ఈనాడు - సాహితీ సంపాదకీయం
తరంతరం నిరంతరం ... ఫిర్ మిలే సుర్ మేరా తుమ్హారా
రచన - కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - దినపత్రిక - 07 -02 -2010 వ తేదీ ప్రచురితం )
రెండు దశాబ్దాల రెండేళ్ళ కిందటి మాట... అప్పటి ప్రధాని ఎర్రకో టపై మూడు రంగుల బావుటా ఎగురవేసిన జండాపండుగ పూట దూరదర్శన్ బుల్లితెరపై ఓ తేనెలూరే పాట! భీమ్ సేన్ జోషీ మొదలు గానగంధర్వుడు బాలమురళి దాకా రవిశంకర్ సితార్ తో జకీర్ హు స్సేన్ తబలాతో తలపడి నరేంద్ర హీర్వాణీ ప్రకాషపదుకొణె వంటివారితో కలిసి ఆడుకుంటున్నట్లు అమితాబ్ బచన్, హేమమాలిని వంటి హేమాహేమీలతో జతకలిసి చేసిన శ్రుతిలయల మాయ అది. ఇన్నేళ్ళు గడిచినా నవ్యమై భవ్యమై ఉండటానికి కారణం- ఆ సమైక్యతారాగతోరణం ఈ మట్టి నుంచి పుట్టింది కావటమే! పీయూష్ పాండే పద్దెనిమిది సార్లు రాసి చించిన ఆ పల్లవిని సురేశ్ మల్లిక్, ఆర్తి, కైలాసు రేంద్రనాథ్ ఎంతో ఆర్తిగా సృజించారు . కనుకనే - ఆనాటి ఆ రాగేంద్ర జాలం మనజాతి పాడుకునే మరో వందేమాతరంలాగా ఓ అనధికార జాతీయహోదాను సంతరించుకొన్నది . ఆసేతుహిమాచల పర్యంతం ఆ ' ఫిర్ మిలే సుర్ మేరా తుమ్హారా' గీతం అంత మన్ననలందుకోవడానికి ఆ రాగం తానం పల్లవులకన్నా అంతర్లీనంగా అందులో మిళితమై సాగిన మన జాతీయతనమే ప్రధాన కారణమంటే కాదనేవారెవరూ ఉండరు. 'నా స్వరమూ నీ స్వరమూ సంగమమై మనస్వరంగా అవతరించె నంటూ- ఈ దేశ నదీనదాలలోని వేదనాదాన్ని సాగర గంభీరతతో జతపరచి మేఘమాలికలవంటి రాగాలను కూర్చి సుతిమెత్తని భావుకతను అత్యంత హృద్యంగా ఆలపించి ఈ నేల నలుచెరగులా జాతి మత కుల వయో లింగ భేదాలకు అతీతంగా ఆ స్వరగాంధర్వులు చిరుజల్లులుగా కురిపించడమే అపురూపం. ఆ రాగాల వర్షంలో తడిసి ముద్దవని భారతీయుడెవడూ ఆనాడు లేడు, ఈనాడూ ఉండడు. ఆ గీతానికి కాలానుగుణమైన గుణాత్మకమైన మార్పులు చేసి 'ఫిర్ మిలే సుర్' అంటూ ఈ గణతంత్ర వజోత్సవ వేళ మరోమారు 'నగారా' మోగించటం హర్షదాయకమే కాదు- దేశ కాల పరిస్థితులు దృష్ట్యా తక్షణావసరం కూడా!
ఆధునికతే నాగరికతగా భ్రమించే నేటి యువతకు వేల సంవ త్సరాల ఘనచరిత గల భారతీయతలోని విశిష్టతపై శీతకన్ను ఉండటం కలత కలిగించే అంశం . దాదాపు ఆరు వందల జిల్లాలలో పదిహేడు రకాల భాషలు, రికార్డులకెక్కని మరెన్నో వందల యాసలు, రకరకాల మతాలు, మూడుకోట్ల ముప్పై లక్షల చదరపు కిలోమీటర్ల పర్యంతం పరచుకుని ఉన్న ఈ సువిశాల భారతంలో వృత్తుల వారీగా లెక్కకు అందని ఎన్నో కులాలు- ప్రవృత్తి రీత్యా చూసినా అత్యంత వైవిధ్యంగా నిత్య చైతన్యంతో సాగే జనజీవనానికి విభిన్నత్వమే బలం. ఏకత్వ భావలేమి బలహీనత. బౌద్ధం పుట్టిన హిందూదేశం ఇది. థెరెసాను ' మదర్ ' గా గౌరవించిన వేదభూమి మనది. మైనారిటీల నుంచి నలుగురిని రాష్ట్రపతులుగా ఎంచుకున్న లౌకికరాజ్యం ఇది. రాష్ట్రపతి నుంచి సభాపతుల వరకు మహిళలు పాలన సాగిస్తున్న నేల కూడా మనదే. యోగులు బాలలైనా సాగిలపడే ఆధ్యాత్మిక విశాలత భారతీయులది. బడుగుల నుంచి మేధావిగా ఎదిగిన మహానుభావుడు ఈ దేశానికి రాజ్యాంగ కల్పన చేశాడ! 'భారతదేశం నా మాతృభూమి... సుసంప న్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకా రణం... ' అని చదువుకొనే ప్రతిజ్ఞ పాఠాన్ని వాచకాలు మొదటి పుటల వరకే పరిమితం చేసే ప్రజ్ఞావంతులు పెరిగిపోతున్నారిప్పుడు. వరస మార్చి అయినా సరే, మన సంగీత్ మహాన్ ఏఆర్ రెహమాన్ 'వందే మాతరం' గీతానికి కొత్త రాగాలను కూర్చి నవతరానికి ఉత్తేజం కలిగించిన తీరులో- ' ఫిర్ మిలే సుర్ మేరా తుమ్హారా'కు సైతం అదే సురేంద్ర కైలాస్ నాథ్ నూతన స్వరాలను సమకూర్చడం తప్పేమీ కాదు కదా- తప్పనిసరిగా మిగతా సామాజిక హితుల తక్షణ విధి!
దేవులపల్లి వారు గీతించిన విధంగా ఏ కవి గాయక వైతాళికుడైనా భావ తాదాత్మ్యతకు దివ్య గీతామృతాన్నే నమ్ముకుంటాడు. 'అర్ధ మతులహంకృతులు అంధమతులు రాని/ నిరుపేదలు నిర్భాగ్యులు నిరంకుశులు లేని/ కొత్త జగం కొత్త యుగం కోరుకునే వారెవరికైనా, కులందాటి మతం దాటి కొద్ది గొప్ప దాటి/ సమభాగం సమభాగ్యం సమసంస్కృతి నాటి/ కొత్త శాంతి, కొత్త కాంతి జగతి నిండాలని, భావించేవారికైనా పాటను మించిన వజ్రాయుధం లేదు. పల్లవిని మించిన దేవదత్తం లేదు. ఆకులందున అణగిమణిగిన కోయిల వలె పలికితే ఆ పలుకులకు పులకలెత్తి దేశాభిమానాలు మొలకెత్తుతాయని మహాకవి గురజాడ ఏనాడో పలికిన మాట. తెల్లవాడి పాలన తెల్లారి నేటికి భారతాన ఆరుపదులు దాటినా- ఉగ్రవాదం అగ్రవాదం ధాటికి మన ఇంట చీకటి తెరలింకా విడిపోనేలేదు. చీటికి మాటికి భాషాద్వే షాలు, కులం కుమ్ములాటలు, మతం మత్సర్యాలు, ప్రాంతాల వారీగా పెరిగిపోతున్న పంతాలూ పట్టింపులతో వేడెక్కిపోతున్న వాతావరణం - ' ఫిర్ మిలే సుర్' వంటి సుస్వరాలు కడుసొంపుగ కడలికి చేరి... మబ్బులై పైపైకి లేచి చల్లగా మెల్లగా మళ్ళీ మళ్ళీ చిరుజల్లులుగా కురిసినప్పుడైనా చల్లబడుతుందేమో! ఇరవై రెండు ఏళ్లి కిందటి ఈ రాగమాలికను ఇరవై రెండు మంది నవతారలతో కలిసి ఆరుపదుల కళాకారులు అరవై ఏళ్ళ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అతి నవ్య రాగాలతో వారి వారి భాషల్లో గొంతెత్తి పాడటం దివ్యంగా ఉంది. ఇదే దారిలో జాతీయ సమై క్యతా గీతాలు మరిన్ని వచ్చి జాతి గుండెల మధ్య అడ్డుగోడలను కూలగొడతాయేమో చూడాలి! ప్రజల రాజ్యం బలపడాలని ఆశ పడాలి .
- రచన - కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - దినపత్రిక - 07 -02 -2010 వ తేదీ ప్రచురితం )
No comments:
Post a Comment