Monday, December 6, 2021

ఈనాడు - గల్పిక- హాస్యం - వ్యంగ్యం ఓటరావతారం రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 05 -04-2014 )

 



ఈనాడు - గల్పిక- హాస్యం - వ్యంగ్యం 

ఓటరావతారం 


రచన - కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 05 -04-2014 ) 


పాలకడలిలో శేషతల్పం మీద యోగనిద్రలో ఉన్న విష్ణు మూర్తికి హఠాత్తుగా మెలకువ వచ్చింది. 


కాళ్ల దగ్గర ఉండే లక్ష్మీదేవి కనిపించలేదు. కంగారైంది. '


' వట్టి చపల చిత్తురాలు' అని విసుక్కుంటూ వెదుకులాట మొదలెట్టాడు. 


ఆదిశేషు సూచనతో భూలోకం వైపు దృష్టిసారించాడు.


అక్కడ.. భారత దేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్రమార్కుల చెరలో చిక్కి లక్ష్మీదేవి ఇబ్బందులు పడుతుండటాన్ని గమనించాడు మహావిష్ణువు.


'  ప్రభూ ! మిమ్మల్ని మించిన మహా జగన్మాయగాళ్లకు . ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారింది. మీరు స్వయంగా పూనుకొని రంగంలోకి దిగందే  అవినీతిపరుల చెర నుంచి లక్ష్మీదేవికి విముక్తి కలగదు' అన్నాడు స్వామి కష్టాన్ని తలచుకుని ఆదిశేషు!


శంఖు చక్ర గదాది ఆయుధాలతో మహావిష్ణువు బయ లుదేరాడు.


'స్వామీ! కాస్త ఆగండి . భరత ఖండంలో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. మీరు ఇన్ని ఆయుధాలు వేసుకుని అక్కడ స్వేచ్ఛగా  తిరగడం దుర్లభం . అడుగడుగునా రక్షకభటుల నిఘా ఉంటుంది. మీరీ అవతార రూపం మార్చాల్సిందే ! ' హెచ్చరించాడు ఆదిశేషు.


' ఇప్పుడు ఏ రూపమైతే మంచిది? ' అడిగాడు మహా విష్ణువు. ' అది కూడా నువ్వే చెప్పు! ' 


' ఎన్నికల్లో ధనప్రవాహం మితిమీరింది. డబ్బులు విప రీతంగా చేతులు మారుతున్నాయి. రక్షక భటులు ఎక్క డికక్కడ నిఘా పెంచారు. కాబట్టి, రక్షక భటుడి అవ తారం దాల్చండి . నిఘా బృందంతో మీరూ కలిసిపోండి. లక్ష్మీదేవి ఆచూకీ సులభంగా తెలుసుకునేందుకు  ఇదొక ఉపాయం' ముక్తాయించాడు ఆదిశేషు. 


సీతాన్వేషణ రోజులు గుర్తుకొచ్చాయి విష్ణుమూర్తికి. 


అది రామావతారం. తను మహారాజు అయినా నార వస్త్రాలు ధరించి తిరగవలసి  వచ్చింది. ఇప్పుడు కాలానుగు ణంగా రక్షకభట అవతారం ఎత్తక తప్పడం లేదు.. హతవిధీ! ' అనుకున్నాడు మహా విష్ణువు!


హైదరాబాద్ ను చుట్టి ఉన్న సైబరాబాద్ కమిషన రేట్ పరిధిలోని ఒక ముఖ్య కూడలి దగ్గర స్థిర నిఘా బృందం గాలింపులు ముమ్మరంగా సాగుతున్నాయి. 


రక్షక భటుడి రూపంలో ఆ శేషతల్పసాయి కలిసిపోయాడు. వచ్చేపోయే వాహనాల తనిఖీలో తలమునకలై పోయాడు!


కారు మేఘాలను సృష్టించుకుంటూ దూసుకొచ్చింది ఓ ఆటో. అందులో ఓా బస్పెడు  ప్రయాణికులు ఉన్నారు. 


కేసు బుక్ చేయాలన్నాడు ఆగ్రహంతో నిఘా బృంద నాయకుడు. 


యజమాని తాపీగా కిందకు దిగాడు. 'వీరంతా కాబోయే శాసన సభ్యుడి అనుచరులు సార్...ఆయన నామినే షన్ వేసే కార్యక్రమానికి వెళ్తున్నారు. ఇప్పుడిలా అడ్డుకుంటే రేపు ఇబ్బందులు పడేది తమరే! '  అనగానే గతుక్కుమన్నాడు నిఘాబృందం నాయకుడు. 


ఆ పుష్పక విమానాన్ని అలాగే వదిలేయక తప్పింది కాదు !


ఈసారి అత్యంత ఖరీదైన కారుని ఆపింది నిఘా బృందం. 


 డ్రైవరు ఒక్కడే ఉన్నాడు. డిక్కీ తెరిపించారు. 


అందులో సూటు ధరించిన పెద్దమనిషి కాలు మీద కాలు. వేసుకుని మరీ దాక్కుని నిద్రపోతున్నాడు. 


' ఎవరీయన? ' ప్రశ్నించాడు డ్రైవర్ని నిఘా బృంద నాయకుడు. 


' ఏం చెప్పను సార్... మొన్న జరిగిన మెడికల్ పీజీ ప్రవేశపరీక్షల్లో కోటిన్నర రూపాయలు కట్టి కొడుక్కి ప్రశ్నపత్రం ముందే ఇప్పించాడు. అది పెద్ద కేసు అయింది. పోలీసులు ఈయన గురించి వెదుకుతు న్నారు. ఇప్పుడు పోలీసుల కంటపడి కేసులో చిక్కు కుంటే, ఓ పెద్ద పార్టీ టికెట్ జారిపోతుందని కంగారుపడుతూ ఇలా తిరుగుతున్నాడు' అంటూ నసుగుతూ జవాబిచ్చాడు డ్రైవరు.


 'ఖర్మగాలి రేపు ఈ పెద్దమనిషికే టికెట్ దక్కి, ఎన్నికల్లో నెగ్గి. . మంత్రిపదవి వస్తే మన బతుకేమైపోతుందో! ' అనుకుంటూ డిక్కీలో నిద్రపోతున్న అతడికి భయంతోనే ఠక్కుమని ఓ శాల్యూట్ కొట్టి వాహనం  వదిలేశాడు నిఘాబృంద నాయకుడు. 


ఇలాగైతే లక్ష్మీదేవి ఆచూకీ దొరికేది ఎలా ? అను కుంటూ ఉసూరుమన్నాడు పక్కనే రక్షకభట రూపంలోని విష్ణుమూర్తి!


తరువాత ఓడ లాంటి పెద్ద కారు వచ్చింది. ' ఏ పుట్టలో ఏ పాముందో!  ముందా కారు డిక్కీ తెరిచి చూడండి! ' అని అర్డరేశాడు  నిఘా అధికారి. 


 డిక్కీలో కూర్చుని చరవాణిలో మాట్లాడుతున్న రాజకీయ నేత కన బడ్డాడు అందులో! 


అధికారంలోకి వచ్చే పార్టీలో దూరేందుకు ఇలా ఏ మీడియా కంటపడకుండా డిక్కీలో నుంచే మంత్రాంగం నడిపిస్తున్నాడట! పక్కనే డబ్బు సంచులు, పెట్టెలు! 


'నీతోపాటు ఇలా మా లక్ష్మీదేవిని తిప్పుకొంటున్నావా? | అని విష్ణుమూర్తి అడిగేలోపే... ఎప్పట్లానే పోలీసుల ఠక్కుమనే  సెల్యూట్లు, వీడ్కోళ్లు పూర్తయ్యాయి!


రకరకాల వాహనాలు, ప్రయాణికులు! 


 డిక్కీ రవాణా వ్యవస్థ ఇంత పకడ్బందీగా వర్ధిలుతుందా ఇక్కడ? ఆహా... ఏమి ఈ భారతదేశ  ప్రజాస్వామ్య వ్యవస్థ  దౌర్భాగ్యం! డబ్బు తరలించడానికి ఎన్ని దొంగ వేషాలు ! 


శవాలను తరలించే వాహనాలు, పిచ్చికుక్కల్ని పట్టుకెళ్ళే మున్సిపాలిటీ బళ్లు, చెత్తకుప్పల్ని ఎత్తుకెళ్లే తోపుడు బళ్లు .. కాదేదీ 'డబ్బు తరలింపునకు అనర్హం' అన్న తీరులో సాగుతున్నదీ అక్రమ రవాణా వ్యవహారం.


ధనలక్ష్మి దర్శనం కాక దిగాలుగా వెనుదిరిగి వచ్చినా  విష్ణుమూర్తిని ఉరడించే పనిలో పడ్డాడు ఆదిశేషుడు. 


'భూదేవమ్మ గతంలోనే ధరిత్రిపై పెరిగిపోతున్న అరాచకాలను  గురించి అనేక సార్లు మీతో మొరపెట్టుకుంది కదా స్వామీ!  అప్పుడే మీరు కాస్త ఆలోచించి ఉంటే లక్ష్మీదేవి కోసం ఇప్పుడీ వెదుకులాటలు  తప్పి ఉండేవి  కదా ! క్షీర సాగర తనయ విముక్తికి ఇప్పుడిక ఒకటే మార్గం' అన్నాడు అది శేషుడు!


'ఆలస్యం చేయకుండా అదేమీటో చెప్పరాదా! ' విష్ణు మూర్తి తొందరపెట్టాడు.


క్రితం అవతారాల్లో మీరు వధించారనుకుంటున్న రాక్షసుల్లో కొందరు భూలోకంలో రాజకీయ నాయకులుగా పుట్టివున్నారు . వాళ్లందరి దర్పాన్ని అణచివేయాలంటే ఈ కాలంలో సంధించాల్సింది ఓటు ఆయుధమొక్కటే. అందుకే, ఓటరు అవతారం ఎత్తాలి పరంధామా! ఎన్ని కల యుద్ధం భీకరంగా నడుస్తోందిప్పుడు .  బద్ధకించకుండా ఓటరు బుద్ధిలోకి జొరబడండి. అప్పుడే మా లక్ష్మీదేవమ్మ  చెర, భూదేవమ్మ  భారానికి  విముక్తి' 


' శభాష్ ఆదిశేషు! భలే ఉపాయం చెప్పావ్! ' అంటూ లేచి కూర్చున్నాడు ఓటరావతరం ఎత్తేందుకు సిద్ధపడుతూ . 


రచన - కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 05 -04-2014 ) 


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...