Saturday, December 4, 2021

ఈనాడు - గల్పిక చరిత్ర చెప్పే పాఠం కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - గల్పిక- 10 - 09-2011 )

 



ఈనాడు - గల్పిక

చరిత్ర చెప్పే పాఠం 

కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - గల్పిక- 10 - 09-2011 ) 


శ్రీరామచంద్రుడి దయలేకపోతే ఎంత మంది శ్రీరాములున్నా ఏమీ సాయంచేయలేర్రా ! 


గాలి గారి గురించేనా నువ్వనేది బాబాయ్ ? వినాయక చవితినాడు పూజ చేయకముందే చంద్రుణ్ణి చూసేసినాట్లున్నాడు . 


తెల్లరగట్లే బంగారు ఆసనంమీద సింహంలాగా కూర్చున్నవాడు. పొదుగూకే లోపలే చంచల్ గూడా జైల్లో చిట్టెలుకగా  తేలాడంటే  అదంతా జాతకచక్రంలోని దోషం వల్లనేరా  ! ఎన్ని వందల సెల్ ఫోన్లుంటే మాత్రమేం యూజ్ ... 'సెల్" యోగం తప్పించలేనప్పుడు ! కోట్లుపోసి కొనుక్కుని పెట్టు కున్నాడు అన్నన్ని హెలికాప్టర్లూ,  చాప్టర్లూ! ఒక్కటైనా ముగిసిపోయిన ఆయన చాప్టర్ మళ్ళీ తెరనగలగిందా 


గోనెసంచుల్లో కుక్కి  నేలమాళిగలో పూడ్చిపెట్టించాడు అన్నేసి వందలకోట్లు.  తలలూపే నేతల్నీ, తోకలూపే అధికారుల్ని మేపటానికీ,   ఓట్లను కొనడానికైతే అవి పనికొస్తాయేమోగానీ- జైలు చిప్పకూల్లో సంజుకోవడానికి ఒక్క  పచ్చిమిర్చి  కొండానికైనా  అవిప్పుడు పనికొచ్చేనా? 


తలరాతను తప్పించడం పుట్టించిన బ్రహ్మ తరం కూడా కాదు. సద్దాం హుసేన్ గుర్తున్నాడుగదా! .. చివరి రోజుల్లో కలుగులో కాలక్షేపం చేశాడు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ని పేకముక్కల్లా కూల్చేసిన బిన్‌ లాడెన్ బతుకేమైంది? అమెరికా కమెండో తుపాకీ గుండుకు టుపుక్కుమని సెకనులో చచ్చూరు కున్నాడు. హోస్నీ ముబారక్ కుక్కిమంచంలోనే ముక్కుతూ మూలుగుతూ కోర్టుల చుట్టూ చక్కర్లు కొడుతున్నాడు. ఎంత కిలాడీ అయినా, కాలం కలిసే  వరకే వైకుంఠపాళిలో పైకి ఎగబాకేది . అందాకా  అదంతా తమ ఘనకార్యమే అన్న భ్రమలో తేలుతుంటారు .. ఇదిగో .. ఈ  గాలి సోదరులకు మల్లే . గాలి ఎదురు వీస్తే ఎన్ని మతిమరుపు వేషాలేసినా కొట్టుకుపోడమే! గడాఫీ లనుంచి కల్మాడీల దాకా అందరిదీ ఒకే స్టోరీ . అయినా, ఒక్కడికీ వంటబట్ట దేంట్రా ..చరిత్ర మొత్తుకునే  పాఠాలో! 


నువ్వెందుకు బాబాయ్ అంతలా తల బాదుకొంటావ్ ! గ్రహాల అనుగ్రహం వల్లే బిల్ క్లింటన్ పక్కన చోటు దక్కిందని రామలింగరాజు నాడు మురుసుకున్నాడా ! తమిళంలో మా గొప్ప కవితలు   రాస్తానని గొప్పలు పోమే   ఆ కరుణానిధి సొంత కూతురు కనిమొళి జాతకం . చివరికేమైంది?  బడికెళ్లే చిన్నారి కూతురుకు 'టాటా.. బైబై  ' చెప్పుకోలేనంత చిక్కుల్లో పడింది! 


అవున్రా! ఎన్ని హెలికాఫ్టర్లు, లక్జోరియస్  బస్సులా కార్లూ జిప్సీలూ కొని దాచుకొంటే ఏంటి? కాలం కలిసి రానప్పుడు   పోలీసువాడి వాహనంలోనే అత్తారింటికి ప్రయాణం!  నేడు మధుకోడా, నేడు  జనార్ధన్రెడ్డి , నకిలీస్టాం పుల తెల్గీ ' స్టాక్ మార్కెట్ కంపు హర్షద్ మెహతా, అక్కడెక్కడి రాడో అమర్సింగు.. అందరిదీ  కొసమెరువు కథా ఒకటే ఒకటి. అయినా ఒక్కడూ పిసరంత నేర్చుకోడు! 


గురుస్థానం ఉచ్ఛ  స్థితిలో ఉన్నంత కాలమే ఏ చంద్రస్వామి ప్రభావమైనా! ఏల్నాటి శని ఎప్పుకొచ్చి పడేనో  ఎవడికి తెలుసు!ఎవడికీ ముందస్తు ఏర్పాట్లు ఉండవు! అందుకే   మహామహా నేతలు, కుబేరులు, శాంతిదూతలంతా వలకు చిక్కిన చేపల్లా గిలగిలా  కొట్టుకునేది! ... ఆ టూ-జీ రాజా కథ టూకీగా చదివినా చరిత్ర చెప్పే పాఠం ఈజీగా అర్థమవుతుంది . ' కాగ్' డ్రస్సులో  శనేశ్వరుడొచ్చి ఎప్పుడు అడ్రస్ చేస్తాడో !ఊహూ .. ఒక్కడికీ ఊహ ఉండదు!  


గుబురు మీసాల వీరప్పన్ గుర్తున్నాడా? పాడు గంధం  చెక్కలకోసం ఎంత గ్రంథం నడిపాడూ! చచ్చినాక చచ్చినోడు పుచ్చు కట్టెలతో బూడిదయ్యాడు! అదే మరి! ఓపిగ్గా వినాలేగానీ .. హిస్టరీ బోల్డన్ని స్టోరీలు చెబుతుంది.  


రాశి చక్రంలో రాజపూజ్యం రాసి ఉన్నంత వరకే బాబాయ్.. గోచి గుడ్డ క్కూడా గోల్డు లైనింగు. రాష్ట్రాధినేతలు రాసిచ్చే గనులు! 


ఆ తరాజు ఒక్కసారి అవమానం వైపు తూలిందా ..  అంతటా అవమానాలే! తలరాత తల కిందులవడానికి ఒక్క రాత్రి చాలదుట్రా! పరువు నష్టం,పరుసు నష్టం.. ముదనష్టం ఎట్లాగైనా పానీ గానీ.. కనాకష్టంగా పడుకునేందుకు పరుపు దొరకడం కూడా కష్టమే! 


'నీ జోకులకు  నవ్వాలనే ఉందిగానీ, పాపం.. గాలి సోదరులు నెత్తికి పెట్టిన గోల్ట్  కిరీటంవా  ఏడుకొండలవాడి అవస్థ చూసి ఏడుపొస్తోంది . 

అన్ని తలకాయలున్న రావణాసురుడే  భూమాత పుత్రిక  సీతమ్మ  నెత్తుకెళ్లినందుకు 'రామా' అంటూ నేలకూలాడు.  వెధవలకు చివరికి మిగిలేది ఎవరం తీర్చలేని వ్యథలే! వేదకాలం బట్టి చరిత్ర మొట్టి చెప్పుకొస్తున్న పాఠం ఇదే! దుండగులు బండ వెధవలు, పాఠాల సారం  వాళ్ల  బుర్రల కెక్కకే ఇన్నేసి గండాలు!  అసలైన ఆనందం.. 


అర్థమయిందిలే బాబాయ్ ! ఆలు బిడ్డల్తో  ఓ ఆదివారం పూట ఏ టూస్టార్ హోటల్లోనో తృప్తిగా ఇంత అని ఓ చక్కటి మూవీ చూసింటికి వస్తే అంతకు మించిన  భోగం భాగ్యం ఇంకోటి లేదనేగా నీ పాఠం టీకా .. తాత్పర్యం? 


గుడ్ ! చరిత్ర చేసే హెచ్చరికా చెవిన పెట్టి బుద్ధిగా నడుచుకోడం అంతా కన్నా ముఖ్యం .  ఇనప గనులు తవ్వి  ఇంట్లో ఇనప్పెట్టెల్నిండా బంగారం పోగేసినా చివర్లో బావుకొనేదేమీ ఉండదు.. చేసిన చెత్త పన్లకి బావురమంటం తప్పించి! 

అన్న దమ్ములకు ముష్టి అయిదూళ్లు వదలడానిక్కూడా మనసొప్పక రాజ్యమంతా  దౌర్జన్యంగా అనుభవించాలనుకున్న   బడుద్ధాయ్ ధుర్యోధనుడికి పట్టిన గతే పడుతుంది. భీమసేనుడి చేత తొడలు విరగ్గొట్టించుకునే ముందు కూడా మురికి చెరువు అడుగున ముక్కు మూసుక్కూర్చోవాల్సిన దిక్కుమాలిన ఖర్మ! 

 పురాణాలు, ఇతిహాసాలే కాదబ్బీ . . చరిత్ర మొదటినుంచీ చెప్పుకొస్తున్న పాఠం కూడా ఇదే! 


- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - గల్పిక- 10 - 09-2011 ) 

ఈనాడు - సంపాదకీయం హేమంతం రసవంతం - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - సంపాదకీయం - 28-01-2012 )

 


ఈనాడు - సంపాదకీయం

హేమంతం రసవంతం 


- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపాదకీయం - 28-01-2012 ) 


మనిషికి రుతువులకు మధ్యగల బంధు మాతాపుత్రుల అనుబంధ మంత అందమైనది. హృదయంగమమైన గతియే రుతు- అని అమర కోశ వ్యాఖ్యానం.  సృష్టిలోని సర్వ పదార్థాలు స్వధర్మాన్ని వీడకుండా ఒక క్రమంలో ప్రవర్తించే విధానాన్ని పాశ్చాత్య పదార్థవాదులు 'రిథమ్' అంటే- మన రుషులు చాలా కాలానికి ముందే దాన్ని 'రుతుధర్మం'గా నిర్ధారించారు. వాల్మీకి వంటి మహాకవులు కావ్యాల్లో పొందుపరచింది. ఈ రుతుధర్మాలనే ప్రకృతి పరిశీలన ఒకరకంగా కవుల బలహీనత కూడా . ఆధ్యాత్మ రామాయణాన్ని తేటతెలుగులో రాసిన మడకసింగన మూలంలో ఒక్క ప్రకృతి వర్ణనా లేకున్నా అనువదించే వేళ వసంత రుతు వర్ణన చేయకుండా ఉండలేకపోయాడు. వాల్మీకి మహాకవి అయితే రామాయణం అరణ్యకాండ పదహారో సర్గ నిండా హేమంత రుతువును అత్యంత హృద్యంగా వర్ణించాడు. ఏడాది అంతటికీ హేమంతం ప్రధానమైన భూషణం అంటాడా మహాకవి పూలవాన లాగా కురిసే మంచుసోన, ఆకుపచ్చని చీరెను చుట్టుకున్నట్లున్న భూభామ, చేయిపడితే చాలు చురుక్కుమనిపించే మంచునీళ్లు, ఇళ్లకు చేరే కొత్తపంటలు, పుష్కలంగా పాడి.. సమృద్ధిగా గ్రామసీమలన్నీ విలాస వాటికలై అలరారే సౌభాగ్యాన్ని కళ్ళకు కట్టించినట్లు కవి వర్ణిం చిన తీరు మనోహరం. మధ్యాహ్న మార్తాండుడూ పున్నమి చంద్రుడి లాగా చక్కిలిగింతలు పెట్టడంతో  పొట్టి పగళ్లు పొడుగు రాత్రిళ్లు యవ్వనంతో తుళ్ళిపడే యువతీ యువకులకు స్వర్గలోకపు పడకటిళ్లను తెరిచాయి - అంటాడు ఆ మహాకవి.  వాల్మీకి చేసిన ఈ రుతు రసవర్ణనల ప్రేరణ తోనే కవికుల గురువు కాళిదాసూ తొలినేతగా 'రుతుసంహారం' అందు కొన్నాడని వాజ్ఞ్మయ లోకంలోని  ఒక ఊహ. మేఘదూతాన్ని అంత అమోఘంగా కాళిదాసు చేత రాయించింది రుతుప్రీతే అన్నది కొందరి భావన.  ఎంత వసంత ప్రియుడైనా ఆ రసరాజు హేమంతాన్నీ బహుగుణ రమణీయం, స్త్రీజన చిత్తహరం, సతతం అతిసునోజ్ఞమని ప్రశంసించకుండా ఉండలేకపోయాడు. వియోగులను వేధించే హేమంత వైభోగాన్ని భాగవతం దశమస్కంధంలో పోతనా మరింత విచిత్రంగా వర్ణించాడు. చలిదెబ్బకు తాళలేక మూడు అగ్నులు ఒకటి శివుడి పాలక్షేత్రంలో, మరొకటి బడ బానలంలా కడలి  అడుగులో, మూడవది  పడుచు గుండెల నడుమ

సక్కి కూర్చున్నాయని ఆయన చమత్కారం . 


ఆహములో  సన్నము లయ్యెను/ దహనము హితమయ్యే దీర్ఘ దశలయ్యె నిశల్ / ‌ బహ శీతోపేతంబ యి / యుహుహు యని వడకె లోకమ' ని  చలికాలం ఆగడాలను అగకుండా ఏ కవి అయినా వర్ణించుకుపోతుంటే 'ఆహా' అనకుండా ఉండ తరమా! 'మాఘుమాసంబు పులివలె మలయుచుండ/ బచ్చడంబమ్ముకొన్నాడట పసరము నకు' ఒక సైరికుడు(రైతు) ఇంటనున్న  ముదితా  వత్తాసు చూసుకోబట్టి అతగాడంత దుస్సాహసానికి వడిగట్టి ఉంటాడని క్రీడాభిరామకర్త వినుకొండ  వల్లభరాయుడి కొంటె ఊహ. తప్పేముంది?  చలికాలం  చలిత హిమనీ లలిత తుషారం ' విప్రనారాయణుడికైనా, 'విప్రో'లో పనిచేసే వెంకట నారాయణుడికైనా ఒకే రకం  సంకటం.  దుప్పటి కుంపటి లేని పేదవాడికి నిప్పులాంటి చెలి పెదవులు దొరకని పక్షంలో  పడే  తిప్పలు చెప్పనలవి కానివి' అని దాశరథి వంటి ప్రజాకవే తుంటరి ఆలోచన చేశారు. 'మంచుతెరల మసకలలోన మందుపొగల మెలికలోనో / మనసెటో చిక్కినట్లే / మనేద కుదిపేస్తది లోన' అంటా కొనకళ్లవారి 'కోడలుపిల్ల' ఎద సొద - చలి ముంచుకొచ్చే తొలి ఝాము వేళ పడుచుగుండెలన్నీ పడే మదన బాధే. 'చప్పరించిన చాలు జలదరింపులు గల్గు/ పొగలు గ్రక్కెడు కాఫీ' ముట్టలేక / పలుకరించిన చాలు పకప కలాడెటి/ పొగలేని కుంపట్లు పొలుపు లేక/ చలిని గెలువంగ వశమె/ ఈ కలియుగమున ఎవరికైనా' అంటాడొక నవకవి ఓ చాటుపద్యంలో . నిజమే కావచ్చుగానీ, ఆ వెచ్చని సౌకర్యాలందరికీ అందుబాటులోకి వచ్చేవి కావే! తిట్టినా, తుమ్మినా- రుతుచక్రం ఒకరికోసం ఆగదు. ఒకరి కోసం వేగంగా సాగదు.


ఎండకాలం మండినప్పుడు గబ్బిలంవలె కాగిపోవాల్సిందే. వాన కాలం ముసిరి రాగా నిలువు నిలువునా నీరు కావాల్సిందే. శీతకాలం కోతపెట్టగ కొరడు గట్టక తప్పదు . ఆకలేసీ కేకలేస్తే చండ్రగాడ్పులు, వాన మబ్బులు, మంచుసోనలు భూమిమీద భుగ్నమవడం  కేవలం కవుల కల్పనకాదు . 'వ్యర్థంగా పారేసిన పాలథీన్ ' సంచుల సమస్తాన్నీ గుండ చేసి గాలిలోకి విసిరేసినట్లుంది' అని కసితీరా తిట్టుకున్నా, పల్లెల్ని బంధించిన కంపెనీలన్నీ కలిసికట్టుగా గాల్లోకి విసర్జిస్తున్న విషం'లాగుందని శాపనార్థాలెంత పెట్టుకున్నా- మంచు తెమ్మెరల రాయబారాలతో ఈ హేమంతమంతా నింగీనేలా మధ్య సాగించే శృంగారం తప్పనిది. రేపటి వసంతానికీ హేమంతమే నాంది. దేహాన్ని చుట్టుముట్టిన చలి/ రోడ్డెక్కి ప్రయాణిస్తే చాలు/ మింగేద్దామా అన్నట్లు ఎదురవుతుంది మృత్యువు' అని ఒకరి బెదురు. 'భూదేవికి ప్రకృతి ప్రేమగా పంచి పెట్టే ప్రసాదం పొగమంచు' అని మరొకరి పరవశం. కవి కృష్ణశాస్త్రి అన్నట్లు 'వేసంగి కోపాలు, మూసిమేఘాలు పోసిన జల్లులు/ పున్నమి వెల్లులు అడరించు చలి కారు- జడ శిశిరము- వీటికి జడిసి మానవుడు అంధ మందిరంలోనే అశ్రు జపమాల తిప్పుకొంటూ కూర్చుని ఉంటానంటే సృష్టిచక్రం ప్రగతి భ్రమణం ఆగిపోతుందా! చెమ్మ తరగని మావికొమ్మ తిరిగి అతిశయించి అందరికీ ఆనందాలు అంది రావాలన్నా... వసంత, గ్రీష్మాలు, వర్ష శరత్తులతోపాటు హేమంత శిశిరాలనీ మనసుకు హత్తుకోవాలి. 'మండుతున్న మార్తాండ గోళం ఎదుట/ రేపు వసంత రజ్జువుతో పైకి లాగేసి రసవంతమైన, రూపకాన్ని ప్రదర్శించాలంటే... నేడు మంచుతెరల హేమంతా'న్ని దింపాలి. . తప్పదు అంటారు దాశరథి. నిజం. లోకం ఆ రూపకానికి వేదికైతే, రుతువులన్నీ వచ్చిపోయే అంకాలే. 


ప్రస్తుతం నడుస్తున్నది హేమంతం. మన సారా ఆస్వాదించగలిగిన మనసులకే దీని మధురానుభవం సొంతం!


- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపాదకీయం - 28-01-2012 ) 

అనాపలింగకూస్కాం - ఈనాడు - కథానిక - గల్పిక)




అనాపలింగకూస్కాం - ఈనాడు - కథానిక - గల్పిక


ఈనాడు - కథానిక - గల్పిక- హాస్యం 

అనాపలింగకూస్కాం 

- కర్లపాలెం హనుమంతరామ 

( ఈనాడు - సంపాదక పుట - గల్పిక - 11- 10 - 2002 1 


 ' అప్పల్నాయుణ్ణి చూస్తే  నాకు జాలేస్తోంది' అన్నాడు మార్రెడ్డి  కులాసాగా.. 


పెంటపాడు రోడ్డులోని  బాడిద ఫ్యాక్టరీపని పూర్తయిన సందర్భంగా కాంట్రాక్టర్ కనకరాజు చిన్న రౌండేర్పాటు చేశాడా పూట 'మా  పార్టీకిలాంటివిప్పుడు గట్టవే అని అప్ప ల్నాయుడెక్కడ అంటాడోనని మరీ ముఖ్యుల్ని మాత్రమే పిలవాల్సొచ్చిందని మధనపడ్డాడు కనకరాజు . 


అప్పల్నాయుడు ఈ సారాట్టే  మాట్లాడటం లేదుగానీ అతని పక్కనున్న  గుర్నాథం మాత్రం వ్యవధానం లేకుండా బాదేస్తున్నాడు.


గన్ మెన్లను  తీసేసి ఆ స్థానంలో సన్నాసుల్ని ఏర్పాటు చేసింది గవర్నమెంటేనాంట అన్నారిటు వైపుకు కూర్చున్న ఈఈగారు చిర్నవ్వుతో  చిన్నగా.  ' నాయకుల్ని నిత్యం ఆధ్యాత్మిక చింతనలో వుంచడం దీని లక్ష్యం.  అవకాశం దొరికినప్పుడల్లా సావకాశంగా ఉపన్యసించటమే ఈ సన్యాసుల పని  '


'ఫ్యాక్టరీతోపాటు రోడ్డు పని కూడా అనుకున్నట్లయినట్లేనా?' అనడిగాడు అప్పల్నాయుడు రెండో రౌండారంభిస్తూ. 


'అశోకుడు రోడ్లని వేయించెను. బాటకిరు వైపులా చెట్లను నాటించెను' అన్నాడు గుర్నా థం అసందర్భంగా. 


' వేయించుకోవటానికి రోడ్డేమన్నా వేరుశనగపప్పా? ఆ'షో'కుడేకాదు. . ఆ దేవుడైనా సరే చెట్లను బాట కటూఇటూనే నాటించాలి. బాటమీద నాటిస్తే అడ్డు కదూ!' అన్నాడు మార్రెడ్డి. 


సూర్రెడ్డి వేరే పార్టీ పెద్దమనిషవటంవల్ల గుర్నాథాన్నెంత  మాటైనా అనే అవకాశం ఉంది.


'అప్పల్నాయుడూ! నువ్వేంటీ  మరీ బుద్ధావతారంలాగా  తయారయ్యావు? ' అని ఎక సెక్కంకూడా చేసేశాడు.


'బుద్ధుడినలా ఎద్దేవా చేయొద్దు.  సిద్ధా ర్థ మహారాజు కొడుకయి వుండి సర్వ సంగ పరిత్యాగంచేసి సన్యాసయిన మహానుభావుడు' అన్నాడు గుర్నాథం టాపిక్ సన్యాసుల మీదకు మళ్ళించి . 


' రాజులు సన్యాసులుగా మారటం కొత్తేం కాదే!  సుభద్రకోసం అర్జునుడు రుషి వేషం వేయలేదూ! ' అన్నాన్నేనూ . 


 'అర్జునుడు సంసారలంపటంలో ఇరు క్కునేందుకు సన్యాసయ్యాడు. మా పార్టీ ఉపదేశించేది స్వచ్ఛమైన సన్యాసం. బాహ్య సుఖాలు దుఃఖహేతువులని కదా భగవద్గీత లోని కర్మసన్యాసయోగం చెప్పేది!' అన్నాడు గుర్నాథం.


'ఖర్మ ! జన్మభూమిలో గ్రామసభలో రచ్చ బండలమీద కూడా ఈ నిత్య పురాణ  పఠనంతో  అప్పల్నాయుడూ! నీకింకా పిచ్చెక్కిపో కుండా వుందంటే ఆశ్చర్యంగా వుంది' అన్నాడు సూర్రెడ్డి జాలిగా. 


గుర్నాథం వెంటనే ఇంకో శ్లోకం అందు కున్నాడు. ఆదిశంకరాచార్యులవారి షడ్పదీ స్తోత్రంలోది. 'అవినయ మపనయవిష్ణోః దమయవానః శమయ విషయ మృగ తృష్ణామ్...' అనంగానే


భూతదయాం విస్తారయ  తారయ సంసార సాగరతః' అని పూర్తిచేశాడు అప్ప ల్నాయుడు గడగడా.


నోరెళ్ళబెట్టటం మావంతయింది. 


అప్ప ల్నాయుడు నోట్లో ఇన్ని పలుకులు నానుతున్నాయంటే ఈ గుర్నాధం ఎంతకాలం నుండి చిత్రవధ చేస్తున్నాడో పాపం. 


వెధవ పదవుల కోసం ఎన్ని తిప్పలు! అప్పల్నాయు డీటెంపో కంటిన్యూ చేస్తే ఈసారి రీషఫిల్లో మంత్రిపదవి గ్యారంటీ! 


ఆమాటే అని అభి నందించబోయానతన్ని.


' నాదేముంది. అంతా అనాపలింగకూస్కాం... ప్రభావం' అనేశాడు 


అర్థంకాలేదు. 


గుర్నాథమే అందుకున్నాడు. అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మ. స్కాంద పురాణాల పేర్లలోని మొదటి అక్షరాలను పేర్చి ముచ్చటగా వుంటుందని ఈ నినాదాన్ని తయారు చేసింది పార్టీ.  పురాణాలు మానవ జీవనానికి ప్రమాణాలు కనక మా పార్టీ సన్యాసులెవరైనా ఉపన్యాసాల చివర్లో ఈ మంత్రాన్ని దేశానికి సందేశంలాగా ఉపదేశించటం కంపల్సరీ' అన్నాడు గుర్నాథం.


'పదవులు శాశ్వతం కాదు. ధనంవల్ల దుఃఖం కలుగుతుంది. కోరికలవల్ల ఆశాంతి కలుగుతుంది. మానవ సేవే మాధవ సేవ . జగమంతా మాయ.. మిగిలిం దంతా మిధ్య.. లాంటి మాటలు మధ్యమధ్యలో పడుతూవుండాలి' అన్నాడు అప్ప ల్నాయుడు ముద్దగా. 


అప్పటికే నాలుగో రౌండయి పోయింది. నాలిక మడతపడుతోంది. ఇవతల సూర్రెడ్డి మంచి కిక్కులో ఉన్నాడు. 


' కరవొచ్చి జనం అల్లాడుతున్నారు. కరెంటు కోతతో, నీటి కొరతతో, ధరల మోతతో సామాన్యుడు సతమతమవుతావుంటే సన్నాసి కబుర్లు చెబు తార్రా మీరూ! ఓటరుకి కూడా వైరాగ్యం. పుట్టి 'ఓటు మిథ్య' అంటూ బూతువైపుకే రాకుంటే నక్సలైట్లనుకున్న పని అనాయాసంగా మనం చేసినట్లవటంలేదూ.... అంటూ చేతిలోని గ్లాసుని పగలగొట్టేశాడు. 


పెద్ద రభసయేట్లుంది. సూర్రెడ్డిని పట్టుకో వటం కష్టంగా వుంది. 


' బార్లు బార్లా తెరిచేసి జనమ్ చేతనయితే తాగటం మానె య్యాలని నీతులు చెబుతారా! సన్యాసులు సారా అమ్ముతార్రా ఎక్కడైనా? ఆర్టీసీ రేట్లు పెంచి... పెంచలేదు. సవరించామని బుకాయిస్తారా! బుద్ధుడు అబద్ధాలు చెబుతాడ్రా ఎక్కడైనా? బియ్యం బొక్కి.... పిల్లల స్కాలర్షిప్పులు నొక్కి... అందిం దంతా మెక్కి... మెట్ట వేదాంతం చెబు తార్రా ! పెళ్ళాం పిల్లల్నెంటేసుకుని విదేశాల కెగేసుకుని పోతూ సంసారీ  దుఃఖీ' అంటే వినటానికిక్కడెవ్వరూ చెవుల్లో పువ్వులు పెట్టుక్కూర్పోలేదురోరేయ్. యోగా... యోగా అనంటుంటే ఇలాంటి అఘాయిత్యమేదో చేస్తారని అనుకుంటూనే వున్నా!  అదే నిజమయింది. మఠాలకీ.. ముఠాలకీ తేడా లేకుండా పోయింది. సన్స్, సనిన్లాస్ చేసే న్యూసెన్సుని కవర్ చేసుకోవటానికి పవరున్న మీరు ఈ సన్యాసం ' థీరీని ప్రచారం చేస్తున్నారని నేనంటాను. అంతా సన్యాసులయితే రాసుకున్న తరువాత రాలేం దుకంతబూడిదసలెక్కడుందో ఆ సంగతి ఆలోచించార్రా ... మీరూ....! ' 


'అందుకేగా మార్రెడ్డన్నా ! కనకరాజు ఫేక్టరీ కడతావుంది' అన్నాడు. అప్పల్నాయుడు .


' ఎవరైనా అడిగితే కనీసం బూడిదైనా ఇవ్వలేకపోతే ఆదిభిక్షువుకి మనకీ తేడా ఏవుంది? మా సన్నాసి బోధనలు విన్న తరవాత కదూ..... మేయర్లక్కూడా ప్రజాసేవ చేయాలని తహతహపుట్టి కనీసం అయిదు లక్షల వరకైనా చెక్కు పవర్ పెంచమని అడుగుతున్నదీ ! కడుపుమంటకొద్దీ తిడతావున్నావుగానీ, మా సన్నాసి థియరీ స్ఫూర్తితోనేకదూ యూనివర్శిటీల్లో కూడా సన్యాసి కోర్సు' ఆరంభించాలని ఆలోచి స్తోంది ప్రభుత్వం! ... అని అప్పల్నాయుడంటుండగా బైట పెద్దగోల బయలుదేరింది.


కనకరాజు బావమరిది కంగారుగా పరు గెత్తుకొచ్చాడు. 


' ఫేక్టరీ గోడ కూలి పది మంది కూలీలు గాయపడ్డారు. పెద్ద గోలగా వుంది. మీరిక్కడుండటం మంచిది కాదు' అంటుండగానే అప్పల్నానాయుడు మత్తుగా వాలిపోయాడు.


కనకరాజు ఈఈ గారిని కంగారుగా పక్కగదిలోకి దాటేస్తే... మార్రెడ్డీ నేనూ కలిసి అప్పల్నాయుడిని దొడ్డిదారిన కారులో ఎక్కించి పంపించేశాం.


పదవులే శాశ్వతం కాదు. ఫ్యాక్టరీలు శాశ్వతమా!' అనుకుంటూ సీసాలో మిగిలింది గొంతులోకి పంపుకుని' 'అంతా అనా - పలింగకూస్కాం' అంటూ కారెక్కుతున్న గుర్నాథం  అచ్చం కన్యాశుల్కంలోని బైరాగి లాగా అనిపించాడు నాకా క్షణంలో. 


సిద్ధులు అబద్ధాన్ని నిజం చేయగలరు. ఆ నిజాన్ని అబద్ధం చేయగలరు. లోకమే పెద్ద అబద్ధమని కదా జైరాగి సిద్ధాంతం! 


మర్నాడామత్తు పూర్తిగా దిగింతరువాత - కానీ అనాపలింగకూస్కాం అంటే అర్థం కాలేదు. 

అగ్నినారదపద్మలింగకూర్మస్కాంద పురాణాలూ .. వల్లకాడూ కాదు ! 

అధికారులు, నాయకులు, పయిరవీకారులు లింకయి గవర్నమెంటుని కూడగట్టుకొని చేసేస్కాములే  ఆనాపలింగకూస్కాం.. అని! 


గవర్నమెంట్ తరుఫునుంచి తర్ఫీదయి వచ్చిన గుర్నాథం తరహా సన్నాసులు చెవుల్లో గూడు కట్టుకుని లోకల్ లీడర్లకి పద్దాకా ఉపదేశించాల్సిన  తారక మంత్రం.. హోర్నీ . . ఇదా! 


-  కర్లపాలెం హనుమంతరావు  

( ఈనాడు - సంపాదక పుట - గల్పిక - 11- 10 - 2002 ) 

ఈనాడు - సంపాదకీయం శతాయుష్మాన్ భవ ... ! - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - సంపాదకీయం - 27-05-2012 )

 


ఈనాడు - సంపాదకీయం 


శతాయుష్మాన్ భవ ... ! 

- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపాదకీయం - 27-05-2012 ) 


'శ్రీకైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్" అన్న భాగవత కర్త  బమ్మెర పోతన భగవంతుడి చేతే గోపాలబాలుడి అవతారం ఎత్తించి 'మీగడ పెరుగుతో మేళవించిన చల్ది ముద్దల' రుచి చూపించాడు. యశోదమ్మ తన ముంగిట ముత్యం బాలకృష్ణుడికి ఇష్టమైన రకరకాల పిండివంటలు చేసిపెట్టేదని సూరదాసూ వర్ణించాడు. పెరుగుమీద తేరుకున్న నీటిలోపాతులు కలిపితే 'రసాల' అనే పానీయం తయారవుతోందని 'భావప్రకాశ' వైద్యగ్రంథం చెబుతోంది. అరణ్యవాసంలో ఉన్న పాండవులను పరామర్శించడానికి శ్రీకృష్ణపరమాత్ముడు వచ్చినప్పుడు బడలిక తీర్చేందుకు భీమసేనుడు తయారుచేసి ఇచ్చిందీ రసాలనే. ఆశ్రమ సందర్శనానికి శ్రీరామచంద్రుడు విచ్చేసిన సందర్భంలో భరధ్వాజ మహర్షి ఇచ్చిన విందులో వడ్డించిన వంటకాలను వాల్మీకి మహర్షి వర్ణిస్తుంటే చదివేవారికి ఇప్పుడు నోటిలో నీరు ఊరాల్సిందే! ఒకనాటి సామాజిక వ్యవహారాలన్నింటికి అయ్యలరాజు నారాయణ రచించిన 'హంస వింశతి' ఒక విజ్ఞాన సర్వస్వం. అందులో కనిపించే పిండివంటల వివరాలు ఆనాటి మన తెలుగువారి తిండి పుష్టికి నిండు తార్కాణాలు. ఇంట్లోని పెద్దలందరూ అనుష్టానాలు చేసుకున్నాక ఉదయం పూట ఉపాహారంగా 'చల్దులు' ఆరగించి చల్లంగా బతికిన మంచికాలం ఒకప్పటి మన తాతలది. ఎంత దూరం దాకో ఎందుకు... వందేళ్లకిందటి గురజాడవారి కన్యాశుల్కంలో బుచ్చెమ్మ 'అయ్యా! మీరు చల్దివణ్నం తింటారా? ' అని గిరీశాన్ని అడుగుతుంది! 'శివరాత్రి మాహాత్మ్యం'లో సుకుమారుడి జిహ్వదారుఢ్యాన్ని వర్ణిస్తూ 'ఏనుబదియేడుల వార్ధక/ మున భ్రాజనశక్తి యుడిగి పోవదా తనికిం/ దీనియెడిది పెద్ద మాంసము/ కొనియెడిది కల్లు... ' అంటాడు శ్రీనాథుడు. తెలుగువారి భోజన ప్రియత్వానికి పెద్దన, తిమ్మన, తెనాలి రామలింగడువంటి కవుల  కావ్యాలకు కావ్యాలే అద్దంపడుతుంటాయి.


ఔషధ గుణాలున్న ద్రవ్యాలను ఆహార పదార్థాలుగా మలచి సామాన్యుడినుంచి సామ్రాట్టులదాకా అందరికీ అందుబాటులోకి తెచ్చిన ఆహార సంస్కృతి భారతీయులది. త్రిదోషాలు(వాతం, పిత్తం, కఫం), ధాతువులు, జఠరాగ్ని, రక్తమాంసాదులు, సమస్థితిలో ఉంటూ సమాన స్థితిలో మలక్రియలు నిర్వహిస్తూ, మనసు, ఆత్మ ఇంద్రియాలు ప్రశాం తంగా ఉండటమే ఆరోగ్యం అని ఆచార్య సుశ్రుతుడి నిర్వచనం. వేలాది సంవత్సరాలుగా ఈ సూత్రానికి అనుగుణంగానే మన ఆహా రపు అలవాట్లు కొనసాగుతూ వస్తున్నాయి. సంసార జీవితాన్ని సుఖ మయం చేసేది మంచి ఆహారమే' అన్న స్పృహ సుశ్రుతుని కాలం నుంచే ఉంది.   మంచి కట్టుబొట్టు ఉన్న నవయవ్వన జవ్వనాంగి దాపులో లీనుం విందైన సంగీతాన్ని ఆలకిస్తూ సేలించే చిత్ర విచిత్ర భోజన తాంబూలాములు స్వర్గసుఖాన్నందించే అశ్వశక్తిని అందిస్తాయని 

సుశ్రుత సంహిత చికిత్సా స్థానం' చెబుతోంది. పంచభక్ష్యాలకు పరమాన్నమూ అదనంగా తోడయితే అదే మనకు సంపూర్ణాహారం. కూరతో ఆరంభమయ్యే భోజనం వరుసగా పప్పు, పచ్చడి, పులుసు చివ రగా చిక్కటి మజ్జిగతో ముగుస్తుంది. ప్రత్యేక సందర్భాల్లో మధ్యమధ్య పాయసాలు, అప్పాలు ఆరగించడం వెనుకున్నది అంతా వట్టి సంతో షమూ, సంతృప్తి మాత్రమే  కాదు... ఆరోగ్య రహస్యం కూడా. 'ఆరు రుచులలో దేనిమీదా అతిలక్ష్యం, అలక్ష్యం పనికిరాదు, అనారోగ్య హేతువు 

అంటుంది ఆయుర్వేద షడ్రసశాస్త్రం. ఆహారం అంటే ఒక జీవ చర్య . దినచర్య . రుతుచర్య . రాత్రి చర్య .   ఒక క్రమపద్ధతిలో సాగించినంత కాలమే మనిషికి ఆరోగ్యం అని ఆయర్వేదం  వాదం  . తెలిసో తెలియకో ఒక వేదంగా   ఆ భోజన విధానాలనే  మకు ఇప్పటిదాకా పాటిస్తూ వస్తున్నది.


నెయ్యి నూనెలు కలిగి కఠినంగా అరిగే ఆహార పదార్థాలు మొదట, మృదువైన పప్పు దప్పళాలను మధ్యలో ద్రవ సంబంధమైన పదార్థాలను చివర్లో ఆరగించడం- భావప్రకాశ వైద్యగ్రంథం సూచించిన ఆహార విధానం. ఎన్ని విదేశీ భోజన పద్ధతులమీద కొత్త మోజులు పెచ్చుమీరినా ఇక్కడి వాతావరణానికి అత్యంత అనుకూలమైనది మన పంచభక్ష్య భోజన విధానమే. భోజనానికి ముందు అల్లం ఉప్పో శొంఠి కలిపిన రవ్వంత ధనియాలు జీలకర్ర పొడో మొదటి ముద్దగా సేవిస్తే రాళ్లయినా రసంలాగా జీర్ణమైపోవా! భోజనాంతంలో పెరిగే కఫానికి పచ్చకర్పూర తాంబూలంలోని లవంగం విరుగుడు. కబళం గొంతులో దిగే సమయంలో మంగళకరమైన వాతావరణం ఉండితీరాలని చరకసంహిత చెబుతోంది. మొదటి ఝాము మధ్యలో పగటి భోజనం, అపర సంధ్య చివరలో రాత్రి భోజనం క్రమం తప్పకుండా రోజూ ఒకే సమయంలో సేవించగలిగితే ఆయుష్షు, వీర్యపుష్టి, దేహదారుఢ్యం, శరీరకాంతి వృద్ధి చెందుతాయన్నది మరో భోజన సిద్ధాంతం. అతివేడి, అతి శీతలం, నిలువ ఉన్న ఆహారం, సమపాళ్లలో దినుసులు కలవని పదార్థాలు రజస్తమో గుణాలకు కారకాలవుతాయని భగవద్గీతా చెబుతోంది. దప్పిక, తాపం, బడలిక, మానసిక అలసట తీర్చేవిధంగా ఉండాలి పోషకాహారం. అవసరానికి మించి వేడిచేసే పదార్థాలలో  పేరు కుపోయే 'అక్రిలమైడ్' వంటి విషాలు ప్రాణాంతక వ్యాధులకు కారణ 'మవుతాయి. వాడిన నూనెలనే వాడి చేసే వంటకాలలో 'ట్రైగ్లిజరైడ్స్' కొవ్వును పెంచి గుండెజబ్బులకు కారణమవుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆకర్షణకోసం భోజనశాలలు వాడే రంగులు ఆరోగ్యా నికి అనర్థదాయకం. భైరవకవి శ్రీరంగ మహాత్యంలో వర్ణించినట్లు 'అప్పడాలకొటారు అమృత ఫలాదులు వడల కుప్పలు దూది మడుగు గిరులు' నిజంగా ఒక భోజనవైభోగం కావచ్చునేమోకాని... ఆ భోగం రోగకారకం కాకూడదు కదా! నిండు నూరేళ్ళు పండు లాగా జీవించా లన్నది ప్రతీ మనిషి ఆశ. ఆ ఆశ పండాలంటే 'ఇంట్లో వండుకున్న ఆహారం తప్ప ఇంకెక్కడా మెతుకు ముట్టరాదు' అంటున్నారు ఈ మధ్యనే వందేళ్ల పుట్టినరోజు పండుగ చేసుకున్న ఒక మెదక్ జిల్లా తాతగారు. మరీ తప్పనప్పుడు తప్ప ఆ తాతగారి ఆరోగ్య సూత్రం పాటించగలిగితే అందరికీ శతాయుష్షు. 


- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపాదకీయం - 27-05-2012 ) 

ఈనాడు - సంపాదకీయం జీవకారుణ్యం కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - సంపాదకీయం - 01 - 06- 2014 )

 ఈనాడు - సంపాదకీయం 

జీవకారుణ్యం 


కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపాదకీయం - 01 - 06- 2014  ) 


జగం ఒక్క మనిషి జాగీరే కాదు. మన ప్రాచీనుల గణన ప్రకారం, భూ జల గగన తలాలు మొత్తం ఎనభైనాలుగు లక్షల జీవజాతుల ఆవాసం. గీతలో నారాయణుడు విశ్వరూప సందర్శనంతో ప్రదర్శించిన వందలాది ఆకారాలు త్రి తలాలలో  తిరుగాడే జీవజాలాల ప్రతిరూపాలే. మరీ డాబులు పోతున్నాం గానీ మనం మాత్రం డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం ప్రకారం చూసుకున్నా ఒకనాటి వానరులకు మునిమనవలం కాదా! శ్రీరామచంద్రుడి ధర్మసంస్థాపనకు కలిసి వచ్చింది కోతులు, కొండముచ్చులు. అపారపారావారం నడుమ హిరణ్యాక్షుణ్ని కోరలతో కుమ్మి భూదేవమ్మకు విముక్తి ప్రసాదించింది వరాహం. యుగాంతాన ఏకార్ణవంగా మారిన ప్రళయ జలాలనుంచి జీవులున్న పెన్నావను బైటకు ఈడ్చింది మత్సం . అమృతోత్పాదన కుతూహ లంతో దేవదానవులు అబ్ధి చిలుకుడుకు దిగినప్పుడు 'కవ్వపుంగొండ వార్ధి. సదాచారుల పాలిట మహాక్రూరుడు హిరణ్యకశిపుడు. వాడిని వాడి గోళ్లతో చీల్చి చెండాడేందుకు కేశవుడు ధరించింది సగం నరరూపమైతే , మిగతాది కేసరి రూపం! ధర్మానికే కాదు, నిత్య కర్మాచరణానికీ కరచరణాలుగా మనిషిని ఆదుకుంటూ వస్తున్నవి ఆదినుంచీ పశు పక్ష్యాదులే. అందుకే గోవుకు మనుస్మృతి దైవీయస్ధానం ఇచ్చింది. పశు వులే ఒకనాడు మనిషికి మూలధనంగా చలామణి అయిన రోజులు ఉన్నాయి. ఆదిదేవుడు గజాననుడని, భూగోళాన్ని అష్టదిగ్గజాలు భరిస్తున్నాయని భారతీయుల విశ్వాసం. విష్ణుమూర్తికి గరుత్మంతుడు వాహనం. వినాయకుడికి చిన్ని మూషికం వాహనం. ఏ దేవుడికైయినా  ... ఏదో ఒక పశువో, పక్షో వాహనంగా ఉండి తీరుతుంది. దైవమూ పశుపక్ష్యాదుల పక్షమే అనడానికి వేరే సాక్ష్యం ఏముంటుంది? మనిషికే సాటిజీవులమీద చిన్నచూపు . 


మేధస్సులో మనిషిది ఏదో కొద్ది ఉన్నతస్థానం కావచ్చు.  నీతి నియమబద్ధ జీవనానికి మాత్రం మానవేతర జీవులే గురువులు . ఆగకుండా సాగి సాగి సాగరాలనైనా అధిగమించే ఓపిక పిపీలికాలది. వెక్కిరిస్తాం గానీ పక్షిజాతి ఏకసహచర నీతి మనిషికెక్కడిది? కాకుల్ని చూసి నేర్చుకోవాలి సాహచార్య ప్రీతి . మార్జాలం  మించిన సహజ సిద్ధ మూషిక సంహారిణి మనిషి ఇంతా దాకా సాధించనే లేదు. బుద్ధి తక్కువని పులుగులను కొట్టిపారేస్తాం గానీ... తేనెటీగల పట్టు ఎన్ని విద్యలు అభ్యసిస్తే మనిషికి అబ్బేను! గడియారం  ముళ్ల కదలికలను గమనించేందుకు మనకు పట్టే సమయం అరనిమిషం మించి. అదే పావురాలకు అరనిమిషం చాలు! చిన్న ఈగ నైనా వెనకనుంచి చెయ్యి విసిరి పట్టుకోవడం మనిషికి అలవిమాలిన పని.  ఒకేసారి అన్నిదిక్కులా అత్యంత స్పష్టంగా దృష్టి సారించేందుకు వీలుగా ఉంటుంది పలు కీటకాల కంటి అమరిక. ఇంద్రచాపంలోని ఏడురంగులకే మన ఉల్లం ఉప్పొంగిపోతుంది గదా... తూనీగలాగ అతి నీలవర్ణాన్నో, గుడ్లగూబకు మల్లే 'ఇన్ఫ్రారెడ్' వర్ణ సమ్మిశ్రితాన్నో కూడా గమనించగలిగితే ! సహనశక్తికి సాలీడు ఒక గూడుకట్టిన రూప మని రాబర్ట్ బ్రూస్ కథ చెబుతూనే ఉంది. అత్యంత లాఘవంగా గూడును అల్లే సాలీడు ముందు మయసభా నిర్మాత మయుడే  దిగదుడుపు. . మనిషి సంగతి చెప్పేందుకేముంది?! అయినా సరే 'రాతి బసవనిగని రంగుగా మొక్కుచు! కునుకు బసవనిగని గుద్దు' మానవుడి నైజం వేమన అన్నట్లు, నైచ్యం..  శోచ్యం.


మూగజీవుల బతుకు దుఃఖభాజనం కావడంలో మానవుడూ ఒక ముఖ్య కారణం కావడం విచారకరం. "పేరు సోమయాజి పెను సింహ బలుడయా! మేకపోతు బట్టి మెడలు వంచు/ జీవహింసలకు జిక్కునా మోక్షంబు' అని వేమన యోగిలా మానవుడు యోచించడం లేదు .. ఎందుకో? పట్టు కంట పడితే చాలు పొగపెట్టి పొడిచి ఈగల కాట్లు కాచుకుంటూనైనా సరే తేనె పట్టుకునే దుష్టత్వం మానుకోవడం లేదు మనిషి.  లేగదూడలను ఒక ఊటకు విడిచి తల్లిపాలను పిండుకోవడమే మహా పాపం. మూడేసి ఊటలను కూడా విడవకుండా దూడ పాలకు పాలు మాలే పాపాత్ములను ఏమనాలి? బరువులు లాగే పశువులను తోచినచోట ముల్లుకర్రతో పొడవడం, తోకలను మెలిపెట్టి గోతులు, గుట్ట లని కూడా చూడకుండా తొందరపెట్టడం స్వానుభవానికి తెస్తేగాని ఎంత బాధాకరమో తెలీని బుద్ధిహీనులమా మనం? ! కార్యమున్నంత వరకే కాళ్లు పట్టడం, కార్యం తీరితే  గొంతుపట్టడం ఎంత నీచం?  పనిచేస్తున్నంత కాలమేనా పశువులకు దాణా! కుందేళ్లమీద కుక్కల్ని ఉసిగొల్పి వినోదించే వికృత క్రీడ ఇంగ్లాండులో ఒకప్పుడు ఉండేది. తమిళనాట ఇప్పుడు జరుగుతున్న జెల్లికట్టు ముందు అది తీసికట్టు. మనదగ్గర నడిచే కోడిపందేలూ ఎడ్లపరుగు పందేలూ... దానికితోడు.  ప్రాణాతిపాతాన్ని మహాపాతకంగా బుద్ధభగవానుడి పంచశీల నిరసి స్తుంది. నిష్కారణంగా హింసించి జీవి ప్రాణాన్ని సృష్టి ప్రసాదించిన కాలానికన్నా ముందే తుంచేసే అధికారం ఎవరికీ లేదు. మూగజీవుల పట్ల క్రూరత్వం నియంత్రించే చట్టం వచ్చి అయిదు దశాబ్దాలు దాటి పోతోంది. అయినా అమలులో చిత్తశుద్ధి లోపంవల్ల జీవాల చిత్రహిం సలో మెరుగుదలలేమి  కనిపించడం లేదని ఈ మధ్య సర్వోన్నత న్యాయ స్థానం ఆగ్రహించింది. 'గిరుల కొమ్ముల నడవుల తిరుగుచుండి/ కోకి లమ యెంత మృదువుగ కూయుచుంటి నాగర లోకమునయందు నడుచుచుండి/ ఎట్లు పలుకుచు నుంటిమో మేము చూడుమ' ని విశ్వనాథ వారొక  గీతంలో వాపోయారు ఎప్పుడో . మనిషి ఇప్పటికైనా ఆ తప్పుడు బాటనుంచి మళ్లితే మిగతా జీవులకు ఎంతో మేలు. లేకుంటే చట్టం ములుగర్రకు 'సుప్రీం' పనిపెట్టాలి. 'మనిషికో మాట... గొడ్డుకో దెబ్బ అని గదా సామెత!


- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపాదకీయం - 01 - 06- 2014  ) 

అంతా ఆనందమయం... - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - సంపాదకీయం - 01 - 01 - 2012 )

 ఈనాడు - సంపాదకీయం 


అంతా ఆనందమయం...

- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపాదకీయం - 01 - 01 - 2012 ) 


రామం- ఆనంద స్వరూప సంక్షిప్త నామం. రామదాసుకు జగ మంతా రామమయంగా అనిపిస్తే మరో కామదాసుకు అదే జగత్తు సర్వం కామమయంగా కనిపించవచ్చు.  కాదని ఎందుకనాలి? లోకం అంతా కామాక్షీమయం కాదా!' అంటారు చంద్రశేఖర సర స్వతీ స్వాములవారో సందర్భంలో . కామాక్షి అంటే సౌందర్యం. అందమూ ఆనందానికి ఒక హేతుధాతువే. 'ఆనందాన్నందించే ప్రతి సౌందర్యమూ పరమేశ్వరత్వమే' అని  రసవాది సంజీవదేవ్ మతం . యాజ్ఞవల్క్యుడు సన్యాసం స్వీకరించేముందు ఇద్దరు ముద్దుల భార్య లకు సంపద సరి సమానంగా పంచేవేళ బ్రహ్మవాది మైత్రేయి అమృతత్వం సిద్ధించే సంపదను కోరుకొంటుంది. అమృతత్వం అంటే ఆత్మ అంతిమంగా అందుకోవాలని తపించే ఆనందలోకం. శంకర భగవత్పాదులు ఒక్క సౌందర్యలహరి రచనతో సంతృప్తి చెందలేదు. శివానందలహరితో గాని ఆయన ఆనందతత్వ విచారణ సంపూర్ణం కాలేదు. 'బ్రహ్మం' అంటే ఏమిటన్న సందేహం కలిగింది. భృగు మహర్షికి ఒకసారి. 'అన్నం ఎందుకు? ప్రాణం ఉనికికి అర్థ మేమిటి? మనసు, బుద్ధి ఏ పరమార్థాలకోసం చలిస్తా'యన్న అన్ని సందేహాలకూ చివరికి ఆ యోగికి దొరికిన సంతృప్తికరమైన సమా ధానం- సంతోషం కోసం' . ఆనందం నుంచే జీవావిర్భావం. ఆనం దంకోసమే జీవిక కొనసాగింపు. 'ఆనంద లోకంలోకి అణగారిపోవ డమే జీవితానికి ముగింపు' అని తైత్తరీయోపనిషత్ వాక్యం. 'అన్న, ప్రాణ, మనో, జ్ఞాన, ఆనందమయాలనే పంచకోశాలవల్ల వ్యష్టి సమ సష్టి దేహాన్ని ధరించి ప్రాణులు అభివృద్ధి చెందుతుంటాయి.... ఆనందమయ కోశంలో వెలుగొందే శుద్ధ స్వరూపాల్ని అందుకోవడమే బ్రహ్మానంద సామ్రాజ్య ప్రాప్తి' అని శ్రీమదాంధ్ర మహా భాగ వతంలో శుకమహాముని వినిపించిన ప్రీతి గీతి. అది, ఒక్క పరీ క్షిత్తు మహారాజుకే కాదు- బతుకును సార్థకం చేసుకోవాలనుకొనే ప్రతివారికీ వర్తించే ఆనంద సూక్తి.


వేదాలను విభజించి, పురాణేతిహాసాల సారాన్ని పంచమవేదం మహాభారతంగా రచించిన వేదవ్యాసుడంతటి వాడికే భాగవత రూపంలో విష్ణుకథలను విస్తారంగా చెప్పినదాకా వ్యాకులత వదల్లేదు. డేల్‌ కార్నెగీ చెప్పినట్లు- గుర్రాలకి, గుడ్లగూబలకి ఈ సంతోషం సమస్య లేదు. సాటి జీవాలను సంతోషపరచి సంతృప్తి చెందాలన్న తపన ఉన్నప్పుడే ఈ ఆనందం బాధంతా. ' త్రాసులోని సిబ్బెల్లాగా సుఖదుఃఖాల మధ్య ఊగిసలాట తంటా  'మనసు' ఉన్న మనిషికొక్కడికే! ' అంటాడు ఖలీల్‌ జిబ్రాన్ ఒకానొక సందర్భంలో . పట్టుకోవాలని వెంటబడేకొద్దీ పట్టు కెంతకూ దొరకనిది... పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే చటుక్కుమని చెంతన చేరే చేతిమీద అందమైన సీతాకోక చిలుక- ఆనందం' అంటాడు ఆంగ్ల రచయిత నథానియనిల్ హాల్రోన్. కాశీలో కడతేరి కైలాసం చేరాలని కాలిచిప్పలు తొలగించుకొన్న శూద్రకుడికి చివరికి దక్కింది ఏమిటి? విధి అశ్వరూపంలో వచ్చి ఎక్కించుకొని వెళ్ళి ఎక్కడో ఉన్న మర్రిమానుకు గుద్ది నరకలోకంలోకి విసిరివేయటమేగా! కైలాసగిరిని కూకటివేళ్లతో పెళ్లగించుకుపోవాలన్న కాని కోరికతో రగి లిన రావణాసురుడంతటివాడికీ చివరికి మిగిలింది ప్రగాఢ శోకమే. ఇంద్రియ సంఘరణలవల్ల ఖిన్నురాలై ఉన్న దేవహూతికి ముక్తి మార్గం సూచించే సందర్భంలో కపిలాచార్యుడు బోధించిన జీవన సూత్రం ఆ ఆనందరాముణ్ని అందుకునే తారకమంత్రం. స్వధర్మాచరణ, శాస్త్ర నిషిద్ధంకాని కర్మాచరణ, ధర్మబద్ధమైన మిత సంపాదన, సత్యాహింసలమీద ప్రేమ, పరిమితమైన పరిశుద్ధ ఆహార పానీయాలు, ఏకాంతంలో సైతం ప్రశాంత ప్రవర్తన, వింత భాషణం, ఇంద్రియ నిగ్రహం వంటి సత్కర్మలు ఆనంద హేతువులు.


పట్టి చంపేవేళ పట్టముగట్టేవేళ/అట్టునిట్టు చలించని యాతడే సుఖి' అన్నది అన్నమయ్య తత్వం. భౌతికానందానికి ప్రాధాన్య మిచ్చినా, అంతరంగంలోకి కొంత తొంగిచూసిన జిజ్ఞాసికే అసలైన 'కైలాస' విలాసం లభిస్తుందంటారు గీతాంజలి కర్త రవీంద్రులు. పరి ణామవాద పితామహుడు ఛార్లెస్ డార్విన్ తనలో తరిగిపోతున్న సౌందర్య తృష్ణను తలచుకొంటూ మధనపడిన సందర్భాలు బోలెడన్ని! 'మేధకు, శీలానికి 'ఆనందం' కలిగించే స్పందనలను కోల్పో వడం జీవితానికి నిజంగా హానే' అని హెచ్చరించాడు ఆ భౌతిక వాది. సుఖముతోడ శరీర సంస్ఫురణ గలుగు' అని పాదుకా పట్టా భిషేకంలో ఒక పాత్ర చేత పానుగంటివారు పలికిస్తారు. గబ్బిలాన్ని ఎవరన్నా కావాలని తలకిందులుగా వేలాడదీశారా! హాలాహలం మింగినా హరుడు ఆనంద స్వరూపుడిగానే ఉన్నాడు. అమృతం తాగిన రాహుకేతువులు అందవికారులుగా మిగిలిపోయారు. 'ఆనందం అంటే సమస్యలు లేకపోవడం కాదు... సమస్యలను సమ ర్థంగా ఎదుర్కొనే తీరు' అంటారు 'యూ కెన్ విన్' గ్రంథకర్త శివ్ ఖేర్‌. 'శకట గత చక్ర భంగిన్/సుకరములై తిరుగుచుండు సుఖదుః ఖములిం/తకు భేదమంద నేటికి/నకటా సంతోషయుక్తుడగుటొప్పు గదా!' అన్న బైచరాజు వెంకటకవి 'పంచతంత్రం' వేదాంతాన్ని తారకమంత్రంలా ఒంటపట్టించుకోవడం ఎవరికైనా మేలు. మునిగితేలాలన్న మనసు ఉండాలేగాని చలం గీతాంజలిలో భావించినట్లు 'జగత్తంతా ఒక ఆనందార్ణవం' కాదూ! కలవాడే సంతోషపడేవాడు అను కోవడం భ్రమ. కలిగినదానితో సంతృప్తి కలిగినవాడే నిజమైన సంతోషపరుడు. ఆర్థికమాంద్యం, యుద్ధాలు, కులమత వర్ణ విచక్షణల వంకతో సంఘర్షణలు, ప్రకృతి వైపరీత్యాలమధ్య అత్యధికానందంతో జీవిస్తున్న జాతుల్లో భారతీయులు ముందువరసలో ఉన్నారంటే దానికి కారణం- మన ఆధ్యాత్మిక జీవనవిధానం. 'కలిసి ఉంటే కలిగి, ఉన్నదానితో తృప్తి కలిగి ఉంటే... కలదు సుఖం' అన్నది భారతీయుల తత్వం. ఇప్సస్ గ్లోబల్ ఇటీవలి అంతర్జాతీయ స్థాయి సర్వే ప్రకారం - నాలుగేళ్ల క్రితం కన్నా మూడొంతుల జనాభా ఎక్కువ ఆనందంగా ఉన్నారు. 'మరీ ఆనందంగా' ఉన్న మిగతా ఆ ఒక వంతులో మన భారతీయులే ముఖ్యులని తేలింది. ఆనందం!


- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపాదకీయం - 01 - 01 - 2012 ) 

ఈనాడు - హాస్యం గాడిద తెలివి - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - సంపాదకీయ పుట - ( 10 -04 - 2009 ) ప్రచురితం)






 






ఈనాడు - హాస్యం 
గాడిద తెలివి 
- కర్లపాలెం హనుమంతరావు 
( ఈనాడు - సంపాదకీయ పుట  - ( 10 -04 - 2009 ) ప్రచురితం) 

రైలుమంత్రి లాలు ఆ మధ్య  ఓ మేకను ఏకంగా మధురై నుంచీ ఢిల్లీదాకా ఏసీబోగీలో ప్రత్యేకంగా తోలించాట్ట! మేక కన్నా మా గాడిదలకు ఏం  తక్కువ? హమ్ కిసీ సే కమ్ నహీ! 

మాకూ నాలుగు కాళ్ళూ రెండు కళ్ళూ చేటచెవులూ, ముక్కూ, మూతీ అన్నీ వున్నాయి గదా! మరెందుకు ఈ మనుషులందరూ వెధవలందర్శీ మా  పేరుతో  'గాడిదా .. గాడిదా' అని చీవరించడం ?

కోపం వస్తే 'అడ్డగాడిదా' అనే ఎందుకు తిట్టాలి? ఎవడు ఏ పోచికాలు పని  చేసినా మా కొడుకుల్తోనే పోల్చి ఎందుకు ఆడిపోసుకోవాలి? వెధవ పన్లు చేసినవాడిని మామీదే ఎందుకు ఊరే గించాలి? వాడికి బుద్ధొస్తుందో  లేదోగానీ మేం సిగ్గుతో చితికిపోతున్నాం. 

పెట్రోలు రేట్లు పెరిగినప్పుడల్లా  ఈ నేతలు వాహనాలను మాచేత ఎందుకు అసెంబ్లీ దాకా లాగించడమెందుకో ?  మనిషిగాడికి ఇన్ని సేవలు చేస్తున్నా... విలువ దగ్గర కొచ్చేసరికి గాడిద  గుండు సున్నానా? ఎన్నికల్లో గెలిస్తే గుర్రమంటారు, ఓడితే మా గాడిద పేరు మీద  ఈసడిస్తారు. ఏమిటీ ఇన్‌ జస్టిస్? 

వసుదేవుడంతటి వాడు మా కాళ్ళు పట్టుకున్నాడే! వినా యకుడంతటి దేవుడు  మా 'శుక్లాంబరధరం' శ్లోకాన్ని వాడుకు న్నాడే . నంది పేరుతో అవార్డులిచ్చే వీళ్లకి కామెడీ కోసమైనా ఓ గాడిద అవార్డు ఇవ్వాలని తోచదెందుకో ? 

లోకం కోడై కూస్తుందని రోజూ కోళ్ళ చేత 'యాడ్లు' చేయిస్తున్నారు. వాటిని నక్కల్లాగా మార్చి చూపిస్తున్నారు. కోళ్ళు కొక్కిరా యిల మీదే గానీ మా గాడిదల మీద మంచి ఐడియాలు రావా ఈ మనుషులకు ? 

కాకులతో లెక్కలేయించేవాళ్ళు. . సింహాలతో గర్జనలు చేయించేవాళ్ళు మాదాకా వచ్చేసరికి 'గాడిద గుడ్డు' అని పక్కకు తోసేస్తున్నారు. ఎందుకిలా ? ఎంతకాలమిలా మా ఖర్మ కాలడం? 

పంచతంత్రం నిండా బోలెడన్ని జంతువులున్నాయి. తెలివి తక్కువది ఒక్క గాడిద మాతామేనా? విష్ణుశర్మకు కూడా విజ్ఞత ఏమయిందో? 

 పంది గుడి చుట్టూ తిరిగిందని దానిచుట్టూ ప్రద క్షిణలు చేసే మూర్ఖులు ,   చంద్రమండలంలో భూములు అమ్మకానికి ఉన్నాయంటే మూఢులు  .. వీళ్లా మమ్మాడిపోసుకునేది ?  

నిజం చెప్పాలంటే ఈ నాయకుల కన్నా మేమే నయం. వెనక కాళ్లతో తన్నడమే తప్పించి వెన్నుపోట్లు పొడవం. పాలు ఇవ్వడమే మాకు తెలుసు.  దేశాన్నింత  దరిద్రంగా పాలించడం తెలియదు . అడ్డగాడిదలమైనా అడ్డమైన గడ్డికీ కక్కర్తి పడం. 

చట్టసభల్లో చాకిరేవులు పెట్టం. దాడులకూ  ఎదురుదాడులకూ ఆమడ దూరం మేం. పదవుల కోసం గోడలు దూకే రకాలం కాం. .

మేం అచ్చమైన గాడిదలం. స్వచ్ఛమైన గాడిద భాషలోనే నిత్యం వ్యవహరిస్తాం . 
మా కంచర గాడిదలైనా  ఈ మనుషుం టీవీ యాంకర్ణంతగా  వంకర టింకరలుగు  సకిలించవు. 

గంజి తాగేవాడికి మేమే బెంజి. అదీ మా సామ్యవాదం . ఈ మానవుడే గుర్రాలకి గుగ్గిళ్ళు.. మాకేమో అవి తిని వూసిన చొప్పదంట్లు ! ఇదిక్కడె సహజన్యాయం ?  

జనం పోగేసే  మైలంతా మా మూపుల మీదే! మైళ్ళకొద్దీ మోసినా విశ్వాసం లేకుండా, మా కష్టానికి కనీసం కృతజ్ఞతయినా  చూపకుండా ' గాడిద చాకిరి ' అంటూ చిన్న చూపు చూస్తారా ఈ పెద్దమనుషులు? 

' గాడ్సు అంతా ఒకవైపు. గాడిద ఒక వైపు వుంటే..  గాడిదవైపే ఒరిగేను నేను'  అని ఆ శ్రీనివాసే టైపులో  గజిల్.  అంతటి గౌరవం  మీ మనుషుల నుంచి ఆశించలేం  .. కానీ .. మినిమమ్ స్వాభిమానం ఉన్న జంతువుగా.. నైనా మా జాతిని గుర్తిస్తే  అదే పదివేలు!  ఒకాయన. 

దేవుడు చేసినా  మనుషులకు మాత్రమేనా.. అదే దేవుడు  చేసిన గాడిదలకు మాత్రం మానాభిమానాలు   ఉండ కూడదా ?  హే! భగవాన్! 

' గాడిద బిడ్డ గాడిదకు ముద్దు. సరేలే.. వచ్చా   గానీ... ఇంతకే ఏమిటి నీ ఏడుపు? ఏం కావాలి నీకు! వాట్ డూ యూ వాంట్ .. డియర్ డాంకీ ?'  అనడిగాడు అప్పటికప్పడు అక్కడ ప్రత్యక్షమయిన  దేవుడుగారు. 

'మార్పు రావాలి. గాడిద జాతి ఆత్మగౌరవానికి భంగం కలిగించే పనులు మానాలి. నాలుగు కాళ్లను ఏక కాలంలో చూసే  నైపుణ్యం  నీవిచ్చిన మా కళ్లది.  తిట్టడాలు మాని మా తెలివిని  చూసి  బాగుపడమని నీవైనా  మనిషికి బుద్ధిచెప్పాలి! '  

' అట్లాగే.. కానీ.. ముందు  కథ చెబుతా విను. అనగనగా ఒక అడవి. ఆ అడవికి సింహం రాజు. ఆ రాజుగారికో రోజు తలపోటొచ్చింది. ఏదైనా జంతువు మెదడు గొంతు దిగితే  గాని ఆ రోగం నిదానించేలా లేదు  . మెదడు దానం చేసిన్ జంతువుకు  కోరిన పారితోషికం ఇవ్వబడుతుందని  రాజావారి  ప్రకటన వెలువడింది. ఆ అడవిలోనే   మీ జాతి గాడిద ఒకటి ఉంది.  దానికి  చాలాకాలంగా  రాచకొలువులో అమాత్య పదవి వెలగెట్టాలని మాహా కుతిగా ఉండేది.  గాడిద కోరిక విని మృగరాజుగారు . . 'నో ప్రాబ్లమ్  !  అలాగే గానీ! కానీ, ముందు  మరెవరినైనా  ఓ మంత్రి  పదవి  నుంచి దిగిపోనీ . అందాకా  నీ మెదడును నన్ను  భోంచేయనియ్యి! నువ్వు వెయిట్ చెయ్ ' అంటూ ఆ గాడిద మెదడును  ఇంచక్కా భోంచేనేసింది . అప్పటి బట్టి  ఆ మెదడులేని గాడిద పాలిటిక్సులో  తనవంతు మంత్రి పాత్ర పోషణ  కోసం శోషొచ్చే దాకా ఎదురుచూస్తూనే ఉంది. ఈ కథ విన్నావు గదా! ఇప్పుడు నీకేం చేయాలనిపిస్తోంది! '

' నీ మీద పరువు నష్టం దావా వేయాలనిపిస్తోంది న' కసిగా అంది గాడిద . 

 'ఎందుకూ? నీకు మెదడు లేదు అన్నందుకా? ' 

' కాదు... నన్ను ఇప్పటి  ఈ  పాడు రాజకీయ నాయకులలోని నాయకులతో పోల్చి నందుకు'  అంటూ మరో మాటా పలుకూ లేకుండా మూపు మీద మైల మూటతో  హాయిగా చాకిరేవు వైపుకు సాగిపోయిందా   తెలివైన గాడిద . 

- కర్లపాలెం హనుమంతరావు
- కర్లపాలెం హనుమంతరావు 
( ఈనాడు - సంపాదకీయ పుట  - ( 10 -04 - 2009 ) ప్రచురితం) 




ప్రేమ పరిమళాలు - రచన: కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు సంపాదకీయం - ప్రచురణ తేదీ 06 -03 - 2011 )

 ఈనాడు - సంపాదకీయం 

ప్రేమ పరిమళాలు 

- రచన: కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు సంపాదకీయం - ప్రచురణ తేదీ 06 -03 - 2011 ) 


నవరసాల్లో శృంగారానిదే ప్రథమ తాంబూలం. కామిగానివాడు మోక్షగామి కాలేడన్నది యోగి వేమన వాదం. పవిత్ర దేవాలయ కుడ్యాలమీద కళాత్మక శిల్పచాతుర్యం వెనుక  రహస్యం- మోక్షప్రాప్తికి తృతీయ పురుషార్ధ దశ దాటవలసింది  అనే  మన పూర్వీకుల భావనే.  వాత్సాయనుడు కామసూత్ర రచన తలపెట్టిందీ మనిషి సంపూర్ణానంద సాధనకోసమే. యమునాతీరం, బృందావనం, గోపికాగణం, రాధామాధవం, రాసలీలానర్తనం... వీటితో బాహ్యేంద్రియాలకు ఓ రసమయానంద అనుభూతి కల్పించడంకోసం మాత్రమే జయదేవుడు గీతగోవిందాన్ని ఆలపించలేదు. జీవిత పరమార్థసారమైన జీవాత్మ పరమాత్మల సంయోగ సాధనార్ధమే ఈ మధుర భక్తిమార్గాన్ని ఆయన ఎంచుకున్నది . వీరశైవంలో సైతం శరణునికి శివునికి మధ్య ఉన్నది పవిత్ర నాయికా నాయక సంబంధ బాంధవ్యమేనని చరిత్రకా రులు చెబుతారు. మధుర మంజుల మాలతీ మండపాన కల్వ పూమాల కడుతూ తనకోసం ఎదురుతెన్నులు చూసే రాధ వాల్గన్నుదోయిని వెనకపాటున వచ్చి మూసి అల్లరికి దిగిన ఆ నల్ల నయ్యను చూసి- బృందావనం, చందమామ, యమునా తరంగాలు... చివరికి రాధిక తలలోని పూవులూ పకపకా నవ్వినాయంటారు కరుణశ్రీ.  ప్రణయాన్ని మించిన సృష్టిరహస్యం మరేముంటుంది! ఆకాంక్షాతప్త ఆత్మ ఒత్తిళ్ల నుంచి సాక్షాత్ ఆ పరమాత్మే తప్పించుకో లేకపోయిన వైనం మనకు తెలుసు. రక్తమాంస నిర్మితమైన మనిషి సంగతి మరిక చెప్పేదేముంది! సృష్టిలోని అందాలూ సౌఖ్యాలూ ప్రేమలూ... అన్నీ ఈశ్వరచ్చాయలే. 'ఈశ్వరుని పొందుకు ఇవి బంధాలుగా మారటమే మాయ' అంటాడు చలం గీతాంజలిలో. ' అంతా మాయేనని తెలుసు... తెలిసీ వలచీ విలపించుటలోని తీయ దనం ఎవరికి తెలుసు? ' అనే భగ్నప్రేమికుడి వేదాంతంలోనే దాగి ఉందనుకోవాలి- మాయాప్రణయ రహస్యమంతా. 


గోవర్ధన గిరిధారిని సైతం తులసిదళంతో తూయగలిగే ఈ మాయ- రెండో ఎక్కమంత సులభమనిపించినా.. రెండో ప్రపంచ యుద్ధమంత భీభత్సాన్నీ  తనలో ఇముడ్చుకుంటుంది. ఆ గాలి సోకితే చాలు- కూసింతసేపు కూడ కూకుండనీయదు. కునుకూ ఉండదు. ఆ జారువలపు జడివానలో జాబిలతల వంటి మేనులే కాదు, మనసులూ తడిసి ముద్దయిపోతాయి . ఆ మగతలో, ప్రతి మబ్బుతునకలో కానవచ్చేది... తన ప్రభువు ఆకారమే. ప్రతి కొమ్మ వంపులో తన కొమ్మ సొంపులే కనిపించి తన్మయత్వం ఆవరిస్తుంది. ఆకులో ఆకుగా పూవులో పూవుగా ఒకరిలో ఒకరు ఒదిగిపోవాలనే తపనతో లోకం పట్టని ప్రణయ సమాధిలోకి జారిపో తారు ప్రేయసీ ప్రియులు. జన్మజన్మలకు సరిపడా ఆనందాన్ని ఆ క్షణానే జుర్రుకోవాలన్న తీవ్ర కాంక్ష వెర్రితనంగా తోచని, అనిపిం చని విచిత్ర అవస్థ అది. నేలా ధూళీ పట్టని ప్రణయజీవులకు.... పగలే వెన్నెల. .  జగమే ఊయల. 'చివురించిన మావుల క్రింద చేయికి చేయి చేర్చి... పేజ చింతనలన్/ మరపించు రాగముల్ దీయుచు వాసనల్ పరిమళించు చోటులందు/ విహరించుటకై' ప్రేయసిని లేచిరమ్మని అబ్బూరివారు ఊహాగానం చేసిందీ . . ఈ మధుర జీవితాధ్యాయాన్ని స్ఫురణలో ఉంచుకునే.  మనసైనవారి చెంత కాలమే

స్తంభించిపోయినట్టుండే ఈ దశను వర్ణించి పులకించని ప్రపంచ సాహిత్యం లేదు. మాటలు మూగబోయిన వేళ మనసులు ముచ్టలాడుకొనేందుకు ప్రకృతి కనిపెట్టిన చిట్కా.. ప్రణయ భాష. ప్రేమికులు గుసగుసలాడుకునేది చెవిలో కాదు, హృదిలో! పెదాలతో స్పర్శించేది పెదవులను కాదు, ఆత్మను' అని మురిసిపోయాడు ఒక ఆంగ్ల కవి. కాళిదాసు, జయదేవుడు, వర్డ్స్ వర్త్, జాన్ కీట్స్.. ఇలా ఎవరెవరి పేర్లను ప్రస్తావించినా ఈ ప్రణయ దేవతను ఆరా ధించని కవి కనిపించడు . అరబిక్ సాహిత్యమంతా ప్రేమభావనతోనే పులకింపజేస్తుంది. ఎన్ని రూపాలైనా అన్ని పూలూ ఒకే గుబాళింత/ ఒక మనసులో ఎన్నెన్నో మారుతాలు సృష్టించే వింత. అందుకే, ప్రేమంటే... ప్రపంచానికంత గిలిగింత.


ఆకలి దప్పికల్లా క్షీరదాలకు ప్రేమభావనా ఒక అవసరమన్నది జీవశాస్త్ర సిద్దాంతం. ఆహారం కోసం, దాహంకోసం తపించే మెదడు భాగాలే ప్రేమకాంక్షకు ప్రేరణ అని నాడీశాస్త్రం చెబుతోంది. ప్రేమభావన మెదడులోని ఆనంద కేంద్రాన్ని అతిగా ఉత్తేజితం చేసే కొన్ని రసాయనాల అధిక ఉత్పత్తికి కారణమవుతుందట. దానివల్ల హృదయ స్పందనల క్రమం గాడితప్పి, నిద్రాహారాల ధ్యాస తగ్గుతుం దంటున్నారు మానసిక శాస్త్రవేత్తలు. ' ఏరోటోమానియా'గా పిలిచే ప్రేమ రుగ్మతకు ప్రేమభావన అందించడానికి మించిన మంచి చికిత్స లేదని అనుభవాలెన్నో నిగ్గుతేల్చాయి. పూవువంటి జీవితానికి ప్రేమవంటి మకరందం అందాలంటే తూనీగల్నీ ఆకర్షించే పరిమళాలు వెదజల్లడం నేర్చుకోవాలి. జీవితం గ్రంథం కాదు. ప్రేమపాఠం ఏ గురువూ నేర్పేదీ కాదు. ఇద్దరినీ గెలిపించగల ఈ ప్రణయ క్రీడలో ఉభయులూ ఓడిపోతుండటమే నేటి తరంలోని విషాదం. 'కాగితం పూలకి అంటుకున్న సెంటురా నేటి కొత్త ప్రేమఫార్ములా' అని ఒకనాటి తరం అభ్యంతర పెడుతుంటే- 'జీవితం స్కేలులో చిన్న సెంటిమెంటురా... అంతకన్నా పెద్దసీను ఈ ప్రేమకు లేదురా!' అని పొరబడుతోంది అత్యధికంగా నేటితరం. 'జావులి యన్' అని పిలుచుకునే పచ్చివయసు  తొలిప్రేమను చైనా యువ తరం భావిబంగారు జీవితానికి అవరోధంగా భావిస్తోంది. ప్రేమ గురించి, సుదృఢమైన మన వివాహ కుటుంబ వ్యవస్థల గురించి సమగ్ర సమాచారం తమ పాఠ్యప్రణాళికల్లో భాగంగా ఉండాలని అక్కడి విద్యార్థిలోకం కోరుకుంటోంది. ఈ మధ్య జరిగిన ఒక యువ సదస్సులో వెల్లడైన సత్యమిది. భారతీయుల సరస భావన  అంతర్జాతీయంగానూ ఆకట్టుకుంటున్నదనడానికి సరికొత్త నిదర్శనమిది!


- రచన: కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు సంపాదకీయం - ప్రచురణ తేదీ 06 -03 - 2011 ) 

ఈనాడు - సంపాదకీయం ఆటవిడుపు - రచన: కర్లపాలెం హనుమంతరావు (ఈనాడు - 06 -05 - 2012 - ప్రచురితం )

 ఈనాడు - సంపాదకీయం 

ఆటవిడుపు 

- రచన: కర్లపాలెం హనుమంతరావు 

(ఈనాడు - 06 -05 - 2012 - ప్రచురితం ) 


సంఘ జీవితంలో ఆటపాటలు అనివార్యం . అవి బతుకు వెలుగులు  వాఙ్మయం లాగే. పాట వాగ్రూపం... ఆట మెదడుకు, శరీరానికి చురుకు పుట్టించే క్రియావిశేషం' అన్నది బాల వాఙ్మయ విభాగంలో విశేషంగా కృషిచేసిన డాక్టర్ తిమ్మావజ్ఝుల కోదం డరామయ్యగారి సిద్ధాంతం.  పాకెట్ బుక్ ఆఫ్ గేమ్స్' సృష్టికర్త మోర్ హెడ్ సిద్ధాంతం ప్రకారం- దేశ కాలచరిత్రలను ప్రభావితం చేసేవి జాతి సంస్కృతులకు అనుగుణంగా రూపుదిద్దుకునే కళారూపాలు . ఆటలూ ఆ కళాప్రపంచంలోని అంతర్భాగమే. సందు దొరికినప్పుడల్లా క్రీడా విశేషాలను కవులు ఏకరువు పెట్టిన సందర్భాలు తెలుగు సాహి త్యంలో కోకొల్లలు. అష్ట శతాబ్దాల కిందటే నాచన సోమన ' హరివంశం' లో రుక్మిణీకృష్ణుల చేత 'పాచికలాట' ఆడించాడు. పాల్కురికి సోమనాథుడు 'బసవపురాణం'లో శైవభక్తులు కార్తీకమాసం వేడుకల్లో ఆడే నందికోలను వర్ణించాడు. ద్రోణుడు హస్తినాపురానికి వచ్చినప్పుడు 'అప్పుర బహిరంగణంబున ధృతరాష్ట్ర పాండునందనులందరు కందుక క్రీడాపరులై వేడుకతో ఆడుచున్నట్లు' మహాభారతం ఆదిపర్వంలో ఉంది. వేదాలు, పురాణాలే 'అక్షఖేలనం ' వంటి జూదక్రీడలను ప్రస్తావించకుండా వదిలాయి కాదు . సాధుకార్యాలవల్ల సత్ఫలితాలు  అందుకోవచ్చన్న సందేశాన్ని ఛాందోగ్యోపనిషత్- పాచికలాటలోని ఎత్తులు వేసే విధానంతో పోల్చి చెప్పింది (41, 4). క్రీడలు మానవ జీవి తంలో ప్రధాన భాగం. వ్యసనమని ఎంత తోసిపారేసినా మన ' పాచి కలాట' ఎన్ని పర్యాయాలు కాలానుగుణంగా మార్పు చెందింది? ఎన్నెన్ని దేశాలు పర్యటించి చివరికి నేటి పచ్చీస్ ఆటగా మారింది! మహాభారతం విరాటపర్వంలో- అర్జునుడు స్తుతించిన ద్రోణుణ్ని దుర్యో ధనుడు దూషిస్తాడు. అందుకు ప్రతిస్పందనగా అశ్వత్థామ అర్జునుడి గాండీవ ప్రయోగం 'అడ్డపాకులు' వేసినట్లుండదని దుర్యోధనుణ్ని ఎద్దేవా చేస్తాడు. మహాభారతాన్నేమిటి.. మానవ జీవితాలనూ క్రీడలు నడిపించిన కథలు విశ్వసాహిత్యంలో బోలెడన్ని. 


ప్రాచీన ఈజిప్షియన్లు పార్థివ శరీరాలతోపాటు పాచికలనూ పూడ్చిపెట్టేవారు. తమవారు పరలోకంలో ఆడుకునేందుకనిట  ఆ ఏర్పాటు! ట్రాయ్ ముట్టడి ఏళ్లతరబడి సాగినకాలంలో యోధుల మనసు ఇళ్లమీదకు మళ్లకుండా క్రీడలు ఏర్పాటుచేశారు. మన రాయలు చతురంగంలో దిట్ట. ఎన్ని పని  ఒత్తిడులు  ఉన్నా రోజుకో గడియ పాటైనా చదరంగం బల్లముందు గడపనిదే సాంత్వన కలిగేది కాదా మహారాజుకు  . ఇంటిముందటి అరుగు బండలమీదా, దేవాలయాల ప్రాంగణాల్లో నేటికీ కనిపించే ఆట ' పటాలు' నాటి మన తాతల క్రీడాప్రీతికి నిలువెత్తు పటాలు. తెలుగునాట పలు బౌద్ధ హిందూ క్షేత్రాల కుడ్యశిల్పాలలో  నాటి మన క్రీడావైభవం దర్శనమిస్తుంది. సురవరం ప్రతాపరెడ్డి 'ఆంధ్రుల సాంఘిక చరిత్ర' లో  వివిధ కాలాల క్రీడావిశేషాలను బహువిస్తారంగా ప్రస్తావించారు. నాచన సోమన ఉత్తర హరివంశంలో పాచికలాటకు రెండుపదుల పద్యాలు కేటాయించాడు. సముద్రతీరంలో దొరికే ఉప్పు- లోభాగాలకు అందేవరకూ చోరులనుంచి, పరాయి ప్రభువులు సుంకాల నుంచి, దౌర్జ న్యపరుల నుంచి తప్పించుకునే తిప్పలన్నీ 'ఉప్పట్టి' ఆటలో పెట్టి నాచన సోమన ' హరివంశం'లో ఆడించాడు. శ్రీకాళహస్తి మాహాత్మ్యం లో మహాకవి ధూర్జటి నాటి పల్లెల్లో 'చిట్ల పొట్లకాయ, సిరిసింగణా    వత్తి, గుడుగుడు గుంజాలు, కుండిన గుడి, తన్ను బిల్ల, బల్లిగోడు, చిడుగుడు లవ్వలపోటి, చిక్కినా బిల్లలాంటి మగపిల్లలాడుకునే ఆటలన్నింటినీ తిన్నడి బాల్యక్రీడలుగా వర్ణించాడు. గుజ్జనగూళ్లు, అచ్చన గండ్లు, పింపిళ్లు, కుచ్చీళ్లు గీరన గింజలు, ఓమనగుంటలు, కనుమూసి గంతలు, కంబాలాట' లాంటి ఆడపిల్లల ఆటలన్నింటినీ పింగళి సూరన 'కళాపూర్ణోదయం'లో తనివితీరా వర్ణించాడు. కొరవి గోపరాజు సింహా సన ద్వాత్రింశిక పుణ్యమా అని- మన పూర్వపు వినోద క్రీడలు కొన్నైనా తెలుస్తున్నాయి. వాటిలో నేటి బాలలు ఆడేవి ఎన్ని?


`ఒకటి ఓ చెలియా/రెండూ రోకళ్లూ/ మూడూ ముచ్చిలుకా/నా లుగూ నందన్నా! ఐదుం బేడళ్లూ' అంటూ అంకెలే ఆటగా నేర్పే గచ్చ కాయలాట ఇప్పటి పిల్లకాయలకు పిచ్చి ఆట ట! ' కొండమీది గుండు జారి/ కొక్కిరాయి కాలు విరిగె/దానికేమి మందు? ... వేపాకు పసుపూ వెల్లుల్లిపాయ/ నూనెలో బొట్టు/ నూటొక్కసారి/ పూయవోయి పూయి/ పూటకొక్కసారి' అంటూ ఇంటివైద్యాన్ని ఇంతప్పటినుంచే ఒంటపట్టించే వానపాట ఆటలు ఏనాడో  అటకెక్కేశాయి. 'విశాఖ పట్నం వీశెడు బెల్లం/నీకో పదలం నాకో పదలం/ కళింగపట్నం కాసు లపేరు/ నీకో పేరు నాకో పేరు' అంటూ దొరికినదాంట్లో భాగం పంచే మంచిని చెప్పే తొక్కుడు బిళ్లాట సందడి ఇప్పుడు ఏ సందులో కనిపిస్తోంది గనక ? 'ఆడేవారికి అచ్చావు పాలు .. పాడేవారికి పాలు పంచదార'  అని ఊరిస్తూ పాపల్ని ఆడించే అలనాటి తాతమ్మల ఆటలు, పాటలు నేడు పాతబడిపోయినవి. . పరమ మొరటువి! దేశ కాలాలతోపాటు అన్నింటిలోలాగే ఆటపాటలలోనూ మార్పు వచ్చేసింది. మార్పు మనిషిని ముందుకు నడిపించినంతకాలం అభ్యంతరం చెప్పేందుకేముంది?! మన అడుగులు వెనక్కి పడుతుండటమే నేడు ఆందోళన కలిగిస్తున్న అంశం. వ్యాపార ప్రపంచం మోజులో పడి పిల్లల చదువు సంధ్యల చివరి సోపానమూ రూపాయేనన్న భ్రమలో మనం ఉన్నాం. ముప్పొద్దులా పసిబిడ్డను పుస్తకం 'రాట' చుట్టూనే తిప్పడం ఎంత ముప్పో మనస్తత్వవేత్తలు మొత్తుకుంటున్నా పట్టించుకోకుండా ఉన్నాం. ఏడాదిపొడుగునా పుస్తకాల పుట్టల్లో విద్యా తపస్సు చేసిన బాల రుషులకు రవ్వంత విశ్రాంతి వరంగా దొరికేది వేసవి సెలవుల విరామంలోనే . 'ఆటవిడుపు' అంటే ఆటల కోసం బిడ్డను విడవడమే కాదు, రేపటి చదువుల పోటీకి వాళ్లు శక్తిని కూడదీసుకోవడం.  నెల వులు పసిమనసులకు ఆ అవకాశం కలిగించే ఆటవిడుపు. కంప్యూటర్ ముందు చేరి కరాటే ఆడటం, తోటి పిల్లలతో కలిసి కబాడీ ఆడటం ఒకటవుతాయా? మళ్లీ బళ్లు తెరిచే వేళకు పిల్లలు గాలిపటాలు, రంగు రంగుల సీతాకోక చిలుకల్లాగా ఎగురుతుండాలంటే- ఈ సెలవులు నిజమైన 'ఆటవిడుపు'గా మారాల్సిందే!


- రచన: కర్లపాలెం హనుమంతరావు 

(ఈనాడు - 06 -05 - 2012 - ప్రచురితం ) 




ఈనాడు - సాహితీ సంపాదకీయం తరంతరం నిరంతరం ... ఫిర్ మిలే సుర్ మేరా తుమ్హారా రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - దినపత్రిక - 07 -02 -2010 వ తేదీ ప్రచురితం )

ఈనాడు  - సాహితీ సంపాదకీయం 

తరంతరం నిరంతరం ... ఫిర్ మిలే సుర్ మేరా తుమ్హారా

రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - దినపత్రిక - 07 -02 -2010 వ తేదీ ప్రచురితం ) 


రెండు దశాబ్దాల రెండేళ్ళ కిందటి మాట... అప్పటి ప్రధాని ఎర్రకో టపై మూడు రంగుల బావుటా ఎగురవేసిన జండాపండుగ పూట దూరదర్శన్ బుల్లితెరపై ఓ తేనెలూరే పాట! భీమ్ సేన్ జోషీ  మొదలు గానగంధర్వుడు బాలమురళి దాకా రవిశంకర్ సితార్ తో  జకీర్ హు స్సేన్ తబలాతో తలపడి నరేంద్ర హీర్వాణీ ప్రకాషపదుకొణె వంటివారితో కలిసి ఆడుకుంటున్నట్లు అమితాబ్ బచన్, హేమమాలిని వంటి హేమాహేమీలతో జతకలిసి చేసిన శ్రుతిలయల మాయ అది. ఇన్నేళ్ళు గడిచినా నవ్యమై భవ్యమై ఉండటానికి కారణం- ఆ సమైక్యతారాగతోరణం ఈ మట్టి నుంచి పుట్టింది కావటమే! పీయూష్ పాండే పద్దెనిమిది సార్లు రాసి చించిన ఆ పల్లవిని సురేశ్ మల్లిక్, ఆర్తి, కైలాసు రేంద్రనాథ్ ఎంతో ఆర్తిగా సృజించారు . కనుకనే - ఆనాటి ఆ రాగేంద్ర జాలం మనజాతి పాడుకునే మరో వందేమాతరంలాగా ఓ అనధికార జాతీయహోదాను సంతరించుకొన్నది . ఆసేతుహిమాచల పర్యంతం ఆ ' ఫిర్ మిలే సుర్ మేరా తుమ్హారా' గీతం అంత మన్ననలందుకోవడానికి ఆ రాగం తానం పల్లవులకన్నా అంతర్లీనంగా అందులో మిళితమై సాగిన మన జాతీయతనమే ప్రధాన కారణమంటే కాదనేవారెవరూ ఉండరు. 'నా స్వరమూ నీ స్వరమూ సంగమమై మనస్వరంగా అవతరించె నంటూ- ఈ దేశ నదీనదాలలోని వేదనాదాన్ని సాగర గంభీరతతో జతపరచి మేఘమాలికలవంటి రాగాలను కూర్చి సుతిమెత్తని భావుకతను అత్యంత హృద్యంగా ఆలపించి ఈ నేల నలుచెరగులా జాతి మత కుల వయో లింగ భేదాలకు అతీతంగా ఆ స్వరగాంధర్వులు చిరుజల్లులుగా కురిపించడమే అపురూపం. ఆ రాగాల వర్షంలో తడిసి ముద్దవని  భారతీయుడెవడూ ఆనాడు లేడు, ఈనాడూ ఉండడు. ఆ గీతానికి కాలానుగుణమైన గుణాత్మకమైన మార్పులు చేసి 'ఫిర్ మిలే సుర్' అంటూ ఈ గణతంత్ర వజోత్సవ వేళ మరోమారు 'నగారా' మోగించటం హర్షదాయకమే కాదు- దేశ కాల పరిస్థితులు దృష్ట్యా తక్షణావసరం కూడా!


ఆధునికతే నాగరికతగా భ్రమించే నేటి యువతకు వేల సంవ త్సరాల ఘనచరిత గల భారతీయతలోని విశిష్టతపై శీతకన్ను ఉండటం కలత కలిగించే అంశం . దాదాపు ఆరు వందల జిల్లాలలో  పదిహేడు రకాల భాషలు, రికార్డులకెక్కని మరెన్నో వందల యాసలు, రకరకాల మతాలు, మూడుకోట్ల ముప్పై లక్షల చదరపు కిలోమీటర్ల పర్యంతం పరచుకుని ఉన్న ఈ సువిశాల భారతంలో వృత్తుల వారీగా లెక్కకు అందని ఎన్నో కులాలు- ప్రవృత్తి రీత్యా చూసినా అత్యంత వైవిధ్యంగా నిత్య చైతన్యంతో సాగే జనజీవనానికి విభిన్నత్వమే బలం. ఏకత్వ భావలేమి బలహీనత. బౌద్ధం పుట్టిన హిందూదేశం ఇది. థెరెసాను ' మదర్ ' గా  గౌరవించిన వేదభూమి మనది. మైనారిటీల నుంచి నలుగురిని రాష్ట్రపతులుగా ఎంచుకున్న లౌకికరాజ్యం ఇది. రాష్ట్రపతి నుంచి సభాపతుల వరకు మహిళలు పాలన సాగిస్తున్న నేల కూడా మనదే. యోగులు బాలలైనా సాగిలపడే ఆధ్యాత్మిక విశాలత భారతీయులది. బడుగుల నుంచి మేధావిగా  ఎదిగిన మహానుభావుడు ఈ దేశానికి రాజ్యాంగ కల్పన చేశాడ! 'భారతదేశం నా మాతృభూమి... సుసంప న్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకా రణం... ' అని చదువుకొనే ప్రతిజ్ఞ పాఠాన్ని వాచకాలు మొదటి పుటల వరకే పరిమితం చేసే ప్రజ్ఞావంతులు పెరిగిపోతున్నారిప్పుడు. వరస మార్చి అయినా సరే, మన సంగీత్ మహాన్ ఏఆర్ రెహమాన్ 'వందే మాతరం' గీతానికి కొత్త రాగాలను కూర్చి నవతరానికి ఉత్తేజం కలిగించిన తీరులో- ' ఫిర్ మిలే సుర్ మేరా తుమ్హారా'కు సైతం అదే సురేంద్ర కైలాస్ నాథ్  నూతన స్వరాలను సమకూర్చడం తప్పేమీ కాదు కదా- తప్పనిసరిగా మిగతా సామాజిక హితుల తక్షణ విధి!


దేవులపల్లి వారు గీతించిన విధంగా ఏ కవి గాయక వైతాళికుడైనా భావ తాదాత్మ్యతకు దివ్య గీతామృతాన్నే నమ్ముకుంటాడు. 'అర్ధ మతులహంకృతులు అంధమతులు రాని/ నిరుపేదలు నిర్భాగ్యులు నిరంకుశులు లేని/ కొత్త జగం కొత్త యుగం కోరుకునే వారెవరికైనా, కులందాటి మతం దాటి కొద్ది గొప్ప దాటి/ సమభాగం సమభాగ్యం సమసంస్కృతి నాటి/ కొత్త శాంతి, కొత్త కాంతి జగతి నిండాలని, భావించేవారికైనా పాటను మించిన వజ్రాయుధం లేదు. పల్లవిని మించిన దేవదత్తం లేదు. ఆకులందున అణగిమణిగిన కోయిల వలె పలికితే ఆ పలుకులకు పులకలెత్తి దేశాభిమానాలు మొలకెత్తుతాయని మహాకవి గురజాడ ఏనాడో పలికిన మాట. తెల్లవాడి పాలన తెల్లారి నేటికి భారతాన ఆరుపదులు దాటినా- ఉగ్రవాదం అగ్రవాదం ధాటికి మన ఇంట చీకటి తెరలింకా విడిపోనేలేదు. చీటికి మాటికి భాషాద్వే షాలు, కులం కుమ్ములాటలు, మతం మత్సర్యాలు, ప్రాంతాల వారీగా పెరిగిపోతున్న పంతాలూ పట్టింపులతో వేడెక్కిపోతున్న వాతావరణం - ' ఫిర్ మిలే సుర్' వంటి సుస్వరాలు కడుసొంపుగ కడలికి చేరి... మబ్బులై పైపైకి లేచి చల్లగా మెల్లగా మళ్ళీ మళ్ళీ చిరుజల్లులుగా కురిసినప్పుడైనా చల్లబడుతుందేమో! ఇరవై రెండు ఏళ్లి  కిందటి ఈ రాగమాలికను ఇరవై  రెండు మంది నవతారలతో కలిసి ఆరుపదుల కళాకారులు అరవై ఏళ్ళ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అతి నవ్య రాగాలతో వారి వారి భాషల్లో గొంతెత్తి పాడటం దివ్యంగా ఉంది. ఇదే దారిలో  జాతీయ సమై క్యతా గీతాలు మరిన్ని వచ్చి జాతి గుండెల మధ్య అడ్డుగోడలను కూలగొడతాయేమో చూడాలి! ప్రజల రాజ్యం బలపడాలని ఆశ పడాలి . 


- రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - దినపత్రిక - 07 -02 -2010 వ తేదీ ప్రచురితం ) 

పెళ్లాం చెబితే వినాలి! - రచన: కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - గల్పిక- 26-06-2009 )

 



ఈనాడు - గల్పిక- హాస్యం 

పెళ్లాం చెబితే వినాలి! 

- రచన: కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - గల్పిక- 26-06-2009 ) 


పెళ్లాల దగ్గర ఉగ్రవాదం పనికిరాదు. భక్తిమార్గమే శరణ్యం. అర్జునుడికి గీతోపదేశం చేసిన కృష్ణుడంతటివాడు సత్యభామ కాళ్ళు పట్టుకోలేదా?


దేవుడా! నాకు కష్టాన్నివ్వు... బాధలనివ్వు.. టెన్షన్నివ్వు' అని నా లాంటి ఓ విరాగి కోరుకుంటే ' ఇదిగో .... నీ కోరికలు తీర్చే సాధనం' అంటూ నీలాంటి ఓ భార్యనిచ్చాడా దేవుడు' అన్నాను. . మా ఆవిడతో ఎద్దేవాగా.


'ఆహా.. మరి ఆ పెళ్ళాన్ని బెటర్ హాఫ్ అని ఎందుకున్నారో మీ మగాళ్ళు?  అయినా, అందుబాటులో ఉండేవాటినే ఆమె కోరుకుంటుంది. మహేష్ బాబు జుట్టు ఎంత ముచ్చటగా ఉంటే నాకేంటి.. నా మొగుడి నెత్తిమీది జుత్తు మాత్రం నా గుప్పెట పట్టేంత ఎత్తుంటే చాలని కోరుకునే అమాయకురాలండీ ఆడది! ఆ మాత్రం మీ మొగమూర్ఖులకు అర్ధంకాదు.. అంతే! 


... మీకు నేనో తమాషా కథ చెప్పనా? అనగనగా ఓ అందమైన తోటంట' దాన్నిండా పండ్లూ పూలూ... కాయలూ... మంచి మంచి జంతువులూనూ! అయినా ఆమెకు ఏమీ తోచింది కాదు... ఆడుకునేందుకు ఓ జోడునివ్వవా' అని దేవుణ్ణ్ని అడిగితే ' ఇస్తాగానీ.. రెండు షరతులు.. ఆ వచ్చే మగవాడు నీ కన్నా బలంగా... మొరటుగా ఉంటాడు అన్నాడట...


సరే.. మరి రెండో షరతు? అడిగిందా ఆడమనిషి 


' వాడు తానే ముందుపుట్టానని... నువ్వు వాడి పక్కటెముకల్నుంచి వచ్చావని గొప్పలు చెప్పుకొంటాడు. నువ్వు వినీ విననట్లు ఊరుకోవాలి మరి' అన్నాడు. 


అప్పుడలా ఒప్పుకొన్నందుకే ఆడది మీ మగాళ్ళ మూర్ఖత్వాన్నే కాదు- చపలచిత్తాన్ని  కూడా ఇప్పుడు చచ్చినట్లు భరిస్తోంది


మాది చపలత్వమా? 


మీదే కాదు. మిమ్మల్ని పుట్టించిన దేవుళ్ళది కూడా ! ఒక భార్యను పక్కన పెట్టుకుని నెత్తిమీదింకో భామను పెట్టుకున్నాడు శివుడు. ఒక పెళ్ళాంచేత కాళ్ళు పట్టించుకుంటూ ఇంకో పెళ్ళాంకోసం అవతార మెత్తాడు ఇంకో మహానుభావుడు . అలికోసం అంత లావు యుద్ధంచేసి అనుమానంతో భార్యను అగ్నిప్ర వేశం చేయమన్నాడు  రాముడు. ఆ  దేవుడూ మగాడే కదా! బెడ్ కాఫీ దగ్గర్నుంచీ నైట్ బెడ్  ఎక్కేదాకా మొగాడి అవసరాలు తీర్చేందుకే ఆడది పుట్టిందని మీ మగాడి


అహంకారం . 


అవునా? 


తలొంచుకుని తాళి కట్టించు కుంటుందని ఎగతాళా? పాచిపనిచేసే పనిమనిషికి బట్టలుతికి ఇస్త్రీ చేసే  లాండ్రీవాడికి డబ్బివ్వాలి. హోటల్లో కప్పు అన్నం ఎక్కువ అడిగినా అదనంగా బిల్లేస్తాడు. ఉపరి సర్వారాయుడికి దక్షిణ ఇవ్వాలి. మీకూ, మీ పిల్లలకూ సొంత పన్ల కన్నా ఎక్కువ  శ్రద్ధతో సేవచేసే ఆడది గడపదాటి లోపలికొచ్చేందుకు మాత్రం లక్షలు లక్షలు కట్నం పోయాలి. ఛ! .. ఆ గోట్ మ్యాన్  మాటన్నా వినకబోతిని? 


ఈ గోట్ మేన్‌ ఎవడు మధ్యలో ? ఏమన్నాడూ ?


మొగుళ్ళు మోటారుబళ్ళులాంటివాళ్ళు. మొదటి ఏడాదే బాగా పనిచేసేది. మొహమాటాలకుపోయి మీ స్వేచ్ఛ పోగొట్టుకోవద్దు! తస్మాత్ జాగ్రత్త! అన్నాడు. 


ఓహో.. మాలాగా పేంట్లూ  చొక్కాలు వేసుకో వటం, పొద్దుపోయేదాకా బైట తిరిగి ఇంటికిరా పటం... ఇదేనా మేడమ్. . మీ దృష్టిలో స్వేచ్ఛ?  దాని  స్వాతంత్య్ర అనరు. ఒకరకంగా మగాడి గొప్పతనాన్ని ఒప్పుకొంటున్నట్లే అన్నారు సద్గురు జగ్గీ వాసుదేవ్. 


గురువుగారికిప్పుడు సద్గురు గుర్తుకొచ్చారన్నమాట. ఆయనింకా చాలా మంచి మంచి ముక్కలు చెప్పారు స్వామీ! విజయవంతమైన వివాహానికి నమ్ముకోవా ల్సింది పామిస్ట్రీని కాదు. మొగుడూ పెళ్ళాలమధ్య కెమిస్ట్రీని.  పెళ్లయితే అబ్బాయి అమ్మాయి ఒకటవుతారు. నిజమే... ఎవరు ఎవరవుతారనేదే అసలు సమస్య . మొగుడూ పెళ్ళాలు సినిమాహాల్లో సీట్లు వంటి వాళ్లు .  రెండింటికీ కలిపి ఒక్క రెక్కే  ఉంటుంది. సర్దుకుపోవాలి.. తప్పదు ! స్త్రీ పాత్ర లేకుండా నాట కాలు నడుస్తాయేమోగాని, సంసా రాలు నడవ్వు.  అలూమగలు ఆలూ కూరిన సమోసాలాగా కలసి ఉండాలి. ఓడి గెలవటమనే విచిత్రసూత్రం ఒక్క భార్యాభర్తల బంధంలో మాత్రమే ఉంటుంది . మొగుడూ పెళ్ళాలు కాటా కుస్తీ వస్తాదులు కాదుకదా! ఇద్దరూ కలిసి ఏడడుగులు వేసిననాడే ఒకటైనట్లు లెక్క.  అతను ఆకాశమైతే ఆమె భూమి.  అతను వాక్కు అయితే, ఆమె మనసు. అతను బైకు అయితే, ఆమె బైకు వెనక సీటు. పెళ్ళి తంతులో వల్లించే ప్రతి మంత్రానికి ప్రత్యేక ఆర్థ ముంది. అలుమగలనేది సీతారాముల్లాగా ఒక అందమైన ద్వంద్వ సమాసం. అనురాగం ఛందస్సు  కుదిరి, సరైన పాళ్ళలో యతిప్రాసలు పడితే పోతన పద్యంలాగా సంసారం హృద్యంగా ఉంటుంది. వేలు పట్టుకుని నడిచి వచ్చిన భార్యను వేలెత్తి చూపే ముందు మగవాడు ఆలోచించాలి. భర్త పేరు చెప్పటానికే సిగ్గుపడే భార్య భర్త సిగ్గుపడే పని ఏనాడూ చేయకూ డదు. పెళ్లంటే... అరె... అప్పుడే నూరేళ్ళూ నిండాయా?' అన్నట్లుండాలి. అలుమగల మధ్య కయ్యం అద్దంమీద పెసరగింజ నిలిచినంతనేపే! వాదులాడుకోకుండా ఉన్నంతసేపే ఆదిదంపతులకైనా ఆరాధన. సీతారాములు విడిపోయిన తదనంతర రామాయణమంతా విషాదమే. చూశారా? మొగుడూ పెళ్లాల పంచాయతీ మధ్య 

మూడోమనిషి దూరేదికాదని రాయని రాజ్యాంగ సూత్రం ఒకటి అనాదిగామన సమాజంలో ఉంది.


నిజమేనోయ్ ! అందుకే ఈ మధ్య ఒక విడాకుల కేసులో సర్వోన్నత న్యాయ స్థానం కూడా కలగజేసుకునేందుకు ఇష్టపడలేదు. '

పైపెచ్చు ' పెళ్ళాం చెబితే వినాలి. మేమంతా అదే చేస్తున్నాం ' అని సలహామాత్రం ఇచ్చింది ఫుల్‌ బెంచీ! 


చూశారా! భూమి ఆకర్షణకన్న భామ ఆకర్షణే మిన్న. భూమికి లొంగి నడవంగాలేనిది.. భామకు లొంగి నడిస్తే తప్పేంది ? చదువులమ్మను భార్యగా పొందీ బ్రహ్మదేవుడు తలరాతలు ఇంత తికమకగా ఎందుకు రాస్తున్నాడో తెలుసా ? పెళ్ళాన్ని అడిగి రాయటానికి నామోషీపడి! ... అందుకే అనేది సార్.. 


పెళ్ళాంచెబితే వినాలని . అంతేగా! ఓకే డార్లింగ్! బుద్ధిగా నడుచుకుంటామిక.. తమరివ్వక ముందే ఇలా వార్నింగ్! 


- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - గల్పిక- 26-06-2009 ) 


మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...