Monday, December 6, 2021

ఈనాడు - సంపాదకీయం సుపరిపాలన - రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - 23 -03 -2014 - ప్రచురితం )

ఈనాడు - సంపాదకీయం 

సుపరిపాలన

- రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - 23 -03 -2014 - ప్రచురితం ) 


'దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్' అన్నారు మహాకవి గురజాడ. మట్టో మనిషో... పేరులో ఏముంది- పాలన కదా ప్రధానం! తల్లి లాలనను పోలి ఉండాలి ఆ విధానం. 'కృతమెరిగిన పతియె జగజ్జనుల నెల్ల బరిపాలించున్' అని నన్నయ భారత కథనం! 'వైయక్తిక భోగదృష్టి కాదు... ప్రజోపయోగ దృష్టి సుపరిపాలకులకు ఎంతో  అవసరం' అని చాణక్యుడి సూక్తి. కాదంబరిలో బాణకవి శుకవాసుడి ద్వారా చెప్పించిందీ ఈ రాజనీతే. 'రాచపుటక, నూతన యౌవనం, దేహ సౌందర్యం, మితి ఎరుగని అధికారం... విడివిడిగానే వినాశ హేతువులు... అన్నీ ఒకే చోట జతకూడితే మరింత కీడు!- పట్టాభిషేక వేళ కొడుకు చంద్రాపీడుడికి ఆ తండ్రి చేసే హెచ్చరికలు గద్దెనెక్కే వారందరూ కంఠోపాఠం చేయదగ్గ సుపరిపాలనా మార్గ సూచికలు. అందరూ స్వర్ణయుగంనాటి గుప్తులు కాలేకపోవచ్చు. అందివచ్చిన అధికార దండాన్ని ప్రభువు ప్రజాభిమతానికి మాత్రమే మీదు కట్టాలన్న కామన అత్యాశ అయితే కాదుగా! భృత్యులొప్పని పనిచేసిన విభులు ఏ విధంగా అపఖ్యాతి పాలవుతారో పోతన భాగవతం కథగా చెబుతుంది. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంలో సుపరిపాలన ఎలా ఉంటుందో నిరూపించే ఘట్టం ఒకటుంది. అప్పటికి అమలులో ఉన్న చట్టం ప్రకారం, సంతానం లేకుండా చనిపోయిన పౌరుడి యావదాస్తులు రాజు పరం అవుతాయి. అయినా దురాశపడడు దుష్యంత మహారాజు. సముద్ర ప్రయాణంలో ప్రాణాలు పోగొట్టుకున్న ఓ వ్యాపారి సమస్త ఆస్తులు అతగాడి గర్భస్థ శిశువుకు ధారపోస్తాడు. శకుంతలా వియోగంలోనూ ప్రజాక్షేమం తప్ప ఊహించలేని మతి ఆ చక్ర వర్తిది. ఆప్తులను పోగొట్టుకున్న పౌరులందరినీ ఆపద్బాంధవుడిలా ఆదుకునేందుకే తనకు రాజ్యం ఉందని భావించిన దుష్యంతుడిని మించిన సుపరిపాలకుడు ఉంటాడా? పరనారికి సోదరుడిగా ఉండేవాడు, ఇతరుల ధనానికి ఆశప డనివాడు,  పరముడని సుమతీ శతకకారుడి నిర్వచనం. ఆ పరముడు పాలకుడైతే పాలితులు ఎంతలా సుఖపడతారో తెలిపేందుకే వాల్మీకి మహర్షి రామాయణమనే  మిషతో పదహారు కళల పురుషోత్తముడిని  పనిగట్టుకుని చిత్రించింది . శతసహస్ర నామాల్లో 'భద్రుడు' రామచంద్రుడికి అత్యంత అర్థవంతమైన బిరుదు. దాసు లకు దాసానుదాసుడు ఆ ప్రభువని రామదాసు చరితన ద్వారా  విదిత మవుతుంది. సేతుబంధన యాగానికి చేతనైన సమిధలు అందిం చిన ఉడుతను అల్పజీవమని కూడా చూడకుండా చేరదీసిన మేరు నగధీరుడు ఆ రామచంద్రప్రభువు. వాత్సల్య తంత్రం అంత గాఢంగా ఒంటపట్టించుకున్న నేత కాబట్టే నేటికీ రాజుగా గాక ఓ తండ్రిగా ప్రజాకోటి గుండెల్లో కోట కట్టించుకొని కొలువై ఉన్నాడు. రాజధర్మం కంటే పాపకర్మం లేదు పొమ్మన్న పాండవాగ్రజుడి నిర్వేదమే నిజమైనదైతే ఆ దుష్కర్మలమీద ఆధిపత్యానికేనా ఇన్నిన్ని ప్రపంచ కురుక్షేత్రాలు జరుగుతున్నది? క్రూరుడు, లోభి, ఉగ్రుడు, ఖలుడు, జడుడు, కృతఘ్నుడు, సత్యహీనుడు, కారుణ్య వర్ణి తుడు, కలుషాత్ముడు... వీరితో కొలువుతీరిన భూవిభుడి పాల నలో ప్రజల శాంతిభద్రతలు చెడుతాయంటుంది సోమన 

ద్విపద భారతం శాంతిపర్వం. అమాయక ప్రజావళికి కవచాలుగా ప్రజావాదుల ఆయుధాలు సదా సిద్ధంగానే ఉంటాయి కానీ, ఆ ఘర్షణలకు అసలు అవకాశమే లేని మేలిమి పాలనకే ముందుగా శాంతికాముకులు మొగ్గు చూపించేది. జనాభిప్రాయమనే తృణబాహుళ్యంతో మృగరాజంవంటి శాసనాన్ని అయినా సునాయాసంగా నిలువరించవచ్చన్నది హర్షవర్ధనుడి ప్రజాపాలనను హర్షిస్తూ బౌద్ధయాత్రికుడు హ్యూయన్ త్సాంగ్ చేసిన పరిశీలన గమనించదగ్గది . సర్వాధికారాలు అయా చితంగా దఖలుపడ్డా రాజ్యపాలన అంటే ప్రజాదైవాన్ని అర్చించు కునే పూజాద్రవ్యంగా భావించిన హర్షవర్ధనుడివంటి మహారాజులు ఎందరో ఈ భారత వర్షంలో. ఇందులో హిందువులు ..  ముసల్మానులు అనే తేడా లేదు.


కామాతురుడు రావణాసురుడు ఉన్నచోటే ధర్మాభిమాని విభీ షణుడు పుట్టుకొస్తాడు. గుడ్డిప్రేమతో చెడ్డబిడ్డలను అడ్డగించని ధృతరాష్ట్రులకు సుద్దులు చెప్పే విదురులు ఎప్పుడూ సోదరులుగా సమీపంలోనే కొలువై ఉంటారు. నిష్కారణంగా ధర్మద్వేషం పెంచుకుంటే హిరణ్యకశిపులకు కన్న పేగే ప్రహ్లాదుడై ఎదురుతన్నే శక్తిగా మారవచ్చు. వేల సంవత్సరాల కిందటే ఈ వేద భూమి పై  క్రూర వేమరాజుకు రుషిగణాల ఆధ్వర్యంలో పేదప్రజ ఎదురు తిరిగింది. వామదేవుడి దుష్టపాలనకు భీష్మసేనుడు విరుద్ధంగా నిలబడ్డ ధర్మక్షేత్రమిది. క్రాంవెల్ ప్రజ్వలన, అమెరికన్ల తిరుగు బాటు, ఫ్రెంచివారి విప్లవం, రష్యన్ల చైతన్యం, చైనీయుల లాంగ్ మార్చ్.. దేశం ఏదైతేనేం- రాజ్యం కంటకమైతే జనం చోద్యం చూస్తూ కూర్చోరన్నదే సత్యం. ఎందాకనో ఎందుకు... వందేళ్ల కిందటి మన 'వందేమాతరం' చాలదూ కుపరిపాలనకు ఆట్టే కాలం చెల్లుబాటు కాదని సందేశం అందించడానికి! చోరులవల్ల చెడకుండా క్రూరుల చేత చావకుండా పాలితులను  నేర్పుగా రక్షిం చాలన్నది- బ్రహ్మ రాజశాస్త్రం నుంచి బార్హస్పత్య రాజశాస్త్రం దాకా అనుశాసిస్తున్న నీతి. రామాయణమైనా, అంబేద్కర్ రాజ్యాంగ మైనా నిర్దేశించే ప్రాథమిక  సుపరిపాలనా సూక్తి ఇదే. 'ఎఱుక లేని దొరల నెన్నాళ్ళు కొలిచిన/ బ్రతుకు లేదు వట్టి భ్రాంతి గాని' అన్న తెలివిడి ' ఆమ్ ఆద్మీ ' కి  ఏర్పడితే చాలు- ఆ తెల్లారే మొండి వృక్షంమీద పక్షులు వాలడం మానేసినట్లు... గొడ్డుమోతు ప్రభుత్వానికి చెల్లుచీటీ రాసేస్తాడు. చరిత్ర పదేపదే చెప్పే పాఠాలు 'విననే వినం... విన్నా పెడచెవిన పెడతాం' అంటే- శాశ్వతంగా నష్టపోయేది దుష్టపరిపాలకులే!


- రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - 23 -03 -2014 - ప్రచురితం 


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...