Wednesday, November 10, 2021

వ్యంగ్యం -ఈనాడు - వినాయకుడికో విన్నపం - కర్లపాలెం హనుమంతరావు

 


వ్యంగ్యం -ఈనాడు 

- వినాయకుడికో విన్నపం 

- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - దినపత్రిక - సంపాదకీయపుట - గల్పిక) 


నాయకుడు లేనివాడు వినాయ కుడు- అని వ్యుత్పత్తి అర్ధమట. ఈ లెక్కన ఇప్పుడు ఉన్న నాయకులందరూ వినాయకులే. ఇంట్లో ఉడకేసుకునే కుంటికూర క్కూడా హస్తిన నుంచి అను మతి రావడం తప్పనిసరనే నాయకులు ఇప్పుడు అమ్మ మీదకే నేరుగా కొమ్ములు విసురుతున్నారు. అన్ని పార్టీ ల్లో దాదాపు అంతే. ఎవరికివారే నాయకులు.


వినాయకుడనగానే ముందు గుర్తుకొచ్చేవి- ఘన మైన ఊరేగింపు, ఆఖర్న నిమజ్జనం. మన నాయకుల దీ అదే తీరు. వాహనమొక్కటే తేడా. ఒజ్జగణప య్యకు బుజ్జి ఎలుక వాహనమైతే, ఈ అయ్యలు ప్ర జల వీపులమీద సవారీ చేస్తుంటారు. వారిలో చాలామందికి త్వరలో నిమజ్జన గండమూ తప్పదంటున్నారు. చూడాలి, ఎన్నికలెలాగూ ముంచుకొస్తున్నాయి కదా!


అసలు వినాయకుడికి ఈ కొసరు వినాయ కులకు 'విగ్రహం' విషయంలో లంకె కుదిరినట్లే ఉంది. రంగురంగుల హంగులు. రకరకాల ఆకారాలు. ఎత్తుల విషయంలో కత్తులు కటార్లు నూరుకోవటాలు! గుజ్జు వినాయకుళ్లకే ఇవన్నీ తప్పనప్పుడు... మరీ మరుగుజ్జులు కదా మన నాయకులు- వాళ్ల మధ్య పొరపొచ్చాలకు కొద వేముంది?


ఒక విషయంలో మాత్రం మన నాయకులే మేలు. 'ప్లాస్టిక్కవి... రసాయనాలవి వాడొద్దు మొర్రో... మట్టి వినాయకులే మన వాతావరణా నికి క్షేమం' అని ఎంత మొత్తుకున్నా చెవిన పె ట్టడంలేదు. మన నాయకులతో ఈ పేచీ లేదు. మొదటి నుంచీ వాళ్లు వట్టి మట్టిముద్దలే!


వినాయకుడి లడ్డూ ప్రసాదాలకు పోటీల మీద వేలం పాటలు నడుస్తుంటాయి ఈ పండగ రోజుల్లో. ఇటీవలి పంచాయతీ ఎన్నికలకు ముం దు జరగబోయే సాధారణ ఎన్నికలకూ బహుశా ఈ వేలంపాటలే ప్రేరణై ఉండాలి. ఎవరు ఎక్కువ మోయ గలిగితే వాళ్లకే లడ్డూల్లాంటి పార్టీ టికెట్లుగా నడుస్తు న్నది ప్రస్తుత ప్రజాస్వామ్యం!


వినాయకుడికి ఆ గణాధిపత్యం ఎలా వచ్చిందో అందరికీ తెలుసు. తమ్ముడు పాతకాలం చాదస్తపు నేత లాగా పుణ్యనదుల్లో మునిగి రావడానికి వెళ్లాడు. తెలి విమీరిన వినాయకయ్య 'అమ్మా అయ్యా' అంటూ చుట్టూ చక్కర్లు కొట్టి ఇట్టే పదవి కొట్టేశాడు. ఆ తెలివే


మన నాయకులకు ఒంటపట్టిందన్నది బడిపిల్లవాడికి కూడా తెలిసిపోయిన రాజకీయ రహస్యం.


ఏనుగు తొండంలాంటి రూపాయి ఎలుకతోకంత చిక్కిపోయింది. సృష్టిలో జరిగే సర్వకార్యాలకీ సాక్షి అంటారే గణపయ్యని... మరి రూపాయి పతనానికి నిజమైన కారణం ఆయనకైనా తెలుసో లేదో! ఆయనా ప్రధానిలాగా మౌనముని ముద్ర దాలిస్తే ఎలా?

కనీసం బొగ్గుకోణం ఫైళ్ల గల్లంతుకు సంబంధించి అయినా నోరువిప్పితే బాగుణ్ను!


కుడుములు ఉండ్రాళ్లు కడుపునిండా పట్టించే ఆహార భద్రత బిల్లు వచ్చిందని ధీమానా? అయ్యో! ఇది రేపొచ్చే ఎన్నికల వలయ్యా పిచ్చిస్వామీ! ఎన్నికలు అయిదేళ్లకోసారే... నీ పండుగ ఏటా వచ్చేది!


శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం/ ప్రసన్నవదనం ధ్యాయేత్' అని మా నాయకులు నిన్ను ప్రార్ధిస్తున్నారని మురిసిపొతున్నావా ? పని పడితే గొప్పగా వసుదేవుడి పేరు చెప్పుకొని మరీ గాడిద కాళ్లైనా పట్టుకు వేళ్లాడే అవకాశవా దులు మా నాయకులు. ఓడ దాటించిన మల్లయ్యలెందరు బోడిమల్లయ్యలైపోలేదూ?


అదేదో శివాగమంలో ఉందట. బ్రహ్మేంద్రాది దేవ తలు, రుషిగణాలు, తతిమ్మా అఖిల జగజ్జగాలన్నీ ప్రార్ధించిన మీదటగానీ నీకీ గణాధిపత్యం, క్రియారంభాది కార్యాల మీద అధికారం లభించింది. కాదని! ఇప్పుడు, ఇచ్చోట ఆ అధికారాలన్నీ ఒక ముద్ద పప్పు బాబుకు బదలాయించే కుట్ర ప్రచండవేగంతో నడుస్తోంది. చూసుకో మరి!


ఎప్పుడో హాలుడు గాథాసప్తశతిలో నీ లీలలను మహా పసందుగా వర్ణించాడు. తొండంతో నువ్వేదో సముద్రజలాలన్నింటినీ తోడిపారేస్తే బడబాగ్నికి ఆకాశం అంటుకుందట! అప్పటి ఆ సరదాలకేంగానీ... ఇప్పుడు ముంచుకొస్తున్న ముప్పును కాచుకో వినాయకా!


సామాన్య జనమంతా అమాయకంగా ఈ నాయకులను నమ్మిన పుణ్యానికి ఇవాళ ఇక్కడ రకరకాలుగా మలమల మాడుతున్నారు. వికృత రాజకీయాల కోరలకు చిక్కి విలవిల్లాడుతున్నారు. కాయగూరలేవీ భూమ్మీద కనబడకున్నా ఉన్నంతలోనే పూలతో పళ్లతో నీ పాలవెల్లిని భక్తిగా అలంకరించుకున్నాం. పప్పులు, అపరాలు బంగారంతో పోటీపడుతున్నా నీ కడుపు నింపా లని మా కడుపులు మాడ్చుకుని కుడుములూ, ఉండ్రాళ్లూ నైవేద్యంగా సమర్పిస్తున్నాం. ప్రతి పం డగకు నీ వ్రతకథ విని మనస్ఫూర్తిగా నీ ముందు పిల్లాపాపలతో సహా గుంజిళ్లు తీస్తున్నాం.


ఎన్ని ఇబ్బందులొచ్చినా నీ జన్మదినాన్ని మా ఇంటి పండగలా జరుపుకొనే మేం, అన్ని దారులూ మూసుకుపోగా చివరికి నిన్నే నమ్ముకున్నాం. వచ్చే ఎన్నికలనాటికైనా మాకు సద్బుద్ధి ప్రసాదించు, సత్ క్రియాసిద్ధి కలిగించే నాయకులనే మాకు ప్రసా దించు, సిద్ధిబుద్ధి నాథా !


చేటల్లాంటి చెవులున్నాయి... జనాల గుండె చప్పుళ్లు ఎన్నాళ్లకూ వినకపోతే ఇక నీకూ, మా నాయకులకూ మరి ఎందులో తేడా స్వామీ... కనికరించు వినాయకా!


- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - దినపత్రిక - సంపాదకీయపుట - గల్పిక) 




No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...