బాపూజీ బతికిపోయాడు!
- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు దినపత్రిక - 30 - 10-2003 నాటి సంపాదకీయ పుట గల్ఫిక)
బాపూజీ చనిపోయాడు
చప్పట్లు
గోడ్సే విసిరిన గోలీ పుణ్యమా అని
బాపూజీ చనిపోయాడు.
మళ్ళీ చప్పట్ల చపుళ్లు
వేదిక మీద ఉన్నాయన కన్నీళ్లు పెట్టుకుంటూన్నాడు.
' కవిత్వం ఎంత బాగా చదువుతున్నాడో చూడండి! అందుకే ఈయన్ని మా ఊళ్లో మేమంతా వాజపేయి అంటుంటాం' అన్నాడు బస్సులో నాపక్కన కూర్చున్న పెద్దాయన సంబరంగా.
ఉదయగిరిలో పనుండి నెలూర్లో తెల్లారు జామున బస్సెక్కా . దార్లో ఈ ఊరిమధ్య బస్సాపేశారు.. ' మీటింగుంది. ముందుకు పోవటానికి వీల్లేదంటూ.
ఎండవల్ల ఉక్కబోస్తోంది. పసిపిల్లాడెవరో దాహమని గోల చేస్తున్నాను. "తాగేందుకు ఒక్క చుక్కనీరు కూడా దొర కవి ఏరియాలివి ' అన్నాడిందాకటి పెద్దాయన అడక్కుండానే.
వేదిక మీదింకో వక్త రెచ్చిపోతున్నాడు .. ' నేడు చాలా సుదినం. గాంధీగారి వర్ధంతి రోజునే బ్రాందీషాపు ఓపెనింగు .. బాగుంది.. బాగుంది ' అంటూ.
' వర్ధంతి అంటే పుట్టిన్రోజే కదండీ? ' పక్కనున్న పెద్దాయన సందేహం.
వేదికమీదున్నాయన కూడా అదే అనుకున్నట్లున్నాడు ' నాకు చాలా ఆవందంగా ఉంది. తాగాలంటే ఆట్టే దూరు పోకుండా ఊరి మధ్యకే వచ్చేసిందీ మద్యం షాపు . డోర్ కొట్టి మరీ డెలివరీ చేస్తామని ఇదిగో ఈ గాంధీ సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు దుకాణంవాళ్లు.. ' స్పీచి దంచేస్తున్నాడా పెద్దమనిషి.
అప్పుడు చూశానటువేపు . పాపం, గాంధీగారి విగ్రహం ఓ మూల వదిగి వదిగి నిలబడివుంది.
ఆయనకే రిపోర్టిస్తున్నాడు లాగుందీయన ' మద్యం మీద మూడు వేల కోట్లకు ఆదాయం రావాలి మనకు . అప్పుడే సంక్షేమ పథకాలు చక్కంగా సాగేది. చీపులిక్కరు తాగి చీపయిపోవద్దు. కల్తీ కల్లుతో శాల్తీలు గల్లంతవుతాయ్. జాగ్రత్త. మన రాష్ట్ర మద్యమే మనం తాగుదాం. మన రాష్ట్ర ఆదాయం పెంచుదాం.. అనేది మన ఉద్యమం కావాలి,
డబ్బాలు గలగలలాడించుకుంటూ బిలబిలా బుస్సులో కెక్కారు వాలంటీర్లు .
తెల్ల బట్టలో ఒకాయన రంకెలేసుకుంటూ మైకులాగేసుకున్నాడు అక్కడ .
మంచి పనయింది. . మనకింకా ఇలాంటి మంచి నాయకులు మిగిలుండబట్టి ప్రజా స్వామ్యం ఇంకా బట్టకట్టి ఉంది .
"ఓపెనింగుకి పిలవలేదని కోసంతో చేస్తున్నాడండీ ఈ ఏరియా ఎమ్మెల్యే. మంచి పనయింది. మరి ఈ ఏరియా ప్రజా ప్రతినిధి . పిలవాలని బుద్ధుండక్కర్లా?' అన్నారెవరో బస్సులో ఆయనకు వత్తాసుగా.
సభలో పెద్ద రభస మొదలయింది. ప్యాకెట్లమ్ముకొనే కుర్రాళ్లు బస్సు మీద పడ్డారు. మజ్జిగలాగుంది . ఎండకు తాగితే చల్లగా ఉంటుంది. పర్సు బైటికి తీస్తుంటే పక్కనున్న పెద్దాయన చటుక్కున చెయ్యి పట్టుకుని
' అది సారా సార్!' అని హెచ్చరించాడు గనక సలిపోయింది గానీ లేకపోతే కొంప కొల్లేరయేది. చాటుగా ఆ పెద్దాయన ఒక ప్యాకెట్ కొట్టడం నేను చూడకపోలేదు. వేదిక మీద రాళ్లేస్తున్నారెవరో .
జెండా ఎగరేయడం కూడా రాని చేతగాని దద్దమ్మలు మీటింగంటే మాత్రం రాళ్లేయడానికి రెడీ ! ' అన్నారెవరో బస్సులో కసిగా .
'మిత్రపక్షాల మధ్య సఖ్యత చూసి ఎవరో కక్ష కట్టారు ' అన్నారింకెవరో కచ్చగా. బస్సులో కూడా గోల మొదలయింది.
విండోగుండా చూస్తే గాంధీగారి విగ్రహం మీద టపటపా రాళ్లు పడుతున్నాయి. వేదిక మీద ఉన్న పెద్దమనిషికి గాయమైనట్లుంది .
గావు కేకలు పెడుతున్నారెవరో .
ఎక్కడున్నారో పోలీసులు అప్పటిదాకా .. ఠక్కుమని లాఠీలతో జనం మీదకొచ్చి పడ్డారు. ' ఫైర్' అని అరిచారెవరో . తూటాలు పేలడం మొదలు పెట్టాయి.
డ్రైవర్ సమయానికి బస్సు స్టార్ట్ చేశాడు గనక సరిపోయింది గానీ లేకపోతే ఇంకెంత మంది అమాయకులు అన్యాయంగా బలై పొయ్యేవాళ్లో?
ఉదయగిరి చేరేసరికి రెండు దాటింది.
మధ్యాహ్నం న్యూసులో జరిగిందంతా చూపిస్తున్నారు.
తూటా సేలి తల పగిలినవాడిని ఆసుపత్రిలో పడేయాల్సిందిపోయి కెమేరా ముందు పడుకోబెట్టి ఆవేశపడిపోతున్నాడో నాయకుడు 'మద్యం ఉద్యమంలో ప్రాణాలు పోయినాసరే ఈ అమరవీరుడి స్మారకార్ధం ఇక్కడ స్థూపం స్థాపించేదాకా నిద్రపోం...
కాబోయే అమర వీరుడు క్లోజప్పులో గోల పెడు తున్నాడు. చటుక్కున గుర్తుకొచ్పిందా మొహం బస్సులో నాపక్కన కూర్చున్న పెద్దాయనదే ఆ ఫేసు .
పాపం ప్యాకెట్ ప్రభావం!
తిరుగు ప్రయాణంలో బస్సు ఆ ఊరు చేరే సరికి చీకటిపడింది. అయినా సందడిగానే ఉంది. పొద్దుటికన్నా జనం ఎక్కువగా ఉన్నారు.
అదే వేదిక మీద అదే వాజపేయి మళ్లా కవిత్వం చదువుతో కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు ముందు తర్వాత ఉపన్యాసం.
' నేడు సుదినం . ఒక అమరవీరుడి స్మారకార్థం మన ఊరి నడిబొడ్డునే స్థూపం నిర్మించుకోవాలని తీర్మానం చేయడం నాకు ఆనందంగా ఉంది. మధ్యపానోద్యమంలో అసువులు బాసిన ఈ అమరవీరుడి విగ్రహ స్థాపనకు అయ్యే ఖర్చు ను మనమే తలా కాస్త భరించడం భావ్యం ' అంటుండగానే డచ్చాలా గలగలలాడించుకుంటో బిలబిలా బస్సులో కెక్కేసింది విరాళాల దండు .
వేదిక మీది ఏరియా ఎమ్మెల్యే గారితో పాటు కేమరా ముందు తెగ ఆవేశపడిపోయిన కుర్రాడూ చిర్నవ్వులు చిందిస్తూ కూర్చోనున్నాడు.
ఇదంతా చూసేందుకు ఎదురుగా ఆ గాంధీగారే లేరు. . పాపం!
' స్మారక స్థూపం నిర్మాణం కోసం గాంధీగారిని లేపేశారు ' అన్నారెవరో .
గోడ్సే విసిరిన గోలీ పుణ్యమా అని చనిపోయి.. బాపూజీ బతికిపోయాడు ...!
చెడు కనకు - కళ్లు మూసుకో!
చెడు అనకు - నోరు మూసుకో!
చెడు వినకు - చెవులు మూసుకో!
అన్న గాందీ గారి మూడు కోతుల సూత్రం మూ - సు - కో తెలిసో తెలియకో మనం ఆచరిస్తున్నంత కాలం గాంధీ విగ్రహమున్న విలువైన స్థలాన్ని కబ్జా చేద్దామని ఎత్తు వేసే బ్రాందీషాపు ఓనర్లు వంటి నాయకులు .. విగ్రహ స్థాపన వంకతో ప్రజల సొత్తును ఒక మంచికి వినియోగించే నిమిత్తం అమరవీరులను తయారుచేస్తున్నట్లు పై ఎత్తు వేసే నేటితరం వారి వారసులు .. ఇట్లా పుట్టుకొస్తూనే ఉంటారు.
గోడ్సే గోలీ చలవతో చనిపోయిన బాపూజీ అందుకే బతికిపోయాడు - అనేది.
- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు దినపత్రిక - 30 - 10-2003 నాటి సంపాదకీయ పుట గల్ఫిక)
No comments:
Post a Comment