Monday, December 13, 2021

ఈనాడు - హాస్యం- వ్యంగ్యం మూతి బిగింపులు రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం -21 - 08 - 2009 )




ఈనాడు - హాస్యం- వ్యంగ్యం 

మూతి బిగింపులు 

రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం -21 - 08 - 2009 ) 


'ఈ స్వైన్ ప్లూ  మూలకంగా ఒక్కసారి నగరాల ముఖచిత్రాలు మారిపోయాయి. ముక్కూ మొహమూ తెలీనివారు ఎక్కువైపో యారు: ముక్కుపచ్చలారని పసివాడినుంచి ముక్కుతూ మూలుగుతూ బతికే ముసలాడి దాకా ఎందరికో మూతికి చిక్కాలే!


నేతల అవాకులు, చెవాకులు వినే బాధ జనానికి తప్పింది. కోడళ్ళకు అత్తగార్ల నుంచి, మొగుళ్ళకు గయ్యాళి పెళ్ళాలనుంచి గద్దింపులు తప్పాయి. 


పిల్లలకు బళ్ళనుంచీ అడవిడుపు . పంతుళ్ళు నోళ్ళు తెరిచి ఏమీ అడగరు కనుక చదువులనుంచీ విరామం. 


డబ్బింగువాళ్ళకి పాపం దెబ్బే.  ధూమపానం, మద్యపానం బంద్! 'మందు' షాపులకన్నా మందుల షాపులు వ్యాపారంలో ముందున్నాయి.


ఆసుపత్రుల్లో ఆపరేషన్లు చేసేవాళ్లెవరో, చేయించుకునేవాళ్ళెవరో తేడా తెలీకుండా  ఉంది. జూనియర్ వైద్యులకు రోగి బంధువుల బెడద తప్పింది. 


మూగభాష వేగంగా వాడుకలోకొస్తోంది. 'సైగల్'క్కు న్నంత మంచి గొంతున్నా సైగలు తప్ప టంలేదు. ఆడవాళ్ళు అపార్థం చేసుకునే ప్రమాదముంది. మగాళ్ళూ... తస్మాత్ జాగ్రత్త! 


ఆడవాళ్లూ, మీరూ జాగ్రత్త! పతి ఎవరో, పరపతి ఎవరో పరకాయించి చూసుకుని మరీ మసలాలి! మూతిక ట్టున్న మొగాళ్ళ మొహాలన్నీ ఒకేరకంగా ఏడుస్తాయి. 


కొంతమంది శునకప్రియులు తమ కుక్కల మూతులక్కూడా చిక్కాలు కడుతుండటంవల్ల అవి దొంగలను చూసి కూడా అరవలేకపోతున్నాయని పోలీ సులు వాపోతున్నారు.


కరవు తరుముకొచ్చేస్తోంది. కందిపప్పు వంద దాటింది. సన్నబియ్యం యాభై, నిత్యావసర సరకులన్నీ ఆకాశంలో చుక్కల్లా మారాయని... చంద్రబాబులాంటి వాళ్ళు హడావుడి చేస్తున్నారు గదా! ఈ స్వైన్ ప్లూ  భయం తో అందరినోళ్ళూ ఠప్పుమని మూతబడ్డాయి. 


బస్తా రూపాయికిస్తానన్నా బాదంపిస్తానైనాసరే జనం కొని తినే ధ్యాసలో లేరు. దేవుడెప్పుడూ మన సీయంవైపే ఉంటా డని ఇప్పుడైనా ఒప్పుకొంటావా? 


'అవును తమ్ముడూ! దేవుడెప్పుడూ తమ వైపే! లేక పోతే కరవొచ్చి ఒకవంక జనం ఊళ్ళు అలా ఖాళీ చేసిపోతున్నా 'ఉత్తిదే... అది స్వైన్ ప్లూ  భయం వల్లలే!' అని బుకాయించే అవకాశం ఇప్పుడెందుకిస్తాడులే!


తమాషాకిదా సమయం అన్నా!


తమాషానా, పాడా! మాయదారి పాడురోగమొచ్చి జనాలకేం చేయాలో దారితోచక అల్లాడుతూ ఉంటే అమృతాంజనమింత తలకు పట్టించుకొని తలుపేసుకుని దుప్పటి కప్పుకొని పడుకోమని తమాషా చేస్తోందెవరు?!


అయిదు శతాబ్దాల కిందట  ఏండ్రియస్ ఐపాలిస్ అనే వైద్యుడు ఒక రోగి శవాన్ని కోసి పరీక్ష చేస్తుండగా అత గాడు జీవించే ఉన్నట్లు తెలిసి... బతికున్నవాళ్ళ మీద కత్తి పెట్టడం రోమన్ శిక్షాస్మృతి ప్రకారం నేరమని ఆ వైద్యుడికి మరణదండన విధించాడట అప్పటి చక్రవర్తి . ఐదో ఛార్లెస్ ఆ లెక్కన జనాల ప్రాణాలను ఇలా గాలి కొదిలేసి తమాషా చూస్తున్న మనవాళ్ళనేం చేయాలో నువ్వే చెప్పు! 


అదేంటనా? .... పుట్టినవాడు గిట్టక తప్పదు. భారతంలో యక్షుడు ప్రపంచంలోకల్లా వింత ఏది? అనడి గితే ధర్మరాజేమన్నాడో తెలుసా? వెనకపోయేవాళ్ళు

ముందుపోయేవాళ్ల కోసం ఏడవటమని! మని

షికుండే  ఏడు ఈతి బాధల్లో ఈ ఫ్లూ లాంటి మహమ్మారి ఒకటి. అయినా మనల్ని ఒకళ్ళాచ్చి ఏడిపించాల్నా? పుడుతూనే ఏడుపు మొదలుపెడతాం. పోతూ పదిమందినేడిపిస్తాం. 


పదిమంది ఏడవాలంటే ఏ గాంధీగారిలాగో బతకాలి. నరకాసురుడు పోయినందుకు ఇప్పటికీ మనం దీపావళి చేసుకుంటున్నాం.  చావు తప్పదని తెలిసీ బతికున్నంత కాలు ఆ చావును మార్కండేయుడి మాదిరి తప్పించుకో వాలనే చూస్తాం గదా ! ఆరోగ్యం పౌరుడి హక్కు . దాన్ని పరిరక్షిస్తామని ప్రమాణాలు చేసి మరీ గద్దెనెక్కిన పెద్దమ నుషులు పెద్ద పెద్ద వాళ్ళ ప్రాణాలు ప్రమా దంలో పడితే తప్ప స్పందించమంటే ఎట్లా? బాధ్యతగా మెలగాల్సిన మన ప్రభువులూ, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలవల్ల అధికంగా లాభాలు పొందే ధనాసుపత్రులవారు  తమకసలేమీ పట్టనట్లు, మొక్కుబడిగా ఓ నాలుగు కుక్కిమంచాలు ఓ మూలగదిలో పడేసి ముక్కు మూసుకుంటున్నారు. ప్రాణభయానికి మించిన భయం ప్రపంచంలో మరేదీ లేదు . చికిత్స అంటే కేవలం శాస్త్రనైపుణ్యమే కాదు. రోగభయం ఉన్నవాళ్ళకు నాలుగు ఓదార్పు మాటలు చెప్పి ప్రాణాలను నిలబెట్టే పుణ్యం కూడా. యక్షుడు అడిగినప్పుడు ఆ ధర్మరాజేదో వింత విషయం చెప్పాడన్నావే! అంతకన్నా వింత విషయ మేంటో తెలుసా? జరిగిందో లేదో తెలీని అత్యాచారం కేసుని ప్రతిపక్ష ప్రజాప్రతినిధిపై రుద్దటానికి చూపించే శ్రద్ధలో లక్షోవంతైనా ... లక్షలాది ప్రజలకు ప్రాణాంతకంగా మారబోతుందన్న ఈ మాయరోగాన్ని మట్టుబెట్టటానికి మన ఏలినవారు చూపించకపోవటమే! ఇందుకు ఏ శిక్షాస్మృతి ప్రకారం ఏ దండన విధించాలో తెలీక రాయైపోయినట్లున్న ఆ దేవుణ్నే ఇక మనం ప్రార్ధిం చాలేమో?


ఏమని?


ఇప్పటికైనా మన ప్రభుత్వం కళ్ళు తెరిపించమని.. సద్బుద్ధి ప్రసాదించమని... ప్రజల ప్రాణాలు కాపాడే పనిలో పడేట్లు చూడమని!'


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం -21 - 08 - 2009

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...