Sunday, December 5, 2021

ఈనాడు - వ్యంగ్యం - హాస్యం - గల్విక - చిన్ని చిన్ని ఆశ... రచన- కర్లపాలెం హనువుంతరావు అంతర్జాతీయ బాలల దినోత్సవం ) ( ఈ నాడు 01 - 06-2009 - ప్రచురితం )



ఈనాడు - వ్యంగ్యం - హాస్యం - గల్విక
- చిన్ని చిన్ని ఆశ... 

రచన:- కర్లపాలెం హనువుంతరావు 
 అంతర్జాతీయ బాలల దినోత్సవం ) 
( ఈ నాడు 01 - 06-2009 - ప్రచురితం ) 

విద్యుత్తు బల్బు కనుక్కున్న థామస్ అల్వా ఎడిసన్ చిన్నప్పుడు పొదగటానికి కోడిగుడ్డు మీద కూర్చున్నాడట. పెద్దయిన తరువాత ఎవరెంత పెద్దాళ్ళయినా చిన్నతనంలో అంతా చిన్నాళ్ళే! 

శ్రీరాముడు బాలుడుగా ఉన్నప్పుడు చందమామకోసం మారాం చేశాడని మా బామ్మ కథ చెప్పింది. 

కలాంగారెంత గొప్పవారైనా కళ్ళు తెరచుకుని తుమ్మలేరుగదా! చందమామనందుకున్న నీల్ ఆమ్ స్ట్రాంగ్  సొంత చేత్తో తన వీపును తట్టుకోమనుండి చూద్దాం! 

పిల్లకాకికేం తెలుసు ఉండేలు దెబ్బని ఊరికే సామెత చెబుతారుగానండి..  మా పిల్లకాయలే ఊరుకోకపోయుంటే మీకింకా ఆస్కారు అవార్డులు ఆకాశంలో దీపాల్లానే  ఊరిస్తుండేవి కావా?  కాదా? పెద్ద పెద్ద పెద్ద అంటారుగానీ పెద్దమహా .. ఆదివారం నుంచీ శనివారం దాకా ఏ పేరు రాకుండా ఏడు రోజుల పేర్లు చెప్పండి చూద్దాం! ఏడుపు మొగ మేసేశారు సార్? ఆ మాత్రం తెలీదా ఆ అటు మొన్న, మొన్న, నిన్న, ఇవాళ, రేపు, ఎల్లుండి, ఆవలేదాండీ . 

అలా తెల్లమొగమేస్తారం సార్.. కాస్త నవ్వుకోండీ! మేం పిల్లలం  రోజుకు మూడొందలసార్లన్నా హాయిగా నవ్వుకుం టుంటాం. అందులో పదోవంతులో సగమన్నా మీ పెద్దాళ్ళు నవ్వుకోకపోతే- ఇదిగో ఇలాగే బీపీలూ, గుండె జబ్బులూ వచ్చి వాటికి ' రాజకీయాలని' పేరు పెట్టి బతుకు రొచ్చు చేసుకుంటున్నారు మీ పెద్దాళ్ళు. వేలడంత లేవు. నువ్వా మాకు చెప్పొచ్చేదని అలా చిరాకుపడిపోకండి మరి. అమెరికాలో వందకు యాభై అయిదు మంది పెద్దాళ్ళు సూర్యుడు ఒక పెద్ద నక్ష త్రమయ్యా బాబూ' అన్నా 'ఛ... మేం నమ్మం పొమ్మ' ని  ఇంకా ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా బుకాయించే స్తున్నారంట! అదీ మీ పెద్దరికం బడాయి   !

ఏనుగుకన్నా ఎలక గొప్పది సార్! ఏనుగు దూకలేదు. దాక్కోలేదు. ఇప్పుడైనా ఒప్పుకుంటారా..! ఐన్‌ స్టీన్ కన్నా ఐన్స్టీన్ తండ్రి తెలివిగలవాడనింకా దబాయిస్తూనే ఉంటారా ? సర్, మీ పెద్దాళ్ళే తెలివిగలవాళ్ళ అయితే స్కూలు బస్సులు సర్వసాధారణంగా పసుపు రంగులోనే ఎందుకుంటాయో చెప్పగలరా! హారర్ సిని మాలు చూసేటప్పుడే పాప్ కార్న్  ఎక్కువెందుకు మెక్కా ల్పొస్తుందో సెలవిస్తారా? టెన్నిస్ గురించి అంతా తెలుసుంటుంది గదా ? మన సానియా మీర్జా మేడమ్ ఆడే ఆ రాకెట్ కు  రంధ్రాలెన్ని ఉంటాయో చెప్పగలరా? ఆమెనే వెళ్ళి అడగాలా! సరే.. పలకముందా .. బలపం ముందా? ఈ సంగతైనా చెప్పుకోండి చూద్దాం ! గాడిద గుడ్డా ! అంటే ఏంటి సార్? అదీ వరస..  తెలవకపోతే ఎదురుదాడి! ఇదేసున్నా రోజూ మీరు టీవీ మైకుల ముందు చేసే రాచకీయ రచ్చలా? 

ఏంటీ.. మాటి మాటికీ రాజకీయాలు అనుకుంటున్నారా? నిన్నటిదాకా మీ పెద్దాళ్ళంతా కలిసి చేసినా ఎన్నికల అల్లరిని మాత్రమే రాజకీయమనుకోవాలా? ఏనుగు కన్నా కప్పల్ని చూసి జడుసుకునే వాళ్ళెక్కవగా ఉన్నారు  ఇప్పటిదాకా.  ఇప్పుడీ  పార్టీలు దూకే వెంకప్పలను చూసి ఇంకా  ఎక్కువ జడుసుకుంటున్నారుగదా! మానాన్న చెప్పాడు.  

మా ఇంట్లో కూడా చాలా పార్టీలే ఉన్నాయి. మా బామ్మది అధికారపార్టీ. అమ్మది ప్రత్యేక పార్టీ . ఎప్పుడు మిఠాయి చేసినా విడిగా వేరే డబ్బాలో దాచుతుంది ..  ఎందుకో? మానాన్నకు మాత్రం పార్టీ లేదు. ఒక్కో సారి బామ్మ పార్టీ, మరోసారి అమ్మపార్టీ. మా బాబాయిది టీపార్టీ.   ఎప్పుడు చూసినా స్టేట్ గవర్నమెంటును , సెంట్రల్  గవర్నమెంటును నిధులు అడిగినట్లు డబ్బుల కోసం నాన్నను వేధిస్తూ ఉంటాడు.

నా పార్టీ ఆభాస అంటే- అఖిలభారత బాలల సమితి. 
తమ్ముడిది దాబాస  అంటే- దోగాడే బాలల సమితి.  పసిపిల్లలకు పార్టీలేంటని  అలా విసుక్కోకండి సార్! మా బాధలు మావి 

మేం మాత్రం కాలక్షేపానికి పార్టీలు పెట్టామా?  దోమలు పెద్దవాళ్ళకన్నా చిన్నపిల్లల్నే ఎందుకు ఎక్కువగా కుడతాయో తేల్చమని ఎన్నేళ్ళ బట్టి పెద్దపార్టీలను అడుగుతున్నాము! పట్టించుకుంటేగా ! నేటి పౌరుడు నిన్నటి బాలుడేగా!  బాలల బాధలు అర్ధం చేసుకోకపోతే ఎలా? స్కూలు బ్యాగులు రోజురోజుకు బరువెక్కుతున్నాయి. పాకెట్ మనీ తగ్గిపోతూ ఉంది. మా ' కా' భాషను అధికారిక భాషగా గుర్తించమని ఎన్నో ఏళ్లుగా  మొత్తకుం టున్నాం. మా ముద్దులకు కనీస మద్దతు ధర పెంచాలి. పరీక్షలు వాయిదా వెయ్యాలి. అక్బరుకు అ..  ఆ లొచ్చా? బీర్బల్ కి ఏబీసీడీలొచ్చా? ఎందుకొచ్చిన హోంవర్కులివి! ప్రోగ్రెస్ రిపోర్టుల మీద సొంతంగా సంతకం చేసుకునే అధికారమివ్వాలి. పరీక్షలో తెలియని ప్రశ్నలు అడగరాదు. ఏ సమాధానం రాసినా సమానమైన పాసులు మార్కులు వేసి సమన్యాయం పాటించాలి. ఆడుకునే సమయం పెంచాలి. టీవీ చూసే వేళల మీద ఆంక్షలు సడలించాలి. పెద్దలకు మాత్రమే సినిమాలు తీసే పద్ధతిలో పిల్లలకూ చిత్రాలు నిర్మించాలి. నాన్‌ సోకింగు జోన్ మాదిరి సైలెన్స్ జోనులు ఏర్పాటు చేయాలి. పైసా వడ్డీకి అప్పులు ఇప్పించాలి. మూడు నెలలు దాటిన బాలలందరికీ పింఛను పథకం వర్తింపజేయాలి. బట్టల మీది బడ్జెట్ కేటాయింపులను చిరుతిళ్ల మీదకు మళ్ళించాలి.

అల్లరే మా అజెండా! బండి చక్రం మా జెండా గుర్తు. గులకరాళ్ళేసిన ఖాకీ డబ్బాల ద్వారా మా ప్రణాళికను జనంలో ప్రచారం చేయాలనుకుంటున్నాం. మా విధానాలు నచ్చిన ఏ పార్టీ ముందుకు వచ్చినా కలిసి పనిచే యటానికి సిద్ధం. బాలల సమస్యలను పట్టించుకోని పార్టీ లను గోడకుర్చీ వేయిస్తాం. బబుల్ గమ్ము లాగా  మా సమ స్యలను నానుస్తామంటే కుదరదు.  సహించం. మాకు మదర్ తెరిసాలే కాదు. ఫాదర్ థెరిస్సా, బ్రదర్ థెరిస్సాలూ కావాలిప్పుడు.

నేను ముఖ్యమంత్రి అయితే  ' కోలాయజ్ఞం' ప్రారంభిస్తా. 
ఐస్క్రీం కిలో రెండు రూపాయల పథకం రద్దు చేసి ఉచి
తంగా ఇచ్చే దస్త్రం మీద మొదటిది, గోల్డు బిస్కెట్లు
అమ్మేసి నిజం బిస్కెట్లు ప్రపంచంలోని బాలలందరికీ ఉచి
తంగా పంచే దస్త్రం మీద రెండో వేలిముద్ర వేస్తానని ఈ
అంతర్జాతీయ బాలల దినోత్సవ సందర్భంగా ప్రమాణం
చేస్తున్నాను. 

చివరగా 'చింటూ'కి బాలరత్న అవార్డు వెంటనే ప్రకటిస్తాం. చివర్లో ఈ 'చింటూ' ఎవరంటారా? 

నేనే! 

- రచన:- కర్లపాలెం హనువుంతరావు 
 అంతర్జాతీయ బాలల దినోత్సవం ) 
( ఈ నాడు 01 - 06-2009 - ప్రచురితం ) 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...