Sunday, December 5, 2021

ఈనాడు - గల్పిక- హాస్యం - వ్యంగ్యం దురభిమానధనులు రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - 10 -04 - 2014 - ప్రచురితం )

 



ఈనాడు - గల్పిక- హాస్యం - వ్యంగ్యం 

దురభిమానధనులు 

రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - 10 -04 - 2014 - ప్రచురితం ) 


'నిజాన్ని నిజంగానే నిజమని నిరూపించినా నమ్మబుద్ధి కాదురా కొందరికి. దాన్నే కామోసు అభిమానమని అంటుంటారు' 


' అభిమానం కాదు... అది దురభిమానం ' 


' ఏదో ఒహటిలే. అలాంటి పిచ్చి అభిమానాన్ని పుష్క లంగా సంపాదించుకున్నావనుకో- ఇహ నువ్వు నంది అంటే నంది. పంది అంటే పంది'


'బాగా చెప్పావన్నా! ఒకానొకప్పుడు వానలు పడకపోతే వరుణదేవుడి ఆగ్రహమన్నారు. అదే వాళ్ల పాలనలో వరదలొచ్చి జనం కొంపాగోడుతో కొట్టుకుపోతుంటే వరుణ మిత్రుడికి తమ మీద ప్రేమ అపారమైన ప్రేమ ఇలా పొంగి పొరలుతుందని సుద్దులు చెప్పారు. అదీ నమ్మారు, ఇదీ నమ్మారు పిచ్చి అభిమానంతో జనాలు'


'బూటకాలు, నాటకాలు వెండితెరమీది గ్రాఫిక్స్ పోరాటాల కన్నా మజాగా ఉంటాయిరా కొంతమం దికి. చెత్త సినిమాలూ ఒక్కోసారి సూపర్ హిట్టవడంలా!' 


'అలాగని అదే సూత్రంలో ప్రతిసారీ జనాల్ని బురిడీ కొట్టిద్దామనుకుంటే ఎంత అభిమానమున్నా ఛీ కొడతారన్నా! రాజకీయాలకూ అదే సూత్రం వర్తిస్తుంది. యూపీఏ తొలిసారి పాలనలో చోటుచేసుకున్న కుంభకోణాలు మలిదఫా పాలనలో బయటపడలా! గాలి నుంచి గనుల దాకా అన్నింటినీ అడ్డ దారుల్లో తెగబడి అమ్ముకున్నారు. ' కాగ్' నుంచి 'సుప్రీం'  దాకా అన్నీ... యూపీఏ నిర్వాకాలను ఛీ కొట్టాయి. ఇక జనాలు 'పో' అని వెళ్లగొట్టడం ఒక్కటే మిగిలింది. సర్వేల వరస చూస్తున్నావుగా!'


'అవన్నీ డబ్బుపోసి కొన్న ఫలితాలని దబాయి స్తున్నారు కదరా వారి అభిమానులు' చెప్పాగా.... అదంతా వట్టి దురభిమానం. టైటానియాన్ని చూస్తున్నావుగా. ఇవిగో రుజువులు అంటూ ఆమెరికా నిఘావర్గాల పత్రాలను చూపించినా- అవన్నీ ఎఫ్బీఐ చేస్తున్న తప్పుడు ఆరోపణలంటూ బుకాయించడం... దురభిమానం కాక మరేమిటి? '


'నిజమేరా! ఢిల్లీలో పెద్దాయన సొంత కార్యాలయం నుంచే ముఖ్యమైన దస్త్రాలు మాయమవుతుంటాయి. నోరు విప్పి నిజాలు కక్కాలనుకునే శాల్తీలు గల్లంతవుతుం టాయి. తెగించి చట్ట ప్రకారం పనిచేసుకోవాలనుకునే ఉద్యోగులను అర్ధాంతరంగా బదిలీలవుతుంటాయి . అయినా సరే, అవినీతి కుళ్ళును అడుగంటా వెళ్లగించే సంఘసం

స్కర్తలం తామేనని భుజాలు ఎగరేస్తే, నిజం నిజమంటూ భజనలు మొదలు పెడుతున్నారు వారి అభిమానులు'


'పైసా బొక్కిన కక్కుర్తికి... రూపాయి భజన చేయక తప్పదన్నా! దేవుడి హారతి పళ్లెంలో రూపాయి బిళ్ల వదలడానికి పది రకాలుగా ఆరాతీసే బేరగాళ్లు, కోట్లు కోట్లు పోసి అలా టికెట్లు కొనడానికి ఆరా టపడుతున్నారు. ఏ చెక్క భజన చేయకపోతే రేప్పొద్దున ఏ బొక్కలోనో పడిపోరూ! అందుకే భజన బృందాలను ఇంతలా పెంచి పోషించేది'


'ఉన్నోడికీ, తిన్నోడికీ ఈ సంకీర్తనల నరకం తప్పదనుకో! మరి నిర్భాగ్యుడికి ఎందుకట ఈ బకాసురులు చుట్టూ భజనల తంటా?' 


‘చెప్పాగదన్నా. దురభిమానం సిద్ధాంతమే అంత. అభి నాయకుడు నటిస్తే చాలు, ఎంత చెత్త చిత్రాన్నయినా పదోసారి చూస్తూ  చప్పట్లు కొట్టేసే  పిచ్చి ప్రేమ మన జనాలది. అయిదేళ్లపాటు ఎక్క డున్నాడో కూడా తెలీని ఆ రాణిగారి అబ్బాయి ఎన్నికల ముందు ఒక్కపూట హఠాత్తుగా మన గుడిసెల్లో దూరి మనం తాగే అంబలిలో వేలు ముంచి నాలుక్కి అంటించుకుంటే చాలు... నడిచొచ్చే దేవుడు అయిపోతాడా?'


 'నిజమేరా, ఇక్కడే చూస్తున్నాం!'


' ఎన్ని వేలకోట్లు అక్రమంగా కొట్టేస్తేనేం మన సొమ్ము కాదుగా కొల్లుబోయింది .అన్నేసి భవనాలు నిర్మించుకున్నా మన మధ్య ఎంత ఓపిగ్గా తిరుగుతున్నాడో, కన్నూ బిడ్డకైనా ఇంత ప్రేమ ఉంటుందా అని పొంగిపోతున్నారు జనతా . యువనేత జైలు కష్టాలకు కుంగిపో తున్నారు. ప్రజలకోసం ఆఖరి రక్తపుబొట్టు వరకు తర్పణం చెయ్యడానికి తయారైన నాయకుడికి అడుగడు గునా మరి ఆ అంగరక్షకుల హడావుడి ఎందుకో?


'నిజమేరా! ధర్మపన్నాలు చెప్పే ఈ పుణ్యాత్ముల్లో ఒక్కరూ మనకు ధర్మాసుపత్రుల్లో కనిపించరు. ధర్మ దర్శ నాన్ని ఆపించి మరీ దేవుడి ప్రత్యేక దర్శనానికి ఒత్తిడి చేసే వీఐపీలే మళ్ళా వీళ్లందరూ '


'అదేనన్నా మరి నేననేది. వెర్రి అభిమానంతో మన కుర్రాళ్లు మాత్రం చదువు సంధ్యలు పక్కకు పెట్టి ఈ దొరల పల్లకీలు మోసే బోయీలు గా  మారుతుంటిరి . పనిపాటలు వదిలిపెట్టి, పెళ్లాంబిడ్డలను  పస్తులు పెట్టి, సొంత సొమ్ము ఖర్చు పెట్టి ఎండనక, వాననక, చలిని ఏ మాత్రం లెక్క చేయక పిచ్చిప్రేమతో పగలూ రాత్రీ నేతాసేవలో తరిస్తున్నారు కదా కొందరు! చట్టసభల ఎన్నికల బరిలోకి దిగేందుకు పార్టీ టికెట్ పంచే సంబరాలు సాగుతున్నాయి. ఒక్క వీరాభిమాని ముఖారవింద మైనా ఏ ఒక్క పార్టీ జాబితాలోనైనా కనపడు

తుందా? '


' గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుతున్నట్లు దిరా నీ తంతు'


'అసలు గొంగట్లో భోజనం వడ్డించడమెందు కంటే, ఆలోచించొద్దూ అంత లావు అభిమానం చూపించే మన సామాన్యులూ!' 


మరేం చెయ్యమనిరా నీ సలహా? '


'ఉక్రెయిన్లో చూడు. అన్యాయానికి ఎదురుగా ఎంత పెద్ద అంతర్యుద్ధం జరుగుతోందో! ప్రజాస్వామ్యంలో ఎన్ని కలూ అయిదేళ్లకోసారి వచ్చే అంతర్యుద్ధ తంత్రమేనన్నా! అమాయక జనం అభిమాన ధనాన్ని కల్లబొల్లి కబుర్లతో మాయదారి నేతలే మన నిజమైన శత్రువులు. ఓటు ఆయుధంతో ఒక్క వేటు వేశామా... మళ్ళీ అయి దేళ్ల దాకా మనమే రాజులం. మన మేలు కోరే సేవకులకే మంచి పాలన చేయమని రాజముద్ర అందిద్దాం!' 


' మంచిదేరా! అందుకు అభ్యంతరమేముందీ!'


-రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - 10 -04 - 2014 - ప్రచురితం

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...