Monday, December 13, 2021

ఈనాడు - హాస్యం - వ్యంగ్యం మనకు బండి.. మరచి పొండి ( ఈనాడు - ప్రచురితం - 07 -07 - 2009 )




ఈనాడు - హాస్యం - వ్యంగ్యం 

మనకు బండి..  మరచి పొండి 

( ఈనాడు - ప్రచురితం - 07 -07 - 2009 ) 


అడగనిది అమ్మయినా పెట్టదని సామెత.  అడిగినా నలిపి నామం పెట్టలేదే ఈ మమతమ్మ!


దీదీ బెంగాలీ కదా... తెలుగు సామెత తెలిసుండదులేరా! లేకపోతే మన సియం లేఖవెళ్ళినా 'నోనో' అని ఎందుకం టుంది? ఇదేమన్నా టాటావారి 'నానో' కారా?


తాతా! మొదట్నుంచీ నువ్వా కలకత్తా కాళికి వత్తాసిస్తున్నావుగానీ, మన జగన్ లాంటి యువ ఎంపీ వెళ్ళి అడిగినా ఒక్క యువ రైలయినా ఇవ్వ కుండా ఖాళీ చెయ్యి చూపించిందే ! ఛ... ప్రతిపక్షాల వాళ్ళచేత ఇప్పుడు ఎన్ని పడాల్సొస్తోందీ?


ఇందులో ఎవర్నో అని ఏం లాభంరా! జగన్మోహిని కాలంనుంచీ ఈ బంతిలో వలపక్షం వస్తున్నదే! బీహారీ లాలూ బ్రీఫ్ కేసులోనుంచి తీసినా, బెంగాలీ బెనర్జీ గుడ్డసంచీలోనుంచి తీసినా తెలుగువాడికి  మొదటినుంచీ పడుతూ వస్తున్నవి ముష్టి  చివరి మెతుకులే ! పాపం ఆ అమ్మను అనటం ఎందుకు? బిర్యానీ, చేపల పులుసు చౌకగా కమ్మగా పెడుతున్నందుకా? పాతిక్కే. బైరాగి టికెట్లు అమ్ముతున్నందుకా ? అన్నింటికీ లడాయి పడితే ఆ లాలూకీ నీకూ తేడా ఏందిరా? అక్క డికీ నీకు హైదరాబాదులో  అంబులెన్సులు, సికిందరాబాదులో కాలేజీ.. 


బెంగాలకు మాత్రం బోగీల ఫ్యాక్టరీ! స్టేషనేలేని లాలగడ్ ని  అభివృద్ధి చేస్తుందంట.... మంటగా ఉంది తలచుకుంటేనే! 


ఆ మంటలకు మందేసేందుకు మన రైలు ఆసుపత్రిలో వెంటనే ఓ విభాగం తెరిపించేస్తుందంటలే! దటీజ్ మమత 


సమత లేని మమత శుభ్రంగా, భద్రంగా రైలు శాఖను నిర్వహిస్తానంది. సుబ్బరంగా రైళ్యూ లైన్లూ సొంత రాష్ట్రానికి, భద్రంగా ప్రాజెక్టులూ నిధులూ సగం ప్రైవేటు రంగానికి అప్పగించేసింది! ఆదా యంలో మన దక్షిణ రైల్వే రెండోదిగదా!  అయినా దీదీ టికెట్లు కూడా కొనకుండా తుపాకులు పట్టుకు తిరిగేచోట పట్టాలు వేయడమేమిటి? ఇదేనా సామాజిక ప్రయోజనాన్ని పట్టాలెక్కించటమంటే? 


బెంగాలు మాత్రం సమాజం కాదా, ఏమిట్రా? ఎప్పుడూ అక్కడ ఎర్రదండు ప్రయోగాలే జర గాలా? రైలుశాఖకు దీదీ కొత్తదేమీ కాదు. ఎన్డీఏలో ఉండగా రెండుసార్లు బడ్జెట్ సమర్పించింది. తెలుసా?


ఫ్రంటేదైనా మీ దీదీ పంథా  ఒకటేలాగుంది.


లేడికి లేచిందే పరుగని రైటర్సు భవనం మీదప్పుడే గడ్డిపూవు మొలిపించెయ్యాలని ఆత్రమా ? మరీ అంత చిత్రమా? 


అసలు వెస్ట్ బెంగాలే ఒక చిత్రం తూర్పున ఉండే పడమటి విచిత్రం! ప్రెస్ వాళ్లనయినా  ఇంప్రెస్ చేయవచ్చుగానీ- మీ ముచ్చుగాళ్ళకు ఏదీ నచ్చక్  పోవటం మహా విచిత్రం; 'ముష్కిల్ ఆసాన్' అని రైలు టికెట్లు రోడ్లమీది తోపుడు బళ్ళలో కూడా దొరికే ఏర్పాట్లు చేసినా.. ఉహూ- మీ చేత 'ఓహో' అనిపించలేకపోతుందే పిచ్చితల్లి.  డబుల్ డెక్కర్లు ,

రైలు డాక్టర్లు, క్లీన్ టాయిలెట్లు పెట్టినా క్లీన్ చిట్ ఇవ్వకపోతుంటరి మరి?


'మాట మార్చకు తాతయ్యా మాటిమాటికి! ' మా, మాటి, మనుష్ ' అంటుంది గదా దీదీ ? యాబైఏడు రైళ్ళకు ఒక్కటా మనకిచ్చేది? చాంతాడంత ఉంది ఆ ఆదర్శస్టేషన్ల జాబితా అందులో మనవి కనిపించేవి. . ముష్టి మూడా! 


భాషాభిమానం ఉంటే మంచిదే.  'దురంటో'నో కరంటో'నో ఏదో ఒకటి పెట్టుకో మను. ఎక్కడా ఆగని ఆ కొత్తరకం రైళ్ళలో ఒక్క టైనా మన తెలుగువాళ్ళకు దక్కకపోనీయకపోవటమేమిటి? మనకు ముప్ఫైముగ్గురు పార్టీ ఎంపీ లున్నా కొత్త ప్రాజెక్టులూ, పాతవాటికి నిధులు, రైళ్ళూ, లైన్లూ దక్కింది సున్నా!


మన బలమే మన బలహీనతరా అబ్బాయ్! అంకెకి కౌరవుల సంఖ్యలో మూడో వంతున్నా గట్టిగా అడిగితే ఆ 'కాళి' ఎక్కడ చొక్కా కాలరు పట్టుకుంటుందోనని తత్తరపడే ఉత్తర కుమారులే ఎక్కువ. భయం. మనకు పల్లకి మోసే బోయీ పనే హాయి. గడపతొక్కిననాడే కాపురం చేసే కళ తెలిసిపోతుందని... మంత్రి పదవుల పంపకాలప్పుడే మనకెంత పవరుందో తెలిసిపోయింది.


ఎంత తక్కువమంది మంత్రులుంటే అంత ఎక్కువ రాబట్టుకోవచ్చని అప్పట్లో చప్పట్లు కొట్టుకున్నారుగా మనవాళ్ళు!  మనవాళ్ళ నిద్రచూసే కాబోలు ఆరుద్ర ఏనాడో అన్నాడు .. . ' నీవెక్కాల్సిన రైలు ఓ జీవితకాలం లేటు' అని.


రైట్.... ఊరికే ఇక్కడ కూర్చుని ఇలా రంకెలేసుకుంటూ బీపీలు పెంచుకునే బదులు ఏ కేవీపీలాంటి వీఐపీనో లాబీయింగుకు పంపించుంటే లాభం ఉండేది అని ఏపీలో అందరూ అనుకుంటున్నారా? అయిపోయిన పెళ్ళి క్కూడా  ఇంకా బాజాలెందుకు? బండిపోయింతరువాత  ప్లాట్ ఫాం  మీద ఈ చిందులెం దుకు? ఏదేమైనా ఒకందుకు నాకు చాలా ఆనందంగా ఉందిరా నాయనా? '


ఏంటది తాతయ్యా! 


ఈ బడ్జెట్ అతి తక్కువ సమ యంలో తయారైనా- అతి ఎక్కువ నష్ట పోయే మన రికార్డు ఉందే. అది మాత్రం మన ఉక్కు ఫ్యాక్టరీలా  చెక్కుచెదరలేదు. మన రాష్ట్రం శని అంత మహత్తరమైనదని.. 


ఆనందబాష్పాలు రాలుస్తున్నావా! 


ఆ వెటకారాలిక ఆపి, జనాలు మనల్ని ఛీకొట్టకుండా ఉండటానికి మంచి ఉపాయమేదన్నా చెప్పొచ్చుగా తాతయ్యా


అలా అడిగావు బాగుంది. తప్పు మనదీకాడు. మమతాదీకాదు. మనరాష్ట్రం జాతకంలోనే దోష ముంది- అని ముందు పండితులచేత భారీ ప్రక టనలిప్పించండి! అందుకే కదా వానలు కూడా పడటంలేదంటే, మన జనాలు ఈజీగా నమ్మే స్తారు. ఆనక రుతుపవనాల రాకకు ఇప్పుడు చేస్తున్నామే. వరుణయాగం తరహాలో ధూమ శకట దేవుడి ఆవాహనకు కూడా ఏ రుత్విక్కుల చేతనో ఓ యజ్ఞం జరిపిస్తే సరి... ఈసారికి సారీ! అనకుండా సరిపోతుంది. 


పెద్ద బడ్జెట్లోనూ ముద్ద దక్కలేదని ఒకేసారి మహాయజ్ఞమేదో జరిపిస్తే మరింత భేషుగ్గా  ఉంటుందేమో తాతయ్యా!  


రచన - కర్లపాలెం హనుమంతరావు(

( ఈనాడు - ప్రచురితం - 07 -07 - 2009 ) 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...