Saturday, December 4, 2021

ఈనాడు - సంపాదకీయం ఆటవిడుపు - రచన: కర్లపాలెం హనుమంతరావు (ఈనాడు - 06 -05 - 2012 - ప్రచురితం )

 ఈనాడు - సంపాదకీయం 

ఆటవిడుపు 

- రచన: కర్లపాలెం హనుమంతరావు 

(ఈనాడు - 06 -05 - 2012 - ప్రచురితం ) 


సంఘ జీవితంలో ఆటపాటలు అనివార్యం . అవి బతుకు వెలుగులు  వాఙ్మయం లాగే. పాట వాగ్రూపం... ఆట మెదడుకు, శరీరానికి చురుకు పుట్టించే క్రియావిశేషం' అన్నది బాల వాఙ్మయ విభాగంలో విశేషంగా కృషిచేసిన డాక్టర్ తిమ్మావజ్ఝుల కోదం డరామయ్యగారి సిద్ధాంతం.  పాకెట్ బుక్ ఆఫ్ గేమ్స్' సృష్టికర్త మోర్ హెడ్ సిద్ధాంతం ప్రకారం- దేశ కాలచరిత్రలను ప్రభావితం చేసేవి జాతి సంస్కృతులకు అనుగుణంగా రూపుదిద్దుకునే కళారూపాలు . ఆటలూ ఆ కళాప్రపంచంలోని అంతర్భాగమే. సందు దొరికినప్పుడల్లా క్రీడా విశేషాలను కవులు ఏకరువు పెట్టిన సందర్భాలు తెలుగు సాహి త్యంలో కోకొల్లలు. అష్ట శతాబ్దాల కిందటే నాచన సోమన ' హరివంశం' లో రుక్మిణీకృష్ణుల చేత 'పాచికలాట' ఆడించాడు. పాల్కురికి సోమనాథుడు 'బసవపురాణం'లో శైవభక్తులు కార్తీకమాసం వేడుకల్లో ఆడే నందికోలను వర్ణించాడు. ద్రోణుడు హస్తినాపురానికి వచ్చినప్పుడు 'అప్పుర బహిరంగణంబున ధృతరాష్ట్ర పాండునందనులందరు కందుక క్రీడాపరులై వేడుకతో ఆడుచున్నట్లు' మహాభారతం ఆదిపర్వంలో ఉంది. వేదాలు, పురాణాలే 'అక్షఖేలనం ' వంటి జూదక్రీడలను ప్రస్తావించకుండా వదిలాయి కాదు . సాధుకార్యాలవల్ల సత్ఫలితాలు  అందుకోవచ్చన్న సందేశాన్ని ఛాందోగ్యోపనిషత్- పాచికలాటలోని ఎత్తులు వేసే విధానంతో పోల్చి చెప్పింది (41, 4). క్రీడలు మానవ జీవి తంలో ప్రధాన భాగం. వ్యసనమని ఎంత తోసిపారేసినా మన ' పాచి కలాట' ఎన్ని పర్యాయాలు కాలానుగుణంగా మార్పు చెందింది? ఎన్నెన్ని దేశాలు పర్యటించి చివరికి నేటి పచ్చీస్ ఆటగా మారింది! మహాభారతం విరాటపర్వంలో- అర్జునుడు స్తుతించిన ద్రోణుణ్ని దుర్యో ధనుడు దూషిస్తాడు. అందుకు ప్రతిస్పందనగా అశ్వత్థామ అర్జునుడి గాండీవ ప్రయోగం 'అడ్డపాకులు' వేసినట్లుండదని దుర్యోధనుణ్ని ఎద్దేవా చేస్తాడు. మహాభారతాన్నేమిటి.. మానవ జీవితాలనూ క్రీడలు నడిపించిన కథలు విశ్వసాహిత్యంలో బోలెడన్ని. 


ప్రాచీన ఈజిప్షియన్లు పార్థివ శరీరాలతోపాటు పాచికలనూ పూడ్చిపెట్టేవారు. తమవారు పరలోకంలో ఆడుకునేందుకనిట  ఆ ఏర్పాటు! ట్రాయ్ ముట్టడి ఏళ్లతరబడి సాగినకాలంలో యోధుల మనసు ఇళ్లమీదకు మళ్లకుండా క్రీడలు ఏర్పాటుచేశారు. మన రాయలు చతురంగంలో దిట్ట. ఎన్ని పని  ఒత్తిడులు  ఉన్నా రోజుకో గడియ పాటైనా చదరంగం బల్లముందు గడపనిదే సాంత్వన కలిగేది కాదా మహారాజుకు  . ఇంటిముందటి అరుగు బండలమీదా, దేవాలయాల ప్రాంగణాల్లో నేటికీ కనిపించే ఆట ' పటాలు' నాటి మన తాతల క్రీడాప్రీతికి నిలువెత్తు పటాలు. తెలుగునాట పలు బౌద్ధ హిందూ క్షేత్రాల కుడ్యశిల్పాలలో  నాటి మన క్రీడావైభవం దర్శనమిస్తుంది. సురవరం ప్రతాపరెడ్డి 'ఆంధ్రుల సాంఘిక చరిత్ర' లో  వివిధ కాలాల క్రీడావిశేషాలను బహువిస్తారంగా ప్రస్తావించారు. నాచన సోమన ఉత్తర హరివంశంలో పాచికలాటకు రెండుపదుల పద్యాలు కేటాయించాడు. సముద్రతీరంలో దొరికే ఉప్పు- లోభాగాలకు అందేవరకూ చోరులనుంచి, పరాయి ప్రభువులు సుంకాల నుంచి, దౌర్జ న్యపరుల నుంచి తప్పించుకునే తిప్పలన్నీ 'ఉప్పట్టి' ఆటలో పెట్టి నాచన సోమన ' హరివంశం'లో ఆడించాడు. శ్రీకాళహస్తి మాహాత్మ్యం లో మహాకవి ధూర్జటి నాటి పల్లెల్లో 'చిట్ల పొట్లకాయ, సిరిసింగణా    వత్తి, గుడుగుడు గుంజాలు, కుండిన గుడి, తన్ను బిల్ల, బల్లిగోడు, చిడుగుడు లవ్వలపోటి, చిక్కినా బిల్లలాంటి మగపిల్లలాడుకునే ఆటలన్నింటినీ తిన్నడి బాల్యక్రీడలుగా వర్ణించాడు. గుజ్జనగూళ్లు, అచ్చన గండ్లు, పింపిళ్లు, కుచ్చీళ్లు గీరన గింజలు, ఓమనగుంటలు, కనుమూసి గంతలు, కంబాలాట' లాంటి ఆడపిల్లల ఆటలన్నింటినీ పింగళి సూరన 'కళాపూర్ణోదయం'లో తనివితీరా వర్ణించాడు. కొరవి గోపరాజు సింహా సన ద్వాత్రింశిక పుణ్యమా అని- మన పూర్వపు వినోద క్రీడలు కొన్నైనా తెలుస్తున్నాయి. వాటిలో నేటి బాలలు ఆడేవి ఎన్ని?


`ఒకటి ఓ చెలియా/రెండూ రోకళ్లూ/ మూడూ ముచ్చిలుకా/నా లుగూ నందన్నా! ఐదుం బేడళ్లూ' అంటూ అంకెలే ఆటగా నేర్పే గచ్చ కాయలాట ఇప్పటి పిల్లకాయలకు పిచ్చి ఆట ట! ' కొండమీది గుండు జారి/ కొక్కిరాయి కాలు విరిగె/దానికేమి మందు? ... వేపాకు పసుపూ వెల్లుల్లిపాయ/ నూనెలో బొట్టు/ నూటొక్కసారి/ పూయవోయి పూయి/ పూటకొక్కసారి' అంటూ ఇంటివైద్యాన్ని ఇంతప్పటినుంచే ఒంటపట్టించే వానపాట ఆటలు ఏనాడో  అటకెక్కేశాయి. 'విశాఖ పట్నం వీశెడు బెల్లం/నీకో పదలం నాకో పదలం/ కళింగపట్నం కాసు లపేరు/ నీకో పేరు నాకో పేరు' అంటూ దొరికినదాంట్లో భాగం పంచే మంచిని చెప్పే తొక్కుడు బిళ్లాట సందడి ఇప్పుడు ఏ సందులో కనిపిస్తోంది గనక ? 'ఆడేవారికి అచ్చావు పాలు .. పాడేవారికి పాలు పంచదార'  అని ఊరిస్తూ పాపల్ని ఆడించే అలనాటి తాతమ్మల ఆటలు, పాటలు నేడు పాతబడిపోయినవి. . పరమ మొరటువి! దేశ కాలాలతోపాటు అన్నింటిలోలాగే ఆటపాటలలోనూ మార్పు వచ్చేసింది. మార్పు మనిషిని ముందుకు నడిపించినంతకాలం అభ్యంతరం చెప్పేందుకేముంది?! మన అడుగులు వెనక్కి పడుతుండటమే నేడు ఆందోళన కలిగిస్తున్న అంశం. వ్యాపార ప్రపంచం మోజులో పడి పిల్లల చదువు సంధ్యల చివరి సోపానమూ రూపాయేనన్న భ్రమలో మనం ఉన్నాం. ముప్పొద్దులా పసిబిడ్డను పుస్తకం 'రాట' చుట్టూనే తిప్పడం ఎంత ముప్పో మనస్తత్వవేత్తలు మొత్తుకుంటున్నా పట్టించుకోకుండా ఉన్నాం. ఏడాదిపొడుగునా పుస్తకాల పుట్టల్లో విద్యా తపస్సు చేసిన బాల రుషులకు రవ్వంత విశ్రాంతి వరంగా దొరికేది వేసవి సెలవుల విరామంలోనే . 'ఆటవిడుపు' అంటే ఆటల కోసం బిడ్డను విడవడమే కాదు, రేపటి చదువుల పోటీకి వాళ్లు శక్తిని కూడదీసుకోవడం.  నెల వులు పసిమనసులకు ఆ అవకాశం కలిగించే ఆటవిడుపు. కంప్యూటర్ ముందు చేరి కరాటే ఆడటం, తోటి పిల్లలతో కలిసి కబాడీ ఆడటం ఒకటవుతాయా? మళ్లీ బళ్లు తెరిచే వేళకు పిల్లలు గాలిపటాలు, రంగు రంగుల సీతాకోక చిలుకల్లాగా ఎగురుతుండాలంటే- ఈ సెలవులు నిజమైన 'ఆటవిడుపు'గా మారాల్సిందే!


- రచన: కర్లపాలెం హనుమంతరావు 

(ఈనాడు - 06 -05 - 2012 - ప్రచురితం ) 




No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...