Sunday, December 5, 2021

ఈనాడు- గల్పిక- హాస్యం వ్యంగ్యం దేవుడి సందేశం రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు ప్రచురితం - 12 - 04 - 2014





ఈనాడు-  గల్పిక- హాస్యం వ్యంగ్యం 

దేవుడి సందేశం 

రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు  ప్రచురితం - 12 - 04 - 2014  


మాయానగర్ ఇలాకా ఎన్నికల బరిలో అధికారపార్టీ అభ్యర్థి 'డొంగ్రే ' గారి గురించి ప్రజానాడి ఎలా ఉందో పసిగట్టే కార్యక్రమం చేస్తున్నాం . 


డోంగ్రేగారి  చిరునామా కనుక్కోవడమే కష్టమైపోయింది. 


నలుగురు పెద్ద మనుషులు పిచ్చాపాటి చర్చించుకునే రచ్చబండ దగ్గరకెళ్లి విచా రించాం. 


డోంగ్రే ఇల్లెక్కడా? 


ఇల్లు..  దాబా .. ఎక్కి కూర్చుంటే ఆయనకేం గిట్టుబాటవుతుందయ్యా?  ఎలాగైనా మళ్ళీ మా నియోజకవర్గం నుంచి గెలవాలన్నదే కదా ఆయన యావ - అనేశాడు ఒక గడుసుపిండం . 


జోకు పాతదే కావచ్చు. డోంగ్రే వ్యక్తిత్వం కనిపించడంతో అది కొత్తాగానే ఉంది. 


ఇలా క్కాదని  ఈసారి పక్కవీధిలో కుళాయిల ముందు నీళ్లు పట్టుకునే ఆఉంగుల దగ్గరికి వెళ్లి వాకబు చేశాం - 'డోంగ్రేగారు  ఎవరో తెలుసా మీకు? అని . 


డొంగ్రేనా? అట్లాంటి పేరు ఎక్కడా ఎప్పుడూ చెవిన బళ్లేదే' అని నోరు వెళ్లబెట్టేశారందరు తల్లులూ . 


అదేంటమ్మా? అయిదేళ్ల నుంచి ఆయనగారే గదా మీ ప్రజాప్రతినిధీ! పోయినసారి మీరే ఆయన్ను భారీ మెజారిటీ ఇచ్చి గెలిపిస్తిరీ! ' అనడిగాం. 


ఆహా! ఆయనా! అట్లా చెప్పండి. అప్పట్లో ఆయన మా ఇలాకాకి బాగా కొత్త . తెలిసిన ముదనష్టాలకన్నా తెలీని కొత్త ముఖమైతేనే మెరుగని భ్రమపడ్డామయ్యా.  అదీగాక అప్పట్లో ఇట్లా ' ఎవరూ వద్దని చెప్పే మాట లేకపోయే ఓటింగు యంత్రంలో అని ఒకావిడ అంటే, అప్పట్లో కనిపించడమే.. మళ్ళా మొహం చూపించలా ! ఈ అయిదేళ్ళలో బాగా పెద్దమనిషయ్యాడంట గదా .. పత్రికల్లో, టీవీల్లో తప్ప ఎదురుగా నిలబడి మా గోడు వినే సావకాశమే ఆయ నకు లేకపాయే! 


 ఇంకా ఏమైనా చెప్పేదేమో కాని, సమయం చాలదని ఎదురు వీధిలో సందడిగా ఉన్న ఓ దురాణంలోకి  వెళ్లాం.


డోంగ్రేగార  పేరు వినగానే ఆ దుకాణం ఆసామి రెండు చేతులూ జోడించి గోడ మీద పూలదండలో మునిగున్న డొంగ్రేగారిని  చూపించాడు. ' ఆయనే  డొంగ్రే సామి. . దేవుడు' అన్నాడు భక్తితో. 


దేవుడా?! 


కాకమరేమిటండీ! ఈ దుకాణం ఇక్కడ పెట్టనే వద్దని చుట్టుపక్కలవాళ్ళు ఎంత గోల చేశారని! ఇటు  పక్కన బడి .. ఎదురుగా గుడి.. ఉందని ఎవరెన్ని అడ్డుపుల్లలేసినా  ఎంతో దయతో దుకాణం ఇక్కడే పెట్టించాడు రేవుడు ' అన్నాడు. 


అప్పుడు గమనించాం. అక్కడి గుడి, బడిలోకన్నా ఈ సారాయి దుకాణం దగ్గరే సందడి ఎక్కువగా ఉందని. 


సందడి ఎందుకు ఉండదండీ! డోంగ్రేగారి  బావమరిది నడిపించేదాయె!  మహా నుభావుడు ! సరకులో కల్తీ కాస్త ఎక్కువ ఉన్నా సర్కారు ఎమ్మార్పీ రేటుకన్నా తక్కువలో సరఫరా చేస్తున్నాడు. అదీ  ఎప్పుడు పడితే అప్పుడు ! అందుకే డోంగ్రేగారూ  జిందాబాద్..  డోంగ్రేగాడు జిన్ .. దా...  అంటూ తూలి పక్కనే ఉన్న మురిక్కాలవలో పడిపోయాడో తాగుబోతు అభిమాని.


ఎలాగూ వచ్చాంగదా అని పక్కనున్న బళ్లోకెళ్లాం


 డోంగ్రేగారి  గురించి స్పందన తెలియజేయండి! అనడిగామోలేదో కన్నెర్రజేసి కాళికమ్మలా ఊగడం మొదలు పెట్టింది ఆ బడి ప్రధానోపాధ్యాయురాలు.


మేం చేసిన నేరమేమిటో పాలుపోక బిక్కమొగమేసి నిలబడుంటే.. ఎక్కణ్నుంచో మెడలో వేళ్లాడే  పలకతో ఓ ఉపాధ్యాయుడు వచ్చి మా రెక్కలు పుచ్చుకొని బయటకు ఈడ్చుకొచ్చాడు. 


మేడమ్ షాకు నుంచి తేరుకునే లోపలే మీరిక్కణ్నుంచి పారిపోవాలి. మా బడి ఆవరణలో తెలుగు పలుకు వినబడితే బడితె పూజే ! అదనంగా పదానికి వంద చొప్పున జరిమానా' అని వివరించాడా మెడ పలక పంతులు. 


అప్పుడు చూశాం ఆయన మెడ లోని పలకను. ' ఐ నెవ్వర్ స్పీక్ ఇన్ తెలుగు' అని పెద్దక్షరాలతో రాసి ఉంది


'నిన్న తరగతి గదిలో కుర్చీ కాలు విరిగి కిందపడ్డప్పుడు రూలు గుర్తురాక పాడు తెలుగులో ' అమ్మా... అబ్బా చచ్చాన్రా ..  దేవుడా ' అంటూ నాలుగుసార్లు శుద్ధ తెలుగులో 

మూలిగా . జీతాలు వచ్చేదాకా నాలుగొందలు జరిమానా చెల్లించలేక జరిమానా కిందా ఈ పలక మెడలో వేసుకు తిరుగుతున్నా! 


ఇవాళ పదో తారీకు గదా! ఇంకా జీతాలు రాలేదా? 


మూణ్ణెల్ల  నుంచి జీతాలు లేవు. మా బడి యాజమాన్యం  డోంగ్రేగారిదే.  ఎన్నికల ఖర్చుకని అన్నీ ఊడ్చేశారు. మళ్ళీ బళ్లు తెరిచి పిల్ల కాయల నుంచీ  పిండితేనే మాకేమన్నా జీతం కానుడు రాలేది 


డోంగ్రే గురించి ఇట్లాంటిదే చాలా సమాచారం  పోగుపడింది.


గుడిముందు రాజకీయాలు ఎందుకులెమ్మని నిమ్మకు నీరెత్తినట్లు నడిచిన స్తుంటే, వెనకనుంచి ఎవరో చొక్కా కాలరు గుంజి ఆపినట్లనిపించింది.


నాకు ఓటుహక్కు లేదని తిరస్కారమా! అంటూ ఓ హుంకారం వినిపించింది. విస్తుబోయి వెనక్కి తిరిగి చూస్తే ఆ శబ్దాలొస్తున్నది దేవుడి గుడి వైపు  నుంచి. 


 అసాధ్యం- దేవుడు మాట్లాడటమేంటి?


మనుషులు మూగమొద్దులైపోయినప్పుడు  నేనైనా  మాట్లాడక తప్పదు గదా భక్తా!  డోంగ్రేగాడి  నిజస్వరూపం మీకు కావాలా. . వద్దా? 


చెప్పండి స్వామి అన్నాం  వణుకుతూ. 


ఎక్కడో పైన సుఖంగా యోగనిద్రలో ఉన్న నన్ను తీసుకొచ్చి  ఈ మరుభూమి మధ్య బంధించాడు. గుడి మిషతో శ్మశాన  భూములూ ఆక్రమించుకోవా లనే దుర్బుద్ధి వాడిది,  ఎదురుగా సారాయి దుకాణం..  పక్కనే పసిపిల్లల చదువుల కొష్టం. వీటిమీది ఆదాయంతో తృప్తిపడక, సంసారులు ఉండే నివాసాల వెనకనే వసతిగృహం వంకతో విలాసాల వల. 

గడచినా ఎన్నికల సమయంలో ఓటర్లకు ఇచ్చిన మంచినీటి పంపులు, నిరంతరాయవిద్యుత్తు, ఇంటింటికీ ఒక విదేశీ ఉద్యోగం, ముసలీముతకలకు ఆర్థికసాయం , అడపడుచులకు భద్రత, ధర వరలమీద అదుపు, బీదాబిక్కీకి  ఉపాధి,  రైతన్నల సాగుకు మద్దతు.. అంటూ ఇచ్చినా హామీలలో  ఏ ఒక్కటీ  గుర్తున్నది లేదు. గుడి లోపలా బయటా జరిగే ఘోరాలను చూసి నాకే కన్నీళ్లు ఆగడం లేదు. భక్తుల ఆక్రందనలు వినలేకుండా ఉన్నా . అందుకనే మళ్ళీ ఎన్నికలు అనే అవకాశం ఇస్తున్నా.  పోయినసారేదో  పొరపాటైపోయింది . ఈసారైనా పునరావృతం కాకూడదు. బాగా ఆలోచించి, ఉన్నవాళ్లలో మంచివాణ్ని ఎన్నుకోమని నా సందేశంగా మీరు ఈ బోళాపౌరులకు వినిపించాలి.


మా మధ్యవర్తిత్వం ఎందుకు స్వామీ ? మీరే భక్తులకు నేరుగా సందేశం ఇవ్వవచ్చు గదా? 


డోంగ్రేగాడి  సంగతి మీకు తెలీదు.  నేను నోరు విప్పానంటే దాన్ని తన గొప్ప తనం ఖాతాలో వేసేసుకుంటాడు. దేవుడి మనిషిగా మరిన్ని ఓట్లు రాబడతాడయ్యా బాబూ అదీ నా బెదురు' అన్నాడు దేవుడు.


రచన - కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 12-04-2014 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...