Tuesday, December 14, 2021

ఈ నాడు - హాస్యం - వ్యంగ్యం ఆపన్నుల పై వింత పన్నులు రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈ నాడు - ప్రచురితం - తేదీ తెలియదు )




ఈనాడు - హాస్యం - వ్యంగ్యం 

ఆపన్నుల పై వింత పన్నులు 

రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈ నాడు - ప్రచురితం - తేదీ తెలియదు ) 







శుభం!




దేనికీ?! 




మన ముఖ్యమంత్రిగారికి మూడ్ వచ్చిందని, రాష్ట్రాన్ని గాడిలో పెడతానని శపథం చేశారని, జిల్లా పర్యటనలూ అప్పుడే మొదలు పెట్టేశారని, ఆదాయ మార్గాలు వెతికే పనిలో పడ్డారని, మంత్రివర్గ సభ్యులందర్నీ ఒక్కతాటి మీదకు తెచ్చేస్తానన్నారని.... అరె ! ఎందుకా నవ్వు? 




లేకపోతే ఏంటి మామా, తలా ఒకతాడైతే ఖర్చు తడిసి మోపెడవుతుందని పెద్దాయన అలా అనుండొచ్చేమోగానీ... మనాళ్ల బరువుకి తాడుకీ ఎక్కడన్నా సాపత్యముందంటావా! తాడు తెగి మొదటికే మోసమొస్తుంది. ఆదాయ మార్గాలను వెతకటమంటే మరీ ఇంత చాదస్తంగానా! పండుగ ఇలా అయిపోయిందో లేదో, అలా పిల్లల చక్కెర బిళ్లల్నీ వదలకుండా అదనంగా అమ్మకం పన్ను బాదేయటమేనా? అరె! ఇంతకుముందే సారు ఆర్టీసీ ప్రయాణికుణ్ని ఉతికి ఆరేశారు. విద్యుత్ ఛార్జీలనూ రెండు మూడ్రోజుల్లో పెంచడానికి సిద్ధంగా ఉన్నారనే వదంతి ఒకటుందాయే! ప్రభుత్వాన్ని వాహనాలకు విధించినట్టు మా గాడిలో పడేయడమంటే.. అది ఇదేనన్నమాట!' 




`అదే మరి! కొంతకాలంగా రాష్ట్రంలో ప్రభుత్వమ నేది అసలుందా? ఉంటే గుర్రుకొట్టి నిద్దరోతోందా? కప్పుకోవటానికి దుప్పటి దిండూ కావాలా? అంటూ అదేపనిగా దెప్పిపొడిచిందీ తమరే. ప్రతిదాన్ని రాజ కీయం చేయకపోతే- రాష్ట్ర ఖజానాకు సొమ్ములు జమయ్యే ఆ విధానాలేంటో... మీకు తెలిస్తే చెప్పవచ్చుగదా! లక్షకోట్ల బడ్జెట్ మనది. ముందా సంగతి గుర్తుంచుకొని మరీ మాట్లాడాలి.




ఆ మాటన్నావూ బాగుంది. మనసంటూ ఉండాలేగానీ పైసలు రాబట్టడానికి బోలెడన్ని మార్గాలు. ఉదాహరణకు మన ముఖ్యమంత్రినే తీసుకో మామా! కాచిగుడాలో బట్టలకొట్టు తెరవాలన్నా పెద్దాయన చూపు హైకమాండ్ వైపే ఉంటుంది. మరా భాగ్యానికి మనకింత జంబోజెట్ మంత్రివర్గం అవసరమా? ఆ ఒక్కడూ ఉంటే చాలదా? ఇంతమంది మంత్రులూ వాళ్లకి కార్లు, ప్రొటోకాళ్లూ, క్వార్టర్లూ, టెలిఫోన్లు, సెక్యూరిటీ ఖర్చులు వృథా వ్యయమే గదా! అధికారులెలాగూ తాము చేసే పనులు ఈ మంత్రులకు చెప్పి చేయనప్పుడు...




'అగక్కడ! మరీ అంత దూకుడొద్దు. ఏ కేసులోనో ఇరుక్కుపోగలవు. ఆందోళనల మూలంగా పెట్టుబడులు పడిపోతున్నాయని, పర్యాటకుల నుంచొచ్చే ఆదాయమూ తగ్గిపోతోందని పెద్దాయన అసలే నస పెడుతున్నాడు. 




ప్రపంచం మొత్తంలో ఎక్కడా లేని విచిత్రమైన నిరసనలు మన దగ్గరే గదా సాగుతు న్నాయి మామా! వీటిని దగ్గరగా చూసే సౌకర్యం కల్పిస్తామంటే... ధనుష్కోటిలో సూర్య గ్రహణాన్ని, శబరిమలైలో మకరజ్యోతిని చూడటానికి ఎగబడే జనాలకన్నా ఎక్కువ పొర్లుకొస్తారు. విదేశీ మారకద్రవ్యమే ద్రవ్యం. ఆకాశాన్నంటే భవనాలను డబ్బులు పోస్తే ఏ దుబాయివాడన్నా తేలిగ్గా కట్టేస్తాడు. కడుతుండుగానే కూలిపోయే ఫ్లైఓవర్లను పుక్కిలించి ఉమ్మేస్తేనే పుసుక్కుమని తెగిపోయే కరకట్టలను చూడాలంటే మన రాష్ట్రానికే రావాలని

ప్రపంచానికి తెలిసే ఏర్పాటు చేస్తే చాలు- పర్యాటకుల ప్రవాహాన్ని ఆపటానికి ప్రత్యేక దళా లను నియమించాల్సివస్తుంది. మనదగ్గర తయారవుతున్నన్ని దిష్టిబొమ్మల రకాలు ప్రపంచంలో ఎక్కడా దొరకవు. వాటిని కనక అమ్మకానికి పెడితే బార్బీ బొమ్మల రికార్డును బద్దలు కొట్టడం ఖాయం. ఊరేగింపులకు అనుమతివ్వటం లేదని చెడ్డపేరు మూటగట్టుకునేకన్నా, ఆందోళనకారుల సంఖ్యను సమయాన్ని బట్టి సుంకాలు వసూలుచేసి చూడండి.. గవర్నమెంటు ఇంకో ఖజానా తెరుచుక్కూర్చోవాల్సొస్తుంది. వేలం వేసుకోవడానికి భూములైపోయాయని మొహాలు వేలాడేసుకుని బాధపడుతూ కూర్చునే కన్నా, ఏ పనీలేని సచివాలయం భవనాలు అలా ఖాళీగా పడున్నాయి గదా! ఓ చంద మడతమంచాలు పరిచి సిటీకి పనిమీదొచ్చేవాళ్లకు అద్దెకిచ్చే పని మొదలుపెడితే ఆదాయం దానంతటది తన్నుకుంటూ రాదా మామా ! దానిమీదొచ్చే వడ్డీతోనే ప్రభుత్వోద్యోగులకు నలభైశాతమేం ఖర్మ ఏకంగా ఆర్టీసీ ఉద్యోగులకు మల్లే వందశాతం ఫిట్ మెంట్ ఇచ్చేయొచ్చుగదా! పప్పులూ నూనెల ధరలు దిగిరా నప్పుడు తెలివిగా అమరణ నిరాహారదీక్షలను ప్రోత్స హించాలి. రిలేదీక్షలకు దిగినవారిని ఆహార పొదుపు ఉద్యమంలో స్వచ్ఛంద కార్యకర్తలుగా గుర్తించి ప్రోత్సహించాలిగాని, పోలీసు కేసులు మోపి బలవం తంగా సెలైన్ బాటిళ్లు పెట్టి అల్లరిపాలవటం ఎంత తెలివితక్కువతనం! అక్రమ నిర్మాణాలమీద అపరాధ రుసుం వసూలు చేసి క్రమబద్ధీకరించే విధా నాన్నే అక్రమార్జనలకూ వర్తింపజేసి చూడండి ఆ నల్లధనం మీద జమపడే రుసం సొమ్ముతో ఏ లోటూ లేకుండా రెండు లక్షల బడ్జెట్ బ్రహ్మాండంగా ప్రవేశపెట్టేయొచ్చు. 'చుక్కల మందు' మీద పెట్టే ఖర్చును మందుచుక్కల మీదకు మళ్లించి ఉంటే మందుబాబులు ఈపాటికే మన ఖజానాను ఏడుకొండలవాడి హుండీకన్నా వేగంగా నింపి ఉండేవాళ్లు. బుర్రుండాలిగానీ...




'బుర్రంటే గుర్తుకొచ్చింది.... వీటన్నింటికన్నా తేలికైనది. . తెలివైనది. . పుణ్యమొచ్చేది. . మన జనాలకు తెగనచ్చేది ఇప్పుడే ఒకటి నా బుర్రకే తట్టిందిరా అబ్బాయ్! పండుగొచ్చినా పబ్బమొచ్చినా ముందుగా మనమందరం పరిగెత్తేది ఎక్కడికీ? ఆ ఏడుకొండల వాడి కొండకేగా! ... రింగురోడ్డు మీద టో ల్‌ ట్ లాంటిదొకటి అలిపిరి కూడలి దగ్గరా ఏర్పాటు చేస్తే సరి! గుండు పన్ను గట్టిగా వసూలు చేస్తే చాలు.. నీ బోటి కోన్ కిస్ గా గాళ్ల సలహాలు వినే యాతన పెద్దాయనకు తప్పుతుందిగా! 




బాగానే ఉందిగాని మామా... మరందరూ గుండుతోనే కొండ దిగుతారని గ్యారంటీ ఏంటంట! 'జుట్టుతో దిగితే గుండును దాచినందుకు జరిమానా వేయొచ్చు. నువ్వే చెప్పావుగా.. మనసుంటే బోలెడు మార్గాలు. ఏదైనా దేవుడి కార్యమే గనక ''ఎవరూ కిమ్మనలేరు. 




- రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈ నాడు - ప్రచురితం - తేదీ తెలియదు )


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...