Wednesday, March 3, 2021

పరిష్కారం - కథానిక- ఈనాడు ఆదివారం అనుబంధం -కర్లపాలెం హనుమంతరావు

 


బ్యాంక్ ఇన్ స్పెక్షన్ పని మీద బాపట్ల వచ్చా. బయలుదేరినప్పటి నుంచి ఒకటే ముసురు. మధ్యలో వచ్చిన ఆదివారం చీరాల బయలుదేరా. అక్కడ మా మా మరదలు జయలక్ష్మి భర్త సాల్మన్ ఆసుపత్రిలో కాంపౌండర్ గా పనిచేస్తున్నాడు. ప్రసాద్ అనుకుంటా అతని పేరు.

జయ ఇంటి అడ్రస్ పట్టుకునే వేళకు చీకటి చిక్కబడింది. వర్షానికి బట్టలు బాగా తడిశాయి. నన్ను చూడగానే జయ మొహం చాటంతయింది.

ప్రసాద్ ఊళ్లో లేడు. చెల్లెలి కొడుక్కి బారసాలని అద్దంకి వెళ్లాట్ట. 'రాత్రి కొస్తాడులే బావా! రాక రాక వచ్చావు. ఈ పూటకు ఉండిపో!' అంటూ మహా బలవంతం దానిది. ప్రసాదుకి ఫోన్ చేసి 'మనల్ని చూడ్డానికి మా ప్రసాదు బావ వచ్చాడండీ! ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా మీరు బైలుదేరిరావాల్సిందే' అని ఫోన్ లోనే ఆర్డరేసింది. అవతల అతనే మన్నాడో గాని సెల్ నా చేతికందింస్తే 'సారీ బ్రదర్! సమయానికి ఇంట్లో లేకుండా పోయా. ఇక్కడా బ్రహ్మాండమైన వర్షం. లాస్ట్ బస్ డౌటే! మాగ్జిమమ్ ట్రయ్ చేస్తా! మీరయితే ఉండి పోండి.. రేపు మాట్లాడుకుందాం' అన్నాడు. ‘గాలికి, వానకు ఈపూరుపాలెం దగ్గర కాలువ పొంగి రోడ్డు మీదకు నీళ్ళు పారుతున్నాయ్! బస్సులూ రైళ్ళూ ఎక్కడివక్కడ బంద్!' అని చెప్పిపోయాడు  పాలు పోసెళ్ళే అబ్బాయ్. ఇహ చేసేదేముంది? జయ వాళ్లాయన పొడి బట్టల్లోకి మారి టి.వి చూస్తూ కూర్చున్నా.

 

జయలక్ష్మి మా మేనమామ కూతురు. చిన్నప్పుడు దీన్నంతా నా పెళ్లామంటూ ఆటపట్టించేవాళ్లు. నేను వైజాగ్ లో ఎమ్మెస్సీ చేసే రోజుల్లో తను ఇంటర్. కోచింగ్ సెంటర్ మాష్టారెవరో వెంట బడితే ..పిచ్చిది.. నమ్మింది. ఇద్దరూ కలసి ఓ రోజు మాయం. మామయ్యెంత వెదికించినా ఆచూకీ దొరకలేదు. అత్తయ్య మంచం పట్టింది. మూణ్ణెల్ల తరువాత తనొక్కతే ఏడుస్తూ తిరిగొచ్చిందని విన్నా. నాకు చేసుకోన్నాడు మామయ్య. అమ్మ పడనీయలే. ఆ తరువాతే ఈ యానాం సంబంధానికి ఇచ్చి చేసింది.  పెళ్ళికి ఎవరికీ పిలుపుల్లేవు. మామయ్య పోయిం తరువాత అత్తయ్య చాలాకాలం కూతురు దగ్గరే గడిపింది. ప్రసాద్ మొన్నీ మధ్య దాకా దుబాయ్ లో ఉండొచ్చాడు. అల్లుడు తిరిగి రాగానే అత్తయ్య తన తమ్ముడు పంచన చేరింది ఎందుకో! జయలక్ష్మికి ఇప్పుడు ఏడాదిన్నర పాప.

జయలో మునుపటి కళ లేదు. 'చూసి చాలా కాలమయింది కదా! అందుకే అలా అనిపిస్తిందేమోలే!' అనుకున్నా. ఆ చీకట్లోనే విందుభోజనంలోలా చాలా చేసింది. తనింత బాగా చేస్తుందనుకోలేదు. శ్రద్ధగా అసలు చేస్తుందనుకోలేదు.

పాప అప్పటికే నిద్రకు పడింది. వంటిల్లు సర్దుకుంటూ 'తనింక రాడు కానీ, నువ్వెళ్లి మా బెడ్ రూంలో పడుకో బావా! నేనొస్తున్నా' అంది.

అటు వైపు తొంగి చూస్తే అక్కడ ఒకటే సింగిల్ కాట్! నేను షాక్!

షాకివ్వడం జయకు ఇది మొదటిసారి కాదు.

నా డిగ్రీ  రోజుల్లో ఓ సారి ఇంతకన్నా పెద్ద షాకే ఇచ్చింది మహా తల్లి. ఆ సారి వేసవి సెలవులకని  మామయ్యావాళ్ళ ఊరు వెళ్లాం మేం. ఆ ఊరికి సముద్రం దగ్గర. అందరం స్నానాలకని బైలుదేరాం. పెద్దాళ్లు సరుగుతోటల్లో భోజనాలు సిద్ధం చేస్తున్నారు. జయను మంచి నీళ్లు తెమ్మంటే బిందె తీసుకుని బైలుదేరింది. వెనకాలే చేదతో తోకలా నేను. ఇదా రోజుల్లో దోరమామిడి పండులా ఉండి కుర్రాళ్లను బాగా ఇబ్బందిపెట్టేది. బిందెను చంకలోకి ఎత్తే టైములో తట్టుకోలేక నేనూ చటుక్కుమని ఓ చెంప మిద ముద్దెట్టేశా.  అది షాకయింది. వెంటనే తేరుకొని 'ఒకసారి బిందె దించు బావా!' అంది తాపీగా. ఇంకో ముద్దు కోసమేమోనని నేను సంబర పడ్దంత సేపు పట్టలే. చేతులు ఖాళీ అవగానే నా రెండు చెంపలు రెండు సార్లు టపటపా వాయించేసింది. 'ఒక ముద్దేగా ఇచ్చింది. రెండు సార్లెందుకే కొట్టావ్ రాక్షసీ?'అనడిగితే

'ఒకటి ఇప్పుడు చేసిన పిచ్చి పనికి. ఇంకోటి ఇక ముందెప్పుడూ చెయ్యకుండా ఉండటానికీ! నా బుగ్గల్ని టచ్ చేసే హక్కు ఒక్క నాగరాజు సార్ కే ఉంది.. మైండిట్' అంది.

'వాడెవడే?' అనడిగా నా మైండ్ ఖారాబయి.

'నాక్కోయే మొగుడండీ బావగారూ!' అంది.

అదీ నా మొదటి షాక్! తేరుకుని 'ఇంట్లో తెలుసా?' అని అడిగితే.

'చెప్పలేదు. నువ్వూ చెప్పద్దు! చెప్పావో నేను చచ్చినంత ఒట్టే' అని బిందె మీదికి తీసుకుంది.

ఇది నిజంగా ఎక్కడ చస్తుందో అన్న భయంతో నేనూ ఇంట్లోవాళ్లవరికీ చెప్పలేదప్పట్లో.

***

పాప ఏడుపుతో ఈ లోకంలోకొచ్చి పడ్డా. కేండిల్ ఆరిపోయివుంది. చీకటికి భయపడనుకుంటా ఆ ఏడుపు. కొవ్వొత్తి వెలిగించి పెట్టి పాపను జోకొట్టి నిద్రపుచ్చి ఇంకో వెలిగించిన కేండిల్తో ఈ గదిలో కొచ్చింది. గాలికి కొవ్వెత్తి ఆరిపోకుండా కిటికీ తలుపులు మూస్తూ 'నువ్వొచ్చినప్పట్నుంచి చూస్తున్నా. ఏంటి బావగారూ ఊరికే తెగ ఆలోచించేస్తున్నారూ?' అని అడిగింది జయ.

ఏమని చెప్పాలి దీనికి?

'నాకంతా తెలుసులే! అసలిక్కడేం జరుగుతుందో కూపీ తీసి రమ్మని పంపించింది కదూ అత్తయ్య? మా అమ్మేదో అత్తయ్యకు చెప్పుకుని ఏడ్చుంటుంది. అవునా?' అని సూటిగా అడిగేసిందీసారి ఓ కుర్చీ నా బెద్ పక్కకే లాక్కుని కూర్చుని.

'జయ ఈ మధ్య మాటి మాటికి అత్తయ్యకు ఫోన్ చేసి ఇంటి కొచ్చేస్తానని ఏడుస్తోందిట్రా! ఏం జరుగుతుందో.. ఏంటో కాస్త కనుక్కో వీలయితే!' అని అమ్మ నేనిక్కడకొచ్చే ముందు హెచ్చరించిన మాట నిజమే.

'ఒక రకంగా అమ్మావాళ్లే నా బతుకును నరకం చేశారు బావా! వద్దన్నా నాన్న నాకీ పెళ్లిచేశాడు' అంది నిష్ఠురంగా. ఎప్పుడో పోయిన మామయ్యను ఇప్పుడిది తప్పుపడుతోంది  అన్యాయంగా.. చేసిందంతా తను చేసుకుని.

'ప్రసాదు మంచివాడు కాదా?' అనడిగాను హఠాత్తుగా. వచ్చినప్పట్నుంచి అడగాలనుకుంటున్న సందేహం అది.

'నువ్వు మంచాడివా కాదా?!' ఎదురడిగింది జయ.

‘ఆ సంగతి నువ్వు కదే చెప్పాలి!’ అన్నా ఈ సంగతి ఎటు తిరిగి ఎటు మళ్లుతుందోనని కొద్దిగా బంగతో.

'నన్నడిగితే నువ్వూ అంత మంచోడివేం కాదులే బావా?'

'మధ్యలో నేనేం చేశానే దయ్యం?' బిత్తరపోతూ అడిగాను.

'నిజంగా నువ్వు మంచోడివే అయ్యుంటే ఆ రోజు నేను నాగరాజుగాడిని గురించి చెప్పినప్పుడు నా రెండు చెంపలూ వాయించుండేవాడివి. లేదా ఆ నాగరాజు ఎలాంటి నిక్రిష్టుడో విచారణ చేసుండేవాడివి. కనీసం మా ఇంట్లోనైనా హెచ్చరించుండేవాడివి'

'చెబితే చస్తానని బెదిరిస్తివి గదే?'

'చిన్నపిల్లవాడేదో తెలీక నిప్పు ముట్టుకుంటామని మారాం చేస్తే ముట్టుకోస్తామా? నిప్పునన్నా ఆర్పేస్తాం. లేదా పిల్లవాడినైనా దూరంగా తీసుకెళతాం. ఏదీ చెయ్యలేదు కదా  నువ్వు!' అంటూ లేచెళ్లిపోయింది.

జయలక్ష్మి అభియోగానికి విస్తుబోయాను. మొత్తానికి ఇదెందుకో బాగా బాధపడుతోంది. సమస్యేమిటో తెలిస్తేనే గదా పరిష్కారం వెదకడానికి!

***

ఎప్పుడు నిద్రపట్టిందో తెలీదు. ఎక్కడి నుంచో సన్నగా ఏడుపు వినిపిస్తుంటే ఆ మూలుక్కి ఉలిక్కిపడి లేచా. కేండిలెప్పుడో ఆరిపోయినట్లుంది. అంతా చిమ్మచీకటి.

పక్కగదిలో  నుంచే ఆ మూలుగులు. పాప పక్కన పడుకునున్న జయలక్ష్మి నిద్రలోనే ఉండి ఉండి ఏడుస్తూ కలవరిస్తోంది. కలవరిస్తో ఏడుస్తోంది. తట్టి లేపే ప్రయత్నం చేస్తే సగం నిద్రా, సగం మెలుకువలో ఉన్నట్లుంది ఇంకా ఏదేదో వాగుతోంది అస్పష్టంగా. 'ప్రసాదు మంచివాడే బావా! పాపనూ, నన్నూ బానే చూసుకుంటాడు. ఏదడిగినా కాదనడు పాపం. అయినా ఆడది అన్నీ అడగుతుందా? అదే ఉప్పూ కారం కదా మగాళ్లు మీరూ తినేది? సంసారం వద్దనుకుంటే ఈ పెళ్లెందు కసలు చేసుకోవాలి పురుషపుంగవా?' ఏడుపు మధ్యలో ఇట్లాంటివే ఏవేవో కలవరింతలు. బలవంతాన నిద్రలేపే నా ప్రయత్నంలో రెండు మట్టిగాజులు కూడా చిట్టినట్లున్నాయి.

కరెంటు రావడంతో జయకు పూర్తిగా మెలుకువొచ్చేసింది. కొంత నయం.  జరిగింది తనర్థం చేసుకునే లోపే తలుపు టకటక చప్పుడయింది!

జయే వెళ్లి తలుపుతీసింది

'రెండు దాటింది. ఇంకా పడుకోలేదా?' అంటూ మగమనిషి ఒకతను లోపలికొచ్చాడు చొరవగా!  అతనే ప్రసాదని ఇట్టే అర్థమయింది 'మీరు పొద్దున్నే వెళ్లిపోతారుట గదా! ఎట్లాగైనా రావాలని మా మహరాణిగారి ఆజ్ఞ. లారీ పట్టుకునొచ్చేసే సరికి ఈ వేళయింది.'అంటూ అతను  గలగలా మాట్లాడే తీరులోనే మనిషెంత బోళానో అర్థమయిపొయింది. ఈ మనిషి మీదనా జయకన్ని కంప్లయింట్స్! నమ్మబుద్ధికాలే!

 బెడ్ రూంలోకి తొంగి చూసి 'మీరు పడుకోండి బ్రదర్! తెల్లారి అన్నీ మాట్లాడుకుందాం!' అంటూ పాప మంచం పక్కనే  ఓ చాప పరుచుకుని క్షణాల్లో నిద్రలోకి జారుకున్నాడు ప్రసాద్ పసిపిల్లాడికి మల్లె! జయ కొద్దిగా ఎడంగా పడుకుండిపోయింది.

'మొగుడూ పెళ్లాల మధ్య ఏం జరిగుంటుందీ? తను మూడో మనిషి. కలగజేసుకోడం ఎంత వరకు భావ్యం? ఇలాంటి ఆలోచనలతోనే నాకు  ఆ మిగతా రాత్రంతా సరిగ్గా నిద్రే పట్టలేదు.

తెల్లారి ఇన్ స్పెక్షన్ చివర్రోజు. పని ఎక్కువగా ఉంటుంది సహజంగా. ప్రసాద్ నిద్రలో ఉండగానే బట్టలు మార్చుకుని జయ ఇచ్చిన కాఫీ తాగి   బాపట్ల వచ్చేశా. సాయంత్రానికల్లా రిపోర్ట్ సబ్మిట్ చేసి లాడ్జ్ రూమ్ ఖాళీచేసే పనిలో ఉండగా ప్రసాద్ ఫోన్ చేశాడు 'సారీ! బ్రదర్! తీరిగ్గా మాట్లాడుకోవడమే కుదిరింది కాదు. మీరే ట్రెయిన్ కండీ వెళ్లేదీ?'

'చార్మీనార్! రాత్రి పదిన్నరకండీ డిపార్చర్' చెప్పాను.

'స్టేషన్లో ఆటో దిగుతుంటే నవ్వుతో ఎదురొచ్చాడు ప్రసాద్.. ఓ ప్యాకెట్ అందిస్తో. 'ఏంటిదీ?' అనడిగితే 'యేఁ అందర్ కి బాత్ హైఁ' అన్నాడు చిలిపిగా కన్నుగీటుతూ. విప్పి చూస్తే నా అండర్ వేర్. తెల్లారి సగం చీకట్లో నాదనుకొని అక్కడే పడున్న ప్రసాద్ డ్రావర్ వేసుకొచ్చిన సంగరి లాడ్జ్ కి రాగానే తెలిసింది.  కానీ, అలాంటివి తిరిగెలా ఇవ్వడం? బావోదని లాడ్జ్ రూమ్ లోననేవదిలేసి వచ్చా. చిన్నపిల్లవాడి తత్వం కాబట్టి ప్రసాద్ భద్రంగా ప్యాక్ చేసి మరీ పట్టుకునిచ్చాడు! సాటి వ్యక్తులపై అతని 'కన్ సర్న్' నన్ను బాగా ఇంప్రెస్ చేసిన మాట్ నిజం.

ఇంత మంచి వ్యక్తి ముందు జయ చేసిన అభియోగాన్ని చర్చకు పెట్టడం ఎలాగా? అన్న నా ఆలోచనలో నేనుండగానే తనే అన్నాడు 'రాత్రి జరిగిందానికి జయ తరుఫున నేను సారీ చెబుతున్నా బ్రదర్! గాజు ముక్కల విషయం నేనడక్క పోయినా తనే చెప్పిందంతా. తనెందుకో కొంత కాలంగా రోజూ అలాగే బిహేవ్ చేస్తోంది'

'జయ ఇంతప్పట్నుంచీ నాకు తెలుసు ప్రసాద్ గారూ! బైటికి అట్లా రూడ్ గా అనిపిస్తుంది కానీ, షి ఈజ్ వెరీ సెన్సిటివ్! ఎందుకో బాగా అప్సెట్టయిన మూడ్ లో ఉన్నట్లనిపిస్తోంది నాకు. సమస్యేంటో భర్తగా మీరే కనుక్కోవలసింది!' అన్నాను నిష్టురంగా!

'మీరేమనుకుంటున్నారో నాకు అర్థమవుతూనే ఉంది సుందరంగారూ! అందుకే నేనింత దూరం వచ్చింది. అన్ని సంగతులూ ఫోన్లలోనో, త్రూ ఈ-మెయిల్సో చెప్పడం కుదరదు కదా! బండికింకా అరగంట టైముంది. కూర్చుందాం రండి!' అన్నాడు ప్రసాద్.

అక్కడే ఉన్న సిమెంట్ బెంచీ మీద చతికిలబడ్డాం ఇద్దరం. తను చెప్పడం మొదలుపెట్టాడు.

'పెళ్లికి ముందే నాకు నాగరాజును గురించి మామయ్యగారు వివరంగా చెప్పేరు. పెళ్లి నాటికి జయ మూడు నెలల గర్భవతి. రహస్యంగా అబార్షన్ చేయించాలని యానాం తీసుకువచ్చారు. అప్పటికే పిండం గట్టిపడివుంది. ఆ దశలో అబార్షన్ అంటే పెద్దప్రాణానికి రిస్క్ చాలా ఎక్కువని డాక్టర్లు చెబుతున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. మా చిన్నచెల్లాయికి చాలా రోజుల నుంచి బాలేకపోతే  అదే ఆసుపత్రిలో వైద్యం నడుస్తోంది. మా నాన్నగారు అక్కదే చనిపోయారు ఎయిడ్స్ తో.. ఆ గొడవల్లో చదువు సరిగ్గా సాగక డిగ్రీలో ఫెయిలయివున్నా నేను  అప్పట్లో. ఉద్యోగం లేదు. చిన్నచెల్లి జబ్బు. పెద్దచెల్లికి ముదిరిపోయే పెళ్ళి వయసు.  నా ఇంటి సమస్యలను తీరుస్తానంటే జయలక్ష్మిని పెళ్లాడతానని నేనే బేరం పెట్టాను మామయ్యగారితో. చెల్లెలి పెళ్లి, నా కాంపౌండర్ ఉద్యోగం మామయ్యగారి చలవే.'

'మరి అన్నీ తెలిసుండి చేసుకుని మా జయను ఎందుకండీ ఇంకా బాధపెట్టడం! సారీ! ఇలా అడిగానని మరోలా అనుకోవద్దు! జయ నాకు కేవలం మరదలే కాదు.. చిన్ననాటి నుంచి గాఢస్నేహితురాలు కూడా!'

'అవన్నీ తెలుసు. జయ ఎప్పుడూ మీ గురించి చెబుతుంటుంది. అందుకే నేనింత దూరం వచ్చి వివరణ ఇచ్చుకోడం! జయంటే నాకూ ప్రాణమే సార్! అందుకే కష్టమైనా నేను తనకు దూరంగా ఉంటున్నది. పెళ్లయిన వెంటనే దుబాయ్ వంకతో దూరంగా వెళ్ళిపోయిందీ అందుకే!'

ప్రసాద్ గొంతు వణుకుతోంది సన్నగా. అతనేదో చెప్పాడు. ట్రైన్ ఎరైవల్ ఎనౌన్స్ మెంట్ గోలలో సరిగ్గా వినబడలేదు. బండి ఫ్లాట్ ఫారం మీదకు ధనాధనా దూసుకురావడం, ప్యాసింజర్ల హడావుడీ హఠాత్తుగా మొదలవడంతో.. నేనూ అలర్టయ్.. లగేజీతో సహా నా రిజర్వుడ్ కంపార్డ్ మెంట్ వైపుకు పరుగెత్తాను.

సీటులో సెటిలయే వేళకి డిపార్చర్ ఎనౌన్స్ మెంటు స్టార్టయింది. ఎప్పుడు కొనుక్కొచ్చాడో ఓ డజన్ ఏపిల్సూ, డజన్ ఆరెంజెస్.. వాటర్ బాటిల్ .. విండో గుండా అందించాడు ప్రసాద్.

'థేంక్యూ ఫర్ యువర్ కన్సర్మ్ మిత్రమా! ఇందకా మీరేదో అన్నారు గాని, ట్రైన్స్ అనౌన్స్మెంట్స్  గోలలో సరిగ్గా వినిపించలా! మళ్లీ చెప్పండి ప్లీజ్!'

గార్డ్ విజిల్ వేశాడు 'ఆ గజిబిజిలోనే ప్రసాద్ పెద్దగా అన్నాడు 'నా పెళ్లయిన వారానికల్లా నా చిన్నచెల్లెల్లూ చనిపోయింది సార్.. అదే ఎయిడ్స్ ప్రాబ్లమే! అనుమానం వచ్చి నేనూ టెస్టులు చేయించుకున్నా తరువాత! హెచ్చైవి పాజిటివ్ అని వచ్చింది. ఏడెనిమిదేళ్లకు మించి లైఫు ఉండదన్నారు.. పూర్తి ఆరోగ్యం ఇంక అసాధ్యమని కూడా చెప్పారు. పాపకు తండ్రిని నేనెలాగూ ఉండను. తల్లిని కూడా లేకుండా చెయ్యడం నా వల్లయ్యే పని కాదు సార్! ఈ సంగతులేవీ జయకు తెలీవు. చెబితే తట్టుకోలేదు. అందుకే రోజూ రాత్రి.. ఆ దెబ్బలాటలు.. ఏడుపులు'

బండి క్రమంగా స్పీడందుకుంటున్నప్పుడు 'పిన్నిగారినీ, డాక్టర్ గారినీ అడిగానని చెప్పండి!' అని చేతులూపుతూ ఫ్లాట్ ఫామ్ మీద నవ్వుతూ నిలబడిపోయిన ప్రసాద్ వంక అలా చూస్తూ షాకయిపోయాను.

***

డాక్టర్ గారు అంటే నా భార్య శ్యామల. ప్రసాదు చెప్పిందంతా తనకూ చెప్పి జయకు అడుగడుగునా ఇలా అన్యాయం  ఎందుకు జరుగుతుందో అర్థం కాకుండా ఉంది?' అని బాధపడ్డాను.

'నా అనుమానం నిజమైతే ప్రసాదుకలా హెచ్చైవి పాజిటివ్ అయ్యే అవకాశం లేదు సుందరం!' అనేసింది శ్యామల.

'ఎలా?!'

'ప్రసాద్ గారి పెద్దచెల్లెలు చక్కగా కాపురం చేసుకుంటుదన్నారుగా! ఆయన తండ్రికి హెచ్ ఐ వి అఫెక్టయ్యే నాటికే మొదటి ఇద్దరు పిల్లలూ పుట్టేసున్నారు. ఆయన పాజిటివ్ అయిన తరువాతనే చివరి అమ్మాయి పుట్టినట్లుంది. సరైన టైములో తెలుసుకుని మంచి ట్రీట్ మెంటు ఇచ్చి ఉంటే ఆ పిల్ల కూడా భేషుగ్గా బతికుండేది. ఇవాళ హెచ్చైవి అసలు  ఫాటల్ డిసీజెస్ జాబితాలోనే లేదు. మెడిసన్ లైన్లో ఉండీ మీ ప్రసాదు ఇంత  మూర్ఖంగా ప్రవర్తించడం ఆశ్చర్యంగా ఉంది' అంది శ్యామల.

***

మా కొత్తింటి గృహప్రవేశం వంకతో జయలక్ష్మి దంపతులను హైదరాబాద్ రప్పించాను. అదను చూసుకుని ప్రసాదుకి పరీక్షలు జరిపిస్తే శ్యామల చెప్పిందే నూటికి నూరు పాళ్లు నిజమయింది.

'మరి మా యానాం డాక్టర్లు అలా ఎలా చెప్పారు మేడం?' అని ఆశ్చర్యపోయాడు ప్రసాద్.

'మీరు ఖర్చుకు జంకి ఎవరో నకిలీ డాక్టరును ఆశ్రయించారు. మీ దురదృష్టం కొద్దీ వాడెవరో డబ్బు గుంజటానికి రోగుల జీవితాలతో ఆడుకొనే ధనపిశాచి అయిపోయాడు! ఇట్లాంటి రోగాలు వచ్చినప్పుడు ఒకటికి రెండు సార్లు వేరే వేరే మంచి డాక్టర్లకు చూపించుకుని గాని ఒక నిర్ధారణకు రకూడదనేది అందుకే!' ఆన్నది శ్యామల.

'మా జయను నిష్కారణంగా క్షోభకు గురిచేసినందుకు  మీకు పనిష్ మెంటు తప్పక వేయాల్సిందే బ్రదర్! ఇన్ స్టాంట్ హనీమూనుకు ఓ వారం వెళ్లిరండి ఇద్దరూ! పాపను గురించి బెంగ వద్దు! మీ అత్తగారు అట్లాంటి  డ్యూటీలకే  ఎదురుచూస్తోంద’ అన్నా పరిష్కరించమని నాకో సమస్యను చుట్టబెట్టిన మా అత్తయ్య వంక చూసి నవ్వుతూ.

 

ఏడాది తరువాత  జయలక్ష్మి కొడుక్కి బారసాలంటే వెళ్లాం నేనూ శ్యామలా. 'పేరేం పెడుతున్నావే?' అని జయనడిగితే, ఎప్పట్లానే తల బిరుసుగా 'నీ డొక్కు పేరు ఒక్కటే కాదులే బావా! అక్క పేరు కూడా కలుపుకుంటాం’ అంది బుజ్జి శ్యామసుందరాన్ని నా ఒళ్లో పడుకోబెడుతూ!

********


-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు ఆదివార అనుబంధం ప్రచురితం)

03 -03 -2021 










No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...