Saturday, December 4, 2021

ఈనాడు - సంపాదకీయం జీవకారుణ్యం కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - సంపాదకీయం - 01 - 06- 2014 )

 ఈనాడు - సంపాదకీయం 

జీవకారుణ్యం 


కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపాదకీయం - 01 - 06- 2014  ) 


జగం ఒక్క మనిషి జాగీరే కాదు. మన ప్రాచీనుల గణన ప్రకారం, భూ జల గగన తలాలు మొత్తం ఎనభైనాలుగు లక్షల జీవజాతుల ఆవాసం. గీతలో నారాయణుడు విశ్వరూప సందర్శనంతో ప్రదర్శించిన వందలాది ఆకారాలు త్రి తలాలలో  తిరుగాడే జీవజాలాల ప్రతిరూపాలే. మరీ డాబులు పోతున్నాం గానీ మనం మాత్రం డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం ప్రకారం చూసుకున్నా ఒకనాటి వానరులకు మునిమనవలం కాదా! శ్రీరామచంద్రుడి ధర్మసంస్థాపనకు కలిసి వచ్చింది కోతులు, కొండముచ్చులు. అపారపారావారం నడుమ హిరణ్యాక్షుణ్ని కోరలతో కుమ్మి భూదేవమ్మకు విముక్తి ప్రసాదించింది వరాహం. యుగాంతాన ఏకార్ణవంగా మారిన ప్రళయ జలాలనుంచి జీవులున్న పెన్నావను బైటకు ఈడ్చింది మత్సం . అమృతోత్పాదన కుతూహ లంతో దేవదానవులు అబ్ధి చిలుకుడుకు దిగినప్పుడు 'కవ్వపుంగొండ వార్ధి. సదాచారుల పాలిట మహాక్రూరుడు హిరణ్యకశిపుడు. వాడిని వాడి గోళ్లతో చీల్చి చెండాడేందుకు కేశవుడు ధరించింది సగం నరరూపమైతే , మిగతాది కేసరి రూపం! ధర్మానికే కాదు, నిత్య కర్మాచరణానికీ కరచరణాలుగా మనిషిని ఆదుకుంటూ వస్తున్నవి ఆదినుంచీ పశు పక్ష్యాదులే. అందుకే గోవుకు మనుస్మృతి దైవీయస్ధానం ఇచ్చింది. పశు వులే ఒకనాడు మనిషికి మూలధనంగా చలామణి అయిన రోజులు ఉన్నాయి. ఆదిదేవుడు గజాననుడని, భూగోళాన్ని అష్టదిగ్గజాలు భరిస్తున్నాయని భారతీయుల విశ్వాసం. విష్ణుమూర్తికి గరుత్మంతుడు వాహనం. వినాయకుడికి చిన్ని మూషికం వాహనం. ఏ దేవుడికైయినా  ... ఏదో ఒక పశువో, పక్షో వాహనంగా ఉండి తీరుతుంది. దైవమూ పశుపక్ష్యాదుల పక్షమే అనడానికి వేరే సాక్ష్యం ఏముంటుంది? మనిషికే సాటిజీవులమీద చిన్నచూపు . 


మేధస్సులో మనిషిది ఏదో కొద్ది ఉన్నతస్థానం కావచ్చు.  నీతి నియమబద్ధ జీవనానికి మాత్రం మానవేతర జీవులే గురువులు . ఆగకుండా సాగి సాగి సాగరాలనైనా అధిగమించే ఓపిక పిపీలికాలది. వెక్కిరిస్తాం గానీ పక్షిజాతి ఏకసహచర నీతి మనిషికెక్కడిది? కాకుల్ని చూసి నేర్చుకోవాలి సాహచార్య ప్రీతి . మార్జాలం  మించిన సహజ సిద్ధ మూషిక సంహారిణి మనిషి ఇంతా దాకా సాధించనే లేదు. బుద్ధి తక్కువని పులుగులను కొట్టిపారేస్తాం గానీ... తేనెటీగల పట్టు ఎన్ని విద్యలు అభ్యసిస్తే మనిషికి అబ్బేను! గడియారం  ముళ్ల కదలికలను గమనించేందుకు మనకు పట్టే సమయం అరనిమిషం మించి. అదే పావురాలకు అరనిమిషం చాలు! చిన్న ఈగ నైనా వెనకనుంచి చెయ్యి విసిరి పట్టుకోవడం మనిషికి అలవిమాలిన పని.  ఒకేసారి అన్నిదిక్కులా అత్యంత స్పష్టంగా దృష్టి సారించేందుకు వీలుగా ఉంటుంది పలు కీటకాల కంటి అమరిక. ఇంద్రచాపంలోని ఏడురంగులకే మన ఉల్లం ఉప్పొంగిపోతుంది గదా... తూనీగలాగ అతి నీలవర్ణాన్నో, గుడ్లగూబకు మల్లే 'ఇన్ఫ్రారెడ్' వర్ణ సమ్మిశ్రితాన్నో కూడా గమనించగలిగితే ! సహనశక్తికి సాలీడు ఒక గూడుకట్టిన రూప మని రాబర్ట్ బ్రూస్ కథ చెబుతూనే ఉంది. అత్యంత లాఘవంగా గూడును అల్లే సాలీడు ముందు మయసభా నిర్మాత మయుడే  దిగదుడుపు. . మనిషి సంగతి చెప్పేందుకేముంది?! అయినా సరే 'రాతి బసవనిగని రంగుగా మొక్కుచు! కునుకు బసవనిగని గుద్దు' మానవుడి నైజం వేమన అన్నట్లు, నైచ్యం..  శోచ్యం.


మూగజీవుల బతుకు దుఃఖభాజనం కావడంలో మానవుడూ ఒక ముఖ్య కారణం కావడం విచారకరం. "పేరు సోమయాజి పెను సింహ బలుడయా! మేకపోతు బట్టి మెడలు వంచు/ జీవహింసలకు జిక్కునా మోక్షంబు' అని వేమన యోగిలా మానవుడు యోచించడం లేదు .. ఎందుకో? పట్టు కంట పడితే చాలు పొగపెట్టి పొడిచి ఈగల కాట్లు కాచుకుంటూనైనా సరే తేనె పట్టుకునే దుష్టత్వం మానుకోవడం లేదు మనిషి.  లేగదూడలను ఒక ఊటకు విడిచి తల్లిపాలను పిండుకోవడమే మహా పాపం. మూడేసి ఊటలను కూడా విడవకుండా దూడ పాలకు పాలు మాలే పాపాత్ములను ఏమనాలి? బరువులు లాగే పశువులను తోచినచోట ముల్లుకర్రతో పొడవడం, తోకలను మెలిపెట్టి గోతులు, గుట్ట లని కూడా చూడకుండా తొందరపెట్టడం స్వానుభవానికి తెస్తేగాని ఎంత బాధాకరమో తెలీని బుద్ధిహీనులమా మనం? ! కార్యమున్నంత వరకే కాళ్లు పట్టడం, కార్యం తీరితే  గొంతుపట్టడం ఎంత నీచం?  పనిచేస్తున్నంత కాలమేనా పశువులకు దాణా! కుందేళ్లమీద కుక్కల్ని ఉసిగొల్పి వినోదించే వికృత క్రీడ ఇంగ్లాండులో ఒకప్పుడు ఉండేది. తమిళనాట ఇప్పుడు జరుగుతున్న జెల్లికట్టు ముందు అది తీసికట్టు. మనదగ్గర నడిచే కోడిపందేలూ ఎడ్లపరుగు పందేలూ... దానికితోడు.  ప్రాణాతిపాతాన్ని మహాపాతకంగా బుద్ధభగవానుడి పంచశీల నిరసి స్తుంది. నిష్కారణంగా హింసించి జీవి ప్రాణాన్ని సృష్టి ప్రసాదించిన కాలానికన్నా ముందే తుంచేసే అధికారం ఎవరికీ లేదు. మూగజీవుల పట్ల క్రూరత్వం నియంత్రించే చట్టం వచ్చి అయిదు దశాబ్దాలు దాటి పోతోంది. అయినా అమలులో చిత్తశుద్ధి లోపంవల్ల జీవాల చిత్రహిం సలో మెరుగుదలలేమి  కనిపించడం లేదని ఈ మధ్య సర్వోన్నత న్యాయ స్థానం ఆగ్రహించింది. 'గిరుల కొమ్ముల నడవుల తిరుగుచుండి/ కోకి లమ యెంత మృదువుగ కూయుచుంటి నాగర లోకమునయందు నడుచుచుండి/ ఎట్లు పలుకుచు నుంటిమో మేము చూడుమ' ని విశ్వనాథ వారొక  గీతంలో వాపోయారు ఎప్పుడో . మనిషి ఇప్పటికైనా ఆ తప్పుడు బాటనుంచి మళ్లితే మిగతా జీవులకు ఎంతో మేలు. లేకుంటే చట్టం ములుగర్రకు 'సుప్రీం' పనిపెట్టాలి. 'మనిషికో మాట... గొడ్డుకో దెబ్బ అని గదా సామెత!


- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపాదకీయం - 01 - 06- 2014  ) 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...