ఈనాడు - గల్పిక - హాస్యం - వ్యంగ్యం
పరుష పురాణం
రచన- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - ప్రచురితం )
'దాక్కుని రాళ్లేయడం కాదు, దమ్ముంటే రారా! కోడిగుడ్లు, కంకర బెడ్డలు కాదురా బిడ్డా... బాంబులు, గండ్రగొడ్డళ్లు ఆదిరా మాస్థాయి' అంటూ రాయలేని భాషలో రెండు గంటలపాటు విలేకరుల సమావేశంలో ప్రత్యర్ధిని పడతిట్టినాక, ఆకలి గుర్తొచ్చి ఇంటిముఖం పట్టారు. శ్రీమాన్ గంటయ్య.
ఇంటికి చేరేసరికి ఎప్పుడూ చెంబు నీళ్లు, పొడి తువ్వా లుతో నవ్వుతూ ఎదురొచ్చే ఇంటావిడ ఎందుకో మొహం చాటేసింది.
చల్లగా పలకరించే తల్లి కంటికి కనిపించలేదు.
పెరట్లోనుంచి పెద్ద పెద్ద రంకెలతో అత్తాకోడళ్లిద్దరూ చేసుకునే వాదనలు మాత్రం కర్ణపుటాలను బద్దలు కొడుతున్నాయి.
'ఉన్నచోటునే నన్ను ఉండమంటావే ! తప్పకుండా నీ నాలిక తరిగిపోస్తానే పిల్లా! ' అంటూ అత్తగారు.
' నీవు తరిగిన నాలుక నేను వేగించిన కూరలో కలిపి వండి నీ బిడ్డకే వడ్డింతునే అత్; తా' అంటూ కోడలు.
నాలుక రుచి తలచుకుని గజగజ వణకడం గుటయ్య వంతైంది.
ఎందుకైనా మంచిదని పక్కదోవసుంచి పిల్లిలా వంటింట్లోకి దూరి వంటావిడకు ఖాళీ కడుపు చూపించి భోజనానికి కూర్చున్నాడు.
గంటయ్య వంటామెకూ ఏదో పాడుగాలి సోకినట్లుంది. పీడాకారం పాట చరణాలేవో పీకి పాకాన పెడుతూ రుసరుస లాడుతూ వడ్డిస్తోంది. వికారాన్ని ఆపుకోలేక వాంతి చేసు కునేందుకు పరుగుచుకున్నాడు. గంటయ్య.
అక్కడా పిల్లలు. తగవులాడుకుంటున్నారు.
ఎక్కడ కొట్టుకొచ్చాడోగాని చిన్నాడు! రకరకాల బూతులతో విరుచుకుపడుతున్నాడు. వాడి చిన్నక్క అసహనంగా ఆ బూతులన్నీ వింటోంది. గంటయ్య రావడం చూసి చిన్నాడు గొంతు పెంచి మరీ పెట్రేగిపోయాడు.
ఆ బూతులు మరి విన లేక పడగ్గదిలోకొచ్చి పడ్డాడు గంటయ్య.
అక్కడా సుఖపడే యోగం లేనట్లుంది. పెద్ద కూతురు వచ్చి ' కళాశాలలో బూతు కూతల పోటీ గురించి చెప్పడం మొదలెట్టింది. తక్కువ సమయంలో ఎక్కువ బూతులు తిట్టిపోసినవారికి ఈ ఏడాది 'బూతుల రాణి' ట్రోఫీ ఇస్తా రట. ఈ విషయంలో మిమ్మల్ని మించినవారు ఎవరూ లేదు కదా నాన్న... కొత్త బూతులు కొన్ని రాసివ్వండి! ' అంటూ మారాం మొదలెట్టగానే గంటయ్య ముఖంలో వరసగా రంగులు మారిపోయాయి.
ఎంత నోటి దురదుంటే మాత్రం కన్నబిడ్డను కూర్చోబెట్టి బూతు పాఠాలు నేర్పించడం కుదురుతుందా?
అక్కడినుంచి బయటపడి హాలులోకి వచ్చి మనశ్శాంతి కోసం టీవీ పెట్టుకున్నాడు గంటయ్య.
ఆ కార్యక్రమంలో ఓ కవిగారు భాషా ప్రసంగం దంచేస్తున్నారు.
' కచటతపలు పరుషాలు. గండదబలు- సరళాలు, పరుషము అంటే తిట్టు అని మరో అర్ధం. అవి మనకు నిషిద్ధాలు! తమాషా చూశారా, పరుషాక్షరాలకు బదులు సరళాక్షరాలు వాడండి! మంచి మాటలు కాస్తా చెద్దమాటలవుతాయి. కప్పు- గబ్బు అయింది. పంట- బండ అయింది. కచ్చి- గజ్జి అయింది. పరుష పదాలను మనం ఈసడించు కుంటాంగాని, నిజానికి ఈశ్వర సృజన అయిన ఏ శబ్దమూ నిషిద్ధం కాదు. ' రామా ' అంటే కొంతమందికి బూతు మాటే. దోషం. పదాల్లో లేదు. మన మనసులోనే ఉంది. అందుకే విజ్ఞులైన నేతలు బూతులకు, నీతులకు అట్టి భేదభావం పాటించరు. యధేచ్ఛగా ఉచ్ఛరించే ఆ వదరుబోతులను అందుకే మనం ' పరుష పితామహులు ' వంటి బిరుదులతో సత్కరించాల్సి ఉంది"
గంటయ్య బుర్రతిరుగుడు ఇంకా ఎక్కువయిపోయింది. టీవీ కట్టేసి, మోగుతున్న ఫోన్ అందుకున్నాడు.
ఎవరో గంటయ్య వీరాభిమానిట " సార్.... మీ విలేకరుల సమావేశం అదిరింది. బూతాడక నవ్వు పుట్టదన్న కవి చౌడప్ప కన్నా మీరే గొప్ప సార్! రాజకీయ బూతు పాఠాలు మీ దగ్గరే నేర్చుకోవాలండి ! జనవినోదం కోసం మీరెంతలా పాటుపడుతున్నారు! సకుటుంబ సమేతంగా సినిమాకు వెళ్తే వెయ్యి రూపాయలు చమురు వదిలిపోతోంది. ఉచితంగా వినోదం పంచే మీ పేరు జనం ఎన్నటికీ మరచిపోరు. ఎన్నికలు ఎలాగూ దగ్గర్లోనే ఉన్నాయి. తమరి రుణం అణాపైసలతో సహా తీర్చు కోవాలని తెగ తొందరపడిపోతున్నారు. ఉచిత విద్యుత్ ఇవ్వకపోయినా ఇలా ఉచిత విద్వత్తునన్నా పంచి పెడుతున్నందుకు సంతోషంగా ఉంది సార్! '
అభిమాని పొగుడుతున్నాడో తెగడుతున్నాడో తెలియక గంటయ్య సతమతమైపోయాడు.
ఆ మాటలు ఇంకా వినాలని ఉన్నా, అధిష్ఠానం నుంచి ఫోను వస్తుండటంతో అక్కడికి దాన్ని ఆపేశాడు.
ఫోన్లో అధిష్ఠానం సందేశం విని ఢామ్మని పడిపోయాడు.... గంటయ్య తిట్టుకుంటూ! పదవి ఊడితే తిట్టుకోరా మరి!
కళ్లు తెరిచాడు గంటయ్య .
ఆసుపత్రి ! మంచం మీద ఉన్నాడు.
మరి మాట్లాడటానికి వీల్లేకుండా వైద్యులు నోట్లో గొట్టాలు పెట్టారు.
చెవులు మాత్రం బాగానే పనిచేస్తున్నాయి. ఎవరి మాటలో వినబడుతున్నాయి.
' కాలు జారితే చికిత్స ఉంది. నోరు జారుడుకు మందు లేదు. నాలుక వల్ల పదవులు, పరువులు పోగొట్టుకున్నవాళ్లు, పిల్లల చేత ' ఛీ ' అనిపించుకున్నవాళ్లు, తల్లితో కన్నీళ్లు పెట్టిం చినవాళ్లూ చరిత్రలో చాలామందే ఉన్నారు. తప్పదు కాబట్టి కట్టుకున్నది ముక్కు మూసుకుని కాపురం చేస్తుంది. సంఘం తాళి కట్టిన పెళ్లాం కాదు కదా!
రాముడు, హరిశ్చంద్రుడు మాటకు కట్టుబడి ఉన్నందుకే పూజనీయులయ్యారు. కోపం వస్తే సత్యాగ్రహ మంత్రం, మౌనదీక్ష మనకు మహాత్ముడు మార్గంగా చూపారు. అతిపెద్ద ప్రజాస్వామ్యంలో అప్రజా స్వామిక భాషే అధికారభాషగా మారటం విచారకరం!'
గంటయ్యకు ఆ మాటలన్నీ వినబడుతున్నాయి. బాధగా ' అమ్మా' ... అనాలనుకున్నాడు. నోటివెంట మరోపూట రాబో
కళ్లు తెరిచాడు. గంటయ్య. ఆసుపత్రి మంచం మీద ఉన్నాడు. మరి మాట్లాడటా వీల్లేకుండా వైద్యులు నోట్లో గొట్టాలు పెట్టారు. చెవులు మాత్రం బాగానే పనిచేస్తున్నాయి. ఎవరి మాటలో వినబడుతున్నాయి.
' అమ్మా' ... అనాలనుకున్నాడు. నోటివెంట మరోమాట రాబో యింది. అయినా తమాయించుకున్నాడు. బాదగా 'అమ్మా' అనే అన్నాడు.
నిన్నటి విలేకరుల సమావేశంలో బూతులు తిట్టినప్పటి నుంచి జరిగిన కధంతా కళ్లముందు కదలాడింది. గంటయ్య కళ్లనుంచి ధారాపాతంగా కారుతున్నాయి... కన్నీళ్లిప్పుడు!
- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - సంపాదకీయ పుట - ప్రచురితం )
No comments:
Post a Comment