Saturday, December 4, 2021

ప్రేమ పరిమళాలు - రచన: కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు సంపాదకీయం - ప్రచురణ తేదీ 06 -03 - 2011 )

 ఈనాడు - సంపాదకీయం 

ప్రేమ పరిమళాలు 

- రచన: కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు సంపాదకీయం - ప్రచురణ తేదీ 06 -03 - 2011 ) 


నవరసాల్లో శృంగారానిదే ప్రథమ తాంబూలం. కామిగానివాడు మోక్షగామి కాలేడన్నది యోగి వేమన వాదం. పవిత్ర దేవాలయ కుడ్యాలమీద కళాత్మక శిల్పచాతుర్యం వెనుక  రహస్యం- మోక్షప్రాప్తికి తృతీయ పురుషార్ధ దశ దాటవలసింది  అనే  మన పూర్వీకుల భావనే.  వాత్సాయనుడు కామసూత్ర రచన తలపెట్టిందీ మనిషి సంపూర్ణానంద సాధనకోసమే. యమునాతీరం, బృందావనం, గోపికాగణం, రాధామాధవం, రాసలీలానర్తనం... వీటితో బాహ్యేంద్రియాలకు ఓ రసమయానంద అనుభూతి కల్పించడంకోసం మాత్రమే జయదేవుడు గీతగోవిందాన్ని ఆలపించలేదు. జీవిత పరమార్థసారమైన జీవాత్మ పరమాత్మల సంయోగ సాధనార్ధమే ఈ మధుర భక్తిమార్గాన్ని ఆయన ఎంచుకున్నది . వీరశైవంలో సైతం శరణునికి శివునికి మధ్య ఉన్నది పవిత్ర నాయికా నాయక సంబంధ బాంధవ్యమేనని చరిత్రకా రులు చెబుతారు. మధుర మంజుల మాలతీ మండపాన కల్వ పూమాల కడుతూ తనకోసం ఎదురుతెన్నులు చూసే రాధ వాల్గన్నుదోయిని వెనకపాటున వచ్చి మూసి అల్లరికి దిగిన ఆ నల్ల నయ్యను చూసి- బృందావనం, చందమామ, యమునా తరంగాలు... చివరికి రాధిక తలలోని పూవులూ పకపకా నవ్వినాయంటారు కరుణశ్రీ.  ప్రణయాన్ని మించిన సృష్టిరహస్యం మరేముంటుంది! ఆకాంక్షాతప్త ఆత్మ ఒత్తిళ్ల నుంచి సాక్షాత్ ఆ పరమాత్మే తప్పించుకో లేకపోయిన వైనం మనకు తెలుసు. రక్తమాంస నిర్మితమైన మనిషి సంగతి మరిక చెప్పేదేముంది! సృష్టిలోని అందాలూ సౌఖ్యాలూ ప్రేమలూ... అన్నీ ఈశ్వరచ్చాయలే. 'ఈశ్వరుని పొందుకు ఇవి బంధాలుగా మారటమే మాయ' అంటాడు చలం గీతాంజలిలో. ' అంతా మాయేనని తెలుసు... తెలిసీ వలచీ విలపించుటలోని తీయ దనం ఎవరికి తెలుసు? ' అనే భగ్నప్రేమికుడి వేదాంతంలోనే దాగి ఉందనుకోవాలి- మాయాప్రణయ రహస్యమంతా. 


గోవర్ధన గిరిధారిని సైతం తులసిదళంతో తూయగలిగే ఈ మాయ- రెండో ఎక్కమంత సులభమనిపించినా.. రెండో ప్రపంచ యుద్ధమంత భీభత్సాన్నీ  తనలో ఇముడ్చుకుంటుంది. ఆ గాలి సోకితే చాలు- కూసింతసేపు కూడ కూకుండనీయదు. కునుకూ ఉండదు. ఆ జారువలపు జడివానలో జాబిలతల వంటి మేనులే కాదు, మనసులూ తడిసి ముద్దయిపోతాయి . ఆ మగతలో, ప్రతి మబ్బుతునకలో కానవచ్చేది... తన ప్రభువు ఆకారమే. ప్రతి కొమ్మ వంపులో తన కొమ్మ సొంపులే కనిపించి తన్మయత్వం ఆవరిస్తుంది. ఆకులో ఆకుగా పూవులో పూవుగా ఒకరిలో ఒకరు ఒదిగిపోవాలనే తపనతో లోకం పట్టని ప్రణయ సమాధిలోకి జారిపో తారు ప్రేయసీ ప్రియులు. జన్మజన్మలకు సరిపడా ఆనందాన్ని ఆ క్షణానే జుర్రుకోవాలన్న తీవ్ర కాంక్ష వెర్రితనంగా తోచని, అనిపిం చని విచిత్ర అవస్థ అది. నేలా ధూళీ పట్టని ప్రణయజీవులకు.... పగలే వెన్నెల. .  జగమే ఊయల. 'చివురించిన మావుల క్రింద చేయికి చేయి చేర్చి... పేజ చింతనలన్/ మరపించు రాగముల్ దీయుచు వాసనల్ పరిమళించు చోటులందు/ విహరించుటకై' ప్రేయసిని లేచిరమ్మని అబ్బూరివారు ఊహాగానం చేసిందీ . . ఈ మధుర జీవితాధ్యాయాన్ని స్ఫురణలో ఉంచుకునే.  మనసైనవారి చెంత కాలమే

స్తంభించిపోయినట్టుండే ఈ దశను వర్ణించి పులకించని ప్రపంచ సాహిత్యం లేదు. మాటలు మూగబోయిన వేళ మనసులు ముచ్టలాడుకొనేందుకు ప్రకృతి కనిపెట్టిన చిట్కా.. ప్రణయ భాష. ప్రేమికులు గుసగుసలాడుకునేది చెవిలో కాదు, హృదిలో! పెదాలతో స్పర్శించేది పెదవులను కాదు, ఆత్మను' అని మురిసిపోయాడు ఒక ఆంగ్ల కవి. కాళిదాసు, జయదేవుడు, వర్డ్స్ వర్త్, జాన్ కీట్స్.. ఇలా ఎవరెవరి పేర్లను ప్రస్తావించినా ఈ ప్రణయ దేవతను ఆరా ధించని కవి కనిపించడు . అరబిక్ సాహిత్యమంతా ప్రేమభావనతోనే పులకింపజేస్తుంది. ఎన్ని రూపాలైనా అన్ని పూలూ ఒకే గుబాళింత/ ఒక మనసులో ఎన్నెన్నో మారుతాలు సృష్టించే వింత. అందుకే, ప్రేమంటే... ప్రపంచానికంత గిలిగింత.


ఆకలి దప్పికల్లా క్షీరదాలకు ప్రేమభావనా ఒక అవసరమన్నది జీవశాస్త్ర సిద్దాంతం. ఆహారం కోసం, దాహంకోసం తపించే మెదడు భాగాలే ప్రేమకాంక్షకు ప్రేరణ అని నాడీశాస్త్రం చెబుతోంది. ప్రేమభావన మెదడులోని ఆనంద కేంద్రాన్ని అతిగా ఉత్తేజితం చేసే కొన్ని రసాయనాల అధిక ఉత్పత్తికి కారణమవుతుందట. దానివల్ల హృదయ స్పందనల క్రమం గాడితప్పి, నిద్రాహారాల ధ్యాస తగ్గుతుం దంటున్నారు మానసిక శాస్త్రవేత్తలు. ' ఏరోటోమానియా'గా పిలిచే ప్రేమ రుగ్మతకు ప్రేమభావన అందించడానికి మించిన మంచి చికిత్స లేదని అనుభవాలెన్నో నిగ్గుతేల్చాయి. పూవువంటి జీవితానికి ప్రేమవంటి మకరందం అందాలంటే తూనీగల్నీ ఆకర్షించే పరిమళాలు వెదజల్లడం నేర్చుకోవాలి. జీవితం గ్రంథం కాదు. ప్రేమపాఠం ఏ గురువూ నేర్పేదీ కాదు. ఇద్దరినీ గెలిపించగల ఈ ప్రణయ క్రీడలో ఉభయులూ ఓడిపోతుండటమే నేటి తరంలోని విషాదం. 'కాగితం పూలకి అంటుకున్న సెంటురా నేటి కొత్త ప్రేమఫార్ములా' అని ఒకనాటి తరం అభ్యంతర పెడుతుంటే- 'జీవితం స్కేలులో చిన్న సెంటిమెంటురా... అంతకన్నా పెద్దసీను ఈ ప్రేమకు లేదురా!' అని పొరబడుతోంది అత్యధికంగా నేటితరం. 'జావులి యన్' అని పిలుచుకునే పచ్చివయసు  తొలిప్రేమను చైనా యువ తరం భావిబంగారు జీవితానికి అవరోధంగా భావిస్తోంది. ప్రేమ గురించి, సుదృఢమైన మన వివాహ కుటుంబ వ్యవస్థల గురించి సమగ్ర సమాచారం తమ పాఠ్యప్రణాళికల్లో భాగంగా ఉండాలని అక్కడి విద్యార్థిలోకం కోరుకుంటోంది. ఈ మధ్య జరిగిన ఒక యువ సదస్సులో వెల్లడైన సత్యమిది. భారతీయుల సరస భావన  అంతర్జాతీయంగానూ ఆకట్టుకుంటున్నదనడానికి సరికొత్త నిదర్శనమిది!


- రచన: కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు సంపాదకీయం - ప్రచురణ తేదీ 06 -03 - 2011 ) 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...