Saturday, December 4, 2021

ఈనాడు - సంపాదకీయం హేమంతం రసవంతం - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - సంపాదకీయం - 28-01-2012 )

 


ఈనాడు - సంపాదకీయం

హేమంతం రసవంతం 


- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపాదకీయం - 28-01-2012 ) 


మనిషికి రుతువులకు మధ్యగల బంధు మాతాపుత్రుల అనుబంధ మంత అందమైనది. హృదయంగమమైన గతియే రుతు- అని అమర కోశ వ్యాఖ్యానం.  సృష్టిలోని సర్వ పదార్థాలు స్వధర్మాన్ని వీడకుండా ఒక క్రమంలో ప్రవర్తించే విధానాన్ని పాశ్చాత్య పదార్థవాదులు 'రిథమ్' అంటే- మన రుషులు చాలా కాలానికి ముందే దాన్ని 'రుతుధర్మం'గా నిర్ధారించారు. వాల్మీకి వంటి మహాకవులు కావ్యాల్లో పొందుపరచింది. ఈ రుతుధర్మాలనే ప్రకృతి పరిశీలన ఒకరకంగా కవుల బలహీనత కూడా . ఆధ్యాత్మ రామాయణాన్ని తేటతెలుగులో రాసిన మడకసింగన మూలంలో ఒక్క ప్రకృతి వర్ణనా లేకున్నా అనువదించే వేళ వసంత రుతు వర్ణన చేయకుండా ఉండలేకపోయాడు. వాల్మీకి మహాకవి అయితే రామాయణం అరణ్యకాండ పదహారో సర్గ నిండా హేమంత రుతువును అత్యంత హృద్యంగా వర్ణించాడు. ఏడాది అంతటికీ హేమంతం ప్రధానమైన భూషణం అంటాడా మహాకవి పూలవాన లాగా కురిసే మంచుసోన, ఆకుపచ్చని చీరెను చుట్టుకున్నట్లున్న భూభామ, చేయిపడితే చాలు చురుక్కుమనిపించే మంచునీళ్లు, ఇళ్లకు చేరే కొత్తపంటలు, పుష్కలంగా పాడి.. సమృద్ధిగా గ్రామసీమలన్నీ విలాస వాటికలై అలరారే సౌభాగ్యాన్ని కళ్ళకు కట్టించినట్లు కవి వర్ణిం చిన తీరు మనోహరం. మధ్యాహ్న మార్తాండుడూ పున్నమి చంద్రుడి లాగా చక్కిలిగింతలు పెట్టడంతో  పొట్టి పగళ్లు పొడుగు రాత్రిళ్లు యవ్వనంతో తుళ్ళిపడే యువతీ యువకులకు స్వర్గలోకపు పడకటిళ్లను తెరిచాయి - అంటాడు ఆ మహాకవి.  వాల్మీకి చేసిన ఈ రుతు రసవర్ణనల ప్రేరణ తోనే కవికుల గురువు కాళిదాసూ తొలినేతగా 'రుతుసంహారం' అందు కొన్నాడని వాజ్ఞ్మయ లోకంలోని  ఒక ఊహ. మేఘదూతాన్ని అంత అమోఘంగా కాళిదాసు చేత రాయించింది రుతుప్రీతే అన్నది కొందరి భావన.  ఎంత వసంత ప్రియుడైనా ఆ రసరాజు హేమంతాన్నీ బహుగుణ రమణీయం, స్త్రీజన చిత్తహరం, సతతం అతిసునోజ్ఞమని ప్రశంసించకుండా ఉండలేకపోయాడు. వియోగులను వేధించే హేమంత వైభోగాన్ని భాగవతం దశమస్కంధంలో పోతనా మరింత విచిత్రంగా వర్ణించాడు. చలిదెబ్బకు తాళలేక మూడు అగ్నులు ఒకటి శివుడి పాలక్షేత్రంలో, మరొకటి బడ బానలంలా కడలి  అడుగులో, మూడవది  పడుచు గుండెల నడుమ

సక్కి కూర్చున్నాయని ఆయన చమత్కారం . 


ఆహములో  సన్నము లయ్యెను/ దహనము హితమయ్యే దీర్ఘ దశలయ్యె నిశల్ / ‌ బహ శీతోపేతంబ యి / యుహుహు యని వడకె లోకమ' ని  చలికాలం ఆగడాలను అగకుండా ఏ కవి అయినా వర్ణించుకుపోతుంటే 'ఆహా' అనకుండా ఉండ తరమా! 'మాఘుమాసంబు పులివలె మలయుచుండ/ బచ్చడంబమ్ముకొన్నాడట పసరము నకు' ఒక సైరికుడు(రైతు) ఇంటనున్న  ముదితా  వత్తాసు చూసుకోబట్టి అతగాడంత దుస్సాహసానికి వడిగట్టి ఉంటాడని క్రీడాభిరామకర్త వినుకొండ  వల్లభరాయుడి కొంటె ఊహ. తప్పేముంది?  చలికాలం  చలిత హిమనీ లలిత తుషారం ' విప్రనారాయణుడికైనా, 'విప్రో'లో పనిచేసే వెంకట నారాయణుడికైనా ఒకే రకం  సంకటం.  దుప్పటి కుంపటి లేని పేదవాడికి నిప్పులాంటి చెలి పెదవులు దొరకని పక్షంలో  పడే  తిప్పలు చెప్పనలవి కానివి' అని దాశరథి వంటి ప్రజాకవే తుంటరి ఆలోచన చేశారు. 'మంచుతెరల మసకలలోన మందుపొగల మెలికలోనో / మనసెటో చిక్కినట్లే / మనేద కుదిపేస్తది లోన' అంటా కొనకళ్లవారి 'కోడలుపిల్ల' ఎద సొద - చలి ముంచుకొచ్చే తొలి ఝాము వేళ పడుచుగుండెలన్నీ పడే మదన బాధే. 'చప్పరించిన చాలు జలదరింపులు గల్గు/ పొగలు గ్రక్కెడు కాఫీ' ముట్టలేక / పలుకరించిన చాలు పకప కలాడెటి/ పొగలేని కుంపట్లు పొలుపు లేక/ చలిని గెలువంగ వశమె/ ఈ కలియుగమున ఎవరికైనా' అంటాడొక నవకవి ఓ చాటుపద్యంలో . నిజమే కావచ్చుగానీ, ఆ వెచ్చని సౌకర్యాలందరికీ అందుబాటులోకి వచ్చేవి కావే! తిట్టినా, తుమ్మినా- రుతుచక్రం ఒకరికోసం ఆగదు. ఒకరి కోసం వేగంగా సాగదు.


ఎండకాలం మండినప్పుడు గబ్బిలంవలె కాగిపోవాల్సిందే. వాన కాలం ముసిరి రాగా నిలువు నిలువునా నీరు కావాల్సిందే. శీతకాలం కోతపెట్టగ కొరడు గట్టక తప్పదు . ఆకలేసీ కేకలేస్తే చండ్రగాడ్పులు, వాన మబ్బులు, మంచుసోనలు భూమిమీద భుగ్నమవడం  కేవలం కవుల కల్పనకాదు . 'వ్యర్థంగా పారేసిన పాలథీన్ ' సంచుల సమస్తాన్నీ గుండ చేసి గాలిలోకి విసిరేసినట్లుంది' అని కసితీరా తిట్టుకున్నా, పల్లెల్ని బంధించిన కంపెనీలన్నీ కలిసికట్టుగా గాల్లోకి విసర్జిస్తున్న విషం'లాగుందని శాపనార్థాలెంత పెట్టుకున్నా- మంచు తెమ్మెరల రాయబారాలతో ఈ హేమంతమంతా నింగీనేలా మధ్య సాగించే శృంగారం తప్పనిది. రేపటి వసంతానికీ హేమంతమే నాంది. దేహాన్ని చుట్టుముట్టిన చలి/ రోడ్డెక్కి ప్రయాణిస్తే చాలు/ మింగేద్దామా అన్నట్లు ఎదురవుతుంది మృత్యువు' అని ఒకరి బెదురు. 'భూదేవికి ప్రకృతి ప్రేమగా పంచి పెట్టే ప్రసాదం పొగమంచు' అని మరొకరి పరవశం. కవి కృష్ణశాస్త్రి అన్నట్లు 'వేసంగి కోపాలు, మూసిమేఘాలు పోసిన జల్లులు/ పున్నమి వెల్లులు అడరించు చలి కారు- జడ శిశిరము- వీటికి జడిసి మానవుడు అంధ మందిరంలోనే అశ్రు జపమాల తిప్పుకొంటూ కూర్చుని ఉంటానంటే సృష్టిచక్రం ప్రగతి భ్రమణం ఆగిపోతుందా! చెమ్మ తరగని మావికొమ్మ తిరిగి అతిశయించి అందరికీ ఆనందాలు అంది రావాలన్నా... వసంత, గ్రీష్మాలు, వర్ష శరత్తులతోపాటు హేమంత శిశిరాలనీ మనసుకు హత్తుకోవాలి. 'మండుతున్న మార్తాండ గోళం ఎదుట/ రేపు వసంత రజ్జువుతో పైకి లాగేసి రసవంతమైన, రూపకాన్ని ప్రదర్శించాలంటే... నేడు మంచుతెరల హేమంతా'న్ని దింపాలి. . తప్పదు అంటారు దాశరథి. నిజం. లోకం ఆ రూపకానికి వేదికైతే, రుతువులన్నీ వచ్చిపోయే అంకాలే. 


ప్రస్తుతం నడుస్తున్నది హేమంతం. మన సారా ఆస్వాదించగలిగిన మనసులకే దీని మధురానుభవం సొంతం!


- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపాదకీయం - 28-01-2012 ) 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...