Tuesday, November 8, 2016

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎన్ని మెరకలో.. అన్ని పల్లాలు- వార్తా వ్యాఖ్య

“Government of the people, by the people, for    the people, shall not perish from the Earth”                      Abraham Lincoln

ప్రజల వలన.. ప్రజల కొరకు.. ప్రజల చేత - నడిచే పాలన 'ప్రజాస్వామ్యం' అని అబ్రహాం లింకన్ కాబోలు మొదటిసారి సుపరిపాలన ఎలా ఉండాలో వివరించే ప్రయత్నంలో వ్యాఖ్యానించింది.
 ఆ పెద్దమనిషి పుట్టిన దేశంలోనే ఇప్పుడు ప్రజాస్వామ్యం ఎన్ని వన్నెచిన్నెలు పోతోందో? ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం అని పద్దాకా మనం గుండెలు గుద్దుకొంటుంటాంగా! మరీ అంత ప్రమాదకరమైన నెంబర్ వన్ స్థానంలో లేకపోయినా .. అమెరికా టైపు ప్రజాస్వామ్యాన్నే ప్రపంచం ప్రమాణంగా తీసుకొంటూ వస్తున్నదిప్పటిదాకా! అక్కడి నేతల నైతిక స్థాయి ఎలా ఉన్నా.. ప్రజలమాత్రం .. అధికశాతం ప్రజాస్వామ్య ప్రియులే. ఆ విధంగానే నిరూపణ అవుతూ వస్తున్నదిప్పటి వరకు.
స్వేఛ్చను కాంక్షించడం.. వ్యక్తిగత విషయాలను బహిరంగ చర్చకు పెట్టడం గిట్టకపోవడం అమెరికన్ పౌరసమాజంలో సాధారణంగా కనిపించే మంచి లక్షణాలు. సున్నితమైన విషయాలమీద అతిగా స్పందించడం బలమో.. బలహీనతో తెలియదు మనకు.  మొత్తానికి.. అమెరికా దేశాన్ని మిగతా దేశాలకన్నా విభిన్నంగా ఉంచడానికి కారణభూతాలని ఇప్పటి వరకూ అందరం  అనుకుంటూ వస్తున్న వ్యక్తిగత విలువల్లో చాలా వరకు ఈ సారి అధ్యక్షపదవికి జరుగుతున్న ఎన్నికల్లో తలకిందులైనట్లే అనిపిస్తున్నది.. రోజూ.. మీడియాలో వస్తున్న వార్తల సరళిని గమనించే ఆసక్తి ఉన్నవాళ్లకి.

స్వేచ్చని ఒక విగ్రహంగా మలుచుకొని ప్రపంచానికి ప్రజాస్వామ్యమెంత విలువైనదో.. అవసరమైనదో.. చాటి చెబుతున్న దేశంలో..  ఈ సారి శ్వేత సౌధం మీద అధిపత్యానికని పోటీపడే అభ్యర్థుల్లో సభ్యత ఎంతగా దిగాజారిందో గమనిస్తుంటే.. మన భారతీయ ప్రజాస్వామ్యవాదులకు సంతోషం కలుగుతుంది. సంతోషం ఎందుకంటే.. మనకన్నా.. నీతిబాహ్య దారుల్లో అధికార దుర్గాలని చేరుకోవలనే యావగల దేశం మరోటున్నది కదా అని!

రిపబ్లికన్ పార్టీ కదా.. రహస్య వ్యవహారాలు ఎందుకు.. పబ్లిగ్గానే అంటే బావుంటుందని  భావించాడో ఏమో.. ఆ పార్టీ అభ్యర్థిత్వానికి పోటీ మఒదలైన మొదట్రోజునుంచి.. డొనాల్డ్ ట్రంప్.. అన్నీ బాహాటంగానే వాగడం మొదలు పెట్టాడు. రిబబ్లికన్లు ఇప్పటి వరకు మరీ బైటకి అనడమెందుకులే.. అని మొహమాట పడే  మాటలన్నీ.. డొనాల్డ్ ట్రంప్.. నిస్సంకోచంగా నిస్సిగ్గుగా బైటికి అంటూ వచ్చాడు. రిపల్లికన్ పార్టీ సభ్యత్వం దొరకబుచ్చుకున్నప్పట్నుంచీ  ఇదే తంతు. సంచలనాలు సృష్టించి పోటీలో సీనియర్లను దాటి ముందుకు దూసుకొచ్చేందుకు   ఈ ఎత్తుగడే కొత్తగా పార్టీ తీర్థం పుచ్చుకున్న ట్రంపుకి బాగా కలసి వచ్చింది. మెక్సికన్లు దేశంలోకి అక్రమంగా వలస రాకుండా గోడ కడతాననడం.. ముస్లిం మతస్థులను దేశంనుంధి తరిమి తరిమి కొడతాననడం, చిన్న.. పెద్ద  ఉద్యోగాలను.. ఉపాధులను.. కొల్లగొడుతున్న  చైనా.. భారత్ వంటి తూర్పు ఆసియా నాన్-ఇమ్మిగ్రెంట్స్ భరతం పడతాననడం.. ఇవన్నీ కచ్చితంగా ఎంత ఉదారవాదులుగా బైటికి కనిపించే సాదారణ అమెరికనుకయినా సంతోషం కలిగించే విషయాలే అవుతాయి. అక్కడి సగటు మద్యతరగతి ఇంగ్లీషు పౌరుడి ఆలోచనలను అద్దం పట్టినట్టినట్లు మాట్లాడేవాడు మొదట్లో ట్రంప్. ఆ విధంగా ప్రైమరీ ఎన్నికల్లో సాటి అభ్యర్థులను వెనక్కి తోసేయడానికి ఉపకరించిన ఎత్తుగడల మూలకంగా.. సగటు అమెరికను ఇప్పటి వరకు తగిలించుకుంటూ వస్తున్న 'జెంటిల్ మన్ షిప్' తొడుగును తొలగించి ప్రపంచానికి ఆ తెల్లతోలువాళ్ల అసలు స్వభావం ఎలా ఉంటుందో  ప్రపంచానికి చూపించిన పుణ్యాత్ముడయాడు ట్రంప్. 

అమెరికా దేశానికి .. దానితో పోటీపడే చైనా.. రష్యా వంటి దేశాలకి మౌలికంగా చరిత్ర నిర్మాణంలోనే పెద్ద అంతరం ఉంది. చైనా లాగా ప్రాచీన సంస్కృతిగల దేశం కాదు అమెరికా. అమెరికా చరిత్ర అంతా కలుపుకున్నా  రెండున్నర  శతాబ్దాలకు మించి ఉండదు. రష్యా దేశంలాగా పలు పాలనా వ్యవస్థల మంచి చెడ్డలను అనుభవించి.. చివరికి సిసలైన  సోషలిజమ్ వైపుకు మొగ్గిన పరిణతీ అమెరికాకు లేదు. అమెరికా దేశ నిర్మాణమంతా వలసపౌరుల రెక్కల కష్టం. ప్రపంచంలోని ఎన్నో దేశాలనుండి ప్రతిభావంతులు ఈ గడ్డమీదకు అడుగుపెట్టి తమ మేధోబలంతో కూడగట్టిన సంపదలనే మూల అమెరికనువాసులు నేటికీ అనుభవిస్తూ వస్తున్నది. అక్కడి భారీ నిర్మాణాలలో చాలా వంతు పలు పేదదేశాలనుంచి పొట్ట చేత పట్టుకుని వచ్చిన వలస కూలీల కాయకష్టంనుంచి లేచినవే.  ప్రపంచ మనీ మార్కెట్లో తన డాలర్ బలపడేందుకు ఆయిల్ దేశాలతో తెలివిగా ఆడిన పాచికలాటలో విజయం సాధించిన విదేశాంగ విధానం వల్ల మాత్రమే అమెరికన్లకు అగ్రరాజ్యస్థాయి దక్కేందుకు ప్రథమ.. ప్రముఖ  కారణమయింది.   అమెరికన్లను నిజంగా అభినందించవలసిన అంశం ఏదైనా ఉందంటే.. అది వాళ్ళ విదేశాంగ విధానం.. ఆ  ఎత్తుగడల్లోని ముందుచూపు. ప్రపంచంలోని ఏ మూల రెండు దేశాల మధ్య చిన్నపాటి  ఘర్షణ తలెత్తినా.. పిలవని పేరంటానికి వెళ్లినట్లు.. అమెరికా.. వాళ్ల మధ్య దూరి.. తనకు లాభించే వర్గం కొమ్ము కాస్తూ రావడం వల్ల క్రమంగా ప్రపంచం మొత్తం  దాదాపు ఆ దేశపు అదుపాజ్ఞలకు ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో లోబడవలసిన పరిస్థితి దాపురించింది. అగ్రరాజ్య హోదాని ఇంతదాకా సవాల్ చేస్తూ వచ్చిన యూ ఎస్ ఎస్ ఆర్.. చీలిక  వల్లకూడా అమెరికాకు  మరింత లాభించిందనుకోవాలి. ప్రస్తుతం దాని వెన్నులో చలి పుట్టించే చేవగల దేశం ఒక్క చైనా మాత్రమే! ప్రపంచ వస్తుమార్కెట్ ను తన సరుకులతో  చైనా ఇప్పటికే దాదాపు ముంచెత్తి ఉంచడం.. అమెరికా  ఆధిపత్యానికి పెద్ద అవరోధంగా ఉంది.

తాను ఎత్తుకున్న ప్రపంచీకరణ సంస్కరణల పాటకు  ప్రపంచమంతా వంత పాడేందుకు ఒక్క చైనా మాత్రమే అవరోధంగా ఉంది ప్రస్తుతం అమెరికాకి.  ఆర్థిక పరంగా లాభించిన సైనిక చర్యల  ఎత్తుగడలే ఒక దశలో అమెరికా  వదిలించుకోలేని గుదిబండలుగా మారాయి. బుష్ లిద్దరూ తలపెట్టి కొనసాగించిన ఇరాక్- ఆఫ్ఘనిస్తాన్ సమరాల ఖర్చు అమెరికా డాలరును అతలాకుతలం చేసిందన్నమాట వాస్తవం. 

2008లో అమెరికాను కుదిపేసిన ఆర్థికమాంద్యం అటు పాలకులలోనే కాదు.. ఇటు పౌరుల మనస్తత్వంలోనూ గణనీయమైన మార్పుకు కారణమయింది.  ఇంత వరకు తామనుకుంటున్నట్లు ప్రపంచానికి తామే రారాజులం కాదన్న తత్వం బాగా తలకెత్తింది. మెక్సికన్ దేశీయుల్లాగా కష్టించి పని చేసే మనస్తత్వం.. ఆసియా వలసవాదుల్లా  ప్రతిబా పాటవాలను పెంపొదించుకొనే అబ్యాసాలకి అలవాటు పడకపోతే ముందొచ్చే కాలం మరింత చేదుగా ఉంటుదన్న సత్యమూ బోధపడింది మెల్లగా. ఆ నిజం తలకెక్కినందువల్ల మూల అమెరికన్లలో ఏర్పడ్డ అభద్రతాభావననే ట్రంప్ తొలి దశలో సొమ్ము చేసుకొని కాబోయే దేశాద్యక్షుడన్న  ఇమేజిని ఖాయపర్చుకోగలిగింది. పోటీలో బాగా ముందుకు పుంజుకొచ్చింది. దురదృష్టవశాత్తూ హిల్లరీ క్లింటన్ డెమోక్రటిక్ అభ్యర్థిత్వం ఖాయమయిన తరువాతా అతగాడు అదే తరహా ఎత్తుగడలకు పోకుండా.. వ్యక్తిగత స్థాయి దూషణ పర్వానికి తెగబడటంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల అధ్యాయంలో పూర్వమెన్నడూ లేని ఒక హేయమైన కొత్త పర్వానికి తెర లేపినట్లయింది.

ఇహ హిల్లరీ క్లింటన్ వైపునుంచి చూద్దాం. గత ఎన్నికల్లో ఒబామాకి ప్రత్యర్థిగా ప్రైమరీ స్థాయిలో డెమోక్రటిక్ అభ్యర్థిగా నిలబడిన వ్యక్తే. అప్పటి పోటీలో ప్రత్యర్థి ఒబామా మెజారిటీ ఓట్లు సాధించిన వెంటనే ప్రజాస్వామ్య స్ఫూర్తితో వైదొలిగారామె.  ఆ సందర్భంలో హిల్లరీని  బైటనుంచి సమర్థించిన వ్యాపారవేత్తల్లో డొనాల్డ్ ట్రంప్ పముఖుడు. ఈ సారి నేరుగా ఆమెతో తలపదవలసిన స్తితి వచ్చేసరికి అప్పటి మంచి ఇప్పుడు కామంచి అయిపోయింది! హిల్లరీ అల్లరి మనిషి.. అతిగా తిరిగే మహిళ.. భర్తను సంతృప్తి పరిచే సామర్థ్యం లేని ఇల్లాలయిపోయింది! హిల్లరీ ప్రైమరీ స్థాయిలో పోటి పడుతున్న సందర్బంలోనే ప్రయివేట్ సర్వర్లనుంచి ప్రభుత్వ విదేశాంగ సంబంధిత ఉత్తర ప్రత్యుత్తరాలు సాగించిన కేసును ఎఫ్ బి ఐ వెలికి తీసింది. విచారణ అనంతరం అభియోగాలు మోపదగినంత అభ్యంతరాలేవీ కనిపించలేదని అదే ఎఫ్ బి ఐ  తదనంతరం ధృవీకరించింది కూడా. అయినా ఆ కేసునే పట్టుకొని డొనాల్డ్ ట్రంప్ చాలా కాలం.. హిల్లరీని జైలుకు పంపిస్తానంటూ అల్లరికి దిగేవాడు! ఇంకా దిగుతున్నాడు కూడా! ఇటీవల మళ్లీ వికీ లీక్స్ చలవవల్ల  కొత్త కోణాలు వెలుగు చూసిన సందర్భంగా ఎఫ్ బి ఐ హిల్లరీ మీద మళ్లీ కేసు బుక్ చేసే ఆలోచనలో ఉందన్న వెంటనే హర్షాదామోదాలతో ఉబ్బి తబ్బుబ్బయిన వారిలో సహజంగానే ట్రంపు మొదటి వాడు. రెండు రోజుల కిందట హిల్లరీకి ఎఫ్ బి ఐ క్లీన్ చిట్ ఇచ్చింది కొత్త కేసులో కూడా. ఇప్పుడు ట్రంప్ మహాశ.యుడు హిల్లరీ.. ఎఫ్ బి ఐ కుమ్మక్కుని గురించి రచ్చ చేస్తున్నాడు! ఎఫ్ బి ఐ నిజాయితీని ప్రశ్నిస్తున్నాడు. ఇదే ఎఫ్ బి ఐ డొనాల్డ్ తన వ్యాపార లావాదేవీల పన్నుల విషయంలో చేసిన గిమ్మిక్కుని పరిశోధించి చట్టబద్ధంగా ఉందని సర్టిఫికేట్ ఇచ్చింది గతంలో. అప్పుడు ఆ అత్యున్నత నేర పరిశోధనా సంస్థను ఆకాశానికి ఎత్తేసిందీ మహానుభావుడే. తడవకో సారి  మాట  మార్చే నైజం అటు రాజ్యాంగ బద్ధ సంస్థల్లోనూ.. ఇటు చట్టబద్ధ పదవులకు పోటీ వ్యక్తులలోను వ్యక్తమవుతుండటం.. అమెరికా మార్కు  ప్రజాస్వామ్య స్ఫూర్తి ఇన్నాళ్లూ ప్రపంచమంతా భావించినట్లు ఇరవై నాలుగు కేరెట్ల బంగారం కాదు..  పొట్టలో  పురుగులున్న  మేడిపండు మాదిరిదని తేల్చేస్తున్నది.

పోటీకి దిగుతున్నది దేశాద్యక్ష పదవికి. కాబట్టి చర్చకు రావలసినవి దేశానికి సంబంధమైన సమస్యలు.తుపాకీ సంస్కృతి.. విద్యావిధానం.. ఉద్యోగ ఉపాధి అవకాశాలు.. మద్యతరగతి జీవుల బతుకుల్లో నాణ్యతా ప్రమాణాలు పెంచడాలు.. ఆరోగ్య, జీవిత బీమా పథకాల పునర్విచారణలు వంటివి ఎన్నో!  అవన్నీ మొదటి అంచె చర్చల్లోనే గాలికి కొట్టుకెళ్లాయి! గాలి మాటలు మొదలయ్యాయి.  ఆ స్థానే.. వ్యక్తిగత అంశాలు ముందుకు చొచ్చుకొచ్చేసాయి. హిల్లరీకి తరచూ జలుబు చేస్తుంది కాబట్టి.. ఆమె అత్యంత వత్తిళ్లతో కూడిన అధ్యక్ష పదవికి అనర్హురాలని ట్రంపు వాదన ఒకసారి. దానికి ఖండనగా హిల్లరీ వైద్యుల తాజా ఆరోగ్య ధృవీకరణ పత్రం సమర్పించుకోవాల్సి వచ్చింది. అయినా ట్రంప్ ఆరోపణలకు అడ్డుకట్ట పడనే లేదు. బహిరంగ వేదికలమీద బఫూన్ల స్థాయికి తగ్గకుండా.. ముక్కు ఎగబీలుస్తూ ఎగతాళిచేసే వరకూ వెళ్లింది అతగాడి వ్యవహార శైలి.  పోటీ చేసే అభ్యర్థి గుణగణాలని.. సమాచార గ్రహణ  సామర్థ్యం.. విశ్లేషణ.. వాటికి తగ్గ మేథోస్థాయి పరిమితులమీద చివరి అంచె మూడు డిబేటింగుల్లో  వాదోపవాదాలు సాగడం అమెరికా అధ్యక్ష ఎన్నికల పూర్వ సాంప్రదాయం. వాటినీ గాలికి వదిలి..   హిల్లరీ క్లింటన్ కి సంబంధంలేని  ఓ నాటి  మాజీ అధ్యక్షుడు  క్లింటన్ సెక్ స్కాండల్సుని తిరిగి తవ్వి తీసి వ్యక్తిశీలహననద్వారా పరువు తీసి పైచేయి సాధించే దుష్ట సాంప్రదాయం మొదటిసారి  ట్రంపు ఎంచుకున్నాడు. విధిలేని పరిస్థితుల్లోమహిళైన హిల్లరీ సైతం ముల్లును ముల్లుతోనే తీయాలన్న సిద్ధాంతాన్ని నమ్మి.. ట్రంప్ మహాశయుడి గతకాలపు శృంగార చాపల్యాన్ని పలు కోణాలలో.. ఉదాహరణలతో సహా  ప్రదర్శించి చర్చను రక్తి కట్టించింది. ఎన్నికల మూడు డిబేటింగ్ దశల్లో రోజుకో సెక్స్ స్కాండల్ ఇరువైపులనుంచి.  వ్యక్తిగత స్వేచ్చను.. శీలాన్ని  ఓ హక్కుగా భావించే అమెరికన్ల దృష్టిలో ఇద్దరు అభ్యర్థులూ అథమస్థాయి వ్యక్తులుగా  భావించేందుకు అవసరమైన ప్రహసనాలన్నీ అత్యంత అట్టహాసంగా  జరిగాయి. ఒక్క అమెరికానే కాకుండా.. ప్రపంచం మొత్తానికి అధ్యక్ష ఎన్నికల ప్రహసనం ఓ వినోద కార్యక్రమం కింద దిగజారి పోవడం మున్నెన్నడూ జరగని దుర్ఘటనే అనుకోవాలి.

హిల్లరీకి గతంలో అధ్యక్షుడుగా పనిచేసిన క్లింటన్ సహధర్మచారిణిగా వైట్ హౌస్ పాలనలో అనుభవం ఉంది. ఒబామా హయాంలో విదేంశాంగ మంత్రిగా గడించిన అనుభవమూ దానికి తోడయి ఉంది. ఆమెది రుజువయిన పాలనా సామర్థ్యం. మొదటిసారి ఎన్నికల్లో జనం ముందుకొచ్చిన అభ్యర్థి డొనాల్డ్ ట్రంపుకు అసలు రాజకీయాలే కొత్త.  డొనాల్డ్  మాట తీరు.. గత వ్యక్తిగత చరిత్ర ఆయనకో పెద్ద ప్లస్.. అదే మైనస్సు.  దేశం ఎదుర్కొనే సంక్షోబాల నివారణకి తన దగ్గర ఉన్న తారక మంత్రాది అంశాలతో సునిశిత ప్రజాస్వామ్య దృషిగల అమెరికన్ల మనసులను దోచుకోవాల్సుంది ఏ అభ్యర్థనా.  చివరి గడియల్లో వెలువడ్డ ప్రత్యర్థి హిల్లరీ ఈ-మెయిల్స్ కుంభకోణాల వల్ల  పొందవలసిన లాభం  సైతం.. సహజ శత్రువైన రష్యాను  పొగడడంతో  స్వయంగా చేజార్చుకొన్నట్లయింది డొనాల్డుకి.

వాచాలత వల్ల.. వ్యక్తిగత నిజాయితీలోని డొల్లతనం వల్ల.. అనవసరమైన, నీచమైన లైంగిక ఆరోపణల వల్ల.. పరాయి దేశాలమీదవున్న మత్సరం   వల్ల.. లౌక్య లేమి వల్ల.. రాజకీయ అనుభవ శూన్యత వల్ల..  ఒబామా సుదీర్ఘ పాలన వల్ల జనంలో ఉన్న అసంతృప్తిని సైతం సొమ్ము చేసుకోవడంలో డొనాల్డ్ ట్రంప్  విఫలమయ్యాడనే.. వెల్లువెత్తుతున్న సర్వేల సారాంశం తేట తెల్లం చేస్తోంది. ట్రంప్ మహాశయుడు ఎక్కడ విఫలమయ్యాడో.. హిల్లరీ క్లింటనుకి అక్కడ కలసి వచ్చినట్లుంది. ఫలితాల అనంతరం కూడా తన పోరు ఆగదు అనడంలోనే విలువలతో కూడుకొన్న అమెరికన్ ప్రజాస్వామ్యాన్ని అతగాడు అవహేళన చేసినట్లయింది. రిగ్గింగ్ మాట ఇప్పుడు వినిపిస్తున్నంతాగా మునుపెన్నడు వినిపించ లేదు అధ్యక్ష ఎన్నికల్లో.

చూడాలి! ఇహ 48 గంటల్లో వచ్చి ఒక్క రోజులో ముగిసే ఎన్నికల తరువాత  రోజు దాదాపుగా వచ్చే ముందస్తు ఫలితాల సరళే అసలు ఫలితం ఎలా ఉండబోతుందో తెలియ చేస్తుంది. మిగతా దేశాల మాదిరిగా కాదు.అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు అనేక దేశాలమీద.. పలు రంగాల పైన తీవ్రమైన ప్రభావం చూపిస్తుంటుంది. అందుకే  ఇప్పుడు ఇంత పెద్ద చర్చ ఇక్కడ.
'ట్రంపు గెలిచినా.. ఓడినా.. సంచలనమే' అనుకుంటున్నాయి ప్రపంచ దేశాలు. ఇప్పటి వరకు గొప్ప ప్రజాస్వామ్య స్ఫూర్తితో జరిగిన అన్ని ఎన్నికలకూ భిన్నంగా ఓటమి వచ్చి పడ్డా.. రిగ్గింగ్ వంటి ఆరోపణలతో అల్లరికి దిగుతానన్న సంకేతాలు కూడా వెలువరిస్తున్నాడు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.

ప్రపంచం దేశాలు ఇప్పటి వరకు గొప్పగా చెప్పుకుంటున్నది అమెరికా  ఆదర్శవంతమైన ప్రజాస్వామ్యాన్ని గురించి.  సందర్బం తటస్థపడ్డప్పుడు వచ్చినప్పుడు .. ఆ అత్యంత  ఉత్తమ ప్రజాపాలనావ్యవస్థా  ఎంతటి అధమస్థాయికైనా దిగిజారిపోగలదు' అని నిరూపిస్తున్న ఈ 2016 ఎన్నికలను ఒక్క అమెరికానే కాదు.. ప్రపంచం మొత్తం ఒక విలక్షణమైన చారిత్రక సంఘటనగా గుర్తుంచుకోడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది.
-కర్లపాలెం హనుమంతరావు

***



Friday, November 4, 2016

భోజ రాజీ(జకీ)యం- వ్యంగ్య కథానిక-

కారులు దూరని కారడవి. బెబ్బులి నిబ్బరంగా బబ్బొని కునుకు లాగిస్తోంది.
'నమస్తే వ్యాఘ్రోత్తమా!'.. వీపు మీదెవరో గోకిన భావన..
బద్ధకంగా కళ్ళు విప్పార్చి చూసింది బెబ్బులి. ఎదురుగా గోమాత!
ఉలిక్కిపడి గభాలున లేచి నిలబడింది పులి.
'బాగున్నారా పుండరీకంగారూ! ఎప్పుడో భోజరాజీయంలో తటస్థపడ్డాం ఇద్దరం.  వేట దూకుడుమీద ఉన్నారు తమరప్పుడునేను తమరి  కంట పడ్డాను. చంపుకు తింటానని వెంటబడ్డారు. 'ఇంటిదగ్గర చంటి బిడ్డున్నది. చన్ను గుడిపి రెండు మంచి మాటలు చెప్పొస్తాను.. దయ చూడమ'ని నేను ప్రాధేయపడ్డాను..'
'ఆఁ! ఆఁ!.. ఆ పాత పురాణాలన్నీ నెమరేసుకోడానికేనా  నువ్వింత దూరభారాలైనా   లెక్కచేయకుండా తరలి వచ్చింది సురభి తల్లీ! నేనోదో పిచ్చిగా ఒప్పుకోడం.. నువ్వంత కన్నా అమాయకంగా ఇచ్చిన మాటక్కట్టుబడి తిరిగి రావడం!  దంతా ఓ పిచ్చిమారాజుల కాలంకదా.. ఇప్పట్లా కాదు!' అంత కంగారులోనూ బెంగాలు టైగరుగారి మీసాలమీదో మంచహాసం మెరిసింది.
కపిలాంబ ఆ  సంబరంలో పాలుపంచుకొనే మూడ్ లో లేదు 'నన్నానాడే చంపుకు తినేసుంటే.. బతికి పోయుండేదాన్నిగదా పుండరీకోత్తమా! నా 'విమల సత్య ప్రౌఢికి మెచ్చి వదిలేయడంతో చచ్చే చావొచ్చి పడింది నాకిప్పుడు'
'మును మును బుట్టె నొక ముద్దుల పట్టి యతండు  పుట్టి యేడెనిమిది నాళ్ల పాటి గలడం' టూ అప్పట్లో బుడి బుడి రాగాలు తీసిందెవరు మిత్రమా! అయినా  ఎప్పుడో ఏదో జరిగిందానికి ఇప్పుడిలా వచ్చేసి దెప్పడం భావ్యమా!'
'నిజమేననుకో! ఇంతయు పూరియ మేయనేరడం'టూ  నీ దగ్గరానాడు వాపోవడం ఎంత పెద్ద నేరమో ఇప్పుడి ప్పుడే మెల్ల మెల్లగా అర్థమవుతోంది. అప్పటి ఆ ముద్దుల పట్టి ఇప్పుడో గోముఖ వ్యాఘ్రం’లాగా తయారైంది నా ప్రాణానికి'
వ్యాఘ్రం మొహం ఎర్రబడింది.. గోమాత ‘పంచ్’ కి.
జరిగిన  పొరపాటు ఆవుకు అప్పుడర్థమయింది. 'సారీ! పొలిటికల్ మనుషుల మధ్య నలిగీ నలిగీ నా  నాలుకక్కూడా ఆ పాడు భాషే  బాగా అలవాటయింది పులిరాజా! ఏమనుకోకేం! నా ఉద్దేశం.. నేనప్పట్లో గారాల బిడ్డగా పెంచుకున్న నా బాలధేనువు ఇవాళ ఆబాల గోపాలం పాలిట పెద్ద శనిదేవతయి కూర్చుందని. గో రక్షక దళం పేరుతో కొత్తగా రెచ్చిపోతున్నాయి కొన్ని శక్తులీ మధ్య కొత్త సర్కారు వచ్చినప్పట్నుంచీ.  దానికిప్పుడు ఆ దున్నపోతులతో బాగా  పొత్తు బలిసింది..’
'ఆ సోదంతా నాకిప్పుడెందుకులే గానీ.. చప్పున నువ్వొచ్చిన పనేదో  టూకీగా చెప్పి పోరాదా  మిత్రమా!  గుజారాతీ 'ఉనా'  టైపు.. అదే ‘చర్మం వలుచుకోడానికి గోవును చంపి తీసుకెళుతున్నాడ’ని కసాయోడి చర్మం వలిచి చంపినలాంటి’  ఊసులైతే నా దగ్గరసలు ఎత్తద్దు. నీ పుణ్యముంటుంది! తమ గోవుల  నిర్వాకం వల్ల.. పాపం..  ఆ  ఆనంద్ బెన్ జీ ముఖ్యమంత్రి పదవికే గండి పడింది అప్పట్లో.. ఇహ నేనెంత?'
'అదిగో! అందర్లా నువ్వూ   నామీదలా నిందలేస్తున్నావా.. ఉత్తిపుణ్యానికే!?  నా కీ జీవితంమీద ఇఛ్ఛ పూర్తిగా చచ్చిపోయింది మిత్రమా! అందుకే తమరి దగ్గరికిలా పరుగులెత్తుకుంటూ వచ్చింది’
'బావుందమ్మా వరస! బంగారం లాంటి ఆవు పుట్టుక నీకు చేదయిందా సురభి తల్లీ!  నీ ముఖమేనా.. పృష్ఠభాగం కూడా  అదృష్టం తెచ్చిపెట్టేస్తుందని నీ భక్తజనాలు తెగ డప్పుకొడుతుంటారే! ఒక్క  మలమే కాదు.. మూత్రం కూడా మందు- మాకు’లకింద చెల్లిపోయే  సౌభాగ్యం మ జంతు జాతిలో నీకులాగా  ఇంకెవరికమ్మా దక్కింది!  గో సేవకులో.. గొప్పోళ్ళ అదృశ్య శక్తులో కమ్మంగా  నిన్నో కామధేనువు కింద  కంటికి రెప్పలా కాపాడుతుంటే..  తోకూపుకుంటూ కాలక్షేపం చెయ్యాలి గానీ.. ఇలా   బతుకంత   ఎకసక్కెమయిపోయినట్లు ఎక్కిళ్ళు పెట్టడమేంటో.. విడ్డూరం కాకపోతే!’
'నా మూలకంగా ఏమీ తెలీని అమాయక జీవుల ప్రాణాలెన్ని అన్యాయంగా గాలిలో కలిసిపోతున్నాయో నీకు తెలీడం లేదు పుండరీకమా! గోమాతగా అంతా నన్ను  పూజించేస్తున్నారు.. అదే గొప్ప సౌభాగ్యమని..  గాలిలో తేలిపొమ్మనడం నీకు భావ్యమా ! నా వల్ల కాదు.   నన్నేదైనా వల్లకాటికి చల్లంగా  పంపించే పూచీ నీదే సుమా! గంపెడాశతో నీ దగ్గరికిలా  గంతులేసుకొంటూ వచ్చాను. నా ఆశ నిరాశ చేయబోకు  శార్దూలరాజమా!'
గోమాత భావోద్వేగాలు కొద్ది కొద్దిగా అర్థమవుతున్నాయి   శార్దూలం రాజావారికి. అయినా ఇంకా  ఏదో సంధిగ్ధం!
‘అవును గానీ ఆవు మిత్రమా!  నిజంగానే  నీకు  బతుకంత వెగటనిపిస్తే మీ  జనావాసాల మధ్యే చచ్చేటన్ని సదుపాయాలేడ్చాయి కదా.. చావడానికి! స్వచ్చ భారత్ ఉత్సవాలంత ఉత్సాహంగా నిర్వహించిన  తరువాతా రాస్తాలమీద బస్తాల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు కనిపిస్తూనే ఉన్నాయి  ఏ గల్లీ గట్టర్లలో  చూసినా! గుట్టుగా ఏ రెండు కట్టల  ప్లాస్టిక  వ్యర్థాలో గుటుక్కుమని మింగేసి.. కుళ్లాయి కంపు నీళ్ళో గుక్కెడు గొంతులో పోసేసుకుంటే  నీ చావు ముచ్చట ఇంచక్కా  తీరిపోను కదా! ఆ మాత్రం భాగ్యానికి  కాలగర్భంలో కలిసిపోడానికింత రొప్పుతూ రోస్తూ  కారడవిలోకి పడీ పడీ పరుగెత్తుకు రావాలా.. అదీ నన్ను ప్రత్యేకంగా నా చేతే చంపించుకోదానికీ?!’
'అర్థమవుతోంది పులిరాజా నీ మనసులోని గుంజాటన! ఇది వాణిజ్య యుగమని..  రీ సైకిలింగు ఓ యాగమని.. ఆ యాగానికి  సమిధలుగా వాడేవి  వ్యర్థాలైనా సరే మా బోటి  జంతుజాలాలకు వృథాగా ధారపోసే ఉదారులెవరూ ఇక్కడ లెరని.. అంతా    లాబాపేక్ష బలిసిన  వ్యాపార యోగులేనని.. తమరికే అర్థమవడం లేదు రాజోత్తమా! ఇహ కుళ్లాయిలంటావా! తాగి చచ్చేందుకు మనుషులకే బొట్టు రాలటం లేదా కుళ్ళు నీళ్లు.    ఇహ మా బోటి మూగజీవాలనెవరు వంతుకు రానిస్తారు  నేస్తమా!'
'పోనీ.. పంట పొలాలమీద చల్లే క్రిమిసంహారకాలమీదైనా ఓ ప్రయోగం చేసి చూడాల్సింది   మిత్రమా! మొన్నీ మధ్యనే చదివానెక్కడో!  బోల్డన్ని లేళ్లూ.. దుప్పులూ..ప్రాణాలకు తెగించి మరీ  ఆ చేలల్లో పడి  చచ్చేదారులేవో దిగ్విజయంగా ఆవిష్కరించాయని ఏవో ఊళ్ళల్లో! అందుబాటులో వందల కొద్దీ చావుసాధనాలున్నా .. అవన్నీ వద్దనుకొని ఈ కారడవిలోకే నాకోసం  ఇలా పరుగులెత్తుకుంటూ రావడంలోనే...’
‘.. మతలబేమన్నా ఉందని అనుమానం. అంతేనా? ఆహా! కాలమా! నేవెంత గడసరిగా మారిపోయావే సమయమా!  ఆనాడు అనంతాచార్యులవారు రాసిన  ‘భోజరాజీయం’లో ‘చంపద్ద’ని  నేనే బతిమాలుకోవడమా? ఈనాటి భక్తి రాజకీయాల్లోనూ  ‘చంపెయ్య’మని నేనే బతిమాలుకోడమా!’
‘ఆ కాలాల గోలేమిటో  నాకు తెలేదు కానీ..   నాకింకా భవిష్యత్తుమీద బోల్డన్ని గోల్డెన్ అంచనాలున్నాయి మిత్రమా! ప్లీజ్!ఏమముకోవద్దు!  మా పులుల సంఖ్య ఈ మధ్యనే మళ్లా  కాస్తింత మెరుగుపడిందంటున్నారు పర్యావరణవేత్తలు. ఇంకా మెరుగుపడేందుకేవో  ప్రణాళికలుకూడా రచిస్తున్నామని  తెగ గొప్పలుపోతున్నారు గద్దెనెక్కిన  ప్రభువులు..ఇప్పుడు నిన్ను చంపి మా చావుని పేరంటానికి పిలవమంటావా?’
'హ్హఁ!.. హ్హఁ!.. హ్హఁ!   మా రాజకీయ నేతలు అల్లే  మాటల తట్టలో తమరూ భలే పడ్డారే    పుండరీక మహాశయా! పులుల సంఖ్య పెరుగుతోంది.. మంచిదే! పులుల్ని   వేటాడే మాఫియా రాయుళ్ల  సంఖ్యా ఆ దామాషాలోనే  పెరుగుతోంది! ఆ తమాషా తమరి దృష్టినసలు ఆకర్షించినట్లే  లేదు.  ఇహ మా  రాజకీయ నేతాశ్రీల గప్పాలంటారా!  ఎన్నికలు ముంచుకొచ్చే ముందు  అమాయక జనాలని ముంచేందుకా నేతాశ్రీల గొంతుల్నుంచీ పెకిలొచ్చే నకిలీ ‘ధ్వని’ అనుకరణలవన్నీ..  అసలు గుండెలోతుల్నుంఈ వచ్చినవి కావు!  ఈ అడవి సరిహద్దులు దాటి తమరెప్పుడో తప్ప బైటికి అడుగేయరు. కాబట్టే  భవిష్యత్తుమీద మీకంతంత  అందమైన కలలు! జనావాసాల సంగతి గాలికొదిలేయండి. మీ సొంత ఇలాక.. ఈ మీ కారడవిలోనే ముందు ముందు మీకే మాత్రం భద్రతుందో.. భరోసా లేదు.  ఏనుగు  బతికినా చచ్చినా  పదివేలే! అదే.. తమరు బతికుంటే పదివేలు. చస్తే  పదింతలు మేలు.. మా మాఫియా మాయావులకు.  తమరి  ఎముకలూ, పుర్రే  గట్రాలు .. మాకు మందూ- మాకులకు. తోళ్లూ, గోళ్లూ, ఎక్సెట్లాలు. దొరబాబుల  ఎక్స్‌ట్రా డాబులూ.. దర్పాలకు! పులిమీద పుట్రలాగా కొత్త సెంటిమెంటింకోటి  బైలుదేరిందీ మధ్య తమరి నోట్లోని  పన్నులమీద! ‘పులిపన్ను‘ షో కేసు’లోగాని పెట్టుకుంటే  పన్నుపోట్లేమీ లేని  సంపన్నుల గుంపులోకి నల్లకుబేరులుకూడా  గుట్టుగా  చేరిపోవచ్చన్న  నమ్మకం   శార్దూలరాజోత్తమా!  ఎర్రచందనంమీద సర్కార్ల బంధనం రోజు రోజుకీ బిగుసుకొంటున్నది కదా! పొట్టకూటికోసం తాపత్రయపడే..  పాపం మా  మాఫియా గుంపులకు మాత్రం ఇంక  మార్గాంతరమేముంది? ఎర్ర ఏగాని ఎక్కడ దొరికితే అక్కడె  ఎవరైనా ఎగబడాల్సింది! అందుకే..  ఇప్పుడు నాలుగు డబ్బులు దండుకొనేందుకు  తమ పులిజాతిమీదకొచ్చి పడిపోబోతున్నారు. వినండి ఆ చప్పుళ్లు!’
అంత లావు బెబ్బులీ బెదిరిపోయిందీ చప్పుళ్లకన్నా ముందు  గో మాత మాటలకు.
బతికుంటే బలుసాకు తినొచ్చు. ఈ అడవి కాకుంటే.. ఆఫ్రికా అడవులకైనా వెళ్ళి తలకాచుకోవచ్చు' అంటూ కాళ్లకు బుద్ధి చెప్పేసింది. వ్యాఘ్రరాజోత్తమం.
***
'శభాష్! మొత్తానికి పులిరాజు బలుసాకు తినేటంత  పరిస్థితి  తీసుకొచ్చావు. పులుల భయం లేకుండా చేసినందుకు ధన్యవాదాలు మిత్రమా. ఇక ఈ అడవంతా మన సామ్రాజ్యమే! ఎన్ని వన వనరులునైనా సొమ్ము చేసుకోవచ్చు. పరిశ్రమలకు భూములమ్ముకోవచ్చు.   ఇదిగో నీ సేవకు తగ్గ పారితోషికం' అంటూ అప్పటి వరకు గుట్టవెనకే దాగున్న మాఫియా మనిషి చప్పట్లు కొట్టుకుంటూ బైటికొచ్చాడు.. సంతోషంగా.
'ఈ కాసిని బోడి  కాసుల కోసమా నేనింత కష్టపడి భోజరాజకీయం రక్తి కట్టించింది!' అంది అప్పటి వరకు తగిలించుకొని ఉన్న గోవు ముఖాన్ని తొలగించుకొన్న నక్క.
' కాసులు కాకపోతే మరింకేం కావాలి? కోరుకో మిత్రమా!' ఆదరంగా ఆడిగాడు మాఫియా మనిషి.
'రేపొచ్చే ఎన్నికల్లో ప్రజాప్రతినిది అయ్యే ఛాన్సు'
'నీ లాంటి జిత్తులమారి నక్కలు సర్కారులో ఉండటం మా మాఫియా గుంపులకీ మంచిదేలే.! ఏ పార్టీ టిక్కెట్టు కావాలో కోరుకో! తప్పకుండా ఏర్పాటు చేద్దాం. అన్ని పార్టీల్లోనూ మనకు ‘ఆత్మ’బంధువులున్నారు!' అన్నాడు మాఫియా  మనిషి మనోహరంగా చిరునవ్వులు చిందిస్తూ!
***
-కర్లపాలెం హనుమంతరావు
('తెలుగిల్లు' అంతర్జాల పత్రికలో ప్రచురితం)



గొడుగులు- గొడవలు- ఓ సరదా గల్పిక- హనుమంతరావు (ఆంధ్రప్రభ - 20-01 - 2018 - ప్రచురితం )



'ఎవరదీ?'
నేనే బాబాయ్! ఛత్రపతిని'
'వానా వంగడం ఏవీ లేదు కదట్రా! ఇప్పుడీ నడివీధిలో ఒక్కడివే గొడుగేసుకొని ఏవిట్రా  విచిత్రంగా!'
'ఇవాళ 'గొడుగుల దినం' కదా బాబాయ్.. అమెరికాలో! .. అందుకనీ..'
'మూలన పడున్న ఈ ముతక గొడుగుని బ్సిటికి తీసి ఇలా ఊరేగిస్తున్నానంటావ్!  అదేదో దేశంలో జరిగే 'దినం' పేరు చెప్పి ఇక్కడిలా వూరికే ఊరేగుతున్నావంటే ఎందుకో నమ్మబుద్ధి కావడం లేదురా బాబ్జీ!.. అమెరికానుంచి పట్టుకొచ్చిన పైత్యమేమో అనిపిస్తున్నది!'
'సీమదొరలకి మనలాగా గొడుగులు.. గిడుగులు జాన్తా నై బాబాయ్!  పరమ నామర్దా కూడా! వాళ్ళు  నెత్తిన పెట్టుకొనేది ‘టోపీ’ ని!. మనమే! ఎండకూ వానకూ మాడును కాచి కాపాడే గొడుగుని వాడకం  అయినాక  గోడకు వేలాడదీసేది!'
'అబ్బో! టిక్కెట్టిచ్చి గెలిపించిన పార్టీ అధికారంలోకి రాలేదని.. దాన్నో మూలన పడేసిని   ఘనుడివి! ధర్మా పన్నాలొద్దు! మన వాళ్ళు  గొడుగుల్ని పనయినాకా  అటకెక్కిస్తారని కదూ నీ వెధవ అభియోగం! చేతిలో గొడుగు లేకుండా కాలు బైటపెట్టని తరం  మా నాన్నగారిది! మా తాతల కాలంలో అయితే గొడుగు పెద్దరికానికో ముఖ్యమైన గుర్తు. పాత సినిమాలు చూస్తావో.. లేదో! రాజ్ కపూర్ .. నర్గీస్ దత్తుల ప్రేమకహానీలో గొడుగుదే పెద్ద పాత్ర! పిలగాడివి.. నీకు చరిత్ర తెలీదు.  ఛాంర్లేనుకు గౌరవం పెంచిందీ.. చార్లీ చాప్లిన్కి గుర్తింపు తెచ్చి పెట్టిందీ ఈ ఛత్రమే  ఛత్రపతీ! శివాజీ మహారాజుకి ఛత్రపతి బిరుదెలా గౌరవం పెంచిందో తెలుసా! రాయలవారికి తన వెనక గొడుగు పట్టి పరుగెట్టే  గోపాలుడంటే గొప్ప ప్రీతి. రాయసానికే కాదు ఛత్ర చామరాలు.. దైవత్వానికీ పెద్ద ఆకర్షణలే బాబూ మన సంప్రదాయంలో. రాళ్ళవాన బారినుంచి ఆబాలగోపాలాన్ని కాపాడేందుకు బాలకృష్ణుడు గోవర్ధన్నాని గొడుగులా ఎత్తి పట్టుకొన్న వైనం నీకు తెలుసా?   బలిని పాతాళం అడుగున  తొక్కేందుకు బయలుదేరిన అవతార మూర్తి వామనుడి నెత్తిమీదా అలంకారంగా ఉండేది ఈ గొడుగే!  ఏదుకొండలవాడి కొండకి ఏటేటా అరవదేశంనుంచి తరలి వచ్చే గొడుగుల ఉత్సహం సందడి  నీకు తెలీదులాగుంది! నీకు తెలిసిందల్లా మీ మార్కు  రాజకీయాల్లో   ఏ ఎండకు పట్టే ఆ గొడుగులూ,,  ఏకఛ్చత్రాధిపత్యంకోసం పక్క పార్టీలనుంని అభ్యర్థులను గొడుగు కర్రలేసి లాక్కోవడాలు!'
'రాజకీయాల్లో ఉన్నామని కదూ మా మీద ఈ  రాళ్ల విసురుళ్లూ?! ఏ ఎండకు ఆ గొడుగు పట్టే గాలివాటం సరుకు పుట్టాగొడుగుల్లా పుట్టుకొస్తున్న మాటా నిజమే! కానీ  కారణం ఎవరు బాబాయ్? ఎన్నికల సంఘాలే 'గొడుగు'ను గుర్తుగా అంగీకరించాక మా నేతల ఒక్కళ్లమీదే  ఇలా బురద చల్లుళ్లు.. ఏవన్నా బావుందా! చెత్త నేతల గతం తెలిసీ నెత్తికి గొడుగు పడుతున్న ఓటర్లది అసలే తప్పు లేదంటాప్ .. పాపం!'
'నీతి నిజాయితీలనేవి బొత్తిగా లేని రాజకీయనాయకులే అందరూ.. అని నేనడంలేదులేరా నాయనా! ఒహటీ అరా ఒకవేళ అలాంటి  చాదస్తులు ఇంకా ఎక్కడైనా  మిగిలున్నా .. మీ తరం వాళు వాళ్లకిస్తున్న మర్యాదల మాటేమిటీవయసుమీద పడిందనో.. వంట్లో ఓపిక సన్నిగిల్లిందనో.. ఏదో ఒహ వంక కనిపెట్టి పాతకాలంనాటి పనికిరాని గొడుగులకు మల్లే గోడలకు వేలాడదీయడంలా!.. ఎందుకురా అర్థాంరంగా ఇప్పుడంతలా నవ్వులూ!'
'గోడకు వేలాడె గొడుగు గుర్తుకొచ్చిందిలే బాబాయ్!  చూసేందుకది అచ్చంగా చెట్టుకొమ్మకు  వేలాడే గబ్బిలం మాదిరిగా ఉంటుందిగదా! నవ్వాగలేదు!'
'గోడకు వేలాడుతున్నా.. వీధిలో ఊరేగుతున్నా.. గొడుగులది ఎప్పుడూ గబ్బిలాల రూపమేరా బాబిగా! పిచ్చుకలు.. పిచ్చికాకులు అంతరించిపోతున్నాయని అంతలా  ఆక్రోశ  పెడుతున్నారే  జనాలు!  మరి ఇప్పుడీ  గొడుగులకు పడుతున్న దుర్గతులను గురించి పట్టించుకోరా ఎవ్వరూ!! ఎందుకు?'
' గొడుగు ఈ ఈ-కాలం తరానికి కి బొత్తిగా పొసిగే సరుకు కాదులే   బాబాయ్!  మూడు కాళ్ళ ముసలయ్యలక్కూడా గొడుగుతో బైట కనబడ్డం పెద్ద నామర్దా అయిపోయిందిప్పుడు.  చరవాణుల్లో సందేశాలందించేందుకే రెండు చేతులూ చాలడం లేదు సుందరాంగులకి.. మళ్లీ గొడుగొకటి నెత్తిమీదకంటే పెద్ద గొడవలయిపోతాయి! ఎన్నిరంగులు.. హంగులతో  హొయలు పోయే సరుకు సంతలోకొస్తే మాత్రం ఛత్రాన్ని  కొనే చాదస్తం ఎవరికుంటుంది .. చెప్పు! గొడుగులకన్నా.. చరవాణి తొడుగులు అమ్ముకోవడం లాభదాయకం అనుకుంటున్నారు బజారు  వ్యాపారస్తులు! రద్దీగా ఉండే బస్సుల్లోకి తోసుకొని ఎక్కడం రాక కిటికీ చువ్వలగుండా సీటుమీద  చేసుకొనేందుకు మినహా ఇప్పుడీ గొడుగు కర్రలు ఎందుకూ పనికొస్తున్నాయి చెప్పూ! ఎన్నికల సంఘమొక్కటే  దీనిమీదింకా ముచ్చట పడుతున్నది.  అభ్యర్థికి గుర్తుగా అదింకా  దీన్ని ఆమోదిస్తుండటమే ఒహ గొప్ప విషయం. 'ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి చట్టబద్ధమైన ప్రజాస్వామిక  హక్కుగా జనం ఎందుకు ఆమోదించడం  లేదో అర్థం కాకుండా ఉంది నాకిప్పటిక్కూడా!’
'జనామోద ప్రమోదాలమీదే ఇంకా మన నేటి రాజకీయాలు  నడుస్తున్నాయనే నన్ను భ్రమ పడమంటావుట్రా సన్నాసీ! ఇప్పుడు నువ్వు ఈ గొడుగు పట్టుకు తిరగాడినికి కారణం నిజంగా అమెరికా గొడుగుల పండుగ' సందర్భం అవునో కాదో చేప్పేపాటి జ్ఞానం నాకు లేకపోవచ్చుగాని..  ఇక్కడ నడుస్తున్న రాజకీయం మాత్రం  అమెరికా తరహా జనామోద అధ్యక్ష ఎన్నికల తరాహాలోవి కాదని మాత్రం కచ్చితంగా చెప్పగలను. అదేంటిరా! మాట పూర్తి కాకుండానే ఎక్కడికా పరుగులు! అరేయ్.. ఛత్రపతీ! నిన్నే!,, నిన్నే!..'

'సార్! ఇప్పుడా గొడుగు వేసుకొని ఉరకలెత్తుతున్న మనిషి ఎవరో చెప్పగలరా?'
'ఛత్రపతి! అదేనయ్యా! మొన్నటి మన  నగర పాలిక ఎన్నికల్లో మనమంతా  ఓట్లేసి గెలిపించిన వార్డు అభ్యర్థి! ఇంతకీ మీరు ఎవరు? మా ఛత్రపతితో మీకేంటి అంత గత్తర?'
'సార్! మీ  ఛత్రపతి ఎన్నికల్లో గెలిచిన తరువాత సర్కారు పార్టీలోకి గెంతాడు కదా! నగర పాలిక కార్యాలయంలో గుమాస్తా ఉద్యోగం ఇప్పిస్తానని నా దగ్గర ఐదు లక్షలు నొక్కేసాడు. ఇప్పటి వరకు నౌఖరీ లేదు.. కదా.. కనీసం.. నా  డబ్బులు తిరిగివ్వమని అడుగుతున్నా .. ప్రయోజనం లేదు. ఎదురు పడ్డప్పుడల్లా ఇలా ఏ గోడనో.. గొడుగునో.. చాటు చేసుకొని.. మొహం తప్పించేస్తున్నాడు..'
ఇప్పుడర్థమయింది.. ఎండా వానా  ఏవీ లేక పోయినా .. ఇలా వీధిలోకి వచ్చినప్పుడల్లా  గొడుగు ఎందుకు వాడుతున్నాడో మా ఛత్రపతి!
అమెరికా గొడుగుల పండుగా కాదు.. పాడూ కాదు! ఇది ఇండియా రాజకీయాల గొడవ!
***
-కర్లపాలెం హనుమంతరావు
(ఆంధ్రప్రభ - 20-01 - 2018 - ప్రచురితం )



Sunday, October 23, 2016

నల్ల’మేతగాళ్లు- ఈనాడు వ్యంగ్య గల్పిక


రోజూ ఉండే రాజకీయాలకేం గానీ ఇవాళ నీకు మహాభారతంలోని ఓ మంచి కథ చెప్పాలనుందిరా!'
'కహానీలు చెప్పడంలో నిన్ను మించిన మొనగాడు లేడుగా! బాదేయ్  బాబాయ్!'
'సృంజయుడనే ఓ రాజుగారికి సంతానం లేదు. నారదులవారో సారి చూడ్డానికని వచ్చినప్పుడు రాజు కోరితే 'గుణవంతుడు, రూపవంతుడయిన కొడుకు పుడతాడ’ని ఆశీర్వదించాడు.’
'గుణాన్నేమన్నా కోసుకు తింటామా? రూపాలతో ఏమన్నా వ్యాపారాలు చేయబోతున్నామా?  వాడి చెమట, రక్తం, ఉమ్మి, కన్నీళ్లుకూడా చివరికి కాసులుగా మారిపోవాలి.  అట్లాంటి రూకలు రాల్చే పుత్రుణ్ని ప్రసాదించండి స్వామీ!' అని కోరుకున్నాడా రాజు. అట్లా పుట్టిన సుపుత్రుడే సువర్ణష్ఠీవి.'
'ఆ నడిచే ఏటియంగానీ  ఇంకా ప్రాణాలతో ఉంటే.. అర్జంటుగా  అడ్రస్ చెప్పెయ్  బాబాయ్! అసలే మన కష్ణమ్సోళ్ళు  గోల్డు గట్రాలు గీకే పనుల్లేక పాపం   గోళ్లు గిల్లుకుంటున్నారూ!'
'హుష్ఁ! ముందు కథ విన్రా! ఆశకొద్దీ ఆ బంగారు బాబుని దొంగలు ఎత్తుకెళ్లా రోసారి. నిధులకోసం పొట్టకోసి చూస్తే వట్టి పేగుచుట్టలు, మాంసం ముద్దలు! రక్తధారలు మినహా మరేవీఁ కనిపించక చెత్త కుండీలో పారేసి పోయారు చిర్రెత్తిపోయి. రాజుగారి దుఃఖం సంగతింక చెప్పాలా? నారదులవారా పుత్రశోకానికి చలించిపోయి 'అందుకే ఎర్ర చందనం దుంగల్లాంటి బిడ్డల్ని కాదు.. ఎవర్ హీరో చంద్రబాబులాంటి మచ్చలేని చంద్రుళ్లను  కొడుకులుగా కోరుకోవాల'ని మందలించాడు. మళ్లీ సువర్ణష్ఠీవిని  బతికించి పోయాడు'
'కథ బాగుంది కానీ బాబాయ్ .. ఇప్పుడా గోల్డుబాబుగాడి గోలింతర్జంటుగా  ఎందుగ్గుర్తుకొచ్చిందో?!’
'ఇవాళ్టి పత్రిక పరీక్షగా చూసుంటే నీకూ ఇట్లాంటి కథే ఇంకోటేదన్నా గుర్తొంచ్చుండేదేమో! అపరాల ధరవరలు ఆకాశాన్నంటుతున్నట్లు.. అవినీతి అధికారుల ఆమ్యాఁమ్యాఁలు కూడా అంగారక గ్రహాని కెగబాకుతున్నాయంట.. వింటంలేదా!'
'పెట్రోలు రేట్లు తగ్గించినట్లే తగ్గించి డీజిలాయిలుమీద దొంగ దెబ్బలు తీస్తే ఎంతధికారులయితే మాత్రం పాప మింకేం చేస్తారు బాబాయ్.. పాపిష్టి పన్లకు  పాల్పడ్డం తప్ప?'
'అందుకేనంటావా పోయినేడాది మన అధికారుల దగ్గర పట్టుబడ్డ అక్రమార్జన  సొమ్ము సిటీ మెట్రో ప్రాజెక్టు  సగం నిధులకు సరిసమానంగా ఉందీ! ఈ లెక్కన ఏ.సి.బి వాళ్లు దాడి చెయ్యని.. చెయ్యలేని.. చెయ్యడానికి మనసొప్పని సొమ్మంతా లెక్క చూస్తే  మన పోలవరం పెంచిన అంచనాలక్కూడా మించుంటుందేమో గదా?! సమాచార హక్కు చట్టాలు, అన్నాహజారేలు అన్నం నీళ్లూ మానేసి దీక్షలకు  దిగడాలు, అవినీతి నిరోధక శాఖల అడుగడుగు నిఘాలు, కాలు కదిపినా చాలు వళ్లు ఝల్లుమనిపించే విజిలెన్సువాళ్లు  ఝళిపించే కొరడాలు, న్యాయస్థానాల మార్కు నిష్పాక్షిక విచారణలు, జనాల చీదరింపులు.. ఎన్ని ముళ్ల కంచెలడ్డంగా ఉన్నా .. ఇదేందిరా 'పచ్చి గడ్డే' పరమాన్నమంత హుషారుగా మన అధికారులిలా చేలల్లోపడ్డ ఆంబోతుల్లా  లంచాలు మేసెయ్యడాలూ?!'
'లంచాలు' ఏంటి బాబాయ్.. మరీ అంత మొరటు పిలుపు? ముడుపులు, నైవేద్యాలు, నజరానాలు, మామూళ్లు, ఫలహారాలు, ప్రసాదాలు,  చాయ్ పానీలు, విరాళాల్లాంటి నాజూకు సహస్రనామాలు వేలకు వేలుంటేనూ! అయినా ఇవాళే ఈ అరాచకాలన్నీ కొత్తగా పుట్టినట్లా తత్తర్లేంటంట? పరగడుపునే భగవంతుడి ముందు బోర్లాపడిపోయి 'నాకిది కావాలి.. వాడికది ఇవ్వద్దం'టూ కోరికల చిట్టా విప్పి.. బదులుగా కొట్టే ముష్టి ' మూడ్రూపాల టెంకాయ' నే మంటారో?! దేవుడంతటి వాడే దేవేరులవారి అనుగ్రహంకోసం పారిజాతపుష్పాన్ని సమర్పించుకోవాల్సొచ్చింది.  రాజులనుగ్రహించే  అగ్రహారాల కోసం కాదా కవులు ఏకాక్షులను సైతం ఏకాంబరులతో కలిపి స్తోత్రపాఠాలు వల్లెవేసిందీ?! భూం పుట్టినప్పట్నుంచే బహుమానాలు పుట్టుకొచ్చాయంటారు  పెద్దలు.  ఆదాము అవ్వలచేత సంసారం చేయించడానిక్కూడా సైతానుకి ఆపిల్ పండు చవుఁరొదిలింది మరి! '
'ఆ లెక్కలిక్కడ కుదరువురా తిక్క సన్నాసీ! జనంచాకిరీ చేయడానికని కదా సర్కారు నెల నెలా జీతభత్యాలు ధారపోస్తునదీ? అదనంగా ఈ 'చాయ్ పానీ'లని గుంజటం అన్యాయ మనిపించడం లేదట్రా నీకూ?'
'నూలు పోగైనా అందకపోతే చందమామక్కూడా వెలుగులందించాలనిపించని  రోజులు బాబాయివి!  ప్రభుత్వందలాలకు బల్లకింది చేతులదో రకమైన అందం చందం. 'ఠంచనుగా బడికి పోరా!' అంటే జీళ్లు కొనుక్కోడానికి  డబ్బులిమ్మంటున్నాడు చడ్డీలేసుకోడంకూడా రాని చంటి కుర్రాడివాళా రేపూ. నోరూ వాయీ లేని మూగ గేదైనా  నోటికింత పచ్చిగడ్డందకపోతే పొదుగుమీద వేలైనా వెయ్యనివ్వదు కదా! నోరున్న మనిషి.. అందునా సర్కారు నౌఖరు. నోరు కుట్టేసుకోమంటే దారం దబ్బనం తెచ్చేసుకుంటాడనే?! ఇన్ని నీతులు వల్లేస్తున్నావ్ గానీ బాబాయ్.. నీ నాలిక్కే ఓ బొట్టు తేనెచుక్క అంటిందనుకో..  చప్పుమని  చప్పరించెయ్యకుండా వుండగలవా? నీళ్లమడుగులో చేపలాంటిది బాబాయ్  అధికార పదవి. తడవకుండా చేపెట్లా ఈతకొట్టలేదో.. డబ్బూ దస్కమంటకుండా  అధికారి కూడా తన ధర్మానికి న్యాయం చెయ్యలేడు.'
'ఆహాఁ! ఎంతమోఘమైనా తర్కం లేవదిసావురా బాబ్జీ! మేతగాళ్లను కూడా ఓ గొప్ప సృజనాత్మక కళకారులుగా ఆవిష్కరించిన తమ ఘనతను మెచ్చుకు తీరాల్సిందే!'
‘నీ మెప్పుల మెడల్సు మెడల్లో వేసుకుని డప్పట్టుకొనూరేగాల్సింది నిజానికి నేను కాదు బాబాయ్! ఇక్కడ నయీం తరహా భాయీలతో కల్సి అందినన్ని రాళ్ళు దండుకునే దండనాయకులు.  అక్కడ నయా నయా ప్రాజెక్టులడొంకల్లో దొరికినన్ని  దోరమగ్గిన పళ్లు పోగేసుకునే  సర్కారు దొరలు!  జీతమెలాగూ  చేతికొచ్చేదే. గీతానికే చేతికళలవసరం. వాటిమీదా నువ్విలా  గీతాబోధనలు సాగిస్తే.. సర్కారువారి దస్త్రాలు ఒక్కంగుళమైనా ముందుక్కదలని మొండి రథాలయిపోతాయ్. అమెరికాలాంటి అగ్రరాజ్యాల్లో కూడా పన్లెంతో మందకొడిగా సాగే రోజుల్లో.. మన దగ్గర సర్కారు కార్యాలయాలెంత  మందు దుకాణాల్లా కళకళ లాడేవో తెలుసా నీకు? అందుక్కారణం.. ప్రభుత్వం తాలూకు కామందులవారి  క్కావలసినంత మందు- మాకూ అందుతుండటమే! ఆర్థికరంగం పరిపుష్టి సర్కారు నౌకర్ల ‘ముష్టి’ పన్లమీదే ఆధార పడుండేది.’
'బాగుందిరా బాబూ తర్కం! నీ వాలకం చూస్తుంటే.. సర్కారు మార్కు అక్రమార్జనను కూడా ఏ సవరణలైనా చేసి రాజ్యాంగబద్ధం చెయ్యాలనేట్లున్నావుగా?!'
'సందర్భానికి తగ్గ సూచనిచ్చినందుకు నిన్నభినందించకుండా ఉండలేక పోతున్నా బాబాయ్! అక్రామార్జనను సర్కారుద్యోగుల హక్కుగా గుర్తించి తీరాల్సిందే! సిటిజన్ ఛార్టుల్లో మాదిరి ప్రభుత్వ కార్యాలయాల్లో 'ఈ ఫలానా పనికి పైన ఇంత.. ఆ ఫలానా పనికి అడుగునింతింత'ని  రేట్లు ఫిక్స్ చేసేస్తే..  అస్పష్టత తొలగిపోతుంది. అవాయిడబుల్ పోటీలు.. అన్వాంటెడ్  లిటిగేషన్లతో అయే జాప్యం నివారణయిపోతుంది. ఆదాయానికి మించిన ఆస్తులున్నవారిని గుర్తించి గౌరవిస్తే.. తరువాతొచ్చే తరాలకు   ప్రేరణ కల్పించినట్లవుతుంది. ఆదాయప్పన్ను వెల్లడి పత్రాల్లో  కూడా అదనపు ఆస్తులు ప్రకటించుకునే సంస్కరణలు వెంటనే చేపటాల్సుంది. జీతభత్యాల   తరహాలో గీతభత్యాలమీదా రాయితీలు ప్రకటించాలి. అవినీతి నిరోధక శాఖ, విజిలెన్సు డిపార్టుమెంటులాంటి అభివృద్ధి నిరోధక శాఖలను వెంటనే రద్దు చేసెయ్యాలి.  ఆ ఆఫీసు కార్యాలయాలను సర్కారుద్యోగుల బేరసారాల కేంద్రాలుగా మార్చాల్సుంది వెంటనే.  ఆవినీతి నిరోధక శాఖ సిబ్బందిని నీతి నిరోధక కార్యకలాపాలకు ఉపయోగించుకోవడం ద్వారా  సమస్యలుత్పన్నం కాకుండా చూసుకోవచ్చు. అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరించే పద్ధతిలోనే అక్రమార్జనలనుకూడా సక్రమార్జనలుగా గుర్తించే పథకాలు వెంటనే చేపట్టాల్సుంది. అధికారులు.. ఉద్యోగులు  నానాగడ్డీ కరిచి పోగేసుకొనే సంపదలను దాచుకొనేందుకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో స్వఛ్ఛంద ప్రకటనలు వచ్చే వరకు నల్లసరుకును  భద్రపరుచుకొనేందుకు సర్కార్లే గిడ్డంగులను నిర్వహించాల్సుంది. ఇసుక తవ్వకాల్లాంటి భారీ ప్రాజెక్టుల్లో పోగైన సొమ్ముకా గిడ్డంగులు చాలని పక్షంలో నేలమాళిగలు ఏర్పాట్ల దిశగా  వెంటనే చర్యలు చేపట్టాల్సుంది. లంచగొండులకు తగినంత ధీమా కలిగిస్తే. విదేశాల్లో మూలిగే మన  సొమ్మంతా స్వదేశానికి తరలొచ్చి జాతివనరుల నిర్మాణంలో తనవంతు నిర్మాణాత్మక పాత్ర తప్పక పోషిస్తుంది. ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో ఎప్పుడూ మనదేశం నుంచీ కేవలం ఒక్కరడజను మించి పేర్లు కనిపించక పోవడం  సిగ్గుపడే విషయం. నల్లధనానిక్కూడా చట్టబద్ధత కల్పిస్తే ఒక్క మనదేశంనుంచే ఊరికి వకరడజనుకు తగ్గకుండా  కుబేరులు బైటపడ్డం ఖాయం. ఏమంటావ్ బాబాయ్?'
'నా మనసులోని ముచ్చట బైట పెట్టాలంటే నువ్వు నాకూ ముందొక వెయ్యినూటపదహార్లచ్చుకోవాలంటాను. హ్హాఁ.. హ్హాఁ.. హ్హాం!'

‘!..!..!’
-కర్లపాలెం హనుమంతరావు
((ఈనాడు 18, నవంబరు, 2011లోని సంపాదకీయం పుటలో ప్రచురితం-కొద్ది సవరణలతో) 

Saturday, October 22, 2016

వాడు చెమటోడ్చి ప్రపంచమునకు భోజనము పెట్టు- వానికి భుక్తి లేదు


'పొలాలనన్నీ/హలాల దున్నీ/ ఇలాతలంలో హేమం పిండే' విరామ మెరుగని శ్రామికుడు- కర్షకవీరుడు. 'ఎవరు నాటిరో, ఎవరు పెంచిరో/ వివిధ సుందర తరువుల/ మివుల చల్లని దయాధారల/తవిలి కురిపించి?' అని కృష్ణశాస్త్రి సందేహం. సందేహమెందుకు? ఆ దయామూర్తి నిశ్చయంగా కర్షక చక్రవర్తే! సర్వజీవుల హృదయపూర్వక వందనాలందుకోగల అర్హత అన్నదాతకుగాక మరెవరికుంది? తెలతెలవారకముందే పల్లెకన్నా ముందు లేచిన రైతుకు నులివెచ్చని చలి మంటలు హారతులు పడుతుంటే, చెట్టూచేమా వింజామరలు వీస్తాయి. నాగులేటి వాగునీళ్లు కాళ్లు కడుగుతుంటే,
జామకొమ్మ చిలకమ్మ యోగక్షేమాలు విచారిస్తుంది. పువ్వునూ కాయనూ పేరుపేరునా పలకరిస్తో పొలం పనుల్లోకి దిగే హలంధరుణ్ని సాక్షాత్ బలరాముడి వారసుడిగా ప్రస్తుతిస్తాడొక ఆధునిక భావుకుడు. పాల కంకులను పసిపాపలకుమల్లే సాకే ఆ సాగుదొరను 'ఆకుపచ్చని చందమామ'గా పిలుచుకుని మురిసిపోతాడు ఇంకో గేయకవి- సుద్దాల. 'మట్టి దాహంతోటి నోరు తెరవంగా/ మబ్బు కమ్మీ నింగి జల్లు కురవంగా' వీలు తెలిసి వాలుగా విత్తులు జల్లితేనేగదా పాతరలోని పాతగింజకైనా పోయిన ప్రాణం లేచివచ్చేది! పుడమితల్లి పురిటి సలుపులకు రైతన్న మంత్రసానితనం వల్లనేకదా చల్లంగా సాంత్వన చేకూరేది! కలుపు పెరగకుండ ఒడుపుగా ఏరి అవతల పారవేయడం, బలుపు తరగకుండ తగు ఎరువు తగిన మోతాదులో అందించడం, తెగులంటకుండ ఆకుమళ్లపై పురుగుమందులు చల్లడం, పురుగు  తగిలిన  ఆకులు గిల్లి పారబోయడం, పశువుకు  కంచెలా.. పక్షికి వడిసెల రాయిలా మారి అహర్నిశలు  కాపుకాయడం!  పంట చేతికి దక్కడమంటే చంక బిడ్డను మీసకట్టు దాకా పెంచడంకన్నా కష్టం. కృషీవలుడు అందుకే రుషితుల్యుడు.
అరచేతి గీతలు అరిగిపోయేదాకా అరక తిప్పడం తప్ప మరో లోకం పట్టని ఆ నిష్కాముకత్వం అమాయకత్వం కాదు. నమ్ముకున్న వాళ్లందరికీ ఇంత బువ్వ పెట్టాలన్న అమ్మతనం అదంతా! ఆరు గాలాలూ శ్రమించి పుడమితల్లిని సేవించినా ఫలం అందనప్పుడు తల్లడిల్లేది తానొక్కడికోసమేనా? బిడ్డ ఆకలి తీర్చలేనితల్లి పడే ఆవేదన అది! మట్టితో సాగుబడి బంధం పేగుముడికన్నా బలమైనది. 'ప్రాణములొడ్డి ఘోర గహ/ నాటవులన్ బడగొట్టి, మంచిమా/గాణములన్ సృజించి, ఎము/కల్ నుసి జేసి పొలాలు దున్ని/ భోషాణముల్' జాతికి నింపిపెడుతున్నా సొంతానికి చారెడు నూకలైనా చేటలో మిగలని రైతు దుస్థితికి కలవరపడిన కవులెందరో! 'వాడు చెమటోడ్చి ప్రపంచమునకు భోజనము పెట్టు/వానికి భుక్తి లేదు' అని కవిజాషువాలాగా ఆర్తిచెందిన భావుకులు తెలుగు నేలమీద ఏటుకూరి వేంకట నర్సయ్యనుంచి దర్భశయనం శ్రీనివాసాచార్యదాకా కో కొల్లలు. సింగమనేని నారాయణ అన్నట్లు  నిజానికి 'ఎర్రటి నేలలో నాగలి మొనదించి యుగాలుగా విత్తనాన్ని మొలకెత్తిస్తున్న ప్రతీ అన్నదాతా కవులకు స్ఫూర్తిప్రదాతే. ఆ కర్షకుడి హృదిలోకి జొరబడి, కనుకొనుకుల్లో నిలబడి, కన్నీటికీ పన్నీటికీ కినిసి, మురిసిన దువ్వూరివారైతే ఏకంగా 'కృషీవలుడు' అనే కర్షకకావ్యాన్నేసృజించారు. శాస్త్రవిజ్ఞానం ఎంత శరవేగంగా దూసుకుపోతున్నా సాగుదారుడు లేకపోతే బతుకు బండి ముందుకు సాగదు. ఏడు నక్షత్రాల హోటలు పాయసాల పాలనుంచి.. ఏడడుగులు నడిచే వధూవరులమీద జల్లే తలంబ్రాలదాకా..  అన్నీ అన్నదాత స్వేదయాగ ఫలాలే! ఆకలి తీర్చాల్సిన నేలతల్లి రైతు బతుకుల్ని మింగే రాక్షసబల్లిగా మారుతుండటమే సాగుభారతంలో నేడు నడుస్తున్న విషాదపర్వం.



జీవనదులెన్ని ఉన్నా మాయదారి కరువు పీడిస్తోంది. ఉత్తరానివి ఉత్తుత్తి ఉరుములు, దక్షిణానివి దాక్షిణ్య మెరుగని మెరుపులు. పడిన చినుకులకు ఎడతెరిపి తోచదు. పాలుతాగే చంటిపిల్ల నీటమునిగితే తల్లి కెంత కడుపు కోతో, పంట మునిగిన రైతు కంత గుండెకోత. చేతులారా పెంచుకున్న పంటకు చేజేతులా నిప్పంటించుకున్నా ప్రభుత్వాలకు పట్టటం లేదు.   గోడలేని పొలాలకు గొళ్లేలు బిగించుకున్నా గోడు వినేందుకు ఏ నాథుడూ రాడు. కళ్ళాల దగ్గరేకాదు.. అంగళ్లలో సైతం ఆసరా దొరకదు. నిల్వలకు నీడలేక నడి బజారులో నిండు జీవితాన్ని పొర్లబోసుకుంటున్నాడు నేడు రైతు. ఓటమని తెలిసీ కడవరకూ పోరాడవలసిన కర్ణుడవుతున్నాడు కర్షకుడు. పొలంగుండెలు  తొలుచుకుంటూ పొగగొట్టాలు లేస్తున్నాయి.
పంటచేల కంఠాలకు ఆర్థిక మండళ్ల ఉరితాళ్ల ముళ్లు బిగుస్తున్నాయి. ఉరి రద్దుకు పరితపించే పెద్దలకైనా పట్టదా ప్రాణదాత ఉసురుకు ముంచుకొచ్చే ఆపద?! రైతు చావుదెబ్బ జాతికి శాపం కాదా! వట్టొట్టి సానుభూతి వచనాలు కురవని నైరుతీ రుతుపవనాలు. వేదికలమీది వాదనలు రైతు లావేదనలు  ఆరుస్తాయా.. తీరుస్తాయా? అన్నదాత కన్నీటికి కావాల్సింది ఇప్పుడు చిత్తశుద్ధితో వేసే ఆనకట్ట. ఆ పని వెంటనే ప్రారంభం కాకపోతే ఆ ప్రవాహంలో జాతి మొత్తం కొట్టుకొనిపోయే ప్రమాదం ఆట్టే దూరంలో లేదు. కాడి ఇంతదాకా పడేయక పోవడం సేద్యగాడి చేతకానితనం కాదు. 'కార్తె కార్తె ఓ కన్నీటి బిందువై/ చెక్కిళ్లమీద జాలిగా జారుతున్నా/ ఒక్క వాన చుక్కయినా చాలు/ వచ్చే 'కాఱు'కి 'చాలు'లో విత్తేందుకు చారెడు గింజలైనా దక్కేందుకు' అన్నది అన్నదాత ఆశావాదం. ఏ అమాత్యుల వారయినా సభల సాక్షిగా వల్లెవేసే  మన వ్యవసాయ సంస్కృతిలోని విలక్షణత వాస్తవానికి అదే. 'మూలావర్షం ముంచినా జ్యేష్ఠజల్లు తేలుస్తుంది' అన్న ఆశే అన్నదాతను ఇంకా కాడి కింద జార్చకుండా బతుకీడవనిస్త్తోంది. నూకలు కతికి బతికే జీవులకు బతుకులు మిగులుస్తోంది.
-కర్లపాలెం హనుమంతరావు
***




Friday, October 21, 2016

రాచకులం కన్నా యాచకులం మిన్న- ఈనాడులో ఒకనాటి వ్యంగ్యం



యాచకులు ఎక్కడుంటారో సంపదలు అక్కడ సమృద్ధిగా ఉంటాయంటారు.
భిక్షువులే సుభిక్షానికి ప్రత్యక్ష సూచికలు. కులాల వారీగా అధికారంలో పాలు  దబాయించి మరీ అడుక్కుంటున్న ఈ కాలంలో మా మానాన మేం మౌనంగా 'భిక్షాం.. దేహీ!' అనరుచుకుంటూ తిరుగుతున్నాం. అయినా మా మీదే అందరికీ అనుమానాలు! మాకే ఎందుకో ఇన్నిన్ని అవమానాలు?! పిడికెడు ముష్టికే పాపిష్టి జనాలకి కడివెడంత పుణ్యం సంపాదించి పెట్టడమేనా మేం చేసిన పాపం?
ఆ మాట కొస్తే యాచక భుక్తి భూం పుట్టకముందునుంచీ వస్తున్నదేగా! మా కులదైవం మహాశివుడు ఆది భిక్షువు. ఆ తోలువస్త్రధారి దర్శనంకోసం అలమటించే  భక్తులు సైతం మేం కనిపిస్తే చాలు.. ‘తోలు వలిచేస్తా’మని వెంటబడతారు! సాక్షాత్తూ లక్షీనాథుడై వుండీ  విష్ణుమూర్తి వామనావతారంలో బలిని మూడడుగులు అడుక్కుంటే 'ఆహోఁ! ఏం లీల!' అంటూ ఈలలేస్తారు! మేమేదో మా జానెడు పొట్టకోసం 'భవతీ.. భిక్షాం దేహీ!' అంటూ బజార్న పడితే పెద్ద రాద్ధాంతాలు సిద్ధం చేస్తారు!
ఇంద్రుడినుంచి.. హిరణ్యకశిపుడి వరకు.. దేవదానవులందరూ ఏదో ఓ సందర్భంలో సందు చూసుకొని  చేతులు చాచిన మహానుభావులే కదా! లేనివాడండే అందరికీ లోకువే కానీ.. ఆ దౌర్భాగ్యుడనేవాడే లేకుంటే బలినుంచి.. అంబరీషుడి వరకు.. కర్ణుణ్నుంచి.. దధీచి దాకా 'మహాదాతలనే కీర్తి కిరీటాలు గడించడం సాధించగలిగేవారా? చేతికి ఎముకలేదన్న ఆ ఖ్యాతి మా యాచక వృత్తివల్లనే  కదా సాధ్యమయిందీ?
బిచ్చగాళ్లంటే సర్కారుకైనా లెక్కుండదుకానీ.. నిజాయితీగా గణాంకాలుగానీ సేకరిస్తే  మా యాచ'కుల'దే మెజారిటీ వర్గం.  దామాషా ప్రకారం మా యాచకులే అన్ని చట్టసభల్లోనూ మూడొంతులు మించి ఉండాలి.  ఎన్నికలముందీ  ప్రజాప్రతినిధులంతా మా బిచ్చగాళ్ళ ఓట్లనీ అడుక్కున్న సంగతి అప్పుడే మర్చిపోతే ఎలా?
'అడగనిదే అమ్మైనా పెట్ట'దని మీరే అంటారు.  అడుక్కుంటుంటే 'ఎద్దులా ఉన్నావ్.. ఏదైనా పని చేసుకొని బతకరాదా?' అని ఈసడించుకుంటారు! పంట పొలాలన్నింటినీ కుహనా పరిశ్రమల కప్పనంగా  ధారాదత్తం చేసి ఉన్న దున్నపోతులకీ.. ఎద్దులకే పని.. పాటా లేకుండా చేసారు. మీ మాట విని పాపం ఆ మూగజీవుల నోటికూటిక్కూడా మేం పోటీకి పోనందుకు 'శభాష్' అని భుజం చరిచి మెచ్చుకోడం పోయి ‘శనిగాళ్ల’ని శాపనార్థాలా? చిన్ని కడుపుకోసం మేం పడే పాట్లనిలా చిన్నబుచ్చుతారా? ఎంతన్యాయం?
యాచకత్వాన్నింతగా తక్కువ చేస్తున్నారుగానీ అసలు అడుక్కోవడమెంత గొప్ప కళో ఏ జ్ఞానికైనా తెలుసా? అస్తమానం హస్తిన చూట్టూ కాళ్ళరిగిపోయేట్లు సియం సార్లు ఎన్నేసి సార్లు తిరిగొస్తున్నారు? ఒక్క పథకం.. ప్రాజెక్టు.. నిధి.. నిఖార్సైనది.. ‘ప్రత్యేక హోదా’లో  లేనిది సాధించుకొచ్చారా? ‘పని చేసుకో’మని మాకు ఉచిత సలహాలు దయచేయకుండా మా సలహాలు గానీ చెవినపెట్టుంటే ప్రపంచబ్యాంకునుంచైనా సరే ఎప్పటికీ తీర్చనక్కర్లేని అప్పులు.. కుప్పలు తెప్పలుగా తెచ్చిపడుండేవాళ్ళు కదూ ఇప్పటికే!
పుట్టినప్పట్నుంచీ ముష్టిబొచ్చె పట్టడం తప్ప మరొహటి ఎరగని పరమ వీర ముష్టి చక్రవర్తులు అడుక్కొక అరడజనుకు తగ్గని ఆగర్భ గడ్డ మనది. ఒక్క ముష్టి మేథావి దగ్గరైనా యాచకశాస్త్రంలో సక్రమంగా శిక్షణ ఇప్పించి ఉంటే.. ఉత్తర కొరియావాడి అణుబాంబేంటి.. వాడి బాబు చైనావోడి ‘మేకింగ్ ‘ కళక్కూడా కాపీలు అడుక్కునైనా తెచ్చి పడేసుండే వాళ్ళు కదూ మన  యువనిపుణులు!
పెరటి చెట్లం కాబట్టి మా కళ మీకెందుకూ కొరగాకుండా పోతోంది గానీ.. అమెరికా ఒబామాగారుకూడా మన యాచక నైపుణ్యాన్ని గూర్చి సందర్బం వచ్చినప్పుడల్లా ఆకాశానికెత్తేస్తుండేవారు.
పంచయితీలని, మండలాలని, జిల్లాలని, మంత్రి పదవులని, మంచి అధికార పదవులని, నిధుల్లో కోటాలని, పనుల్లో వాటాలని.. దేనికో దానికి.. ఎవరో ఒకరు.. ఎప్పుడంటే అప్పుడు.. దేవురించడం అధర్మం కాదు కానీ.. ఏదో రోడ్డువారగానో.. గుడి మెట్లమీదనో.. ఇంటి గుమ్మంలోనో.. ఒదిగొదిగి  నిలబడి 'ఒక్క రూపాయి ధర్మం చేయమ'ని వచ్చే పోయే అమ్మలు.. అయ్యలముందు  మేం చేయి చాపి అడగడంమాత్రం అధర్మం! ఏ రాజ్యాంగంలోని సెక్షన్ల ప్రకారం అడుక్కు తినడం శిక్షార్హమవుతుందో తేల్చాలి!
చదువుకున్న బాబుల్లాగా సర్కారు జాబులిప్పించాలని డిమాండ్లేమన్నా చేస్తున్నామా? డబుల్ బెడ్రూం ఫ్లాట్లు కావాలని.. రేషను బియ్యం కోటాలు పెంచాలని.. ధరలమాంతం పాతాళానికి దించాలని.. ధర్నాలేమన్నా చేస్తున్నామా? మగపిల్లకాయల మాదిరి ప్రేమించి తీరాలని యాసిడ్ సీసాల్తో ఆడపిల్లలెంట పడుతున్నామా? శనల్లుళ్లకు మల్లే అదనపు కట్నకానుకలు ముట్టకపోతే కట్టుకున్నదనైనా జాల్లేకుండా గేసునూనెతో కాలుస్తామని అల్లర్లు పెడుతున్నామా? ‘చందా’మావఁలకన్నా.. పార్టీ విరాళాలకు వేధించే యములాళ్లకన్నా.. పనులు తెమలాలంటే 'చాయ్.. పానీ'ల సంగేతేంటని నిలదీసే అవినీతివంతులకన్నా.. చీటికి మాటికి చీకటి మాటున తోటి తల్లులనైనా చూడకుండా ‘చీరలిప్ప’మని చికాకులేమన్నా పెడుతున్నామా? 'మాదా కబళం తల్లీ!' అంటూ మర్యాదపుర్వకంగానే కదా మా దారిన మేం  ఇంటి గుమ్మాలముందు గంటలకొద్దీ నిలబడుతున్నాం?
గొంతెత్తి అరవడం, గొప్పలు చెప్పడం , ఇచ్చకాలు పోవడం, భట్రాజులకు మల్లే  స్తోత్రాలు చదవడం.. యాచకుల నీచలక్షణాలని వెనకటి కెవరో మహానుభావుడు యాచకగుణాన్నిగూర్చి నిర్వచించాడంట! మంచిది. ఆ కొలమానం ప్రకారం చూసుకొన్నా కాన్డబ్బులకోసం జోలట్టుకు తిరిగే మా కుచేలజాతికన్నా ముందుచ్చోది నిత్యం రాజకీయాల్లో నలిగే పెద్దమనుషులేనంటే చిన్నబుచ్చుకోకూడదు మరి!
'సాధు మేధానిధి' అనే శతకంలో పుష్పగిరి అమ్మన అనే పెద్ద పండితుడు - ప్రపంచంలో బిల్ గేట్స్ బికారిలాగాను..  బికారి బిర్లా తాతలాగానూ మారువేషాల్లో తిరుగుతూ మాయ చేస్తుంటారని కుండబద్దలు కొట్టేసాడు. ఏ మాయలు మంత్రాల జోలికి పోకుండా కేవలం పొట్టకూటి కింత ముద్ద కోసం మాత్రమే జోలె పట్టుకొని తిరిగే మేమే ఎన్ని అవమానాలైనా భరించే అమాయకులం.
ఏ అమెరికానుంచి అధ్యక్షులవారో.. బ్రిక్స్  దేశాల్నుంచీ అధినేతలో   వ్యాపారొప్పందాలు అడుక్కునేందుకు  మన దేశానికి ఎప్పుడూ వచ్చి పోతుంటారు.  ఎప్పుడు పడితే అప్పుడు మమ్మల్ని వీధుల్లో కనిపించకుండా దాచేయాలనుకోడం..  చిన్నగాళ్లమనేనా పెద్దబిచ్చగాళ్లముందు మా కిన్నేసి అవమానాలు?! ధర్మం కాదు!
-కర్లపాలెం హనుమంతరావు
(ఈనాడు 24 అక్టోబరు, 2009 నాటి సంపాదకీయ పుటలో ప్రచురితం- చిన్ని సవరణలతో)

 (ఈనాడు యాఅమాన్యానికి- కార్టూనిష్టు శ్రిధర్ గారికి ధన్యవాదాలతో)

Monday, October 10, 2016

గురువు.. దేవుడూ ఒకేసారి కనిపిస్తే..?

'
గురువూ, దేవుడూ ఒకేసారి కనిపిస్తే ముందు నేను గురువుకే నమస్కారం చేస్తాను. దేవుడిని నాకు ముందు చూపించినవాడు గురువే కదా!' అంటాడు షిర్డీ సాయిబాబా. 
యుద్ధరంగం మధ్య విషాదయోగంలోపడ్డ అర్జునుడికి 'సుఖదుఃఖే సమైకృత్వా' అంటూ గీతోపదేశం చేసిన శ్రీకృష్ణుడిని మనం 'జగద్గురువు'గా భావిస్తాం. అద్వైతబోధ చేసిన ఆదిశంకరులు మరో జగద్గురువు.

రాయికి రూపం ఇచ్చేవాడు శిల్పి. శిష్యుడికి రూపం తెచ్చేవాడు గురువు.
'గు' అంటే చీకటి, 'రు' అంటే పోగొట్టేది. అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేవాడు గురువే కనకే, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల తరవాత పూజనీయుడవుతున్నాడు.
గురువును పరబ్రహ్మ స్వరూపంగా సంభావించే సంప్రదాయం మనది.
అధర్వణ వేదంలోని శిష్టాచార సంప్రదాయం
ప్రకారం- చదువుకు కూర్చునే ముందు శిష్యుడు ఇష్టదేవతా ప్రార్థన తరవాత 'స్వస్తినో బృహస్పతిర్దదాతు' అంటూ గురువును స్మరించే విధానం ఉంది.
 మహాభారతం అరణ్యపర్వంలో యక్షుడు 'మనిషి మనీషి ఎలాగవుతాడు?' అనడిగినప్పుడు- 'అధ్యయనం వలన... గురువుద్వారా' అని సమాధానం చెబుతాడు ధర్మరాజు.
అందరూ ప్రణామాలు చేసే ఆ శ్రీరామచంద్రుడు
కూడా విశ్వామిత్రుడి ముందు చేతులు జోడించి నిలబడి ఉండేవాడు.
సమాజంలో గురుస్థానం అంతటి ఘనమైనది కనకనే శ్రీకృష్ణుడు చదువుచెప్పిన సాందీపునికోసం అతని మృతశిశువును తిరిగి తెచ్చి ఇచ్చే శ్రమ తీసుకున్నాడు.

గురువును గౌరవించటం రానివారు జీవితంలో రాణించలేరనటానికి కౌరవులే ప్రబల  తార్కాణం.
చిన్నతనంలో విద్యాబుద్ధులు చెప్పిన గురువును ఔరంగజేబుకూడా చక్రవర్తి అయిన తరవాత దారుణంగా అవమానించాడు.
క్రీస్తు పుట్టుకకు మూడు శతాబ్దాల ముందే మహామేధావి అరిస్టాటిల్‌ ఏథెన్స్‌లో ఒక పెద్ద విశ్వవిద్యాలయన్నే స్థాపించి అలెగ్జాండర్‌లాంటి విశ్వవిజేతను తయారుచేశాడు.
అదేదారిలో చంద్రగుప్తుడిని తీర్చిదిద్దిన మహాగురువు మన కౌటిల్యుడు.
కృష్ణదేవరాయలుకు తిమ్మరుసు మామూలు మంత్రేకాదు, గురువు కూడా.

మనిషి భూమిమీద పడిననాడే బడిలోపడినట్లు లెక్క. ఇంటివరకూ తల్లే ఆది గురువు. తల్లితండ్రులు ప్రేమపాశంచేత కఠిన శిక్షణనీయలేరు గనక గురువు అవసరం కలిగింది. గురుకుల సంప్రదాయంలో మహారాజు కుమారుడైనా కౌమారదశలో గురుకుల విద్యాభ్యాసం చేయవలసిందే!
మహాచక్రవర్తి అయిన హిరణ్యకశిపుడు కూడా చెక్కిట పాలుగారే ప్రహ్లాదుడిని మంచి విద్యాబుద్ధులు నేర్పించమని చండామార్కులవారికి అప్పగించాడు.
పాటలీపుత్రాన్ని ఏలే సుదర్శనుడు తన బిడ్డలు విద్యాగంధంలేక అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉన్నారనే గదా వారిని విష్ణుశర్మ అనే పండితుడి వద్దకు విద్య నేర్చుకోవటానికి సాగనంపింది!

నాటి చదువులు నేటి విద్యలంత సుకుమారంగా ఉండేవికావు. వేదాధ్యయనం తరవాత పరీక్షలు మరింత కఠినంగా ఉండేవి. నింబ, సారసమనే రెండు పరీక్షలు మరీ సంక్లిష్టం. సామవేదం సంగీతమయం. తలూపకుండా వల్లించటం తలకు మించిన పని. బోడిగుండుమీద నిమ్మకాయ పెట్టుకుని అది దొర్లకుండా వల్లింపు పూర్తిచేస్తేనే పరీక్ష అయినట్లు, అది నింబ పరీక్ష. మెడకు రెండువైపులా సూదులుతేలిన నారసంచుల్ని కట్టి సామగానం చేయమనేవాడు గురువు. తల కదిలితే సూదులు నేరుగా గొంతులో దిగుతాయి! అది నారస పరీక్ష.
గురువు మాట వేదవాక్కుగా సాగిన కాలం అది.

మన పురాణాలు, ఉపనిషత్తులు, చరిత్రల్లోనే కాదు- ప్రపంచవ్యాప్తంగా కూడా గురుప్రసక్తి లేని, గురుప్రశస్తి చేయని సంస్కృతులే లేవు.
జార్జి చక్రవర్తి తన కొడుకు 'ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌' చదివే పాఠశాలకు వెళ్ళి కొడుకు ఎలా చదువుతున్నాడో చూడాలని ఉబలాటపడ్డాడు ఒకసారి. చక్రవర్తి వస్తున్నాడని తెలిసి ఆ పాఠాలు చెప్పే పంతులుగారు 'మహాప్రభో! మీరు రావద్ద'ని కబురు చేశాడు. 'ఎందుకయ్యా?' అనడిగితే 'తమరు వస్తే నేను మర్యాదపూర్వకంగా నా తలపాగా తీసి, లేచి నిలబడాలి. ఇంతవరకూ నా విద్యార్థుల దృష్టిలో నేనే పెద్దను. నాకంటే పైన మీరొకరున్నారని తెలిసిపోతే, నా మాట విలువ తగ్గిపోతుంది. అది వారి భవిష్యత్తుకు మంచిది కాదు!' అని విన్నవించుకున్నాట్ట. రాజుగారు మన్నించి అటువైపు వెళ్లటం మానుకున్నారు. అదీ ఆ రోజుల్లో గురువుకిచ్చిన విలువ!

దేవతలకూ గురువున్నాడు బృహస్పతి. రాక్షసులకు శుక్రాచార్యుడు గురువు. మృతసంజీవనీ విద్య అతనికొక్కనికే తెలుసు. కచుడు ఆ తంత్రం తెలుసుకునేందుకే శిష్యరికం చేయటానికి వచ్చి చచ్చి బతికిన కథ మనకు తెలుసు.
'ద్రోణ' పేరుతో గురువులకు ఇవాళ బిరుదులిస్తున్నారు. ఆ ద్రోణాచార్యుడి దగ్గర విలువిద్య నేర్చుకోవాలని తంటాలుపడి భంగపడినా ఆయన పిండి విగ్రహం ముందు పెట్టుకుంటేగాని ఏకలవ్యుడికి ఆ శాస్త్రరహస్యం పట్టుబడలేదు.
బలి అమాయకంగా వామనుడి రూపంలో వచ్చిన
విష్ణువుకు సర్వం ధారబోసే ప్రయత్నంలో ఉండగా, శిష్యవాత్సల్యంతో అడ్డుపడి కన్నుపోగొట్టుకున్నాడు గురువు శుక్రాచార్యుడు.

గురుస్థానం అంత గొప్పది కనకనే మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం దేశాధ్యక్షుడి పదవికన్నా బడిపిల్లలకు పాఠాలు చెప్పటానికే ఎక్కువ మక్కువ చూపుతున్నాడు. ఓ తమిళ పత్రికలో బాలలకు ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో ఓ చిన్నారి 'చిన్నతనంలో మీరు చాలా కష్టాలు పడి ఓ పెద్ద శాస్త్రవేత్త, ఉపాధ్యాయుడు, రాష్ట్రపతి అయ్యారుగదా! మీ విజయానికి కారణం అదృష్టమా?' అని అడిగితే 'అవును. చిన్నతనంలో నాకు మంచి దారిచూపించే ఉపాధ్యాయులు దొరికిన అదృష్టం' అని బదులిచ్చాడు కలాం. అలాంటి గురువుకి నేటి మన సినిమాల్లో పడుతున్న గతిని చూస్తుంటే దిగులు కలుగుతుంది.
'గురువు' అంటే గుండ్రాయి కాదు అంటాడు ఓ సినిమా కవి. కాదు గుండ్రాయే! మనిషి అజ్ఞానాన్ని, మొండితనాన్ని చితక్కొట్టే గుండ్రాయే నిజమైన గురువు. తాను ఆనాడు 'గోడకుర్చీ' వేయించాడు గనకే మనమీనాడు ఓ 'కుర్చీ'లో కూర్చుని గొప్పగా పనిచేసుకోగలుగుతున్నాం.

గురువులు అష్టవిధాలు.
అక్షరాభ్యాసం చేయించినవాడు,
గాయత్రి ఉపదేశించినవాడు,
వేదాధ్యయనం చేయించినవాడు,
శాస్త్రజ్ఞానం తెలియజెప్పేవాడు,
పురోగతి కోరేవాడు,
మతాది సంప్రదాయాన్ని నేర్పేవాడు,
మహేంద్రజాలాన్ని విడమరిచి చెప్పేవాడు,
మోక్షమార్గాన్ని చూపించేవాడు
అని పురాణజ్ఞానం తెలియజేస్తున్నా వాటిని పట్టించుకొనే శిష్యులు ఇప్పుడు లేరు. గురువుకు నామాలు పెట్టే శిష్యులు తయారవుతున్నారు.
దొంగలపాలు కానిది, దొడ్డకీర్తిని తెచ్చేది, పరమ సౌఖ్యానిచ్చేది, భద్రతనిచ్చేది, యాచకులకిచ్చినా రవంత తరగనిది, గొప్ప నిధి అయిన జ్ఞానాన్ని ఇచ్చే గురువును లఘువు చేయకుండా ఉంటేనే ఏ జాతికైనా మేలు జరిగేది.
- కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు, o5-o9-2009)

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...