Tuesday, June 30, 2015

ఇంతకీ ఆ సీసాలో ఏముంది?- చిట్టి సరదా కథ


శిబి చక్రవర్తి గొప్ప దాత. దయా గుణం జాస్తి. ఉశీనరుడు అనే మహారాజుకు కుమారుడుగా జన్మించిన ఇతని చరిత్ర మహాభారతం, రామాయణంలాంటి పురాణాలలో,  బుద్ధుల జాతక కథలోసైతం  పేర్కొనబడింది.
భృగుతుంగ పర్వతంమీద ఓ సారి పెద్ద ఎత్తున యజ్ఞం చేసాడు శిబి చక్రవర్తి. ఎందరో మహర్షులు ఆ యజ్ఞానికి హాజరయ్యారు. అందరికీ ఘనంగా మర్యాదలు జరిగాయి. అందర్నీ గొప్పగా సత్కరించాడు చక్రవర్తి. ఆయన ఔదార్యానికి, దాననిరతికి తాపసులందరూ ఆశ్చర్యపోయారు. శిబి చక్రవర్తి దానశీలతను పదే పదే ప్రజలందరూ ప్రశంసించారు. ఈ వార్త ఇంద్రుడివరకూ వెళ్ళింది. ఆయన చక్రవర్తి ఔదార్యాన్ని పరీక్షిద్దామనుకున్నాడు. ఒక పావురంగా మారాడు దేవరాజు.
రాజుగారు యజ్ఞంచేసే సమయంలో అతని ఒళ్ళోకి  ఎగిరివచ్చి ఆ పావురం మానవభాషలో
'రాజా! నన్నొక డేగ తరుముకొంటూ వస్తోంది! రక్షించు!' అని వేడుకొంది. రాజుగారు 'నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డువేస్తాను. భయపడకు!' అంటూ ఆ పావురానికి అభయమిచ్చాడు.
అదే సమయంలో ఓ డేగ అక్కడికి  ఎగురుకుంటూ వచ్చి మానవభాషలోనే 'రాజా! నా నోటిదగ్గర ఆహారాన్ని దాచెపెట్టాడం రాజుగా నీకు ధర్మంకాదు. పావురాన్ని విడిచిపెట్టు! నేను ఆకలితో చచ్చిపోతే ఆ పాపం నీకు అంటుకొంటుంది' అంటూ వాదనకు దిగింది. ధర్మవర్తనుడైన శిబిచక్రవర్తి డేగ హేతుబద్దమైనవాదనను కాదనలేకపోయాడు. 'పావురానికి సరిపడా ఆహారమే కదా నీకు కావాలి. ఇస్తాను. తీసుకో!' అంటూ అప్పటికప్పుడు ఒక కత్తి, త్రాసు తెప్పించి.. పావురాన్ని ఒక సిబ్బెలో ఉంచి మరో సిబ్బెలో తన శరీరాన్నుంచి కొంత మాంసాన్ని కోసి తూచాడు. ఎంత మాంసం తాచులో వేసినా పావురానికి సరిపడా తూగడమే లేదు! చూపరులందరు ఆశ్చర్యంతో నోటమాట రాకుండా నిశ్చేతనంగా నిలబడిపోయారు. చివరికి రాజుగారే స్వయంగా సిబ్బెలో కూర్చొన్నారు. ఆశ్చర్యం! అయినా పావురాయివున్న సిబ్బె కిందకి దిగనే లేదు!
శిబి ఖిన్నుడవడంచూసి సభలోని విదూషకుడు 'మహారాజా!  మీరు అనవసరంగా వంటినిండా  గాయాలు చేసుకొన్నారు. పావురాయికి సరితూగే సాధనం నా దగ్గర ఉంది' అంటూ అంగీలోనుంచి ఒక సీసాతీసి అందులోని ద్రవాన్ని మూడొంతులు గొంతులో వంపుకొని నాలుగోవంతు మిగిలిన సీసాని త్రాసు సిబ్బెలో వేసాడు. ఆప్పటిగ్గాని పావురం  సరితూగింది కాదు!
ఇంద్రుడు, అగ్ని ప్రత్యక్షమై శిబి అసమాన దానశీలతకు, విదూషకుడి నిరుమానమైన తెలివితేటలకు సంతసించి కోరిన వరాలిచ్చి వెళ్ళిపోయారు.
ఇంతకీ ఆ సీసాలో ఉన్నది ఏమిటి?
పావు.. రమ్!

పావురానికి సరితూగేది పావు రమ్మేగదా!
***
-కర్లపాలెం హనుమంతరావు
(ఎప్పుడో చదివి రాసిపెట్టుకొన్న నోట్ సునుంచి కొద్ది సొంతపైత్యంతో-సోర్సు నోట్ చేసుకోలేదు.. సారీ!)


Monday, June 29, 2015

అలా అయితే మనమే ఒలంపిక్సులో ఛాంపియన్స్!- సరదా గల్పిక


ఏడు దశాబ్దాలు  గడిచిపోయాయి.. దేశం దాస్యం సంకెళ్ళు తెంచుకొని! దాని దుంపతెగ.. ఏడుగురికిమించి ఒలంపిక్సు విజేతలు మన దగ్గర తేలకపోతిరే! నూటపాతిక కోట్లమందున్నాం        జనాభా! ఎందుకూ?  దేశమాత పరువు గంగలో కలుపుతున్నాం అందరం!
ఒలంపిక్సు ఇప్పట్లో లేవే! ఇప్పుడెందుకబ్బా ఈ దెప్పుళ్ళూ! ఉన్నప్రతిభను పట్టించుకోకుండా.. లేనివాటిని.. తేలేని వాటిని గురించి విలపించడం ఈ మద్య మరీ ఫ్యాషనై పోయింది! దేశమాత పరువు పోతోందని బావురుమంటున్నావు గానీ.. ఆ లోటు తీరుస్తున్న మనపాలిటిక్సు పెద్దల్నిమాత్రం  తెగ తిట్టిపోస్తున్నావ్!
క్రీడలలోటును రాజకీయాలు పూడ్చడమా? పెద్ద జోక్!
ఒలంపిక్సులో మన రిలే ఆటగాళ్లెప్పుడూ బొక్కబోర్లా పడుతుంటారని నువ్వేగా తెగ విమర్శిస్తావు! ఆ లోటునిప్పుడు మన రాజకీయవేత్తలు ఎంత వడుపుగా   పూడుస్తున్నారో చూడవా! నెహ్రూజీనుంచి పుత్రిక ఇందిరా ప్రియదర్శిని, ఆ ప్రియదర్శిన్నుంచి బిడ్డ రాజీవ్ గాంధీజీ, ఆ రాజీవ్ జీనుంచి భార్యామణి సోనియమ్మాజీ, ఆ సోనిమ్మాజీనుంచి ఇప్పుడు బుజ్జి రాహుల్ బాబూజీ.. ఇలా ఐదు తరాలబట్టీ ఆ   ‘జీ’ళ్ల ఫ్యామిలీనే అధికార మంత్రదండం  రిలే పరుగులతో ఎలా 'చేతులు' మార్చుకొంటూ నెట్టుకొస్తుందో నీకు పట్టదు! ప్రపంచంలో ఎక్కడైనా మరీ ఇంత కట్టుదిట్టమైన రిలేపరుగులు నడుస్తున్నాయా నువు చెప్పు!
ఓహో!.. అలాంటి క్రీడలా బాబూ తమరు చెప్పేది! ఆ ఆట ఇక్కడ మన తెలుగురాష్ట్రంలోకూడా  ఆడనివ్వడంలేదనేగా  జగన్ బాబు అలక పానుపెక్కింది!
ప్రస్తుతానికి ఆ టాపిక్కు అప్రస్తుతంలే! ట్రాకు తప్పితే నాకు  టాకు కష్టమవుతుంది.  ముక్కూమీదా మూతిమీదా రక్తాలు కారేటట్లు గుద్దుకునే మీ బాక్సింగూ ఓ
క్రీడేనంటావా? దెబ్బంటే కంటికి కనపడకుండా పడాలి! మూడో కంటికి తెలీకుండా మట్టి కరవాలి! చేతికి మకిలంటకుండా గొయ్యి తియ్యాలి. ఏ క్రిమినల్ సెక్షన్లకందకుండా క్షురకర్మకాండమొత్తం గమ్మున  కానివ్వడంలోనే ముష్ఠికళంతా బైటపడాలి. అలాంటి క్రీడానైపుణ్యం కోకొల్లలుగా ఉన్నా మన రాజకీయనేతల్ని నువ్వేనాడన్నా  నోరారా 'శభాష'న్నావా? ఏడుపదులు దాటిన ఎవడో మూడుకాళ్ల ముసలిడొక్కు గుర్రపుస్వారీ కళలో తెగ మెప్పించేసాడని డప్పుకొడుతున్నావ్ గానీ, కాటికి కాళ్లు చాపీ.. ఒంట్లో ఓపిక లేకపోయినా.. వృద్దపితామహులు ఎందరో వళ్ళు తూలుళ్ళనుకూడా లెక్కచేయకుండా వణుక్కుంటూ వణుక్కుంటూ రాజకీయాలను ఎంత కళగా నెట్టుకొస్తున్నారో! వాళ్లనొక్కమారైనా నోరారా పొగిడిన పాపాన పోయావా? మనదేశ పతాకం లండన్లో ఎగిరినా, లడక్లో గింగిరాలు కొట్టినా  నీ వళ్లోకేమీ బంగార్రాసులు  వచ్చి రాలవుగదా సోదరా! సర్కారువారి బుగ్గకారు నీ కొచ్చి.. దానిమీదగానీ నీ పార్టీజెండా ఎగురుతుంటేనేగదా దర్జా.. దర్పం! బోడి  ఒలంపిక్సు రికార్డులకోసం అంతలా కొట్టుకు చావడ మంతవసరమా? నీ కన్నా ఖిలాడీగాడెవడో వచ్చి నీ రికార్డులుగట్రా  బద్దలుకొట్టేస్తే నీ ఆట శాశ్వతంగా కట్టయి పోయినట్టేగదా! అంతమాత్రం దానికి ఇన్ని అష్టకష్టాలు దేనికి.. ఆలోచించవా? నీ కన్నవాళ్ల చేతుల్లో ఎన్ని వందల బంగారు పతకాలైనా పొయ్యి.. ఒక్క ఎమ్మెల్యే టిక్కెట్టుకి అవేవీ ఎప్పటికీ సాటిరావు. మెడలు ఇరగ్గొటుకొని  వంద మెడల్సు నువు సాధించినా సర్కారుపెద్దలు దయతలిస్తేనేనబ్బా  రొక్కమైనా.. శివార్లలో భూమిస్తానన్న హామీ ఐనా నీకు దక్కేది! అదే నీకు నువ్వే ఓ ప్రజాప్రతినిధివయావనుకో! వయా ఎమ్మేల్యే సీటు రూటులో కోట్లక్కోట్లు  ఎవరి దయాదాక్షిణ్యాలతో పనిలేకుండానే కుమ్మేసుకోవచ్చు!  రకరకాల పతాకాలు మన ఇందిరాపార్కుదగ్గరి   ధర్నాచౌకులో రోజూ రెపరెపలాడుతుంటాయ్..  మరి దేనికోసమంట?!
నీ ఒలంపిక్సులో ఓ పక్షం రోజులే జెండా పండగ.   మన రాజకీయాల్లో రోజూ జెండాల పండుగే!  అక్కడి ఆటలు మొత్తం కలిపి కూడినా ఓ మూడొందలు మించుండవు మహా. అదే మరి మన రాజకీయాల్లోనో? రోజుకో కొత్తరకం ఆట! ఒలంపిక్కు ఆటల్ను అటల్బీహారీబాజ్పాయి ఇప్పుడున్న స్టేజిలోకూడా ఒంటిచేత్తో ఈజీగా  నిర్వహించేసవతల పారేయవచ్చు. పాలిటిక్సుక్రీడల  నిర్వహణకి ఎంత పరిణితి  అవసరం? అధిష్ఠానం కనుసన్నల్లోనే కదులుతుండాలా! తనదైన శైలిలో వ్యూహాలకు పదును పెడుతుండాలా!  కుంగ్ఫూలూ, కరాటేలూ, పంచిలూ, ఫెన్సింగులంటూ ఏవో నాలుగు బోర్డ్లు ఎవరెవరో మెళ్ళకు తగిలించేసుకొని బోరవిరుచుకోంగానే వాటికి నువ్వింతగా హారతులు పడుతున్నావే! అంతేలే! పెరటిచెట్లు మందుకు పనికిరావన్నట్లు .. మన రాజకీయక దిగ్గజాలు దుగ్గూదూగర్లా  నీకంటికానరు! నీ ఒలంపిక్సు  నాలుగేళ్ళకొక్కసారొచ్చి పోయే కొక్కిరాయి సంబడం. భూమి పుట్టకముందునుంచి ఉందబ్బా  మన భారతీయుల రాజకీయ క్రీడావైభవం!
ఒలంపిక్సులో నువ్వెంత ఒళ్ళిరుచుకొని నైపుణ్యం చూపించినా చివరకు దక్కేది
ఒక్క బంగారబ్బిళ్లేరా! అదే మన రాజకీయాల్లో?  వడుపు చూపి ముందుక్కదిలివానుకో..   వళ్లుకందకుండానే కిలోలకొద్దీ  బంగారం కందకాల్లో దాచుకోవచ్చు!  ఒలంపిక్కా?.. వాన్ పిక్కా? అని నీకింకా సందేహమేనందువా?
సందు లేకుండా వాయగొడుతున్నావ్! ఇహ సందేహమెందుకుంటుందులే!  అయితే అసలు సిసలు   ఆటలన్నింటినీ అటకెక్కించాల్సిందేనంటావ్ నువ్వు?!
మరి! నీ మాయదారి ఆటల్లో మ్యాచ్ ఫిక్సింగు పీడా ఒకటి! ఆ ముద్ర ఒక్కసారి పడిందనుకో.. ఆటగాడి లైఫుగాడీ పర్మినెంటుగా షెడ్డుపాలు! అదే తంత్రం రాజకీయాల్లో వడుపుచూసి వదిలావనుకో.. పదవులే పదవులు! కోట్లే కోట్లు! సంపదే సంపద! అవినీతిని కడిగిపారేస్తానన్న మీ అన్నాహజారేనే ఒకదశలో రాజకీయక్రీడలమీద తెగ మోజు చూపించాడబ్బా! పొలంబాట.. బడిబాట.. బస్తీబాట.. పాట ఏదైనా అదంతా రాజకీయాల్లో ఒక కొత్తరకమైన ఆటేరా బుజ్జికన్నా! వయసుతో నిమిత్తం లేకుండా పెద్ద పెద్ద వృద్ధనేతలుసైతం  పాదయాత్రలుకు ఎందుకు  ‘సై’ అంటారంటావ్?
    ఆ మారథాన్ మూలకంగా  ఆరోగ్యం బాగుపడుతుందనీ!
అమాయకుడా! నువ్వు బాగుపడవురా ఈ జన్మకింక! మూలబడ్డ పొలిటికల్ బతుకుబండిని మళ్ళీ రోడ్డుమీదకు లాగాలని..  జనంమధ్య మహారాజులా మళ్ళా ఊరేగాలని ఆ ఉబలాటమంతా! ఒలంపిక్సు నడిచే నాలుగురోజులేగా జనంనోళ్లలో నీ చాంపియన్ల పేరు తెగ నలిగేది! అదే రాజకీయాల్ని నమ్ముకొన్నావనుకో! రోజూ మీడియాలో డబల్ రోస్టు పెసరట్ విత్ అల్లం ఉల్లి పేస్టు! అమ్ముడుపోతూ బైటపడితే   ఆటగాడి బతుకింక చాకిరేవుబండమీది చింకిపాత సామెతే! అదే రాజకీయక్రీడల్లో?  అమ్మకం గ్లామరుకు గుర్తు. ఆనక పదవికి  పైపదవికి ప్లస్సు. ఇహ ప్రచారానికైతే   ఉండదు కానీ ఖర్చు!
ఐనా కానీ మన రాజకీయనాయకులమీద నాకింకా  ఎందుకో ఏమాత్రం నమ్మకం,  గౌరవం కలగడం లేదు బాబాయ్!
వాళ్లనలా వదిలేయవోయ్! ఒలంపిక్సులో పతకాలు రావడంలేదనేగా పదిరోజులబట్టీ శతకాలు చదువుతున్నావ్!  నీ కోరికతీరే దారొకటుంది.. చెప్పనా! పెద్ద పెద్ద ఆటగాళ్ళకు బదులుగా  మన సగటు నగరం ఓటర్లలో ఎవర్నైనా ఒలంపిక్సు గోదాలోకి దింపి చూడు! స్వర్ణాలకు స్వర్ణాలే స్వర్ణాలు!  వాటికవే దొర్లుకుంటూ మెళ్లోకొచ్చి పడతాయ్!  మరి దానికేమంటావ్?

అదెలాగా?!
వెయిట్ లిఫ్టింగు పోటీలకు గ్యాసుబండల్ని అవలీలగా మోసే  మీ పక్కింటి పిన్నిగారిని పంపరా! దూదిపింజల్లా ఆ బరువుల్నెత్తవతల పారేయకపోతే నా నెత్తిమీద ఓ బండేసి మొత్తరా! మన భాగ్యనగర రహదార్ల గోతుల్ని దాటివెళ్లే వాళ్లెవర్ని ఎన్నికచేసి పంపించినా చాలు..  పోల్ జంప్ ఈవెంటులో పోలెండు రికార్డు బద్దలవడం ఖాయం. బస్సులమీదా, వేదికలమీదా రాళ్లు విసిరే బాపతు  అనుభవం.. డిస్కస్ త్రో ఈవెంటుకి కలిసొచ్చే నైపుణ్యంరా బాబూ! స్కూలు బస్సుల వెనకాల పరుగెత్తే బడికెళ్లే బుడతళ్ళు ఎంత లావు 'బోల్టు'నైనా పరుగుపందెంలో  పల్టీ కొట్టించెయ్యగలరు. ఎలాగూ మనకు మోదీజీ ఉండనే ఉండె! యోగా మోడల్లో ఒలింపిక్   క్రీడల్లో  రాజకీయాలుకూడా   చేర్చేట్టు చూడు! రాబోయే  ఒలంపిక్సులో బంగారం పతకాలన్నీ మనవే! దానికేగా నీ ఏడుపు!
***

-కర్లపాలెం హనుమంతరావు
(ఈ నాడు - ఆగస్టు 14-2012 దినపత్రికలో ప్రచురితమైన దానికి చిరుసవరణలతో)





Saturday, June 27, 2015

మనలో ఒకడే- కానీ లక్షల్లో ఒకడు! -వీడియో

https://www.blogger.com/video-thumbnail.g?contentId=1e11639b20e60a99&zx=u5qw4hctm1de

తెలివి తేటలు ఒకరి సొత్తు కాదు.
అవి కులాన్ని బట్టో , మతాన్ని బట్టో వచ్చేవి  కాదు .
మనిషి పరిసరాల ప్రభావాన్నుంచి తప్పించు కోలేడు.
ఈ పసివాడి ప్రతిభ సమాజాన్ని ఎన్ని రకాలుగా ప్రశ్నిస్తున్నదో చూడండి
పని మీద అర్జంటుగా పోతున్నప్పుడో 
తోచక అలా ఏ ట్యాంక్ బండ్ మీదో షికారుకు వెళ్లినప్పుడో,
ఆదివారం పూట సినిమా హాలు బయట బ్లాక్ లోనయినా సరే టిక్కెట్ కొని సినిమా చూసి తీరాలనో తహ తహ లాడే వేళ
తలెత్తి ఒక్కసారి చుట్టూ చూస్తే
ఇలాంటి ప్రతిభ కారు అద్దాలు తుడుచుకుంటూనో
చెప్పులు పాలిష్ చేసుకుంటూనో,
చెత్త కాగితాలు ఏరుకుంటూనో
మనల్ని
మన మానవత్వాన్ని వెక్కిరిస్తూ కనిపిస్తుంది.
ఒక్క రూపాయో,
పండో వాడి చేతిలో పెడితే మన అహం చల్లారుతుందేమో కానీ 
అది వాడి పికిలిపోతున్న బతుక్కి ఒక్క టాక లెక్కకయినా సరిపోదు.
ఎవరు చేసిన పాపానికో శిలువను మోసే ఈ  బాల ఏసులు
మన చుట్టూ మసులుతున్నంత  కాలం  
సంక్షేమాన్ని గుర్చి ఎన్ని గొప్పలు చెప్పుకున్నా అవన్ని
వట్టి పిట్టల దొరకబుర్లే!   

Thursday, June 25, 2015

తెలుగు పత్రికలు అప్పుడు- ఇప్పుడు- వ్యాసం


1976లో తన మూడు దశాబ్దాలు’ సంపాదకీయాల సంకలనానికి ముందుమాట రాస్తూ నార్ల వెంకటేశ్వరరావుగారు ‘‘కారణాలేవైనా నేటి సంఘంలో సంపాదకునికి, అతడి సంపాదకీయాలకు పూర్వపు గౌరవప్రతిష్టలు లేవు. నా జీవితకాలంలో సంపాదకుని ప్రతిపత్తి ఇంతగా దిగజారిపోవడం నాకు మరింత బాధాకరం." అన్నారు . మరి నలభై ఏళ్ళతర్వాత పత్రికారంగంలో ఇప్పుడు సంభవిస్తున్న ఈ విపరిణామాలకు వారు సజీవంగా వుండివుంటే ఏవిధంగా స్పందించి వుండేవారో!

దేశంలో మరే ఇతర భారతీయ భాషాపత్రికలకు తీసిపోని రీతిలో తెలుగుపత్రికారంగం ఈనాడు వెలుగొందుతోంది. సంతోషమే !
హిందీ పత్రికలు చదివే రాష్ట్రాల సంఖ్య ఎక్కువ. కాబట్టి సహజంగానే వాటి చలామణీకూడా (సర్క్యులేషన్) ఎక్కువ. దక్షిణాది పత్రికల పురోగతి మొదలయింది గత మూడు దశాబ్దాలనుంచే.
గతంలో మలయాళ, తమిళ పత్రికలు తెలుగుపత్రికలకన్నా ఎక్కువ ప్రతులు అమ్ముడయేవి. కానీ ఇవాళ మలయాళం తర్వాత తెలుగు ఆ స్థానం ఆక్రమించింది.

క్రియాశీలకంగా, సృజనాత్మకంగా, రంగుల హంగులతో ఆకర్షణీయమైన లే-అవుట్లతో, స్పష్టమైన  ఛాయాచిత్రాలతో, ఆసక్తికరమైన శీర్షికలతో చొచ్చుకొనిపోతున్న పత్రికలలో ప్రథమ స్థానం ఇప్పుడు దేశవ్యాప్తంగా చూసుకున్నాతెలుగుపత్రికలదే! మండలస్థాయి  విలేకరులున్న పత్రికలు కూడా తెలుగువారివే. దేశంలో ఎక్కడాలేని విధంగా రాజకీయాలను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నవీ తెలుగు పత్రికలే. శాసనసభల్లో చాలా సందర్భాల్లో తెలుగు పత్రికలు ప్రదర్శింపబడుతూ చర్చలు కొనసాగడం, వార్తా పత్రికల కథనాలతో ఎందరి రాజకీయ ప్రముఖుల  జీవితాలో మలుపులు తిరగడం మనం తరుచుగా చూస్తున్నతతంగమే! తాజాగా జరుగుతున్న ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగులలో సైతం పత్రికల పాత్ర కొట్టొచ్చినట్లు కనిప్సిస్తున్నది కదా! గతం లోకూడా మన
తెలుగు వార్తాపత్రికలు ఇలాంటి క్రియాశీలక పాత్రనే పోషించాయా? అంటే  లేదనే చెప్పాలి. ఈ రెండు దశాబ్దాల మధ్యకాలంలో పత్రికారంగంలో వచ్చిన మార్పులను తులనాత్మకంగా బేరిజు వేసుకున్నప్పుడు మనమీ నిర్ధారణకే రాకతప్పదు.

ఐదు దశాబ్దలకిందట పత్రికల నిర్వహణలో వృత్తి ధర్మం కాకుండా, ఉద్యమస్ఫూర్తి ఊతంగా ఉండేది. ఇప్పుడు వృత్తిధర్మం స్థానే వ్యాపారపోకడలు పెరిగి పోయాయి. సామాజికసేవ స్థానంలో రాజకీయ, ఆర్థికప్రయోజనాలు స్థిరపడ్డాయన్న విమర్శలో నిజం  లేకపోలేదు. మేమిచ్చినవే వార్తలు.. మాకు వీలుకుదిరి పంపినప్పుడే మీరు పత్రిక చదవాలి - అనే పాతధోరణి పూర్తిగా మారిపోయింది. అభివ్యక్తీకరణలో భావానికన్నా ఆకర్షణకే భాష ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం నేర్చుకుంది. . ఈ క్రమంలో తెలుగులో తెలుగుతనం తగ్గిపోతున్నదనే విమర్శా ఉంది. అందులో కొంత వాస్తవమూ వుంది.
విద్యకోసం, సామాజికపరమైన అవగాహనకోసం అనే పరిస్థితి దాటి వినియోగం, వినోదం, వాణిజ్యంవంటి కోణాల్లో  పత్రికలు రూపుదిద్దుకుంటున్నాయి. ఒకప్పుడు ఆదివారం అనుబంధం అంటే కళ, సాహిత్య, విజ్ఞాన, సాంస్కృతిక వేదిక. ఇప్పుడు వినియోగదారుడి కరదీపిక. పాఠకుల ఆకర్షణకు  నిడివితక్కువ శీర్షికలు, కంటికింపైన రంగులు, అంత్యప్రాసలతో కూడిన భాష  తయారయ్యాయి. కించిత్ అశ్లీలం కూడా చోటు చేసుకుంటున్న సందర్భాలు లేకపోలేదన్న విమర్శలూ కద్దు.డైనమిగ్గానో డైనమోట్ గానో వుంటేనేతప్ప ఇప్పుడు పత్రిక బ్రతికి బట్టకట్టలేదన్న మాటలో ఆవగింజంతయినా అతిశయోక్తి లేదు.

పత్రికలు, అవి ప్రచురించే పుటలు, అంశాలు, అమ్ముడయ్యే ప్రతులసంఖ్య పెరగడం విశేషం. ఐదు దశాబ్దాలకిందట లక్షప్రతులంటే గగనకుసుమంగా ఉండేది. మూడు దశాబ్దాలకిందట మలయాళ మనోరమ ఐదులక్షల సర్క్యులేషన్ని గొప్పగా చెప్పుకునేది. ఇవాళ తెలుగులో రెండు పత్రికలకు పదిలక్షలకుమించి సర్క్యులేషన్ ఉందని 'ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్' (ఎ.బి.సి) వెల్లడిస్తోంది. ప్రచురించే అంశాలకన్నా అమ్మకాల్లో పాటించే నైపుణ్యమే పత్రికల విజయానికి కీలకాంశం అవుతున్న రోజులు ప్రస్తుతం నడుస్తున్నవి.

దేశంలో ఏ భాషలోలేని రీతిలో మండలస్థాయిలో విలేక్రులను కలిగి ఉండడం తెలుగు పత్రికల ప్రత్యేకత. విలేకర్ల విధులలో స్థానికవార్తలు పంపడమేకాక, పత్రిక అమ్మకాలు, వాణిజ్య ప్రకటనల సేకరణా అదనంగా వుండటం ఒక వాస్తవం. ప్రజాస్వామ్యస్ఫూర్తికి ఆలవాలమైన వికేంద్రీకరణ విధానానికి అనుగుణంగానే నేడు ప్రతీపత్రికా జిల్లా అనుబంధాలనూ ప్రత్యేకంగా ప్రచురిస్తున్నది. ఈ పరిణామాల కారణంగా పత్రికలకు ఆర్థిక వనరులు పెరగడం ఒక లాభమయితే,  విమర్శల తాకిడి పెరగడం ప్రతికూల అంశం.

ఒకప్పుడు సినిమా వార్తలు కావాలంటే ఆదివారందాకా వేచి ఉండే పరిస్థితి. ఇవాళో? ప్రతి దినపత్రికా సినిమా విశేషాలకోసం ఒకటో రెండో  పుటలు కేటాయించడం కొత్త పరిణామం. కొన్ని దినపత్రికలైతే ప్రత్యేకంగా సినిమా ఎడిషన్లనే ప్రారంభించాయి . చిత్రప్రముఖుల రాజకీయ
రంగప్రవేశం కారణంగా సినీవిశేషాలు  వార్తలుగా మారి తొలిపుటదాకా తోసుకురావడం  సహజమైపోయింది. బాలలకోసం ప్రత్యేకంగా పత్రికలు నడిపే అవసరం లేకుండా దినపత్రికలే ఆయాఅంశాలనుకూడా ఇవ్వడం మరో చెప్పుకోదగ్గ మార్పు.
ఇక ఆదివారం సంచికలు వారపత్రికల సైజులోకి మారడంతోపాటు అందులోని అంశాలూ ఒకనాటి వారపత్రికల చట్రంలో ఒదిగిపోవడం ఇంకో విశేషం. గతంలో దినపత్రికలంటే డెమీ సైజు, వారపత్రికలంటే 1/4 డెమీ, మాసపత్రికలంటే 1/8 డెమీ అనేదే అలవాటయిన లెక్క. కానీ నేడు దినపత్రికలే కొన్ని పుటలు డెమీ, మరికొన్ని పుటలు 1/2 డెమీ,  1/4 డెమీ సైజుల్లో ప్రచురిస్తున్నాయి.

పత్రిక అనగానే ఒకప్పుడు ఆ పత్రిక సంపాదకుడు గుర్తుకు వచ్చేవారు. కానీ ఇవాళ ఆ పత్రిక యజమాని ముందు  గుర్తుకు వస్తున్నారు. గతంలో ఆంధ్రపత్రికను కాశీనాథుని నాగేశ్వరరావుపంతులుగారు అమృతాంజనం లాభాలతో, గృహలక్ష్మి పత్రికను డాక్టర్ కె.ఎన్. కేసరి లోధ్ర అమ్మకాలతో, కిన్నెర సంపాదకుడు పందిరి మల్లికార్జునరావుగారు రీటావ్యాపారంలోని మిగులుసొమ్ముతో నడిపితే..  నేటి కొన్ని పత్రికలు లాభాలకోసమే నడపబడుతున్నాయనేది ఒక విమర్శ. వ్యాపారానికి  తగ్గట్టుగానే పత్రికలు వార్తాంశాల్ని ఎంపిక చేసుకోవడం, అలంకరించడం జరుగుతోంది. సంపాదకుడిస్థానం కుంచించుకుపోవడం  దురదృష్ట పరిణామం. గత పది, పదిహేనేళ్లబట్టి క్రమంగా పెరుగుతూ వస్తున్న టి.వి చానళ్లు, వార్తాచానళ్లు తెలుగు పత్రిక
మనుగడనుకూడా గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయన్నది క్షేత్రస్థాయి వాస్తవం . ఎప్పటికప్పుడు సంభవించే విశేషాలను వార్తలైనా కాకపోయినా మసాలా దట్టించి మరీ వడ్డిస్తున్న ఛానళ్ల పోటికి దీటుగా 'ఏం చెయ్యాల'న్న మధనలో పత్రికలూ కొంతకాలం నలిగినా క్రమక్రమంగ పరస్థితి తేటపడిందనే చెప్పాలి. సంఘటనల వెనుక ఉండే నేపథ్యాలను వివరణాత్మక కథనాలుగా అందించటం నేటిపత్రికల విధానంగా మారింది. ఆ కథనాల ఆధారంగా చర్చలు కొనసాగించడం టి.వి చానళ్ల వంతయింది. వార్తాఛానళ్ళు అప్పటికప్పుడు ఇచ్చే పొట్టివార్తల ఆధారంగా
విస్తృతకథనాలు సిద్ధంచేసుకోవడం పత్రికలకు పెద్దసవాలే. అనివార్యంగా టి.వి చూడక తప్పని పరిస్థితి- పాత్రికేయుల, సంపాదకుల మేధో, సృజనాత్మక సామర్థ్యాల విస్తృతికి పెద్ద అవరోధంగా మారటం అభిలషణీయమైన పరిణామం కాదు.
పత్రికా రంగంలో కంప్యూటర్, ఉపగ్రహం వంటి వెసులుబాట్లతో తాజా వార్తలు తెల్లవారుజాముదాకా ఇవ్వవలసిన పరిస్థితి పాత్రికేయుల మానసిక శారీరిక ఆరోగ్యాలని దెబ్బతీసే ప్రతికూల అంశం . ఆసక్తితో, ఆర్తితో సమాజానికి ఏదో చేయాలనే తపనతో తక్కువ జీతానికైనా పాత్రికేయులుగా ప్రవేశించాలనుకునే వారి సంఖ్య నేడు క్రమంగా తగ్గుతూ వస్తుంది . బాగా జీతాలు ఉన్న వృత్తులలో ఇప్పుడు జర్నలిజం కూడా ఒకటి అని ఒప్పుకోవాలి. అయితే వేతనాలు పెరిగుతున్న స్థాయిలో మేధస్సు, సృజన, భాష, శైలి పెరుగుతున్నాయా అంటే అవునని కచ్చితంగా చెప్పే పరిస్థితి లేదు. ఇది ఒక్క తెలుగు పత్రికా రంగం ప్రత్యేక పరిస్థితేమి కాదు.దేశమంతటా పత్రికా రచనల స్థాయి ఒకేలా తగ్గుతూ రావటం గమనించవచ్చు. దీన్ని వాంఛనీయ పరిణామంగా కాక ఒక అనివార్యమైన పరిస్థితి గా అర్ధం చేసుకోవాలి . తమ యజమానులకు దోహదపడేవి , తమ ఉద్యోగౌన్నత్యానికికి తోడ్పడే వాదనలనే సమాజాని క వసరమైన ఔషధాలుగా పత్రికా ప్రముఖులు ముందుకు తీసుకుని రావడానికి సిద్ధమవడం ఒక ప్రమాదకరంయిన విపరిణామం. పాత్రికేయులకు సంబంధించి రకరకాల అవినీతి ఆరోపణలు తరుచుగా వినబడుటానికి పవిత్రమయిన పాత్రికేయ వృత్తిని స్వలాభం కోసం వాడుకోవాలనుకునే ప్రబుద్ధులు ఎక్కువవటమే ముఖ్యమయిన కారణం. కేవలం వార్తను నివేదించే పాత్రికేయుడే ఈ స్థాయిలో ఉంటే ఇంక యజమాని గురించి చెప్పనే అక్కరలేదు. సమాచార హక్కు పరిధిలోకి మీడియా సంస్థలను, వ్యక్తులను కూడా తీసుకురావాలని ఒక వర్గం బలంగా వాదించటానికిదే ప్రధాన కారణం .
పత్రికారంగం ఇంతగా విస్తరించినా, సమాజంపై ఇంతబలమైన ప్రభావం చూపిస్తున్నా దానికి దీటైన స్థాయిలో పాత్రికేయశాస్త్రం తెలుగులో అభివృద్ధి చెందక పోవటం విచారించవలసిన విషయం. పాత్రికేయులకు అవసరమైన సమాచారగ్రంధాలు గతపదేళ్లకాలంలో కొన్ని వచ్చాయి. అంతకుముందయితే అటువంటి సౌకర్యాలే బొత్తిగా ఉండేవి కావు.  విద్యాపరంగా తగిన సౌకర్యాలు లేకుండా సగటు యువకుడు పాత్రికేయుడుగా ఎదగటమంటే సామాన్యమయిన వ్షయం కాదు. ఈ మధ్య కాలంలోనే పట్టభద్రుల స్థాయిలో పాఠ్యాంశంగా జర్నలిజం బోధించాలనే ప్రయత్నాలు విశ్వవిద్యాలయాల్లో ఊపందుకున్నాయి . జర్నలిజం అభ్యసించిన ఎంతోమంది పాత్రికేయ వృత్తిలో ప్రవేశించకుండా ప్రజాసంబంధ అధికారులుగానో,  ఈవెంట్ మేనేజర్లుగానో  స్థిరపడిపోవడం, పాత్రికేయవృత్తిని పక్కనపెట్టి వ్యాపారరంగంలో ప్రవేశించడమో గమనార్హం. ఈ ఐదుదశాబ్దాల్లోనే ఆంధ్రపత్రిక, ఆంధ్రసచిత్ర వారపత్రిక, భారతి, యువ, జ్యోతి, సినిమారంగం, విజయచిత్ర, ఉదయం సంస్థ పత్రికలు, సినీ హెరాల్డ్, ఆంధ్రప్రభ వారపత్రిక, ఆదివారం.. ఇలా ఎన్నో పత్రికలు మూతపడ్డాయి. ఇప్పుడు నడుస్తున్న పత్రికలన్నీ దాదాపు ఈ ఐదు దశాబ్దాలలో ప్రారంభమయినవే. అలాగే ఒకప్పుడు తెలుగువారు ఆంగ్ల పత్రికారంగంలో రాణించిన మాట వాస్తవం. కానీ నేడు ఆ స్థాయిలో తెలుగు వెలుగులు దేశ వ్యాప్తంగా ప్రకాశిస్తున్నాయా అంటే లేదనే సమాధానమే  వస్తుంది.

పత్రికలను కూడా సమాజానికి బాధ్యులను చేసే కొన్ని ప్రయత్నాలు ఈ మధ్య ఊపందుకు కొన్న మాట నిజమే! టైమ్స్ ఆఫ్ ఇండియా అంబుడ్స్‌మన్ వ్యవస్థను ప్రారంభించి కొంతకాలం కొనసాగించింది. హిందూ దినపత్రిక రీడర్స్ ఎడిటర్‌ను, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దినపత్రిక కరెక్షన్స్ ఎడిటర్‌ను ఈ విధానం లో భాగంగానే నియోగించాయి. ఏ తెలుగు దినపత్రికా ఈ దిశలో ప్రయత్నించక పోవటం గమనించదగ్గ అంశం.  తొలిపుట మొత్తం ప్రకటనలకు ఇవ్వడంవంటి వాణిజ్యపోకడలను ఆంగ్ల పత్రికలనుంచి ఇష్టంగా అందిపుచ్చుకున్న తెలుగు పత్రికలు ధరల తగ్గింపువిషయలో మాత్రం ఆ స్థాయిలో స్పందించక పోవటం మన పత్రికల వ్యాపార పోకడలక్ అద్దం పడుతున్నాయి.

వడివడిగా సాగిపోయే చరిత్రని వడిసిపట్టుకుని, నమోదుచేసే బృహత్తరమయిన పాత్ర పాత్రికేయానిది. కానీ అదే నేడు విచారించదగ్గ  స్పర్థలోపడి వడివడిగా మారిపోతున్నది. ప్రపంచాన్ని అన్నిరకాలుగా ప్రభావితంచేసి శాసించాలనుకునే మాధ్యమాన్ని మాత్రం శాసించే సరైన యంత్రాంగం లేని లోటు  కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. పర్యవేక్షణలేని శక్తివల్ల నివరించదగ్గ ప్రమాదాలు జరిగే అవకాశాలే ఎక్కువ. మీడియాకూ ఆత్మవిమర్శ అవసరమనీ, స్వయం నియంత్రణ అనివార్యంగా ఉండితీరాలని బుద్ధిజీవులు అందుకే భావించేది. పత్రికాప్రపంచం టి.వి. చానళ్లకన్నా ఈ స్వయం నియంత్రణ విషయంలో కొంత మెరుగని  ఒప్పుకొన్నా.. ఔషధంవంటి ఈ స్వీయ నియంత్రణను, పథ్యంవంటి ఆత్మవిమర్శను పత్రికాలోకం ఇంకా బాగా అలవాటు చేసుకోవాల్సివుంది.

అప్పుడే ఈ రంగానికి , దీనివల్ల సమాజానికి సరయిన మేలు జరిగే అవకాశం వుంది.
***
-కర్లపాలెం హనుమంతరావు
రచనా కాలం 2010

భూపాలరాగం- ఒబామా 2010- భారత సందర్సనం సందర్భంళో రాసుకున్న కవిత

పురుగుమందుకు మనుషులంటేనే ఎందుకో అంత ప్రేమ!
విషం మిథైల్ ఐసో సైనేట్ మారు వేషంలో
నగరం మీద విరుచుకుపడిన చీకటి క్షణాల ముందు
హిరోషిమా నాగసాకీ బాంబు దాడులే కాదు
'తొమ్మిదీ పదకొండు' ఉగ్ర దాడులు కూడా దిగదుడుపే !
టోపీల వాడి మాయాజాలమంటే అంతే మరి!
మనకి ఊపిరాడదని మన తలుపుకే కన్నం వేసే కంతిరితనం వాడిది.
అప్పుడెప్పుడో వాస్కోడిగామా వచ్చి మిరియంమొక్క అడిగినా
కంపెనీవాడొచ్చి మూడడుగుల నేలడిగినా
మన కళ్ళుకప్పి మాడుమీద వాడి జెండా దిగేయ్యటానికే!
మన కండలు పిసికి పండించిన పంటను ఓడల కెత్తుకెళ్ళటానికే.
అదిప్పుడు పాత కథ.
కొత్త కథలో..

వామనుడు అడగక ముందే నెత్తి చూపించే అమాయక బలి చక్రవర్తులం మనం

భూమిని చాపలా చుట్టి వాడి పాదాల ముందు పరచటానికి
పోటీలు పడే కలియుగ దానకర్ణులం.
మన రూపాయి ప్రాణవాయువును
వాడి డాలరు బతుకుతెరువు కోసం
తృణప్రాయంగా సమర్పించుకునే
పిచ్చి బేహారులం
వాడి విమానాలు క్షేమంగా దిగాలని
మన వూళ్ళు కూల్చుకుని
రహదారులు విశాలంగా చేసుకునే
విశాలహృదయులం
వాడి నాలిక మడత పడటం లేదని
మన మాటను సంకరం చేసుకునే టందుకయినా సంకోచపడం.
వాడి అణుదుకాణాల కోసం
మన అన్నపూర్ణ కడుపులో చిచ్చు పెట్టుకోటానికయినా మనం సిద్దం.
సార్వభౌమత్వమంటేనే ఒక చమత్కారం
ఆ డాబు దర్పాలకి మురిసి చప్పట్లు కొట్టటమే మనకు గొప్పతనం.
అణుఒప్పందం వల్ల భవిష్యత్తులో జరిగే భారతీయ చెర్నోబిల్ నాటకానికి
పాతికేళ్ళ క్రిందటే ప్రారంభమయింది
భూపాల రాగం... వింటున్నారా!
-కర్లపాలెం హనుమంతరావు

(ప్రొద్దు-05-10-2010-సంపుటి 5 సంచిక 4-లో ప్రచురితం)


Wednesday, June 24, 2015

ఆరుద్రగారితో పన్నాలవారి ఆకాశవాణి ఇంటర్వ్యూ- వీడియో

మంచి సాహిత్య చర్చ. ప్రముఖ ఆకాశవాణి కళాకారుడు శ్రీ పన్నాల సుబ్రహ్మణ్య భట్టు (రమణగారి భట్టు పెసరట్టు ఫేం) ఆరుద్రగారితో మాట్లాడుతున్న ఆడియో. ఈ ఆడియో ఆకాశవాణిలో ప్రసారం అయ్యింది. పూర్తిగా లేదు. ఈ రికార్డింగు నాకు ఇచ్చినది శ్రీ శ్యాంనారాయణ, ఫిరంగిపురం వాస్తవ్యులు. ఆయనకు ఎక్కడనుంచి వచ్చినదో తెలియదు. రికార్డ్ చేసి ఇలా వదిలిన ఆ అజ్ఞాత వ్యక్తికి ధన్యవాదాలు.
(కప్పగంతుల శివరామప్రసాద్ గారి గూగుల్+ కాతాలో చూసి యూ ట్యూబ్ నుంచి షేర్ చేస్తున్నాను. వారికి ధన్యవాదాలు)

Tuesday, June 23, 2015

రహస్యకవాటం- కవిత


మాటలమీదనుంచి మాటలమీదకు దూకటంకాదు
మంత్రకవాటాలను ఒక్కక్కొక్కటే తెరుచుకుంటూ పోవటం కవిత్వం
లోపలి చీకటికి వెలుగుల రంగులద్దే అద్దకంపని కవిత్వమంటే
నాడులు నీవే కావచ్చు, ధమనుల బాధను అర్థం చేసుకోవడం
పచ్చిదనాన్ని పచ్చదనంగా అనువదించడం.. ఆ కళే కదా కవిత్వమంటే!
ఎడారిలో నడుస్తూ కూడాఒయాసిస్సులను మోసుకుతిరిగే కూలీపనికి సిద్ధమా!
బోరుబావిలో పడ్డ బిడ్డ మాదిర
ఊహలు ఊపిరికొసం విలవిలలాడితేనే  కవిత్వం జ్వరంలా తగులుకున్నట్లు!
ఉపమాలకోసం జపమాల తిప్పుతూ కూర్చోకు
ఊర్వశి మరోపురూరవుడితొ లేచిపోవచ్చు!

కవిత్వం సాక్షాత్కారానికి ఎన్ని మన్వంతరాలు శోధించాలో తెలుసా?
పసిబిడ్డ పకపకల పక్కలకి పోయి నిలబడాలి.. కాస్తంత  కాకెంగిలి కవిత్వం దొరకుతుంది
పడుచుపిల్ల వాల్చూపుల్లో తడిసి ముద్దవాలి.. ప్రబంధాల చలిగాలి వణికిస్తుంది
అమ్మలాలింపు, నాన్నగద్దింపు, అన్న అల్లరివేధింపు, చెల్లి బుంగమూతిసాధింపు
కవివే అయుంటే నీ ఇల్లే ఓ భువనవిజయంకదరా బాబూ!
ఇరుగింటి పంచాంగంవారి బహుళ శుద్ధపూర్ణిమ పర్వంలోనే కాదు
పొరుగింటి కుటుంబయ్యగారి క్యేలండరు ముప్పయ్యో తారీఖు అడుగునా
అణిగి వుటుంది కవిత్వం.. కాస్త తడిమి చూడాలిగాని.

తాగొచ్చిన మొగుడు  తన్నినా తను కంచం ఖాళీచేసిందాక
పచ్చిగంగ ముట్టనని శపథంపట్టిన
తడికవతలి  తల్లి తడికళ్ళలోకి తొంగిచూడు
మానిషాద’కన్న మహావిషాదమైనకవిత్వం
వరదలై పారుతుంటుందక్కడ!

ఎక్కడ లేదు కవిత్వం?
గుడిబైట గుడ్డిబిచ్చగాడు పరుచుకు పడుకున్న చింకిపాతలో లేదా!
బడికెళ్ళే బుడ్డడి  స్కూలుబ్యాగు బుక్కుల బరువుకింద నలగడంలేదా!
పొలంగట్టుమీద మట్టికుప్పలా పడున్న అన్నదాత
గుండెల్లో కదుంకట్టి ఉంది  తట్టలతట్టల కవిత్వం!

అడవిచీకటిదారుల్లో జనంవెలుగులకోసం అహోరాత్రులు
తుపాకీమడమలమీదే కునికిపాట్లుతీసే
అన్నల కంటిరెప్పల మరుగున మరుగుతుంటుంది కవిత్వం!

పట్టించుకోవాలేగాని బడ్జెట్ ప్రసంగాల్లో, సన్మానపత్రాల్లోనూ
అధికప్రసంగంలా  అప్పుడప్పుడూ చప్పుడు చేస్తూనేవుంటుంది కవిత్వం!


తాతలకాలంనాటి తాళపత్రగ్రంథాలనుంచి
పక్కింటి సీతకు ఎదురింటి రాంబాబు రాసిన ప్రేమలేఖల దాకా
ఎదవెలుగులో వెదుకుతూపోతే.. అంతా  కవిత్వమేలే!

మేలైన కవిత్వమే ఏదీ? ఎక్కడా ఆ రహస్య కవాటం?

ఖాళీపదాల అర్థాలను పీకిపాకానపెట్టి.. పద్యాల ప్రతిపదార్థాలను తవ్విపోసి..
వెర్రి గీతాల చరణాలవెంట పిచ్చిగా పరుగెత్తితే వినిపించేది
సిల్కుస్మితల చీరకుచ్చెళ్ళ చప్పుళ్ళు!
సీతాకోకచిలుక రెక్కలసవ్వళ్ళరహస్యం కావాలా!
పగలంతా వళ్ళు పుళ్ళుచేసుకుని
రాత్రి హోటలుబల్లల సందులమధ్య
కలతనిద్రలో ఉలికులికిపడే
బుడ్డోడి గుండెలు తట్టి చూడు!
 అక్కడ తెరుచుకుంటుంది అసలు కవిత్వరహస్యకవాటం!


-కర్లపాలెం హనుమంత రావు
(సాహిత్య ప్రస్థానంలో ప్రచురితం)




Monday, June 22, 2015

ప్రపంచ పక్షి- కవిత

సృష్టి నాటి నుంచి చూస్తున్నా
సూర్యుడెప్పుడూ తూర్పునే ఉదయిస్తున్నాడు
దశాబ్దాలనీ శతాబ్దాలనీ
గుర్తుల కోసం నువ్వే ఋతువుల పేర్లైనా పెట్టుకో
కాలం మాత్రం అనంతం నుంచి అనంతంలోకి
సాగే జీవన ప్రవాహం
మనిషి అందులో ఒక అల

నదులూ , సముద్రాలూ, పర్వతాలూ,
అగాధాలూ, అడవులూ, ఎడారులూ,
మహా సముద్రాలనీ
నేలనీ, నీటినీ ముక్కలు ముక్కలు చేస్తున్నావ్!

జాతులనీ, రంగులనీ, మతాలనీ , కులాలనీ,
బానిసలనీ,
నిన్ను నీవే నిలువుగా, అడ్డంగా
నరుక్కుంటున్నావ్!

నిజమే....
నడక మాత్రమే తెలిసినవాడివి- నదులు
నీకడ్డమే మరి!

శతాబ్దానికవతల ఏముందో వినలేని
చెవిటి వాడివి
కంటికి కనిపించనిదంతా నీకు దగా!
నీ గుళ్ళూ, గోపురాలూ, పిరమిడ్లూ, ప్యాలెస్ లూ
నగరాలూ, నాగరికతలూ
కాలం తీరాల వెంట శిధిలాల్లా పడి ఉన్నాయ్!

నత్త గుల్లలే నీ చరిత్రకు గుర్తులుగా మిగిలున్నాయ్!
అణువును ఛేదించి అస్త్రాలను చేసేవాడా
జీవాన్ని మమ్మీ గా మార్చి పిరమిడ్ బొడ్డులో దాచేస్తావా?
కరువులూ, కాటకాలూ, వరదలూ, తుఫానులూ,
భూకంపాలూ, సునామీలు చాలకా ...
మధ్యలో పుట్టి మధ్యలో పోయే ఓ మనిషీ!
మళ్ళీ యుద్ధాలను సృష్టిస్తున్నావ్!

నీ అధికారం, ఉగ్రవాదం, యు యెన్ వో వీటో పవరూ,
ప్రభుత్వాలూ, పహరాలూ డాలర్లు పేటెంట్లు
అణువుపగిలితే అంతా మసి!
విశ్వాన్ని జయించాలని విర్రవీగిన నియంతలు
బాత్రూముల్లో జారిపడి చచ్చిన ఉదంతాలు
వినలేదా!

క్యాలెండరుకు ముందేముందో తెలీనివాడివి
నీ కన్న పిట్ట నయం!
చినుకు కోసం నేలపడే తపన దానికి తెలుసు
ఉనికి కోసం జీవిపడే ఆరాటం తను చూడగలదు

తల్లడిల్లే పిల్లవాడు తల్లి నాలుకతో 'అమ్మా!'
అనే ఏడుస్తాడు ఏ ఖండంలోనైనా
తల్లి నాలుకలు వేరైనా తల్లి మాత్రం ఒక్కటే
బాధలకూ, భయాలకూ రంగులు వేరైనా వాసన ఒక్కటే అయినట్లు
జపానుకైనా ఇరానుకైనా
చెక్కిళ్ళ మీద జారే కన్నీళ్లు ఎప్పుడూ ఉప్పగానే ఉంటాయి

ఆఫ్రికా అడవులైనా, అలప్స్ కొండలైనా,
నైలునది నీళ్ళయినా, దార్ ఎడారి ఇసుకైనా
ఎవరెస్టు శిఖరమైనా మృత్యులోయ లోతైనా
పిట్ట కొక్కటే!

మనిషి ముక్కలు చేసిన ఆకాశాన్ని
తన రెక్కలతో కుట్టుకుంటూ
రవ్వంత వసంతం కోసం దిగంతాల అంచుల దాకా
ఎగరటమే దానికి తెలుసు

నేను
అలుపెరగని ఆ వలసపక్షిని
ప్రపంచ పక్షిని

ఖండాల జెండాలన్నీ ఒక్కటేనని మనిషి
నమ్మేదాకా దేశదేశాలకు
ఈ సందేశాన్ని పంచటమే నా పని!

-కర్లపాలెం హనుమంతరావు

(పొద్దు అంతర్జాల పత్రికకు డిసెంబరు 2010 సంచికలో ప్రచురితం)

ప్రేమ- మినీకవిత






ఈ తేనెబొట్టొకటి 
మూతికి రాసుకో సుమా!
పాతాళందాకా నువు
తీపెక్కేవు సంద్రమా!
-కర్లపాలెం

Sunday, June 21, 2015

మందార మాధుర్య మకరందమిదిగో. అందుకోండి!- పోతనగారి భాగవతపద్యాల వెబ్-సైట్ పరిచయం




(iBAP పద్యము= (డిజిటలైజు చేసిన భాగవతం పద్యం)
శారద నీరదేందుఘనసార పటీరమరాళమల్లికా
హారతుషార ఫేనరజతాచల కాశఫణీశకుందమం
దార సుధాపయోధి సితతామరసామరవాహినీశుభా
కారత నొప్పు నిన్ను మదిఁ గానగ నెన్నడుగల్గు భారతీ!

iBAPP ప్రతిపదార్ధము= (డిజిటలైజు చేసిన భాగవతం ప్రతిపదార్ధం)
శారద = శరదృతు; నీరద = మేఘము; ఇందు = చంద్రుడు; ఘనసార = కర్పూరం; పటీర = మంచిగంధం; మరాళ = హంస; మల్లికా = మల్లిపువ్వుల; హార = దండ; తుషార = మంచు; ఫేన = నురుగు; రజత = వెండి; అచల = కొండ; కాశ = రెల్లుపువ్వులు; ఫణీశ = ఆదిశేషుడు; కుంద = అడవిమల్లె; మందార = కల్పవృక్షము; = పాల సముద్రము; సిత = తెల్లని; తామరస = తామరపువ్వు; అమర = దేవతల; వాహినీ = నదిలో - ఆకాశగంగలో; శుభ = శుభకరమైన; ఆకారతన్ = ఆకారంతో; ఒప్పు = అమరు; నిన్ను = నిన్ను; మదిన్ = మదిలో; కానగ = చూచుట; ఎన్నడు = ఎప్పుడు; కల్గు = కలుగు తుంది; భారతీ = సరస్వతీదేవీ.

iBAT తాత్పర్యము= డిజిటలైజు చేసిన భాగవతపద్య తాత్పర్యం
దివ్యత్వాన్ని సాధారణమైన కన్నులతో చూడలేము. భావన అనే నేత్రంతోనే చూడాలి. అలా చూడటం గొప్పతపశ్శక్తితో గానీ సాధ్యం కాదు. శ్రీభారతీదేవి దివ్యదర్శనంకోసం ఆర్తితో విన్నవించుకుంటున్నాడు పోతనగారు.
"సర్వశుక్లా సరస్వతీ" సరస్వతి నిలువెల్లా తెల్లదనంతో అలరారుతుంది అని ఋషులభావన. లోకంలో తెల్లదనంతో విరాజిల్లే పవిత్రవస్తువులు కొన్నింటిని ఉపమానా లుగా సరస్వతీ స్వరూపాన్ని సంభావిస్తున్నాడు పోతన. శరత్కాలమేఘం, చందమామ, కర్పూరం, నీటినురుగు, వెండికొండ, రెల్లుపూలు, మొల్లలు, మందారాలు, అమృతసముద్రం, తెల్లని తామరలు, దేవతలనది మందాకిని - అనేవాని శుభమైన ఆకారంవంటి ఆకారంతో ప్రకాశించే నిన్ను , ఓతల్లీ! భారతీ! హృదయం అనే గుడిలో ప్రతిష్ఠించుకొని చూడగలగటం ఎన్నటి కౌతుందో!
 పద్యం .. ప్రతిపదార్థం.. తాత్పర్యం.. చక్కగా ఇవ్వడమే కాదు.. ఆ పద్యాన్ని సుమధురస్వరంతో ఆలపించడంకూడా ఈ భాగవతం వెబ్ సైట్ లో ప్రత్యేకంగా కనిపించింది.
ఇదొక భారీ ప్రోజెక్టు లాగుంది. నాలుగో స్కంధంలోని కొన్ని పద్యాలవరకే ఆలపించడం అయినట్లుంది. ముందు ముందు ఈ బృహత్ప్రయత్నం దిగ్విజయంగా సాగి మన తెలుగువారందరం గర్వించే తేట తేనియల ఊట పోతన భాగవతం విశ్వవ్యాప్తంగా అందరికీ ఆన్-లైనులో అందుబాటులోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను.
ఈ లోగా తెలుగు సాహిత్యప్రియులెవరైనా  మరోసారి బమ్మెర పోతనామాత్యులవారి భాగవత మందార  మాధుర్యాన్ని గ్రోలాలంటే ఇదిగో కొద్దిగా ఆ మకరంధం ఇక్కడ లింకులో దొరుకుతోందిః



మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...