Wednesday, November 10, 2021

అమ్మల పండుగ - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ఆదివారం సంపాదకీయం )

 సాహిత్యం : 

అమ్మల పండుగ

- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ఆదివారం సంపాదకీయం ) 


కౌసల్య తన 'పేరేమిటో' చెప్పమంది. 'రా' అనే అక్షరం, 'డు' అనే అక్షరం పలకడం రాని చిన్నారి రాముడు 'లాములు' అంటాడు. 'నాన్న పేరేమిటి నాన్నా?' అని అడుగుతుందీ సారి. 'దాచాతమాలాలు' అంటాడు బాలుడు ముద్దుగా. 'మరి నా పేరో?' రెట్టించిన ఉత్సాహంతో మరో ప్రశ్న. అమ్మతోనే కానీ.. ఆమె పేరుతో పనేంటి చంటి పిల్లలకి? 'అమ్మగాలు' అంటాడు బాలరాముడు అత్యంత కష్టం మీద. 'కౌసల్య తండ్రీ' అని బిడ్డడ్ని సరిదిద్దబోయి అప్పటికే నాలుక తిప్పటం రాని రాముని కళ్ళలో చిప్పిల్లిన నీరు చూసి తల్లి గుండె చెరువైపోతుంది. 'కౌసల్యను కానులేరా నాన్నా!.. 'వట్టి అమ్మనేరా నా చిట్టి రామా !' అంటో అమాంతం ఆ పసికందుని తల్లి గుండెలకు హత్తుకునే రమణీయ దృశ్యం విశ్వనాథ వారి 'రామాయణ కల్పవృక్షం'లోది. నవ మాసాలు మోసి రక్త మాంసాలను పంచి కన్న పాప- 'కనుపాప కన్న ఎక్కువ' అనటం 'సుమధుర భావనామృత సుశోభిత మాతృ హృదంతమ్ము'ను తక్కువ చేయడమే. సంత్ జ్ఞానానంద యోగి ప్రవచించినట్లు తాయి 'సంతతి సంతత యోగ దాయి.' 'చల్లగ కావు మంచు మనసార పదింబది దైవ సన్నిధిన్ మ్రొక్కుచునుండు' మాత వాత్సల్యాన్ని ప్రసిద్ధ ఆంగ్ల రచయిత రాబర్ట్ బ్రాల్ట్ మాటల్లో చెప్పాలంటే 'తల్లి నివేదనకన్నా ముందుగా బిడ్డ కామన చేరగలిగే ప్రార్థనాస్థలి సృష్టి మొత్తం గాలించినా ఎక్కడా దొరకదు'. గణాధిపత్యం కోసం శివపుత్రులిద్దరి మధ్య స్పర్థ ఏర్పడింది. మయూరవాహనుడికి సర్వ తీర్థాలలో తనకన్న ముందుగా అన్న మూషికారూఢుడై సందర్శనమివ్వడం ఆశ్చర్యం కలిగిస్తుంది. తల్లి కామన వల్లే సిద్ధివినాయకుడికా విజయం సిద్ధించిందన్న ధర్మసూత్రం వల్లీనాథుడుడికి అప్పుడు కాని బోధపడదు. వానలో తడిసి వస్తే తడిసినందుకు నాన్న తిడతాడు. అదే అమ్మైతే? 'ఈ పాడు వాన నా బిడ్డ ఇంటికి వచ్చిందాకా ఆగకూడదా' అంటో వాననే శాపనార్థాలు పెడుతో బిడ్డ తలతుడుస్తుందిట. అమ్మ అంటే అది. హిందువులు సంధ్యావందనంలో 'తల్లిలా కాపాడమని' జలదేవతను ప్రార్థించేది అందుకే.


ఏడాదికి పన్నెండు మాసాల పర్యంతం వారంలో ఒక్క రోజైనా విశ్రాంతి లేకుండా ఇరవై నాలుగ్గంటలపాటూ అనుక్షణం బిడ్డమీద వాత్సల్యం కురిపించినా తృప్తి చెందనిది సృష్టిలో అమ్మ ఒక్కతే. 'తండ్రిం జూడము తల్లి జూడము యశోదాదేవియున్ నీవు మా/తండ్రిందల్లియు నంచు నుండుదుము.. యింతటివారమైతిమి గదా తత్త ద్వయోలీలలన్' అంటో రెండు చేతులూ జోడిస్తాడు ముకుందుడంతటి వాడు నందుని సందర్శనార్ధమై రేపల్లె వచ్చిన సందర్భంలో భాగవతంలో. ఈశుడు ఓంప్రథమంగా సృష్టించిన ఈశానాం ( లక్ష్మీ దేవి ) ఈశిత్రి ( జగత్తు) ని అమ్మలా పాలిస్తుంటుందని పరాశరబట్టర్ ద్వయ మంత్రశ్లోక సారంశం. అమ్మతో కూడున్నవేళ ఆ భగవానుడు చేసే జగత్పాలనా విలక్షణంగా ఉంటుందని ఆళ్వారుల నమ్మకం. 'జగన్నాథుడిని అలా తీర్చి దిద్దే శక్తి అమ్మదే. నాయన గొప్ప సంపద అమ్మే' అని కదా శ్రీస్తవ స్తోత్రం ! సర్వ భూతాలలో ద్యోతకమయ్యే దివ్యశక్తిని మాతృరూపిగానే సంభావిస్తుంది దుర్గా సప్తశతి కూడా. 'తల్లుల చల్లని ప్రేమలు,/పిల్లల మాటలు, నగవులు, ప్రియమగు పాటల్/ ఫుల్ల ధవళ కుసుమ సరము/లల్లా తెల్లని మనసున కతి ముదము నిడున్' అని అల్లాచల్లని దయమీదో చక్కని అష్టకం ఉంది. అకాళికమూ, అసాయి, అనల్లా, అనేసు అనేవి ప్రేమలోకంలో చెల్లవు. దుర్గా, ఫాతిమా, యేసు తల్లి మేరీ, బుద్ధుని మేనత్త గోతమి, బహాయీల తాయి తాహిరి, మహావీరుని తల్లి త్రిషాల.. మాతృ ప్రేమకు కులమతాల దేశకాలాల ఎల్లలే ముంటాయి? గ్రీకులకు వార్షిక వసంతోత్సవాలలో దేవతల తల్లిని ఆరాధించడం ఆనవాయితీ. ప్రాచీన రోమన్లు హీఠారియా పేరిట దేవతామూర్తి సిబెల్ను మాతృపీఠం ఎక్కించారు. యేసు తల్లి గౌరవార్థం ప్రాచీన క్రైస్తవులు మాతృదినోత్సవం జరుపుకునే వారు. ఇంగ్లాండ్ తల్లులందరికీ 'మదరింగ్ డే' పేరిట ఆటవిడుపు. అదే రోజునుఅమెరికా దేశమూ 'తల్లుల దినోత్సవం'గా ఆమోదించి వచ్చే ఏటికి శతాబ్దం. ప్రపంచీకరణ ప్రభావం..ఇవాల్టి రోజును మరెన్నో దేశాలూ తల్లికి నివాళులిచ్చే ఓ సంబరంగా జరుపుకుంటున్నాయి. ప్రేమాభిమానాల పాలు భారతీయులకూ అధికమే. మాతృదినోత్సవం మనకూ ఓ ముఖ్యమైన పండుగవడంలో అబ్బురమేముంది?


కాలం సనాతనమైనా.. అధునాతనమైనా అమ్మ పాత్రలో మాత్రం మారని అదే సౌజన్యం. బిడ్డ కోరితే గుండైనా కోసిచ్చే త్యాగం. కోటి తప్పిదాలనైనా చిరునవ్వుతో క్షమించేయగల సహనం. గుళ్లోని దేవుణ్ని అడిగాడు ఓ సత్యాన్వేషి 'అమ్మ' అంటే ఏమిటని? 'తెలిస్తే ఆమె కడుపునే పుట్టనా ! 'అని ఆయనగారి ఉత్తరం. భిక్షమడిగే బికారి నడిగాడీసారి. 'బొచ్చెలోని పచ్చడి మెతుకులేన'ని సమాధానం. మానవులతో కాదని చివరికి పిల్లిపిల్లను చేరి అడిగితే.. కసిగా కరవబోయిందా పిల్లతల్లి. నడిచే దారిలో ఓ రాయి తాకి తూలి పడినప్పుడు కాని తెలిసి రాలేదా సత్యాన్వేషికి తన పెదాల మీద సదా 'అమ్మా'లా దాగుండేదే అమ్మని. విలువ తెలియని వారికి అమ్మ అంటే 'ఇంతేనా?' తెలుసుకున్న వారికి 'అమ్మో..ఇంతనా!' అనిపిస్తుంది. 'ఆపద వచ్చినవేళ నారడి బడినవేళ/పాపపువేళల భయపడిన వేళ/ వోపినంత హరినామమొక్కటే గతి..' అని అన్నమాచార్యుల వారన్న ఆ ఒక్క హరినామానికి అమ్మపదమొక్కటే ఇలలో సరి. అద్దాలనాటి బిడ్డలకి గడ్డాలు మొలుచుకొచ్చి ఆలి బెల్లం.. తల్లి అల్లమతున్న రోజులివి. కాలమెంతైనా మారనీ.. పెరటి తులసి వంటి అమ్మలో మాత్రం మార్పు లేదు. రాబోదు. అందుకేనా చులకనా? బిడ్డను చెట్టులా సాకేది తల్లి. ఆ తల్లికే కాస్తంత చెట్టునీడ కరవా? జీవితం పంచి ఇచ్చిన ఆ తల్లికి 'జీవించే హక్కు' ఇప్పుడు ప్రశ్నార్థకం ! తల్లి కన్నీటికి కారణమైనాక బిడ్డ ఎన్ని ఘనకార్యాలు ఉద్ధరించినా నిరర్ధకమే. కన్నీటి తడితో కూడా బిడ్డ మేలు కోరేది సృప్తి మొత్తంలో తల్లి ఒక్కతే. 'అమ్మకై పూదండ/లల్లుకుని వచ్చాను/అందులో సగభాగ/మాశ పెడుతున్నాను/ మా యమ్మ మాకిత్తువా దైవమా ! /మాలలన్నియు నిత్తురా!' అని మాతృవిహీనుడైన ఓ కవిగారి మొత్తుకోలు. అమ్మ పాదాలు దివ్య శోభాకరాలు, పరమ కృపాస్పదాలు, సకల భయాపహాలు, అమ్మ పాదాలు.. కొండంత అండ! స్తోత్రాలు సరే. 'అమ్మ పండుగ' ఏడాదికి ఒక్కనాడే. నిండు మనసుతో బిడ్డ ఆదరించిన ప్రతిక్షణమూ అమ్మకు నిజమైన పండుగే. ఈ 'అమ్మల పండుగ' నుడైనా చాలు.. అమ్మ మేలుకు బిడ్డలు మళీ నాంది పలికితే అదే పదివేలు.

***

- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ఆదివారం సంపాదకీయం ) 

దారుణమేలా? - ఈనాడు వ్యంగ్యం



 వ్యంగ్యం 

దారుణ మేలా! 

- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపా - 21 -01 - 2003 ప్రచురితం) 


పీక్ అవర్సులో సిగ్నల్ దగ్గర బండి ఆగ గానే గ్రీన్సిగ్నల్ పడేలోగానే క్రెడిట్ కార్డు అంటగట్టి పోయాడో గట్టిపిండం. 


ఈసురో మని ఆఫీసుకు రాగానే బాసురమ్మన్నాడని పిలుపు. 


ఆలస్యమైందని క్లాసు పీకుతాడు. . కామోసని కంగారుగా పోగానే ' కంగ్రాట్యులే షన్సోయ్ సుబ్బారావ్ ' అంటూ ఎన్నడూ లేనిది ఎదురు కుర్చీ చూపించాడు


 'ఎంతకాలమిలా ఆ తుక్కు చేతక్కు తొక్కుతూ ఆఫీసుకు ఆల స్యంగా వస్తుంటావు? మారుతీ సెకండు హ్యాండొకటి మంచి బేరానికొచ్చింది. తీసుకో! అంటూ కాగితాలేవో కొన్ని నాముందు పారేశాడు. 


తీరాచూస్తే అవి ఒక లక్షకు అప్పు పత్రాలు! 


' అప్పా సార్! నేనడగలేదే!' అన్నాను ఆ శ్చర్యపోతూ. 


అడగందే ఇవ్వకుండా ఉండేందుకు ఇదేమన్నా అమ్మపెట్టే అన్నంటయ్యా?  అప్పు . చందమామ ఏమడిగాడని సూర్యుడలా కిరణాలను రుణంగా ఇచ్చేస్తున్నాడు... చంద్రబాబు ఏమడిగాడని ప్రపంచ బ్యాంకు అలా వెంటపడి అప్పిచ్చేసిందీ! చెయ్... ముందు సంతకం!' అని గదమాయించేశాడు బాసు.


ఒకప్పుడు కప్పుడు పంచదారపుకోసం చెప్పులరిగేలా ఎన్ని పంచలెక్కి దిగాల్పొ చ్చేదీ...? 


ఇప్పుడిలా ఇంటిమీద పడి ఇంటి లోనిస్తామనీ, పిల్లాడితో కలిసుంటే స్టడీలో నిస్తామనీ, పిల్లతో కలిసిచూస్తే మారేజికి లోనరేంజ్ చేస్తామనీ అడుగడుగునా అప్పుల వాళ్ళు చెడుగుడాడేస్తుంటే ఏ పాతాళం అడు కెళ్ళి దాక్కోవాలో దిక్కుతోచటం లేదురా దేవుడా! 


రీఫామ్స్ మహత్యం! మనీ ఏదో ఫారంలో రొటేట్ కాకపోతే మార్కెట్టే రాట వుతుందని మల్టీ నేషనల్ బ్యాంకులు కూడా మధ్యతరగతి వాడింటిముందు పల్టీలు కొడు తున్నాయిప్పుడు. 


అప్పు ఏరూపంలో ఇచ్చినా అపురూపంగా పుచ్చుకునేదీ మధ్యతరగతి జాతేగా ! 


హరిశ్చంద్రుడి రోజుల్లో గానీ ఈ రీఫారమొచ్చుంటే నక్షత్రకుడి అప్పునలా ఆలినమ్ముకుని తీర్చాల్సొచ్చేదా?


అప్పనంగా అప్పిస్తుంటే తీసుకోడానికేం నొప్పి ' అంటూ 

కేకలేయటం మొదలెట్టాడు మా ఆఫీసరు

 "అప్పెంత గొప్పదో నీకు తెలుసా సుబ్రావ్! తిరుపతి వెంకన్నకు అంత పరపతి  ఉన్నా పెళ్ళికోసం అప్పెందుకుచేశాడో తెలుసా? గొప్పకోసం. అప్పర్ క్లాసంటే అప్పులున్న  లోవర్ క్లాసనేనయ్యా బాబూ అర్థం. అప్పంత గొప్పది కనకనే మన ఉపనిషత్తులు సైతం పంచభూతాల్లో అప్పును చేర్చి మరీ స్మరిస్తున్నాయి. అప్పంటే నీరని ఇంకో అర్థముంది  తెలుసుకో! భగీరధుడంతటి మహర్షి  ఆ అప్పు కోసమేగా శివుడిని వేడుకున్నదీ ! మిడిల్‌ క్లా సోళ్ళం... మనమోలెక్కా!'


' నిజమేకానీ... నేనింతవరకు ఒక్క  బేడా కూడా అప్పుచేసి ఎరుగను సార్‌!' అన్నా బిక్కమొగమేసి.. 


'అదే తప్పు . చెప్పుల్లేనివాడుమోగానీ... అప్పుల్లేని వాడున్నాడంటే న్నమ్మనోయ్ సుబ్బారావ్! సుతులు రుణస్థులని పాపం, పోతనగారు ఆ వామనావతార వర్ణనలో ఎలా వాపోతున్నారో చూడు!  "దారాసుతులు రుణ రూపాలని శంకరాచార్యులవారెప్పుడో భాష్యం చెప్పారు. మానవ బంధాలన్నీ రుణానుబంధాలేనని గురజాడ  అప్పారావుగారు అప్పట్లోనే గుర్తుపట్టేరు. కాబట్టే కన్యాశుల్కాన్ని గిరీశం అరువుసీనులకు  పెన్చేశారు. అప్పిచ్చువాడు లేని ఊర చొరపడద్దని సుమతీ శతకకారుడు శతవిధాలా కోప్పడ్డాడనే గదయ్యా మనమీ రుణానంద లహరికి నాందీ పలికిందీ!  అహ... నువ్యా

 సూ ర్యుడికన్నా గొప్పోడిననుకుంటున్నావా? '' అంటూ కోపానికి దిగారు ఆఫీసరుగారు. 


'' అదేంటి సార్... అలాగనేశారూ? " 

" లేకపోతే ఎందయ్యా... సూర్యుడంతటి వాడు కూడా సముద్రాల నుంచి  అప్పుచ్చుకునే మేఘాలుగా మార్చి  భూమి ద్వారా  మళ్ళీ చెల్లిస్తున్నాడు. కాబట్టే కదా రుణచక్రం సక్రమంగా తిరుగుతూ సృష్టి నడుస్తోందని ముళ్ళపూడివారి  అప్పులప్పారావెప్పుడో చెప్పిందీ!  అప్పంతగొప్పది కనుకనే  అప్పుడెప్పుడో  లోగడ మన ఇందిరమ్మగారు ఇండియాలో ఆసియా క్రీడలాడిస్తున్నప్పుడు 'అప్పు' నే  లోగోగా వాడిందయ్యా!  అంతెందుకూ...? మొన్న మన ఏపీలో సీయం గారు  ఆడించిన ఆటల్లో గెలిచిన పతకాల్లో మెజారిటీ అరువాటగాళ్ళచలవేనని తెలీనివా డెవడున్నాడూ! పిలిచి మధ్యాహ్న భోజనం పెడతానంటే మజ్జిగలోకి వంకాయబజ్జీ లేదని వంకపెట్టాట్ట వెనకటికి నీలాంటివెంకయ్యే ఒకాయన. లోను కావాలంటే వ్యసనాలకే లోను కానవసరంలేదయ్యా... దర్జాగా కారు కొనుక్కోవచ్చుగా! '


'అప్పుచేసి పప్పుకూడు తినమంటారా?' 


'అక్కడే పప్పులో కాలేస్తున్నావ్ సుబ్బా రావ్! అప్పుచేసిన పప్పుకూడిప్పుడస్సలు  తప్పేకాదు తెలుసానీకూ! పైపెచ్చు పెద్ద గొప్పకూడాను. కాబట్టే సి.యం లిక్కడా అక్కడా లెక్కా పత్రాల్లేకుం డా అప్పుడు వుట్టించే పోటీల్లో పడి  మరీ మధ్యాహ్నం పూటన్నాలు  పెట్టేస్తున్నారు. రుణాన్నెంత తృణమని తీసిపారేసినా అప్పు ల్నుంచీ నువ్వెప్పుడూ తప్పించుకుపోలేవు సుబ్బారావ్! తృణంలోనే రుణం దాగుంది. దీన్నే ఇంగ్లీషోళ్ళు హిడెన్ లోన్సంటారు. అలాగే 'హేలో ' అంటారు గదా! అంటే అర్థమేంటనుకున్నావ్! ' హేండు లో నుందా? "అనడగటమన్నమాట.  నీకో శాడ్ న్యూస్ చెప్పాలయ్యా! ! నువ్వు ఆల్రడీ అప్పులపా లయిపోయున్నావయ్యా;  నువ్విండియాలో పుట్టినపుణ్యానికి నీ తలమీదా  ఏటేటా పది వేల చొప్పున అప్పులవాటా పెరుగుతూనే ఉంటుందని ' నేషనల్ డెట్' పత్రం చెపుతూనేవుంది.  అందులోనే ఈ లోనూ ఉందనుకుని ముందు నా వంతు పదిశాతమక్కడ పెట్టి చెక్కుతీసుకు చక్కాపో... ఫో' అని బైటికి తోసేశాడు బాసు.


హే రామా! మిడిల్ క్లాసులో పుట్టడమే నేను చేసిన నేరమా! ఈ మిడిమేళపు మొబైల్లోను మేళాలను  ఆపటం నా తరమా! 


చేసేదిలేక చెక్కు పుచ్చుకొని ఇంటికెళితే మా ఆవిడ మరో క్లాసు పీకేసింది. 'అమాయకుడని గీర్వాణం నేర్పితే వరుణదేవుణ్ణి రుణమడిగేందు కెళ్ళాట్ట మీలాంటివాడే ఒకడు. రుణం  తరుణంలో తీర్చలేని వ్రణంలాగా సలుపుతుందని తెలీదా? సమయానికి తీర్చలేకపోతే 'ఇంతింతై... మరియు దానంతై... నబోవీధి పైనంతై... ' వడ్డీ నడ్డివిరగ్గొడుతుందని పోత నగారెప్పుడో చెప్పారు గదా స్వామీ! వేళకు వాయిదా రాకపోతే లోనిప్పించిన మీ బాస్ కాబూలీ వాలాలా వాలీబాలాడేసుకుంటాడు స్వామీ! అంతలావు బిగ్ బీనే అప్పులు తీర్చలేక ఏబీసీ క్లోజుచేస్తే... ఆఫ్టరాల్ మిడిల్ క్లా సోళ్ళం... మనమెంత? అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకునే కేసులు ఏపీ నిండా . . కుప్పలుతిప్పలుగా ఉన్నాయి. మనమూ ఆ జాబితాలో చేరాలని ఉందా  యేం? అని దబాయించేసరికి... 


నేరుగా బాసుదగ్గరికి పోలేక అప్పిప్పించిన ఏజెంటు దగ్గరికి పోవాల్సొచ్చింది. వాడి పేరు కరుణాకరంట:  పేరులోనే 'రుణం ఉండి చచ్చింది. 


 వాడు పీల్చి పిప్పిచేసి హాండిలింగు ఛార్జీలకని మరో పదివేలు నొక్కిగాని చెక్కు వెనక్కుతీ సుకోలేదు. 


పోనీలే... ఏ జన్మలోనో వాడికి రుణపడివున్నానోనని సరిపెట్టుకొందామను కొనేలోపలే మర్నాడాఫీసుకొచ్చి నోటుమీద సంతకం చేయమని కూర్చున్నాడా సైతానుగాడు. మళ్ళీ నోటిమాటరాలే నాకు. 


' అదేంటీ! నిన్నే నీకు చెక్కు తిరిగిచ్చేశాగా!' అనంటే 'చంపారు పొండి! వాడు నేను కాదు.  నేను నేనే సర్  కరుణాకర్. వాడు కణరుణాకర్. నేను కణాలు రుణంగా ఇస్తే పుట్టినక్లోనింగ్ శాల్తీ.  నాకు సంబంధంలేదు సార్!' అనేశాడు.


కణాలు కూడా రుణాలుగా ఇచ్చే రోజులొచ్చేసాయని మా కొలీగ్ అప్పలాచారికి అప్పటికప్పుడు అప్పులగొప్పతనం గురించి క్లాసు పీకటం మొదలెట్టాడు మా బాసు మరో లోనులో కమీషనుకు ఎర వేస్తూ. 


అదీ సంగతి! ఏ శరణాగతుడొచ్చి ఈ రుణగ్రస్తుల వెతలు తీరుస్తాడో.. దేవుడికే తెలియాలి! 


- కర్లపాలెం హనుమంతరావు

( 21/01/03 నాటి ఈనాడు దినపత్రిక సంపాదకీయ పుట గల్పిక ) 

వ్యంగ్యం -ఈనాడు - వినాయకుడికో విన్నపం - కర్లపాలెం హనుమంతరావు

 


వ్యంగ్యం -ఈనాడు 

- వినాయకుడికో విన్నపం 

- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - దినపత్రిక - సంపాదకీయపుట - గల్పిక) 


నాయకుడు లేనివాడు వినాయ కుడు- అని వ్యుత్పత్తి అర్ధమట. ఈ లెక్కన ఇప్పుడు ఉన్న నాయకులందరూ వినాయకులే. ఇంట్లో ఉడకేసుకునే కుంటికూర క్కూడా హస్తిన నుంచి అను మతి రావడం తప్పనిసరనే నాయకులు ఇప్పుడు అమ్మ మీదకే నేరుగా కొమ్ములు విసురుతున్నారు. అన్ని పార్టీ ల్లో దాదాపు అంతే. ఎవరికివారే నాయకులు.


వినాయకుడనగానే ముందు గుర్తుకొచ్చేవి- ఘన మైన ఊరేగింపు, ఆఖర్న నిమజ్జనం. మన నాయకుల దీ అదే తీరు. వాహనమొక్కటే తేడా. ఒజ్జగణప య్యకు బుజ్జి ఎలుక వాహనమైతే, ఈ అయ్యలు ప్ర జల వీపులమీద సవారీ చేస్తుంటారు. వారిలో చాలామందికి త్వరలో నిమజ్జన గండమూ తప్పదంటున్నారు. చూడాలి, ఎన్నికలెలాగూ ముంచుకొస్తున్నాయి కదా!


అసలు వినాయకుడికి ఈ కొసరు వినాయ కులకు 'విగ్రహం' విషయంలో లంకె కుదిరినట్లే ఉంది. రంగురంగుల హంగులు. రకరకాల ఆకారాలు. ఎత్తుల విషయంలో కత్తులు కటార్లు నూరుకోవటాలు! గుజ్జు వినాయకుళ్లకే ఇవన్నీ తప్పనప్పుడు... మరీ మరుగుజ్జులు కదా మన నాయకులు- వాళ్ల మధ్య పొరపొచ్చాలకు కొద వేముంది?


ఒక విషయంలో మాత్రం మన నాయకులే మేలు. 'ప్లాస్టిక్కవి... రసాయనాలవి వాడొద్దు మొర్రో... మట్టి వినాయకులే మన వాతావరణా నికి క్షేమం' అని ఎంత మొత్తుకున్నా చెవిన పె ట్టడంలేదు. మన నాయకులతో ఈ పేచీ లేదు. మొదటి నుంచీ వాళ్లు వట్టి మట్టిముద్దలే!


వినాయకుడి లడ్డూ ప్రసాదాలకు పోటీల మీద వేలం పాటలు నడుస్తుంటాయి ఈ పండగ రోజుల్లో. ఇటీవలి పంచాయతీ ఎన్నికలకు ముం దు జరగబోయే సాధారణ ఎన్నికలకూ బహుశా ఈ వేలంపాటలే ప్రేరణై ఉండాలి. ఎవరు ఎక్కువ మోయ గలిగితే వాళ్లకే లడ్డూల్లాంటి పార్టీ టికెట్లుగా నడుస్తు న్నది ప్రస్తుత ప్రజాస్వామ్యం!


వినాయకుడికి ఆ గణాధిపత్యం ఎలా వచ్చిందో అందరికీ తెలుసు. తమ్ముడు పాతకాలం చాదస్తపు నేత లాగా పుణ్యనదుల్లో మునిగి రావడానికి వెళ్లాడు. తెలి విమీరిన వినాయకయ్య 'అమ్మా అయ్యా' అంటూ చుట్టూ చక్కర్లు కొట్టి ఇట్టే పదవి కొట్టేశాడు. ఆ తెలివే


మన నాయకులకు ఒంటపట్టిందన్నది బడిపిల్లవాడికి కూడా తెలిసిపోయిన రాజకీయ రహస్యం.


ఏనుగు తొండంలాంటి రూపాయి ఎలుకతోకంత చిక్కిపోయింది. సృష్టిలో జరిగే సర్వకార్యాలకీ సాక్షి అంటారే గణపయ్యని... మరి రూపాయి పతనానికి నిజమైన కారణం ఆయనకైనా తెలుసో లేదో! ఆయనా ప్రధానిలాగా మౌనముని ముద్ర దాలిస్తే ఎలా?

కనీసం బొగ్గుకోణం ఫైళ్ల గల్లంతుకు సంబంధించి అయినా నోరువిప్పితే బాగుణ్ను!


కుడుములు ఉండ్రాళ్లు కడుపునిండా పట్టించే ఆహార భద్రత బిల్లు వచ్చిందని ధీమానా? అయ్యో! ఇది రేపొచ్చే ఎన్నికల వలయ్యా పిచ్చిస్వామీ! ఎన్నికలు అయిదేళ్లకోసారే... నీ పండుగ ఏటా వచ్చేది!


శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం/ ప్రసన్నవదనం ధ్యాయేత్' అని మా నాయకులు నిన్ను ప్రార్ధిస్తున్నారని మురిసిపొతున్నావా ? పని పడితే గొప్పగా వసుదేవుడి పేరు చెప్పుకొని మరీ గాడిద కాళ్లైనా పట్టుకు వేళ్లాడే అవకాశవా దులు మా నాయకులు. ఓడ దాటించిన మల్లయ్యలెందరు బోడిమల్లయ్యలైపోలేదూ?


అదేదో శివాగమంలో ఉందట. బ్రహ్మేంద్రాది దేవ తలు, రుషిగణాలు, తతిమ్మా అఖిల జగజ్జగాలన్నీ ప్రార్ధించిన మీదటగానీ నీకీ గణాధిపత్యం, క్రియారంభాది కార్యాల మీద అధికారం లభించింది. కాదని! ఇప్పుడు, ఇచ్చోట ఆ అధికారాలన్నీ ఒక ముద్ద పప్పు బాబుకు బదలాయించే కుట్ర ప్రచండవేగంతో నడుస్తోంది. చూసుకో మరి!


ఎప్పుడో హాలుడు గాథాసప్తశతిలో నీ లీలలను మహా పసందుగా వర్ణించాడు. తొండంతో నువ్వేదో సముద్రజలాలన్నింటినీ తోడిపారేస్తే బడబాగ్నికి ఆకాశం అంటుకుందట! అప్పటి ఆ సరదాలకేంగానీ... ఇప్పుడు ముంచుకొస్తున్న ముప్పును కాచుకో వినాయకా!


సామాన్య జనమంతా అమాయకంగా ఈ నాయకులను నమ్మిన పుణ్యానికి ఇవాళ ఇక్కడ రకరకాలుగా మలమల మాడుతున్నారు. వికృత రాజకీయాల కోరలకు చిక్కి విలవిల్లాడుతున్నారు. కాయగూరలేవీ భూమ్మీద కనబడకున్నా ఉన్నంతలోనే పూలతో పళ్లతో నీ పాలవెల్లిని భక్తిగా అలంకరించుకున్నాం. పప్పులు, అపరాలు బంగారంతో పోటీపడుతున్నా నీ కడుపు నింపా లని మా కడుపులు మాడ్చుకుని కుడుములూ, ఉండ్రాళ్లూ నైవేద్యంగా సమర్పిస్తున్నాం. ప్రతి పం డగకు నీ వ్రతకథ విని మనస్ఫూర్తిగా నీ ముందు పిల్లాపాపలతో సహా గుంజిళ్లు తీస్తున్నాం.


ఎన్ని ఇబ్బందులొచ్చినా నీ జన్మదినాన్ని మా ఇంటి పండగలా జరుపుకొనే మేం, అన్ని దారులూ మూసుకుపోగా చివరికి నిన్నే నమ్ముకున్నాం. వచ్చే ఎన్నికలనాటికైనా మాకు సద్బుద్ధి ప్రసాదించు, సత్ క్రియాసిద్ధి కలిగించే నాయకులనే మాకు ప్రసా దించు, సిద్ధిబుద్ధి నాథా !


చేటల్లాంటి చెవులున్నాయి... జనాల గుండె చప్పుళ్లు ఎన్నాళ్లకూ వినకపోతే ఇక నీకూ, మా నాయకులకూ మరి ఎందులో తేడా స్వామీ... కనికరించు వినాయకా!


- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - దినపత్రిక - సంపాదకీయపుట - గల్పిక) 




బాపూజీ బతికిపోయాడు! - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు దినపత్రిక - 30 - 10-2003 నాటి సంపాదకీయ పుట గల్ఫిక)

 


సాహిత్యం - వ్యంగ్యం - కథానిక :

బాపూజీ బతికిపోయాడు! 

- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు దినపత్రిక - 30 - 10-2003 నాటి సంపాదకీయ పుట గల్ఫిక) 



బాపూజీ చనిపోయాడు  

చప్పట్లు

గోడ్సే  విసిరిన గోలీ పుణ్యమా అని 

బాపూజీ చనిపోయాడు. 

మళ్ళీ చప్పట్ల చపుళ్లు 

 వేదిక మీద ఉన్నాయన కన్నీళ్లు పెట్టుకుంటూన్నాడు. 

' కవిత్వం ఎంత బాగా  చదువుతున్నాడో చూడండి! అందుకే ఈయన్ని మా ఊళ్లో  మేమంతా వాజపేయి అంటుంటాం' అన్నాడు బస్సులో  నాపక్కన కూర్చున్న పెద్దాయన సంబరంగా. 


ఉదయగిరిలో పనుండి  నెలూర్లో తెల్లారు  జామున బస్సెక్కా .  దార్లో ఈ ఊరిమధ్య  బస్సాపేశారు.. ' మీటింగుంది. ముందుకు పోవటానికి వీల్లేదంటూ.   


ఎండవల్ల ఉక్కబోస్తోంది. పసిపిల్లాడెవరో దాహమని గోల చేస్తున్నాను. "తాగేందుకు ఒక్క చుక్కనీరు కూడా దొర కవి ఏరియాలివి ' అన్నాడిందాకటి  పెద్దాయన అడక్కుండానే. 


వేదిక మీదింకో వక్త   రెచ్చిపోతున్నాడు .. ' నేడు చాలా సుదినం.  గాంధీగారి వర్ధంతి  రోజునే బ్రాందీషాపు ఓపెనింగు ..  బాగుంది.. బాగుంది '  అంటూ. 


' వర్ధంతి అంటే పుట్టిన్రోజే  కదండీ? ' పక్కనున్న పెద్దాయన సందేహం. 


వేదికమీదున్నాయన కూడా అదే అనుకున్నట్లున్నాడు ' నాకు చాలా ఆవందంగా ఉంది. తాగాలంటే ఆట్టే దూరు పోకుండా ఊరి మధ్యకే వచ్చేసిందీ మద్యం షాపు . డోర్ కొట్టి మరీ డెలివరీ చేస్తామని ఇదిగో ఈ గాంధీ సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు దుకాణంవాళ్లు.. ' స్పీచి దంచేస్తున్నాడా పెద్దమనిషి. 


అప్పుడు చూశానటువేపు . పాపం, గాంధీగారి విగ్రహం ఓ మూల వదిగి వదిగి నిలబడివుంది. 


ఆయనకే రిపోర్టిస్తున్నాడు లాగుందీయన ' మద్యం మీద మూడు వేల కోట్లకు ఆదాయం రావాలి మనకు . అప్పుడే సంక్షేమ పథకాలు చక్కంగా  సాగేది. చీపులిక్కరు తాగి చీపయిపోవద్దు. కల్తీ కల్లుతో శాల్తీలు గల్లంతవుతాయ్. జాగ్రత్త. మన రాష్ట్ర మద్యమే మనం తాగుదాం. మన రాష్ట్ర ఆదాయం పెంచుదాం.. అనేది మన ఉద్యమం కావాలి,  


డబ్బాలు గలగలలాడించుకుంటూ బిలబిలా బుస్సులో కెక్కారు వాలంటీర్లు . 


తెల్ల బట్టలో ఒకాయన రంకెలేసుకుంటూ మైకులాగేసుకున్నాడు అక్కడ . 


మంచి పనయింది. . మనకింకా  ఇలాంటి మంచి నాయకులు మిగిలుండబట్టి ప్రజా స్వామ్యం ఇంకా బట్టకట్టి ఉంది .


"ఓపెనింగుకి పిలవలేదని కోసంతో చేస్తున్నాడండీ  ఈ ఏరియా ఎమ్మెల్యే.  మంచి పనయింది. మరి ఈ ఏరియా ప్రజా ప్రతినిధి . పిలవాలని బుద్ధుండక్కర్లా?' అన్నారెవరో బస్సులో ఆయనకు వత్తాసుగా. 


సభలో పెద్ద రభస మొదలయింది. ప్యాకెట్లమ్ముకొనే కుర్రాళ్లు బస్సు మీద పడ్డారు. మజ్జిగలాగుంది . ఎండకు తాగితే చల్లగా ఉంటుంది. పర్సు బైటికి  తీస్తుంటే పక్కనున్న పెద్దాయన చటుక్కున చెయ్యి పట్టుకుని 

' అది సారా సార్!' అని హెచ్చరించాడు గనక సలిపోయింది గానీ  లేకపోతే కొంప కొల్లేరయేది. చాటుగా ఆ పెద్దాయన ఒక ప్యాకెట్ కొట్టడం నేను చూడకపోలేదు. వేదిక మీద రాళ్లేస్తున్నారెవరో . 

జెండా ఎగరేయడం కూడా రాని చేతగాని దద్దమ్మలు మీటింగంటే  మాత్రం రాళ్లేయడానికి  రెడీ ! ' అన్నారెవరో బస్సులో కసిగా  . 


'మిత్రపక్షాల మధ్య సఖ్యత చూసి ఎవరో కక్ష కట్టారు ' అన్నారింకెవరో కచ్చగా.  బస్సులో కూడా గోల మొదలయింది. 


విండోగుండా చూస్తే గాంధీగారి విగ్రహం మీద టపటపా రాళ్లు పడుతున్నాయి. వేదిక మీద ఉన్న పెద్దమనిషికి గాయమైనట్లుంది .


గావు కేకలు పెడుతున్నారెవరో . 

ఎక్కడున్నారో పోలీసులు అప్పటిదాకా .. ఠక్కుమని లాఠీలతో  జనం మీదకొచ్చి పడ్డారు.  ' ఫైర్' అని అరిచారెవరో .  తూటాలు పేలడం మొదలు పెట్టాయి. 




డ్రైవర్ సమయానికి బస్సు స్టార్ట్‌ చేశాడు గనక సరిపోయింది గానీ లేకపోతే ఇంకెంత  మంది అమాయకులు అన్యాయంగా బలై పొయ్యేవాళ్లో? 


ఉదయగిరి చేరేసరికి రెండు దాటింది.  

మధ్యాహ్నం న్యూసులో  జరిగిందంతా చూపిస్తున్నారు. 

తూటా సేలి  తల పగిలినవాడిని ఆసుపత్రిలో పడేయాల్సిందిపోయి కెమేరా ముందు పడుకోబెట్టి ఆవేశపడిపోతున్నాడో నాయకుడు 'మద్యం ఉద్యమంలో ప్రాణాలు పోయినాసరే ఈ అమరవీరుడి స్మారకార్ధం ఇక్కడ స్థూపం   స్థాపించేదాకా నిద్రపోం... 


కాబోయే అమర వీరుడు  క్లోజప్పులో  గోల పెడు తున్నాడు. చటుక్కున గుర్తుకొచ్పిందా మొహం బస్సులో నాపక్కన కూర్చున్న పెద్దాయనదే  ఆ ఫేసు . 

పాపం ప్యాకెట్ ప్రభావం! 


తిరుగు ప్రయాణంలో బస్సు  ఆ ఊరు చేరే సరికి చీకటిపడింది. అయినా సందడిగానే ఉంది. పొద్దుటికన్నా జనం ఎక్కువగా ఉన్నారు. 


అదే వేదిక మీద అదే వాజపేయి మళ్లా కవిత్వం చదువుతో కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు ముందు తర్వాత ఉపన్యాసం. 


' నేడు సుదినం . ఒక అమరవీరుడి స్మారకార్థం మన ఊరి నడిబొడ్డునే స్థూపం నిర్మించుకోవాలని తీర్మానం చేయడం నాకు ఆనందంగా ఉంది. మధ్యపానోద్యమంలో అసువులు బాసిన ఈ అమరవీరుడి విగ్రహ స్థాపనకు అయ్యే ఖర్చు ను మనమే తలా కాస్త భరించడం భావ్యం ' అంటుండగానే డచ్చాలా గలగలలాడించుకుంటో బిలబిలా బస్సులో కెక్కేసింది విరాళాల దండు . 


వేదిక మీది ఏరియా ఎమ్మెల్యే గారితో పాటు కేమరా ముందు తెగ ఆవేశపడిపోయిన కుర్రాడూ చిర్నవ్వులు చిందిస్తూ కూర్చోనున్నాడు. 


ఇదంతా చూసేందుకు ఎదురుగా ఆ గాంధీగారే లేరు. . పాపం! 


' స్మారక  స్థూపం నిర్మాణం కోసం గాంధీగారిని లేపేశారు ' అన్నారెవరో . 


గోడ్సే విసిరిన గోలీ పుణ్యమా అని చనిపోయి..  బాపూజీ  బతికిపోయాడు ...! 


చెడు కనకు  - కళ్లు మూసుకో! 

చెడు అనకు - నోరు మూసుకో! 

చెడు వినకు - చెవులు మూసుకో! 

అన్న గాందీ గారి మూడు కోతుల సూత్రం మూ - సు - కో  తెలిసో తెలియకో మనం ఆచరిస్తున్నంత కాలం గాంధీ విగ్రహమున్న విలువైన స్థలాన్ని కబ్జా చేద్దామని ఎత్తు వేసే బ్రాందీషాపు ఓనర్లు వంటి నాయకులు   .. విగ్రహ స్థాపన వంకతో ప్రజల సొత్తును ఒక మంచికి  వినియోగించే నిమిత్తం   అమరవీరులను తయారుచేస్తున్నట్లు పై ఎత్తు వేసే నేటితరం వారి వారసులు .. ఇట్లా పుట్టుకొస్తూనే ఉంటారు. 


గోడ్సే గోలీ చలవతో చనిపోయిన బాపూజీ అందుకే బతికిపోయాడు - అనేది. 


- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు దినపత్రిక - 30 - 10-2003 నాటి సంపాదకీయ పుట గల్ఫిక) 


 

తప్పులు -ఒప్పులు -3వ భాగం

 


11:39 AM

 

అడివి కాదు మహాప్రభో అడవి. అంబోధి అంటే సముద్రమే కానీ, బో కీ వత్తు ఉండాలి. అంభోధి అపార పారావారం అనే భావన ఒకానొక రోజుల్లో. అంటే ఎవరూ దాటలేనంత వడ్డు కలదని అర్థం. నలదమయంతుల చరిత్రలో కావాలని దమయంతి చేతికి చిక్కిన కలహంస (నల్లటి హంస)నలుడి మీద ఆమె మరులు మళ్లించే నిమిత్తం కోసే కోతలలో ఈ అపార పారావారమనే పలుకు వినిపిస్తుంది. 'అపార పారావార పర్యంతానంత మహీతలంబు నందు నా చూడని రాజులు లేరు సర్వగుణ సౌందర్యంబుల నెవ్వరు నలుం బోలరు' అనడం అతిగా అనిపిస్తుంది. కానీ, ఎవర్నయినా పొగడాలనుకుంటే ఉన్నది ఉన్నట్టుగా చెబితే 'ఆర్ట్ ఫిల్మ్' తరహాలో బోర్ కొడుతుంది కదా! అందుకే అపార పారావార పర్యంతం పరుచుకున్న భూమండలంలో నలుడంత నాజూకు మనిషి లేడని ఆ కలహంస కోసింది. ఇక్కడ అపార పారావారం అన్న పదం ఉపయోగించడంలో విశేషం ఉంది. ఎవరూ దాటలేనిది అంభోధి అని.. అతిశయోక్తి పదాన్ని ఎంచుకోవడంలోనే నలుడి అందాన్ని గురించి చేసే వర్ణనలోని అతిశయోక్తి సూచితం. ఇంత కథ ఉన్న అంభోధి పదంలో ఉన్న అన్ని అక్షరాలకు ఒత్తులు ఉండడంలో తప్పేం ఉంది!నీ సంగరి  గుర్తు ఉంచుకుంటే చచ్చినా ఇక అంభోధి పదంలో తప్పు దొర్లే అవకాశం ఉండదు.

అదృష్టం అనే పదాన్ని ఇప్పటి తరంలో ఎక్కువ మంది అద్రుష్టం అని రాస్తుంటారు. ఉచ్ఛారణలో రెండు పదాలు ఒకే తీరులో పలకడం వల్లనే ఈ అయోమయం. నిజానికి ఫోనెటికి సిస్టమ్ (ఉచ్ఛారణ ప్రకారం రాసే పద్ధతి) గట్టిగా అమలయే పరిస్థితి ఉంటే కృష్ణుణ్ణి అయినా క్రుష్ణుడు అని బేఫర్వాగా అనేయవచ్చు. మన దగ్గర పితలాటకం ఒక్కోసారి ఫోనెటికి సిస్టం, ఒక్కోసారి నాఫోనెటిక్ సిస్టమ్ (ఉచ్ఛారణకు రాసే పదానికి సంబంధం లేకుండా పోవడం) పాటించడం. చుండూరును టిసుండూరుగా, కాకినాడను కొకనాడగా రాయడం లాంటివి ఇందుకు ఉదాహరణలు. కాబట్టి
తెలుగులో డిక్టేషన్ తీసుకునేటప్పుడు ఉచ్ఛారణను బట్టి పదాలు తయారైనా అప్రమత్తంగా ఉండడం అవసరం. పాత తెలుగులో పద్యాలలో పద్దాకా కనిపించే అరసున్నాలను నోటితో చదవడం ఆ అర్థ పూర్ణాలను సృష్టించిన విధాతకైనా సాధ్యమయే వ్యవహారం కాదు. పలక్కపోతే పీడా పాయిరి అనుకోవచ్చు కాని.. కొన్ని తెలుగు పదాలకు అర్థాలను కేవలం అరసున్నాలే మార్చేసే సంకటం ఒకటుంది. పాండురంగ మాహాత్మ్యం అనే ప్రబంధం 4వ ఆశ్వాసంలో
'భానుఁడు శీతభానుఁడున్‌ గాఁడిన మేఘకాళిమ వికారము దూరము సేయ.' అనే పద్యం కనిపిస్తుంది.  ఇక్కడ కాఁడు అంటే అర్థం నాటు, అంటే పొలాలలో నాట్లు వేయడం తరహా కార్యకలాపం.

 

 

 

 

 

 

 

 

 

  

నివురు గప్పిన నిజాలు -ఈనాడు వ్యంగ్యం -కర్లపాలెం హనుమంతరావు

 



నెత్తిక్కిరీటం, భుజానికి కీర్తులు, జులపాల జుట్టు, చెవి కుండలాలు, పట్టు పీతాంబరాలు.. ముఖ వర్చస్సు చూస్తుంటే .. ఎవరో దేవుడనిపిస్తోంది.

'దేవుణ్ణే నాయనా! సత్య నారాయణస్వామిని. నీ కోసమే  రాక'

యుగాల తరబడి ఒంటి కాలి జపమైనా కనికరించని దేవుళ్ళు అడగా పెట్టాకుండా ఇట్లా హఠాత్ దర్శనాలిచ్చేస్తుంటే..డౌటెంత ఉగ్రభక్తుడికైనా తన్నుకురాకుండా ఉంటుందా!

'ఎందుకొచ్చినట్లో?'

'రేపే ఇరవయ్యో తారీఖు. ఇంకా ఏర్పాట్లే స్టార్టయినట్లు లేదే!'

'ఏమేర్పాత్లు స్వామీ?'

'ఇరవయ్యో తారీఖు.. నా వ్రతం ఫిక్స్ చేశావుగా!'

'ఎవరా చెప్పిందీ?'

'మీ బాసు. నైటు ఆయనకు నిద్రలో కనిపించాలే!'

అర్థమయింది మేటరు. ఆఫీసులో లోన్ పెట్టుకోడానికి రీజనేదైనా కావాలి. రిలిజియస్సుదైతే రిజెక్షనుకు భయం శాంక్షన్ అధార్టీసుకు. పద్దాకా పెళ్లి, చావు లాంటి ఫంక్షన్స్ రిపిటీషన్ కుదుర్దు కదా! అందుకే, అందర్లా నేనూ సత్యన్నారాయణ వ్రతం వంకన పాతికవేలు నొక్కేశాను. బాసా విషయం కూడా దేవుడి ముందు దాచలేదన్న మాట!

బాస్ కంటే భయపడాలి. భగవంతుడిక్కూడానా! ఫ్యాక్ట్సేవీ దాచుకో తలుచుకోలే!

'ఆ డబ్బింకా ఉంటుందా? అప్పుడే ఖర్చయిందిగా? దేవుణ్ణంటున్నావు. ఇంత చిన్న మేటర్ మీద కూడా సమాచారం లేదా?'

'పాతికవేలయ్యా! ఒక్క టెన్రూపీసన్నా మిగుల్చుకోలేదా?' భగవంతుడి గొంతులో ఉక్రోషం.

'మిగిల్తే మాత్రం .. నిజం పూజకు అవగొడతామా?' దేవుణ్ణి టీజ్ చెయ్యడం తమాషా అయిన కొత్తనుభవం!

'పోనీ.. సత్యవ్రతమన్నా చెయ్యవయ్యా! డబ్బుతో పనుండని దీక్ష.. అది' జాలిగా అడిగాడు దేవుడు.

'సత్యవ్రతమా! పైసలక్కర్లేని వ్రతాలుంటాయా! జోక్..'

'ఉంటాయ్. నిత్యమూ సత్యమునాడవలయును. అనృతములాడరాదు'

'ఇదేం పైత్యం! సాధ్యమేనా ఈ కలికాలంలో?' దేవుడు నన్ను గానీ రివర్సులో టీజ్ చేయడంలేదు కదా?

'పోనీ.. ఒక్క ఇరవై నాలుగ్గంటలన్నా అబద్ధాలడకుండా ఉండలేవా.. మానవా?'

'ఎట్లా సామీ? నేను సాంగ్స్ రాసిన సినిమా ఆడియో రేపే రిలీజ్! నేనూ మీటింగులో ముఖ్యమైన వక్తనే!'

పరంధాముడుకి పరిస్థితి అర్థమైనట్లుంది.

'ఓకే! నీ ప్రాబ్లమ్స్ నీకున్నాయి మరి! ఒక్క మూడు అబద్ధాల వరకు కన్ సెషన్ గ్రాంటెడ్! ఆ పైన నువ్వు ఆడాలన్నా ఆడలేవు..'

'ఏందదీ..?'

'అబద్ధం! నీ టంగ్ కంట్రోల్ నీ అధీనంలో ఉండదు. ఆచి తూచి వాడుకో విలువైన అబద్దాలను. మళ్లీ రేపిదే టైమ్కి ఠంచనుగా మళ్లీ ప్రత్యక్షమయి చూస్తా.. నీ పరిస్థితి' మరో మాటకు తావివ్వకుండా మాయమైపోయాడు  సత్యనారాయణుడు.

ఫోనదే పనిగా రింగవుతోంటే నాకూ మెలుకొవొచ్చేసింది. ఇహ కథ నడుపుకోడం నాదీ బాధ్యత!

'శంకరయ్యంట! ఎవరో ఎల్లైసీ ఏజెంట్' అంది మా శ్రీమతి లాండ్ లైన్ రిసీవర్ ఎత్తి పట్టుకుని.

'ఊళ్లో లేనని ఏదో చెప్పు' అంటూ మళ్లీ ముసుగు బిడాయించబోతూ వుంటే  'ఇవేళ పెందరాళే ఆఫిసు కెళ్లాలన్నారుగా?' అని దుప్పటి లాగేసింది మా మహాతల్లి.

ప్రెస్ మీటింగ్ సంగతి గుర్తుకొచ్చి ఠక్కున లేచి కూర్చున్నా. అప్పటికే ఎనిమిదయింది. 

హడావుడిగా తయారై  హుషారుగా మెట్లు దిగుతుంటే అనుమానంగా అడిగింది మా ఆవిడ 'ఆఫీసుకేనా?'

'సునిమాలంటే ఇష్టవెఁ కానీ, సినిమాల్తీసేవాళ్లంటే వళ్లు మంటావిడకు. మందు కొడతారని, ఆడోళ్లనో పట్టన వదిలిపెట్టరని పక్కింటి పంకజం నూరిపొసిన ఇన్ఫ్లుయెన్స్! తనతో గొడవెందుకని సినిమా పన్లుప్పుడు కూడా ఆఫీసుకే వెళ్తున్నాని అలవాటుగా చెబుతుంటానెప్పుడూ! ఆ మాటే చెప్పి బైటకొచ్చింతరువాత గాని బుర్రకు తట్టింది కాదు .. అప్పుడే రెండు అబద్ధాలు వృథా అయిపోయాయని!

సత్యనారాయణ మాట సత్యమేనా? మూడో అబద్ధం తరువాత నా నాలుక నా కంట్రోల్లో ఉండదా?

వెళ్లే దారిలోనే బాస్  ను కలసి 'నాట్ ఫీలింగ్ వెల్' అని మూడో అబద్ధమాడేసి నేరుగా సినిమా ఆఫీసుకు చేరేసరికి గుమ్మంలోనే రంగారావు కనిపించాడు.

రంగారావుకు నేనో పదివేలు అప్పున్న మాట నిజం. ఏడాది బట్టీ నక్షత్రకుడికి మల్లే నా చుట్టూ చుట్టూతానే తిరుగున్నాడు; ఎప్పటికప్పుడేదో ఓ అబద్ధమాడి తప్పించుకోడం ఓ హాబిట్ నాకు.

'అర్జెంటుగా డబ్బవసర పడింది. నీ దగ్గరెంతుంది ప్రస్తుతం ప్యాకెట్లో?' అనడిగాడు ఎప్పట్లానే. '

'పదేలు' అన్నా అప్రయత్నంగా.

ప్రొడక్షనాఫీసువాళ్లు పంక్షను ఏర్పాట్లకని ఇచ్చిన సొమ్ము! దాన్నుంచి నొక్కేసిన రొక్కం ప్రస్తుతం నా జేబులో ఉండటం నా  కొంపలా ముంచేసిందీ పూట ఇట్లా.

'ఇహనేం!' అంటూ నా జేబులో తనే తన చెయ్యేసేసుకుని ఉన్న సొమ్మంతా ఊడలాగేసుకుని 'అసలు వరకిది ఓకేరా మిత్రమా! వడ్డీ ఎప్పుడిస్తావో చెప్పి చావమ'ని పీకల మీదెక్కి కూర్చున్నప్పుడు కాని స్వామివారి అబద్ధాల కన్ సెషన్ మహిమ తెలిసిరాలేదు.

రంగారావుతో నిజం చెప్పడమదే మొదటి సారి నాకు. స్వామి వారి మాట సత్యమేనన్న రూఢికే ఈ ఘోరం జరిగినట్లుంది ఆ క్షణంలో.

ఆడియో ఫంక్షను మధ్యలో రాజమండ్రి నుంచి ఫోన్! మా మరదల్ని చూసిపోయిన మగపెళ్లివారి నుంచి . ' మాకీ సంబంధం నచ్చింది. ముహూర్తాలు పెట్టేసుకునే ముందు లాస్టుగా ఓ చిన్న ఎన్ క్వయిరీ! మీరూ ఆ ఇంటి అల్లుడే కదా! మాట వరసకే అడుగుతున్నాం. మంచి సంబంధమేగా?'

నా నాలుక నా అధీనం తప్పిన మాట నిజంలానే ఉంది. నా నోటి నుంచి వచ్చే మాటలకు నా గుండే రగిలిపోతోంది 'దరిద్రపు సంబంధం. పిల్లకు చదువులేదు. మహా మొరటు. వెకిలి చేష్టలకిహ అంతుండదు. మాటే కాదు.. బుద్ధికీ నిలకడలేని మనిషి మా మాంగారు.  చెప్పిన కట్నం గిట్టేది వట్టిదే. అత్తగారు కిలాడీ. నోరెత్తితే మంచి మాట రాదు. ఆ ఇంటి పిల్లను చేసుకుంటే చేసేది సంసారం కాదు.. సర్కస్! పెద్దదాన్ని చేసుకుని నేను బఫ్ఫున్నయ్యా.. రెండో దాన్ని మీరు చేసుకుంటే..'

అవతల లైన్ కట్ అయింది.

విస్తుబోయి వింటున్నారు ప్రొడక్షన్ టీమంతా నా వంక రెప్ప వాల్చకుండా! 'మీకేమయింది మిత్రమా ఇవాళ. మీటింగులో కూడా మీ ఉపన్యాసం ఈ ..' అంటుండగానే ఎవరో నా చేతికి మైకందించేశారు.

ఎదురుగా మీడియా! వీడియోలు రన్నవుతున్నాయ్!

'నిజానికి  పాట ట్యూన్లేవీ ఓన్ క్రియేషన్ కాదు. అస్సాం భాష  లిటరేచరరుకు మక్కీకి మక్కీ!  ట్యూన్లు తులు భాష మూవీ నుంచి ఎత్తుకొచ్చినవి. కథ బెంగాలీ థీమ్ ను లైట గా మార్చుకున్నది. అవుట్ పుట్ అధ్వానం. హీరో పరమ వికారం. హిరోయిన్ కోతి ముఖం చూసి మొదటాట నుంచే హాలు ఖాళీలవడం,, ఖాయం!..' నా చేతిలోని మైకును ఎవరో గుంజెసుకున్నారు. ఇంకెవరో నన్ను సీటు నుంచి లేపి గేటు బైటకు నెట్టేశారు.  వెనక్కు తిరిగి చూస్తే తలుపులు బంద్!

ఇంటికి పోవాలంటే భయంగా ఉంది.  టీవీల నిండా నా మీదే ఫుల్ కవరేజీ! నా సత్యవ్రతం అప్పుడే నెట్ లో  ఓ వీడియాగా వైరలయింది. 

పార్కులోని ఓ సిమెంట్ బెంచీ నా బెడ్డయిందా నైటుకి. చుట్టూతా కటిక చీకటి నా అబద్ధపు జీవితంలా. దూరంగా ఆకాశంలో తారకలు నేనాడిన సత్యపు తునకల్లా!

సర్వం స్వామి వారి సత్యస్వరూప శుద్ధ మాహాత్మ్యం!

'లోకంలో ఇంత మంది ఉన్నారు. ఇన్నేసి అబద్ధాలాడుతున్నారు. నిజం చెప్పమని స్వామి.. సామాన్యుణ్ని నా వెంట మాత్రమే ఎందుకు పడ్డట్లు?

బంగ్లా యుద్ధంలో జైలు కెళ్లినట్లు ప్రధానిచ్చిన స్టేట్ మెంట్ పెద్ద అబద్ధం కాదా?  దేవుళ్ళ మీద ప్రమాణం చేసి ప్రజాప్రతినిధులంతా పదవులు స్వీకరించే సమయంలో పేలేవన్ని పరమ సత్యాలనేనా? న్యాయదేవత ముందు బోనులో నిలబడి సాక్షులంతా ప్రత్యక్షంగా కళ్లతో చూసొచ్చినట్లు చెప్పేవన్నీ శుద్ధసత్యాలా? అధికారులు సర్కారు సొమ్ము గుంజేందుకు సమర్పించే పత్రాలన్నీ నికార్శైన నిజాలకు నిలువుటద్దాలా? బ్యాంకుల్లో పెద్దలు గుంజుకునెళ్లే సొమ్ముల కోసమై సమర్పిచే పత్రాలలో ఎదీ అబద్ధమయే అవకాశం లేనేలేదా? సినిమా కలెక్షన్ల గురించి నిర్మాత మహాశయులు,  అభివృద్ధి కోసమని  దొంగవ్యాపారులు, విదేశీ వీసాల కోసమై విద్యర్థులు సమర్పించుకునే అర్హతా పత్రాలు అన్నీ పచ్చి వాస్తవాలనేనా? ముఖ పుస్తకాలలో శాల్తీలే అసలైనవి కాని కలికాలంలో అచ్చమైన సత్యాలు మాత్రమే చెప్పితీరాలంటూ ఎంత సత్యనారాయణస్వామివారైతే మాత్రం దిక్కూ దివాణం లేని తన బోటి బక్కవెధవను ఉక్కితి బిక్కరి చేయడమేమిటి?

అబద్ధాలు ఆడైనా పెళ్లి చేసుకునేందుకు పర్మిషనిచ్చేసిన భగవంతుడి ముందు ముష్టి పాతిక వేలు అప్పుగా తీసుకున్నందుకు నేనిత అలుసవుతానని కలలో సైతం ఊహించలేదు.  ఆక్సిజనైనా లేకుండా మనిషి బతకవచ్చునేమో కానీ.. అబద్ధమాడకుండా మనుగడ కొనసాగించలేడు' అని భగవంతుడికి ఇవాళ రాత్రి కలలోకి వచ్చినప్పుడు నచ్చచెప్పాలి' అనుకున్నా.

ద్

దేవుడు ఎంచేతనో మళ్లీ కనిపించిందే లేదు!  నిజం మీద నేను నిలదీసేందుకు తెగించిన విషయం బహుశా భగవానుడు కూడా పసిగట్టేశాడనుకుంటా!

దేవుడే మాట తప్పగా లేంది ఇహ జీవుడి సంగతి చెప్పేదేముంది!

·         కర్లపాలెం హనుమంతరావు

·         (ఈనాడు -దినపత్రిక సంపాదకీయ పుట (నివురు గప్పిన నిజాలు పేరుతో) మే, 2002 లో (30?) ప్రచురితం

 

 

 

భూమి గుండ్రంగా ఉండదా? ఈనాడు - గల్పిక

 



భూమి గుండ్రంగా ఉండదా? 

- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు దిన పత్రిక - సంపాదకీయ పుట( 29 - 11 - 1902 ) ప్రచురితం. ) 


' భూమి గుండ్రంగా ఉండకూడదనేందుకు   వంద రీజన్లున్నాయ్! . ముందు సంతకం చెయ్యీ' అంటూ ఓ కిలో కాగితాల కట్ట నా మొహాన కొట్టి కూర్చున్నాడు లోక నాథం. 


అప్పటికే అందులో ఓ ముప్పావుకిలో కాగితాలమీదేవేవో  సంతకాలు గిలికున్నాయి. 


కరెంటు సమస్య,  నీటి సమస్య,  కరవు సమస్య,  కండోమ్ సమస్య..  వగైరాలిన్నుండగా కొత్తగా ఈ భూమి గుండ్రం సమస్య ఎక్కణ్ణుం చి ఊడిపడిందో..  అర్ధం కాలేదు. అదే అడిగా. 


' అన్ని సమస్యలకీ  అదే మూలంరా  బాబూ!  ముందు మనముండే ఎర్త్ ఏ ఆకారంలో వుందో కూడా తెలుసుకోకుండా.. తతిమ్మా సమస్య ల్నెలా సాల్వు  చేస్తామో చెప్పు!  వాస్తు ప్రకారం ఏ వస్తువైనా వృత్తాకారంలోవుందంటే దానికేదో మూడిందనే అనుకోవాలని మొన్న పార్లమెంటు భవనాన్ని పరిశీలించిన గణితాగమశాస్త్ర పారంగతులు  కూడా కుండబద్దలు కొట్టి నట్లు చెప్పారు   కదా! పార్లమెంటులోని గందరగోళానికి పార్లమెంటు గోళాకారంలో వుండటమే అసలు కారణమని వాళ్లేమన్నా వేళాకో ళానికి అన్నారనుకున్నావా ? కెనడా వాళ్ల సాక్షిగా లడాయి చేసుకున్నారని మనాళ్లనలా పాపం. . ఆడిపోసుకుంటున్నాంగానీ, వాస్తు దోషాలున్న వేదికమీద కాళిదాసైనా దేవదాసులాగయిపోవాల్సిందేనని శాస్త్రమే నొక్కిచెబు తోంది. 


భూమి కూడా కపిద్ధాకారంలో  గుండ్రంగా వుందనే గదా మనుధర్మ శాస్త్ర చెబుతోందని మన గిరీశమంటున్నదీ!  అందుకేనేమో మొన్న అమెరికాలో డబ్ల్యూటీవో అలా పేకముక్కల్లా కూలిపోయింది. అంతకు ముందు యూఎస్సెస్సారూ ముక్కలు చెక్కలయిందీ. సద్దాంతో యుద్ధమలా సాగుతూనే వున్నదీ.. బ్రహ్మాండం గుండ్రంగా వుండబట్టే.  ఇండియాలో ఇప్పుడిన్ని బర్నింగ్ ప్రాబ్లమ్స్ మేప్ తూర్పు దిక్కున అడుగు భాగాన్నలా  పట్టుకుని తలక్రిందులుగా వేలాడుతున్నాయి గనకనే ఇండియా..  శ్రీలంక టెరిటరీల్లో టెర్రరిస్టులలా రెచ్చిపోతున్నారని నా థియరీ! అందుకే ముందర్జంటుగా మనంభూమిని చదును చేసెయ్యాలి. నీ వంతు చందా వందో.. వెయ్యో . . అర్జంటుగా వెయ్యి!  అవతల చాలా ఇళ్లున్నాయ్ ' ఆవటా అని  మహతొందరచేశాడు మా లోకనాథం.


చందాదందాల్లాంటివో లేనిదే మా లోకనాధంలాటి గల్లీ లీడర్లు లోకోపకారం లైన్లోకి రానే రారు. 


భూమిని ఫ్లాట్ చేయాలంటే మాటలా? ..  మూటల్తో పని. ఏ అమెరికా. .. బిల్‌  గేట్స్ వంటి వాళ్ల పూనిక లేనిదే పూర్తికాని పని. లోకనాథంలాంటి లోకల్లీడర్లతో అయేదేనా? 


'అందుకేగా ఇంటర్నెట్లో వెబ్సైట్ పెట్టిందీ! డబ్బులు. డబ్బులు.. డబ్బులూ .. అదేదో డాట్కామని దాని పేరు. అన్నాడు లోకనాథం  చందా బుక్కు నాముందుకు తోసి. 


' ఎర్త్ డీమాలిషింగ్ ఆపరేషన్ డి.ఎ డ్రామాలో టెంపరరీగా ప్రజల్ని చంద్రమండలం మీదికి షిఫ్ట్ చెయ్యాలి.  డొనేషన్ని బుట్టే  ప్రియారిటీ. ఆనక  చెప్పలేదని దెప్పద్దన్నా!' అని హెచ్చరిక . 


'ఓ వెయ్యి రూపాయలేగా!  పారేద్దురూ! . పై పోర్షను వాళ్లయిదొందలే ఇచ్చారు. వాళ్ల కంటే మనమే ముందుండాలి మూన్ – ట్రావెలింగ్ లో  అంటూ మా శ్రీమతి తొందర!  ఏదో వంకతో చంద్రుడి మీద ఇంచకా  చక్కర్లు కొట్టిరావచ్చన్న ఆవిడ ఉబలాటం బాగానే వుందికానీ, ఇదంతా వింటుంటే కట్టెతుపాకీ పట్టుకొనే పిట్టలదొర చెప్పే కట్టుకథలాగుంది.


జన్మభూమంటే అందరూ నమ్ముతారు గానీ, జన్మగ్రహమంటే అంతపనమ్మకమా? అన్నాడాగ్రహంగా లోకనాథం. 

ఢిల్లీ నుంచి దౌల్తాబాదుకూ... దౌల్తాబాదు టు  ఢిల్లీకి మళ్లీ మళ్లీ తుగ్లక్ అలా  రాజధాన్ని మార్చంగా లేంది .. టెక్నిక్కింత బాగా డెవలప్పయిన రోజుల్లో ఆఫ్టరాల్ చంద్రమండలం మీదికి పోయి రాలేమా' .. అని గద్దించాడు లోకనాథం. 


' నాన్ సెన్స్! దిసీజ్ నాన్ సెన్స్ ' అన్నాడు స్వామినాథం, సాయంత్రం టౌన్ హాలు మీటింగులో. 

' చందాలు దండుకోవాలని  భూమి గుండ్రంగా వుందని పూరికే బుకాయిస్తున్నారు. ఇన్ ఫాక్ట్  ఎర్ ఈజ్ ఫ్లాట్' 

అని  స్వామినాథం గద్దింపు . 


లోకల్ గవర్నమెంటు కాలేజీలో జాగ్రఫీ లెక్చరర్ గా రిటైరై రాజకీయాల్లోకొచ్చిన మేధావాయన . 

' భూమి బల్ల పరుపుగానే ఉంటుందనడానికి లక్ష కారణాలున్నాయి. అమరంలోఅవనికి అరయ్యేడు పదాలన్నాయ్. అందులో


ఒక్కటీ  పృథ్వి గుండ్రంగా వుందంటే వప్పుకోదు . ప్రాచీన సాహిత్యంలో భూగోళం పేరుమీద రాసిన గ్రంథం కలికమేసి చూసినా ఈ థియరీ దొరికి చావదు. నలుచదరంగా వున్న ధరాతలాన్ని అష్టదిగ్గజాలూ, ఆదిశేషుడూ,ఆదిమకాలం  నాటి నుంచే  ధరించి భరిస్తున్నాయని మన పురాణాలు ఘోషిస్తునే ఉన్నాయి. ఎర్త్ ఈజ్ ఫ్లాట్ థీరీ   బైబిలు  కన్ ఫాం చేస్తోంది. హెర్కులిస్ మోసిన అట్లాస్ పెనం మీది  పెసరట్టులాగా పల్పగానే వుంటుందనటానికిఇంతకన్నా పెద్ద ఆధారాలింకేంకావాలీ? ' అని గద్దించాడు స్వామినాథం 

చప్పటు. 

అమరం చదివిన మేధావి. కావ్యాన్ని కడిగి పారేశాడని మెచ్చుకున్నారె వరో . 

లోకనాథానికంత పురాణ జ్ఞానం లేకపోయినా, పబ్లిక్ ముందు లోకువయిపోతామనేమో వేదిక మీదికి దూకి వాదన మొద లుపెట్టాడు. భర్తృహరి భూమి అత్తికాయ లాగా ఉందన్నాడు కదయ్యా! ' 

 ' అదే భక్త హరి మరోచోట భువనం  భవనంలాగా ఫ్లాటుగానే వుందున్నాడు కనయ్యా? . బమ్మెర పోతనగారు కమలపత్రులాగా వసుంధర వర్తులాకారంలో వుంటుందన్నారు. ఎమోషన్లో కవులేవేవో అంటుంటారు. వాట్నే పట్టు క్కూర్చుంటే ఎలా? ఫ్లాట్  అంటే అర్థమేంటి ? ఫ్లాట్గా వుండేదనేగా ! భూమి గనక మైదానంలాగా చదునుగా లేకపోతే జయలలిత,  లాలూలాంటి లీడర్లు పిల్లల పెళ్లిళ్లప్పుడు ఆకాశమంత అరుగు  ఎలా వేయగలరూ ? చాపలా  వుంది కాబట్టే  చుట్టచుట్టి హిరణ్యా క్షుడు సముద్రంలో గిరాటేశాడు. భూమిప్పుడు చుట్టులా ఉందనడానికి ఇదే పెద్ద ప్రూఫు. దాన్ని సాఫు చెయ్యడానికే ఇప్పుడు చందాలు కావాలి' అన్నాడు లోకనాధం. 

' కానీ ఇవ్వం. కావలిస్తే బిల్ గేటు గేటు ముందు అడుక్కో! 

 ఎయిడ్స్ డాలరొకటి విండోస్ గుండా విసిరేస్తాడేమో! ' .

అరపులా.. గోలా.. అరక్షణంలో అసెంబ్లీ వాతావరణం ! 

ఎక్కణ్ణుంచో ఓ నాణెం స్టేజీ మీదకొచ్చి పడింది. 

డాలరు లాగుంటే కళ్లకద్దుకుని జేబులో వేసుకున్నాడు గుర్నాథం. 

'ఢామ్' అని పేలింది! 

--- 

మర్నాడు పేపర్ల  నిండా అదే న్యూస్ . 

న్యూసా? న్యూసెన్సా? అదేమో గానీ, ఇన్నోసెన్స్ .. ఇగ్నోరెన్స్ ! టిలీల నిండా చర్చలే.. చర్చలు! 

' భూమి గుండ్రంగా ఉందా? బల్లపరుపు గా ఉందా ? గుండ్రంగా ఉంటే మరమ్మత్తులకు చందాల వసరమా? కాదా? 

ఇంటర్నెట్లతో సహా అంతటా.. ఒపీనియన్ పోల్స్! 

ఆ పాయింట్ మీద తమ స్టాండేదో వెల్లడించక తప్పని దుస్థితి అన్ని రాజకీయ పార్టీలకు వచ్చి పడింది ! 

ఈ సారి ఎన్నికల్లో ఏ ప్రభుత్వం గెల్సినా ఈ ఎజెండా మీదనే! 

--- 

ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న చెంచునాథం బజార్లో కనిపిస్తే ఆపి అడిగా  

'ఇంతకీ నీ భూమి గుండ్రమా? బల్లపరుపా ? ' 

 చెంచునాథం  లోకనాథానికి స్వయానే బావమరిది. స్వామినాథానికి మేనల్లుడుకూడా. 

అందుకే ఇబ్బందిగా నవ్వుతూ ' ఇంట్లో గుండ్రం.. బైటి బల్లపరుపు '   అని దాటేశాడు. 

పార్టీ గుర్తు వాస్తు బాగా లేక లోకనాథం  పార్టీ ఓడిపోయిందీ సారి. 

'సారీ' చెప్పటానికి వెళ్లి కల్సినప్పుడు 'పర్లేదులే.. అందా, మనవాళ్లేగా! ' అవి నవ్వేశాడు క్రీడాస్ఫూర్తితో . 


' వచ్చే ఎన్నికల్లో మా భూమిగుండ్రం పార్టీనే గెలుస్తుంది. ఈసారికైతే కరెంట్ కరపు లాంటి ప్రాబ్లమ్స్ ! సాల్వ్ చేసే  బాధ తప్పింవికదా !  అన్నాడు లోకనాథం..  అక్కడే వున్న స్వామినాథం వంక  చూసి కన్నుగొడుతూ . 


- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు దిన పత్రిక - సంపాదకీయ పుట( 29 - 11 - 1902 ) ప్రచురితం. ) 


- కర్లపాలెం హనుమంతరావు


అందరూ బాగుండాలి.. అందులో నేనూ ఉండాలి - సరదా వ్యాఖ్య -కర్లపాలెం హనుమంతరావు

 

అందరూ బాగుండాలి.. అందులో నేనూ ఉండాలి - సరదా వ్యాఖ్య

 -కర్లపాలెం హనుమంతరావు

 

పాడు రాజకీయాలని పద్దాకా చీదరించుకోడం మనకో పెద్ద ఫ్యాషన్. రాజకీయాల నుంచి ఎన్ని లాభాలు రాబట్టుకోవచ్చో!

 

ముక్కుసూటిగా వెళితే రాజకీయాలు వికటిస్తాయని మనకో యాంటీ సెంటిమెంటు. ముక్కునిలా లైట్ గా నేలకు రాసేయండి చాలు ఎక్కడెక్కడి పాపాలూ జనాలు ఇట్టే క్షమించేస్తారు.. ఆ గొప్ప విషయం ఆవిష్కృతం  చేసిందీ రాజకీయాలే. త్రేతాయుగం నాటికి ఈ తెలివితేటలు అభివృద్ధి చెందకే  పాపం సీతమ్మవారు అంత అమానుషంగా అగ్నిపరీక్షకు గురయింది!

 

'అనను.. కనను..వినను' అంటూ వున్న నోరూ, కన్నూ, చెవులూ వృథాచేసుకునే చాదస్తపు రాజకీయాలు కాదు ప్రస్తుతం నడుస్తున్నవి. గతంలో ఇటీవల ఓ నేత అంగరక్షకుడి వీపును మైకుసెట్టు పెట్టుకునే బల్లగా ఎట్లా మార్చుకోవచ్చో చేసి చూపించాడు.  సైంటిస్టులు ఏళ్ళ తరబడి కోట్లు తగలెట్టినా సాధించలేని ఈ మాదిరి ప్రయోజనాలెన్నో పొలిటీషియన్లు ఇట్టే పసిగట్టి ప్రచారంలో పెట్టేస్తారు.

 

ఏళ్ల చరిత్రున్న  ఓ జాతీయపార్టీకి గుర్తింపు తెచ్చింది  ఆఫ్ట్రాల్ ఓ అరచెయ్యి. చేతులనేవే లేకపోతే ప్రజాస్వామ్యానికి చేష్టలుడిగినట్లనేగా మీనింగ్? లోక్ పాల్ బిల్ ఎంత గొప్పదైతేనేమంట!  చట్టసభల్లో మెజారిటీ సభ్యులు చేతులెత్తిం తరువాతే గదా ఆ బండి ముందుకు కదిలిందీ!

 

బూతు కూతలు రాని నేతలకి చేతులు చేసే సాయం అంతా ఇంతా  కాదు. ఎదుటి పక్షం మీద మర్యాదపూర్వకంగా దాడి చేయాలంటే ఎంతలావు  పెద్దమనిషైనా 'చేతులు తీసేస్తా.. నాలుక కోసేస్తా.. తోకలు పీకేస్తా' అంటూ  వంటిభాగాలనే కదా రోషంగా  వాడుకోవాలి!

 

హస్తం పార్టీ మీద అస్తమానం పడి ఏడ్చే నేత ఎంత సీనియర్ అయినప్పటికీ తత్ అభినయానికి తగ్గట్లు వాడేదీ మరి స్వహస్తాలనే!

 

'కళ్ళు కైకలూరులో.. కాపురం డోకిపర్రులో' అని సామెత.   టైపు  పక్కచూపుల మీదెంత రచ్చవుతోందో తాజా రాజకీయాలలో! హన్నన్నా!  నాయకులు  కళ్లకూ, కన్నీళ్ళకూ అద్దే  కొత్త కళలు మరి అన్నా..ఇన్నా! ఓటరు కంటబడితే చాలు.. వాటర్ ఆఫ్ ఇండియా టైపు.. ఓ.. ఒహటే కన్నీళ్ళ ట్యాపుల పెనింగులు! ఎన్నడో పోయిన బామ్మలూ, బాపూల చావులిప్పుడు గుర్తొచ్చి ఆ  శోకన్నాలే తెప్పలుగా ఎన్నికల గోదారి ఈదాలనే మాదిరి ప్రయోజనాలు రాజకీయవేత్తలకు తప్ప శాస్త్రవేత్తలకు తడతాయా! ఏళ్ల తరబడి కోట్లు తగలేసినా సైంటిష్టు సాధించలేని రిజల్టు పొలిటీషియనెంత ఫాస్టుగా పట్టేస్తున్నాడూ!

 

సీదా సాదా పేదల పాదాలు.. కొన్ని క్రోసులు నడిచి  మురిగ్గుంటల నీళ్ళో తోడితెచ్చుకోడానికో.. స్టాపుల్లో ఆగని బస్సుల వెంటబడి రొప్పడానికే.  అదే మరి ఏ మహా మేధావి  అధినేతవైతేనో? మరుపులోకెళ్లిన బోడి మల్లయ్యలను మళ్ళీ మాలిమి చేసుకునే ఇంచక్కని చిట్కాలు! పడీ పడీ ప్రసన్నం చేసుకొనేందుకు.. పడనప్పుడు  పట్టి పడదోయడానికి ఎదుటి శాల్తీ తాలుకు   పాదపద్మాలు  ఎంత ప్రయోజనమో పాలిటిక్సోళ్లకు తప్ప తతిమ్మా  ప్రజావళికి తడుతున్నాయా!

 

నోరు అన్నది బడుగుజీవులకైతే పెనుశాపం. కరవు రోజుల్లో దాని ఫీడింగే సామాన్యుడికి పెద్ద ఫీట్. అదే నోరు మరి  ఏ మహారాజరాజశ్రీ  నేతాజీ గారికైతేనో? ఎదుటోడి మీద  చేసే దాడిలో తిరుగులేని వజ్రాయుధం.

 

నిర్భాగ్యులు నిర్వేదంతో చప్పరించుకోడానికి తప్ప పనికి రాని  నాలుక ఎన్నికల్లో హామీలు గుప్పించే వేళ ఏలికలకు ఎంతో కీలకం.  నాటకం చివర్లో ఇంచక్కా మడతేసి  మళ్ళా ఎన్నికలొచ్చే వరకూ  భద్రంగా దాచుకునే సరుక్కూడా. నోరు ఒక్కోసారి అలవాటుగా జారి అల్లరి పాల్జేసినా ఒక్క'సారీ'తో  'స్వారీ' సౌకర్యం చేజారి పోకుండా పదిలపరిచేందుకు పక్కనే చెవితమ్మలు సదా హాజరు.

 

రెండు వేళ్లూ నోట్లోకి  తిన్నగా పోయే వెసులుబాటేమీ లేక వట్టిగాలి మాత్రం జనం భోంచేస్తుంటే.. ఆ వేళ్ళనే విక్టరీ సింబల్ కింద మలుచుకున్న ప్రయోజకులు  మన  నేతలూ.. వాళ్ల తాలూకు దూతలూ.

 

ఓటు బ్యాంకు రాజకీయాలనే వదిలిపెట్ట బుద్ధికాని మన  నేతలకు..  ఉచితంగా వచ్చిపడే  వంటి మీది పార్టులను వృథాగా పోనిస్తారా.. మన పిచ్చిగానీ! నీతిని నమ్మితే మోచేతి మీది బెల్లమే అధికార పరిధి వరకు.

 

పై నుంచొచ్చిన పెద్దాయనొకాయన ఆ మధ్య  పద్దాకా ఓ యువనేత  డిఎన్ఏ ప్రస్తావన తీసుకొచ్చేవాడు. ఆ పెద్దాయన చెంపలు రెండూ  వాయించేయమన్నాడా యువనేతగారు. నేతల రాజకీయ యాత్రల్లో చెంపల  వైటల్ రోల్ రోజూ చూస్తున్న కథే కదా!  ఆడా మగా  చిన్నా పెద్దా తేడా కూడా చూడక  కంటబడ్ద ప్రతి ఓటరు రెండు చెంపలు నిమిరే మా గొప్ప మేనరిజం ఓ జెంటిల్మేంగారిది. 'పంఖా' ఎన్నికల గుర్తుగా ఎందుకు ఖాయమైందో! కానీ నిజానికా  జెంటిల్మేన్ పంథాకు 'చెంపలు' సరైన సింబల్.

 

 కొందరు బుర్రమీసాలు.. కొందరు తొడగొట్టుళ్ళ చూట్టూ రాజకీయాలు తిప్పుతారు. వంటి భాగాలు  గుర్తుగా కూడదన్న షరతేదో ఎన్నికల సంఘానికి అడ్డొస్తోంది కానీ.. నిజానికి కొన్ని పార్టీలకు 'కడుపు' గుర్తు ఇస్తే ఓటరుకు  పసిగట్టే వెసులుబాటు ప్రసాదించినట్లే.

 

గత్తర కొద్దీ ఏదో కూసి ఆనక చెవులు పట్టుకుని 'సారీ' చెప్పే ఆత్రగాళ్లకేమో చెవుల గుర్తు మోస్ట్ సూటబుల్. తడవ తడవకీ వేళ్లో, గోళ్ళో చూపించే పాడలవాటు పోనివాళ్లకు 'గోళ్ళు ఏపుగా పెరిగిన వేళ్ళు' గుర్తు ఖాయం చేస్తే అభిమానులు తగుదూరంలో తిరగేందుకు సులువు. తల్లి చంక దిగని చంటి పాపలకు 'పాల పీక' లాంటిదేదన్నా  గుర్తుగా అందిస్తే పాలిటిక్సుతో ఆడుకుందుకు సరిపోతుంది. అస్తమానం సానుభూతి సెంటిమెంటు మీద ఆధారపడే పార్టీలకు  'నీళ్లు నిండిన కళ్లు' సింబలుగా ఇస్తే  నాలుగు ఓట్లేమన్నా అదనంగా కలిసొచ్చే వెసులుబాటు పెరుగుతుంది. నిండు సభ, చట్టసభలయినా  నిద్రాగని కుంభకర్ణ  వారసులకు 'గురక మార్కు నోరు' గనక గుర్తయితే నిద్రమత్తు ఓటర్ల మద్దతైనా దొరికేవీలుంది మరి! నీలి చిత్రాలతో తప్ప ఉత్తేజం పొందలేని నీచ నేతలకు ''మార్కు బొమ్మలేమైనా సింబల్సుగా వాడుకునే సౌకర్యం ప్రత్యేకంగా కల్పిస్తే.. ఆ టైపు ఓటర్లంతా ఒకటయ్యే అవకాశం ఇచ్చినట్లవుతుంది.

 

తలాతోకా .. అని కాదు.. దేన్నైనా తళతళలాండించే కళ మరో పేరే రాజకీయం. రాజ్యాంగ పెద్దల పుణ్యమా అని ఏదో ఐదేళ్లకోసారి వేలుకి చుక్క పొడిపించుకుని..  నచ్చిన మంచివాడికి ఓటేయ వచ్చనుకుంటుంటే.. మధ్యలో ఈ తిరకాసేమిటనా సందేహం?

 

చెడ్దవాడికిచ్చే ఓటు తలారి చేతికిచ్చే తల్వారు వేటు= అన్నది  రాటుదేలిన ఓ రాజకీయవేత్త కోట్. పదేసి తలలతో  తలపడే రావణబ్రహ్మ ప్రాణాలైనా అరికాలి బొటన వేలులొనేగా పడి ఉండేది! ఎంతలేసి ఛాతీ వడ్డూ పొడుగులున్న నేత ఆయుష్షైనా బ్యాలెట్ పెట్టె బొడ్డు మరుగునే దాగుండేది! ఓటు గుండు పేల్చేది చెడ్ద రాజకీయాలను  చివరంటా కూల్చేయడానికే.  ‘అందరూ చల్లంగుండాలి. అందులో మేమూ ఉండాలి’ అని ఓటర్లంతా ఆలోచించగలగితే  ఇన్నేసి కళలున్న రాజకీయానికి  అప్పుడే కొత్త కళ వచ్చేది! దేహంలోని ఏ పార్ట్ కయినా వివేచన ఉన్న మెదడే అధినేత.. అయినట్లు   దేశంలో ఎన్ని రాజకీయ పార్టీలున్నా వివేకం ఉన్న ఓటరే ఆయువుపట్టు.  

-కర్లపాలెం హనుమంతరావు

25 -02 -2021

***

(ఈనాడు దినపత్రిక సంపాదకీయ పుటలో ప్రచురితం)

 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...