Monday, December 13, 2021

ఈనాడు - సంపాదకీయం శృంగార కళాశాల రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం- 11-03-2012 )

ఈనాడు - సంపాదకీయం 

శృంగార కళాశాల 


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం- 11-03-2012 ) 



సభ్యసమాజం దృష్టిలో శృంగారమంటే, నాలుగ్గోడల నడుమ మూడో కంటపడకుండా స్త్రీ పురుషులిద్దరి మధ్య మాత్రమే సాగే ముద్దుము చ్చట. శృంగారానికి అనువైన రసాయనిక తతంగం శారీరకంగా జరగ కపోతే ఎనభైనాలుగు లక్షల జీవకోటిలో ఒక్కటీ మిగలదు. ' బ్రహ్మ కును బ్రహ్మయైన నారాయణుండు/ మొదలుగా సర్వజీవ సమూహ మునకు/ బ్రప్రధానంబు శృంగార రసము గాదె' అంటారు పానుగం టివారు కంఠాభరణంలో. భరతుడి కోరికమీద కైశికీవృత్తి నాట్య ప్రయోగానికని శృంగారాంగనలను సృష్టించింది సాక్షాత్తు ఆ బ్రహ్మదే వుడే. తనకు ప్రదక్షిణ చేస్తున్న తిలోత్తమ అందచందాలు చూసి తల తిప్పుకోలేకే దక్షిణామూర్తి చతుర్ముఖుడయ్యాడని ఒక చమత్కారం. వేయికళ్లతో అనుక్షణం ఊర్వశివంటి అందాలరాశుల ఒంపుసొంపులు చూసే దేవేంద్రుడు సైతం అహల్యమీద కోరిక చంపుకోలేక తిప్పల పాలయ్యాడు! శ్రీరామచంద్రుడు సీతారమణుడు. గోదాదేవి కొప్పులో ముడిచి ఇచ్చిన పూలతో తప్ప అభిషేకాన్ని ఒప్పుకోలేదు శ్రీరంగనాథుడు . ముద్దుపళనివారి మాధవుడైతే రాధికాదేవి శృంగార యౌవన క్షీరాబ్ధి నడుమ 'నజుడొనర్చిన మోహన యంత్రము' లాగ ఎపుడెపుడు కలియతిరుగుదామా అని కలవరించాడు. శృంగారకేళిలో సంతృప్తి చెందితే యజ్ఞం చేసినంత పుణ్యం- అంటుంది బృహదారణ్యకోపని షత్తు. నూరేళ్లు సంసారం చేసినా ఏ పూటకాపూట మరో రోజుకు ఆగమని కండు మహాముని అంతటివాడే ప్రమోచను ప్రాధేయపడ్డాడు (విష్ణుపురాణం). సర్వసంగపరిత్యాగులనే అంతలా అల్లాడించిన ఉల్లాస  వ్యాసంగం మామూలు మానవుల కాలు నిలవనిస్తుందా!


ఛాందోగ్యోపనిషత్ పేర్కొన్న అష్టాదశ విద్యలలోని  దేవజన విద్యా విభాగంలో శృంగారం ఒక ప్రధాన అంగం. కరుణశ్రీ భావించినట్లు 'ఏ ప్రేమ మహిమచే ధారుణి చక్రము ఇరుసు లేకుండగనే తిరుగుచు న్నదో- ఆ మహాప్రేమకు ప్రేరణ శృంగారమే. నిగనిగని మోముపై నెరులు గెలకుల చెదర/ పగలైన దాక చెలి పవళించెను' అంటూ అన్న మయ్య అమ్మ శృంగార సౌందర్యాన్ని వర్ణించి తరిస్తే- 'మగువ తన కేశికా మందిరము వెడలే/ వగకాడ మా కంచి వరద తెలతెలవారెన నుచు' అంటూ క్షేత్రయ్య అయ్య సుమ సురతి బడలికలను తరచితరచి వర్ణించి తరించాడు. వివిధ దేవాలయాలమీద నేటికీ  కనిపించే మిథునశిల్పాలు ఒకనాటి తరానికి ఉద్దేశించిన కామశాస్త్ర కుడ్య పాఠాలు- అని తాపీ ధర్మారావు వంటి పరిశోధకుల వాదం. ఉత్తర భారతంలో హోలీ యువ సమూహాలు నేటికీ ఆడుకునే 'రంగుల క్రీడ' ఒకనాటి కామదేవుడి ఆరాధనోత్సవాల అవశేషమే. మొహంజొదారో తవ్వకాలలో  బయల్పడిన పుష్కరిణి సరస సల్లాపాల కోసం బ్రహ్మ కల్పించిన సరోవరమే అంటూ సశాస్త్రీయంగా రుజువు చేసిన డి.డి. కోశాంబివి వట్టి మాటలని కొట్టి పారేయలేం. శృంగారం బంగారం లాగా మెరుగులీనుతుంటేనే కదా ఏ యువజంటకైనా కళ!  పనిపాటలవేళ శ్రమ తెలియకుండా జానపదులు ఆలపించే పదాల నిండా శృంగార సుమ పరిమళాలు గుప్పుమంటుంటాయి. గోపికా స్త్రీల జలక్రీడలనుంచి గోంగూర పాటలదాకా- జీవితం ఎంత వైవిధ్యమో జానపదుల లొల్లాయి పలుకులూ అంత వైవిధ్యమంటారు డాక్టర్ బిరుదురాజు రామరాజు. సరస రసానికి దేశ కాలాలు ఏముంటాయి?  'మనసు' పుట్టినప్పుడే మనిషికి 'మనసు పుట్టడం' మొదలయింది .


శేషం వెంకటపతి- ' శశాంక విజయం'లో తర్క, శబ్ద, యోగ, సాంఖ్య, మోక్ష, ద్వైత, అద్వైత సిద్ధాంతాలన్నింటినీ కామకళకు జోడించి కనువిందు చేశాడు. 'ఏను నీవని పైకొనుటేను ద్వైతం- ఇరువురొకటైన అద్వైతమిద్ధరిత్రి' అంటూ సిద్ధాంతీకరిస్తే ఎంతటి సిద్ధులకైనా తొలినాటి ముద్దుముచ్చట్లు మదిలో మెదిలి పులకింతలు పుట్టక మానవు . మదన భావమంటే అంత తీపి బాధ మరి! నండూరివారి నాయుడుబావ మధనపడిపో యినట్లు- 'మందో మాకో యెట్టి మరిగించినట్లుంటుందా ఇది. గుండె గొంతుకలో కొట్లాడుతుంటే... వల్లకుందామంటే... గౌరీవల్లభుడి వల్లే కాలేదు మరి . కొనకళ్లవారి 'బంగారి' భామ- 'దారంటపోయే మామ కాలిధూళిగా  మారి రాలిపోయినా చాలు బతుకు పండిపోతుంది' అనుకుం టుంది. వలపు పెంకితనానికి యెంకి, నాయుడుబావ అనే భేదభావ మేమిటి? పానుగంటివారు చూడామణిలో చెప్పినట్లు ' ప్రకృతి నెట జూడు శృంగార రసమె, సర్వ/ సృష్టికి బ్రధాన సూత్రము' సరస రసమే! మొదటి కుళోత్తుంగుడు యుద్ధరంగంలో అంతఃపుర చెలులు నిద్రలో అతడి చిలిపి చేష్టలను తలచుకొనేవారు. మేలుకొని ఆ ' వెడద చన్నుల మీది ఆ విదియ చంద్రుల' కోసం తడుముకొనేవారు! అంత చిత్తచాంచల్యం శృంగారానిది. అదను తప్పినా, అదుపు తప్పినా అది చేసే బతుకు బీభత్సానికి పాండురంగ మాహాత్మ్యం నిగమశర్మే ప్రథమ ఉదాహరణ. అందుకే శృంగార కళను ఓ శాస్త్రంగా అభ్యసిం చవలసి ఉందని కామసూత్రాలను క్రీస్తు శకారంభం నాటికే వాత్సాయనుడు క్రోడీకరించి పెట్టాడు. పడకగది ముద్దుముచ్చట్లు అచ్చంగా ఆ పడుచు జంట గుప్తజ్ఞానమే కావచ్చు.  కానీ తెలియనివి, తెలుసుకోవాల్సినవీ, అడగలేనివీ, బిడియంవల్ల అడగనివీ, ఎవరిని అడగాలో తెలియనివీ బోలెడన్ని సందేహాలు... దేహధర్మం గురించి. అందుకే పండంటి సంసారానికి అత్యంత అవసరమైన ప్రేమబంధంతో శృంగారబంధాన్ని ముడివేయాలన్న సదుద్దేశంతో మరియా థాంప్సన్ శృంగార పాఠశాల ఏర్పాటుకు సిద్ధపడ్డారు. వియన్నాలోనే కాదు, భూమ్మీదే అది తొలిశృం గార కళాశాల. హింసాత్మక ప్రేమస్థానే ఆత్మీయానురాగాలను అది పెంపొందిస్తుందంటే- అందుకు అభ్యంతర పెట్టాల్సింది ఏముంటుంది? చట్టానికి, సభ్యతకు లొంగి ఉన్నంతకాలం శృంగారానికి స్వాగతం పలకవలసిందే!


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం- 11-03-2012 ) 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...