Tuesday, December 14, 2021

వ్యంగ్యం ఆ గురువులకు నమస్కారం - రచన- కర్లపాలెం హనుమంతరావు

 వ్యంగ్యం 

ఆ గురువులకు నమస్కారం


- రచన- కర్లపాలెం హనుమంతరావు 


 

‘గురుబ్రహ్మ గురుర్విష్ణు: …’

 ‘సోది! మాను మానవా! సూటిగా పాయింటుకి రా!’

 'చిత్తం చిత్తం శ్రీమన్నారాయణా! దిగువ లోకంలో నేనో దిక్కుమాలిన అయ్యవారుని..!' కన్నీళ్లు అడ్డు పడ్డంతో మాట పెగల్లేదు బక్క పంతులుగారికి.

 'అరరేఁ! ఎందుకయ్యవారూ ఈ కన్నీరు?! నరుల  నువ్వే కదా గురువుగా మా తరుఫు   జ్ఞాన తరువువి! బుజ్జాయిలుగా ఉన్నప్పటి బట్టీ మనుషుల మరగుజ్జు మెదళ్లలో నానా గుజ్జూ కూరి బాహుబలి సైజు భారీ మోదీలుగా  మలిచే పూచీ నీకే కదా మేం అప్పగించింది! మరి ఇప్పుడేంటీ పేచీ?’

 ‘బుద్ధి గడ్డి తిని స్వామీ      మీ దేవుళ్ల పని నా నెత్తికి రుద్దుకున్నది. కేవలం తొమ్మిది అవతారాలు మాత్రమే తమరు ఎత్తింది కేశవా ఇప్పటికి.   ఓఁ.. దానికే సర్వలోకాలకు సమస్త సన్మంగళాలు సిద్ధించాయనుకుంటే ఎట్లా? దుష్ట శక్తులన్నింటినీ తరిమికొట్టేసినట్లు తమరేమో  ఇక్కడ  నిశ్చింతగా యోగనిద్రలో జోగుతుంటిరి!  తుంటరి మూకలేవీ ఎక్కడకీ తారుకోనేలేదు తాండవ కృష్ణా! బాహాటంగానే  మా భూమండలం పై   బళ్లూ, కాన్వెంట్లూ గట్రా పీడిస్తున్నారు.  పసికుంకలకు,  మా బడిపంతుళ్లకు నానా రకాల నరకాలు  రుచి చూపిస్తున్నారు! మేష్టార్లుగా మేం దిద్దే బుడతల నోటుబుక్కుల  ముందర కూర్మావతారంలో మీరెత్తిన  మంధర గిరులు ఎన్ని వందలైనా  దూది పింజలే సుమా!’  

 ‘గోల మాని గో టు ది స్ట్రయిట్ పాయింట్ గురువా!’

 ‘భూమ్మీద కో సారి కోదండపాణి మళ్ళీ దిగిరావాలి! ఏ కాన్వెంటు ఇస్కూలులోనో జాయినవాలి!. అప్పటికి గానీ మా గురుర్విష్ణువుల తిప్పలేమిటో  తిరుమలేశునికి తెలిసిరావు.  అట్టహాసమే తప్పించి హిరణ్యాక్షుడు నిజానికి వట్టి పిచ్చి సన్నాసి కదా స్వామీ? వరాహావతారం ఎత్తి  తమరిట్లా ముట్టే,   మూతీ ఎగరేయగానే బెదిరి   కొట్టేసిన భూమి మొత్తం  ఇట్టే  తిరిగిచ్చేసిన రాక్షసుడతడు. ఎన్నో హిరణ్యాక్ష వరాలిచ్చారు మా నేతలు ఎన్నికల ముందు..  మీ ముక్కోటి దేవతలను మించి! గెలిచి గట్టెక్కినాక  కావరమే గాని.. ఏ ఒక్క వరమూ తీర్చే యోచనలో లేరు యోగానందా! తమరెంతో  అధర్మ ద్వేషులని గదా అంతటా వినిపించే టముకులు! అదే సత్యమైతే మరెందుకు  సుమొటోగా అయినా   మా భూలోక గురువుల  ఘోష పట్టించుకోడంలేదు?! ఏదో ఓ అవతారమెత్తండి ఓంకార మూర్తీ! ఏ కోరలూ కొమ్ములూ ఎగరేస్తారా తమరిష్టం. ముందు మా ఉపాథ్యాయుల కాంట్రిబ్యూటరీ పింఛను సమస్యనైనా పఇష్కరించండి తండ్రీ!  ప్రహ్లాదుడంటే పాలూ నీరూ తేడా తెలియని  పిలగాడు. అతగాడేదో అమాయకంగా అడిగాడని అంత లావు ‘గాడ్’ అయి వుండీ అన్యాయంగా తమరు  నరసింహావతారమెత్తి అంతమొందించారే హిరణ్యకశిపుడిని! నిజానికి అక్షరం విలువ క్షుణ్ణంగా తెలిసిన  సత్తెకాలపు తండ్రి హిరణ్యకశిపుడు.  పద్దాకా పాఠ్యప్రణాళికలను అర్థరహితంగా మార్చే మా ప్రభుత్వాలు ఆ ప్రహ్లాదుడి తండ్రి కాలి ధూళికైనా సరిరారు.! ఆ ప్రభుద్ధుల బుద్ధి సరిదిద్దే పనికి తమరెందుకు బద్ధకిస్తున్నట్లు? దుష్టశిక్షణ పద్దు తమరి ఎజెండా నుంచి ఇంకా మారకుండా ఉందా ముకుందా?  భూలోక దేవుళ్ళం మేం గురువులం. ఇంత దూరం  దేకుతూ పాకుతూ వచ్చి దేబిరించే దాకా  తమరు విద్యాహక్కు చట్టం అమలుపై దృష్టి పెట్టరా పరంధామా విడ్డూరం కాకపోతే!  తమరా బాకీ కల్కి అవతారం ఎందుకు ఎత్తైనా ముందు మా పీ ఆర్ సి బకాయిలు నగదు రూపంలో చెల్లించేదుకు మా ప్రభుత్వాల చేత ఒప్పించమని మనవి. విద్యాసంస్కరణలపై  తాత్సారం  వద్దు! ఇందిరా రమణుని  ఇమేజికే డ్యామేజీ! వైనతేయుని స్వామి అన్న వినయమన్నా   వైరి వర్గాలు ఏ పరశురామావతారం  గండ్రగొడ్డళ్ల సీనులో మార్ఫింగులు చేసి వీడియోలు వైరల్ చేసే ప్రమాదం కద్దు! 'బతకలేక బడి పంతులు' అన్న సామెత చచ్చినా చచ్చిపోరాదన్నదన్నంత కచ్చగా ప్రవర్తిస్తున్నారందరూ  గురువుల పట్ల! ఏకీకృత సర్వీసు నిబంధనల అమలుకోసం భూమ్యాకాశాలనైనా ఏకం చేసెయ్యాలనే పంతానికొచ్చాం పంతుళ్లమందరం. ఇకనైనా  తమరికీ     ఉదాసీనత తగదు సదానందా! మా తగాదాలలో తలదూర్చి జగద్గురువుగా సాటి గురువుల గౌరవం నిలపమని ప్రార్థిస్త్తున్నాం!  హలం భుజాన మోసారే  తప్పించి  కిందికి దించి కనీసం ఓ అరెకరమైనా మడి చెక్క తమరు చదును చేసిందెక్కడ?  భూమ్మీది పంతుళ్ల పనులు  అంత సులువుగా లేవు.  పేరుకే బడి సెలవులు. పరగడుపున నిద్ర లేచింది మొదలు రాత్రి పొద్దెక్కినా పడకెక్కలేనంత పనిభారమే!  ఎన్నికల నుంచి సమాచార సేకరణల వరకు అన్నింటా సర్కారువారికి కాణీ ఖర్చులేని కంచిగరుడ సేవకులు బడి గురువులే! అయినా ‘టీచర్’ అంటే బడిలో  బుడతడి పాలిట డర్టే క్రీచర్. బడికి బైట సర్కారు కంటికి ‘సిల్లీ కేరికేచర్’! కృష్ణావతారంలో అబల ‘సత్య’ ఆగ్రహానికి జడిసి గబగబా పారిజాతం కోసం పరుగులెత్తారే మురారీ తమరు! అరే!  అదే మరి ఇన్నాళ్ళుగా మా బతుకులు బాగు కోసం లబలబలాడుతున్నా శ్రీమన్నారాయణా.. తమరికి చీమైనా కుట్టినట్లు లేదేం!  

 

‘సర్సరేలే గురువా! గురక నిద్ర మధ్యలో జొరబడింది ఈ మీ  లోకం గోలంతా చెప్పి మరీ నన్ను దెప్పేందుకా?!’

 

‘ఏళ్ల తరబడి పదవీ విరమణ చేసే ఏళ్ళు పెంఛమని ఏడ్చుకుంటున్నాం పంతుళ్లం. యుగాల బట్టి పెండింగులో పడుంది  జగన్నాథుడి పదో అవతారం. ముందెళ్ళి ఆ ముకుందుడి  ముక్కు పిండి జవాబు రాబట్టుకు రండి.. అప్పుడు మీ తిప్పల సంగతి గురించి  తీరిగ్గా ఆలోచిద్దాం!’ అంటోంది సర్కార్ ఎప్పుడు ఆందోళనలకు దిగినా చివరాఖర్న! ఈ వేళ మా లోకంలో ఉపాధ్యాయులకు  దినోత్సవం.  గురువులకు గురువువి! తమరిచ్చే  సూచనల గురించే ఈ యాచనంతా యాదగిరిస్వా,మీ!’

 

‘బిగినింగులో చదవబోయావే .. ఏదీ ఆ శ్లోకం ఇప్పుడో సారి బిగ్గరగా బైటికి చదువు గురువా!’

 

'గురుబ్రహ్మ.. గురుర్విష్ణు:.. గురుర్దేవో మహేశ్వర: ..

 

‘ఆగక్కడ! నీ శ్లోకంలోనే ఉంది కదా సారూ  ముందుగా గురువంటే  బ్రహ్మ.. చివర్నేమో శివుడు. నా ఖర్మ కాకపోతే  మధ్యన ఉన్న నన్ను అడ్డమేసుకుని  ఎవరెవరినో ఈ ఆఅడిపోసుకోవడంలోని ఆంతర్యమేమి స్వామీ?!’

 

‘కైలాసగిరి చుట్టూతానే ముందు కాళ్లరిగేటట్లు తిరిగింది ముందు ముకుందా!  ‘ఒకే రకంగా ఉద్యోగ నిబంధనలు లేవు. ఆ కారణంగా పదోన్నతలకు అవకాశాలు కరువు. కరువు భత్యం బకాయిలకు ఎప్పుడూ ఎదురుచూపులే! పీఆర్సీ నివేదికల అమలు జాప్యమయే పక్షంలో కనీసం బకాయిల్లో కొంత నగదుగానైనా  ముక్కుకు వాసన చూపించమని  ఏళ్ల బట్టి మొత్తుకోళ్లు. అయినా సర్కార్ల మనసులు కరగేదిలేదు. పింఛన్ కోసమని  జీత బత్తేలలో  కోత పెట్టే పద్ధతిఅయినా  బలవంతంగా రుద్దకుండా పాత విధానమే  కొనసాగించేలా చూడమని కైలాసవాసుణ్ని  వేడుకొనేందుకుఉ వెండికొండ పై కెన్ని సార్లు ఎగబాకామో.. ఆ దేవుడికే తెలుసు.  నల్ల బ్యాడ్జీలతో  మేం కంటపడ్డప్పుడల్లా వల్లకాదు పొమ్మనడు.. వల్లకాటికి రావద్దనడు. శివాయి తాండవాగ్రహాలు తప్పించి మరో అనుగ్రహం మాకెన్నడూ  లేకపాయ! ఇదేమని నిలదీయబోతే నడి మధ్యలోకి నంది బంటు వచ్చి  గుప్పెడు బూడిదకు తోడు ఆ బికారి శేష వస్త్రాలని చెప్పి ఇదిగో ఈ మందపాటి తోలు ఒకటి అందించడంతో సరి .. శ్రీహరీ!’

 

‘సరి! మరి మీ గురుబ్రహ్మ శ్లోకంలోనే ఉంది కదా అందరి కన్నా ముందు   విధాత పేరు? ఆ చతుర్ముఖుడికీ ఎందుకట ముఖం చాటేయడం?’

 

 ‘ బ్రహ్మగురువుకి మా లోకంలో పూజాదికాలు కరువు!  ఆ మాంధాత  మాటకు ఏమంత విలువుంటుంది? వట్టి కంఠశోష అవుతుందేమోనని    మీ సన్నిదానానికే ఇట్లా వచ్చి విన్నవింఛుకునేది? ’

 

‘దుర్మార్గాల ప్రక్షాళన కోసం  ఈ సరికే తొమ్మిది అవతారాలు ఎత్తున్నాను! బుద్ధావతారంలోనే మీ  మానవుల బుద్ధి మా బాగా బుర్రకెక్కింది బాబూ!   కలి పైత్యం ఆసాంతం ముదరాలి ముందు. ఆ పైనే కల్క్యావతారం కథా కమామిషు! నా సహస్ర బాహువుల్లో సహస్ర ఆయుధాలు. శంకువు, చకం, గద, దండం. మీ అధికారులది బధిరాంధకార బుద్ధి. శంఖవు పనిచేయదు. చక్రం ఏ సత్యయుగం ముందు కాలంనాటొ తయారీనో! వాడకం లేని అలంకారం. అస్తమానం సర్కులేషన్లో ఉండి.. వాడుతున్న కొద్దీ వాడి పెరిగే ఆయుధం దండం. దీన్నందుకో గురువర్యా! మీ యుగంలో దీని మరో పేరే ‘దణ్ణం’. దణ్ణం దశగుణం భవేత్! పై వాళ్లను  మునగ చెట్టు ఎక్కించేందుకు, కరుడుగట్టిన పెద్దలను మెత్తబరిచి కడగండ్ల బారి నుంచి  తప్పించుకునేందుకు అన్ని యుగాలలో, అన్ని లోకాలలో దాసులు ఎల్లవేళలా రెండు చేతుల నిండుగా ధరించి ధీమాగా తిరిగే లైట్ వెయిట్ పవర్ ఫుల్ వెపన్ ఈ దణ్ణం.  గద  మాదిరి భారీగా ఉండదు కనుక  భుజం మోత తప్పుతుంది. శంకువు  తరహాలో మారుమోగదు కాబట్టి గుట్టు చప్పుడు కాకుండా  మన పని కానిస్తుంది. చక్రమంటే చూపుడు వేలు పద్దస్తమానం దానికే మీదు కట్టే బాధ.  దండం   పెరుకే ఒక ఆయుధం. కనీసం బట్టలు ఆరేసుకునే దండెం కిందకైనా ఉపయోగించని దండుగ ఆయుధం.  ’ బక్క అయ్యవారువి.  తిక్క ఆందోళనలతో సాధించేది ఏమీ లేదని ముందు తెలుసుకో! సమయానుకూలంగా ఈ 'దండం'  సందించే విద్య ఒక్కటి వంటకి బడితే చాలు సర్వీసులో ఉన్నంత కాలం బడికి వెళ్ళి పాఠాలు చెప్పకున్నా జీత భత్తేలతో పాటు ‘ఉత్తమ ఉపాధ్యాయ’ వంటి  పురస్కారాలు అడక్కోకుండానే రెక్కలు కట్టుకుని మరీ ఇంటి ముంగిట వాలిపోతాయ్!  మంచు కొండ మీద ఒంటి మీద చింకిపాతైనా లేకుండా మాడు పై ఒకరిని, వంటి పక్కన వేరొకరిని  ఇద్దరాడంఫులను  ఒకేసారి భరింఛడానికి తోడు గొంతు లోపల కాల కూట విషమున్నా, గొంతు మీదనే మిన్నాగు పాకుతున్నా,  గోల గోలగా అరుపులు సాగిస్తూ ఒక్క క్షణమైనా వదలని భూత ప్రేత, పిశాచాల  మూకలను సైతం చుట్టూ చేర్చుకునీ యోగ ముద్రలో అంత భద్రంగా కాలుడు దున్నపోతు మీద ఓ కాలు వేసుకుని మరీ అంత  కులాసాగా విశ్వదుష్ట వినాశనం పైన ఏ ఒక్క  ఫిర్యాదుకైనా తావీయనంత దీక్షతో  ధర్మకార్యం నిర్వహణ నిరంతరం అనాదిగా అంత సమర్థంగా ఎలా నిర్వహిస్తున్నాడో ఎన్నడైనా ఆలోచించావా గురువా! ఆ మహేశ్వరుడి అంత నిశ్చింతకూ నీవు ఇందాక తిట్టిపోస్తివే.. ఆ 'తోలు మందమే' మూల కారణం పంతులూ! గురువే బ్రహ్మ, గురువే విష్ణువు. గురువే మహేశ్వరుడు- అని నీవే ఓ శ్లోకం అందుకుంటివి గదా ఇందకా! పిల్లల అల్లరి మాటల పట్ల బ్రహ్మ చెముడు  పాటించు. పెద్దల చిల్లర చేష్టలనే మాత్రం పట్టించుకోని మహేశ్వరుడి మందపాటి తోలు మనసుకు ధరించు. కలియుగం కాబట్టి నేను అందించిన ‘దణ్ణం’ రెండు చేతుల నిండుగా పట్టు! అప్పుడు తప్కుండాక నీ శ్లోకంలోని  ఆ రెండో భాగం 'గురుస్సాక్షాత్ పరబ్రహ్మం'  నిజం కాక చస్తుందా? అప్పుడు వద్దన్నా అన్ని లోకాలూ 'తస్మై శ్రీ గురువే నమ:!' అంటూ మోకాళ్ల మీద తలవంచి మరీ నీ ఆశీర్వాదం కోసం క్యూ కడతాయి అయ్యవారూ! ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా  అందుకో మా త్రి మూర్తుల  తరుఫు నుంచి ఆయుధాలూ, అభినందనలు!

 

***


ఈ నాడు - హాస్యం - వ్యంగ్యం ఆపన్నుల పై వింత పన్నులు రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈ నాడు - ప్రచురితం - తేదీ తెలియదు )




ఈనాడు - హాస్యం - వ్యంగ్యం 

ఆపన్నుల పై వింత పన్నులు 

రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈ నాడు - ప్రచురితం - తేదీ తెలియదు ) 







శుభం!




దేనికీ?! 




మన ముఖ్యమంత్రిగారికి మూడ్ వచ్చిందని, రాష్ట్రాన్ని గాడిలో పెడతానని శపథం చేశారని, జిల్లా పర్యటనలూ అప్పుడే మొదలు పెట్టేశారని, ఆదాయ మార్గాలు వెతికే పనిలో పడ్డారని, మంత్రివర్గ సభ్యులందర్నీ ఒక్కతాటి మీదకు తెచ్చేస్తానన్నారని.... అరె ! ఎందుకా నవ్వు? 




లేకపోతే ఏంటి మామా, తలా ఒకతాడైతే ఖర్చు తడిసి మోపెడవుతుందని పెద్దాయన అలా అనుండొచ్చేమోగానీ... మనాళ్ల బరువుకి తాడుకీ ఎక్కడన్నా సాపత్యముందంటావా! తాడు తెగి మొదటికే మోసమొస్తుంది. ఆదాయ మార్గాలను వెతకటమంటే మరీ ఇంత చాదస్తంగానా! పండుగ ఇలా అయిపోయిందో లేదో, అలా పిల్లల చక్కెర బిళ్లల్నీ వదలకుండా అదనంగా అమ్మకం పన్ను బాదేయటమేనా? అరె! ఇంతకుముందే సారు ఆర్టీసీ ప్రయాణికుణ్ని ఉతికి ఆరేశారు. విద్యుత్ ఛార్జీలనూ రెండు మూడ్రోజుల్లో పెంచడానికి సిద్ధంగా ఉన్నారనే వదంతి ఒకటుందాయే! ప్రభుత్వాన్ని వాహనాలకు విధించినట్టు మా గాడిలో పడేయడమంటే.. అది ఇదేనన్నమాట!' 




`అదే మరి! కొంతకాలంగా రాష్ట్రంలో ప్రభుత్వమ నేది అసలుందా? ఉంటే గుర్రుకొట్టి నిద్దరోతోందా? కప్పుకోవటానికి దుప్పటి దిండూ కావాలా? అంటూ అదేపనిగా దెప్పిపొడిచిందీ తమరే. ప్రతిదాన్ని రాజ కీయం చేయకపోతే- రాష్ట్ర ఖజానాకు సొమ్ములు జమయ్యే ఆ విధానాలేంటో... మీకు తెలిస్తే చెప్పవచ్చుగదా! లక్షకోట్ల బడ్జెట్ మనది. ముందా సంగతి గుర్తుంచుకొని మరీ మాట్లాడాలి.




ఆ మాటన్నావూ బాగుంది. మనసంటూ ఉండాలేగానీ పైసలు రాబట్టడానికి బోలెడన్ని మార్గాలు. ఉదాహరణకు మన ముఖ్యమంత్రినే తీసుకో మామా! కాచిగుడాలో బట్టలకొట్టు తెరవాలన్నా పెద్దాయన చూపు హైకమాండ్ వైపే ఉంటుంది. మరా భాగ్యానికి మనకింత జంబోజెట్ మంత్రివర్గం అవసరమా? ఆ ఒక్కడూ ఉంటే చాలదా? ఇంతమంది మంత్రులూ వాళ్లకి కార్లు, ప్రొటోకాళ్లూ, క్వార్టర్లూ, టెలిఫోన్లు, సెక్యూరిటీ ఖర్చులు వృథా వ్యయమే గదా! అధికారులెలాగూ తాము చేసే పనులు ఈ మంత్రులకు చెప్పి చేయనప్పుడు...




'అగక్కడ! మరీ అంత దూకుడొద్దు. ఏ కేసులోనో ఇరుక్కుపోగలవు. ఆందోళనల మూలంగా పెట్టుబడులు పడిపోతున్నాయని, పర్యాటకుల నుంచొచ్చే ఆదాయమూ తగ్గిపోతోందని పెద్దాయన అసలే నస పెడుతున్నాడు. 




ప్రపంచం మొత్తంలో ఎక్కడా లేని విచిత్రమైన నిరసనలు మన దగ్గరే గదా సాగుతు న్నాయి మామా! వీటిని దగ్గరగా చూసే సౌకర్యం కల్పిస్తామంటే... ధనుష్కోటిలో సూర్య గ్రహణాన్ని, శబరిమలైలో మకరజ్యోతిని చూడటానికి ఎగబడే జనాలకన్నా ఎక్కువ పొర్లుకొస్తారు. విదేశీ మారకద్రవ్యమే ద్రవ్యం. ఆకాశాన్నంటే భవనాలను డబ్బులు పోస్తే ఏ దుబాయివాడన్నా తేలిగ్గా కట్టేస్తాడు. కడుతుండుగానే కూలిపోయే ఫ్లైఓవర్లను పుక్కిలించి ఉమ్మేస్తేనే పుసుక్కుమని తెగిపోయే కరకట్టలను చూడాలంటే మన రాష్ట్రానికే రావాలని

ప్రపంచానికి తెలిసే ఏర్పాటు చేస్తే చాలు- పర్యాటకుల ప్రవాహాన్ని ఆపటానికి ప్రత్యేక దళా లను నియమించాల్సివస్తుంది. మనదగ్గర తయారవుతున్నన్ని దిష్టిబొమ్మల రకాలు ప్రపంచంలో ఎక్కడా దొరకవు. వాటిని కనక అమ్మకానికి పెడితే బార్బీ బొమ్మల రికార్డును బద్దలు కొట్టడం ఖాయం. ఊరేగింపులకు అనుమతివ్వటం లేదని చెడ్డపేరు మూటగట్టుకునేకన్నా, ఆందోళనకారుల సంఖ్యను సమయాన్ని బట్టి సుంకాలు వసూలుచేసి చూడండి.. గవర్నమెంటు ఇంకో ఖజానా తెరుచుక్కూర్చోవాల్సొస్తుంది. వేలం వేసుకోవడానికి భూములైపోయాయని మొహాలు వేలాడేసుకుని బాధపడుతూ కూర్చునే కన్నా, ఏ పనీలేని సచివాలయం భవనాలు అలా ఖాళీగా పడున్నాయి గదా! ఓ చంద మడతమంచాలు పరిచి సిటీకి పనిమీదొచ్చేవాళ్లకు అద్దెకిచ్చే పని మొదలుపెడితే ఆదాయం దానంతటది తన్నుకుంటూ రాదా మామా ! దానిమీదొచ్చే వడ్డీతోనే ప్రభుత్వోద్యోగులకు నలభైశాతమేం ఖర్మ ఏకంగా ఆర్టీసీ ఉద్యోగులకు మల్లే వందశాతం ఫిట్ మెంట్ ఇచ్చేయొచ్చుగదా! పప్పులూ నూనెల ధరలు దిగిరా నప్పుడు తెలివిగా అమరణ నిరాహారదీక్షలను ప్రోత్స హించాలి. రిలేదీక్షలకు దిగినవారిని ఆహార పొదుపు ఉద్యమంలో స్వచ్ఛంద కార్యకర్తలుగా గుర్తించి ప్రోత్సహించాలిగాని, పోలీసు కేసులు మోపి బలవం తంగా సెలైన్ బాటిళ్లు పెట్టి అల్లరిపాలవటం ఎంత తెలివితక్కువతనం! అక్రమ నిర్మాణాలమీద అపరాధ రుసుం వసూలు చేసి క్రమబద్ధీకరించే విధా నాన్నే అక్రమార్జనలకూ వర్తింపజేసి చూడండి ఆ నల్లధనం మీద జమపడే రుసం సొమ్ముతో ఏ లోటూ లేకుండా రెండు లక్షల బడ్జెట్ బ్రహ్మాండంగా ప్రవేశపెట్టేయొచ్చు. 'చుక్కల మందు' మీద పెట్టే ఖర్చును మందుచుక్కల మీదకు మళ్లించి ఉంటే మందుబాబులు ఈపాటికే మన ఖజానాను ఏడుకొండలవాడి హుండీకన్నా వేగంగా నింపి ఉండేవాళ్లు. బుర్రుండాలిగానీ...




'బుర్రంటే గుర్తుకొచ్చింది.... వీటన్నింటికన్నా తేలికైనది. . తెలివైనది. . పుణ్యమొచ్చేది. . మన జనాలకు తెగనచ్చేది ఇప్పుడే ఒకటి నా బుర్రకే తట్టిందిరా అబ్బాయ్! పండుగొచ్చినా పబ్బమొచ్చినా ముందుగా మనమందరం పరిగెత్తేది ఎక్కడికీ? ఆ ఏడుకొండల వాడి కొండకేగా! ... రింగురోడ్డు మీద టో ల్‌ ట్ లాంటిదొకటి అలిపిరి కూడలి దగ్గరా ఏర్పాటు చేస్తే సరి! గుండు పన్ను గట్టిగా వసూలు చేస్తే చాలు.. నీ బోటి కోన్ కిస్ గా గాళ్ల సలహాలు వినే యాతన పెద్దాయనకు తప్పుతుందిగా! 




బాగానే ఉందిగాని మామా... మరందరూ గుండుతోనే కొండ దిగుతారని గ్యారంటీ ఏంటంట! 'జుట్టుతో దిగితే గుండును దాచినందుకు జరిమానా వేయొచ్చు. నువ్వే చెప్పావుగా.. మనసుంటే బోలెడు మార్గాలు. ఏదైనా దేవుడి కార్యమే గనక ''ఎవరూ కిమ్మనలేరు. 




- రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈ నాడు - ప్రచురితం - తేదీ తెలియదు )


ఈనాడు - సంపాదకీయం ఏరువాకా... అందుకో స్వాగతం రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ఆశల చినుకులు పేరుతో ప్రచురితం - 12-06-2011 )

 


ఈనాడు - సంపాదకీయం 

ఏరువాకా... అందుకో స్వాగతం ! 


రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ఆశల చినుకులు పేరుతో ప్రచురితం - 12-06-2011 )  


'ఏరు' అంటే సాగుగిత్తల మెడమీది నేలతల్లిని దున్నే నాగలి కర్రు. ముచ్చి ముమ్మారు మూడు చాళ్ళను బసవన్నలచేత మృగశిరకార్తె మొదటిరోజున దున్నించి అన్నదాత సేద్యయాగం ఆరంభించే ముచ్చటే ఏరువాక. భాగవతంలో బలరామ సోదరుడు భావించినట్లు- గోపాల కూటమికి గిరియజ్ఞమెంత ప్రధానమో, కర్షక లోకానికి ఏరువాకా అంత అవసరం. కసవు దేనుగణానికి, ధేనుసంపద పాడిపంటలకు, పాడిపం టలు బతుకుతెరువుకు ఎంత అవసరమో త్రేతాయుగం నాటికే మనిషి గుర్తించాడు. అందుకే నృపాలురు సైతం పొలం పనుల్లో పాలుపం చుకొనేవారని పురాణాల కథనం. మిథిల మహారాజు జనకుడు ఏరు వాక ఆరంభమయ్యే జ్యేష్ఠ శుద్ధ పున్నమినాడు రాజపురోహితుడు శతానందుడి పవిత్ర మంత్రోచ్ఛారణలూ ప్రజల జయజయధ్వానాల మధ్య  స్వయంగా సీతాయజ్ఞం ఆరంభించిన వైనాన్ని వాల్మీకి రామాయణం పరమాద్భుతంగా వర్ణించింది. విష్ణుపురాణం సీతాయజ్ఞమన్నా, బౌద్ధ జాతక కథలు పప్పమంగల దివసమన్నా, జైమినీ న్యాయమాల ఉద్య షభయజ్ఞమన్నా.... అన్నీ ఆ ఏరువాకమ్మ మారుపేర్లే.  వ్యవసాయానికి సాయమందించే బసవన్న మెడలను  రంగురంగుల పూసదండలతో, పూలదండలతో తనివితీరా అలంకరించి, పొంగలి ప్రసాదాలతో అంగరంగ వైభోగంగా మంగళ వాయిద్యాలమధ్య పూజాదికాలు నిర్వహించి పొలం దున్నుడుతో సాగుపనులు ఆరంభించే ఒకనాటి సంబరాలు ఇప్పుడూ అంతే సంరంభంగా కొనసాగుతున్నాయనలేం. ఆడపడుచులు ముచ్చటపడుతూ పుట్టింటికి పరిగెత్తుకు రావడాలూ, పొగరుగిత్తలను ఊరిమధ్యనుంచి హుషారుగా యువకులు పోటీలు పడి పరుగులెత్తించడాలూ, భారీ బసవన్నలచేత బండ బరువులు లాగించి బహుమా నాలందించడాలూ... ఈనాటికీ కొన్ని గ్రామసీమల్లో ఏరువాక సాగే కాలాన కనిపించే దృశ్యాలే! 


ఆది మానవుడికి మల్లే ఆధునిక జీవుడికీ వ్యవసాయం ఓ జీవ నాధారం. రోళ్లు పగిలే రోహిణీ గండం గడిచి మృగశిరారంభంలో కురిసే తొలకరి చినుకులకు అందుకే అంత ప్రాధాన్యం. 'ఏరువాక పున్నమికి వెండిమబ్బు దారబ్బంతి/ చిక్కులేని పోగులను పుడమికి జారవిడిచే'  ఆ సుందర దృశ్యానికి స్పందించని హృదయం అసలుం టుందా! ' ఏటి ఒడ్డున ఎంకిని తలదన్నే పూబంతి/ దుక్కిదున్నగ పోతున్న బసవమామకి ఎదురొచ్చే'  సన్నివేశం కవితావేశం రగిలించడానికి గుండె నండూరివారిదే కానవసరంలేదు. వానకార్తె దృశ్యాలకు రుగ్వేదమే స్పందించకుండా ఉండలేకపోయింది. గాథా సప్తశతి హాలుడినుంచి 'కృషీవలుడు' కర్త దువ్వూరివారి వరకు తొలకరి చినుకుల కులుకులకు పులకరించని కవులు బహు అరుదు. 'ఆ ఆకుల పమిట చాటున పాల కంకుల రహస్యం/ పొలం మడిగట్టుమీద ఒంటరి బంతిమొక్క ఎదురుచూపు/ పొగరెక్కిన ఆంబోతు రంకెలా ఉరుము/ నింగికేసి చూసే నీరుకాయ తలపాగా' ... ఏ వికారాలకూ లోనుకాని దేవుడూ, పాపం, ఎవరి పరవశంలో పడి ఈ తడి దృశ్యా లంత అందంగా సృష్టించాడోనని నేలభామ ముద్దొచ్చే బురద పూవులా ముసిముసిగా నవ్వుకుంటుందంటాడు ఓ ఆధునిక కవి. మబ్బు పలకరింపే చినుకు. పరిమళం, మట్టి మౌన స్పందన, అందు కేనేమో భగవంతుడు తాను ఆ సుగంధంలోనే దాగి ఉంటానని గీతలో బోధించింది! 

సృష్టికర్త తన సృజనలో ఒక్క చందన పరిమళాలకు, సౌందర్యానికే కాదు... సకల జీవరాశుల యోగక్షేమాలకూ సమప్రాధాన్యం ఇవ్వడాన్ని గతితప్పని రుతుచక్ర క్రమవిధానంలో గమ నించవచ్చు. మృగశిరంతో మొదలయ్యే కార్తె రోజుల్లో ఆకశాన  మూడు తారలతో మృగశిరాన్ని సూచించడం సాగుకు అవసరమయ్యే పశుసంపదను సమాయత్తం చేసుకొమ్మని హెచ్చరించటమేనని ఓ కవి భావించడం ఎంత కమనీయమైన సాంఘిక కల్పన! 


కాలమే ఎందుకో క్రమంగా రుతుధర్మాన్ని సక్రమంగా పాటించడంలేదు. 'ఏరువాక వస్తుందంటే యుద్ధమొస్తున్నంత భయం.... ప్రకృతి ఏ బాంబు వేయబోతుందోనని/ కిసాన్ జవానై కిట్టు సర్దుకుం టంటే... ఇల్లాలు కన్నీళ్లై ఎదురు వస్తోంది' అంటాడో కవి. స్వేదం విత్తితే చావులు మొలుస్తున్న కాలాన్ని ఈ కవికన్నా సహజంగా ఇంకె వరు చిత్రించగలరు! ఏరువాకలన్నీ యముని తాఖీదులవుతు న్నాయి/ సేద్యం శకునితో ఆడే మాయ జూదమైపోయింది' అన్నది నేటి వ్యథార్త  దృశ్యాలకు యథార్థ చిత్రణ! రూకల రాకాసి రెక్కల నీడలో వ్యవసాయమూ వ్యాపారి వేషం వేసుకోవడమే నేటి రైతు భాగవతంలోని విషాదఘట్టానికి అసలైన కారణం. మట్టికీ మనిషికీ మధ్య ముడివడిన పేగుబంధం విడిపోతున్న కొద్దీ- పక్షుల్లేని  ఆకా శంలా పొలం పేలవంగా మారిపోతుంది. సైరన్ కూతల సంగీత కచేరికి క్షేత్రాన్ని వేదికగా మార్చిన క్షణానే అన్నదాత క్షేమం ప్రశ్నార్ధకమనే లోయలో పడిపోయింది. రైతు కదిలే కన్నీటి మేఘంలా మారడానికి కర్ణుడి చావుకన్నా ఎక్కువ కారణాలే ఉన్నాయి. లెక్కల బతుకులోనూ లెక్కకందని అనుభూతులుంటాయని మళ్ళీమళ్ళీ గుర్తు చేసుకోవడమే ఈ కార్తె ప్రస్తుత పరమార్థం. మట్టికి మరణం ఉంటుందా? మొలకై మళ్ళీ మొలకెత్తటమే గదా దాని జీవతత్వం! రైతన్న ఎన్నిసార్లు కూలిపోయిన రథం కాలేదు! బీడు అడుగున దీర్ఘ నిదుర తీస్తున్నా ఆశల చినుకులు నాలుగు రాలితే చాలు... లోక మంతా పచ్చగా పరుచుకునే విత్తనం రైతు. 'అనావృప్లై ఆనాడు వెంట బడినా అతివృష్టిగా పడగవిప్పి ఈనాడు భయపెట్టినా/ తడిసి ముద్దైన కలలు ఎన్ని వందలసార్లు నీటి బాంబులై గుండెలను వేల్చే సినా' - చెక్కు చెదరనిది రైతు ఉక్కు సంకల్పం. మనసును ఆకాశమంత పందిరి చేసుకుని, ఆశకు భూమాత అంత మండపం లేపి ఎప్పటి లాగా రైతు ఏరువాకకు ఎదురేగి మనసారా స్వాగతం చెప్పకపోతే మన పేరున్న గింజలకోసం ఇప్పటికన్నా ఎక్కువగా గింజుకోక తప్పని పరిస్థితి. అందుకే ఏరువాకా... అందుకో ఈ స్వాగతం! ఆదుకో... ఈసారైనా రైతునీ... మా జాతినీ!


రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు ఆశల చినుకులు పేరుతో  - ప్రచురితం - 12-06-2011 ) 

Monday, December 13, 2021

తెలుగు సాహిత్యానికి పాశ్చాత్యుల సేవ కర్లపాలెం హనుమంతరావు ( మూలం - భాషా సాహిత్య స్వరూపం - డా॥ జె. చెన్నయ్య )










తెలుగు సాహిత్యానికి పాశ్చాత్యుల సేవ 

కర్లపాలెం హనుమంతరావు 

( మూలం - భాషా సాహిత్య స్వరూపం - డా॥ జె. చెన్నయ్య ) 




బెంజమెన్ షుల్జ్ - తొలి తెలుగు ముద్రాపకుడు


తెలుగులో తొలిసారిగా గ్రంథాన్ని ముద్రించి చరిత్రకెక్కిన బెంజమెన్ షుల్జ్ చిరస్మరణీయుడు. ఇతడు 1689లో జర్మనీలో జన్మించాడు. 1719 × తన 29వ ఏట దక్షిణ భారతదేశం వచ్చాడు. డెన్మార్క్ రాజు ఐదవ ఫ్రెడరిక్ పంపగా జర్మనీ నుంచి దక్షిణ భారతదేశంలోని తరంగంబాడికి క్రైస్తవ మత ప్రచారం కోసం వచ్చిన రెండవ జట్టు ఫాదరీల్లో షుల్జ్ ఒకరు. చెప్పులు సైతం లేకుండా నిరాడంబరంగా పాదచారిగా మత ప్రచారం చేశాడు. అనారోగ్య కారణాల వల్ల స్వదేశం తిరిగి వెళ్లిన తర్వాత కూడా తెలుగు టైపులు పోతపోయించి, తెలుగు గ్రంథాలు రచించి ముద్రించాడు. జర్మన్ లూథరన్ తత్త్వవేత్త జోహాన్ ఆర్నెడ్ (1555-1621) రచించిన నాలుగు గ్రంథాలను షుల్జ్ తెలుగులోకి హాలేలో ముద్రించాడు. 23 సంవత్సరాల ముద్రణారంగంలో శ్రమించాడు. స్వదేశం వెళ్లిపోయాక కూడా 17 సంవత్సరాల పాటు తెలుగు పుస్తకాలు ముద్రించాడు. స్వయంగా 'GRAMMATICA TELUGICA' (1728) పేర 8 ప్రకరణాల్లో తెలుగు వ్యాకరణం రచించాడు. దీనిని హాలే విశ్వవిద్యాలయం వారు భద్రపరచి 1984లో తొలిసారి ముద్రించారని ఆరుద్ర తెలియజేశారు.8 తమిళం, పోలీసు, డేనిష్ భాషల్లో 20 పుస్తకాలను ఆరేళ్లలో ముద్రించాడు. మద్రాసులో సెంట్ జార్జ్ కోటలో కుంపిణీ గవర్నరు ఒప్పించి భారతీయుల కోసం పాఠశాల పెట్టించడమే గాక అందులో తెలుగు విభాగాన్ని ప్రారంభించి పిల్లల్లో తానూ ఒకనిగా కేవలం రెండు నెలల్లో తెలుగు నేర్చుకున్నాడు. అంతేకాదు బైబిల్ను సాహసోపేతంగా తెలుగులోకి అనువదించి ముద్రించాడు. 1760 నవంబర్ 25న షుల్జ్ కన్నుమూశాడు.


K. జేమ్స్ గ్రాంటు - దేశీయ విద్యలపై దృష్టి


కుంపిణీ వారికి మన దేశంలో మొట్టమొదట వశమైనవి ఉత్తర సర్కారులు. ఈ ప్రాంతాల సంక్షిప్త రాజకీయ చరిత్రను, విపులమైన రెవెన్యూ చరిత్రను వ్రాసిన తొలి ఆంగ్లేయిడు జేమ్స్ గ్రాంటు నిజాం దర్బారులో బ్రిటిషు రాయబారిగా పనిచేశాడు. దేశీయ విద్యలు మూలపడ్డాయని, వాటిని ఉద్దరించాలని చెప్పాడు.


ఛార్లెస్ వైట్ - నిఘంటు నిర్మాణానికి అంకురార్పణ


సెంట్ జార్జ్ కోటలో సివిల్ సర్వెంట్ హోదాలో పనిచేసిన ఛార్లెస్ వైట్ తెలుగులో నిఘంటు నిర్మాణానికి 1793 ప్రాంతాల్లో అంకురార్పణ చేశాడు.మంచి నిఘంటువు తయారు చేసిన వారికి బహుమతులివ్వాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశాడు. అంతేకాదు తెలుగు నేర్చుకొనేవారికి ఉపయోగపడే ప్రాథమిక గ్రంథాలను రాయించాలని సూచించాడు. ఈయన సూచనవల్లే సెంట్ జార్జి కోట

పాలకులు మామిడి వెంకయ్య 'ఆంధ్ర దీపిక' హక్కులను కొన్నారని భావించవచ్చునని తెలుగు భాషా సారస్వతాల రంగాన్ని బ్రౌసు మహోజ్వల కాంతులతో నింపాడు. తెలుగు భాషా సాహిత్యాల పునరుద్ధరణకు, పునరుజ్జీవానికి అతడు ధారవోసిన శ్రమ అపారం. 1798 నవంబర్ 10న కలకత్తాలో జన్మించాడు. ఇంగ్లండులో విద్యాభ్యాసం తర్వాత 1817లో కుంపిణీ ప్రభుత్వ సివిల్ సర్వెంట్గా భారతదేశంలో అడుగుపెట్టాడు. దక్షిణ భారత క్యాడర్లో బ్రౌను నియామకం ముఖ్యంగా తెలుగు వారు చేసుకున్న పుణ్యం.

కలెక్టరు సహాయకునిగా, మెజిస్ట్రేటుగా, పర్షియన్, తెలుగు పోస్ట్మాస్టర్ జనరల్ కునిగా, గా, విద్యామండలి సభ్యునిగా, కాలేజ్ బోర్డు కార్యదర్శిగా అనేక హోదాల్లో అనేక ప్రాంతాల్లో ఉద్యోగం చేశాడు. 38 సంవత్సరాలు కుంపిణీ వారి కొలువులో ఉన్నాడు. తాను దేశంలోనూ, తిరిగి ఇంగ్లండు వెళ్లాకకూడా మొత్తం దాదాపు ఐదున్నర దశాబ్దాల కాలం తెలుగు భాషా సాహిత్యాల వికాసం కోసం అవిశ్రాంతంగా కృషి చేశాడు. ఇది ఒక వ్యక్తికి సాధ్యమయ్యే పని కాదు. తెలుగు గ్రంథాల రచనలో, తాళపత్ర గ్రంథాల సేకరణలో, ఉద్ధరణలో, భద్రపరచడంలో, పరిష్కరణలో, ముద్రణలో ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి పనిచేశాడు బ్రౌన్. బ్రౌన్ వేమన పద్యాల ఆంగ్లానువాదం 1825లోనే చేపట్టాడు. తెలుగు ఛందస్సు (1827) ముద్రించాడు. తెలుగు-ఇంగ్లీషు, ఇంగ్లీషు-తెలుగు నిఘంటువులు, తెలుగు వ్యాకరణం, ఆంగ్లంలో తెలుగు వ్యాకరణం ప్రచురించాడు. ది లిటిల్ లెక్సికాన్, ది జిల్లా డిక్షనరీ కూర్చాడు. కొత్త నిబంధనను అనువదించాడు. వేమన పద్యాలను ఆంగ్లంలో 1829లో 693 పద్యాలతో, 1839లో 1164 పద్యాలతో ప్రచురించాడు. ఆయన ఎన్నో విధాలా శ్రమించి వ్యయప్రయాసల కోర్చి సేకరించిన తెలుగు, సంస్కృత గ్రంథాల సంఖ్య వేలల్లో వుంది. మాజేటి సర్వేశలింగం సంకలనం నుండి సేకరించిన గ్రంథాలు 613 కాగా 227 గ్రంథాలు తెలుగు, 386 సంస్కృత గ్రంథాలు. మచిలీపట్నంలో కొన్నవి 1830 గ్రంథాలు. ప్రత్యేకంగా కడపలో భవనాన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసి, దిగ్ధంతులైన పండితులను నియమించి అనేక కావ్యాలు, శతకాలకు సంబంధించిన వేరు వేరు చోట్ల లభ్యమైన ప్రతులను పోల్చి చూపి (Collation) శాస్త్రీయ పద్ధతిలో పరిష్కరింపజేశాడు. వాటిల్లో వసు చరిత్ర, మనుచరిత్ర, రాఘవపాండవీయం, రంగనాధ రామాయణం, పండితారాధ్య చరిత్ర, పల్నాటి వీర చరిత్ర, దశావతార చరిత్ర మొదలైనవి ఉన్నాయి. పోతన భాగవతాన్ని పరిష్కరించడమే కాక తెలుగు భారతం 18 పర్వాల పరిష్కరణకు, శుద్ధ ప్రతుల తయారీకి 2714 రూపాయలు ఖర్చు చేశాడు. తెలుగు నేర్చుకోదలచే ఇంగ్లీషు వారి కోసం, ఇంగ్లీషు నేర్చుకోదలచే తెలుగు వారి కోసం వాచకాలు తయారు చేశాడు. మద్రాసులో, కడపలో, మచిలీపట్నంలో స్వంత ఖర్చులతో ఉచిత పాఠశాలలు నడిపాడు. ఆయనే అన్నాడు " In 1825 found Telugu Literature dead in thirty years I raised it to life "10 అని. అది అక్షరాలా నిజం. 1855 ఏప్రిల్లో ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తిరిగి ఇంగ్లండు వెళ్లిపోయాడు. లండన్ యూనివర్సిటీలో తెలుగు గౌరవ ఆచార్యునిగా పనిచేశాడు. గ్రంథ రచన, ముద్రణ నిర్వహించాడు. ఆయన చివరి ప్రచురణ 'తాతాచార్యుల కథలు'. 1884లో కన్నుమూశాడు. పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్న వేమన పద్యానికి నిదర్శనంగా తెలుగుజాతి ఎన్ని తరాలకైనా మరువరాని పుణ్య పురుషుడు సి.పి. బ్రౌన్.


సర్ థామస్ మన్రో ప్రజల గవర్నరు -

తన 19 ఏళ్ల వయసులో మద్రాసుకు సైనిక విద్యార్థిగా వచ్చిన సర్ థామస్ మన్రో తన 66వ ఏట మద్రాసు గవర్నర్ గా చేస్తూ చనిపోయాడు. తెలుగు నేర్చుకున్న తెల్ల దొరల్లో ఈయన సుప్రసిద్ధుడు. రాయలసీమ తెల్లదొరల అధీనంలోకి వచ్చాక ఈయనను పాలకునిగా నియమించారు. దత్త మండలాల్లో ఉన్న 80 మంది పాలెగాండ్లను అదుపులోకి తెచ్చి రైతులకెంతో ఉపకారం చేశాడు. పాఠశాలలు నెలకొల్పేందుకు, ప్రజోపయోగకరమైన విద్యావిధానాన్ని ప్రవేశపెట్టడానికి పథకాలు రూపొందించాడు. రాయలసీమ అంటే ప్రాణం.

1783లో రైటర్గా మద్రాసు వచ్చిన విలియం బ్రౌన్ మచిలీపట్నం, విజయనగరం, విశాఖ, గంజాం, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో అనేక హోదాల్లో 50 సంవత్సరాల పాటు పనిచేశాడు. 1817లో 'జెంటూ' (తెలుగు) వ్యాకరణం ముద్రించాడు. అందులో పూర్వ వ్యాకర్తలను స్మరించడమే గాక కొన్ని పూర్వ వ్యాకరణాలు నిరుపయోగాలన్నాడు. 1818లో ఆయన ప్రచురించిన జెంటూ వొకాబులరీ వల్ల ఆనాటి సాంఘిక చరిత్ర తెలుసుకోవచ్చు. 1832లో తెలుగు అనువాదకునిగా పనిచేశాడు. మచిలీపట్నంలోని మామిడి వెంకయ్య, గుండుమళ్ల పురుషోత్తం వంటివారు విలియం బ్రౌను తెలుగు వ్యాకరణ రచనకు సహాయం చేశారు. ఆయన తెలుగు వ్యాకరణం చాలా విశిష్టమైనది. ఇంగ్లీషు వర్ణక్రమం ప్రకారం తెలుగు అక్షరాలు 22 మాత్రమేనని వర్గీకరించాడు. ఇది ఇంగ్లీషు వాళ్లు తెలుగు నేర్చుకొనేందుకు దోహదం చేసింది. తెలుగు భావ ప్రకటనకు గంభీరంగానూ, వినడానికి కమ్మగానూ ఉంటుందని అన్నాడు.


ఎ. డి. క్యాంబెల్ - ప్రామాణిక వ్యాకరణం


అలెగ్జాండర్ డంకన్ క్యాంబెల్ 1807లో రైటర్గా మనదేశానికి వచ్చాడు. బళ్లారి, తంజావూరు కలెక్టరుగా పనిచేశాడు. ప్రభుత్వ తెలుగు, పర్షియా అనువాదకునిగా పనిచేశాడు. బళ్లారి మిషన్కు ఈయన కృషివల్లే ముద్రణశాల లభించింది. 1817లోనే సెంట్ జార్జికోట కాలేజ్ బోర్డుకు కార్యదర్శి అయ్యాడు. రెవెన్యూ బోర్డు కార్యదర్శిగా కూడా పనిచేశాడు. తెలుగును నిశితంగా అధ్యయనం చేయడమేగాక తెలుగులోనూ, తెలుగును గురించి ఆంగ్లంలోనూ ప్రామాణిక రచనలు చేసిన కొద్ది మందిలో క్యాంబెల్ ఒకరు. ఉదయగిరి నారాయణయ్య అనే పండితుని దగ్గర ఆంధ్ర శబ్ద చింతామణిని ఆమూలాగ్రం చదువుకున్నాడు. మామిడి వెంకయ్య ఆంధ్ర దీపిక పీఠిక, ఆంధ్రకౌముది, అహోబిల పండితీయం మొదలైనవి 10 ఏళ్లపాటు శ్రద్ధగా పఠించాడు. ఈ పరిజ్ఞానంతో తర్వాతి వారికి ఉపయుక్తంగా ఉండేలా ఆరు అధ్యాయాలు, 519 సూత్రాలతో తెలుగు వ్యాకరణాన్ని ఇంగ్లీషులో రచించాడు. అప్పట్లో ఇంగ్లీషు వచ్చిన తెలుగు వ్యాకరణాల్లో క్యాంబెల్ వ్యాకరణ గ్రంథం ప్రామాణికమైనదిగా పరిగణనకెక్కింది.


1812 నుంచి దేశ భాషల అధ్యయన సంఘానికి కార్యదర్శిగా ఉన్నాడు. అదే తర్వాత కాలేజ్ బోర్డుగా మారింది. 1816లో వ్యాకరణం ముద్రణ జరిగింది. 1812 నుంచి 1820 వరకు ఎనిమిదేళ్లు కాలేజ్ బోర్డు కార్యదర్శిగా, పరీక్షాధికారిగా పనిచేశాడు. ఆయన ప్రతిభా విశేషాలకు మెచ్చి ప్రభుత్వం వారు నిఘంటువు రాయమన్నారు. క్యాంబెల్ ఆంధ్ర దీపికను ప్రాతిపదికగా తీసుకొని కొత్త పదాలు కలుపుకుంటూ తెలుగు ఇంగ్లీషు అర్థాలిస్తూ నిఘంటువు పూర్తి చేశాడు. దాని తొలి ముద్రణ 1821లోనూ, రెండవ ముద్రణ 1848లోనూ జరిగింది. తన వ్యాకరణానికి ఆయన రాసిన ప్రవేశిక చాలా గొప్పది. ఆంధ్ర భాషా చరిత్రను, ఆంధ్రదేశ చరిత్రను సంక్షిప్తంగా రాసినా అది కూడ ప్రామాణికమైనది. ఆంధ్ర చరిత్ర రచించిన వారిలో క్యాంబెల్ మొదటివాడు కావచ్చునని ఆరుద్ర అభిప్రాయపడ్డారు.11 తన గ్రంథంలో త్రిలింగ శబ్దానికి విపులమైన పీఠిక రచించాడు. ప్రాచీన పాశ్చాత్య చరిత్రకారులు ఆంధ్రదేశం గురించి భావించిన అంశాల్ని ప్రస్తావించాడు. వివిధ భారతీయ పురాణాల్లో ఆంధ్రప్రసక్తి ఉన్న ఘట్టాలను క్రోడీకరించాడు. మెకంజీ సేకరించిన వ్రాత ప్రతులను, శాసనాలను ఆధారం చేసుకొని విజయనగర రాజుల జాబితా రూపొందించాడు.


ఫ్రాన్సిస్ వైట్ ఎల్లిస్ - తులనాత్మక అధ్యయనం


మద్రాసులో రైటర్ 1796లో సివిల్ సర్వీసు ప్రారంభించిన ఎల్లిస్ 1802లో రెవెన్యూ బోర్డు సభ్యునిగా, జిల్లా జడ్జిగా, కలెక్టర్ గా అనేక హోదాల్లో పనిచేశాడు. మచిలీపట్నంలో జడ్జిగా పనిచేస్తున్నప్పుడు తెలుగు బాగా నేర్చుకున్నాడు. తెలుగు, తమిళం, మళయాళం భాషల్లో ప్రావీణ్యం సంపాదించడంతో పాటు దక్షిణ భారతీయ భాషల విషయంలో చెప్పుకోదగిన కృషి చేశాడు. తమిళ, సంస్కృత, మళయాళ భాషలలో తెలుగును తులనాత్మకంగా అధ్యయనం చేసి ద్రావిడ భాషావాదం బలపడడానికి ఎల్లిస్ దోహదం చేశాడు.


ఎ. డి. క్యాంబెల్ తెలుగు వ్యాకరణానికి పరిచయంగా ఎల్లిస్ తెలుగుతో ద్రావిడ భాషకు గల సామ్యాన్ని గురించి రాసిన నోటును (1816) పొందుపరచడం జరిగింది.


భారతీయుల సాంఘిక పరిస్థితుల పట్లా, చరిత్ర పట్లా ఎంతో శ్రద్ధ కనబరచి ఆ విషయాలపై ప్రామాణిక రచనలు చేశాడు. "జనని సంస్కృతంబు సకల భాషలకును" అన్న కొందరు ఆంగ్ల పండితుల వాదాన్ని ఎల్లిస్ ఖండిస్తూ తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషలు ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాషలనీ, సంస్కృతం నుంచి జనించినవి కావని నిరూపించాడు. వాక్య నిర్మాణ పద్ధతిలో దక్షిణాది భాషలు సంస్కృతంతో ఎలా విభేదిస్తున్నాయో రాశాడు. మామిడి వెంకయ్య 'అంధ్ర దీపిక' ఉపోద్ఘాతంలో చెప్పిన తత్సను, తద్భవాలను గురించి చర్చించాడు. లక్ష్మధరుని షడ్భాషా చంద్రికను ఉటంకించాడు. ఇది భాషా శాస్త్ర విషయకంగా ప్రాముఖ్యాన్ని సంతరించుకోదగింది. ఎల్లిస్ మరణానంతరం ఆయన భాషా శాస్త్ర పరిశోధన పత్రాలన్నిటినీ సర్ వాల్టర్ ఇలియట్క అందే ఏర్పాటు జరిగింది. ఇలియట్ డాక్టర్ పోపు ఇచ్చి ఆక్స్ఫర్డ్ బోదిలియన్ గ్రంథాలయంలో భద్రపరచేట్లు చేశాడు.


కోలిన్ మెకంజీ - చారిత్రక సంపద


తెలుగుతో పాటు 15 భారతీయ భాషల్లో వేలాది వ్రాతప్రతులు సేకరించి అనంతర తరాలకు అమూల్యమైన విశేషాలను అందించిన పాశ్చాత్య ప్రముఖుడు కోలిన్మెకంజీ. లూయిస్ ద్వీపానికి చెందిన మెకంజీ 1783లో ఈస్టిండియా కంపెనీ వారి ఇంజనీర్స్ క్యాడెట్లో ఎంపికై భారతదేశం వచ్చాడు. మద్రాసు ప్రెసిడెన్సీ సర్వేలో పాల్గొన్న ఇంజనీర్లలో మెకంజీ ఒకరు. కోయంబత్తూరు, దిండిగల్, నెల్లూరు, గుంటూరు ఎక్కడికి సర్వే కోసం వెళ్లినా తనతో జిజ్ఞాసువులైన పండితులను తీసుకెళ్లేవాడు. 1809లో మద్రాసు సర్వేయర్ జనరల్, 1817లో కలకత్తా సర్వేయర్ జనరల్ గా ఉండి దాదాపు 70 వేల చదరపు మైళ్ల మేర సర్వే జరిపించాడు. కావలి వెంకట బొర్రయ్య. లక్ష్మయ్య అనే ఇద్దరు ప్రతిభావంతులైన తెలుగు సోదరుల సహాయంతో దేవాలయాలు, చెరువులు, రిజర్వాయర్లు, శాసనాల ప్రాచీన చరిత్రను మెకంజీ వెలికితీశాడు. ఆయన కృషిని సెంట్ జార్జి కోట ప్రభుత్వం కూడా ఎంతగానో ప్రశంసించింది.

తాను సేకరించిన 1620 ప్రాంతాల స్థానిక చరిత్రల కైఫీయతుల విశ్లేషణ, కేటలాగింగు చేపట్టిన కొంత కాలానికి 1821లో కలకత్తాలో మెకంజీ మరణించాడు. మెకంజీ సేకరించిన సమాచారన్నంతటినీ గపిండియా కంపెనీ కొనుగోలు చేసింది. 

ఏషియాటిక్ జర్నల్ మెకంజీ సేకరించిన విషయ సంపదను మొదటిసారిగా వెలుగులోకి తెచ్చింది.


విల్సన్స్ మెకంజీ కలెక్షన్స్ పేరుతో 1828లో కలకత్తాలో కేటలాగింగ్ ఆరంభమైంది. మెకంజీ సేకరించిన 176 తెలుగు లిఖిత ప్రతుల వివరాలు అందులో చోటు చేసుకున్నాయి. 36 పౌరాణిక, వైతాళిక సాహిత్య గ్రంథాలు, 23 స్థానిక చరిత్రలు, 82 ప్రతులు కావ్యాలు, నాటకాలు, గాధలకు సంబంధించినవి ఉన్నాయి. వీటి సహాయంతో సాధికారికమైన స్థానిక చరిత్ర నిర్మాణం చేయవచ్చు.


వీరేగాక ఇంకా ఎందరో తెల్లదొరలు తెలుగు ప్రాంతాల్లో, తెలుగువాళ్ల మధ్య తెలుగు భాషా సాహిత్యాల వికాసానికి కృషి చేశారు. వారందరి గురించి విపులంగా చర్చించడం ఈ అధ్యయనంలో సాధ్యమయ్యేది కాదు. అయితే వారిని నామమాత్రంగానైనా స్మరించడం బాధ్యత. బెంజిమెన్ బ్రాన్ఫీల్, జాన్. పి. మారిస్, థామస్ కన్ సెట్టస్, సర్ విలియం జోన్స్, చార్లెస్ విల్కిన్స్, హెన్రీ థామస్, కోల్ బ్రూక్, జె. బి. గిల్ క్రిస్ట్, విలియం కేరీ, జార్జి అబ్రహం గ్రియర్ సన్, రెవరెండ్ డేవిడ్ బ్రౌన్ (సి. పి. బ్రౌన్ తండ్రి) క్లాడినస్ బఛ్యస్, జాషువా మార్ష్మన్, హెన్రీ మార్టిన్, డేనియల్ కోరీ, డా. జాన్ లీడెన్... ఇలా వారి వారి స్థాయిల్లో, పరిమితుల్లో తెలుగు భాషా సాహిత్యాల వికాసానికి కృషి చేశారు.


- కర్లపాలెం హనుమంతరావు 

( మూలం - భాషా సాహిత్య స్వరూపం - డా॥ జె. చెన్నయ్య

రామకృష్ణుని గడుసుతనం సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 13 -11-2021 ( కీ.శే. దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి చాటు పద్య రత్నావళి నుంచి )

 



రామకృష్ణుని గడుసుతనం 

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 

13 -11-2021 

( కీ.శే. దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి చాటు పద్య రత్నావళి నుంచి ) 


వాకిటి కావ౨  తిమ్మనికి రాయలువారెప్పుడో ఒక  మంచి శాలువ  ఇచ్చారుట . దాని నతఁడు కప్పుకొని క్రుమ్మరుటఁ జూచి, మన వికటకవి దానిపైఁ గన్ను వేసి, మెట్లనను దానిని కాఁజేయవలయునని యూహఁజేసి, యుపాయము గుదుర్చు కొని యొకనాడుఁ తిమ్మనిఁ బిలిచి మెల్లఁగా నిట్లు బోధించెను. "ఓయీ! కృష్ణ దేవరాయలవంటి మహారాజుగారి ద్వారపాలకుఁ డవై, యొక పద్యమునైనను గృతినందకుండుట నాకిష్టము లేదు.” అనఁగా "అయ్యా! తగినంత బహుమానము నియ్యనిదే కవులు పద్యములు చెప్పుదురా” యనెను. రామకృష్ణుడు “తిమ్మా, నే నుపాయముఁ జెప్పెద వినుము; ఒక్కొక్క కవి నొక్కొక్క చరణమువంతున నడిగితివేని సులభముగాఁ బదిపద్యములఁ గృతి నందఁగలవు. ఇంతకు వేఱక యుపాయము లేదని చెప్పఁగా నతఁడు సంతోషించి, మఱునాఁ డుదయమున వాకిట నిలచి మొదట వచ్చిన పెద్దన్న గారికిఁ దనకోర్కి ని దెల్పఁగా నక్కవి నవ్వి, యిట్లొక చరణమును జెప్పి లోపలికిఁ బోయెను.


క. “వాకిటి కావలి తిమ్మా


తర్వాత వచ్చిన భట్టుకవి నాశ్రయింపఁగా సాతఁడు..... 


"ప్రాకటమగు సుకవివరుల పాలిటిసొమ్మా


అనుచరణమును వ్రాసియిచ్చిపోయెను. పిమ్మట వచ్చిన తిమ్మకవి కీసంగతిని విన్న నింపఁగా నతఁడు


“నీ కిదె పద్యము కొమ్మా”


అని చెప్పి పోయెను. వీరి రాకను గనిపెట్టియుండి నాలు గవ వాఁడుగా వచ్చిన మన రామకృష్ణుఁడు -


“నా కీపచ్చడమె చాలు నయముగ నిమ్మా.”


అనిపూర్తిచేయఁగా తిమ్మఁడు మాఱుపలుక నేరక సెలువ నిచ్చివేసెను.” 


ఈకథవిని రాయలునవ్వి తిమ్మనికి వేఱక సేలువ నొసంగెనంట.


సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 

13 -11-2021 

( కీ.శే. దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి చాటు పద్య రత్నావళి నుంచి ) 

ఈనాడు - హాస్యం - వ్యంగ్యం మనకు బండి.. మరచి పొండి ( ఈనాడు - ప్రచురితం - 07 -07 - 2009 )




ఈనాడు - హాస్యం - వ్యంగ్యం 

మనకు బండి..  మరచి పొండి 

( ఈనాడు - ప్రచురితం - 07 -07 - 2009 ) 


అడగనిది అమ్మయినా పెట్టదని సామెత.  అడిగినా నలిపి నామం పెట్టలేదే ఈ మమతమ్మ!


దీదీ బెంగాలీ కదా... తెలుగు సామెత తెలిసుండదులేరా! లేకపోతే మన సియం లేఖవెళ్ళినా 'నోనో' అని ఎందుకం టుంది? ఇదేమన్నా టాటావారి 'నానో' కారా?


తాతా! మొదట్నుంచీ నువ్వా కలకత్తా కాళికి వత్తాసిస్తున్నావుగానీ, మన జగన్ లాంటి యువ ఎంపీ వెళ్ళి అడిగినా ఒక్క యువ రైలయినా ఇవ్వ కుండా ఖాళీ చెయ్యి చూపించిందే ! ఛ... ప్రతిపక్షాల వాళ్ళచేత ఇప్పుడు ఎన్ని పడాల్సొస్తోందీ?


ఇందులో ఎవర్నో అని ఏం లాభంరా! జగన్మోహిని కాలంనుంచీ ఈ బంతిలో వలపక్షం వస్తున్నదే! బీహారీ లాలూ బ్రీఫ్ కేసులోనుంచి తీసినా, బెంగాలీ బెనర్జీ గుడ్డసంచీలోనుంచి తీసినా తెలుగువాడికి  మొదటినుంచీ పడుతూ వస్తున్నవి ముష్టి  చివరి మెతుకులే ! పాపం ఆ అమ్మను అనటం ఎందుకు? బిర్యానీ, చేపల పులుసు చౌకగా కమ్మగా పెడుతున్నందుకా? పాతిక్కే. బైరాగి టికెట్లు అమ్ముతున్నందుకా ? అన్నింటికీ లడాయి పడితే ఆ లాలూకీ నీకూ తేడా ఏందిరా? అక్క డికీ నీకు హైదరాబాదులో  అంబులెన్సులు, సికిందరాబాదులో కాలేజీ.. 


బెంగాలకు మాత్రం బోగీల ఫ్యాక్టరీ! స్టేషనేలేని లాలగడ్ ని  అభివృద్ధి చేస్తుందంట.... మంటగా ఉంది తలచుకుంటేనే! 


ఆ మంటలకు మందేసేందుకు మన రైలు ఆసుపత్రిలో వెంటనే ఓ విభాగం తెరిపించేస్తుందంటలే! దటీజ్ మమత 


సమత లేని మమత శుభ్రంగా, భద్రంగా రైలు శాఖను నిర్వహిస్తానంది. సుబ్బరంగా రైళ్యూ లైన్లూ సొంత రాష్ట్రానికి, భద్రంగా ప్రాజెక్టులూ నిధులూ సగం ప్రైవేటు రంగానికి అప్పగించేసింది! ఆదా యంలో మన దక్షిణ రైల్వే రెండోదిగదా!  అయినా దీదీ టికెట్లు కూడా కొనకుండా తుపాకులు పట్టుకు తిరిగేచోట పట్టాలు వేయడమేమిటి? ఇదేనా సామాజిక ప్రయోజనాన్ని పట్టాలెక్కించటమంటే? 


బెంగాలు మాత్రం సమాజం కాదా, ఏమిట్రా? ఎప్పుడూ అక్కడ ఎర్రదండు ప్రయోగాలే జర గాలా? రైలుశాఖకు దీదీ కొత్తదేమీ కాదు. ఎన్డీఏలో ఉండగా రెండుసార్లు బడ్జెట్ సమర్పించింది. తెలుసా?


ఫ్రంటేదైనా మీ దీదీ పంథా  ఒకటేలాగుంది.


లేడికి లేచిందే పరుగని రైటర్సు భవనం మీదప్పుడే గడ్డిపూవు మొలిపించెయ్యాలని ఆత్రమా ? మరీ అంత చిత్రమా? 


అసలు వెస్ట్ బెంగాలే ఒక చిత్రం తూర్పున ఉండే పడమటి విచిత్రం! ప్రెస్ వాళ్లనయినా  ఇంప్రెస్ చేయవచ్చుగానీ- మీ ముచ్చుగాళ్ళకు ఏదీ నచ్చక్  పోవటం మహా విచిత్రం; 'ముష్కిల్ ఆసాన్' అని రైలు టికెట్లు రోడ్లమీది తోపుడు బళ్ళలో కూడా దొరికే ఏర్పాట్లు చేసినా.. ఉహూ- మీ చేత 'ఓహో' అనిపించలేకపోతుందే పిచ్చితల్లి.  డబుల్ డెక్కర్లు ,

రైలు డాక్టర్లు, క్లీన్ టాయిలెట్లు పెట్టినా క్లీన్ చిట్ ఇవ్వకపోతుంటరి మరి?


'మాట మార్చకు తాతయ్యా మాటిమాటికి! ' మా, మాటి, మనుష్ ' అంటుంది గదా దీదీ ? యాబైఏడు రైళ్ళకు ఒక్కటా మనకిచ్చేది? చాంతాడంత ఉంది ఆ ఆదర్శస్టేషన్ల జాబితా అందులో మనవి కనిపించేవి. . ముష్టి మూడా! 


భాషాభిమానం ఉంటే మంచిదే.  'దురంటో'నో కరంటో'నో ఏదో ఒకటి పెట్టుకో మను. ఎక్కడా ఆగని ఆ కొత్తరకం రైళ్ళలో ఒక్క టైనా మన తెలుగువాళ్ళకు దక్కకపోనీయకపోవటమేమిటి? మనకు ముప్ఫైముగ్గురు పార్టీ ఎంపీ లున్నా కొత్త ప్రాజెక్టులూ, పాతవాటికి నిధులు, రైళ్ళూ, లైన్లూ దక్కింది సున్నా!


మన బలమే మన బలహీనతరా అబ్బాయ్! అంకెకి కౌరవుల సంఖ్యలో మూడో వంతున్నా గట్టిగా అడిగితే ఆ 'కాళి' ఎక్కడ చొక్కా కాలరు పట్టుకుంటుందోనని తత్తరపడే ఉత్తర కుమారులే ఎక్కువ. భయం. మనకు పల్లకి మోసే బోయీ పనే హాయి. గడపతొక్కిననాడే కాపురం చేసే కళ తెలిసిపోతుందని... మంత్రి పదవుల పంపకాలప్పుడే మనకెంత పవరుందో తెలిసిపోయింది.


ఎంత తక్కువమంది మంత్రులుంటే అంత ఎక్కువ రాబట్టుకోవచ్చని అప్పట్లో చప్పట్లు కొట్టుకున్నారుగా మనవాళ్ళు!  మనవాళ్ళ నిద్రచూసే కాబోలు ఆరుద్ర ఏనాడో అన్నాడు .. . ' నీవెక్కాల్సిన రైలు ఓ జీవితకాలం లేటు' అని.


రైట్.... ఊరికే ఇక్కడ కూర్చుని ఇలా రంకెలేసుకుంటూ బీపీలు పెంచుకునే బదులు ఏ కేవీపీలాంటి వీఐపీనో లాబీయింగుకు పంపించుంటే లాభం ఉండేది అని ఏపీలో అందరూ అనుకుంటున్నారా? అయిపోయిన పెళ్ళి క్కూడా  ఇంకా బాజాలెందుకు? బండిపోయింతరువాత  ప్లాట్ ఫాం  మీద ఈ చిందులెం దుకు? ఏదేమైనా ఒకందుకు నాకు చాలా ఆనందంగా ఉందిరా నాయనా? '


ఏంటది తాతయ్యా! 


ఈ బడ్జెట్ అతి తక్కువ సమ యంలో తయారైనా- అతి ఎక్కువ నష్ట పోయే మన రికార్డు ఉందే. అది మాత్రం మన ఉక్కు ఫ్యాక్టరీలా  చెక్కుచెదరలేదు. మన రాష్ట్రం శని అంత మహత్తరమైనదని.. 


ఆనందబాష్పాలు రాలుస్తున్నావా! 


ఆ వెటకారాలిక ఆపి, జనాలు మనల్ని ఛీకొట్టకుండా ఉండటానికి మంచి ఉపాయమేదన్నా చెప్పొచ్చుగా తాతయ్యా


అలా అడిగావు బాగుంది. తప్పు మనదీకాడు. మమతాదీకాదు. మనరాష్ట్రం జాతకంలోనే దోష ముంది- అని ముందు పండితులచేత భారీ ప్రక టనలిప్పించండి! అందుకే కదా వానలు కూడా పడటంలేదంటే, మన జనాలు ఈజీగా నమ్మే స్తారు. ఆనక రుతుపవనాల రాకకు ఇప్పుడు చేస్తున్నామే. వరుణయాగం తరహాలో ధూమ శకట దేవుడి ఆవాహనకు కూడా ఏ రుత్విక్కుల చేతనో ఓ యజ్ఞం జరిపిస్తే సరి... ఈసారికి సారీ! అనకుండా సరిపోతుంది. 


పెద్ద బడ్జెట్లోనూ ముద్ద దక్కలేదని ఒకేసారి మహాయజ్ఞమేదో జరిపిస్తే మరింత భేషుగ్గా  ఉంటుందేమో తాతయ్యా!  


రచన - కర్లపాలెం హనుమంతరావు(

( ఈనాడు - ప్రచురితం - 07 -07 - 2009 ) 

ఈనాడు - హాస్యం- వ్యంగ్యం మూతి బిగింపులు రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం -21 - 08 - 2009 )




ఈనాడు - హాస్యం- వ్యంగ్యం 

మూతి బిగింపులు 

రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం -21 - 08 - 2009 ) 


'ఈ స్వైన్ ప్లూ  మూలకంగా ఒక్కసారి నగరాల ముఖచిత్రాలు మారిపోయాయి. ముక్కూ మొహమూ తెలీనివారు ఎక్కువైపో యారు: ముక్కుపచ్చలారని పసివాడినుంచి ముక్కుతూ మూలుగుతూ బతికే ముసలాడి దాకా ఎందరికో మూతికి చిక్కాలే!


నేతల అవాకులు, చెవాకులు వినే బాధ జనానికి తప్పింది. కోడళ్ళకు అత్తగార్ల నుంచి, మొగుళ్ళకు గయ్యాళి పెళ్ళాలనుంచి గద్దింపులు తప్పాయి. 


పిల్లలకు బళ్ళనుంచీ అడవిడుపు . పంతుళ్ళు నోళ్ళు తెరిచి ఏమీ అడగరు కనుక చదువులనుంచీ విరామం. 


డబ్బింగువాళ్ళకి పాపం దెబ్బే.  ధూమపానం, మద్యపానం బంద్! 'మందు' షాపులకన్నా మందుల షాపులు వ్యాపారంలో ముందున్నాయి.


ఆసుపత్రుల్లో ఆపరేషన్లు చేసేవాళ్లెవరో, చేయించుకునేవాళ్ళెవరో తేడా తెలీకుండా  ఉంది. జూనియర్ వైద్యులకు రోగి బంధువుల బెడద తప్పింది. 


మూగభాష వేగంగా వాడుకలోకొస్తోంది. 'సైగల్'క్కు న్నంత మంచి గొంతున్నా సైగలు తప్ప టంలేదు. ఆడవాళ్ళు అపార్థం చేసుకునే ప్రమాదముంది. మగాళ్ళూ... తస్మాత్ జాగ్రత్త! 


ఆడవాళ్లూ, మీరూ జాగ్రత్త! పతి ఎవరో, పరపతి ఎవరో పరకాయించి చూసుకుని మరీ మసలాలి! మూతిక ట్టున్న మొగాళ్ళ మొహాలన్నీ ఒకేరకంగా ఏడుస్తాయి. 


కొంతమంది శునకప్రియులు తమ కుక్కల మూతులక్కూడా చిక్కాలు కడుతుండటంవల్ల అవి దొంగలను చూసి కూడా అరవలేకపోతున్నాయని పోలీ సులు వాపోతున్నారు.


కరవు తరుముకొచ్చేస్తోంది. కందిపప్పు వంద దాటింది. సన్నబియ్యం యాభై, నిత్యావసర సరకులన్నీ ఆకాశంలో చుక్కల్లా మారాయని... చంద్రబాబులాంటి వాళ్ళు హడావుడి చేస్తున్నారు గదా! ఈ స్వైన్ ప్లూ  భయం తో అందరినోళ్ళూ ఠప్పుమని మూతబడ్డాయి. 


బస్తా రూపాయికిస్తానన్నా బాదంపిస్తానైనాసరే జనం కొని తినే ధ్యాసలో లేరు. దేవుడెప్పుడూ మన సీయంవైపే ఉంటా డని ఇప్పుడైనా ఒప్పుకొంటావా? 


'అవును తమ్ముడూ! దేవుడెప్పుడూ తమ వైపే! లేక పోతే కరవొచ్చి ఒకవంక జనం ఊళ్ళు అలా ఖాళీ చేసిపోతున్నా 'ఉత్తిదే... అది స్వైన్ ప్లూ  భయం వల్లలే!' అని బుకాయించే అవకాశం ఇప్పుడెందుకిస్తాడులే!


తమాషాకిదా సమయం అన్నా!


తమాషానా, పాడా! మాయదారి పాడురోగమొచ్చి జనాలకేం చేయాలో దారితోచక అల్లాడుతూ ఉంటే అమృతాంజనమింత తలకు పట్టించుకొని తలుపేసుకుని దుప్పటి కప్పుకొని పడుకోమని తమాషా చేస్తోందెవరు?!


అయిదు శతాబ్దాల కిందట  ఏండ్రియస్ ఐపాలిస్ అనే వైద్యుడు ఒక రోగి శవాన్ని కోసి పరీక్ష చేస్తుండగా అత గాడు జీవించే ఉన్నట్లు తెలిసి... బతికున్నవాళ్ళ మీద కత్తి పెట్టడం రోమన్ శిక్షాస్మృతి ప్రకారం నేరమని ఆ వైద్యుడికి మరణదండన విధించాడట అప్పటి చక్రవర్తి . ఐదో ఛార్లెస్ ఆ లెక్కన జనాల ప్రాణాలను ఇలా గాలి కొదిలేసి తమాషా చూస్తున్న మనవాళ్ళనేం చేయాలో నువ్వే చెప్పు! 


అదేంటనా? .... పుట్టినవాడు గిట్టక తప్పదు. భారతంలో యక్షుడు ప్రపంచంలోకల్లా వింత ఏది? అనడి గితే ధర్మరాజేమన్నాడో తెలుసా? వెనకపోయేవాళ్ళు

ముందుపోయేవాళ్ల కోసం ఏడవటమని! మని

షికుండే  ఏడు ఈతి బాధల్లో ఈ ఫ్లూ లాంటి మహమ్మారి ఒకటి. అయినా మనల్ని ఒకళ్ళాచ్చి ఏడిపించాల్నా? పుడుతూనే ఏడుపు మొదలుపెడతాం. పోతూ పదిమందినేడిపిస్తాం. 


పదిమంది ఏడవాలంటే ఏ గాంధీగారిలాగో బతకాలి. నరకాసురుడు పోయినందుకు ఇప్పటికీ మనం దీపావళి చేసుకుంటున్నాం.  చావు తప్పదని తెలిసీ బతికున్నంత కాలు ఆ చావును మార్కండేయుడి మాదిరి తప్పించుకో వాలనే చూస్తాం గదా ! ఆరోగ్యం పౌరుడి హక్కు . దాన్ని పరిరక్షిస్తామని ప్రమాణాలు చేసి మరీ గద్దెనెక్కిన పెద్దమ నుషులు పెద్ద పెద్ద వాళ్ళ ప్రాణాలు ప్రమా దంలో పడితే తప్ప స్పందించమంటే ఎట్లా? బాధ్యతగా మెలగాల్సిన మన ప్రభువులూ, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలవల్ల అధికంగా లాభాలు పొందే ధనాసుపత్రులవారు  తమకసలేమీ పట్టనట్లు, మొక్కుబడిగా ఓ నాలుగు కుక్కిమంచాలు ఓ మూలగదిలో పడేసి ముక్కు మూసుకుంటున్నారు. ప్రాణభయానికి మించిన భయం ప్రపంచంలో మరేదీ లేదు . చికిత్స అంటే కేవలం శాస్త్రనైపుణ్యమే కాదు. రోగభయం ఉన్నవాళ్ళకు నాలుగు ఓదార్పు మాటలు చెప్పి ప్రాణాలను నిలబెట్టే పుణ్యం కూడా. యక్షుడు అడిగినప్పుడు ఆ ధర్మరాజేదో వింత విషయం చెప్పాడన్నావే! అంతకన్నా వింత విషయ మేంటో తెలుసా? జరిగిందో లేదో తెలీని అత్యాచారం కేసుని ప్రతిపక్ష ప్రజాప్రతినిధిపై రుద్దటానికి చూపించే శ్రద్ధలో లక్షోవంతైనా ... లక్షలాది ప్రజలకు ప్రాణాంతకంగా మారబోతుందన్న ఈ మాయరోగాన్ని మట్టుబెట్టటానికి మన ఏలినవారు చూపించకపోవటమే! ఇందుకు ఏ శిక్షాస్మృతి ప్రకారం ఏ దండన విధించాలో తెలీక రాయైపోయినట్లున్న ఆ దేవుణ్నే ఇక మనం ప్రార్ధిం చాలేమో?


ఏమని?


ఇప్పటికైనా మన ప్రభుత్వం కళ్ళు తెరిపించమని.. సద్బుద్ధి ప్రసాదించమని... ప్రజల ప్రాణాలు కాపాడే పనిలో పడేట్లు చూడమని!'


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం -21 - 08 - 2009

వ్యాసం స్వామి వివేకానంద -రచన - కర్లపాలెం హనువుంతరావు ( సూర్య సంపాదకీయ పుట ప్రచురణ )



వ్యాసం 

స్వామి వివేకానంద 

 -రచన - కర్లపాలెం హనువుంతరావు 

( సూర్య సంపాదకీయ పుట ప్రచురణ ) 



స్వామి వివేకానంద డాంబిక ప్రదర్శన లేని విరాగి.  ప్రాపంచిక విషయాల తరహాలోనే రాజకీయ వ్యవహారాలనే తామరాకు పైన   తనను  తాను ఓ నీటి బిందువుగా భావించుకున్న ఆధునిక యోగి.  ఆ పరివ్రాజకుడికి ఆ అంటీ ముట్టనితనం   సాధ్యమయిందా?  పరిశీలిద్దాం. 

తన జీవితకాలంలో ఎన్నడూ రాజకీయరంగం దిశగా స్వామి అడుగులు పడిన సూచనలు కనిపించవు.  ఏ రాజకీయ పక్షానికీ ఆయన మద్దతు లభించిన  దాఖలాలూ దొరకవు. తన స్వంత  పరివ్రాజక సంస్థలోనూ రాజకీయరంగ ప్రస్తక్తిని నిషేధించిన స్వామీజీ.. ఆ నిబంధనను అధిగమించినవాళ్లని సభ్యత్వం నుంచి తొలగించేందుకైనా సందేహించినట్లు కనిపించదు. రామకృష్ణ మిషన్ నుంచి నివేదిత రాజకీయ సంబంధిత  కారణాల  వల్ల వైదొలగినప్పటి బట్టి స్వామీజీలో ఈ రాజకీయ విముఖత మరింత కరుడుగట్టినట్లు  భావిస్తారు. వివేకానందుడు నివేదితకు పరివ్రాజక సంఘంలో సభ్యత్వం నిరాకరించడం  ఈ సందర్భంగా గమనించవలసిన ముఖ్యాంశం.  

మనిషి పట్ల స్వామికి ఉండే ప్రేమ, సానుభూతి అపారమైనవి. అయినా సందర్భం వచ్చిన ప్రతీసారీ  వివేకానందుడు రాజకీయాల పట్ల తనకున్న విముఖతను నిర్మొహమాటంగా బైటపెట్టేవారు. స్వామి దృష్టిలో రాజకీయాలు మనిషిని సంకుచిత మార్గంలోకి మళ్లించేవి. రాజకీయం మిషతో ఎదుటి మనిషిని పీడించడమే కాదు, తనను గూర్చి తాను  డాంబికంగా  ఊహించుకునే మానసిక రుగ్మత మొదలవుతుందన్నది  వివేకానందుడి నిరసన వెనక ఉన్న భావన. ప్రస్తుతం నడుస్తున్న రాజకీయ ప్రహసనాలు చూస్తున్నప్పుడు వివేకానందుడి నాటి ఊహలో వీసమెత్తైనా అసత్యం లేదనే అనిపిస్తుంది.  

స్వామి దృష్టిలో ఈ దేశం పుణ్యభూమి. ఇక్కడి అణువణువు అత్యంత పవిత్రమైనది.  రుషులు,  జాతి వివక్షతకు తావీయని పద్ధతుల్లో  సర్వ మానవాళికి  ఉచితంగా  ఆధ్యాత్మిక జ్ఞానసంపదను పంచిపెట్టారు. వారి అనుయాయులదీ అదే సన్మార్గం. భారతీయుల  మానవతావాదం యావత్ ప్రపంచం దృష్టిలో గౌరవనీయమైన స్థానం సాధించుకునేందుకు ఇదే ముఖ్య కారణం. సర్వశ్రేష్టమైన మానవత్వం పట్ల   భారతీయుల ఆధ్యాత్మిక సంస్కృతి కనబరచిన శ్రద్ధాసక్తులు  ప్రపంచం దృష్టికి తేవడమే లక్ష్యంగా చికాగో సర్వమత మహాసభ తాలూకు   వివేకానందుడి తొలి  ప్రసంగం సాగింది కూడా. 

 ప్రపంచం భారతీయ సంస్కృతి ఔన్నత్యం గూర్చి చర్చించడానికి భారతీయులు కేవలం భారతీయుల మాదిరిగానే ఉండి తీరాలని స్వామి ప్రగాఢంగా విశ్వసించారు. కేవలం ఆ కారణం చేతనే మరే ఇతర దేశమో, సంస్కృతో మన దేశం మీదనో,  సంస్కృతి మీదనో పెత్తనం చెలాయించే అత్యుత్సాహం ప్రదర్శించినప్పుడు, చెత్త రాజకీయాల ద్వారా  జోక్యం చేసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు వివేకానందుడు తీవ్రంగా అసహం వ్యక్తపరిచింది.  

ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే భారతీయుల పుణ్యభూమి పై పరాయివారి పాలన కొనసాగకూడదన్నదే స్వామి ప్రగాఢ కాంక్ష. ఆ చింతనాపరుడి ఆలోచనల నుంచి రగిలిన దేశభక్తి భావనలే అప్పటి ఈ దేశపు యువతను తెల్లవారి పాలనకు ఎదురు నిలిచే దిశగా ప్రోత్సహించింది. స్వీయ వ్యక్తిత్వ వికాస నిర్మాణం దిశగా ధ్యాస పెట్టేందుకూ దోహదించిన భావజాలం వివేకానందునిది. ఆ పరివ్రాజకుడి ప్రబోధాల ప్రభావమే మరణానంతరమూ  బ్రిటిష్ దొరల దృష్టిలో స్వామిని  విప్లవకారుడి కింద ముద్ర వేయించింది. 

నైతిక పతనం వల్ల నిజమైన ఆర్థిక స్వాతంత్ర్యం  సాధ్యం  కాదు. రాజకీయాలదే మనిషి పతనానికి చాలా వరకు ప్రధాన బాధ్యత- అన్నది రాజకీయాలపై వివేకానందుని తిరుగులేని సూత్రీకరణ. 'చట్టం, ప్రభుత్వం, రాజకీయాలు మాత్రమే సర్వస్వం కాదు. అవి కేవలం మనిషి జీవన పరిణామ క్రమంలో కొన్ని దశలు మాత్రమే. మానుషత్వ సాధన ఆయా రంగాల ఊహకైనా అందనంత ఎత్తులో ఉంటాయన్న'ది  వివేకానందుడి ఆలోచన. మనిషి అంతరంగ పరంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన నీతి నిజాయితీల  పట్ల రాజకీయాలకు ఎప్పుడూ బొత్తిగా ఆసక్తి ఉండదు’ అన్నది వివేకానందుడి ఫిర్యాదు. కులం, మతం, వర్గం -ఇత్యాదుల పరంగా ప్రజావళిని  విభజనకు గురి చేసే రాజకీయాలు ఈ దేశాన్ని పట్టి వదలకుండా పీడిస్తున్న ప్రధాన రుగ్మతలుగా స్వామి ఆనాడే గుర్తించి గర్హించారు. రెండో ప్రాధాన్యంగా ఉండవలసిన ‘గుడి- మసీదు- చర్చి’ రాజకీయాలు మొదటి స్థానం ఆక్రమించడం స్వామీజీకి బొత్తిగా  గిట్టేది కాదు. మానుషత్వం సంకుచితమయిపోతూ, దేవుళ్లూ దయ్యాలనే భావనల పట్ల వెర్రితనం ప్రబలిపోవడం మనిషికి, మనిషికి మధ్య పూడ్చలేని అగాథాలను సృష్టికేనన్నది ఆయన భావన. రాజకీయక్షేత్ర అనైతిక క్రీడల పట్ల స్వామీజీ క్రుద్ధుడు కాని క్షణం లేదు. 'ఉన్న పరిమిత అనుభవంతో నేను సేకరించిన జ్ఞానం నాకు బోధిస్తున్నది ఏమిటంటే.. మతం మీద మనం ప్రదర్శించే విముఖత్వానికి  మతం అసలు కారణమే కాదు. మనిషిలోని విద్వేషగుణానికి మతాన్ని తప్పు పట్టి ప్రయోజనంలేదు. ఏ మతమూ మనిషిని నిట్టనిలువుగా తగలవేయమని చెప్పదు; సాటి మనిషిని పీడించమనీ రెచ్చగొట్టదు. ఆ తరహా  దుష్కృత్యాలు చెయ్యమని మనిషి మీద వత్తిడి చేసేందుకుగాను మతం పుట్టలేదు. అంతులేని అమానుష కార్యాలన్నిటికి మనిషిని  ప్రేరేపిస్తున్నవి నిజానికి జుగుప్సాకరమైన రాజకీయాలే. కానీ,  ఆ తరహా  అవాంఛనీయ రాజకీయాలనే నిజమైన మతమని జనం నమ్ముతున్నారిప్పుడు! ఈ విషాదకర పరిణామాలకు బాధ్యులెవరో గ్రహించినప్పుడే మనిషికి నిజమైన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు లభించేది' అన్నారో సందర్భంలో స్వామి వివేకానంద మతానికి రాజకీయాలకు మధ్య గల అపవిత్ర సంబంధాలను ఎండగడుతూ.  

మతం అసలైన పరిమళం ఆధ్యాత్మికత. నిజమైన ఆధ్యాత్మిక విశ్వాసి దుష్కృత్యాల మీద ధ్యాస పెట్టడు. పరులకు దుఃఖం కలిగే చర్యలు చేపట్టడు.  స్వానుభవం నుంచి వెలికి తీసిన వెన్నముద్దల వంటి సూక్తులు పంచిపెట్టే ఒక సందర్భంలో స్వామి వివేకానందుడు 'మనిషి మేధస్సు చేయదగిన అత్యుత్తమైన ఆరోగ్యకరమైన దారుఢ్య సాధన.. స్వచ్ఛమైన అంతరంగంతో మతాన్ని అనుసరించడం మాత్రమే' అని హితవిచ్చారు.  

జంతువు, మనిషి, దేవుడు- ఈ ముగ్గురికి  ముఖ్య ప్రవృత్తుల సంగమమే మనిషి. అతనిలో అంతుబట్టకుండా దాగి  ఉండి అంతర్గతంగా చెలరేగే రాగద్వేషాల వంటి దుర్లక్షణాలను అణచివేయడం ద్వారా పశుప్రవృత్తిని సాధ్యమైన మేరకు కుదించి మనిషిలో నిద్రాణమై ఉన్న దైవత్వాన్ని తట్టిలేపడమే 'మతం' అసలు లక్ష్యం. 'కాబట్టే  దేశానికి ఒక రాజ్యాంగం ఎంత అవసరమో, మనిషికి మతమూ అంతే అవసరం' అని వివేకానందుడు భావించింది. ఈర్ష్యాసూయలు, క్రోధావేశాలు వంటి విద్వేష భావనలకు మాత్రమే ఆలవాలమైన రాజకీయాలు సర్వమానవళి పట్ల సరిసమానమైన ప్రేమాభిమానాలను పంచవలసిన మనిషికి మేలు చేయవని స్వామి గట్టిగా నమ్మారు. ప్రతికూల దృక్పథ రాజకీయాలతో ప్రపంచమంతా పొంగి పొర్లిపోతున్న సన్నివేశాల మధ్య జీవిస్తున్న స్వామి పౌరుల మనసులు దుర్మార్గమైన ఆలోచనలతో కలుషితం కాక  ముందే, వారి మెదళ్లను అందుకే ఉదాత్తమైన ఆధ్యాత్మిక భావనలతో ముంచెత్తెయ్యాలని  అనుక్షణం ఆరాటపడిపోయింది.  

యూరోపియన్ మేధావుల సదస్సులో ఉటంకించిన భావాలను పునరాలోచిస్తే వివేకానందుడికి భారతీయ సోషలిజమ్ పట్ల ఎంత  చక్కని  అవగాహన ఉందో అర్థమవుతుంది. 'భారతదేశంలోనూ సోషలిజమ్ ఉంది. కానీ  అదీ యూరోపియన్ తరహా ద్వంద్వ విధానం కన్నా విభిన్నంగా ఉంటుంది. అద్వైతమనే అఖండ జ్యోతుల వెలుగుల్లో కళాకాంతులీనే సాంఘిక వ్యవస్థ మాది. యూరప్ లో ప్రాచుర్యంలో ఉన్న సోషలిజమ్ భావనలో మాత్రమే ఆర్థిక సోషలిజమ్. అర్థికపరమైన  కోణంలో చూడడమే అందులోని ప్రధాన  లోపం. బైటకు  వ్యక్తివాదానికి చోటిచ్చే వ్యవస్థగానే  కనిపించినప్పటికీ,  వాస్తవానికి అది వ్యక్తిలోనే నిత్యం సంఘర్షించే రెండు పరస్పర విరుద్ధమైన శక్తుల(మనసు, మెదడు)ను పరిగణలోకి తీసుకునేపాటి శ్రద్ధ చూపించలేదు’ అని స్వామి కుండబద్దలు కొట్టినట్లు చెప్పిన మాట. మార్క్సిజమ్ ఒక  రాజకీయ భావజాలంగా యూరప్ నంతటా ముంచెత్తుతున్న దశలో, దాని తాకిడి హిందూదేశపు ఎల్లలలను కూడా తాకుతున్న నేపథ్యంలొ వివేకానందుడు నిర్భీతిగా వెల్లడించిన మనసులోని మాటలు ఇవి. ఆ నాటి రాజకీయ యుగసంధిలోని పరిణామాలన్నింటిని బాగా ఆకళింపు చేసుకున్న ఆధ్యాత్మిక చింతనాపరుడు కాబట్టే వివేకానందుడు సోషలిజమ్, మార్క్సిజమ్ వంటి సాంఘిక చైతన్య భావజాలాలలోని  'సామాన్యుణ్ణి ఉద్ధరించే లక్ష్యం'  వైపుకు ఆకర్షితుడై తనను తాను ఒక 'ఆధ్యాత్మిక సోషలిష్టు'గా ప్రకటించుకున్నాడు. ఒక పరివ్రాజకుడు సోషలిజమ్ పట్ల ఆకర్షితుడవడం వరకు నిజంగా ఒక అద్భుత సన్నివేశమే! కాని ఆ పోలిక అక్కడి వరకే సరి.

సోషలిజమ్ లోని శ్రామిక పక్షపాతం స్వామిని బాగా ఆకర్షించిన సద్గుణాలలో ఒకటే కానీ, అదే సమయంలో పీడితుని బాధా విముక్తికై సోషలిజమ్ సూచించిన మార్గమే సమగ్రమైనదిగా భావించడానికి ఆయన సమ్మతించలేదని కూడా గమనించడం ముఖ్యం. సోషలిజమ్ భావనను ఆయన 'సగం ఉడికిన ఆహారం'గా భావించారు.  

అంతర్గతంగా దాగిన లోపాల వల్ల ఉన్నవారికి, లేనివారికి మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చే  శక్తి సోషలిజానికి చాలదన్న భావన వివేకానందుడిలో ఉంది.  సోషలిజమ్ ప్రవచించే మేధావుల మధ్య గల అభిప్రాయ భేదాలనూ ఆయన గుర్తించకపోలేదు.

 సోషలిజమ్ అన్న భావన ఆధునిక ప్రపంచానికి సైంట్ సైమన్ (1760 -1825), ఫ్యూరర్ (1772 -1832), రాబర్డ్ ఓవెన్ (1804 -1892) ద్వారా పరిచయం చేయబడింది.  త్రిమూర్తుల ద్వారా ప్రవచితమైన ఈ సామాజిక సూత్రాలు  ఎవరి వల్లా నమ్మదగిన స్థాయిలో సవ్యంగా నిర్వచించబడలేదన్నది ఒక ఫిర్యాదు. 'ఎవరి శక్తిని బట్టి వారికి దక్కవలసిన భాగం, ఎవరి అవసరాన్ని బట్టి వారికి దక్కవలసిన భాగం' అన్నది మార్క్స్ భావజాలమయితే,  విభేదించిన లెనిన్ మహాశయుడు దాని స్థానే  'ఎవరి శక్తిని బట్టి వారికి దక్కవలసిన భాగం.. ఎవరికి శ్రమను బట్టి వారికి దక్కవలసిన భాగం' అని కొత్త నిర్వచనం వెలువరించాడు. బెర్నార్డ్ షా ఆ ఇద్దరినీ ఖండిస్తూ ' సోషలిజమ్ మీద స్వామీజీ  చేసిన అధ్యయనమే సరళంగా, సవ్యంగా, సూటిగా సాగింద'ని  కితాబిచ్చాడు.  పారిశ్రామిక దేశాలు కాకపోయినప్పటికీ రష్యా, చైనాలలో కమ్యూనిస్టు విఫ్లవాలు చెలరేగడమే స్వామి పరిశీలనలోని సంబద్ధతకు నిదర్శనం' అని జి.బి.షా భాష్యం. 1897 సంవత్సరంలోనే  'మరో అర్థ శతాబ్దానికి భారతదేశం సంపూర్ణ స్వాతంత్ర్యం సాధిస్తుంద'ని స్వామి చెప్పిన జోస్యం సత్యం కావడం బట్టి  ఆయన పరిశీలనలోని బుద్ధినైశిత్యం వెల్లడవుతుంది. ఆ రోజుల్లో అసంభవమనిపించిన భారతదేశ స్వాతంత్ర్య హోదా స్వామి చెప్పిన విధంగానే సరిగ్గా 1947లో సాకారం కావడం మిడతంభొట్టు జోస్యమైతే కాదు గదా! నిశిత పరిశీలనా ప్రజ్ఞ గల ఘటికులే ఈ విధమైన నిర్దుష్ట ప్రతిపాదనలు ధైర్యంగా ముందుకు తెచ్చి ‘ఔరా!’ అనిపించుకోగలిగేది. 

స్వామి ప్రస్థానించిన 1902 కి అర్థ శతాబ్ది తరువాత భూగోళ   రాజకీయం పూర్తిగా గందరగోళ పరిస్థితుల్లో పడిపోయింది. అధికారం కోసం, అర్హతలతో నిమిత్తంలేని పెత్తనాల కోసం ప్రపంచదేశాలు  ప్రదర్శించే అత్యంత హీనమైన దౌర్జన్య రాజకీయరంగాలు ప్రపంచాన్ని పేలబోయే అగ్నిగుండంగా  మార్చేసాయన్న మాట నిజం. 

 సామ్రాజ్యవాదం, జాతీయవాదం, ఉగ్రవాదాలకు తోడు నియంతృత్వ పోకడలు ప్రబలి నేరాలకు, మూకుమ్మడి హత్యలకు అణచివేతలకు అంతమనేది లేకుండా కొనసాగుతున్నది ప్రపంచ రాజకీయమంతా.  రెండు సోషలిష్టు విప్లవాలు బలిగొన్న రక్తపాతం ఎంతో లెక్కలు అందనంత గాఢమైనది.  రెండు ప్రపంచయుద్ధాలు, అణుబాంబు విస్ఫోటాలు, ట్రేడ్ సెంటర్ దాడి వంటి దుర్ఘటనల వల్ల మానవత్వానికి జరిగిన చెరుపుకు  లెక్కలు కట్టడం ఎవరి తరమూ కాదు. అత్యంత సూక్ష్మ దార్శనిక దృష్టి గల స్వామి వివేకానందుడు అందుచేతనే ఈ తరహా దుర్ఘటనలు చోటు చేసుకోవడానికి చాలా ముందు నుంచే ' ప్రపంచం అగ్ని పర్వతం అంచున నిలబడి ఉంది. అది ఏ క్షణంలో అయినా భగ్గుమని పేలి సర్వమానవాళికి పూడ్చలేనంత నష్టం  కలిగించే అవకాశం ఉంది' అంటూ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ వచ్చారు. ఈ తరహా కష్టనష్టాల భారం తగ్గించే దిశగా అందుకే స్వామి యూఎన్ఓ వంటి  అంతర్జాతీయ స్థాయిలో సంస్థలు ఏర్పాటయి చురుకుగా పనిచేయాలని అభిలషించింది. 

కొన్ని దశాబ్దాల కిందట వరకు జాతీయ స్థాయిలో ఏర్పడ్డ సమస్యలను  జాతీయ స్థాయి సంస్థలే సమన్వయించి  సర్దిచెప్పేవి. పరిస్థితి మారింది. రెండు దేశాల పిట్టగోడ సరిహద్దు వివాదాలు కూడా ఊహించడానికైనా  సాధ్యం కానంత ఉత్పాతాలకు దారితీసి ప్రపంచదేశాలన్నింటిని  రచ్చలోకి ఈడ్చుకొస్తున్నాయి. ఇదంతా గామనించిన స్వామి ఆ తరహా సమస్యల పరిష్కారం అంతర్జాతీయ స్థాయిలో ఏర్పడ్డ  సంస్థల ద్వారానే సుసాధ్యమౌతుందన్న మాట వాస్తవం. అంతర్జాతీయ సంస్థలు, అంతర్జాతీయ కూటములు, అంతర్జాతీయ న్యాయచట్టాల ఆవశ్యకత నానాటికి పెరగక తప్పదు' అని ముందుగా గుర్తించి  ప్రకటింనిన వాస్తవిక రాజకీయ పరిశీలకుడు స్వామి వివేకానంద.   

నేటి మనిషి జీవితంలో రాజకీయాలు అంతర్గత విభాగాలవక తప్పడంలేదు.  రాజకీయాలతో నిమిత్తంలేని బతుకులు సాధ్యం కాదన్న పచ్చి వాస్తవం స్వామి అనుభావానికేమీ అందకుండా పోలేదు ఎప్పుడూ. అందు చేతనే సామాన్య గృహస్తును రాజకీయాల నుంచి దూరంగా ఉండమని ఆయన ఏనాడూ కోరలేకపోయివుండవచ్చు. కానీ రాజకీయాలతో అనుసంధానం ఏర్పరుచుకునే విధానంలోనే కొత్త పుంతలు తొక్కమని మాత్రం  ప్రబోధించేందుకు ప్రయత్నం చేసారాయాన. ‘భారతీయ వేదాంతం రాజకీయాలలో తెచ్చే సగుణాత్మకమైన మార్పులను  ఊతం చేసుకోకుండా ఇంగ్లాండ్ దేశానికి  నేను మతం  అగత్యాన్ని గురించి ప్రబోధించలేకపోయాను. ఇక్కడ ఇండియాలో కూడా సంఘసంస్కరణలు ప్రవేశపెట్టే ముందు  ఆధ్యాత్మిక రంగం  మానవాళికి చేకూర్చే మేళ్ళను గురించి ముందు  చర్చించవలసిన అగత్యం ఉందని మాత్రం హెచ్చరిస్తున్నాను. రాజకీయ భావజాలాన్ని ప్రబోధించే సమయంలోనూ అది భారతదేశానికి అవసరమైన ఆధ్యాత్మిక సంపదలో ఏ మేరకు అభివృద్ధి  సాధించగలదో ముందు చెప్పాలి.'  అన్నది  రాజకీయాల  వరకు చివరకు స్వామి వివేకానందుడు తీసుకున్న వైఖరి.  

వివేకానందుడి స్వంత వ్యక్తిత్వానికి సంబంధించినంత వరకు రాజకీయ ప్రభావానికి అతీతమైన రాజకీయ పరిశీలకుడు ఆయన. ఏ జాత్తీయ, అంతర్జాతీయ రాజకీయాలకూ ఆయన మనస్తత్వాన్ని మార్చే శక్తి చాలదు. కానీ స్వామి రాజకీయ పరిశీలన అర్థవంతంగా ఉంటుంది.  నిర్దుష్టత శాతం ఎక్కువ. నైపుణ్యంతో కూడిన సునిశితత్వంతో, సూక్ష్మ పరిశీలనతో  నిరపాయకరంగా సాగే వివేకానందుని ప్రసంగాలంటే అందుకే మానవ జీవితంలోని అన్ని పార్శ్వాల మేధావులు అత్యంత శ్రద్ధగా ఆలకించడానికి ఇష్టపడేది. ఆఖరుకు అవి రాజకియ సంబధమైన  ప్రసంగాలైనా సరే.. మినహాయించడానికి వీలులేనివి!  

'స్వామి వివేకానందుని సంపూర్ణ మేదోశక్తిని ఒకే చోట పోగేసి పరిశీలించేవారికి నోటమాట  రాకపోవడం సాధారణంగా జరిగే అనుభవమే. జాతీయవాదానికి, అంతర్జాతీయవాదానికి  మధ్య మరేదో నూత్న భావజాలంతో నిండిన మానవతావాదంలా పరమ ఆకర్షణీయంగా ధ్వనింపచేయడమే వివేకానందుని ప్రసంగాలలోని ప్రధాన ఆకర్షణ' అంటారు  'గుడ్ బై టు బెర్లిన్' రచయిత క్రిస్టోఫర్ ఐషర్ వుడ్. భారతీయుల చరిత్ర, భాషా సాహిత్య సంస్కృతులలో లోతైన అధ్యయనం చేసిన ప్రముఖ ఇండాలజిస్ట్ ప్రొఫెసర్ ఎ.ఎల్. భాషమ్  'రాబోయే కొన్ని శతాబ్దాల వరకు స్వామి వివేకానంద  ఆధునికి ప్రపంచ నిర్మాతల వర్గంలోని చింతనాపరులలో ఒక ప్రముఖునిగా గుర్తుండిపోవడం ఖాయం' అని స్వామీజీ రచనలు అన్నీ సుదీర్ఘ కాలం అధ్యయనం చేసిన తరువాత వెలిబుచ్చిన ఆఖరు మాట. కాదని మనం మాత్రం ఎట్లా అనగలం!

*** 

                                            

-రచన - కర్లపాలెం హనువుంతరావు 

( సూర్య సంపాదకీయ పుట ప్రచురణ ) 

కవిత్వ ప్రయోజనము : - కర్లపాలెం హనుమంతరావు




విత్వ ప్రయోజనము :

- కర్లపాలెం హనుమంతరావు


అభినవగుప్తుడు లెక్క ప్రకారం వాఙ్మయుం  ప్రభుసమ్మితం , మిత్రసమ్మితం, కాంతాసమ్మితం.  


వేదాయి  ప్రభునమ్మిఅలు . పురాణములు మిత్ర సమ్మితాలు.  కావ్యాలు  కాంతాసమ్మితాలు . 


కాంతాసమ్మితాలు  అంటే స్వాధీనపతిక సాథ్వీమణి తన రూప లావగ్యాలతో భర్తను వశపరుచుకునే పద్ధతి. ఆమె భర్తకు ఆ సందర్భంలో చేసే ఉపదేశం కావ్యం అవుతుంది, ఆ కావ్యం పరమార్ధం హృదయానందం. 



తరువాతి  కాలంలో ఈ కావ్య ప్రయోజనాల జాబితాను భరతుడు అనే మరో అక్షణికుడు ధర్మకామాలు, ఉత్సాహం , హితోపదేశం , విశ్రామజనకత్వం లాంటి వాటితో పెంచేశాడు.  

ఆ విశ్రామజనకత్వ'మే క్రమంగా  'ఆనంద' రూపంలో కలసిపోయింది.  


భామహుడు అనే మరో లాక్షణికుడు కావ్య ప్రయోజనాలకు ఆనందానికి అదనంగా కలిపాడు. 


 దండి  - సాహిత్యానికి  సామాజిక జీవన చిత్రణం  ప్రయోజనమన్నాడు.  


ఆనందవర్ధనుడయితే  తనకు ముందున్న  లాక్షణికులు కావ్యప్రయోజనాలుగా చెప్పుకొచ్చిన  ప్రీతి, కీర్తి, హితోపదేశాలలో  ఒక్క మనోప్రీతిని మాత్రమే కావ్యప్రయోజనంగా ఒప్పుకున్నాడు.  అభినవగుప్తుడూ కావ్యప్రయోజనాలన్నిం టిలోనూ ' ప్రీతిరేవ ప్రధానమ్' అన్నాడు. 


మమ్మటుడు ప్రాచీనాలంకారికులు కావ్యప్రయోజనాలుగా చెప్పుకొచ్చినవాటివన్నంటినీ ఒక జాచితాకి కుదిస్తూ  వాటన్నింటిలో   సద్యఃపర నిర్వృతి, ఉపదేశం ఎన్నదగినవి అన్నాడు .


ఇక పాశ్చాత్యుల దగ్గరికొస్తే,  ఆనంనం, ఉపదేశాలనే ప్రధానమైన  కావ్యప్రయోజనాల తీసుకున్నారు. 


వర్డ్సువర్తుది  ఆనందమే ప్రధానమనే వాదన . డ్రైడెన్, బ్లేక్ లు అ అందంతో పాటు నీతిబోధకం కూడా  అయివుండాలని అభిప్రాయపడ్డారు.   మిల్టన్ అయితే కేవలం నీతిబోధే  ప్రధానం అన్నాడు.   ఎడ్గర్ ఎలన్ పో కవిత్వధర్మం-   ఆనందానికి  సత్యంతో నిమిత్తంలేని ఆనంద అనుసంధానం.    ఫిలిప్ సిడ్నీకి  కవిత్వప్రయోజనాలకు  ఆనందసందేశాలు రెండూ ముఖ్యమే.  


చివరికి బ్రాడ్లీ మహానుభావుడు కావ్యప్రయోజనాలు ఏంటా అని తర్కించుకుంటూ కూర్చంటే అసలు కవిత్వమే పలచబడి పోతుంది  పొమ్మని కొట్టేశాడు . 


 ఆస్కార్ వైల్డ్  మరీ దారుణం. కళలన్నీ నీతిబాహ్యాలని ఈసడించుకుంటాడు .   నీతి అనేది మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్లకే తప్పించి మేథావులకు అక్కర్లేదని  ఆయన వాదన. 


పాశ్చాత్యులకు .. ప్రాచ్యులకు మధ్య తేడా ఒక్కటే! నీతిబోధ విషయంలో ఏకీభావం ఉన్నా .. నీతి బాహ్యం  విషయంలో  మాత్రం మరీ పడమటి అలంకారికుల్లాగా ప్రాచ్య మేధావులు  పోలేదు . 


నిజానికి అందంగా అల్లినంత మాత్రాన ఏ కావ్యమూ ఉత్తమమైనది కాలేదు . ముద్దుపళని  ' రాధికా సాంత్వనం ' ఇందుకో ఉదాహరణ. ఆ కావ్యం చదివే సమయంలో హృదయం  ఓ రకమైన ఆనంద డోలికల్లో ఊగవచ్చు .  కానీ, మొత్తంగా చూసుకుంటే ఆ అనుభూతి సభ్యతా సంస్కారాలకు అనువుగా ఉండదు. 


నీతిబాహ్యమైన వస్తువే  రమణీయంగా ఉంటుందని అనుకుంటే పేక్స్పియర్ ' క్లియోపాట్రా ' గానీ,  అభిజ్ఞాన  శాకుంతలం ' శకుంతల ' గానీ అనుభోగ్యాలు అవాలి . అదెంత మాతం సమ్మతం కాదు ' అంటారు దువ్వూరి రామిరెడ్డి ఒక సందర్భంలో. 


కావ్యాలలో నీతిప్రస్తావన  కూడా అనవసరమేనరి బ్రాడ్లీ చేసిన వాదనా సమంజసంగా లేదు. సదుద్దేశాలను ఉపదేశిస్తుండ బట్టే న్యూ టెస్టిమెంట్ గానీ పిల్ గ్రిమ్స్  ప్రొగ్రెస్  కానీ వాల్టేర్, బైరన్, స్విఫ్ట్ రచనలు గానీ రామాయణ భారతాదులు గానీ కాళిదాసు రఘువంశ చరిత్రగానీ చదివేటప్పుడు ఆత్మానందం కలిగిస్తాయి . అయినా వాటిని 'కావ్యాలు  అనటానికి లేదు. .  అందులో కవిత్వమే లేదు ' అని బుకాయించగలమా? వాటిలో ఉత్తమ పరమార్ధాన్ని ప్రబోధించే ఉపదేశాలు ఉన్నాయి. చదివే సమయంలో ఆ పరమార్ధం గ్రహింపుకు రావడం వల్ల పాఠకులలో కలిగే ఆత్మానందమే ఇక్కడ కావ్యప్రయోజనం. అలాంటి ఉత్తమ పరమార్థాలు లోపించనందువల్లనే ' ఏన్సియంట్ మారినర్ , శుక సప్తశతి. తారాశశాంకం లాంటివి కావ్యాలే అయినా ఉత్తమ కావ్యాలు కాలేవు. 


ఇకపోతే, డ్రైడెన్ చెప్పినట్లు ఆనందసందేశాలు ఉన్న కావ్యాలలో ఆనందం ప్రథమం .. ఆ తరువాతే సందేశం  అన్న సిద్ధాంతమూ ఎన్నదగినదేమే . 

సంస్కృతలాక్షణికులలో అభినవగుప్తుడు లాంటి వాళ్లు కూడా  'తథాపి ప్రీతిరేవ ప్రధానమ్' అని ఇట్లాంటి  అభిప్రాయాన్నే వెలిబుచ్చినట్లు ఇందాకే చెప్పుకున్నాం కదా! 


' తైతరీయోపనిషత్ భృగవల్లి ' ఆనందం'  తాలూకు మహిమను గూర్చి  వివరిస్తూ అంటుందీ  .. 


'ఆనందాద్ధ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే

ఆనందాద్ధ్యేవ  జాతాని జీవంతి 

ఆనందం ప్రయాం త్యభిసంవిశంతి.' 


  ఆ ఆనందం తాలూకు అనుభూతిని  ఉత్తమాభిరుచి గల పాఠకులకు  కలిగిస్తో  క్రమక్రమంగా  వాళ్లను కర్తవ్యం  దిశగా తీసుకువెళ్లడమే కవిత్వ ప్రక్రియ  పరమ ప్రయోజనం. 

పేరుకు పోయిండే మాలిన్యం మొత్తాన్ని   ప్రక్షాళన చేసి మనిషి మనసును శరత్కాల కాసారం లాగా మార్చేసే మంతశక్తి  ఆనందం సొంతం .  ఆ ఆనందం ఆత్మకు సిద్ధింప చేస్తూనే  సంఘానికి ఉపయుక్తమయే కర్తవ్యాన్ని ప్రబోధించడమే అంతిమంగా ఏ కావ్యానికయినా, కవిత్వానికయినా ఉండవలసిన ప్రధాన ప్రయోజనం . 


- కర్లపాలెం హనుమంతరావు 

13 - 12 -2021 

బోథెల్; యూ . ఎస్.ఎ


( ఆధారం: డా॥ సి.నారాయణ రెడ్డి గారి ' ఆధునికాంధ్ర కవిత్వము  - సంప్రదాయములు ; ప్రయోగములు )  





 

ఈనాడు - సంపాదకీయం శృంగార కళాశాల రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం- 11-03-2012 )

ఈనాడు - సంపాదకీయం 

శృంగార కళాశాల 


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం- 11-03-2012 ) 



సభ్యసమాజం దృష్టిలో శృంగారమంటే, నాలుగ్గోడల నడుమ మూడో కంటపడకుండా స్త్రీ పురుషులిద్దరి మధ్య మాత్రమే సాగే ముద్దుము చ్చట. శృంగారానికి అనువైన రసాయనిక తతంగం శారీరకంగా జరగ కపోతే ఎనభైనాలుగు లక్షల జీవకోటిలో ఒక్కటీ మిగలదు. ' బ్రహ్మ కును బ్రహ్మయైన నారాయణుండు/ మొదలుగా సర్వజీవ సమూహ మునకు/ బ్రప్రధానంబు శృంగార రసము గాదె' అంటారు పానుగం టివారు కంఠాభరణంలో. భరతుడి కోరికమీద కైశికీవృత్తి నాట్య ప్రయోగానికని శృంగారాంగనలను సృష్టించింది సాక్షాత్తు ఆ బ్రహ్మదే వుడే. తనకు ప్రదక్షిణ చేస్తున్న తిలోత్తమ అందచందాలు చూసి తల తిప్పుకోలేకే దక్షిణామూర్తి చతుర్ముఖుడయ్యాడని ఒక చమత్కారం. వేయికళ్లతో అనుక్షణం ఊర్వశివంటి అందాలరాశుల ఒంపుసొంపులు చూసే దేవేంద్రుడు సైతం అహల్యమీద కోరిక చంపుకోలేక తిప్పల పాలయ్యాడు! శ్రీరామచంద్రుడు సీతారమణుడు. గోదాదేవి కొప్పులో ముడిచి ఇచ్చిన పూలతో తప్ప అభిషేకాన్ని ఒప్పుకోలేదు శ్రీరంగనాథుడు . ముద్దుపళనివారి మాధవుడైతే రాధికాదేవి శృంగార యౌవన క్షీరాబ్ధి నడుమ 'నజుడొనర్చిన మోహన యంత్రము' లాగ ఎపుడెపుడు కలియతిరుగుదామా అని కలవరించాడు. శృంగారకేళిలో సంతృప్తి చెందితే యజ్ఞం చేసినంత పుణ్యం- అంటుంది బృహదారణ్యకోపని షత్తు. నూరేళ్లు సంసారం చేసినా ఏ పూటకాపూట మరో రోజుకు ఆగమని కండు మహాముని అంతటివాడే ప్రమోచను ప్రాధేయపడ్డాడు (విష్ణుపురాణం). సర్వసంగపరిత్యాగులనే అంతలా అల్లాడించిన ఉల్లాస  వ్యాసంగం మామూలు మానవుల కాలు నిలవనిస్తుందా!


ఛాందోగ్యోపనిషత్ పేర్కొన్న అష్టాదశ విద్యలలోని  దేవజన విద్యా విభాగంలో శృంగారం ఒక ప్రధాన అంగం. కరుణశ్రీ భావించినట్లు 'ఏ ప్రేమ మహిమచే ధారుణి చక్రము ఇరుసు లేకుండగనే తిరుగుచు న్నదో- ఆ మహాప్రేమకు ప్రేరణ శృంగారమే. నిగనిగని మోముపై నెరులు గెలకుల చెదర/ పగలైన దాక చెలి పవళించెను' అంటూ అన్న మయ్య అమ్మ శృంగార సౌందర్యాన్ని వర్ణించి తరిస్తే- 'మగువ తన కేశికా మందిరము వెడలే/ వగకాడ మా కంచి వరద తెలతెలవారెన నుచు' అంటూ క్షేత్రయ్య అయ్య సుమ సురతి బడలికలను తరచితరచి వర్ణించి తరించాడు. వివిధ దేవాలయాలమీద నేటికీ  కనిపించే మిథునశిల్పాలు ఒకనాటి తరానికి ఉద్దేశించిన కామశాస్త్ర కుడ్య పాఠాలు- అని తాపీ ధర్మారావు వంటి పరిశోధకుల వాదం. ఉత్తర భారతంలో హోలీ యువ సమూహాలు నేటికీ ఆడుకునే 'రంగుల క్రీడ' ఒకనాటి కామదేవుడి ఆరాధనోత్సవాల అవశేషమే. మొహంజొదారో తవ్వకాలలో  బయల్పడిన పుష్కరిణి సరస సల్లాపాల కోసం బ్రహ్మ కల్పించిన సరోవరమే అంటూ సశాస్త్రీయంగా రుజువు చేసిన డి.డి. కోశాంబివి వట్టి మాటలని కొట్టి పారేయలేం. శృంగారం బంగారం లాగా మెరుగులీనుతుంటేనే కదా ఏ యువజంటకైనా కళ!  పనిపాటలవేళ శ్రమ తెలియకుండా జానపదులు ఆలపించే పదాల నిండా శృంగార సుమ పరిమళాలు గుప్పుమంటుంటాయి. గోపికా స్త్రీల జలక్రీడలనుంచి గోంగూర పాటలదాకా- జీవితం ఎంత వైవిధ్యమో జానపదుల లొల్లాయి పలుకులూ అంత వైవిధ్యమంటారు డాక్టర్ బిరుదురాజు రామరాజు. సరస రసానికి దేశ కాలాలు ఏముంటాయి?  'మనసు' పుట్టినప్పుడే మనిషికి 'మనసు పుట్టడం' మొదలయింది .


శేషం వెంకటపతి- ' శశాంక విజయం'లో తర్క, శబ్ద, యోగ, సాంఖ్య, మోక్ష, ద్వైత, అద్వైత సిద్ధాంతాలన్నింటినీ కామకళకు జోడించి కనువిందు చేశాడు. 'ఏను నీవని పైకొనుటేను ద్వైతం- ఇరువురొకటైన అద్వైతమిద్ధరిత్రి' అంటూ సిద్ధాంతీకరిస్తే ఎంతటి సిద్ధులకైనా తొలినాటి ముద్దుముచ్చట్లు మదిలో మెదిలి పులకింతలు పుట్టక మానవు . మదన భావమంటే అంత తీపి బాధ మరి! నండూరివారి నాయుడుబావ మధనపడిపో యినట్లు- 'మందో మాకో యెట్టి మరిగించినట్లుంటుందా ఇది. గుండె గొంతుకలో కొట్లాడుతుంటే... వల్లకుందామంటే... గౌరీవల్లభుడి వల్లే కాలేదు మరి . కొనకళ్లవారి 'బంగారి' భామ- 'దారంటపోయే మామ కాలిధూళిగా  మారి రాలిపోయినా చాలు బతుకు పండిపోతుంది' అనుకుం టుంది. వలపు పెంకితనానికి యెంకి, నాయుడుబావ అనే భేదభావ మేమిటి? పానుగంటివారు చూడామణిలో చెప్పినట్లు ' ప్రకృతి నెట జూడు శృంగార రసమె, సర్వ/ సృష్టికి బ్రధాన సూత్రము' సరస రసమే! మొదటి కుళోత్తుంగుడు యుద్ధరంగంలో అంతఃపుర చెలులు నిద్రలో అతడి చిలిపి చేష్టలను తలచుకొనేవారు. మేలుకొని ఆ ' వెడద చన్నుల మీది ఆ విదియ చంద్రుల' కోసం తడుముకొనేవారు! అంత చిత్తచాంచల్యం శృంగారానిది. అదను తప్పినా, అదుపు తప్పినా అది చేసే బతుకు బీభత్సానికి పాండురంగ మాహాత్మ్యం నిగమశర్మే ప్రథమ ఉదాహరణ. అందుకే శృంగార కళను ఓ శాస్త్రంగా అభ్యసిం చవలసి ఉందని కామసూత్రాలను క్రీస్తు శకారంభం నాటికే వాత్సాయనుడు క్రోడీకరించి పెట్టాడు. పడకగది ముద్దుముచ్చట్లు అచ్చంగా ఆ పడుచు జంట గుప్తజ్ఞానమే కావచ్చు.  కానీ తెలియనివి, తెలుసుకోవాల్సినవీ, అడగలేనివీ, బిడియంవల్ల అడగనివీ, ఎవరిని అడగాలో తెలియనివీ బోలెడన్ని సందేహాలు... దేహధర్మం గురించి. అందుకే పండంటి సంసారానికి అత్యంత అవసరమైన ప్రేమబంధంతో శృంగారబంధాన్ని ముడివేయాలన్న సదుద్దేశంతో మరియా థాంప్సన్ శృంగార పాఠశాల ఏర్పాటుకు సిద్ధపడ్డారు. వియన్నాలోనే కాదు, భూమ్మీదే అది తొలిశృం గార కళాశాల. హింసాత్మక ప్రేమస్థానే ఆత్మీయానురాగాలను అది పెంపొందిస్తుందంటే- అందుకు అభ్యంతర పెట్టాల్సింది ఏముంటుంది? చట్టానికి, సభ్యతకు లొంగి ఉన్నంతకాలం శృంగారానికి స్వాగతం పలకవలసిందే!


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం- 11-03-2012 ) 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...