కవిత్వ ప్రయోజనము :
- కర్లపాలెం హనుమంతరావు
అభినవగుప్తుడు లెక్క ప్రకారం వాఙ్మయుం ప్రభుసమ్మితం , మిత్రసమ్మితం, కాంతాసమ్మితం.
వేదాయి ప్రభునమ్మిఅలు . పురాణములు మిత్ర సమ్మితాలు. కావ్యాలు కాంతాసమ్మితాలు .
కాంతాసమ్మితాలు అంటే స్వాధీనపతిక సాథ్వీమణి తన రూప లావగ్యాలతో భర్తను వశపరుచుకునే పద్ధతి. ఆమె భర్తకు ఆ సందర్భంలో చేసే ఉపదేశం కావ్యం అవుతుంది, ఆ కావ్యం పరమార్ధం హృదయానందం.
తరువాతి కాలంలో ఈ కావ్య ప్రయోజనాల జాబితాను భరతుడు అనే మరో అక్షణికుడు ధర్మకామాలు, ఉత్సాహం , హితోపదేశం , విశ్రామజనకత్వం లాంటి వాటితో పెంచేశాడు.
ఆ విశ్రామజనకత్వ'మే క్రమంగా 'ఆనంద' రూపంలో కలసిపోయింది.
భామహుడు అనే మరో లాక్షణికుడు కావ్య ప్రయోజనాలకు ఆనందానికి అదనంగా కలిపాడు.
దండి - సాహిత్యానికి సామాజిక జీవన చిత్రణం ప్రయోజనమన్నాడు.
ఆనందవర్ధనుడయితే తనకు ముందున్న లాక్షణికులు కావ్యప్రయోజనాలుగా చెప్పుకొచ్చిన ప్రీతి, కీర్తి, హితోపదేశాలలో ఒక్క మనోప్రీతిని మాత్రమే కావ్యప్రయోజనంగా ఒప్పుకున్నాడు. అభినవగుప్తుడూ కావ్యప్రయోజనాలన్నిం టిలోనూ ' ప్రీతిరేవ ప్రధానమ్' అన్నాడు.
మమ్మటుడు ప్రాచీనాలంకారికులు కావ్యప్రయోజనాలుగా చెప్పుకొచ్చినవాటివన్నంటినీ ఒక జాచితాకి కుదిస్తూ వాటన్నింటిలో సద్యఃపర నిర్వృతి, ఉపదేశం ఎన్నదగినవి అన్నాడు .
ఇక పాశ్చాత్యుల దగ్గరికొస్తే, ఆనంనం, ఉపదేశాలనే ప్రధానమైన కావ్యప్రయోజనాల తీసుకున్నారు.
వర్డ్సువర్తుది ఆనందమే ప్రధానమనే వాదన . డ్రైడెన్, బ్లేక్ లు అ అందంతో పాటు నీతిబోధకం కూడా అయివుండాలని అభిప్రాయపడ్డారు. మిల్టన్ అయితే కేవలం నీతిబోధే ప్రధానం అన్నాడు. ఎడ్గర్ ఎలన్ పో కవిత్వధర్మం- ఆనందానికి సత్యంతో నిమిత్తంలేని ఆనంద అనుసంధానం. ఫిలిప్ సిడ్నీకి కవిత్వప్రయోజనాలకు ఆనందసందేశాలు రెండూ ముఖ్యమే.
చివరికి బ్రాడ్లీ మహానుభావుడు కావ్యప్రయోజనాలు ఏంటా అని తర్కించుకుంటూ కూర్చంటే అసలు కవిత్వమే పలచబడి పోతుంది పొమ్మని కొట్టేశాడు .
ఆస్కార్ వైల్డ్ మరీ దారుణం. కళలన్నీ నీతిబాహ్యాలని ఈసడించుకుంటాడు . నీతి అనేది మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్లకే తప్పించి మేథావులకు అక్కర్లేదని ఆయన వాదన.
పాశ్చాత్యులకు .. ప్రాచ్యులకు మధ్య తేడా ఒక్కటే! నీతిబోధ విషయంలో ఏకీభావం ఉన్నా .. నీతి బాహ్యం విషయంలో మాత్రం మరీ పడమటి అలంకారికుల్లాగా ప్రాచ్య మేధావులు పోలేదు .
నిజానికి అందంగా అల్లినంత మాత్రాన ఏ కావ్యమూ ఉత్తమమైనది కాలేదు . ముద్దుపళని ' రాధికా సాంత్వనం ' ఇందుకో ఉదాహరణ. ఆ కావ్యం చదివే సమయంలో హృదయం ఓ రకమైన ఆనంద డోలికల్లో ఊగవచ్చు . కానీ, మొత్తంగా చూసుకుంటే ఆ అనుభూతి సభ్యతా సంస్కారాలకు అనువుగా ఉండదు.
నీతిబాహ్యమైన వస్తువే రమణీయంగా ఉంటుందని అనుకుంటే పేక్స్పియర్ ' క్లియోపాట్రా ' గానీ, అభిజ్ఞాన శాకుంతలం ' శకుంతల ' గానీ అనుభోగ్యాలు అవాలి . అదెంత మాతం సమ్మతం కాదు ' అంటారు దువ్వూరి రామిరెడ్డి ఒక సందర్భంలో.
కావ్యాలలో నీతిప్రస్తావన కూడా అనవసరమేనరి బ్రాడ్లీ చేసిన వాదనా సమంజసంగా లేదు. సదుద్దేశాలను ఉపదేశిస్తుండ బట్టే న్యూ టెస్టిమెంట్ గానీ పిల్ గ్రిమ్స్ ప్రొగ్రెస్ కానీ వాల్టేర్, బైరన్, స్విఫ్ట్ రచనలు గానీ రామాయణ భారతాదులు గానీ కాళిదాసు రఘువంశ చరిత్రగానీ చదివేటప్పుడు ఆత్మానందం కలిగిస్తాయి . అయినా వాటిని 'కావ్యాలు అనటానికి లేదు. . అందులో కవిత్వమే లేదు ' అని బుకాయించగలమా? వాటిలో ఉత్తమ పరమార్ధాన్ని ప్రబోధించే ఉపదేశాలు ఉన్నాయి. చదివే సమయంలో ఆ పరమార్ధం గ్రహింపుకు రావడం వల్ల పాఠకులలో కలిగే ఆత్మానందమే ఇక్కడ కావ్యప్రయోజనం. అలాంటి ఉత్తమ పరమార్థాలు లోపించనందువల్లనే ' ఏన్సియంట్ మారినర్ , శుక సప్తశతి. తారాశశాంకం లాంటివి కావ్యాలే అయినా ఉత్తమ కావ్యాలు కాలేవు.
ఇకపోతే, డ్రైడెన్ చెప్పినట్లు ఆనందసందేశాలు ఉన్న కావ్యాలలో ఆనందం ప్రథమం .. ఆ తరువాతే సందేశం అన్న సిద్ధాంతమూ ఎన్నదగినదేమే .
సంస్కృతలాక్షణికులలో అభినవగుప్తుడు లాంటి వాళ్లు కూడా 'తథాపి ప్రీతిరేవ ప్రధానమ్' అని ఇట్లాంటి అభిప్రాయాన్నే వెలిబుచ్చినట్లు ఇందాకే చెప్పుకున్నాం కదా!
' తైతరీయోపనిషత్ భృగవల్లి ' ఆనందం' తాలూకు మహిమను గూర్చి వివరిస్తూ అంటుందీ ..
'ఆనందాద్ధ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే
ఆనందాద్ధ్యేవ జాతాని జీవంతి
ఆనందం ప్రయాం త్యభిసంవిశంతి.'
ఆ ఆనందం తాలూకు అనుభూతిని ఉత్తమాభిరుచి గల పాఠకులకు కలిగిస్తో క్రమక్రమంగా వాళ్లను కర్తవ్యం దిశగా తీసుకువెళ్లడమే కవిత్వ ప్రక్రియ పరమ ప్రయోజనం.
పేరుకు పోయిండే మాలిన్యం మొత్తాన్ని ప్రక్షాళన చేసి మనిషి మనసును శరత్కాల కాసారం లాగా మార్చేసే మంతశక్తి ఆనందం సొంతం . ఆ ఆనందం ఆత్మకు సిద్ధింప చేస్తూనే సంఘానికి ఉపయుక్తమయే కర్తవ్యాన్ని ప్రబోధించడమే అంతిమంగా ఏ కావ్యానికయినా, కవిత్వానికయినా ఉండవలసిన ప్రధాన ప్రయోజనం .
- కర్లపాలెం హనుమంతరావు
13 - 12 -2021
బోథెల్; యూ . ఎస్.ఎ
( ఆధారం: డా॥ సి.నారాయణ రెడ్డి గారి ' ఆధునికాంధ్ర కవిత్వము - సంప్రదాయములు ; ప్రయోగములు )
No comments:
Post a Comment