Saturday, June 20, 2015

అదీ కామెడీ- ఓ సినిమా తారుమారు తమాషా


ఇప్పుడంటే మొదలైనప్పట్నుంచీ పూర్తై హాలు బైటికి వచ్చేదాకా హోరెత్తించే ‘సౌండు’ కానీ.. చలనచిత్రాల మొదటి దశ మూగది. 
తెరమీద బొమ్మలాడుతుంటే అనువాదకుడు హాలు మూల నిలబడి పెద్ద గొంతేసుకుని తనకు తోచిన వ్యాఖ్యానం చేస్తుండేవాడు. అప్పట్లో వచ్చినవన్నీ ముంబై.. కలకత్తా మార్కు హిందీ.. బెంగాలీ ‘మేకు’లు. కనక ఈ అనువాదకుడి సాయం మన ప్రేక్షకులకు అవసరమయేది. అప్పట్లో జరిగిన ఒక వాస్తవ సంఘటన ఇది. సంఘటన పాతదే ఐనా.. అందులోని హాస్యం మాత్రం సదా తాజాదే. చిత్తగించండి చిత్తమున్నవారు.
ఒక హిందీ సినిమా మొదటి రోజు మొదటి ఆట మ్యాట్నీ మొదలైంది ఒక తెలుగు వూళ్ళో. బాక్సు చివరి నిముషంలో రావడం వల్ల హాలు వాళ్ళకు వేసుకుని చూసుకునే సావకాశం లేక పోయింది. వచ్చిన రీళ్ళను ఆదరాబాదరాగా ప్రోజెక్టరు ఆపరేటరు రోలర్ల్లకు చుట్టేసి సినిమా మొదలు పెట్టేసాడు. 
కథ నడుస్తోంది. అనువాదకుడు భీభత్సంగా అనువాదం చేసి పారేస్తున్నాడు తనకు తోచిన పదజాలంతో. చివరికి అన్ని చిత్రాలలో లాగేనే కథానాయికను నానాతిప్పలు పెట్టిన ప్రతినాయకుడు ముష్ఠియుద్ధంలో కథానాయకుడి చేత చితకబాదించుకుని.. ఎలాగైతేనేం.. చచ్చాడు చివరికి. అనువాదకుడు తన వ్యాఖ్యానంతో రెచ్చి పోతూ స్వస్తి వాక్యాల్లో ఇలాగా నీతి బోధ మొదలుపెట్టాడు "అంతిమ విజం న్యాయానికి, నీతికే లభిస్తుందని మరో సారి రుజువైంది. ఎంత కాలం దుష్టుల ఆగడాలు చెల్లుతాయి?! చెల్లవు. చెల్లనే చెల్లవు! ఈ చిత్రంచెప్పేది అదే నీతి” అంటూ. జనం లేచారు హుషారుగా ఈలలేసుకుంటో సినిమా ఐపోయిందని. 
కానీ..
చచ్చిన ప్రతినాయకుడు.. ఎలా బ్రతికి వచ్చాడో?! మద్యం తాగుతూ.. వికటాట్టహాసాలతో కథానాయికను తెగ చెర బట్టేస్తున్నాడు! తెల్ల బోవడం ప్రేక్షకుల వంతయింది. 

చితకబాదుదామనుకుంటే అనువాదకుడు ఏడీ? ప్రాజెక్టు రూంలోకెళ్ళి నక్కి కుర్చున్నాడు.

(రీళ్లుచుట్టే హడావుడిలో ఎలా జరిగిందో ఏమో కానీ..చివరి భాగం ముందుకి.. ముందు భాగం చివరికి తారుమారయాయండీ!.. అదీ కామెడీ  )

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...