ఈనాడు - గల్పిక:
చోరకళావారసులు
- కర్లపాలెం హనుమంతరావు
రారా కృష్ణయ్యా ! వచ్చి మా మోర ఆలకించవయ్యా! దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించావనే కదా అందరూ నిన్ను పూజించేది! బుడి బుడి అడుగుల చిన్ని కృష్ణయ్యను ఆనందంగా స్వాగతించేది! ఇప్పుడా ఆనందం నీ భక్త జన సందోహంలో కనిపించడం లేదు. గమనించావా దీనజన బాంధవా?
మన్ను తిన్న నోటితో తినలేదని నువ్వే పరమార్థంతో మీ అమ్మతో అబద్ధమాడావో! భువన భాండాలని మింగే బకాసురులకు ఇప్పుడు ఆ బుకాయింపు పర్వమే పెద్ద పరమాత్మ తత్వంగా స్థిరబడిపోయింది! కిరాయి మనుషులను పెట్టి మరీ గోవర్థన గిరులను ఎత్తిస్తున్నవారే విచారణల కమిటీల నుంచి తమను తాము కాపాడుకునేందుకు తులాభారంలో తులసీదళానికి తూగిన నీ కన్నా ఎక్కువ అమాయకత్వం నటించేస్తున్నారు. అస్మదీయులకు పద్మనయనాలల్లో నయన మనోహరంగా దర్శనమిచ్చే రాజకీయం సామాన్యుడిన్ని మాత్రం సహస్రాధిక క్రూర దంష్ట్రాలతో బెదరగొట్టేస్తుందయ్యా మహానుభావా!
కన్నయ్యా! నీవు లేకుండా మహాభారతమన్నా నడుస్తుందేమో కాని.. నీ వారసులమని చెప్పుకు తిరిగే నాయకుల జోక్యం లేకుండా చివరికి తిరుమల వెంకన్న దర్శన భాగ్యమైనా దొరికే పరిస్థితి లేదు!
దేవుడంటే వాళ్లందరికీ పన్ను కట్టక్కర్లేని హుండీ! దేవాలయాల అదాయాలంటే చాలా మందికి కడుపు నిండా తిన్నా తరగని ప్రసాదాలు. నీ 'పవిత్రాణాయ సాధూనాం' ఇప్పుడు ఎన్నికల ముందు నీ వారసులమని చెప్పుకునే వారినీ ధర్మ సంస్థాపనార్థాయ థీరిని ధనసంపాదనార్థాయగా మార్చేసిందయ్యా ముకుందా! నీ కాలం నాటి రాజకీయం రంగూ రుచీ వాసనా మార్చేసుకుని ఒక యుగాంతరం దాటిపోయిందయ్యా గోవిందా! గోపి అంటే నీ కన్నా ముందు 'గోడ మీద పిల్లే' గుర్తుకొస్తోందిప్పుడు! కృపారసం జల్లెడివాడు పైనుంటే ముష్టి యములాడికేమిటి.. ఐటి, ఇడిలాంటి ఇడియెట్ శాఖల వారెవరికి జడవనవసరమే లేదు. చట్ట సభల్లో బిల్లులు చెల్లిపోవడానికి, చట్టం ముందున్న కేసులు చెల్లిపోవడానికి కొత్త బాదరాయణ సంబంధాలు పుట్టుకొస్తున్నాయిపుడు బదరీనాథా! 'భజగోవిందం .. భజగోవిందం' అంటూ ముఢమతులు కూడా పాడటంలేదిపుడు! భజనలూ, కీర్తనలూ, దందకాలూ, అష్టోత్తర నామావళులూ ఎక్సెట్రా ఎక్స్ట్రాలన్నీ బుల్లి దేవుళ్లకూ, దేవతలకే మళ్లిపోయాయయ్యా వనమాలీ! గురువాయూరు కన్న పరమ పవిత్ర దేవాలయాలిప్పుడు హస్తినలో అమరావతిలో, భాగ్యనగరుల్లో వెలసి వర్థిల్లుతున్నాయి గోవర్థన గిరిధారీ! చెప్పులు బైట వదిలి పెట్టి ములవిరాట్టుకో నమస్కారం కొట్టి, వీపు కూడా చూపించకుండా వెనక్కి వచ్చే భక్తశిఖామణులకే ముందుకెళ్లే అవకాశాలు మెండు! ఆత్మకథల నిజాలను కూడా తొక్కిపెట్టేయటమే నేటి నిజమైన పారదర్శక విధానం. నార్కో అణాలసిస్ పరీక్షల్లో కూడా నాలిక మడత పడకపోవడమే నేటి నేత మొదటి ఘనత.
మూడు లోకాల నేలేటి మోహనాకారుడివైనా ధర్మసంస్థాపన కోసం గుర్రాలు తోలే పనికి నువ్వు గనక వెర్రిగా ఒప్పుకున్నావు! విదురుడంతటి ఘనుడు అరటిపండు ఒలిచి తొక్క ఇచ్చినా బెదురు లేకుండా ఆరగించిన అమాయకుడివి. రాజసూయ యాగంలో ఎంగిలాకులు ఎత్తిన వినయ విధేయ సంపన్నుడివి. మోర పెట్టుకున్నది ఆఫ్ట్రాల్ బోడి కరిరాజమే! అయినా సిరికి కూడా చెప్పనంత హడావుడిగా పరుగెత్తుకొనొచ్చి ఆర్తత్రాణ పరాయణత్వం మీదుండే నీ ఆత్రం నిరూపించుకుంటివి. నేటి నేతలు వాటిలో ఏ ఒక్కటి పాటించినా జనమే తాటాకులు కట్టే పరిస్థితి. గోవర్థన గిరిని ఎత్తడం ఇప్పుడు గొప్ప కాదు మాధవా! పెరుగుతున్న ధరవరలను మా కోసం కిందికి దింపి నీ మహిమలు మళ్లీ నిరూపించుకోగలవా? మానినీ మానసంరక్షకుడనంటు భుజకీర్తులు బజాయించుకునుడు కాదు! సందునో దుశ్సాసనుడు శాసిస్తున్నాడిప్పుడు! ఆడపడుచులను ఆ కిచకాధముల నుంచి కాపాడి చూపించు.. కామినీ కుల వంద్యుడవేనని వప్పుకుంటామప్పుడు! ఒక్క పసిబిడ్డ పాలలో ఏం ఖర్మ.. మనిషి తినే ప్రతి పదార్థంలోనూ విషం కలిపే పూతనలే ఎక్కువవుతున్నారిప్పుడు. వారి పనిపట్టగల చేవ చూపెట్టగలవా మాధవా? నీటినీ, నేలనూ, గాలినీ సర్వం కాలుష్యమయం చేసే కాళీయుల మాడు పైన మళ్లీ మా కోసం తాండవమాడగలవా కృష్టా! నువ్వా ద్వాపరంలో చంపింది ఒక్క కంసుడిని మాత్రమే! ఇప్పుడు ఆ దుష్టుడి వారసులు అడుగడునా సామాన్యులను నానాహింసల పాల్చేస్తున్నారు ఆపద్భాంధవా! వంద తప్పులు వరకు సహించే ఓపిక పరమాత్ముడివి కనక నీకుండ వచ్చునేమో గానీ వాసుదేవా! మానవ మాత్రులం మేమీ గర్విష్టుల బాధలకిక ఏ మాత్రం ఓర్వలేని దుఃఖంలో పడివున్నాం. ఆత్మకు చావు లేదు. నిజమే కానీ, అది ధరించిన దేహానికి ఆకలి దప్పికలు తప్పవు కదా స్వామీ? ఎంత కట్టి విడిచు దేహమయినా.. కట్టి విడిచే గోచీపాత అవసరమే కదా స్వామీ? చిన్న చినుకు చాలు.. ఊళ్ల కూళ్ళు వరదలిక్కడ. నీ దంటే.. హాయిగా వటపత్ర శాయి బతుకు. గోవులను కాపాడు గొప్ప దేవుడివి ! ఈ బక్క జీవుల దిక్కుకు మాత్రం ఎందుక రావు? జనం కష్టసుఖాలను ముందు ఆలకించు స్వామీ! వద్దన్నా అవుతుంది అప్పుడు పెద్ద పండుగ నీవు పుట్టిన తిథి అష్టమి!
• కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - సంపాదక పుట ప్రచురితం )
No comments:
Post a Comment