Friday, March 5, 2021

చుట్ట, ఉడుత, నల్లి, చీమ ల, క్షురకర్మల మీద పద్యాలు

 చుట్ట కంపుః

అగ్గిపెట్టె తీసి ఆత్రముతో అతడును

పట్టి కాల్చి పీల్చె చుట్ట నతడు

యేమి ఖర్మయనుచు ఇతరులు తిట్టిరి

ఎవరి కంపు వారికి ఇంపుగాదె!

*

ఉడుతః

అటు జూచు నిటు జూచు నన్ని దిక్కుల జూచు

 నిమిషమైనను నొకట  నిలువలేదు-

వీపున నానాడు ప్రేమతో  రాముడు

 చేతగీటె ననుచు జీరిచూపు-

మెడను ద్రిప్పుచు జూచు మింటి వైపు

చిటిక వేసినంత చిందిలిపాటున

పరుగెత్తుకొని పోవు భయము తోడ

చిన్ని యుడుత ఉండదగునె కన్ను మూసి-

నిముసమొక్క యుగమగు నిజము జూడ!

*

మనుజుల రక్తము ద్రాగుచు

చనెదవు నీ దారి నీవు సరసర నల్లీ!

మనుజుల రక్తము పిండుచు

కనుచుందురు మరలిపోక ఖలులీ ధరణిన్.

*

చీమలు

కలసి మెలసి మీరు కట్టుబాతు కలిగి

మనుట జూడలేము మనుజల లిలను'

తెలివి యున్నదంచు ధీరుల మనుచును

చెప్పుకొనుట సరియె చీమలార!

*

గడియారం

నీవు లేపిన గాని నిదుర లేవను లేడు

కునుకు తీయుచునుండు కొసరి కొసరి

నీవు చెప్పిన గాని పోవగ నేరడు

బ్రదుకు తెరువు చూపు పనులు చేయ

నీ చలనము చూచి నిలువగ లేడింక కమ్మగ మెక్కును కడుపు నిండ

నిన్ను చూచిన గాని కన్ను మూయగ లేడు

నీవె దైవమంచు నిలిచి మొక్కు

నీకు బానిస అయ్యె నరుడు నిజము

కాలమహిమంబు తెలియంగ గాదు జగతి

నడిచి గడియారమా! యింక నన్ను నడిపి

కట్టుకుని పొమ్ము పుణ్యమ్ము కరుణ కలిగి!

*

క్షుర మర్ధనంః

తలవంచని వీరుండును

కలిగినవాడైనగాని ఖలుడే యైనన్

పలుమారును దీనముగా

తలవంచును నీకు సరియె ధరలో క్షురకా?

-శ్రీ రాళ్లపల్లి సుందరం

 (ప్రాస్తవిక పద్యములు- ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక- పక్ష పత్రిక - 69 -5 )

సేకరణః కర్లపాలెం హనుమంతరావు

05 -03 -2021

 

 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...