Saturday, December 4, 2021

అంతా ఆనందమయం... - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - సంపాదకీయం - 01 - 01 - 2012 )

 ఈనాడు - సంపాదకీయం 


అంతా ఆనందమయం...

- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపాదకీయం - 01 - 01 - 2012 ) 


రామం- ఆనంద స్వరూప సంక్షిప్త నామం. రామదాసుకు జగ మంతా రామమయంగా అనిపిస్తే మరో కామదాసుకు అదే జగత్తు సర్వం కామమయంగా కనిపించవచ్చు.  కాదని ఎందుకనాలి? లోకం అంతా కామాక్షీమయం కాదా!' అంటారు చంద్రశేఖర సర స్వతీ స్వాములవారో సందర్భంలో . కామాక్షి అంటే సౌందర్యం. అందమూ ఆనందానికి ఒక హేతుధాతువే. 'ఆనందాన్నందించే ప్రతి సౌందర్యమూ పరమేశ్వరత్వమే' అని  రసవాది సంజీవదేవ్ మతం . యాజ్ఞవల్క్యుడు సన్యాసం స్వీకరించేముందు ఇద్దరు ముద్దుల భార్య లకు సంపద సరి సమానంగా పంచేవేళ బ్రహ్మవాది మైత్రేయి అమృతత్వం సిద్ధించే సంపదను కోరుకొంటుంది. అమృతత్వం అంటే ఆత్మ అంతిమంగా అందుకోవాలని తపించే ఆనందలోకం. శంకర భగవత్పాదులు ఒక్క సౌందర్యలహరి రచనతో సంతృప్తి చెందలేదు. శివానందలహరితో గాని ఆయన ఆనందతత్వ విచారణ సంపూర్ణం కాలేదు. 'బ్రహ్మం' అంటే ఏమిటన్న సందేహం కలిగింది. భృగు మహర్షికి ఒకసారి. 'అన్నం ఎందుకు? ప్రాణం ఉనికికి అర్థ మేమిటి? మనసు, బుద్ధి ఏ పరమార్థాలకోసం చలిస్తా'యన్న అన్ని సందేహాలకూ చివరికి ఆ యోగికి దొరికిన సంతృప్తికరమైన సమా ధానం- సంతోషం కోసం' . ఆనందం నుంచే జీవావిర్భావం. ఆనం దంకోసమే జీవిక కొనసాగింపు. 'ఆనంద లోకంలోకి అణగారిపోవ డమే జీవితానికి ముగింపు' అని తైత్తరీయోపనిషత్ వాక్యం. 'అన్న, ప్రాణ, మనో, జ్ఞాన, ఆనందమయాలనే పంచకోశాలవల్ల వ్యష్టి సమ సష్టి దేహాన్ని ధరించి ప్రాణులు అభివృద్ధి చెందుతుంటాయి.... ఆనందమయ కోశంలో వెలుగొందే శుద్ధ స్వరూపాల్ని అందుకోవడమే బ్రహ్మానంద సామ్రాజ్య ప్రాప్తి' అని శ్రీమదాంధ్ర మహా భాగ వతంలో శుకమహాముని వినిపించిన ప్రీతి గీతి. అది, ఒక్క పరీ క్షిత్తు మహారాజుకే కాదు- బతుకును సార్థకం చేసుకోవాలనుకొనే ప్రతివారికీ వర్తించే ఆనంద సూక్తి.


వేదాలను విభజించి, పురాణేతిహాసాల సారాన్ని పంచమవేదం మహాభారతంగా రచించిన వేదవ్యాసుడంతటి వాడికే భాగవత రూపంలో విష్ణుకథలను విస్తారంగా చెప్పినదాకా వ్యాకులత వదల్లేదు. డేల్‌ కార్నెగీ చెప్పినట్లు- గుర్రాలకి, గుడ్లగూబలకి ఈ సంతోషం సమస్య లేదు. సాటి జీవాలను సంతోషపరచి సంతృప్తి చెందాలన్న తపన ఉన్నప్పుడే ఈ ఆనందం బాధంతా. ' త్రాసులోని సిబ్బెల్లాగా సుఖదుఃఖాల మధ్య ఊగిసలాట తంటా  'మనసు' ఉన్న మనిషికొక్కడికే! ' అంటాడు ఖలీల్‌ జిబ్రాన్ ఒకానొక సందర్భంలో . పట్టుకోవాలని వెంటబడేకొద్దీ పట్టు కెంతకూ దొరకనిది... పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే చటుక్కుమని చెంతన చేరే చేతిమీద అందమైన సీతాకోక చిలుక- ఆనందం' అంటాడు ఆంగ్ల రచయిత నథానియనిల్ హాల్రోన్. కాశీలో కడతేరి కైలాసం చేరాలని కాలిచిప్పలు తొలగించుకొన్న శూద్రకుడికి చివరికి దక్కింది ఏమిటి? విధి అశ్వరూపంలో వచ్చి ఎక్కించుకొని వెళ్ళి ఎక్కడో ఉన్న మర్రిమానుకు గుద్ది నరకలోకంలోకి విసిరివేయటమేగా! కైలాసగిరిని కూకటివేళ్లతో పెళ్లగించుకుపోవాలన్న కాని కోరికతో రగి లిన రావణాసురుడంతటివాడికీ చివరికి మిగిలింది ప్రగాఢ శోకమే. ఇంద్రియ సంఘరణలవల్ల ఖిన్నురాలై ఉన్న దేవహూతికి ముక్తి మార్గం సూచించే సందర్భంలో కపిలాచార్యుడు బోధించిన జీవన సూత్రం ఆ ఆనందరాముణ్ని అందుకునే తారకమంత్రం. స్వధర్మాచరణ, శాస్త్ర నిషిద్ధంకాని కర్మాచరణ, ధర్మబద్ధమైన మిత సంపాదన, సత్యాహింసలమీద ప్రేమ, పరిమితమైన పరిశుద్ధ ఆహార పానీయాలు, ఏకాంతంలో సైతం ప్రశాంత ప్రవర్తన, వింత భాషణం, ఇంద్రియ నిగ్రహం వంటి సత్కర్మలు ఆనంద హేతువులు.


పట్టి చంపేవేళ పట్టముగట్టేవేళ/అట్టునిట్టు చలించని యాతడే సుఖి' అన్నది అన్నమయ్య తత్వం. భౌతికానందానికి ప్రాధాన్య మిచ్చినా, అంతరంగంలోకి కొంత తొంగిచూసిన జిజ్ఞాసికే అసలైన 'కైలాస' విలాసం లభిస్తుందంటారు గీతాంజలి కర్త రవీంద్రులు. పరి ణామవాద పితామహుడు ఛార్లెస్ డార్విన్ తనలో తరిగిపోతున్న సౌందర్య తృష్ణను తలచుకొంటూ మధనపడిన సందర్భాలు బోలెడన్ని! 'మేధకు, శీలానికి 'ఆనందం' కలిగించే స్పందనలను కోల్పో వడం జీవితానికి నిజంగా హానే' అని హెచ్చరించాడు ఆ భౌతిక వాది. సుఖముతోడ శరీర సంస్ఫురణ గలుగు' అని పాదుకా పట్టా భిషేకంలో ఒక పాత్ర చేత పానుగంటివారు పలికిస్తారు. గబ్బిలాన్ని ఎవరన్నా కావాలని తలకిందులుగా వేలాడదీశారా! హాలాహలం మింగినా హరుడు ఆనంద స్వరూపుడిగానే ఉన్నాడు. అమృతం తాగిన రాహుకేతువులు అందవికారులుగా మిగిలిపోయారు. 'ఆనందం అంటే సమస్యలు లేకపోవడం కాదు... సమస్యలను సమ ర్థంగా ఎదుర్కొనే తీరు' అంటారు 'యూ కెన్ విన్' గ్రంథకర్త శివ్ ఖేర్‌. 'శకట గత చక్ర భంగిన్/సుకరములై తిరుగుచుండు సుఖదుః ఖములిం/తకు భేదమంద నేటికి/నకటా సంతోషయుక్తుడగుటొప్పు గదా!' అన్న బైచరాజు వెంకటకవి 'పంచతంత్రం' వేదాంతాన్ని తారకమంత్రంలా ఒంటపట్టించుకోవడం ఎవరికైనా మేలు. మునిగితేలాలన్న మనసు ఉండాలేగాని చలం గీతాంజలిలో భావించినట్లు 'జగత్తంతా ఒక ఆనందార్ణవం' కాదూ! కలవాడే సంతోషపడేవాడు అను కోవడం భ్రమ. కలిగినదానితో సంతృప్తి కలిగినవాడే నిజమైన సంతోషపరుడు. ఆర్థికమాంద్యం, యుద్ధాలు, కులమత వర్ణ విచక్షణల వంకతో సంఘర్షణలు, ప్రకృతి వైపరీత్యాలమధ్య అత్యధికానందంతో జీవిస్తున్న జాతుల్లో భారతీయులు ముందువరసలో ఉన్నారంటే దానికి కారణం- మన ఆధ్యాత్మిక జీవనవిధానం. 'కలిసి ఉంటే కలిగి, ఉన్నదానితో తృప్తి కలిగి ఉంటే... కలదు సుఖం' అన్నది భారతీయుల తత్వం. ఇప్సస్ గ్లోబల్ ఇటీవలి అంతర్జాతీయ స్థాయి సర్వే ప్రకారం - నాలుగేళ్ల క్రితం కన్నా మూడొంతుల జనాభా ఎక్కువ ఆనందంగా ఉన్నారు. 'మరీ ఆనందంగా' ఉన్న మిగతా ఆ ఒక వంతులో మన భారతీయులే ముఖ్యులని తేలింది. ఆనందం!


- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపాదకీయం - 01 - 01 - 2012 ) 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...