Saturday, June 20, 2015

యోగా గొప్పతనం - సీరియస్లీ సిల్లీ స్టోరీ

(జూన్ 21 ప్రపంచ యోగాదినోత్సవమే కానీ.. ఆ ఉత్సాహం అన్నార్తుడి కడుపులో ఏదీ?!)
"ఏటా సంక్రాంతికి మా  వూళ్ళో రివాజుగా జరిగే జాతరలో ముఖ్య ఆకర్షణ తిండిపోతుల పోటీ. చెయ్యి ఆపకుండా.. అరగంటలో ఎవరెక్కువ ఇడ్డెన్లు చట్నీల్లేకుండా లాగిస్తాడో.. వాడే 'భీముడు'. వంద కొబ్బరికాయలను వంటి చేత్తో పగలేసి లోపలి గుజ్జుతో సహా నీళ్ళన్నీ చుక్క కింద పడకుండా అతి తక్కువ సమయంలో స్వాహా చేసినవాడు 'బకాసురుడు'. తొక్క వలవకుండా అరటి పండ్లు తినడం, టెంకె వదలకుండా  మామిడి పండ్లు  మింగడం, పెంకు తియ్యకుండా కోడిగుడ్లు   నమలడం.. లాంటి విన్యాసాలన్నీ చిన్నతనంనుంచే  మా దగ్గర ప్రోత్సహించే విద్యలు. మా ప్రాంతంలో పుట్టిన వాళ్ళందరికీ   తిండిపొటీలో 'భీముడు' 'బకాసురుడు' బిరుదులు సాధించడమే అంతిమ  లక్ష్యం. ఐఐటీలో దేశం మొత్తం మీదా మొదటి ర్యాంకొచ్చినా మేం పట్టించుకోం. నెలకి రెండు కోట్లొచ్చే ఉద్యోగం సాధించినా.. 'ఆహా!'.. అలాగా.. అని వూర్కే తలెగరేసి వూరుకుంటామే.. గానీ హారతులు గట్రాల్లాంటివేమీ పెట్టుకోం. ఏటా  జరిగే భీమయ్య తిరణాల్లో మహా వైభవంగా నిర్వహించే తిండిపోతుల పొటీల్లో విజేతలైతే మాత్రం బ్రహ్మరథం పట్టామన్నమాటే.
ప్రధాన మంత్రి.. బకాసురుడు ఒకేరోజు ఒకే సమయంలో  మా ఊళ్ళో సభ తీరితే మూడొంతుల జనాభా తిండిపోతును చూట్టానికే ఎగబడేది. ఎన్నికల ప్రచారాలప్పుడు అందుకే ఎంత పెద్ద అభ్యర్థైనా సరే తమ వెంట ఇతర జిల్లాల్లో మాదిరి  ఏ పవన్ కళ్యాణో.. బాలయ్యబాబో.. ఉండాలని కోరుకోరు. భీమయ్యో, బకాసరుడో పక్కనుండి చెయ్యూపుతోంటే  చాలు ఫలితాలు అవే అనుకూలంగా వస్తాయనే గట్టి నమ్మకం"

"మీ బకాసురుణ్ణి, భీముణ్ణి ఒక్క నెలరోజులు మా వైపుకి వచ్చి  పొమ్మనండి. బక్కాసురులుగా మారడం ఖాయం"

"ఇన్ని కరవులొచ్చాయి. కాటకాలొచ్చాయి. హుద్ హుద్ తుఫానులొచ్చి వూళూ.. పూళ్ళూ వారాలకు వారాలు నిరాహారంగా అలమంటించాయి. ఐనా  మా వూరి తిండిపోతుల జిహ్యపుష్టినవేమీ చెయ్యలేక పోయాయి స్వామీ!"

"మెహిదీపట్నం రైతుబజారు పక్కనే  మొన్నీమధ్య నడిరోడ్డు మీద  సగం తెరిచున్నచేతిసంచీ ఒకటి పడివుందన్న వార్తొకటి పెద్ద సంచలనం సృష్టించింది. ఆ కథ ఆసాంతం మీ దాకా వచ్చినట్లు లేదు.. పాపం! అందుకే సోదరా ఈ కోతలు."

"ఆ సంచీలో బాంబులేవో ఉండుంటాయి. దానికీ మా తిండిపోతులకీ సంబంధమేముందబ్బీ?"

"ఉంది కాబట్టే..ఇప్పుడీ  ముచ్చట"

"సరే..ఇంతకీ సంచీలో బాంబులున్నాయా లేవా నిజంగా? ఉత్తుత్తి భయమేనా?"

"అది తెసుసుకోవాలంటే ముందుగా 'తొక్క సందేశం'లో ఏముందో ఓపిగ్గా వినాలి!"

"మధ్యలో ఈ తొక్క సందేశం ఏమిటి మహానుభావా?"

"ఆ సంచీలో ఒక ఉల్లి గడ్డ ఉంది. దాని మీద రాసున్న సందేశంలే అది. మరి ‘తొక్కసందేశం’ కాక తోలుసందేశం అవుతుందా? విను ముందు.. ఆనక సందేహాలు.

"వినిపించు మరి!"

"పెళ్ళిళ్ళ జోరు ప్రారంభమైంది. అసలే మండిపోతున్న కూరగాయలకి  మరిన్ని కొత్త  రెక్కలు పుట్టుకొచ్చాయి. మంచి రోజులూ ఇప్పుడే  వచ్చి పడడంతో మాలాంటి సామాన్యులకి చెడ్డరోజులు మొదలయ్యాయి. పోయిన ఏడాది సరిగ్గా ఇదే తిథికి మా నాయన పోయాడు.. పైకి.. ఆకలి జబ్బుతో. పోయే ముందు మా అయ్య అలమటించింది  తులసి తీర్థం కోసం కాదు. ఇన్ని ఉల్లి చారునీళ్ళ కోసం కన్నీళ్ళు పెటుకున్నాడు. ఆయన కడసారి కోరికను తీర్చడం కన్నబిడ్డగా నా ధర్మం అనుకున్నాను. భార్యలకి గుర్తుగా భర్తలు  తాజ్ మహళ్ళు కట్టించిన పుణ్య భూమి ఈ దేశం. కనీసం ఉల్లి చారు నీళ్ళైనా కన్నతండ్రి ఆకలికి గుర్తుగా అన్నార్తులకు పంచకపోతే నాకీ జన్మెందుకు?  మొదటి వర్థంతి రోజునైనా సరే ఎలాగైనా  నాయన చివరి కోరిక తీర్చి తీరాలనుకున్నాను.ఇల్లు తనఖా పెట్టిన సొమ్ముకు అదనంగా  బ్యాంకు ఖాతాలో ఉన్నమొత్తమంతా ఊడ్చుకుని ఊళ్ళో ఉన్న అన్ని  రైతుబజార్లూ తిరుగుతున్నాను. కూరగాయల ధరలు ఎలా మండుతున్నాయో తెలుసు కుంటే గుండె మండిపోదు.. ఆగిపోతుంది. పచ్చి మిర్చి కిలో ముప్పై ఏడు. చిక్కుడు నలభై ఏడు. కొన్ని చోట్లైతే డెబ్భై ఏడుమీద ఏడు. బెండ మూడు తక్కువ  ఇరవై ఏడు. ఈ 'ఏడు’పులకి ఆంధ్రా.. నైజాం.. సర్కారు.. సీడెడ్.. తేడాలేదు. కడపలో జనాలకి  కడుపులు మంట. గుంటూరులో ప్రజలకి గుండెల్లో కోత. ఏలూరు పౌరులకు కళ్ళు బైర్లు. అటు తెలంగాణా కరీంనగరు వాసులకు  కాకరకాయే కాదు మామిడికాయా కనరు. క్యారెట్.. క్యా ‘రేట్’.. మాలూమ్.. హై? ఒకటెక్కువ నలభై ఏడు. హైదరాబాద్ మే ఇరవై ఏడు. కాలీ ఫ్లవరు ఏడు తక్కువ నలభై ఏడు. రాజధానిలో ఐదు తక్కువ పదిహేడు. బీరకాయో? నలభై ఏడు.”

“బీరుకాయా .. నలభై ఏడా?!”
“బీరుకాయ కాదయ్యా? బీరకాయ. కనకే ఈ ధర. బంగారం ధర పెరిగితే  కంగారు కొద్దిమందికే.  పెట్రోలు..గ్యాసు ధరలు పెరుగుడు తరుగుడు అంటే.. పోనీలే..  ఏదో అంతర్జాతీయ బజార్లకి అనుసంధానమనో..నా బొందనో..  సరి పుచ్చుకు చావచ్చు. రేపటికి పుచ్చిపోయే వంకాయలకీ..ఎల్లుండికల్లా కుళ్ళిపోయే టమోటాలకీ టాటా.. హొండా కార్లధరలతో పోటీ ఏంటంట? పంటల దిగుబడికీ  ఎవరితో సంబంధముంటుందనీ.. మండీల ధరలు  ఇలా మండిపోతున్నాయో చెప్పండీ! పర్యావరణ నిర్వహణ సూచీట- రెండువేల పన్నెండులోనట మన తెలుగునేలే ప్రథమ స్థానంలో ఉందట! నాణ్యమైన గాలి, నీరు, అత్యుత్తమమైన అనుకూల విధానలను అవలంబిస్తున్న ఘనత దేశంమొత్తంలో మన ఉభయరాష్ట్రాలదేనట! లోకసభలో  కోసుకోవడానికి పనికొస్తాయేమో కానీ ఈ లేత లేత సొరకాయలు.. లోకల్ మార్కెట్లలో ముదురు మునక్కాడలు కూడా ఐదుకి రెండు తూగడం లేదు! ఆ ప్రణాళిక మంత్రి గారెవరో గానీ.. ఒకసారిలా  మన  రెండు రాష్ట్రాల   నాలుగు మూలలా తిప్పాలి. నాలికమీదకి రుచికి రాసుకునే నిమ్మబద్ద ధర విన్నా గుండె బద్దలైపోవాలి. చారెడు రూకలు పోసినా చారులోకిన్ని  ఉలవలు వచ్చి చావడం లేదిప్పుడు! పచ్చకార్డువాడినలా తగలడనీయండి.. తెల్ల కార్డువాడైనా బతికి చచ్చే దారుందా? బియ్యం ఓ పది కిలోలు ఆమ్ ఆద్మీ సంచీలో ఇలా  పోసేసి 'అమ్మయ్య' అనుకుంటే సమస్య పరిష్కారమైపోతుందా? దాని దుంప తెగ.. దుంపలూ ఆకాశానికి వేలాడుతున్నాయయ్యా! ఆకలి వేస్తున్నవాళ్ళందరూ కేకలయాత్రలో.. కూకలజాతర్లో చేయలేక పోవచ్చు కానీ.. నోరు మూసుకునికూడా కూర్చో లేరు కదా! ఆ సంగతి తెలుసుకోవాలనే ఈ పని చేసింది.."

"ఏం పని చేసింది? తొందరగా చెప్పు! సందేశమంతా చదవక్కర్లేదు. ఉద్దేశం అర్థమైందిగా! ఇంతకీ ఆ సంచీలో బాంబులున్నట్లా? లేనట్లా?"

"ఉన్నాయయ్యా మహానుభావా. ఒకటి కాదు. రెండు కాదు. కిలో.. సంచీ నిండుగా"

"బాబోయ్.. నిజంగా ఇది సంచలనమే!"

"నిజం సంచలనం అదికాదు మిత్రమా! ఆ బాంబుల అడుగున ఒక తొక్కల ఉల్లిగడ్డ కూడా ఉంది. మొగ్గుగా వేసినట్లుంది! ఆ తొక్కలోని ఉల్లిగడ్డకే చుట్టున్నది ఇప్పటిదాకా నేను అప్పచెప్పిన సందేశమంతా. 'నా ఆస్తంతా అమ్మేస్తే వచ్చింది ఈ ఉల్లి తొక్కు. ఇంకో తొక్కా వచ్చునేమో కానీ.. దానికి బదులుగా  ఈ చేతిసంచీ నిండా బాంబులు ఖరీదు చేసా. తెల్లారే సరికల్లా   రెండు రాష్ట్రాల్లోని అన్ని  మార్కెట్లలో  కూరగాయలధరలు ఠకీమని పడిపోవాలి. ఒక్కరోజే గడువు. తెల్లకార్డుదారులందరికీ అందివచ్చే సకలచర్యలు యుద్ధ ప్రాతిపదిక మీద జరిగి పోవాలి. అలా  జరిగిపోలేదని నాకు అనుమానం వచ్చిన  పక్షంలో.. ఈ చేతి సంచీలాంటివే మరిన్ని    మిగతా చాలా చోట్ల పేలడం ఖాయం' అని  రాసుంది".

"ఈ మధ్య అలాగా బాంబులేవీ  ఎక్కడా పేలినట్లు వార్తల్ల్లేవే!"

"అనగా సర్కారువారు   కూరగాయల ధరలు కారు చవుకస్థాయికి దింపే చర్యలు నిజంగానే యుద్ధప్రాతిపదిక మీద చేపట్టారని అర్థమా! అదే నిజమైతే  మా ఊరికొస్తే మీ బకాసురుళ్ళూ, భీముళ్ళూ బక్కాసురుళ్లవుతారని పందెం ఎందుకు కాస్తాను మిత్రమా?"

"నీ కథ పూర్తిగా చెప్పేసే ఆత్రంలో నా కథ నువ్వింకా పూర్తిగా విననేలేదయ్యా మిత్రమా! ఎన్ని కరవులొచ్చినా.. ఇంకెన్ని కాటకాలు.. వరదలొచ్చి వూళూ పూళ్ళూ వారాలకు వారాలు నిరాహారంగా అలమంటించినా.. మా ఊరి తిండిపోతులకు ఢోకాలేదన్నానే కానీ.. వాళ్ళు తింటున్నది అన్నమనో.. కాయగూరలనో..పళ్లనో..పుష్టికరమైన ఫలహారాలనో అని గాని అన్నానా? కరవులూ.. కాటకాలూ.. వరదలూ.. వర్షాలూ.. మా దగ్గర మాత్రం తక్కువా నాయనా! పూర్వపాలకుల పుణ్యమా అని బతకడానికి మా ప్రాంతంవాళ్ళం  సాంప్రదాయికమైన ఆహార విధానాలకు ఎప్పుడో స్వస్తి చెప్పేసాం.   ప్రత్యామ్నాయ విధానాలను
కనుక్కుని ఆచరణలో పెడుతున్నాం ఇప్పుడు. చెడిపోయిన ట్యూబ్ లైట్లు, ఇనుము, తుక్కు సామాను ఇవే మాకిప్పుడు ముఖ్యాహారం. ఇవేవి  దొరకనప్పుడూ ఇసుక, సున్నం, మట్టీ, మశాన్నమే మాకు అన్నం. ఏలిన వారి పుణ్యమా అని ఇసుకలాంటి వాటికీ కరువు రావచ్చన్న ముందు చూపుతో.. ఇప్పుడిప్పుడే కేవలం వాయుభక్షణం మీదే జీవనం కొనసాగించే యోగావిద్య  అభ్యసిస్తున్నాము. మోదీజీ ఐరాసలో చెప్పిందాకా యోగా గొప్పతనం ప్రపంచానికైతే పట్టకపోవచ్చు గానీ.. మా ప్రాంతంవాళ్ళకి  ఈ విధానాలు ఎప్పట్నుంచో చిరపరిచితం. ఇప్పటి దాకా చెప్పానే.. భీముడూ.. బకాసురుడూ.. అని  ఆ బిరుదులు సాధించిన మొనగాళ్ళే  మాకిప్పుడు వాయుభక్షణ శిక్షణ ఇచ్చే గురువులు కూడా!"
-కర్లపాలెం హనుమంతరావు
(వాకిలి- అంతర్జాల పత్రికలోప్ర చురితం)

***

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...