ఈనాడు - సంపాదకీయం
శృంగారమూ ఆరోగ్యమే!
రచన- కర్లపాలెం హనుమంతరావు
( 17-07-2011 - తేదీ ప్రచురితం )
తనను అన్వేషిస్తూ సముద్రాలు దాటివచ్చిన ఆంజనేయుడు రాముడి నమ్మినబంటేనన్న నమ్మకం కుదిరాక- వనవాసం నాటి పతిదేవుని చిలిపి చేష్టనొకటి సీతమ్మ ఆ బ్రహ్మచారితో పంచుకుంటుంది. చెదిరిన ఆ నుదుటి తిలకాన్ని సరిదిద్దే నెపంతో మణిశిలను చెక్కిలికి నొక్కిన శృంగారచేష్ట అది. ఆలుమగల మధ్య అత్యంత గోప్యంగా సాగే రసవ త్తర సరస ఘట్టాన్ని సీతమ్మవంటి పరమ సాథ్వీమణి ఇలా బహిరంగపరచడం వెనకున్న కథా పరమార్థం, ప్రస్తుతం అప్రస్తుతం. విధి వంచించిన విషాద సమయాల్లో సైతం ఆలుమగలు ఒకరి సన్నిధిలో ఒకరు గడిపిన మధురక్షణాల తలపోతలే బాధోపశమనానికి అందుబా టులో ఉండే దగ్గరి దారులన్నదే నీతిసారం. ఆ మార్గం దర్శింపజేసి నందువల్లే సీతారాముల దాంపత్యం సకల లోకాలకూ ఆదర్శవంతమవడం. ఆ రాముడినే ద్వాపరంలో తమితీరక పయోరుహనాభుని
'భాగ్యరేఖ రుక్మిణి' గా అవతరించి తరించిందన్నది మడికి సింగనవంటి కవుల భావం. రుక్మిణి శ్రీకృష్ణునితో అనుభవించిన సంసార సుఖాలను అందుకే ఆ శృంగార రసకళాశ్రిత వచోధనుడు పద్మపురాణంలో అంత అంగరంగ వైభోగంగా వర్ణించగలిగింది! 'తెల్లని పండు తమలపాకులు కూడ గోర సవరించి చూర్ణ కర్పూర మిశ్రితం చేసి మడిచి- చిటికేసి చేచాచిన కృష్ణుని అరచేతికి గాజులల్లలాడగా అందించే' శయనాగార శృంగార దృశ్యాలు- నిజానికి ప్రతి పడుచుజంట ఇంటా వలపుపంట పండేముందు తీసుకునే సరసాల పాదులే! స్వర్గానికీ నరకానికీ మధ్య ఉండే గదే పడకటిల్లు' అంటాడు చలం. పడక సౌకర్యంగా ఉంటేనే ఇంట సుఖమూ శాంతీ! మేనమామతో చేసే యుద్ధ సమయంలో సైతం కువలయాపీడం కుంభస్థలం కృష్ణపరమాత్మకు రాధ గుబ్బి గుబ్బలను గుర్తుకు తెచ్చి తన్మయత్వానికి లోనుచేసిందని గీతగోవిందం చమత్కారం. ప్రణయభావనలో ఎంత చమత్కారం లేకపోతే సంసారకేళి ప్రసక్తే పట్టని శివుడు శివానికి అర్థశరీరం అందిస్తాడు!
సంసారం ఓ త్రివేణీ సంగమం. స్త్రీ పురుషులు గంగాయమునలు. కంటికి కనిపించకుండా అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతే వారిద్దరి మధ్య సాగే ప్రణయధార. క్షణమొక యుగంగా సాగి వేధించడం ఎడబాటు ప్రధాన లక్షణమైతే, యుగమొక క్షణంగా కరిగిపోవడమే కలయిక ఫలశ్రుతి. ముక్కంటి గుండెకే మంట పెట్టిన ఘనుడు పుష్పశరుడు. మామూలు మనుషుల మనసులు, శరీరాలు- వాడి శరాగడాలకు ఆటమైదానాలు. అశరీరుడు రతీసమేతంగా వసంతుణ్ని వెంటేసుకుని వస్తే తుమ్మెదలు పుష్పాలనుంచి మధువులు గ్రోలటానికి పోటీలు పడతాయి. మగలేడి కొమ్ము కొనలతో గీరి చేసే సంకేతాలకు ఆడలేళ్ల కళ్లు మైకంతో మాగన్నుగా మూతలు పడతాయి. మద గజాలు పద్మాల పుప్పొడి కలగలిసిపోయిన సుగంధమయ నదీజలాలను పుక్కిటపట్టి జతగాళ్లకు తమకంతో అందిస్తుంటాయి- అంటూ ఆ మదనలీలా విలాసాలను కాళిదాసు కుమార సంభవంలో ఆమో ఘంగా వర్ణించాడు. దేవరాజు ఇంద్రుడివద్ద ఉండే రెండాయుధాలు వజ్రాయుధం, మదనాయుధం. తపశ్చక్తి సంపన్నుల ముందు మొదటిది వట్టిపోవచ్చు గానీ... ప్రణయాస్త్రం ముందు విశ్వామిత్రులు వంటి జితేంద్రియులైనా మతిభ్రష్టులు కావాల్సిందే అన్నది కాళిదాసు వాదం . సోమరసానికైనా సాధ్యంకాని మోహావేశాన్ని కామరసం ప్రేరేపిస్తుంది. కనకనే తార శశాంకుని చేరిక కోసం అన్నిరకాల అడ్డదారులు తొక్కింది. పదికోట్ల యజ్ఞాది క్రతువులు నడిపించిన దేవేంద్రుడూ ఈ మాయలోపడే యోని శరీరుడైంది. ధర్మబద్ధంకాని కామం ప్రమాదకరం కావచ్చునేమోగానీ... చతుర్విధ పురుషార్థాలలో కామమూ ఒకటి. మోక్షసాధనా మార్గం సుగమం కావాలంటే ధర్మబద్ధమైన కామ మార్గాన్ని దాటి రావాల్సిందే!
సంసార రథానికి రెండు చక్రాలు అలుమగలు. సజావైన రథయాత్రకు అవసరమైన ఇంధనం ప్రేమపూరితమైన శృంగారం. ఒకే శయ్యమీద రెండు వేరు ప్రపంచాలుగా అలుమగలు విహరించడం ఆ కాపురానికి శాపం. పెళ్ళిపీటలమీద పెద్దలు వేసిన కొంగుముడులు జీవితాంతం విడిపోని పీటముడిగా మలచుకునే కార్యం భార్యాభర్తలదే! మూడుముళ్ల బంధం మూడోపాత్రకు ప్రవేశంలేని ప్రణయ కావ్యం. ప్రణయ సామ్రాజ్యం పాలకులుగా ఇద్దరిదీ సమ భాగస్వా మ్యం. వాక్కు, అర్థంలాగా పతీపత్నులిద్దరూ అర్ధనారీశ్వరత్వానికి ప్రతి రూపాలుగా సహకరించుకునే ప్రతి ఇల్లూ... కైలాసం. శిశుపాలుని తలను కోసిన గోపాలుడు తన భామముందు మోకరిల్లింది తల్పాగారంలోనే. అశేష భక్తకోటి పాదాభివందనాలు అందుకునే లక్ష్మీ పతి పాదసేవలో తరించిందీ శయనాగారంలోనే. 'శృంగారం అంటే చొప్ప దంటు అంగాంగ స్పర్శాసుఖం కాదు. అది లక్షల దీపాల అద్వైత కాంతిప్రభ" అంటాడు ఒక ఆధునిక కవి. 'జీవన సాగరంలో సాగే ఆత్మనౌకకు చుక్కాని ప్రేమ అయితే మోహావేశం తెరచాప' అని ఖలీల్ జిబ్రాన్ భావన. నావ అద్దరి క్షేమంగా చేరడానికి భార్యాభ ర్తల ఇద్దరి ముద్దుల ఒద్దిక తప్పనిసరి. శరీరం ఒక శత తంత్రుల విపంచి. స్వరరాగాల స్వారస్యం తెలుసుకొని మీటితే శత సహస్ర అనురాగాల ప్రకంపనలు పుట్టుకొస్తాయి. కాపురాలు క్షేమంగా సాగుతాయి, ఆలుమగల ఆరోగ్యాలూ చిరకాలం సురక్షితంగా ఉంటాయం టున్నారు మానవ జీవన సంతృప్తికర స్థాయీభేదాలమీద పరిశోధనలు సాగిస్తున్న బ్రిటిష్ శాస్త్రవేత్తలు. మనిషి ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితంచేసే ఏడురంగాల్లో ప్రేమ, శృంగారాలదే ప్రధాన భూమిక అన్నది వారి పరిశోధనల సారం. సంతృప్తికరమైన శృంగార జీవి తాన్ని ధర్మబద్ధంగా సాంఘికామోదంతో గడిపే జంటల్లో గుండెజ బ్బులు వచ్చే అవకాశం- సన్యాసి జీవితం గడిపేవారు, నీతిబాహ్యమైన శృంగారానికి, ప్రేమరహితమైన ప్రణయానికి పాల్పడేవారిలో వచ్చేదానికన్నా పదమూడుశాతం తక్కువ అని తాజాగా విడుదలైన యూరో పియన్ హార్ట్ జర్నల్ సంచికలోని కథనం. ఇంకేం! శృంగారమే ఆరోగ్యం. కవి కృష్ణశాస్త్రిలాగా 'జోహారో హరినందనునికి.. జోహారో చిలిపి జోదుకి' అని మనమూ పాడుకుందామా!
- రచన- కర్లపాలెం హనుమంతరావు
( 17-07-2011 - తేదీ ప్రచురితం )
No comments:
Post a Comment