ఈనాడు - సంపాదకీయం
శతాయుష్మాన్ భవ ... !
- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - సంపాదకీయం - 27-05-2012 )
'శ్రీకైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్" అన్న భాగవత కర్త బమ్మెర పోతన భగవంతుడి చేతే గోపాలబాలుడి అవతారం ఎత్తించి 'మీగడ పెరుగుతో మేళవించిన చల్ది ముద్దల' రుచి చూపించాడు. యశోదమ్మ తన ముంగిట ముత్యం బాలకృష్ణుడికి ఇష్టమైన రకరకాల పిండివంటలు చేసిపెట్టేదని సూరదాసూ వర్ణించాడు. పెరుగుమీద తేరుకున్న నీటిలోపాతులు కలిపితే 'రసాల' అనే పానీయం తయారవుతోందని 'భావప్రకాశ' వైద్యగ్రంథం చెబుతోంది. అరణ్యవాసంలో ఉన్న పాండవులను పరామర్శించడానికి శ్రీకృష్ణపరమాత్ముడు వచ్చినప్పుడు బడలిక తీర్చేందుకు భీమసేనుడు తయారుచేసి ఇచ్చిందీ రసాలనే. ఆశ్రమ సందర్శనానికి శ్రీరామచంద్రుడు విచ్చేసిన సందర్భంలో భరధ్వాజ మహర్షి ఇచ్చిన విందులో వడ్డించిన వంటకాలను వాల్మీకి మహర్షి వర్ణిస్తుంటే చదివేవారికి ఇప్పుడు నోటిలో నీరు ఊరాల్సిందే! ఒకనాటి సామాజిక వ్యవహారాలన్నింటికి అయ్యలరాజు నారాయణ రచించిన 'హంస వింశతి' ఒక విజ్ఞాన సర్వస్వం. అందులో కనిపించే పిండివంటల వివరాలు ఆనాటి మన తెలుగువారి తిండి పుష్టికి నిండు తార్కాణాలు. ఇంట్లోని పెద్దలందరూ అనుష్టానాలు చేసుకున్నాక ఉదయం పూట ఉపాహారంగా 'చల్దులు' ఆరగించి చల్లంగా బతికిన మంచికాలం ఒకప్పటి మన తాతలది. ఎంత దూరం దాకో ఎందుకు... వందేళ్లకిందటి గురజాడవారి కన్యాశుల్కంలో బుచ్చెమ్మ 'అయ్యా! మీరు చల్దివణ్నం తింటారా? ' అని గిరీశాన్ని అడుగుతుంది! 'శివరాత్రి మాహాత్మ్యం'లో సుకుమారుడి జిహ్వదారుఢ్యాన్ని వర్ణిస్తూ 'ఏనుబదియేడుల వార్ధక/ మున భ్రాజనశక్తి యుడిగి పోవదా తనికిం/ దీనియెడిది పెద్ద మాంసము/ కొనియెడిది కల్లు... ' అంటాడు శ్రీనాథుడు. తెలుగువారి భోజన ప్రియత్వానికి పెద్దన, తిమ్మన, తెనాలి రామలింగడువంటి కవుల కావ్యాలకు కావ్యాలే అద్దంపడుతుంటాయి.
ఔషధ గుణాలున్న ద్రవ్యాలను ఆహార పదార్థాలుగా మలచి సామాన్యుడినుంచి సామ్రాట్టులదాకా అందరికీ అందుబాటులోకి తెచ్చిన ఆహార సంస్కృతి భారతీయులది. త్రిదోషాలు(వాతం, పిత్తం, కఫం), ధాతువులు, జఠరాగ్ని, రక్తమాంసాదులు, సమస్థితిలో ఉంటూ సమాన స్థితిలో మలక్రియలు నిర్వహిస్తూ, మనసు, ఆత్మ ఇంద్రియాలు ప్రశాం తంగా ఉండటమే ఆరోగ్యం అని ఆచార్య సుశ్రుతుడి నిర్వచనం. వేలాది సంవత్సరాలుగా ఈ సూత్రానికి అనుగుణంగానే మన ఆహా రపు అలవాట్లు కొనసాగుతూ వస్తున్నాయి. సంసార జీవితాన్ని సుఖ మయం చేసేది మంచి ఆహారమే' అన్న స్పృహ సుశ్రుతుని కాలం నుంచే ఉంది. మంచి కట్టుబొట్టు ఉన్న నవయవ్వన జవ్వనాంగి దాపులో లీనుం విందైన సంగీతాన్ని ఆలకిస్తూ సేలించే చిత్ర విచిత్ర భోజన తాంబూలాములు స్వర్గసుఖాన్నందించే అశ్వశక్తిని అందిస్తాయని
సుశ్రుత సంహిత చికిత్సా స్థానం' చెబుతోంది. పంచభక్ష్యాలకు పరమాన్నమూ అదనంగా తోడయితే అదే మనకు సంపూర్ణాహారం. కూరతో ఆరంభమయ్యే భోజనం వరుసగా పప్పు, పచ్చడి, పులుసు చివ రగా చిక్కటి మజ్జిగతో ముగుస్తుంది. ప్రత్యేక సందర్భాల్లో మధ్యమధ్య పాయసాలు, అప్పాలు ఆరగించడం వెనుకున్నది అంతా వట్టి సంతో షమూ, సంతృప్తి మాత్రమే కాదు... ఆరోగ్య రహస్యం కూడా. 'ఆరు రుచులలో దేనిమీదా అతిలక్ష్యం, అలక్ష్యం పనికిరాదు, అనారోగ్య హేతువు
అంటుంది ఆయుర్వేద షడ్రసశాస్త్రం. ఆహారం అంటే ఒక జీవ చర్య . దినచర్య . రుతుచర్య . రాత్రి చర్య . ఒక క్రమపద్ధతిలో సాగించినంత కాలమే మనిషికి ఆరోగ్యం అని ఆయర్వేదం వాదం . తెలిసో తెలియకో ఒక వేదంగా ఆ భోజన విధానాలనే మకు ఇప్పటిదాకా పాటిస్తూ వస్తున్నది.
నెయ్యి నూనెలు కలిగి కఠినంగా అరిగే ఆహార పదార్థాలు మొదట, మృదువైన పప్పు దప్పళాలను మధ్యలో ద్రవ సంబంధమైన పదార్థాలను చివర్లో ఆరగించడం- భావప్రకాశ వైద్యగ్రంథం సూచించిన ఆహార విధానం. ఎన్ని విదేశీ భోజన పద్ధతులమీద కొత్త మోజులు పెచ్చుమీరినా ఇక్కడి వాతావరణానికి అత్యంత అనుకూలమైనది మన పంచభక్ష్య భోజన విధానమే. భోజనానికి ముందు అల్లం ఉప్పో శొంఠి కలిపిన రవ్వంత ధనియాలు జీలకర్ర పొడో మొదటి ముద్దగా సేవిస్తే రాళ్లయినా రసంలాగా జీర్ణమైపోవా! భోజనాంతంలో పెరిగే కఫానికి పచ్చకర్పూర తాంబూలంలోని లవంగం విరుగుడు. కబళం గొంతులో దిగే సమయంలో మంగళకరమైన వాతావరణం ఉండితీరాలని చరకసంహిత చెబుతోంది. మొదటి ఝాము మధ్యలో పగటి భోజనం, అపర సంధ్య చివరలో రాత్రి భోజనం క్రమం తప్పకుండా రోజూ ఒకే సమయంలో సేవించగలిగితే ఆయుష్షు, వీర్యపుష్టి, దేహదారుఢ్యం, శరీరకాంతి వృద్ధి చెందుతాయన్నది మరో భోజన సిద్ధాంతం. అతివేడి, అతి శీతలం, నిలువ ఉన్న ఆహారం, సమపాళ్లలో దినుసులు కలవని పదార్థాలు రజస్తమో గుణాలకు కారకాలవుతాయని భగవద్గీతా చెబుతోంది. దప్పిక, తాపం, బడలిక, మానసిక అలసట తీర్చేవిధంగా ఉండాలి పోషకాహారం. అవసరానికి మించి వేడిచేసే పదార్థాలలో పేరు కుపోయే 'అక్రిలమైడ్' వంటి విషాలు ప్రాణాంతక వ్యాధులకు కారణ 'మవుతాయి. వాడిన నూనెలనే వాడి చేసే వంటకాలలో 'ట్రైగ్లిజరైడ్స్' కొవ్వును పెంచి గుండెజబ్బులకు కారణమవుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆకర్షణకోసం భోజనశాలలు వాడే రంగులు ఆరోగ్యా నికి అనర్థదాయకం. భైరవకవి శ్రీరంగ మహాత్యంలో వర్ణించినట్లు 'అప్పడాలకొటారు అమృత ఫలాదులు వడల కుప్పలు దూది మడుగు గిరులు' నిజంగా ఒక భోజనవైభోగం కావచ్చునేమోకాని... ఆ భోగం రోగకారకం కాకూడదు కదా! నిండు నూరేళ్ళు పండు లాగా జీవించా లన్నది ప్రతీ మనిషి ఆశ. ఆ ఆశ పండాలంటే 'ఇంట్లో వండుకున్న ఆహారం తప్ప ఇంకెక్కడా మెతుకు ముట్టరాదు' అంటున్నారు ఈ మధ్యనే వందేళ్ల పుట్టినరోజు పండుగ చేసుకున్న ఒక మెదక్ జిల్లా తాతగారు. మరీ తప్పనప్పుడు తప్ప ఆ తాతగారి ఆరోగ్య సూత్రం పాటించగలిగితే అందరికీ శతాయుష్షు.
- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - సంపాదకీయం - 27-05-2012 )
No comments:
Post a Comment