Monday, December 6, 2021

ఈనాడు - గల్పిక- హాస్యం - వ్యంగ్యం ఓటరావతారం రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 05 -04-2014 )

 



ఈనాడు - గల్పిక- హాస్యం - వ్యంగ్యం 

ఓటరావతారం 


రచన - కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 05 -04-2014 ) 


పాలకడలిలో శేషతల్పం మీద యోగనిద్రలో ఉన్న విష్ణు మూర్తికి హఠాత్తుగా మెలకువ వచ్చింది. 


కాళ్ల దగ్గర ఉండే లక్ష్మీదేవి కనిపించలేదు. కంగారైంది. '


' వట్టి చపల చిత్తురాలు' అని విసుక్కుంటూ వెదుకులాట మొదలెట్టాడు. 


ఆదిశేషు సూచనతో భూలోకం వైపు దృష్టిసారించాడు.


అక్కడ.. భారత దేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్రమార్కుల చెరలో చిక్కి లక్ష్మీదేవి ఇబ్బందులు పడుతుండటాన్ని గమనించాడు మహావిష్ణువు.


'  ప్రభూ ! మిమ్మల్ని మించిన మహా జగన్మాయగాళ్లకు . ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారింది. మీరు స్వయంగా పూనుకొని రంగంలోకి దిగందే  అవినీతిపరుల చెర నుంచి లక్ష్మీదేవికి విముక్తి కలగదు' అన్నాడు స్వామి కష్టాన్ని తలచుకుని ఆదిశేషు!


శంఖు చక్ర గదాది ఆయుధాలతో మహావిష్ణువు బయ లుదేరాడు.


'స్వామీ! కాస్త ఆగండి . భరత ఖండంలో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. మీరు ఇన్ని ఆయుధాలు వేసుకుని అక్కడ స్వేచ్ఛగా  తిరగడం దుర్లభం . అడుగడుగునా రక్షకభటుల నిఘా ఉంటుంది. మీరీ అవతార రూపం మార్చాల్సిందే ! ' హెచ్చరించాడు ఆదిశేషు.


' ఇప్పుడు ఏ రూపమైతే మంచిది? ' అడిగాడు మహా విష్ణువు. ' అది కూడా నువ్వే చెప్పు! ' 


' ఎన్నికల్లో ధనప్రవాహం మితిమీరింది. డబ్బులు విప రీతంగా చేతులు మారుతున్నాయి. రక్షక భటులు ఎక్క డికక్కడ నిఘా పెంచారు. కాబట్టి, రక్షక భటుడి అవ తారం దాల్చండి . నిఘా బృందంతో మీరూ కలిసిపోండి. లక్ష్మీదేవి ఆచూకీ సులభంగా తెలుసుకునేందుకు  ఇదొక ఉపాయం' ముక్తాయించాడు ఆదిశేషు. 


సీతాన్వేషణ రోజులు గుర్తుకొచ్చాయి విష్ణుమూర్తికి. 


అది రామావతారం. తను మహారాజు అయినా నార వస్త్రాలు ధరించి తిరగవలసి  వచ్చింది. ఇప్పుడు కాలానుగు ణంగా రక్షకభట అవతారం ఎత్తక తప్పడం లేదు.. హతవిధీ! ' అనుకున్నాడు మహా విష్ణువు!


హైదరాబాద్ ను చుట్టి ఉన్న సైబరాబాద్ కమిషన రేట్ పరిధిలోని ఒక ముఖ్య కూడలి దగ్గర స్థిర నిఘా బృందం గాలింపులు ముమ్మరంగా సాగుతున్నాయి. 


రక్షక భటుడి రూపంలో ఆ శేషతల్పసాయి కలిసిపోయాడు. వచ్చేపోయే వాహనాల తనిఖీలో తలమునకలై పోయాడు!


కారు మేఘాలను సృష్టించుకుంటూ దూసుకొచ్చింది ఓ ఆటో. అందులో ఓా బస్పెడు  ప్రయాణికులు ఉన్నారు. 


కేసు బుక్ చేయాలన్నాడు ఆగ్రహంతో నిఘా బృంద నాయకుడు. 


యజమాని తాపీగా కిందకు దిగాడు. 'వీరంతా కాబోయే శాసన సభ్యుడి అనుచరులు సార్...ఆయన నామినే షన్ వేసే కార్యక్రమానికి వెళ్తున్నారు. ఇప్పుడిలా అడ్డుకుంటే రేపు ఇబ్బందులు పడేది తమరే! '  అనగానే గతుక్కుమన్నాడు నిఘాబృందం నాయకుడు. 


ఆ పుష్పక విమానాన్ని అలాగే వదిలేయక తప్పింది కాదు !


ఈసారి అత్యంత ఖరీదైన కారుని ఆపింది నిఘా బృందం. 


 డ్రైవరు ఒక్కడే ఉన్నాడు. డిక్కీ తెరిపించారు. 


అందులో సూటు ధరించిన పెద్దమనిషి కాలు మీద కాలు. వేసుకుని మరీ దాక్కుని నిద్రపోతున్నాడు. 


' ఎవరీయన? ' ప్రశ్నించాడు డ్రైవర్ని నిఘా బృంద నాయకుడు. 


' ఏం చెప్పను సార్... మొన్న జరిగిన మెడికల్ పీజీ ప్రవేశపరీక్షల్లో కోటిన్నర రూపాయలు కట్టి కొడుక్కి ప్రశ్నపత్రం ముందే ఇప్పించాడు. అది పెద్ద కేసు అయింది. పోలీసులు ఈయన గురించి వెదుకుతు న్నారు. ఇప్పుడు పోలీసుల కంటపడి కేసులో చిక్కు కుంటే, ఓ పెద్ద పార్టీ టికెట్ జారిపోతుందని కంగారుపడుతూ ఇలా తిరుగుతున్నాడు' అంటూ నసుగుతూ జవాబిచ్చాడు డ్రైవరు.


 'ఖర్మగాలి రేపు ఈ పెద్దమనిషికే టికెట్ దక్కి, ఎన్నికల్లో నెగ్గి. . మంత్రిపదవి వస్తే మన బతుకేమైపోతుందో! ' అనుకుంటూ డిక్కీలో నిద్రపోతున్న అతడికి భయంతోనే ఠక్కుమని ఓ శాల్యూట్ కొట్టి వాహనం  వదిలేశాడు నిఘాబృంద నాయకుడు. 


ఇలాగైతే లక్ష్మీదేవి ఆచూకీ దొరికేది ఎలా ? అను కుంటూ ఉసూరుమన్నాడు పక్కనే రక్షకభట రూపంలోని విష్ణుమూర్తి!


తరువాత ఓడ లాంటి పెద్ద కారు వచ్చింది. ' ఏ పుట్టలో ఏ పాముందో!  ముందా కారు డిక్కీ తెరిచి చూడండి! ' అని అర్డరేశాడు  నిఘా అధికారి. 


 డిక్కీలో కూర్చుని చరవాణిలో మాట్లాడుతున్న రాజకీయ నేత కన బడ్డాడు అందులో! 


అధికారంలోకి వచ్చే పార్టీలో దూరేందుకు ఇలా ఏ మీడియా కంటపడకుండా డిక్కీలో నుంచే మంత్రాంగం నడిపిస్తున్నాడట! పక్కనే డబ్బు సంచులు, పెట్టెలు! 


'నీతోపాటు ఇలా మా లక్ష్మీదేవిని తిప్పుకొంటున్నావా? | అని విష్ణుమూర్తి అడిగేలోపే... ఎప్పట్లానే పోలీసుల ఠక్కుమనే  సెల్యూట్లు, వీడ్కోళ్లు పూర్తయ్యాయి!


రకరకాల వాహనాలు, ప్రయాణికులు! 


 డిక్కీ రవాణా వ్యవస్థ ఇంత పకడ్బందీగా వర్ధిలుతుందా ఇక్కడ? ఆహా... ఏమి ఈ భారతదేశ  ప్రజాస్వామ్య వ్యవస్థ  దౌర్భాగ్యం! డబ్బు తరలించడానికి ఎన్ని దొంగ వేషాలు ! 


శవాలను తరలించే వాహనాలు, పిచ్చికుక్కల్ని పట్టుకెళ్ళే మున్సిపాలిటీ బళ్లు, చెత్తకుప్పల్ని ఎత్తుకెళ్లే తోపుడు బళ్లు .. కాదేదీ 'డబ్బు తరలింపునకు అనర్హం' అన్న తీరులో సాగుతున్నదీ అక్రమ రవాణా వ్యవహారం.


ధనలక్ష్మి దర్శనం కాక దిగాలుగా వెనుదిరిగి వచ్చినా  విష్ణుమూర్తిని ఉరడించే పనిలో పడ్డాడు ఆదిశేషుడు. 


'భూదేవమ్మ గతంలోనే ధరిత్రిపై పెరిగిపోతున్న అరాచకాలను  గురించి అనేక సార్లు మీతో మొరపెట్టుకుంది కదా స్వామీ!  అప్పుడే మీరు కాస్త ఆలోచించి ఉంటే లక్ష్మీదేవి కోసం ఇప్పుడీ వెదుకులాటలు  తప్పి ఉండేవి  కదా ! క్షీర సాగర తనయ విముక్తికి ఇప్పుడిక ఒకటే మార్గం' అన్నాడు అది శేషుడు!


'ఆలస్యం చేయకుండా అదేమీటో చెప్పరాదా! ' విష్ణు మూర్తి తొందరపెట్టాడు.


క్రితం అవతారాల్లో మీరు వధించారనుకుంటున్న రాక్షసుల్లో కొందరు భూలోకంలో రాజకీయ నాయకులుగా పుట్టివున్నారు . వాళ్లందరి దర్పాన్ని అణచివేయాలంటే ఈ కాలంలో సంధించాల్సింది ఓటు ఆయుధమొక్కటే. అందుకే, ఓటరు అవతారం ఎత్తాలి పరంధామా! ఎన్ని కల యుద్ధం భీకరంగా నడుస్తోందిప్పుడు .  బద్ధకించకుండా ఓటరు బుద్ధిలోకి జొరబడండి. అప్పుడే మా లక్ష్మీదేవమ్మ  చెర, భూదేవమ్మ  భారానికి  విముక్తి' 


' శభాష్ ఆదిశేషు! భలే ఉపాయం చెప్పావ్! ' అంటూ లేచి కూర్చున్నాడు ఓటరావతరం ఎత్తేందుకు సిద్ధపడుతూ . 


రచన - కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 05 -04-2014 ) 


ఈనాడు - సంపాదకీయం సుపరిపాలన - రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - 23 -03 -2014 - ప్రచురితం )

ఈనాడు - సంపాదకీయం 

సుపరిపాలన

- రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - 23 -03 -2014 - ప్రచురితం ) 


'దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్' అన్నారు మహాకవి గురజాడ. మట్టో మనిషో... పేరులో ఏముంది- పాలన కదా ప్రధానం! తల్లి లాలనను పోలి ఉండాలి ఆ విధానం. 'కృతమెరిగిన పతియె జగజ్జనుల నెల్ల బరిపాలించున్' అని నన్నయ భారత కథనం! 'వైయక్తిక భోగదృష్టి కాదు... ప్రజోపయోగ దృష్టి సుపరిపాలకులకు ఎంతో  అవసరం' అని చాణక్యుడి సూక్తి. కాదంబరిలో బాణకవి శుకవాసుడి ద్వారా చెప్పించిందీ ఈ రాజనీతే. 'రాచపుటక, నూతన యౌవనం, దేహ సౌందర్యం, మితి ఎరుగని అధికారం... విడివిడిగానే వినాశ హేతువులు... అన్నీ ఒకే చోట జతకూడితే మరింత కీడు!- పట్టాభిషేక వేళ కొడుకు చంద్రాపీడుడికి ఆ తండ్రి చేసే హెచ్చరికలు గద్దెనెక్కే వారందరూ కంఠోపాఠం చేయదగ్గ సుపరిపాలనా మార్గ సూచికలు. అందరూ స్వర్ణయుగంనాటి గుప్తులు కాలేకపోవచ్చు. అందివచ్చిన అధికార దండాన్ని ప్రభువు ప్రజాభిమతానికి మాత్రమే మీదు కట్టాలన్న కామన అత్యాశ అయితే కాదుగా! భృత్యులొప్పని పనిచేసిన విభులు ఏ విధంగా అపఖ్యాతి పాలవుతారో పోతన భాగవతం కథగా చెబుతుంది. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంలో సుపరిపాలన ఎలా ఉంటుందో నిరూపించే ఘట్టం ఒకటుంది. అప్పటికి అమలులో ఉన్న చట్టం ప్రకారం, సంతానం లేకుండా చనిపోయిన పౌరుడి యావదాస్తులు రాజు పరం అవుతాయి. అయినా దురాశపడడు దుష్యంత మహారాజు. సముద్ర ప్రయాణంలో ప్రాణాలు పోగొట్టుకున్న ఓ వ్యాపారి సమస్త ఆస్తులు అతగాడి గర్భస్థ శిశువుకు ధారపోస్తాడు. శకుంతలా వియోగంలోనూ ప్రజాక్షేమం తప్ప ఊహించలేని మతి ఆ చక్ర వర్తిది. ఆప్తులను పోగొట్టుకున్న పౌరులందరినీ ఆపద్బాంధవుడిలా ఆదుకునేందుకే తనకు రాజ్యం ఉందని భావించిన దుష్యంతుడిని మించిన సుపరిపాలకుడు ఉంటాడా? పరనారికి సోదరుడిగా ఉండేవాడు, ఇతరుల ధనానికి ఆశప డనివాడు,  పరముడని సుమతీ శతకకారుడి నిర్వచనం. ఆ పరముడు పాలకుడైతే పాలితులు ఎంతలా సుఖపడతారో తెలిపేందుకే వాల్మీకి మహర్షి రామాయణమనే  మిషతో పదహారు కళల పురుషోత్తముడిని  పనిగట్టుకుని చిత్రించింది . శతసహస్ర నామాల్లో 'భద్రుడు' రామచంద్రుడికి అత్యంత అర్థవంతమైన బిరుదు. దాసు లకు దాసానుదాసుడు ఆ ప్రభువని రామదాసు చరితన ద్వారా  విదిత మవుతుంది. సేతుబంధన యాగానికి చేతనైన సమిధలు అందిం చిన ఉడుతను అల్పజీవమని కూడా చూడకుండా చేరదీసిన మేరు నగధీరుడు ఆ రామచంద్రప్రభువు. వాత్సల్య తంత్రం అంత గాఢంగా ఒంటపట్టించుకున్న నేత కాబట్టే నేటికీ రాజుగా గాక ఓ తండ్రిగా ప్రజాకోటి గుండెల్లో కోట కట్టించుకొని కొలువై ఉన్నాడు. రాజధర్మం కంటే పాపకర్మం లేదు పొమ్మన్న పాండవాగ్రజుడి నిర్వేదమే నిజమైనదైతే ఆ దుష్కర్మలమీద ఆధిపత్యానికేనా ఇన్నిన్ని ప్రపంచ కురుక్షేత్రాలు జరుగుతున్నది? క్రూరుడు, లోభి, ఉగ్రుడు, ఖలుడు, జడుడు, కృతఘ్నుడు, సత్యహీనుడు, కారుణ్య వర్ణి తుడు, కలుషాత్ముడు... వీరితో కొలువుతీరిన భూవిభుడి పాల నలో ప్రజల శాంతిభద్రతలు చెడుతాయంటుంది సోమన 

ద్విపద భారతం శాంతిపర్వం. అమాయక ప్రజావళికి కవచాలుగా ప్రజావాదుల ఆయుధాలు సదా సిద్ధంగానే ఉంటాయి కానీ, ఆ ఘర్షణలకు అసలు అవకాశమే లేని మేలిమి పాలనకే ముందుగా శాంతికాముకులు మొగ్గు చూపించేది. జనాభిప్రాయమనే తృణబాహుళ్యంతో మృగరాజంవంటి శాసనాన్ని అయినా సునాయాసంగా నిలువరించవచ్చన్నది హర్షవర్ధనుడి ప్రజాపాలనను హర్షిస్తూ బౌద్ధయాత్రికుడు హ్యూయన్ త్సాంగ్ చేసిన పరిశీలన గమనించదగ్గది . సర్వాధికారాలు అయా చితంగా దఖలుపడ్డా రాజ్యపాలన అంటే ప్రజాదైవాన్ని అర్చించు కునే పూజాద్రవ్యంగా భావించిన హర్షవర్ధనుడివంటి మహారాజులు ఎందరో ఈ భారత వర్షంలో. ఇందులో హిందువులు ..  ముసల్మానులు అనే తేడా లేదు.


కామాతురుడు రావణాసురుడు ఉన్నచోటే ధర్మాభిమాని విభీ షణుడు పుట్టుకొస్తాడు. గుడ్డిప్రేమతో చెడ్డబిడ్డలను అడ్డగించని ధృతరాష్ట్రులకు సుద్దులు చెప్పే విదురులు ఎప్పుడూ సోదరులుగా సమీపంలోనే కొలువై ఉంటారు. నిష్కారణంగా ధర్మద్వేషం పెంచుకుంటే హిరణ్యకశిపులకు కన్న పేగే ప్రహ్లాదుడై ఎదురుతన్నే శక్తిగా మారవచ్చు. వేల సంవత్సరాల కిందటే ఈ వేద భూమి పై  క్రూర వేమరాజుకు రుషిగణాల ఆధ్వర్యంలో పేదప్రజ ఎదురు తిరిగింది. వామదేవుడి దుష్టపాలనకు భీష్మసేనుడు విరుద్ధంగా నిలబడ్డ ధర్మక్షేత్రమిది. క్రాంవెల్ ప్రజ్వలన, అమెరికన్ల తిరుగు బాటు, ఫ్రెంచివారి విప్లవం, రష్యన్ల చైతన్యం, చైనీయుల లాంగ్ మార్చ్.. దేశం ఏదైతేనేం- రాజ్యం కంటకమైతే జనం చోద్యం చూస్తూ కూర్చోరన్నదే సత్యం. ఎందాకనో ఎందుకు... వందేళ్ల కిందటి మన 'వందేమాతరం' చాలదూ కుపరిపాలనకు ఆట్టే కాలం చెల్లుబాటు కాదని సందేశం అందించడానికి! చోరులవల్ల చెడకుండా క్రూరుల చేత చావకుండా పాలితులను  నేర్పుగా రక్షిం చాలన్నది- బ్రహ్మ రాజశాస్త్రం నుంచి బార్హస్పత్య రాజశాస్త్రం దాకా అనుశాసిస్తున్న నీతి. రామాయణమైనా, అంబేద్కర్ రాజ్యాంగ మైనా నిర్దేశించే ప్రాథమిక  సుపరిపాలనా సూక్తి ఇదే. 'ఎఱుక లేని దొరల నెన్నాళ్ళు కొలిచిన/ బ్రతుకు లేదు వట్టి భ్రాంతి గాని' అన్న తెలివిడి ' ఆమ్ ఆద్మీ ' కి  ఏర్పడితే చాలు- ఆ తెల్లారే మొండి వృక్షంమీద పక్షులు వాలడం మానేసినట్లు... గొడ్డుమోతు ప్రభుత్వానికి చెల్లుచీటీ రాసేస్తాడు. చరిత్ర పదేపదే చెప్పే పాఠాలు 'విననే వినం... విన్నా పెడచెవిన పెడతాం' అంటే- శాశ్వతంగా నష్టపోయేది దుష్టపరిపాలకులే!


- రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - 23 -03 -2014 - ప్రచురితం 


Sunday, December 5, 2021

ఈనాడు- గల్పిక- హాస్యం వ్యంగ్యం దేవుడి సందేశం రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు ప్రచురితం - 12 - 04 - 2014





ఈనాడు-  గల్పిక- హాస్యం వ్యంగ్యం 

దేవుడి సందేశం 

రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు  ప్రచురితం - 12 - 04 - 2014  


మాయానగర్ ఇలాకా ఎన్నికల బరిలో అధికారపార్టీ అభ్యర్థి 'డొంగ్రే ' గారి గురించి ప్రజానాడి ఎలా ఉందో పసిగట్టే కార్యక్రమం చేస్తున్నాం . 


డోంగ్రేగారి  చిరునామా కనుక్కోవడమే కష్టమైపోయింది. 


నలుగురు పెద్ద మనుషులు పిచ్చాపాటి చర్చించుకునే రచ్చబండ దగ్గరకెళ్లి విచా రించాం. 


డోంగ్రే ఇల్లెక్కడా? 


ఇల్లు..  దాబా .. ఎక్కి కూర్చుంటే ఆయనకేం గిట్టుబాటవుతుందయ్యా?  ఎలాగైనా మళ్ళీ మా నియోజకవర్గం నుంచి గెలవాలన్నదే కదా ఆయన యావ - అనేశాడు ఒక గడుసుపిండం . 


జోకు పాతదే కావచ్చు. డోంగ్రే వ్యక్తిత్వం కనిపించడంతో అది కొత్తాగానే ఉంది. 


ఇలా క్కాదని  ఈసారి పక్కవీధిలో కుళాయిల ముందు నీళ్లు పట్టుకునే ఆఉంగుల దగ్గరికి వెళ్లి వాకబు చేశాం - 'డోంగ్రేగారు  ఎవరో తెలుసా మీకు? అని . 


డొంగ్రేనా? అట్లాంటి పేరు ఎక్కడా ఎప్పుడూ చెవిన బళ్లేదే' అని నోరు వెళ్లబెట్టేశారందరు తల్లులూ . 


అదేంటమ్మా? అయిదేళ్ల నుంచి ఆయనగారే గదా మీ ప్రజాప్రతినిధీ! పోయినసారి మీరే ఆయన్ను భారీ మెజారిటీ ఇచ్చి గెలిపిస్తిరీ! ' అనడిగాం. 


ఆహా! ఆయనా! అట్లా చెప్పండి. అప్పట్లో ఆయన మా ఇలాకాకి బాగా కొత్త . తెలిసిన ముదనష్టాలకన్నా తెలీని కొత్త ముఖమైతేనే మెరుగని భ్రమపడ్డామయ్యా.  అదీగాక అప్పట్లో ఇట్లా ' ఎవరూ వద్దని చెప్పే మాట లేకపోయే ఓటింగు యంత్రంలో అని ఒకావిడ అంటే, అప్పట్లో కనిపించడమే.. మళ్ళా మొహం చూపించలా ! ఈ అయిదేళ్ళలో బాగా పెద్దమనిషయ్యాడంట గదా .. పత్రికల్లో, టీవీల్లో తప్ప ఎదురుగా నిలబడి మా గోడు వినే సావకాశమే ఆయ నకు లేకపాయే! 


 ఇంకా ఏమైనా చెప్పేదేమో కాని, సమయం చాలదని ఎదురు వీధిలో సందడిగా ఉన్న ఓ దురాణంలోకి  వెళ్లాం.


డోంగ్రేగార  పేరు వినగానే ఆ దుకాణం ఆసామి రెండు చేతులూ జోడించి గోడ మీద పూలదండలో మునిగున్న డొంగ్రేగారిని  చూపించాడు. ' ఆయనే  డొంగ్రే సామి. . దేవుడు' అన్నాడు భక్తితో. 


దేవుడా?! 


కాకమరేమిటండీ! ఈ దుకాణం ఇక్కడ పెట్టనే వద్దని చుట్టుపక్కలవాళ్ళు ఎంత గోల చేశారని! ఇటు  పక్కన బడి .. ఎదురుగా గుడి.. ఉందని ఎవరెన్ని అడ్డుపుల్లలేసినా  ఎంతో దయతో దుకాణం ఇక్కడే పెట్టించాడు రేవుడు ' అన్నాడు. 


అప్పుడు గమనించాం. అక్కడి గుడి, బడిలోకన్నా ఈ సారాయి దుకాణం దగ్గరే సందడి ఎక్కువగా ఉందని. 


సందడి ఎందుకు ఉండదండీ! డోంగ్రేగారి  బావమరిది నడిపించేదాయె!  మహా నుభావుడు ! సరకులో కల్తీ కాస్త ఎక్కువ ఉన్నా సర్కారు ఎమ్మార్పీ రేటుకన్నా తక్కువలో సరఫరా చేస్తున్నాడు. అదీ  ఎప్పుడు పడితే అప్పుడు ! అందుకే డోంగ్రేగారూ  జిందాబాద్..  డోంగ్రేగాడు జిన్ .. దా...  అంటూ తూలి పక్కనే ఉన్న మురిక్కాలవలో పడిపోయాడో తాగుబోతు అభిమాని.


ఎలాగూ వచ్చాంగదా అని పక్కనున్న బళ్లోకెళ్లాం


 డోంగ్రేగారి  గురించి స్పందన తెలియజేయండి! అనడిగామోలేదో కన్నెర్రజేసి కాళికమ్మలా ఊగడం మొదలు పెట్టింది ఆ బడి ప్రధానోపాధ్యాయురాలు.


మేం చేసిన నేరమేమిటో పాలుపోక బిక్కమొగమేసి నిలబడుంటే.. ఎక్కణ్నుంచో మెడలో వేళ్లాడే  పలకతో ఓ ఉపాధ్యాయుడు వచ్చి మా రెక్కలు పుచ్చుకొని బయటకు ఈడ్చుకొచ్చాడు. 


మేడమ్ షాకు నుంచి తేరుకునే లోపలే మీరిక్కణ్నుంచి పారిపోవాలి. మా బడి ఆవరణలో తెలుగు పలుకు వినబడితే బడితె పూజే ! అదనంగా పదానికి వంద చొప్పున జరిమానా' అని వివరించాడా మెడ పలక పంతులు. 


అప్పుడు చూశాం ఆయన మెడ లోని పలకను. ' ఐ నెవ్వర్ స్పీక్ ఇన్ తెలుగు' అని పెద్దక్షరాలతో రాసి ఉంది


'నిన్న తరగతి గదిలో కుర్చీ కాలు విరిగి కిందపడ్డప్పుడు రూలు గుర్తురాక పాడు తెలుగులో ' అమ్మా... అబ్బా చచ్చాన్రా ..  దేవుడా ' అంటూ నాలుగుసార్లు శుద్ధ తెలుగులో 

మూలిగా . జీతాలు వచ్చేదాకా నాలుగొందలు జరిమానా చెల్లించలేక జరిమానా కిందా ఈ పలక మెడలో వేసుకు తిరుగుతున్నా! 


ఇవాళ పదో తారీకు గదా! ఇంకా జీతాలు రాలేదా? 


మూణ్ణెల్ల  నుంచి జీతాలు లేవు. మా బడి యాజమాన్యం  డోంగ్రేగారిదే.  ఎన్నికల ఖర్చుకని అన్నీ ఊడ్చేశారు. మళ్ళీ బళ్లు తెరిచి పిల్ల కాయల నుంచీ  పిండితేనే మాకేమన్నా జీతం కానుడు రాలేది 


డోంగ్రే గురించి ఇట్లాంటిదే చాలా సమాచారం  పోగుపడింది.


గుడిముందు రాజకీయాలు ఎందుకులెమ్మని నిమ్మకు నీరెత్తినట్లు నడిచిన స్తుంటే, వెనకనుంచి ఎవరో చొక్కా కాలరు గుంజి ఆపినట్లనిపించింది.


నాకు ఓటుహక్కు లేదని తిరస్కారమా! అంటూ ఓ హుంకారం వినిపించింది. విస్తుబోయి వెనక్కి తిరిగి చూస్తే ఆ శబ్దాలొస్తున్నది దేవుడి గుడి వైపు  నుంచి. 


 అసాధ్యం- దేవుడు మాట్లాడటమేంటి?


మనుషులు మూగమొద్దులైపోయినప్పుడు  నేనైనా  మాట్లాడక తప్పదు గదా భక్తా!  డోంగ్రేగాడి  నిజస్వరూపం మీకు కావాలా. . వద్దా? 


చెప్పండి స్వామి అన్నాం  వణుకుతూ. 


ఎక్కడో పైన సుఖంగా యోగనిద్రలో ఉన్న నన్ను తీసుకొచ్చి  ఈ మరుభూమి మధ్య బంధించాడు. గుడి మిషతో శ్మశాన  భూములూ ఆక్రమించుకోవా లనే దుర్బుద్ధి వాడిది,  ఎదురుగా సారాయి దుకాణం..  పక్కనే పసిపిల్లల చదువుల కొష్టం. వీటిమీది ఆదాయంతో తృప్తిపడక, సంసారులు ఉండే నివాసాల వెనకనే వసతిగృహం వంకతో విలాసాల వల. 

గడచినా ఎన్నికల సమయంలో ఓటర్లకు ఇచ్చిన మంచినీటి పంపులు, నిరంతరాయవిద్యుత్తు, ఇంటింటికీ ఒక విదేశీ ఉద్యోగం, ముసలీముతకలకు ఆర్థికసాయం , అడపడుచులకు భద్రత, ధర వరలమీద అదుపు, బీదాబిక్కీకి  ఉపాధి,  రైతన్నల సాగుకు మద్దతు.. అంటూ ఇచ్చినా హామీలలో  ఏ ఒక్కటీ  గుర్తున్నది లేదు. గుడి లోపలా బయటా జరిగే ఘోరాలను చూసి నాకే కన్నీళ్లు ఆగడం లేదు. భక్తుల ఆక్రందనలు వినలేకుండా ఉన్నా . అందుకనే మళ్ళీ ఎన్నికలు అనే అవకాశం ఇస్తున్నా.  పోయినసారేదో  పొరపాటైపోయింది . ఈసారైనా పునరావృతం కాకూడదు. బాగా ఆలోచించి, ఉన్నవాళ్లలో మంచివాణ్ని ఎన్నుకోమని నా సందేశంగా మీరు ఈ బోళాపౌరులకు వినిపించాలి.


మా మధ్యవర్తిత్వం ఎందుకు స్వామీ ? మీరే భక్తులకు నేరుగా సందేశం ఇవ్వవచ్చు గదా? 


డోంగ్రేగాడి  సంగతి మీకు తెలీదు.  నేను నోరు విప్పానంటే దాన్ని తన గొప్ప తనం ఖాతాలో వేసేసుకుంటాడు. దేవుడి మనిషిగా మరిన్ని ఓట్లు రాబడతాడయ్యా బాబూ అదీ నా బెదురు' అన్నాడు దేవుడు.


రచన - కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 12-04-2014 

ఈనాడు - గల్పిక - హాస్యం - వ్యంగ్యం జంతులోకం రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 07 - 11 - 2002




ఈనాడు - గల్పిక - హాస్యం - వ్యంగ్యం 
జంతులోకం 
రచన - కర్లపాలెం హనుమంతరావు 
( ఈనాడు - ప్రచురితం - 07 - 11 - 2002 

మేన్ ఈజ్ ఎ  సోషల్ ఏనిమల్.. 

దానికి మనమేం చేస్తాం!' అంది కోతి గంభీరంగా

 అక్కడికి మనమంతా సైన్సు జంతువులు మైనట్లు! - అంది నక్క ఎకసెక్కెంగా . 

జోకులొద్దు!  మేటర్ సీరియస్.  మాటి  మాటికి మాటమాటకు మనిషి మనతో కంపేరెందుకు చేసుకొంటాడో అర్ధం కాకుండా ఉంది. ఎవరైనా కొద్దిగా బుద్ధి తక్కువ పన్పేస్తే చాలు గాడిద కొడకా అని తిడతాడే! గాడిదలకు మెదడు అంతతక్కువ ని అతగాడి ఉద్దేశమా?' అంది గార్దభం  కోపంగా  . 

మనిషికెవరైనా సరే సరిపడక పోతే తెగబడి తిడతాడు. కొండవీటి చాంతాడంత  కవిత్వాలు రాస్తున్నాడని కాబోలు . . వాడలవాడలందిరిగి  వచ్చెరువారలు గోడల గొందులొందొదిగి  కూయుచుంచెడువారినలా గాడిదలతో పోల్చాడూ! గాడిదకైతే మాత్రం కైతలు రాకూడదని - రూలుందా ? అనింకా ఎక్కించింది నక్క . 

వీడా నాకొడుకని.. కందంలో అంతందంగా ఏడ్చింది గాడిద . 

గాడిదవి కనక కాస్తోకూస్తో నీకూ కవిత్వాలొచ్చు. మొరగటమే తప్ప మరేమీ ఎరగని ఈ పిచ్చికుక్కేం చేసిందీ పాపం. మొన్న తొగాడియా అనే పెద్దమనిషంతలా తెగబడి ఎగస్వార్టీ వాళ్లనలా వూరకుక్కలు. బోరకుక్కలు సీమకుక్కలని తిట్టిపోయడాలు! 

అట్లాగే మా పేర్లు పెట్టి ముట్టె పొగరని - మనిషి ఎప్పుడూ తిడుతూ ఉంటాడు అంది  పంది కూడా బాధగా. 

దున్నపోతులాగా మాచేత పనిచేయించుకుంటూ  ఒళ్లొంగని   వాళ్లను మళ్లీ  దున్నపోతులని దులిపేస్తాడదేందో -  ఆవేదనగా అంది దున్నపోతు. 

' అందరు అందరే మరియు సందరునంద రేయందరందరే ' అని సభలోని వాళ్లందర్నీ కలగలిపి కుక్కలూ,  కోతులూ, పందులూ, దున్నలను  ఒక కవిగారు  కలగలపి తిట్టిపో యటం గుర్తుకొచ్చి  గట్టిగా నిట్టూర్చుకొన్నాయి. అభయారణ్యంలో సభ తీరిన ఆ జంతువులన్నీ 


మనవాడి తీరే అంత ! మన మనవడని చెప్పుకోటానికే సిగ్గేస్తోంది 'అంది పాతతరం కోతోకటి ని పక్క కోతితో. 

'పెద్ద.. దేవుడు వాడికొక్క డికే పెద్ద బుర్రిచ్చాడని  పొగరేమో! వెళ్లి దేవుణ్ణే అడుగుదాం పదండి - అంది  జంబూకం . 

చెయ్యాల్సిన నక్క జిత్తులన్నీ తానే చేస్తూ ' జిత్తులకు జాకాల్ ' అని తన నేమ్  బద్నామ్ చేస్తున్నాడని నక్క అక్కసు. 

సమావేశం సమరావేశం చూసి గాడ్ కూడా  గాఢంగా నిట్టూర్చాడు. మడిసి మిడిసిపాటు తనకూ కొత్తకాదు . ఒళ్లుమండినప్పుడు  తననూ విడిచిపెట్టింది లేదు.  '  తిరిపమాని కిద్దరాండ్రా పరమేశా .. గంగ విడుము. పార్వతిచాలున్!' అనటం గుర్తొచ్చింది. ఇంటి ఆడవాళ్ల  జోలికొస్తే ఎవరికైనా కాలిపోతుంది,  

అయినా దేవుడి రోల్ లో ఉన్నాడు.  సర్దిచెప్పడం  తన డ్యూటీ.  కనక విషయమంతా విని తొగాడియా మహాశయుడు తెగనాడేటప్పుడు  గాడితప్పటంలో  మహా ప్రవీణుడు లే. 

పాలిటిక్సు అన్నాన్  ఇలాంటి హాట్ హాట్ కామెంట్లు ఎప్పు ఉన్నా  తప్పవులే. ఎన్నికలంటేనే పోలింగు బూతులు , న 
' బూతో'  న భవిష్యత్తని  నమ్మే సజ్జు  రాయల్టీ  రోజురోజుకూ ఎక్కువౌతోంది.  కాబట్టే నరుల నాలికలకిలా నరాలు తెగిపో న్నాయి. అశ్లీలమే వాళ్లసలైన శీలమై యింది. అట్లాంటివాళ్ల తిట్లనాట్టే పట్టించు కొంటే మీకు నిద్ర పట్టదు. థూ అని ఓ సారి ఉసేసుకుని మీ పని మీరు చేసుకోవాలి!  అన్నాడు కోవాలన్నాడు దేవుడు.

వాళ్ల లో వాళ్లు ఒకళ్లనొకళ్లు మెంటల్‌ .. శుంఠలనో  ఎంత అన్  ప్రింటబుల్ తిట్టుకొ ఫరవాలేదు .. కానీ,  మహాప్రభో! ఈ కుక్కలనీ, పందులనీ గోలేంది. భాష మహా వల్గరావుంది... ఈ వానర వారసుల   వరస చూస్తే  మీరింకా అవతారమెత్తాల్సిన అవసరముంది - అంటూ జంతు తంతు సర్వం గొంతెత్తి ఘోష పెట్టాయి .

సరే!  ముందసలు సందర్భమేంటో క్కుందాం ! మానవుడి వాదనా విందాం! వాడిని  'రమ్మ'ని కాకిచేత కబురంపించాడు దేవుడు. 

ఎన్నికల హడావుడి. ఎక్కడి టైము పాదయాత్రలకే  చాలటంలేదు. చిలకను పంపిస్తున్నా.. చర్చించుకోండి న  అన్నాడు మనిషి . 

చిలక మనిషి పలుకుయి చెప్పడం మొదలు పెట్టింది.- కుక్కంటే మాకూ మక్కువ ఎక్కువే. డిఓజి డాగ్.. డాగన్న తిరగేసిన గాడే .. జిఓడి నే గదా! కనకనే దాన్ని కాల  భైరవుడుగా కొలుస్తుంటాం. గ్రామ సింహమని గౌరవిస్తుంటాం . ధర్మరాజు తమ్ముళ్లందర్నీ వదిలేసి ఒక్క కుక్కనే సరాసరి స్వర్గానికి అందుకేగా  తీసుకెళ్లిందీ!  కుక్క పిల్లా..  అగ్గిపుల్లలాగా  కాదు మా కవుల కనర్హం. ఆ మాటకొస్తే మేము ఏ జంతువునీ  తక్కువ చేసి చూసిందిలేదు.  పాము మాకు పాకే దేవుడు.  దశావతారాల్లో జంతువులకెన్నింటికో  దేవుడి హోదా కల్పించామా.. లేదా ? ! గాడిది అయినా ' గాడ్, ది గ్రేట్' తో సమానమే గదా !  పేపర్ల వాళ్లు  ఉపన్యాసాలు  పూర్తిగా విన కుండా మిస్ రిపోర్టింగ్ చేస్తే మాదా తప్పు ? ఇన్ని నిజాలు చెప్పిన తరువాత కూడా ఇంకా భుజాలు తడుముకుంటామంటే మీ ఇష్టం- 

చిలకద్వారా విన్న మనిషి  పలుకులకు పాము ఫ్లాటయిపో యింది. మనిషినపార్థం చేసుకున్నందుకు గార్దభం బాధపడింది. మొసలి కూడా కన్నీరు కార్చింది . 

కాని నక్కే.. ఈ మనిషి జిత్తులు నాకు కొత్త కాదు. మనిషిని పనిష్ చేయాల్సిందే!' అని వాదనకు దిగింది. 
ఉడుముది  కూడా అదే పట్టు. 

 మనిషితో మాది రక్తసంబంధం.. మాటపోతుంద' ని  దోమ తెలివిగా తప్పు కుంది. 

మనిషి వదిలే మురుగు లేనిదే మాకు మనుగడ లేదు. నరుడే మా గురుడు - అని ఈగలూ నల్లులూ... పేలూలాంటి కీటకాలా ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి.  

కోడికి మాత్రం చాలా కోపంగా ఉంది. నేను కూయటం మానేస్తాను. ఘడియ ఘడి యక కూయించుకుని ఆకలేసినప్పుడు వేయించుకు తింటాడు- అందికోడి. 

బోడి  కోడి లేక పోతే తెల్లవారదా ఏందీ? మాకు బోలెడన్ని గడియారాలున్నాయి అంది చిలుక మనిషి తరపునుంచి, 

నేనూ దున్నటం మానేస్తాను. తిండిగింజలు లేక ఛస్తాడ'
ని కాడి  కింద పడేసింది దున్నపోతు. 

 నీ సాయం లేకపోతే వ్యవ సాయం ఆగదులే ! మిషన్లతో పన్లు నిమి షాల్లో అయిపోతాయి అంది మళ్లీ చిలక. 

అడవి నడివికి చీలిపోయింది .

గోవులూ, గుర్రాలూ, చిలకలూ, ఎలు కలూ, నెమళ్లూ, లేళ్లూ లాంటివొకవైపు . కాకి , నక్క, గద్ద , గబ్బిలం లాంటివింకోవైపు.

పులులూ, గొరిల్లాలు చర్చల్ని బహిష్కరిం చాయి. మనిషి కనపడితే వేసేయటమే మా పాలసీ- అని కూడా ప్రకటించేశాయి. 

కప్ప గంటకో వైపు గెంతుతోంది. 

గోడమీదున్న పిల్లికి  ఎటు దూకాలో  పాలుపోలేదు. 

కుక్క ఒక్క ముక్క మాట్లాడితే ఒట్టు.  అరిచే కుక్క కరవదని కదా సామెత ! 

ఎన్నికల నుకున్నాయి.

మనిషి నీ మాస్టర్... మాకే నీ ఓటంటూ చిలక మనిషి  పార్టీ ఒకవైపు... '

మాస్టర్ కాదు. వాడొట్టి వరస్ట్! మాకే నీ ఓటు అంటు  నక్క పార్టీ  ఊళ ఇంకో వైపు . 

ఒక్క కుక్క ఓటుమీదే గెలుపోటములు తేలిపోయే పరిస్థితి వచ్చిపడిందిప్పుడు . అందుకే అంటారు ప్రతి కుక్కకూ ఓ రోజొస్తుందని. 

పోలింగ్ ముగిసింది. 

ఒక్క ఓటు మెజా ర్టీతో మనిషి ఘనవిజయం సాధించాడు మనిషి ! 

ధరావత్తు కూడా దక్కదనుకున్న మనిషి విజేత అయ్యాడు. అదెలా సాధ్యం? 

ఫలితాలపై సమీక్షకోసమని జంతులోకం మళ్లీ సభతీరింది, అన్నింటి అనుమానం కుక్క విశ్వాసఘాతుకం మీదనే 

ఛీ... కుక్కబుద్ధి.. కనకపు సింహాసన మ్మీద కూర్చోబెడతామన్నారని హామీ ఇచ్చాడు కాబోలు!  వెనకటి బుద్ధి పోనిచ్చుకుందికాదు. తొగాడియాలాంటి వాళ్లు ' ఛీ! కుక్కా! ' అని వూరికే   తిడతారా ? అని చీదరించు కొంది కాకి అండ్ కాకి గ్రూప్. 

లోకులు పలుగాకులు.

' శునకం ఓటు ఎలాగూ  మనిషికేనని నేనూ అను కున్నాను . నా ఓటు వృథా అవడం ఎందుకని  నేనూ ఓటు  మనిషికే వేశాను - అని మధనపడింది మళ్లీ గోడెక్కిన పిల్లి . 

'నువ్వటు దూకటం చూసి .. నేనూ అటే గెంతేశాను. . ఆఖరి  నిమిషంలో' అంది కప్ప పిల్లితో గుడ్లు తిప్పుతూ . 

'ఏదైతేనేం. మనిషి గెలిచాడు! సంధి చేసుకుంటే మీకే మంచిది '  అని సలహా ఇచ్చి చక్కాపోయాడు దేవుడు.

దేవుడి మాట మేరకు జంతువులంతా కలసి తమ తరుపున రాయబారానికి పావురాయిని పంపించాయి . 

పది రోజులు పాస్ అయ్యాయి. 
పావురమెంతాకు తిరిగి  రాలేదు. 

మనిషి దగ్గర నుంచి సందేశం మాత్రమ వచ్చింది చిలుక ద్వారా! 

' థేంక్స్... ఎన్నికల్లో గెలిచినందుకు మీరు పంపిన గిఫ్ట్ .. మహా టేస్టుగా వుంది' . 

చెప్పాగా, మనిషి ఎంత  మడతపేచీ  గాడో!  కనకనే నేనటు వేపు ఓటెయ్యంది. ఒట్టు... నన్ను నమ్మండి - అని ఇప్పుడు ఘొల్లుమనడం   మొదల పెట్టింది. . పాపం .. శునకం. 

మరి మనిషి గెలవటానికి సాయపడిన ఆఒక్క ఓటూ ఎవరిది? 

ఆ దేవుడికే తెలియాలి. 

'మావాడికి ఓటెయ్యకపోతే వచ్చే జన్మలో నువ్వూ మనిషివై పుట్టి రాజకీయాలలో  పడిపోతావు  - అని ఈ చిలక నా చెవిలో చెప్పి బెదరగొట్టింది  . అదిరి పోయి నేనూ అటే ఓటెయ్యాల్సొచ్చింది - అంటూ  బురదలో మొహం దాచుకుని భోరుమంది వరాహం . 

- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - ప్రచురితం - 07.11.2002 ) 

ఈనాడు - గల్పిక- హాస్యం - వ్యంగ్యం దురభిమానధనులు రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - 10 -04 - 2014 - ప్రచురితం )

 



ఈనాడు - గల్పిక- హాస్యం - వ్యంగ్యం 

దురభిమానధనులు 

రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - 10 -04 - 2014 - ప్రచురితం ) 


'నిజాన్ని నిజంగానే నిజమని నిరూపించినా నమ్మబుద్ధి కాదురా కొందరికి. దాన్నే కామోసు అభిమానమని అంటుంటారు' 


' అభిమానం కాదు... అది దురభిమానం ' 


' ఏదో ఒహటిలే. అలాంటి పిచ్చి అభిమానాన్ని పుష్క లంగా సంపాదించుకున్నావనుకో- ఇహ నువ్వు నంది అంటే నంది. పంది అంటే పంది'


'బాగా చెప్పావన్నా! ఒకానొకప్పుడు వానలు పడకపోతే వరుణదేవుడి ఆగ్రహమన్నారు. అదే వాళ్ల పాలనలో వరదలొచ్చి జనం కొంపాగోడుతో కొట్టుకుపోతుంటే వరుణ మిత్రుడికి తమ మీద ప్రేమ అపారమైన ప్రేమ ఇలా పొంగి పొరలుతుందని సుద్దులు చెప్పారు. అదీ నమ్మారు, ఇదీ నమ్మారు పిచ్చి అభిమానంతో జనాలు'


'బూటకాలు, నాటకాలు వెండితెరమీది గ్రాఫిక్స్ పోరాటాల కన్నా మజాగా ఉంటాయిరా కొంతమం దికి. చెత్త సినిమాలూ ఒక్కోసారి సూపర్ హిట్టవడంలా!' 


'అలాగని అదే సూత్రంలో ప్రతిసారీ జనాల్ని బురిడీ కొట్టిద్దామనుకుంటే ఎంత అభిమానమున్నా ఛీ కొడతారన్నా! రాజకీయాలకూ అదే సూత్రం వర్తిస్తుంది. యూపీఏ తొలిసారి పాలనలో చోటుచేసుకున్న కుంభకోణాలు మలిదఫా పాలనలో బయటపడలా! గాలి నుంచి గనుల దాకా అన్నింటినీ అడ్డ దారుల్లో తెగబడి అమ్ముకున్నారు. ' కాగ్' నుంచి 'సుప్రీం'  దాకా అన్నీ... యూపీఏ నిర్వాకాలను ఛీ కొట్టాయి. ఇక జనాలు 'పో' అని వెళ్లగొట్టడం ఒక్కటే మిగిలింది. సర్వేల వరస చూస్తున్నావుగా!'


'అవన్నీ డబ్బుపోసి కొన్న ఫలితాలని దబాయి స్తున్నారు కదరా వారి అభిమానులు' చెప్పాగా.... అదంతా వట్టి దురభిమానం. టైటానియాన్ని చూస్తున్నావుగా. ఇవిగో రుజువులు అంటూ ఆమెరికా నిఘావర్గాల పత్రాలను చూపించినా- అవన్నీ ఎఫ్బీఐ చేస్తున్న తప్పుడు ఆరోపణలంటూ బుకాయించడం... దురభిమానం కాక మరేమిటి? '


'నిజమేరా! ఢిల్లీలో పెద్దాయన సొంత కార్యాలయం నుంచే ముఖ్యమైన దస్త్రాలు మాయమవుతుంటాయి. నోరు విప్పి నిజాలు కక్కాలనుకునే శాల్తీలు గల్లంతవుతుం టాయి. తెగించి చట్ట ప్రకారం పనిచేసుకోవాలనుకునే ఉద్యోగులను అర్ధాంతరంగా బదిలీలవుతుంటాయి . అయినా సరే, అవినీతి కుళ్ళును అడుగంటా వెళ్లగించే సంఘసం

స్కర్తలం తామేనని భుజాలు ఎగరేస్తే, నిజం నిజమంటూ భజనలు మొదలు పెడుతున్నారు వారి అభిమానులు'


'పైసా బొక్కిన కక్కుర్తికి... రూపాయి భజన చేయక తప్పదన్నా! దేవుడి హారతి పళ్లెంలో రూపాయి బిళ్ల వదలడానికి పది రకాలుగా ఆరాతీసే బేరగాళ్లు, కోట్లు కోట్లు పోసి అలా టికెట్లు కొనడానికి ఆరా టపడుతున్నారు. ఏ చెక్క భజన చేయకపోతే రేప్పొద్దున ఏ బొక్కలోనో పడిపోరూ! అందుకే భజన బృందాలను ఇంతలా పెంచి పోషించేది'


'ఉన్నోడికీ, తిన్నోడికీ ఈ సంకీర్తనల నరకం తప్పదనుకో! మరి నిర్భాగ్యుడికి ఎందుకట ఈ బకాసురులు చుట్టూ భజనల తంటా?' 


‘చెప్పాగదన్నా. దురభిమానం సిద్ధాంతమే అంత. అభి నాయకుడు నటిస్తే చాలు, ఎంత చెత్త చిత్రాన్నయినా పదోసారి చూస్తూ  చప్పట్లు కొట్టేసే  పిచ్చి ప్రేమ మన జనాలది. అయిదేళ్లపాటు ఎక్క డున్నాడో కూడా తెలీని ఆ రాణిగారి అబ్బాయి ఎన్నికల ముందు ఒక్కపూట హఠాత్తుగా మన గుడిసెల్లో దూరి మనం తాగే అంబలిలో వేలు ముంచి నాలుక్కి అంటించుకుంటే చాలు... నడిచొచ్చే దేవుడు అయిపోతాడా?'


 'నిజమేరా, ఇక్కడే చూస్తున్నాం!'


' ఎన్ని వేలకోట్లు అక్రమంగా కొట్టేస్తేనేం మన సొమ్ము కాదుగా కొల్లుబోయింది .అన్నేసి భవనాలు నిర్మించుకున్నా మన మధ్య ఎంత ఓపిగ్గా తిరుగుతున్నాడో, కన్నూ బిడ్డకైనా ఇంత ప్రేమ ఉంటుందా అని పొంగిపోతున్నారు జనతా . యువనేత జైలు కష్టాలకు కుంగిపో తున్నారు. ప్రజలకోసం ఆఖరి రక్తపుబొట్టు వరకు తర్పణం చెయ్యడానికి తయారైన నాయకుడికి అడుగడు గునా మరి ఆ అంగరక్షకుల హడావుడి ఎందుకో?


'నిజమేరా! ధర్మపన్నాలు చెప్పే ఈ పుణ్యాత్ముల్లో ఒక్కరూ మనకు ధర్మాసుపత్రుల్లో కనిపించరు. ధర్మ దర్శ నాన్ని ఆపించి మరీ దేవుడి ప్రత్యేక దర్శనానికి ఒత్తిడి చేసే వీఐపీలే మళ్ళా వీళ్లందరూ '


'అదేనన్నా మరి నేననేది. వెర్రి అభిమానంతో మన కుర్రాళ్లు మాత్రం చదువు సంధ్యలు పక్కకు పెట్టి ఈ దొరల పల్లకీలు మోసే బోయీలు గా  మారుతుంటిరి . పనిపాటలు వదిలిపెట్టి, పెళ్లాంబిడ్డలను  పస్తులు పెట్టి, సొంత సొమ్ము ఖర్చు పెట్టి ఎండనక, వాననక, చలిని ఏ మాత్రం లెక్క చేయక పిచ్చిప్రేమతో పగలూ రాత్రీ నేతాసేవలో తరిస్తున్నారు కదా కొందరు! చట్టసభల ఎన్నికల బరిలోకి దిగేందుకు పార్టీ టికెట్ పంచే సంబరాలు సాగుతున్నాయి. ఒక్క వీరాభిమాని ముఖారవింద మైనా ఏ ఒక్క పార్టీ జాబితాలోనైనా కనపడు

తుందా? '


' గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుతున్నట్లు దిరా నీ తంతు'


'అసలు గొంగట్లో భోజనం వడ్డించడమెందు కంటే, ఆలోచించొద్దూ అంత లావు అభిమానం చూపించే మన సామాన్యులూ!' 


మరేం చెయ్యమనిరా నీ సలహా? '


'ఉక్రెయిన్లో చూడు. అన్యాయానికి ఎదురుగా ఎంత పెద్ద అంతర్యుద్ధం జరుగుతోందో! ప్రజాస్వామ్యంలో ఎన్ని కలూ అయిదేళ్లకోసారి వచ్చే అంతర్యుద్ధ తంత్రమేనన్నా! అమాయక జనం అభిమాన ధనాన్ని కల్లబొల్లి కబుర్లతో మాయదారి నేతలే మన నిజమైన శత్రువులు. ఓటు ఆయుధంతో ఒక్క వేటు వేశామా... మళ్ళీ అయి దేళ్ల దాకా మనమే రాజులం. మన మేలు కోరే సేవకులకే మంచి పాలన చేయమని రాజముద్ర అందిద్దాం!' 


' మంచిదేరా! అందుకు అభ్యంతరమేముందీ!'


-రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - 10 -04 - 2014 - ప్రచురితం

ఈనాడు - పరుషపురాణం - గల్పిక - హాస్యం - వ్యంగ్యం రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం )

 





ఈనాడు - గల్పిక - హాస్యం - వ్యంగ్యం 

పరుష పురాణం 

రచన-  కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం ) 


'దాక్కుని  రాళ్లేయడం  కాదు, దమ్ముంటే రారా! కోడిగుడ్లు, కంకర బెడ్డలు కాదురా బిడ్డా... బాంబులు, గండ్రగొడ్డళ్లు  ఆదిరా మాస్థాయి' అంటూ రాయలేని భాషలో రెండు గంటలపాటు విలేకరుల సమావేశంలో ప్రత్యర్ధిని పడతిట్టినాక, ఆకలి గుర్తొచ్చి ఇంటిముఖం పట్టారు. శ్రీమాన్ గంటయ్య. 


ఇంటికి చేరేసరికి ఎప్పుడూ చెంబు నీళ్లు,  పొడి తువ్వా లుతో నవ్వుతూ ఎదురొచ్చే ఇంటావిడ ఎందుకో మొహం చాటేసింది. 


చల్లగా పలకరించే తల్లి కంటికి కనిపించలేదు. 


పెరట్లోనుంచి పెద్ద పెద్ద రంకెలతో అత్తాకోడళ్లిద్దరూ  చేసుకునే వాదనలు మాత్రం కర్ణపుటాలను  బద్దలు కొడుతున్నాయి.


'ఉన్నచోటునే నన్ను ఉండమంటావే ! తప్పకుండా నీ నాలిక  తరిగిపోస్తానే పిల్లా! ' అంటూ అత్తగారు. 


' నీవు  తరిగిన నాలుక  నేను వేగించిన  కూరలో  కలిపి వండి నీ బిడ్డకే వడ్డింతునే అత్; తా' అంటూ కోడలు.


నాలుక రుచి తలచుకుని గజగజ వణకడం గుటయ్య వంతైంది. 


ఎందుకైనా మంచిదని పక్కదోవసుంచి పిల్లిలా వంటింట్లోకి దూరి వంటావిడకు ఖాళీ కడుపు చూపించి భోజనానికి కూర్చున్నాడు. 


గంటయ్య వంటామెకూ ఏదో పాడుగాలి సోకినట్లుంది. పీడాకారం పాట చరణాలేవో పీకి పాకాన పెడుతూ రుసరుస లాడుతూ వడ్డిస్తోంది. వికారాన్ని ఆపుకోలేక వాంతి చేసు కునేందుకు పరుగుచుకున్నాడు. గంటయ్య. 


 అక్కడా పిల్లలు. తగవులాడుకుంటున్నారు.


ఎక్కడ కొట్టుకొచ్చాడోగాని చిన్నాడు! రకరకాల బూతులతో విరుచుకుపడుతున్నాడు. వాడి చిన్నక్క అసహనంగా ఆ బూతులన్నీ వింటోంది. గంటయ్య రావడం చూసి చిన్నాడు గొంతు పెంచి మరీ పెట్రేగిపోయాడు. 


ఆ బూతులు మరి విన లేక పడగ్గదిలోకొచ్చి పడ్డాడు గంటయ్య.


అక్కడా సుఖపడే యోగం లేనట్లుంది. పెద్ద కూతురు వచ్చి '  కళాశాలలో బూతు కూతల పోటీ గురించి చెప్పడం మొదలెట్టింది. తక్కువ సమయంలో ఎక్కువ బూతులు తిట్టిపోసినవారికి ఈ ఏడాది 'బూతుల రాణి' ట్రోఫీ ఇస్తా రట. ఈ విషయంలో మిమ్మల్ని మించినవారు ఎవరూ లేదు కదా నాన్న... కొత్త బూతులు కొన్ని రాసివ్వండి! ' అంటూ మారాం మొదలెట్టగానే గంటయ్య ముఖంలో వరసగా రంగులు మారిపోయాయి.


ఎంత నోటి దురదుంటే మాత్రం కన్నబిడ్డను కూర్చోబెట్టి బూతు పాఠాలు నేర్పించడం కుదురుతుందా?


అక్కడినుంచి బయటపడి హాలులోకి వచ్చి మనశ్శాంతి  కోసం టీవీ పెట్టుకున్నాడు గంటయ్య. 


ఆ కార్యక్రమంలో ఓ కవిగారు భాషా ప్రసంగం దంచేస్తున్నారు.


' కచటతపలు పరుషాలు. గండదబలు- సరళాలు, పరుషము అంటే తిట్టు అని మరో అర్ధం. అవి మనకు నిషిద్ధాలు! తమాషా చూశారా, పరుషాక్షరాలకు బదులు సరళాక్షరాలు వాడండి!  మంచి మాటలు కాస్తా చెద్దమాటలవుతాయి. కప్పు- గబ్బు అయింది. పంట- బండ అయింది. కచ్చి-  గజ్జి అయింది. పరుష పదాలను మనం ఈసడించు కుంటాంగాని, నిజానికి ఈశ్వర సృజన అయిన  ఏ శబ్దమూ నిషిద్ధం కాదు. ' రామా ' అంటే కొంతమందికి బూతు మాటే. దోషం. పదాల్లో లేదు. మన మనసులోనే ఉంది. అందుకే విజ్ఞులైన నేతలు బూతులకు, నీతులకు అట్టి భేదభావం పాటించరు. యధేచ్ఛగా ఉచ్ఛరించే ఆ వదరుబోతులను అందుకే మనం ' పరుష పితామహులు ' వంటి బిరుదులతో సత్కరించాల్సి ఉంది"


గంటయ్య బుర్రతిరుగుడు ఇంకా  ఎక్కువయిపోయింది. టీవీ కట్టేసి, మోగుతున్న ఫోన్ అందుకున్నాడు. 


ఎవరో గంటయ్య వీరాభిమానిట " సార్.... మీ విలేకరుల సమావేశం అదిరింది.  బూతాడక నవ్వు పుట్టదన్న  కవి చౌడప్ప కన్నా మీరే గొప్ప సార్!   రాజకీయ బూతు పాఠాలు మీ దగ్గరే నేర్చుకోవాలండి ! జనవినోదం కోసం మీరెంతలా పాటుపడుతున్నారు! సకుటుంబ సమేతంగా సినిమాకు వెళ్తే వెయ్యి రూపాయలు చమురు వదిలిపోతోంది. ఉచితంగా వినోదం పంచే మీ పేరు జనం ఎన్నటికీ మరచిపోరు. ఎన్నికలు ఎలాగూ దగ్గర్లోనే ఉన్నాయి. తమరి రుణం అణాపైసలతో సహా తీర్చు కోవాలని తెగ తొందరపడిపోతున్నారు. ఉచిత విద్యుత్ ఇవ్వకపోయినా ఇలా ఉచిత విద్వత్తునన్నా పంచి పెడుతున్నందుకు సంతోషంగా ఉంది సార్! ' 


 అభిమాని పొగుడుతున్నాడో తెగడుతున్నాడో తెలియక గంటయ్య సతమతమైపోయాడు. 


ఆ మాటలు ఇంకా వినాలని ఉన్నా, అధిష్ఠానం  నుంచి ఫోను వస్తుండటంతో అక్కడికి దాన్ని ఆపేశాడు. 


ఫోన్లో అధిష్ఠానం  సందేశం విని ఢామ్మని  పడిపోయాడు.... గంటయ్య తిట్టుకుంటూ! పదవి ఊడితే తిట్టుకోరా మరి!


కళ్లు తెరిచాడు గంటయ్య . 

ఆసుపత్రి ! మంచం మీద ఉన్నాడు. 

మరి మాట్లాడటానికి వీల్లేకుండా వైద్యులు నోట్లో గొట్టాలు పెట్టారు. 


చెవులు మాత్రం బాగానే పనిచేస్తున్నాయి. ఎవరి మాటలో వినబడుతున్నాయి.


' కాలు జారితే చికిత్స ఉంది. నోరు జారుడుకు మందు లేదు. నాలుక వల్ల పదవులు, పరువులు పోగొట్టుకున్నవాళ్లు,  పిల్లల చేత ' ఛీ ' అనిపించుకున్నవాళ్లు, తల్లితో కన్నీళ్లు పెట్టిం చినవాళ్లూ చరిత్రలో చాలామందే ఉన్నారు. తప్పదు  కాబట్టి కట్టుకున్నది ముక్కు మూసుకుని కాపురం చేస్తుంది. సంఘం తాళి కట్టిన పెళ్లాం  కాదు కదా! 


రాముడు, హరిశ్చంద్రుడు మాటకు కట్టుబడి ఉన్నందుకే పూజనీయులయ్యారు. కోపం వస్తే సత్యాగ్రహ మంత్రం, మౌనదీక్ష మనకు మహాత్ముడు మార్గంగా చూపారు. అతిపెద్ద ప్రజాస్వామ్యంలో అప్రజా స్వామిక భాషే అధికారభాషగా మారటం విచారకరం!' 


గంటయ్యకు ఆ మాటలన్నీ వినబడుతున్నాయి. బాధగా ' అమ్మా' ... అనాలనుకున్నాడు. నోటివెంట మరోపూట రాబో





కళ్లు తెరిచాడు. గంటయ్య. ఆసుపత్రి మంచం మీద ఉన్నాడు. మరి మాట్లాడటా వీల్లేకుండా వైద్యులు నోట్లో గొట్టాలు పెట్టారు. చెవులు మాత్రం బాగానే పనిచేస్తున్నాయి. ఎవరి మాటలో వినబడుతున్నాయి.


' అమ్మా' ... అనాలనుకున్నాడు. నోటివెంట మరోమాట రాబో యింది. అయినా తమాయించుకున్నాడు. బాదగా 'అమ్మా' అనే అన్నాడు. 


  నిన్నటి విలేకరుల సమావేశంలో బూతులు తిట్టినప్పటి నుంచి జరిగిన కధంతా కళ్లముందు కదలాడింది. గంటయ్య కళ్లనుంచి ధారాపాతంగా కారుతున్నాయి... కన్నీళ్లిప్పుడు! 


- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - సంపాదకీయ పుట - ప్రచురితం ) 

ఈనాడు - వ్యంగ్యం - హాస్యం - గల్విక - చిన్ని చిన్ని ఆశ... రచన- కర్లపాలెం హనువుంతరావు అంతర్జాతీయ బాలల దినోత్సవం ) ( ఈ నాడు 01 - 06-2009 - ప్రచురితం )



ఈనాడు - వ్యంగ్యం - హాస్యం - గల్విక
- చిన్ని చిన్ని ఆశ... 

రచన:- కర్లపాలెం హనువుంతరావు 
 అంతర్జాతీయ బాలల దినోత్సవం ) 
( ఈ నాడు 01 - 06-2009 - ప్రచురితం ) 

విద్యుత్తు బల్బు కనుక్కున్న థామస్ అల్వా ఎడిసన్ చిన్నప్పుడు పొదగటానికి కోడిగుడ్డు మీద కూర్చున్నాడట. పెద్దయిన తరువాత ఎవరెంత పెద్దాళ్ళయినా చిన్నతనంలో అంతా చిన్నాళ్ళే! 

శ్రీరాముడు బాలుడుగా ఉన్నప్పుడు చందమామకోసం మారాం చేశాడని మా బామ్మ కథ చెప్పింది. 

కలాంగారెంత గొప్పవారైనా కళ్ళు తెరచుకుని తుమ్మలేరుగదా! చందమామనందుకున్న నీల్ ఆమ్ స్ట్రాంగ్  సొంత చేత్తో తన వీపును తట్టుకోమనుండి చూద్దాం! 

పిల్లకాకికేం తెలుసు ఉండేలు దెబ్బని ఊరికే సామెత చెబుతారుగానండి..  మా పిల్లకాయలే ఊరుకోకపోయుంటే మీకింకా ఆస్కారు అవార్డులు ఆకాశంలో దీపాల్లానే  ఊరిస్తుండేవి కావా?  కాదా? పెద్ద పెద్ద పెద్ద అంటారుగానీ పెద్దమహా .. ఆదివారం నుంచీ శనివారం దాకా ఏ పేరు రాకుండా ఏడు రోజుల పేర్లు చెప్పండి చూద్దాం! ఏడుపు మొగ మేసేశారు సార్? ఆ మాత్రం తెలీదా ఆ అటు మొన్న, మొన్న, నిన్న, ఇవాళ, రేపు, ఎల్లుండి, ఆవలేదాండీ . 

అలా తెల్లమొగమేస్తారం సార్.. కాస్త నవ్వుకోండీ! మేం పిల్లలం  రోజుకు మూడొందలసార్లన్నా హాయిగా నవ్వుకుం టుంటాం. అందులో పదోవంతులో సగమన్నా మీ పెద్దాళ్ళు నవ్వుకోకపోతే- ఇదిగో ఇలాగే బీపీలూ, గుండె జబ్బులూ వచ్చి వాటికి ' రాజకీయాలని' పేరు పెట్టి బతుకు రొచ్చు చేసుకుంటున్నారు మీ పెద్దాళ్ళు. వేలడంత లేవు. నువ్వా మాకు చెప్పొచ్చేదని అలా చిరాకుపడిపోకండి మరి. అమెరికాలో వందకు యాభై అయిదు మంది పెద్దాళ్ళు సూర్యుడు ఒక పెద్ద నక్ష త్రమయ్యా బాబూ' అన్నా 'ఛ... మేం నమ్మం పొమ్మ' ని  ఇంకా ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా బుకాయించే స్తున్నారంట! అదీ మీ పెద్దరికం బడాయి   !

ఏనుగుకన్నా ఎలక గొప్పది సార్! ఏనుగు దూకలేదు. దాక్కోలేదు. ఇప్పుడైనా ఒప్పుకుంటారా..! ఐన్‌ స్టీన్ కన్నా ఐన్స్టీన్ తండ్రి తెలివిగలవాడనింకా దబాయిస్తూనే ఉంటారా ? సర్, మీ పెద్దాళ్ళే తెలివిగలవాళ్ళ అయితే స్కూలు బస్సులు సర్వసాధారణంగా పసుపు రంగులోనే ఎందుకుంటాయో చెప్పగలరా! హారర్ సిని మాలు చూసేటప్పుడే పాప్ కార్న్  ఎక్కువెందుకు మెక్కా ల్పొస్తుందో సెలవిస్తారా? టెన్నిస్ గురించి అంతా తెలుసుంటుంది గదా ? మన సానియా మీర్జా మేడమ్ ఆడే ఆ రాకెట్ కు  రంధ్రాలెన్ని ఉంటాయో చెప్పగలరా? ఆమెనే వెళ్ళి అడగాలా! సరే.. పలకముందా .. బలపం ముందా? ఈ సంగతైనా చెప్పుకోండి చూద్దాం ! గాడిద గుడ్డా ! అంటే ఏంటి సార్? అదీ వరస..  తెలవకపోతే ఎదురుదాడి! ఇదేసున్నా రోజూ మీరు టీవీ మైకుల ముందు చేసే రాచకీయ రచ్చలా? 

ఏంటీ.. మాటి మాటికీ రాజకీయాలు అనుకుంటున్నారా? నిన్నటిదాకా మీ పెద్దాళ్ళంతా కలిసి చేసినా ఎన్నికల అల్లరిని మాత్రమే రాజకీయమనుకోవాలా? ఏనుగు కన్నా కప్పల్ని చూసి జడుసుకునే వాళ్ళెక్కవగా ఉన్నారు  ఇప్పటిదాకా.  ఇప్పుడీ  పార్టీలు దూకే వెంకప్పలను చూసి ఇంకా  ఎక్కువ జడుసుకుంటున్నారుగదా! మానాన్న చెప్పాడు.  

మా ఇంట్లో కూడా చాలా పార్టీలే ఉన్నాయి. మా బామ్మది అధికారపార్టీ. అమ్మది ప్రత్యేక పార్టీ . ఎప్పుడు మిఠాయి చేసినా విడిగా వేరే డబ్బాలో దాచుతుంది ..  ఎందుకో? మానాన్నకు మాత్రం పార్టీ లేదు. ఒక్కో సారి బామ్మ పార్టీ, మరోసారి అమ్మపార్టీ. మా బాబాయిది టీపార్టీ.   ఎప్పుడు చూసినా స్టేట్ గవర్నమెంటును , సెంట్రల్  గవర్నమెంటును నిధులు అడిగినట్లు డబ్బుల కోసం నాన్నను వేధిస్తూ ఉంటాడు.

నా పార్టీ ఆభాస అంటే- అఖిలభారత బాలల సమితి. 
తమ్ముడిది దాబాస  అంటే- దోగాడే బాలల సమితి.  పసిపిల్లలకు పార్టీలేంటని  అలా విసుక్కోకండి సార్! మా బాధలు మావి 

మేం మాత్రం కాలక్షేపానికి పార్టీలు పెట్టామా?  దోమలు పెద్దవాళ్ళకన్నా చిన్నపిల్లల్నే ఎందుకు ఎక్కువగా కుడతాయో తేల్చమని ఎన్నేళ్ళ బట్టి పెద్దపార్టీలను అడుగుతున్నాము! పట్టించుకుంటేగా ! నేటి పౌరుడు నిన్నటి బాలుడేగా!  బాలల బాధలు అర్ధం చేసుకోకపోతే ఎలా? స్కూలు బ్యాగులు రోజురోజుకు బరువెక్కుతున్నాయి. పాకెట్ మనీ తగ్గిపోతూ ఉంది. మా ' కా' భాషను అధికారిక భాషగా గుర్తించమని ఎన్నో ఏళ్లుగా  మొత్తకుం టున్నాం. మా ముద్దులకు కనీస మద్దతు ధర పెంచాలి. పరీక్షలు వాయిదా వెయ్యాలి. అక్బరుకు అ..  ఆ లొచ్చా? బీర్బల్ కి ఏబీసీడీలొచ్చా? ఎందుకొచ్చిన హోంవర్కులివి! ప్రోగ్రెస్ రిపోర్టుల మీద సొంతంగా సంతకం చేసుకునే అధికారమివ్వాలి. పరీక్షలో తెలియని ప్రశ్నలు అడగరాదు. ఏ సమాధానం రాసినా సమానమైన పాసులు మార్కులు వేసి సమన్యాయం పాటించాలి. ఆడుకునే సమయం పెంచాలి. టీవీ చూసే వేళల మీద ఆంక్షలు సడలించాలి. పెద్దలకు మాత్రమే సినిమాలు తీసే పద్ధతిలో పిల్లలకూ చిత్రాలు నిర్మించాలి. నాన్‌ సోకింగు జోన్ మాదిరి సైలెన్స్ జోనులు ఏర్పాటు చేయాలి. పైసా వడ్డీకి అప్పులు ఇప్పించాలి. మూడు నెలలు దాటిన బాలలందరికీ పింఛను పథకం వర్తింపజేయాలి. బట్టల మీది బడ్జెట్ కేటాయింపులను చిరుతిళ్ల మీదకు మళ్ళించాలి.

అల్లరే మా అజెండా! బండి చక్రం మా జెండా గుర్తు. గులకరాళ్ళేసిన ఖాకీ డబ్బాల ద్వారా మా ప్రణాళికను జనంలో ప్రచారం చేయాలనుకుంటున్నాం. మా విధానాలు నచ్చిన ఏ పార్టీ ముందుకు వచ్చినా కలిసి పనిచే యటానికి సిద్ధం. బాలల సమస్యలను పట్టించుకోని పార్టీ లను గోడకుర్చీ వేయిస్తాం. బబుల్ గమ్ము లాగా  మా సమ స్యలను నానుస్తామంటే కుదరదు.  సహించం. మాకు మదర్ తెరిసాలే కాదు. ఫాదర్ థెరిస్సా, బ్రదర్ థెరిస్సాలూ కావాలిప్పుడు.

నేను ముఖ్యమంత్రి అయితే  ' కోలాయజ్ఞం' ప్రారంభిస్తా. 
ఐస్క్రీం కిలో రెండు రూపాయల పథకం రద్దు చేసి ఉచి
తంగా ఇచ్చే దస్త్రం మీద మొదటిది, గోల్డు బిస్కెట్లు
అమ్మేసి నిజం బిస్కెట్లు ప్రపంచంలోని బాలలందరికీ ఉచి
తంగా పంచే దస్త్రం మీద రెండో వేలిముద్ర వేస్తానని ఈ
అంతర్జాతీయ బాలల దినోత్సవ సందర్భంగా ప్రమాణం
చేస్తున్నాను. 

చివరగా 'చింటూ'కి బాలరత్న అవార్డు వెంటనే ప్రకటిస్తాం. చివర్లో ఈ 'చింటూ' ఎవరంటారా? 

నేనే! 

- రచన:- కర్లపాలెం హనువుంతరావు 
 అంతర్జాతీయ బాలల దినోత్సవం ) 
( ఈ నాడు 01 - 06-2009 - ప్రచురితం ) 

ఈనాడు - సంపాదకీయం శృంగారమూ ఆరోగ్యమే రచన- కర్లపాలెం హనుమంతరావు ( 17-07-2011 - తేదీ ప్రచురితం )

 



ఈనాడు - సంపాదకీయం 

శృంగారమూ ఆరోగ్యమే! 

రచన- కర్లపాలెం హనుమంతరావు 

( 17-07-2011 - తేదీ ప్రచురితం ) 


తనను అన్వేషిస్తూ సముద్రాలు దాటివచ్చిన ఆంజనేయుడు రాముడి నమ్మినబంటేనన్న నమ్మకం కుదిరాక- వనవాసం నాటి పతిదేవుని చిలిపి చేష్టనొకటి సీతమ్మ ఆ బ్రహ్మచారితో పంచుకుంటుంది. చెదిరిన ఆ నుదుటి తిలకాన్ని సరిదిద్దే నెపంతో మణిశిలను చెక్కిలికి నొక్కిన శృంగారచేష్ట అది. ఆలుమగల మధ్య అత్యంత గోప్యంగా సాగే రసవ త్తర సరస ఘట్టాన్ని సీతమ్మవంటి పరమ సాథ్వీమణి  ఇలా బహిరంగపరచడం వెనకున్న కథా పరమార్థం, ప్రస్తుతం అప్రస్తుతం. విధి వంచించిన విషాద సమయాల్లో సైతం ఆలుమగలు ఒకరి సన్నిధిలో ఒకరు గడిపిన మధురక్షణాల తలపోతలే బాధోపశమనానికి అందుబా టులో ఉండే దగ్గరి దారులన్నదే నీతిసారం. ఆ మార్గం దర్శింపజేసి నందువల్లే సీతారాముల దాంపత్యం సకల లోకాలకూ ఆదర్శవంతమవడం. ఆ రాముడినే  ద్వాపరంలో తమితీరక పయోరుహనాభుని

'భాగ్యరేఖ రుక్మిణి' గా  అవతరించి తరించిందన్నది మడికి సింగనవంటి కవుల భావం. రుక్మిణి శ్రీకృష్ణునితో అనుభవించిన సంసార సుఖాలను అందుకే ఆ శృంగార రసకళాశ్రిత వచోధనుడు పద్మపురాణంలో అంత అంగరంగ వైభోగంగా వర్ణించగలిగింది! 'తెల్లని పండు తమలపాకులు కూడ గోర సవరించి చూర్ణ కర్పూర మిశ్రితం చేసి మడిచి- చిటికేసి చేచాచిన కృష్ణుని అరచేతికి గాజులల్లలాడగా అందించే' శయనాగార శృంగార దృశ్యాలు- నిజానికి ప్రతి పడుచుజంట ఇంటా వలపుపంట పండేముందు తీసుకునే సరసాల పాదులే! స్వర్గానికీ నరకానికీ మధ్య ఉండే గదే పడకటిల్లు' అంటాడు చలం. పడక సౌకర్యంగా ఉంటేనే ఇంట సుఖమూ శాంతీ! మేనమామతో చేసే యుద్ధ సమయంలో సైతం కువలయాపీడం కుంభస్థలం కృష్ణపరమాత్మకు రాధ గుబ్బి గుబ్బలను గుర్తుకు తెచ్చి తన్మయత్వానికి లోనుచేసిందని గీతగోవిందం చమత్కారం. ప్రణయభావనలో ఎంత చమత్కారం లేకపోతే సంసారకేళి ప్రసక్తే పట్టని శివుడు శివానికి అర్థశరీరం అందిస్తాడు! 


సంసారం ఓ త్రివేణీ సంగమం. స్త్రీ పురుషులు గంగాయమునలు. కంటికి కనిపించకుండా అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతే వారిద్దరి మధ్య సాగే ప్రణయధార. క్షణమొక యుగంగా సాగి వేధించడం ఎడబాటు ప్రధాన లక్షణమైతే, యుగమొక క్షణంగా కరిగిపోవడమే కలయిక ఫలశ్రుతి. ముక్కంటి గుండెకే మంట పెట్టిన ఘనుడు పుష్పశరుడు. మామూలు మనుషుల మనసులు, శరీరాలు- వాడి శరాగడాలకు ఆటమైదానాలు. అశరీరుడు రతీసమేతంగా వసంతుణ్ని వెంటేసుకుని వస్తే తుమ్మెదలు పుష్పాలనుంచి మధువులు గ్రోలటానికి పోటీలు పడతాయి. మగలేడి కొమ్ము కొనలతో గీరి చేసే సంకేతాలకు ఆడలేళ్ల కళ్లు మైకంతో మాగన్నుగా మూతలు పడతాయి. మద గజాలు పద్మాల పుప్పొడి కలగలిసిపోయిన సుగంధమయ నదీజలాలను పుక్కిటపట్టి జతగాళ్లకు తమకంతో అందిస్తుంటాయి- అంటూ ఆ మదనలీలా విలాసాలను కాళిదాసు కుమార సంభవంలో ఆమో ఘంగా వర్ణించాడు. దేవరాజు ఇంద్రుడివద్ద ఉండే రెండాయుధాలు వజ్రాయుధం, మదనాయుధం. తపశ్చక్తి సంపన్నుల ముందు మొదటిది వట్టిపోవచ్చు గానీ... ప్రణయాస్త్రం ముందు విశ్వామిత్రులు వంటి జితేంద్రియులైనా మతిభ్రష్టులు కావాల్సిందే అన్నది కాళిదాసు వాదం . సోమరసానికైనా  సాధ్యంకాని మోహావేశాన్ని కామరసం ప్రేరేపిస్తుంది. కనకనే తార శశాంకుని చేరిక కోసం అన్నిరకాల అడ్డదారులు  తొక్కింది. పదికోట్ల యజ్ఞాది క్రతువులు నడిపించిన దేవేంద్రుడూ ఈ మాయలోపడే యోని శరీరుడైంది. ధర్మబద్ధంకాని కామం ప్రమాదకరం కావచ్చునేమోగానీ... చతుర్విధ పురుషార్థాలలో  కామమూ ఒకటి. మోక్షసాధనా మార్గం సుగమం కావాలంటే ధర్మబద్ధమైన కామ మార్గాన్ని దాటి రావాల్సిందే!


సంసార రథానికి రెండు చక్రాలు అలుమగలు. సజావైన రథయాత్రకు అవసరమైన ఇంధనం ప్రేమపూరితమైన శృంగారం. ఒకే శయ్యమీద రెండు వేరు ప్రపంచాలుగా అలుమగలు విహరించడం ఆ కాపురానికి శాపం. పెళ్ళిపీటలమీద పెద్దలు వేసిన కొంగుముడులు జీవితాంతం విడిపోని పీటముడిగా మలచుకునే కార్యం భార్యాభర్తలదే! మూడుముళ్ల బంధం మూడోపాత్రకు ప్రవేశంలేని ప్రణయ కావ్యం. ప్రణయ సామ్రాజ్యం పాలకులుగా ఇద్దరిదీ సమ భాగస్వా మ్యం. వాక్కు, అర్థంలాగా పతీపత్నులిద్దరూ అర్ధనారీశ్వరత్వానికి ప్రతి రూపాలుగా సహకరించుకునే ప్రతి ఇల్లూ... కైలాసం. శిశుపాలుని తలను కోసిన గోపాలుడు తన భామముందు మోకరిల్లింది తల్పాగారంలోనే. అశేష భక్తకోటి పాదాభివందనాలు అందుకునే లక్ష్మీ పతి పాదసేవలో తరించిందీ శయనాగారంలోనే. 'శృంగారం అంటే చొప్ప దంటు అంగాంగ స్పర్శాసుఖం కాదు. అది లక్షల దీపాల అద్వైత కాంతిప్రభ" అంటాడు ఒక ఆధునిక కవి. 'జీవన సాగరంలో సాగే ఆత్మనౌకకు చుక్కాని ప్రేమ అయితే మోహావేశం తెరచాప' అని ఖలీల్ జిబ్రాన్ భావన. నావ అద్దరి క్షేమంగా చేరడానికి భార్యాభ ర్తల ఇద్దరి ముద్దుల ఒద్దిక తప్పనిసరి. శరీరం ఒక శత తంత్రుల విపంచి. స్వరరాగాల స్వారస్యం తెలుసుకొని మీటితే శత సహస్ర అనురాగాల ప్రకంపనలు పుట్టుకొస్తాయి. కాపురాలు క్షేమంగా సాగుతాయి, ఆలుమగల ఆరోగ్యాలూ చిరకాలం సురక్షితంగా ఉంటాయం టున్నారు మానవ జీవన సంతృప్తికర స్థాయీభేదాలమీద పరిశోధనలు సాగిస్తున్న బ్రిటిష్ శాస్త్రవేత్తలు. మనిషి ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితంచేసే ఏడురంగాల్లో ప్రేమ, శృంగారాలదే ప్రధాన భూమిక అన్నది వారి పరిశోధనల సారం. సంతృప్తికరమైన శృంగార జీవి తాన్ని ధర్మబద్ధంగా సాంఘికామోదంతో గడిపే జంటల్లో గుండెజ బ్బులు వచ్చే అవకాశం- సన్యాసి జీవితం గడిపేవారు, నీతిబాహ్యమైన శృంగారానికి, ప్రేమరహితమైన ప్రణయానికి పాల్పడేవారిలో వచ్చేదానికన్నా పదమూడుశాతం తక్కువ అని తాజాగా విడుదలైన యూరో పియన్ హార్ట్ జర్నల్ సంచికలోని కథనం. ఇంకేం! శృంగారమే ఆరోగ్యం. కవి కృష్ణశాస్త్రిలాగా 'జోహారో హరినందనునికి.. జోహారో చిలిపి జోదుకి' అని మనమూ పాడుకుందామా!


- రచన- కర్లపాలెం హనుమంతరావు 

( 17-07-2011 - తేదీ ప్రచురితం ) 

Saturday, December 4, 2021

గల్పిక: ముద్దూ ముచ్చట - కర్లపాలెం హనుమంతరావు

' ప్రకృతి వరం- జీవితం.జీవితం వరం- ప్రేమ . ప్రేమ వరం- ముద్దు' అంటాడు ఉమర్ ఖయాం. 'గంభీరవారాశికల్లోలమండలం, బంభోజవైరి ముద్దాడుచుండె,/అత్యున్నతంబైన యవనీధ రానీక, మంబోధ పటలి ముద్దాడుచుండె..' అంటో ముద్దుకుఅచేతనాలే మురుసి పోతుంటేమనిషి చిత్తవృత్తినిగురించి మరిక చెప్పేదిఏముంది?' అవును.. ఒకపార్శీ కవి అన్నట్లు కండచక్కెర, కలకండ పటిక, కదళీ ఫలం, ఖర్జూర మిశ్రమం, గోక్షీరసారం, ద్రాక్షారసం, దివ్యామృతం, అలరుతేనెల ధార, చెరుకు రసాల చవులు దేనిలోనూలేనిదీ ముద్దులోపలి తీపి. వట్టి రుచేనా.. మనసుముడతలను సరి చేసేదీ ఈపెదాల ముడితడే. పెదవి పెదవి కలిసాయంటేసగం సంగమం శుభప్రదమయినట్లే. 'సపది మద నానలో దహతిమమ మానసం, దేహి ముఖకమల మధుపానం' అంటూప్రియనాయిక మధురాధరాల కోసంవూరికే ఆరాటపడతాడా జయదేవుడిఅష్టపది నాయకుడు! 'అన్యులెవరు చూడకుండగొల్లభామా! ఒక్క/ చిన్ని ముద్దు బెట్టిపోవే గొల్లభామా!' అని నల్లనయ్యనే గొల్లభామవెంట పరుగులెత్తించి అల్లరిపెట్టింది ఈ అధరవల్లరి.'కన్నుల కపూర్వమైన చీకటులు గవియు, గాఢముగమేనికి వింత మైకమ్ము గ్రమ్ము/చిత్తమున కేదో యున్మాదమత్తమిల్లు, చెక్కిళ్ళు ముద్దిడునవసరమున.' అదీ మధురాధర సంగమావస్థమదనావస్థ. మదనతాపానికి ప్రథమ చికత్స ప్రియముఖకమల మధువు ఆస్వాదనమే. ఆఔషధ సేవనం'సురగణాధీశ దుర్లభసుఖమొసంగు, అగణితాత్మ వ్యథాభార మణచివేయు/ భీష్మసదయప్రతాపంబు ప్రిదుల సేయు'. తొలిరేయి తొలిముద్దును గురించికలవరించని వారుఅసలు యవ్వనులేకారు.
నిజానికి తొలిముద్దు దొరికేది తల్లినుంచే. అమ్మవరం ఇచ్చిన పాపదైవానికి భక్తతల్లి సంతృప్తితో చెల్లించే ముడుపు- ముద్దు. 'నిండుమోమున పండు వెన్నెల హసింప/ చిల్క పల్కులు ముద్దులు గుల్కుచుండ/నల్లనల్లన గజ్జియల్ ఘల్లుమనగ/చిరునడతల దరిజేరే చిట్టితల్లి'ని ఏ తల్లి నిజానికి ముద్దాడకుండా ఉండ గలదు? గోరుముద్దలే కాదు..అమ్మ నాన్నలు ఆప్యాయంగా పంచి ఇచ్చేగోరువెచ్చని మురిపాల ముద్దులూ ఎదిగే బిడ్డలకు బలవర్థక ఔషధాలే. యవ్వనంలో మనసు కోరే, మనసును కోఱే ఆ 'ఛీ పాడు' ముద్దుతోనే అసలు పేచీ. తలుపు చాటునో, పెరటిచెట్టు చాటునో, పొలం గడ్డిమేట చాటునో.. పెదవి పై పడే మొదటి ఎంగిలి ముద్రే జీవితాంతం మనసు పుస్తకంలో భద్రంగా మిగిలే నెమలీక. 'తల్లిదండ్రియు దక్కు బాంధవులు జ్ఞప్తి, దొలగిపోదురు వలచిన పొలతిమిన్న/నిద్దపుంజెక్కిలిని ముద్దు దిద్దువేళ' అన్నారు కవి దాశరథి.వెనక వచ్చిన ఆ కొమ్ముల విసురు మగాడికైతే అతిశయ బాహాటమే కానీ మగువకు మాత్రం మనసుతో సైతం పంచుకో సంశయించే అనుభవం. ఆ ముద్దుల్లో మళ్లీ ఎన్ని రకాలు! 'కార్యార్థియై యధికారిబిడ్డల చేరి, బుడిబుడి నద్దించు ముద్దు వేరు,/వెలయిచ్చి కూడెడు వెలయాలి చెక్కిళ్ళ, మురువుమై పొరలించు ముద్దు వేరు/చిన్నారిపొన్నారి చిరుత పాపల పాల, బుగ్గల గీలించు ముద్దు వేరు/నవమాసాగమమందు గవగూడు ప్రియురాలి, ముద్దు చెక్కిలిబెట్టు ముద్దు వేరు/ స్వప్నమున దాను వలచిన సారసాక్షి, నిద్దపుం జెక్కిలిబెట్టు ముద్దు వేరు'. అధరాలు అవే. ఎవరివి ఎప్పుడు ఎక్కడ ఎలా ఆదానప్రదాలు చేస్తున్నాయన్నదే ప్రధానం. చేతి వేళ్ళ మీద అద్దే ముద్దు అభిమాన సూచకం. నుదుటి మీద దిద్దే ముద్దు భరోసాకు చిహ్నం. చుబుకం మీద సాగే చుంబనం సంసిద్దతకు అద్దం. పెదాలపైని ముద్దుదైతే పతాకస్థాయే. చెవుల దొప్పలు, ముక్కు చివరలు కంటిరెప్పల వంటి ఏ ఇతర వంటిభాగాలైనా ముద్దుసీతాకోకచిలుక రాక కోసం ఎదురు చూసే పద్మపుష్పాలే.
మనిషి పెదాలు మాత్రమే ముద్దుకు అనువుగా సృషించినట్లుంటాయి. స్పర్శ నాడుల చివరలకన్నీ చివుళ్ళ చివరనే ముడి. మనసు లోపలి ఉద్వేగాలవడి ముందుగా బైట పడేదీ అధర ముఖద్వారాలనుంచే. సిగ్గు, బిడియం, కామన, సంశయం, భయం, అసహ్యం.. ఏది ముంచుకొచ్చినా చివురుటాకుల్లా ముందు వణికేవ పెదవి చివరి భాగాలే. ముద్దులాడుకునే వేళ 'డోపమిన్' అనే రసాయనం మోతదుకి మించి విడుదలై ఆకలి మందగించడం, నిద్రకు దూరమవడం సహజం. 'ఆక్సిటోసిన్' అనే మరో ప్రేరకం అధికంగా విడుదలై శృంగారవాంఛ రెట్టింపు అవుతుంది.'న్యూరోట్రాన్స్ మీటర్స్' మెదడులోఉత్పన్నమై గుండె లబ్ డబ్ ల వేగం పెరిగిపోతుంది. మనిషి జీవితంలో ముద్దు పద్దు సరాసరి 20,160 నిమిషాలు. నిముషం ముద్దుకు 20 కేలరీలు ఖర్చు. ముద్దుకో శాస్త్రమూ కద్దు. పేరు 'ఫైల్మేతాలజీ'. మమకార ప్రకటనకి ముప్పై నాలుగు కండరాల సహకారం అవసరం. వ్యాధుల సంక్రమణంలోనూ ముద్దుదే ముఖ్య పాత్ర .'నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానంటానా? నీ ముద్దు ముచ్చట కాదంటానా? సరదా పడితే వద్దంటానా?' అంటో 'టాం టాం' కొట్టే పెదవులు నంటే ఉంటాయంటున్నారు అంటువ్యాధి కారక క్రిములు. అయినా ముద్దంటే చేదెవరికి? చంటిబిడ్డలనైనా అందుకే ఓ హద్దు దాటి ముద్దాడ వద్దని ఆరోగ్యశాస్త్రం హెచ్చరిస్తోంది. మన్మధ సామ్రాజ్య విహారయాత్రలో ముద్దు ఒక 'టోల్ గేట్'. మధువుకూ, ధూమానికి ఆమడ దూరం మధురాధరాల ఆదరం. నమిలిన తిండిని బిడ్డకు అందించడంతో ప్రేమగా పెదవులు కలపడం మొదలయిందని ఓ ఊహ. ముద్దు ఆలోచన ముందు రోమనులదే అని ఒక వాదం. భారతీయులకూ బోలెడంత చుంబన సాహిత్యం ఉంది. 'శతపథ బ్రాహ్మణ'మే ఉదాహరణ. ముద్దు సమయ సందర్భాలమీద పెద్దలకే పెద్ద అవగాహన లేదంటున్నారు శృంగార శాస్త్రవేత్తలు. వారానికి సగటున 11 సార్లేనుట దంపతుల మధ్య ముద్దాయణం. అదీ కంటిరెప్ప పడి లేచే లోపలే చప్పున చల్లారిపోతోందని, పెళ్లయిన ప్రతి ఐదుగురిలోనూ ఒకరు ముద్దుకు దూరమవుతున్నారని 'డెయిలీ ఎక్స్‌వూపెస్' బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్'సంయుక్తంగా నిర్వహించిన తాజా సర్వే సారాంశం. సంపాదనే లక్ష్యంగా సాగుతున్న సంసారాల్లో ముద్దు ముచ్చట్లు తగ్గిపోవటం ఆందోళన కలిగించే అంశమే. 'ప్రణయకోపము పంచబంగాళమైపోవు, నీసడింపులవెల్ల బాసిపోవు/మనసు బింకబెల్ల మటుమాయమైపోవు, నాత్మగౌరవమెల్ల నడగిపోవు/ కోటి రూకలును గవ్వకు సాటి రాకుండు, త్యాజంబుగా తోచు రాజ్యమైన/అవధి చెప్పగ రానియానంద మెసలారు, స్వాంతంబు తన్మయత్వంబు జెందు/' .అదీ ముద్దు మహిమ మరి. వద్దనుకుంటే ఎలా?

- కర్లపాలెం హనుమంతరావు

బోథెల్, యూ.ఎస్.ఎ 

( సిలికాంధ్రవారి సాహిత్య అంతర్జాలి పొదరిల్లు - సుజనరంజని - ఫిబ్రవరి 2015 లో ప్రచురితం ) 


 


మనిషి మహా ‘ క్రాక్ ‘ ! - కర్లపాలెం హనుమంతరావు

 


'ఏం చేస్తున్నావు?' - అడిగింది అంతరాత్మ.

పెన్‌ పవర్  పత్రిక ప్రకాశం ఎడిషన్ కోసం వ్యాసం రాసే పనిలో ఉన్నా  . ఏ అంశం మీద రాద్దామా అని బుర్ర చించుకుంటున్నా. తెగడంలే బ్రో ‘ 

'ఈ మధ్య  నువ్ రాసే చెత్తలో  మరీ తాలు తప్ప  ఎక్కువయిందంటుందయ్యా నీ రీడర్ గణం. బ్రేకింగ్ గా ఏదైనా, లైటర్ వీన్  ట్రై  చెయ్యచ్చుగా?' అని గొణిగింది అంతరాత్మ.

'ఆ సణుగుళ్లెందుకు. మనసులో ఉన్న మధనేదో బైటికే అనవచ్చుగా!'

ఫక్కుమని నవ్వి అంది అంతరాత్మ 'బాబూ! నేను నీ అంతరాత్మను. అంతరాత్మలక్కూడా అంతలా భారీ  మనసులుంటాయా? అయినా, అక్కడికి మీ మనుషులు మా అంతరాత్మం  పెట్టే  వింటున్నట్లు.. మహా బిల్టప్ ! నేను జంతువు టైప్ . నాకూ వాటికి మల్లే మనసులూ పాడూ అంటూ  నసలుండవు. ముందా సంగతి తెలుసుకోవయ్యా మహానుభావా! రచయితవి. నీకే తెలీకపోతే ఇహ పాఠకులకు నువ్వేంటి కొత్తగా చెప్పుకొచ్చేది.. నాబొంద!' అందా అంతరాత్మ. 

నవ్వొచ్చింది నాకు.. నా అంతరాత్మ మళ్లీ బొంద మాట ఎత్తేసరికి . 


నిజానికి అది  పెట్టే నస చెవినపడితే చాలు. . 'మన  పాతకాలం తెలుగు సినిమాల అంతరాత్మల్లా  శుభ్రంగా ఏ టినోపాలుతోనో  ఉతికారేసిన  ఏ తెల్లటి  వైట్ నైట్ డ్రస్ లోనో   అద్దంలో నుంచో, స్తంభం చాటి  నుంచో అడగా పెట్టకుండా తగలడి  వద్దన్నావినకుండా  నసపెట్టేస్తుంటాయ్. తెలుగు పంతుళ్ల తీరే అచ్చంగా! ఒక్కోసారి, మన టైం బాలేనప్పుడు ..  ఒకటి కాదు, రెండు  కూడా చెరో పక్కనా చేరి చెండుకు తినడం.. వాటికి  అదో సరదా. పాత్ర  ఎస్వీ రంగారావు స్టయిల్లో  చేతిలో ఉన్న పాత్రను   విసిరి గొట్టినా అద్దం ముక్కలయి చచ్చేదే కాని అద్దాని నస అన్ని గాజు ముక్కల్నుంచి వెయ్యింతలై  మన తల వక్కలయేది. మళ్లీ ఏ కమలాకర కామేశ్వర్రావు సారో వచ్చి  కల్పించుకుంటే తప్ప ఆ అంతరాత్మల ఘోష అంతమయ్యే ఛాన్సే లేదు. కొంపదీసి నువ్వూ ఇప్పుడు ఆ తరహా ప్రోగ్రామేమన్నాపెట్టుకుని దయచేయ లేదు కదా! కరోనా రోజులు!  ఎటూ బైటికి పోయే దారి  నాకుండదని   గాని పసిగట్టావా ఏందీ ఇంటలిజెన్సోడిలాగా!'

'ఆపవయ్యా సామీ ఆ పైత్యకారీ కూతలు. నువ్వేమీ ఎస్వే ఆర్వీ, ఎంటీఆర్వీ కాదులే! వట్టి ఓ మామూలు కెహెచ్చార్ గాడివి . గంతకు తగ్గ బొంత సైజులో నీ స్టేటస్సుకు తగ్గ  మోతాదులోనే నా ఆర్భాటం ఉండేది. ఇంతకీ అసలు  చెప్పాల్సిన మాట డైవర్టయి పోయింది నీ  డర్టీ డైలాగుల డప్పు చప్పుళ్ల మధ్య. మరోలా అనుకోక పోతే ఒక సలహా బాబూ! ఈ కరోనా రాతలు కాస్సేపు పక్కన పెట్టు. పోలిటిక్సు  పోట్లు పద్దాకా ఏం పొడుస్తావులే కాని,, ఇంచక్కా ఈ లోకంలో నీకు మల్లేనే హుందాగా  జీవించే జంతుజాలం గురించి ఏమన్నా ఓ నాలుగు ముక్కలు అందంగా  గిలికిపారెయ్యవయ్యా  ఈ దఫాకు! సరదాగా అందరు చదు కుంటారు!'

'జంతువుల గురించా? రాయడానికేమంత ఇంపార్టెంట్ మేటరుంటుందబ్బా? మన పాఠకులంతా అన్నీ   చదివి ఎంజాయ్ చేసినవే గదా ?  జిత్తులు, నత్త నడక, సాలెగూడు, కాకి గోల, కోడి నిద్ర, కుక్క బుద్ధి, క్రూర మృగం, హంస నడక, మొసలి కన్నీరు, కోతి చేష్టలు, పిల్లి మొగ్గలు, పాము పగ, ఉడుం పట్టు, గాడిద చాకిరీ గట్రా జంతు రిలేటెడ్  సజ్జెక్టులు అన్నీ  నీ బోటి  అంతరాత్మలు నస పెట్టించి మరీ గిలికించేసాయి కదా! ఇహ నాకు మాత్రం  కొత్తగా రాసేందుకు ఏం మిగిల్చారు గనకయ్యా నాయనా?‘

 

'ఆపవయ్యా రైటర్ ఆ పాడు అపవాదులు! అక్కడికి భాషలు, భావాలు  ఓన్లీ మీ మనుషులకే సొంతమయినట్లూ!  ఏమిటా కోతలు! మీ మనుషులున్నారే చూడు .. వాళ్లే  అసలైన జంతువులు. ఏ సాధుశీలి డ్రెస్  లోపల ఏ మేకవన్నె పులి పొంచివుందో , ఏ అరి వీర భీకర మహా విజేత గుండెల్లో 'ఉస్సో ‘  అంటేనే  ఉలిక్కి పడే  పిల్లేడ్చిందో?పుట్టింటిని గూర్చి మేనమామ ముందా  డప్పు కొట్టేదీ?   అంతరాత్మలం..  మాకానువ్వు  కొత్తగా సినిమా కతలు చెప్పి నమ్మించేదీ! ఆ  రొటీన్ టాపిక్కుల గోల మళ్లా ఇప్పుడెందు గ్గానీ, ఊపు కోసం నేనీ మధ్య  వాట్సప్ లో చదివిన వెరైటీ జంతువుల కహానీ ఓటి  చెబుతా.. చెవ్విటు పారేయ్!ఆనక నీకు ఆ యానిమల్స్ జాతి మీదుండే యనిమిటీ, గినిమిటీ మొత్తం వదిలిపోవాలి.’ 

 జంతువులేవీ అసలాలోచనలు గట్రా  చేయలేవని కదూ  మీ పుచ్చు మనుషుల పుర్రెల్లో  ఊహలు!  ఆహారం,  నిద్రా మైథునమంటి   సహజాతాలంటేనే  వాటికి ఇంటరెస్టని మీ మెంటాలాలోచనా?   జంతుజాలం భాష నీ  డీ-కోడింగుకు అందదు.కాబట్టే  కాకి కూతల వెనకుండే రంపపు కోత నీ డర్టీ  బుర్రకెక్కదు.  వాటి నాటికసలు  మాటాడమే  రాదనుకుంటే .. అది నీ మూఢత్వంరా బేటా!  వాటి మాటల సారం నీ బుర్రకెక్కి చావదు! మనిషిగా పుట్టావు కాబట్టి అన్నిటికీ   నువ్వా బ్రహ్మయ్యనే తప్పు పడతావ్! అన్నీ నీకు మాత్రమే తెలుసంటూ డబ్బు కొడతావ్!’

ఈ సారి ఏ  హిమాలమాల సైడుకో టూరుకని వెళ్ళి నప్పుడు ఆ హరిద్వారం , ఋషీకేశ్వరం దాకా వెళ్లి చూడు! టీ నీళ్ల కోసం నిన్ను వేధించాడని విసుక్కోడమొక్కటే నీకు తెలుసు. కానీ,    రక రకాల పక్షి కూతలకు, జంతు భాషలకు ఆ గడ్డం బుచోళ్లే అచ్చుపడని పదనిఘంటువులని నీకు తెలీదు.  పక్షులూ, జంతువులతో మాట్లాట్టం  వాస్తవానికి ఓ గడసరి విద్యయ్యా!  మేక చెవులు  గట్టిగా పట్టుకుని మన ఏప్రియల్ మాసం తరువాత వచ్చే నెల పేరేంటో చెప్పమని అడుగూ !

'మే' అని ఠక్కున చెప్పకపోతే  నీ పాత  చెప్పుతో నా దవడ పగల కొట్టు! చిరుగు జోడు  తెచ్చి  నా మెడకు కట్టు ‘ 

అంతరాత్మలకు మెడలు ఎక్కడేడ్చాయన్న డౌటొచ్చే లోపలే 

'సర్కార్ల  సంక్షేమ పథకాలేవన్నా ప్రజలకు మేలు చేసేవేనా  ?' అని కాకి మూకల నడిగి చూడు!  'కావు.. కావు' మనకుండా నోరు మూసుకు చావవు,  నాదీ గ్యారంటీ.  ‘! 

‘ గలగల, వలవల, గడగడల్లాంటి  జంటపదాలు మీ చెత్తు రచైతులకు  మల్లే చెత్తచెత్తగా వాడేసే  శక్తి.. గ్యాపు  లేకుండా  'కిచకిచ'లాడే  పిచ్చుకమ్మకుంటుందని తెలుసా తమకు? 'భ' అనే హల్లుకి ఔత్వం ఇస్తే ఏమవుతుందో బోలెడంత డబ్బుపోసి కార్పొరేట్ బళ్లల్లో కునికే  మీ బదుద్ధాయిలకు  తెలీకపోవచ్చు కానీ.. ఏ వీధి కుక్క వీపు మీద ఓ రాయి బెడ్డ విసిరినా   'బౌ.. బౌ' అవుతుందని బోలెడన్ని సార్లుగొంతు చించుకుని మరీ  చెప్పేస్తుంది!  కప్పల్ని మింగడం తప్ప ఇంకేమీ తెలిదనుకునే పన్నగాలకు అమెరికా అధ్యక్షుల్లో  'బుష్' పేరున్న వాళ్లు  ఒకడు కాదు.. ఇద్దరున్నారన్న ఇంగితం బుసలు కొట్టి మరీ బైటపెడుతుందయ్యా మట్టి బుర్రయ్యా!  పార్వతమ్మకున్న  పర్యాయపదాలల్లో 'అంబ' ఒకటని.. నీకే కాదు..  ఆవుకూ  తెలుసు. జి.కె  మనిషి జన్మ ఎత్తిన మీకు మాత్రమే స్పషల్ క్యాలిటీ అంటూ   అస్తమానం ఇంతలావు  ఉబ్బెత్తు ఛాతీలు తెగ బాదుకుంటూ  తిరిగే మీ బోడి  మనుషు ముందు తెలుసుకోవలసవా సీక్రెటోటుంది.  ఏనుగుకి ఆంగ్లంలో నెయ్యిని ‘ ఘీ ‘ అంటారని ఏ క్రాష్ కోర్సులోనో జాయినయి బిట్టీ పట్టే   మీ భడవాయిలకన్నా   ముందే  తెలుసు – తెలుసా! ఇట్లా చెపు    చెప్పుకుంటా  పోతే ఈ జంతువుల జనరల్ నాలెడ్జుందే ఆ సబ్జెక్టుకు ఫుల్ స్టాపే కాదు.. కామా, సెమీ కోలన్లైనా  ఎక్కడ తగిలించాడామో తోచక తలలు పట్టుకోవాల తంబీ! లాస్ట్..  బట్ నాట్ ది లీస్ట్.. ఇంపార్టెంట్ పాయింటొకటుంది బ్రదర్ ! ఆ ముక్కా చెప్పక  వదిలేస్తే జంతులోకానికి అంతులేని ద్రోహం చేసినట్లే!   దటీజ్ .. నెమలీస్  ఒపీనియన్ ! ఈ మనిషిని గురించి ‘ పీకాక్!  . . పీకాక్! నువ్వేమనుకుంటున్నావో చెప్పు! ‘ అని ఎన్ని సార్లు అయినా అడుగు!  

'క్రాక్.. క్రాక్.. క్రాక్.. క్రాక్ ‘  అంటూ ఇంచక్కా  తోకూపేసుకుంటూ ఎగ్జిటయిపోతుంది ప్రతిసారీ! మనమేం చేస్తాం! చోసుడికే అన్నాళ్లకే నిలవనీడ లేకుండా పోయిన వండర్ఫుల్ వరళ్లో !

అంతరాత్మ అంతర్యం బోధపణ్ణంత  బ్లాంక్ హెడ్డు కాదిక్కడ . అంతులేని కోపంతో చేతిలోది విసిరేసా!  

పగలని అద్దంలో ‘ క్రాక్.. క్రాక్.. క్రాక్ , క్రాక్.. అంటూ  పగలబడి నవ్వుతున్న ఈ  అంతరాత్మ గాడిద నేంచేస్తే నస వదులుతుందనే  ఆలోచన నలిపేస్తుంది నన్నిక్కడ. 

వాంటెడ్ హెల్ప్ .. ప్లీజ్ . ప్లీజ్! 


-కర్లపాలెం హనుమంతరావు

29-10-2021  

బోథెల్ ; యూ.  ఎస్.  ఎ  

( పెన్ పవర్ దినపత్రిక ప్రచురితం ) 




 ఈనాడు - గల్పిక: 

చోరకళావారసులు

- కర్లపాలెం హనుమంతరావు


రారా కృష్ణయ్యా ! వచ్చి మా మోర ఆలకించవయ్యా! దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించావనే కదా అందరూ నిన్ను పూజించేది! బుడి బుడి అడుగుల చిన్ని కృష్ణయ్యను ఆనందంగా స్వాగతించేది! ఇప్పుడా ఆనందం నీ భక్త జన సందోహంలో కనిపించడం లేదు. గమనించావా దీనజన బాంధవా? 

మన్ను తిన్న నోటితో తినలేదని నువ్వే పరమార్థంతో మీ అమ్మతో అబద్ధమాడావో! భువన భాండాలని మింగే బకాసురులకు ఇప్పుడు ఆ బుకాయింపు పర్వమే పెద్ద పరమాత్మ తత్వంగా స్థిరబడిపోయింది! కిరాయి మనుషులను పెట్టి మరీ గోవర్థన గిరులను ఎత్తిస్తున్నవారే విచారణల కమిటీల నుంచి తమను తాము కాపాడుకునేందుకు తులాభారంలో తులసీదళానికి తూగిన నీ కన్నా ఎక్కువ అమాయకత్వం నటించేస్తున్నారు. అస్మదీయులకు పద్మనయనాలల్లో నయన మనోహరంగా దర్శనమిచ్చే రాజకీయం సామాన్యుడిన్ని మాత్రం సహస్రాధిక క్రూర దంష్ట్రాలతో బెదరగొట్టేస్తుందయ్యా మహానుభావా!

కన్నయ్యా! నీవు లేకుండా మహాభారతమన్నా నడుస్తుందేమో కాని.. నీ వారసులమని చెప్పుకు తిరిగే నాయకుల జోక్యం లేకుండా చివరికి తిరుమల వెంకన్న దర్శన భాగ్యమైనా దొరికే పరిస్థితి లేదు! 

దేవుడంటే వాళ్లందరికీ పన్ను కట్టక్కర్లేని హుండీ! దేవాలయాల అదాయాలంటే చాలా మందికి కడుపు నిండా తిన్నా తరగని ప్రసాదాలు. నీ 'పవిత్రాణాయ సాధూనాం' ఇప్పుడు ఎన్నికల ముందు నీ  వారసులమని చెప్పుకునే వారినీ ధర్మ సంస్థాపనార్థాయ థీరిని ధనసంపాదనార్థాయగా మార్చేసిందయ్యా ముకుందా! నీ కాలం నాటి రాజకీయం రంగూ రుచీ వాసనా మార్చేసుకుని  ఒక యుగాంతరం దాటిపోయిందయ్యా గోవిందా! గోపి అంటే నీ కన్నా ముందు 'గోడ మీద పిల్లే' గుర్తుకొస్తోందిప్పుడు! కృపారసం జల్లెడివాడు పైనుంటే ముష్టి యములాడికేమిటి.. ఐటి,  ఇడిలాంటి ఇడియెట్  శాఖల వారెవరికి  జడవనవసరమే లేదు. చట్ట సభల్లో బిల్లులు చెల్లిపోవడానికి, చట్టం ముందున్న కేసులు చెల్లిపోవడానికి కొత్త బాదరాయణ సంబంధాలు పుట్టుకొస్తున్నాయిపుడు  బదరీనాథా! 'భజగోవిందం .. భజగోవిందం'  అంటూ ముఢమతులు కూడా పాడటంలేదిపుడు! భజనలూ, కీర్తనలూ, దందకాలూ, అష్టోత్తర నామావళులూ ఎక్సెట్రా ఎక్స్ట్రాలన్నీ బుల్లి దేవుళ్లకూ, దేవతలకే మళ్లిపోయాయయ్యా వనమాలీ! గురువాయూరు కన్న పరమ పవిత్ర దేవాలయాలిప్పుడు హస్తినలో అమరావతిలో, భాగ్యనగరుల్లో వెలసి వర్థిల్లుతున్నాయి గోవర్థన గిరిధారీ! చెప్పులు బైట వదిలి పెట్టి ములవిరాట్టుకో నమస్కారం కొట్టి, వీపు కూడా చూపించకుండా వెనక్కి వచ్చే భక్తశిఖామణులకే ముందుకెళ్లే అవకాశాలు మెండు! ఆత్మకథల నిజాలను కూడా తొక్కిపెట్టేయటమే నేటి నిజమైన పారదర్శక విధానం. నార్కో అణాలసిస్ పరీక్షల్లో కూడా నాలిక మడత పడకపోవడమే నేటి నేత మొదటి ఘనత. 

మూడు లోకాల నేలేటి మోహనాకారుడివైనా ధర్మసంస్థాపన కోసం గుర్రాలు తోలే పనికి నువ్వు గనక వెర్రిగా ఒప్పుకున్నావు! విదురుడంతటి ఘనుడు అరటిపండు ఒలిచి తొక్క ఇచ్చినా బెదురు లేకుండా ఆరగించిన  అమాయకుడివి. రాజసూయ యాగంలో ఎంగిలాకులు ఎత్తిన వినయ విధేయ సంపన్నుడివి. మోర పెట్టుకున్నది ఆఫ్ట్రాల్ బోడి కరిరాజమే! అయినా సిరికి కూడా చెప్పనంత హడావుడిగా పరుగెత్తుకొనొచ్చి ఆర్తత్రాణ పరాయణత్వం మీదుండే నీ ఆత్రం నిరూపించుకుంటివి. నేటి నేతలు వాటిలో ఏ ఒక్కటి పాటించినా జనమే తాటాకులు కట్టే పరిస్థితి. గోవర్థన గిరిని ఎత్తడం ఇప్పుడు గొప్ప కాదు మాధవా! పెరుగుతున్న ధరవరలను మా కోసం కిందికి దింపి నీ మహిమలు మళ్లీ నిరూపించుకోగలవా? మానినీ మానసంరక్షకుడనంటు భుజకీర్తులు బజాయించుకునుడు కాదు! సందునో దుశ్సాసనుడు శాసిస్తున్నాడిప్పుడు! ఆడపడుచులను ఆ కిచకాధముల నుంచి కాపాడి చూపించు.. కామినీ కుల వంద్యుడవేనని వప్పుకుంటామప్పుడు! ఒక్క పసిబిడ్డ పాలలో ఏం ఖర్మ.. మనిషి తినే ప్రతి పదార్థంలోనూ విషం కలిపే పూతనలే  ఎక్కువవుతున్నారిప్పుడు. వారి పనిపట్టగల చేవ చూపెట్టగలవా మాధవా? నీటినీ, నేలనూ, గాలినీ సర్వం కాలుష్యమయం చేసే కాళీయుల మాడు పైన మళ్లీ మా కోసం తాండవమాడగలవా  కృష్టా! నువ్వా ద్వాపరంలో చంపింది ఒక్క కంసుడిని మాత్రమే! ఇప్పుడు ఆ దుష్టుడి వారసులు అడుగడునా సామాన్యులను నానాహింసల పాల్చేస్తున్నారు ఆపద్భాంధవా! వంద తప్పులు  వరకు సహించే ఓపిక పరమాత్ముడివి కనక నీకుండ వచ్చునేమో గానీ వాసుదేవా! మానవ మాత్రులం మేమీ గర్విష్టుల  బాధలకిక ఏ మాత్రం  ఓర్వలేని దుఃఖంలో పడివున్నాం. ఆత్మకు చావు లేదు. నిజమే కానీ, అది ధరించిన దేహానికి ఆకలి దప్పికలు తప్పవు కదా స్వామీ? ఎంత కట్టి విడిచు దేహమయినా.. కట్టి విడిచే గోచీపాత అవసరమే కదా  స్వామీ?  చిన్న చినుకు చాలు.. ఊళ్ల కూళ్ళు వరదలిక్కడ.  నీ దంటే.. హాయిగా  వటపత్ర శాయి బతుకు. గోవులను కాపాడు గొప్ప దేవుడివి ! ఈ బక్క జీవుల దిక్కుకు మాత్రం ఎందుక రావు? జనం కష్టసుఖాలను ముందు ఆలకించు స్వామీ! వద్దన్నా అవుతుంది అప్పుడు పెద్ద పండుగ నీవు పుట్టిన తిథి అష్టమి!


కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపాదక పుట ప్రచురితం ) 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...