Tuesday, December 14, 2021

ఈనాడు - సంపాదకీయం ఏరువాకా... అందుకో స్వాగతం రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ఆశల చినుకులు పేరుతో ప్రచురితం - 12-06-2011 )

 


ఈనాడు - సంపాదకీయం 

ఏరువాకా... అందుకో స్వాగతం ! 


రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ఆశల చినుకులు పేరుతో ప్రచురితం - 12-06-2011 )  


'ఏరు' అంటే సాగుగిత్తల మెడమీది నేలతల్లిని దున్నే నాగలి కర్రు. ముచ్చి ముమ్మారు మూడు చాళ్ళను బసవన్నలచేత మృగశిరకార్తె మొదటిరోజున దున్నించి అన్నదాత సేద్యయాగం ఆరంభించే ముచ్చటే ఏరువాక. భాగవతంలో బలరామ సోదరుడు భావించినట్లు- గోపాల కూటమికి గిరియజ్ఞమెంత ప్రధానమో, కర్షక లోకానికి ఏరువాకా అంత అవసరం. కసవు దేనుగణానికి, ధేనుసంపద పాడిపంటలకు, పాడిపం టలు బతుకుతెరువుకు ఎంత అవసరమో త్రేతాయుగం నాటికే మనిషి గుర్తించాడు. అందుకే నృపాలురు సైతం పొలం పనుల్లో పాలుపం చుకొనేవారని పురాణాల కథనం. మిథిల మహారాజు జనకుడు ఏరు వాక ఆరంభమయ్యే జ్యేష్ఠ శుద్ధ పున్నమినాడు రాజపురోహితుడు శతానందుడి పవిత్ర మంత్రోచ్ఛారణలూ ప్రజల జయజయధ్వానాల మధ్య  స్వయంగా సీతాయజ్ఞం ఆరంభించిన వైనాన్ని వాల్మీకి రామాయణం పరమాద్భుతంగా వర్ణించింది. విష్ణుపురాణం సీతాయజ్ఞమన్నా, బౌద్ధ జాతక కథలు పప్పమంగల దివసమన్నా, జైమినీ న్యాయమాల ఉద్య షభయజ్ఞమన్నా.... అన్నీ ఆ ఏరువాకమ్మ మారుపేర్లే.  వ్యవసాయానికి సాయమందించే బసవన్న మెడలను  రంగురంగుల పూసదండలతో, పూలదండలతో తనివితీరా అలంకరించి, పొంగలి ప్రసాదాలతో అంగరంగ వైభోగంగా మంగళ వాయిద్యాలమధ్య పూజాదికాలు నిర్వహించి పొలం దున్నుడుతో సాగుపనులు ఆరంభించే ఒకనాటి సంబరాలు ఇప్పుడూ అంతే సంరంభంగా కొనసాగుతున్నాయనలేం. ఆడపడుచులు ముచ్చటపడుతూ పుట్టింటికి పరిగెత్తుకు రావడాలూ, పొగరుగిత్తలను ఊరిమధ్యనుంచి హుషారుగా యువకులు పోటీలు పడి పరుగులెత్తించడాలూ, భారీ బసవన్నలచేత బండ బరువులు లాగించి బహుమా నాలందించడాలూ... ఈనాటికీ కొన్ని గ్రామసీమల్లో ఏరువాక సాగే కాలాన కనిపించే దృశ్యాలే! 


ఆది మానవుడికి మల్లే ఆధునిక జీవుడికీ వ్యవసాయం ఓ జీవ నాధారం. రోళ్లు పగిలే రోహిణీ గండం గడిచి మృగశిరారంభంలో కురిసే తొలకరి చినుకులకు అందుకే అంత ప్రాధాన్యం. 'ఏరువాక పున్నమికి వెండిమబ్బు దారబ్బంతి/ చిక్కులేని పోగులను పుడమికి జారవిడిచే'  ఆ సుందర దృశ్యానికి స్పందించని హృదయం అసలుం టుందా! ' ఏటి ఒడ్డున ఎంకిని తలదన్నే పూబంతి/ దుక్కిదున్నగ పోతున్న బసవమామకి ఎదురొచ్చే'  సన్నివేశం కవితావేశం రగిలించడానికి గుండె నండూరివారిదే కానవసరంలేదు. వానకార్తె దృశ్యాలకు రుగ్వేదమే స్పందించకుండా ఉండలేకపోయింది. గాథా సప్తశతి హాలుడినుంచి 'కృషీవలుడు' కర్త దువ్వూరివారి వరకు తొలకరి చినుకుల కులుకులకు పులకరించని కవులు బహు అరుదు. 'ఆ ఆకుల పమిట చాటున పాల కంకుల రహస్యం/ పొలం మడిగట్టుమీద ఒంటరి బంతిమొక్క ఎదురుచూపు/ పొగరెక్కిన ఆంబోతు రంకెలా ఉరుము/ నింగికేసి చూసే నీరుకాయ తలపాగా' ... ఏ వికారాలకూ లోనుకాని దేవుడూ, పాపం, ఎవరి పరవశంలో పడి ఈ తడి దృశ్యా లంత అందంగా సృష్టించాడోనని నేలభామ ముద్దొచ్చే బురద పూవులా ముసిముసిగా నవ్వుకుంటుందంటాడు ఓ ఆధునిక కవి. మబ్బు పలకరింపే చినుకు. పరిమళం, మట్టి మౌన స్పందన, అందు కేనేమో భగవంతుడు తాను ఆ సుగంధంలోనే దాగి ఉంటానని గీతలో బోధించింది! 

సృష్టికర్త తన సృజనలో ఒక్క చందన పరిమళాలకు, సౌందర్యానికే కాదు... సకల జీవరాశుల యోగక్షేమాలకూ సమప్రాధాన్యం ఇవ్వడాన్ని గతితప్పని రుతుచక్ర క్రమవిధానంలో గమ నించవచ్చు. మృగశిరంతో మొదలయ్యే కార్తె రోజుల్లో ఆకశాన  మూడు తారలతో మృగశిరాన్ని సూచించడం సాగుకు అవసరమయ్యే పశుసంపదను సమాయత్తం చేసుకొమ్మని హెచ్చరించటమేనని ఓ కవి భావించడం ఎంత కమనీయమైన సాంఘిక కల్పన! 


కాలమే ఎందుకో క్రమంగా రుతుధర్మాన్ని సక్రమంగా పాటించడంలేదు. 'ఏరువాక వస్తుందంటే యుద్ధమొస్తున్నంత భయం.... ప్రకృతి ఏ బాంబు వేయబోతుందోనని/ కిసాన్ జవానై కిట్టు సర్దుకుం టంటే... ఇల్లాలు కన్నీళ్లై ఎదురు వస్తోంది' అంటాడో కవి. స్వేదం విత్తితే చావులు మొలుస్తున్న కాలాన్ని ఈ కవికన్నా సహజంగా ఇంకె వరు చిత్రించగలరు! ఏరువాకలన్నీ యముని తాఖీదులవుతు న్నాయి/ సేద్యం శకునితో ఆడే మాయ జూదమైపోయింది' అన్నది నేటి వ్యథార్త  దృశ్యాలకు యథార్థ చిత్రణ! రూకల రాకాసి రెక్కల నీడలో వ్యవసాయమూ వ్యాపారి వేషం వేసుకోవడమే నేటి రైతు భాగవతంలోని విషాదఘట్టానికి అసలైన కారణం. మట్టికీ మనిషికీ మధ్య ముడివడిన పేగుబంధం విడిపోతున్న కొద్దీ- పక్షుల్లేని  ఆకా శంలా పొలం పేలవంగా మారిపోతుంది. సైరన్ కూతల సంగీత కచేరికి క్షేత్రాన్ని వేదికగా మార్చిన క్షణానే అన్నదాత క్షేమం ప్రశ్నార్ధకమనే లోయలో పడిపోయింది. రైతు కదిలే కన్నీటి మేఘంలా మారడానికి కర్ణుడి చావుకన్నా ఎక్కువ కారణాలే ఉన్నాయి. లెక్కల బతుకులోనూ లెక్కకందని అనుభూతులుంటాయని మళ్ళీమళ్ళీ గుర్తు చేసుకోవడమే ఈ కార్తె ప్రస్తుత పరమార్థం. మట్టికి మరణం ఉంటుందా? మొలకై మళ్ళీ మొలకెత్తటమే గదా దాని జీవతత్వం! రైతన్న ఎన్నిసార్లు కూలిపోయిన రథం కాలేదు! బీడు అడుగున దీర్ఘ నిదుర తీస్తున్నా ఆశల చినుకులు నాలుగు రాలితే చాలు... లోక మంతా పచ్చగా పరుచుకునే విత్తనం రైతు. 'అనావృప్లై ఆనాడు వెంట బడినా అతివృష్టిగా పడగవిప్పి ఈనాడు భయపెట్టినా/ తడిసి ముద్దైన కలలు ఎన్ని వందలసార్లు నీటి బాంబులై గుండెలను వేల్చే సినా' - చెక్కు చెదరనిది రైతు ఉక్కు సంకల్పం. మనసును ఆకాశమంత పందిరి చేసుకుని, ఆశకు భూమాత అంత మండపం లేపి ఎప్పటి లాగా రైతు ఏరువాకకు ఎదురేగి మనసారా స్వాగతం చెప్పకపోతే మన పేరున్న గింజలకోసం ఇప్పటికన్నా ఎక్కువగా గింజుకోక తప్పని పరిస్థితి. అందుకే ఏరువాకా... అందుకో ఈ స్వాగతం! ఆదుకో... ఈసారైనా రైతునీ... మా జాతినీ!


రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు ఆశల చినుకులు పేరుతో  - ప్రచురితం - 12-06-2011 ) 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...