Tuesday, June 23, 2015

రహస్యకవాటం- కవిత


మాటలమీదనుంచి మాటలమీదకు దూకటంకాదు
మంత్రకవాటాలను ఒక్కక్కొక్కటే తెరుచుకుంటూ పోవటం కవిత్వం
లోపలి చీకటికి వెలుగుల రంగులద్దే అద్దకంపని కవిత్వమంటే
నాడులు నీవే కావచ్చు, ధమనుల బాధను అర్థం చేసుకోవడం
పచ్చిదనాన్ని పచ్చదనంగా అనువదించడం.. ఆ కళే కదా కవిత్వమంటే!
ఎడారిలో నడుస్తూ కూడాఒయాసిస్సులను మోసుకుతిరిగే కూలీపనికి సిద్ధమా!
బోరుబావిలో పడ్డ బిడ్డ మాదిర
ఊహలు ఊపిరికొసం విలవిలలాడితేనే  కవిత్వం జ్వరంలా తగులుకున్నట్లు!
ఉపమాలకోసం జపమాల తిప్పుతూ కూర్చోకు
ఊర్వశి మరోపురూరవుడితొ లేచిపోవచ్చు!

కవిత్వం సాక్షాత్కారానికి ఎన్ని మన్వంతరాలు శోధించాలో తెలుసా?
పసిబిడ్డ పకపకల పక్కలకి పోయి నిలబడాలి.. కాస్తంత  కాకెంగిలి కవిత్వం దొరకుతుంది
పడుచుపిల్ల వాల్చూపుల్లో తడిసి ముద్దవాలి.. ప్రబంధాల చలిగాలి వణికిస్తుంది
అమ్మలాలింపు, నాన్నగద్దింపు, అన్న అల్లరివేధింపు, చెల్లి బుంగమూతిసాధింపు
కవివే అయుంటే నీ ఇల్లే ఓ భువనవిజయంకదరా బాబూ!
ఇరుగింటి పంచాంగంవారి బహుళ శుద్ధపూర్ణిమ పర్వంలోనే కాదు
పొరుగింటి కుటుంబయ్యగారి క్యేలండరు ముప్పయ్యో తారీఖు అడుగునా
అణిగి వుటుంది కవిత్వం.. కాస్త తడిమి చూడాలిగాని.

తాగొచ్చిన మొగుడు  తన్నినా తను కంచం ఖాళీచేసిందాక
పచ్చిగంగ ముట్టనని శపథంపట్టిన
తడికవతలి  తల్లి తడికళ్ళలోకి తొంగిచూడు
మానిషాద’కన్న మహావిషాదమైనకవిత్వం
వరదలై పారుతుంటుందక్కడ!

ఎక్కడ లేదు కవిత్వం?
గుడిబైట గుడ్డిబిచ్చగాడు పరుచుకు పడుకున్న చింకిపాతలో లేదా!
బడికెళ్ళే బుడ్డడి  స్కూలుబ్యాగు బుక్కుల బరువుకింద నలగడంలేదా!
పొలంగట్టుమీద మట్టికుప్పలా పడున్న అన్నదాత
గుండెల్లో కదుంకట్టి ఉంది  తట్టలతట్టల కవిత్వం!

అడవిచీకటిదారుల్లో జనంవెలుగులకోసం అహోరాత్రులు
తుపాకీమడమలమీదే కునికిపాట్లుతీసే
అన్నల కంటిరెప్పల మరుగున మరుగుతుంటుంది కవిత్వం!

పట్టించుకోవాలేగాని బడ్జెట్ ప్రసంగాల్లో, సన్మానపత్రాల్లోనూ
అధికప్రసంగంలా  అప్పుడప్పుడూ చప్పుడు చేస్తూనేవుంటుంది కవిత్వం!


తాతలకాలంనాటి తాళపత్రగ్రంథాలనుంచి
పక్కింటి సీతకు ఎదురింటి రాంబాబు రాసిన ప్రేమలేఖల దాకా
ఎదవెలుగులో వెదుకుతూపోతే.. అంతా  కవిత్వమేలే!

మేలైన కవిత్వమే ఏదీ? ఎక్కడా ఆ రహస్య కవాటం?

ఖాళీపదాల అర్థాలను పీకిపాకానపెట్టి.. పద్యాల ప్రతిపదార్థాలను తవ్విపోసి..
వెర్రి గీతాల చరణాలవెంట పిచ్చిగా పరుగెత్తితే వినిపించేది
సిల్కుస్మితల చీరకుచ్చెళ్ళ చప్పుళ్ళు!
సీతాకోకచిలుక రెక్కలసవ్వళ్ళరహస్యం కావాలా!
పగలంతా వళ్ళు పుళ్ళుచేసుకుని
రాత్రి హోటలుబల్లల సందులమధ్య
కలతనిద్రలో ఉలికులికిపడే
బుడ్డోడి గుండెలు తట్టి చూడు!
 అక్కడ తెరుచుకుంటుంది అసలు కవిత్వరహస్యకవాటం!


-కర్లపాలెం హనుమంత రావు
(సాహిత్య ప్రస్థానంలో ప్రచురితం)




No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...