అనాపలింగకూస్కాం - ఈనాడు - కథానిక - గల్పిక)
ఈనాడు - కథానిక - గల్పిక- హాస్యం
అనాపలింగకూస్కాం
- కర్లపాలెం హనుమంతరామ
( ఈనాడు - సంపాదక పుట - గల్పిక - 11- 10 - 2002 1
' అప్పల్నాయుణ్ణి చూస్తే నాకు జాలేస్తోంది' అన్నాడు మార్రెడ్డి కులాసాగా..
పెంటపాడు రోడ్డులోని బాడిద ఫ్యాక్టరీపని పూర్తయిన సందర్భంగా కాంట్రాక్టర్ కనకరాజు చిన్న రౌండేర్పాటు చేశాడా పూట 'మా పార్టీకిలాంటివిప్పుడు గట్టవే అని అప్ప ల్నాయుడెక్కడ అంటాడోనని మరీ ముఖ్యుల్ని మాత్రమే పిలవాల్సొచ్చిందని మధనపడ్డాడు కనకరాజు .
అప్పల్నాయుడు ఈ సారాట్టే మాట్లాడటం లేదుగానీ అతని పక్కనున్న గుర్నాథం మాత్రం వ్యవధానం లేకుండా బాదేస్తున్నాడు.
గన్ మెన్లను తీసేసి ఆ స్థానంలో సన్నాసుల్ని ఏర్పాటు చేసింది గవర్నమెంటేనాంట అన్నారిటు వైపుకు కూర్చున్న ఈఈగారు చిర్నవ్వుతో చిన్నగా. ' నాయకుల్ని నిత్యం ఆధ్యాత్మిక చింతనలో వుంచడం దీని లక్ష్యం. అవకాశం దొరికినప్పుడల్లా సావకాశంగా ఉపన్యసించటమే ఈ సన్యాసుల పని '
'ఫ్యాక్టరీతోపాటు రోడ్డు పని కూడా అనుకున్నట్లయినట్లేనా?' అనడిగాడు అప్పల్నాయుడు రెండో రౌండారంభిస్తూ.
'అశోకుడు రోడ్లని వేయించెను. బాటకిరు వైపులా చెట్లను నాటించెను' అన్నాడు గుర్నా థం అసందర్భంగా.
' వేయించుకోవటానికి రోడ్డేమన్నా వేరుశనగపప్పా? ఆ'షో'కుడేకాదు. . ఆ దేవుడైనా సరే చెట్లను బాట కటూఇటూనే నాటించాలి. బాటమీద నాటిస్తే అడ్డు కదూ!' అన్నాడు మార్రెడ్డి.
సూర్రెడ్డి వేరే పార్టీ పెద్దమనిషవటంవల్ల గుర్నాథాన్నెంత మాటైనా అనే అవకాశం ఉంది.
'అప్పల్నాయుడూ! నువ్వేంటీ మరీ బుద్ధావతారంలాగా తయారయ్యావు? ' అని ఎక సెక్కంకూడా చేసేశాడు.
'బుద్ధుడినలా ఎద్దేవా చేయొద్దు. సిద్ధా ర్థ మహారాజు కొడుకయి వుండి సర్వ సంగ పరిత్యాగంచేసి సన్యాసయిన మహానుభావుడు' అన్నాడు గుర్నాథం టాపిక్ సన్యాసుల మీదకు మళ్ళించి .
' రాజులు సన్యాసులుగా మారటం కొత్తేం కాదే! సుభద్రకోసం అర్జునుడు రుషి వేషం వేయలేదూ! ' అన్నాన్నేనూ .
'అర్జునుడు సంసారలంపటంలో ఇరు క్కునేందుకు సన్యాసయ్యాడు. మా పార్టీ ఉపదేశించేది స్వచ్ఛమైన సన్యాసం. బాహ్య సుఖాలు దుఃఖహేతువులని కదా భగవద్గీత లోని కర్మసన్యాసయోగం చెప్పేది!' అన్నాడు గుర్నాథం.
'ఖర్మ ! జన్మభూమిలో గ్రామసభలో రచ్చ బండలమీద కూడా ఈ నిత్య పురాణ పఠనంతో అప్పల్నాయుడూ! నీకింకా పిచ్చెక్కిపో కుండా వుందంటే ఆశ్చర్యంగా వుంది' అన్నాడు సూర్రెడ్డి జాలిగా.
గుర్నాథం వెంటనే ఇంకో శ్లోకం అందు కున్నాడు. ఆదిశంకరాచార్యులవారి షడ్పదీ స్తోత్రంలోది. 'అవినయ మపనయవిష్ణోః దమయవానః శమయ విషయ మృగ తృష్ణామ్...' అనంగానే
భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః' అని పూర్తిచేశాడు అప్ప ల్నాయుడు గడగడా.
నోరెళ్ళబెట్టటం మావంతయింది.
అప్ప ల్నాయుడు నోట్లో ఇన్ని పలుకులు నానుతున్నాయంటే ఈ గుర్నాధం ఎంతకాలం నుండి చిత్రవధ చేస్తున్నాడో పాపం.
వెధవ పదవుల కోసం ఎన్ని తిప్పలు! అప్పల్నాయు డీటెంపో కంటిన్యూ చేస్తే ఈసారి రీషఫిల్లో మంత్రిపదవి గ్యారంటీ!
ఆమాటే అని అభి నందించబోయానతన్ని.
' నాదేముంది. అంతా అనాపలింగకూస్కాం... ప్రభావం' అనేశాడు
అర్థంకాలేదు.
గుర్నాథమే అందుకున్నాడు. అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మ. స్కాంద పురాణాల పేర్లలోని మొదటి అక్షరాలను పేర్చి ముచ్చటగా వుంటుందని ఈ నినాదాన్ని తయారు చేసింది పార్టీ. పురాణాలు మానవ జీవనానికి ప్రమాణాలు కనక మా పార్టీ సన్యాసులెవరైనా ఉపన్యాసాల చివర్లో ఈ మంత్రాన్ని దేశానికి సందేశంలాగా ఉపదేశించటం కంపల్సరీ' అన్నాడు గుర్నాథం.
'పదవులు శాశ్వతం కాదు. ధనంవల్ల దుఃఖం కలుగుతుంది. కోరికలవల్ల ఆశాంతి కలుగుతుంది. మానవ సేవే మాధవ సేవ . జగమంతా మాయ.. మిగిలిం దంతా మిధ్య.. లాంటి మాటలు మధ్యమధ్యలో పడుతూవుండాలి' అన్నాడు అప్ప ల్నాయుడు ముద్దగా.
అప్పటికే నాలుగో రౌండయి పోయింది. నాలిక మడతపడుతోంది. ఇవతల సూర్రెడ్డి మంచి కిక్కులో ఉన్నాడు.
' కరవొచ్చి జనం అల్లాడుతున్నారు. కరెంటు కోతతో, నీటి కొరతతో, ధరల మోతతో సామాన్యుడు సతమతమవుతావుంటే సన్నాసి కబుర్లు చెబు తార్రా మీరూ! ఓటరుకి కూడా వైరాగ్యం. పుట్టి 'ఓటు మిథ్య' అంటూ బూతువైపుకే రాకుంటే నక్సలైట్లనుకున్న పని అనాయాసంగా మనం చేసినట్లవటంలేదూ.... అంటూ చేతిలోని గ్లాసుని పగలగొట్టేశాడు.
పెద్ద రభసయేట్లుంది. సూర్రెడ్డిని పట్టుకో వటం కష్టంగా వుంది.
' బార్లు బార్లా తెరిచేసి జనమ్ చేతనయితే తాగటం మానె య్యాలని నీతులు చెబుతారా! సన్యాసులు సారా అమ్ముతార్రా ఎక్కడైనా? ఆర్టీసీ రేట్లు పెంచి... పెంచలేదు. సవరించామని బుకాయిస్తారా! బుద్ధుడు అబద్ధాలు చెబుతాడ్రా ఎక్కడైనా? బియ్యం బొక్కి.... పిల్లల స్కాలర్షిప్పులు నొక్కి... అందిం దంతా మెక్కి... మెట్ట వేదాంతం చెబు తార్రా ! పెళ్ళాం పిల్లల్నెంటేసుకుని విదేశాల కెగేసుకుని పోతూ సంసారీ దుఃఖీ' అంటే వినటానికిక్కడెవ్వరూ చెవుల్లో పువ్వులు పెట్టుక్కూర్పోలేదురోరేయ్. యోగా... యోగా అనంటుంటే ఇలాంటి అఘాయిత్యమేదో చేస్తారని అనుకుంటూనే వున్నా! అదే నిజమయింది. మఠాలకీ.. ముఠాలకీ తేడా లేకుండా పోయింది. సన్స్, సనిన్లాస్ చేసే న్యూసెన్సుని కవర్ చేసుకోవటానికి పవరున్న మీరు ఈ సన్యాసం ' థీరీని ప్రచారం చేస్తున్నారని నేనంటాను. అంతా సన్యాసులయితే రాసుకున్న తరువాత రాలేం దుకంతబూడిదసలెక్కడుందో ఆ సంగతి ఆలోచించార్రా ... మీరూ....! '
'అందుకేగా మార్రెడ్డన్నా ! కనకరాజు ఫేక్టరీ కడతావుంది' అన్నాడు. అప్పల్నాయుడు .
' ఎవరైనా అడిగితే కనీసం బూడిదైనా ఇవ్వలేకపోతే ఆదిభిక్షువుకి మనకీ తేడా ఏవుంది? మా సన్నాసి బోధనలు విన్న తరవాత కదూ..... మేయర్లక్కూడా ప్రజాసేవ చేయాలని తహతహపుట్టి కనీసం అయిదు లక్షల వరకైనా చెక్కు పవర్ పెంచమని అడుగుతున్నదీ ! కడుపుమంటకొద్దీ తిడతావున్నావుగానీ, మా సన్నాసి థియరీ స్ఫూర్తితోనేకదూ యూనివర్శిటీల్లో కూడా సన్యాసి కోర్సు' ఆరంభించాలని ఆలోచి స్తోంది ప్రభుత్వం! ... అని అప్పల్నాయుడంటుండగా బైట పెద్దగోల బయలుదేరింది.
కనకరాజు బావమరిది కంగారుగా పరు గెత్తుకొచ్చాడు.
' ఫేక్టరీ గోడ కూలి పది మంది కూలీలు గాయపడ్డారు. పెద్ద గోలగా వుంది. మీరిక్కడుండటం మంచిది కాదు' అంటుండగానే అప్పల్నానాయుడు మత్తుగా వాలిపోయాడు.
కనకరాజు ఈఈ గారిని కంగారుగా పక్కగదిలోకి దాటేస్తే... మార్రెడ్డీ నేనూ కలిసి అప్పల్నాయుడిని దొడ్డిదారిన కారులో ఎక్కించి పంపించేశాం.
పదవులే శాశ్వతం కాదు. ఫ్యాక్టరీలు శాశ్వతమా!' అనుకుంటూ సీసాలో మిగిలింది గొంతులోకి పంపుకుని' 'అంతా అనా - పలింగకూస్కాం' అంటూ కారెక్కుతున్న గుర్నాథం అచ్చం కన్యాశుల్కంలోని బైరాగి లాగా అనిపించాడు నాకా క్షణంలో.
సిద్ధులు అబద్ధాన్ని నిజం చేయగలరు. ఆ నిజాన్ని అబద్ధం చేయగలరు. లోకమే పెద్ద అబద్ధమని కదా జైరాగి సిద్ధాంతం!
మర్నాడామత్తు పూర్తిగా దిగింతరువాత - కానీ అనాపలింగకూస్కాం అంటే అర్థం కాలేదు.
అగ్నినారదపద్మలింగకూర్మస్కాంద పురాణాలూ .. వల్లకాడూ కాదు !
అధికారులు, నాయకులు, పయిరవీకారులు లింకయి గవర్నమెంటుని కూడగట్టుకొని చేసేస్కాములే ఆనాపలింగకూస్కాం.. అని!
గవర్నమెంట్ తరుఫునుంచి తర్ఫీదయి వచ్చిన గుర్నాథం తరహా సన్నాసులు చెవుల్లో గూడు కట్టుకుని లోకల్ లీడర్లకి పద్దాకా ఉపదేశించాల్సిన తారక మంత్రం.. హోర్నీ . . ఇదా!
- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - సంపాదక పుట - గల్పిక - 11- 10 - 2002 )
No comments:
Post a Comment