Wednesday, November 10, 2021

అందరూ బాగుండాలి.. అందులో నేనూ ఉండాలి - సరదా వ్యాఖ్య -కర్లపాలెం హనుమంతరావు

 

అందరూ బాగుండాలి.. అందులో నేనూ ఉండాలి - సరదా వ్యాఖ్య

 -కర్లపాలెం హనుమంతరావు

 

పాడు రాజకీయాలని పద్దాకా చీదరించుకోడం మనకో పెద్ద ఫ్యాషన్. రాజకీయాల నుంచి ఎన్ని లాభాలు రాబట్టుకోవచ్చో!

 

ముక్కుసూటిగా వెళితే రాజకీయాలు వికటిస్తాయని మనకో యాంటీ సెంటిమెంటు. ముక్కునిలా లైట్ గా నేలకు రాసేయండి చాలు ఎక్కడెక్కడి పాపాలూ జనాలు ఇట్టే క్షమించేస్తారు.. ఆ గొప్ప విషయం ఆవిష్కృతం  చేసిందీ రాజకీయాలే. త్రేతాయుగం నాటికి ఈ తెలివితేటలు అభివృద్ధి చెందకే  పాపం సీతమ్మవారు అంత అమానుషంగా అగ్నిపరీక్షకు గురయింది!

 

'అనను.. కనను..వినను' అంటూ వున్న నోరూ, కన్నూ, చెవులూ వృథాచేసుకునే చాదస్తపు రాజకీయాలు కాదు ప్రస్తుతం నడుస్తున్నవి. గతంలో ఇటీవల ఓ నేత అంగరక్షకుడి వీపును మైకుసెట్టు పెట్టుకునే బల్లగా ఎట్లా మార్చుకోవచ్చో చేసి చూపించాడు.  సైంటిస్టులు ఏళ్ళ తరబడి కోట్లు తగలెట్టినా సాధించలేని ఈ మాదిరి ప్రయోజనాలెన్నో పొలిటీషియన్లు ఇట్టే పసిగట్టి ప్రచారంలో పెట్టేస్తారు.

 

ఏళ్ల చరిత్రున్న  ఓ జాతీయపార్టీకి గుర్తింపు తెచ్చింది  ఆఫ్ట్రాల్ ఓ అరచెయ్యి. చేతులనేవే లేకపోతే ప్రజాస్వామ్యానికి చేష్టలుడిగినట్లనేగా మీనింగ్? లోక్ పాల్ బిల్ ఎంత గొప్పదైతేనేమంట!  చట్టసభల్లో మెజారిటీ సభ్యులు చేతులెత్తిం తరువాతే గదా ఆ బండి ముందుకు కదిలిందీ!

 

బూతు కూతలు రాని నేతలకి చేతులు చేసే సాయం అంతా ఇంతా  కాదు. ఎదుటి పక్షం మీద మర్యాదపూర్వకంగా దాడి చేయాలంటే ఎంతలావు  పెద్దమనిషైనా 'చేతులు తీసేస్తా.. నాలుక కోసేస్తా.. తోకలు పీకేస్తా' అంటూ  వంటిభాగాలనే కదా రోషంగా  వాడుకోవాలి!

 

హస్తం పార్టీ మీద అస్తమానం పడి ఏడ్చే నేత ఎంత సీనియర్ అయినప్పటికీ తత్ అభినయానికి తగ్గట్లు వాడేదీ మరి స్వహస్తాలనే!

 

'కళ్ళు కైకలూరులో.. కాపురం డోకిపర్రులో' అని సామెత.   టైపు  పక్కచూపుల మీదెంత రచ్చవుతోందో తాజా రాజకీయాలలో! హన్నన్నా!  నాయకులు  కళ్లకూ, కన్నీళ్ళకూ అద్దే  కొత్త కళలు మరి అన్నా..ఇన్నా! ఓటరు కంటబడితే చాలు.. వాటర్ ఆఫ్ ఇండియా టైపు.. ఓ.. ఒహటే కన్నీళ్ళ ట్యాపుల పెనింగులు! ఎన్నడో పోయిన బామ్మలూ, బాపూల చావులిప్పుడు గుర్తొచ్చి ఆ  శోకన్నాలే తెప్పలుగా ఎన్నికల గోదారి ఈదాలనే మాదిరి ప్రయోజనాలు రాజకీయవేత్తలకు తప్ప శాస్త్రవేత్తలకు తడతాయా! ఏళ్ల తరబడి కోట్లు తగలేసినా సైంటిష్టు సాధించలేని రిజల్టు పొలిటీషియనెంత ఫాస్టుగా పట్టేస్తున్నాడూ!

 

సీదా సాదా పేదల పాదాలు.. కొన్ని క్రోసులు నడిచి  మురిగ్గుంటల నీళ్ళో తోడితెచ్చుకోడానికో.. స్టాపుల్లో ఆగని బస్సుల వెంటబడి రొప్పడానికే.  అదే మరి ఏ మహా మేధావి  అధినేతవైతేనో? మరుపులోకెళ్లిన బోడి మల్లయ్యలను మళ్ళీ మాలిమి చేసుకునే ఇంచక్కని చిట్కాలు! పడీ పడీ ప్రసన్నం చేసుకొనేందుకు.. పడనప్పుడు  పట్టి పడదోయడానికి ఎదుటి శాల్తీ తాలుకు   పాదపద్మాలు  ఎంత ప్రయోజనమో పాలిటిక్సోళ్లకు తప్ప తతిమ్మా  ప్రజావళికి తడుతున్నాయా!

 

నోరు అన్నది బడుగుజీవులకైతే పెనుశాపం. కరవు రోజుల్లో దాని ఫీడింగే సామాన్యుడికి పెద్ద ఫీట్. అదే నోరు మరి  ఏ మహారాజరాజశ్రీ  నేతాజీ గారికైతేనో? ఎదుటోడి మీద  చేసే దాడిలో తిరుగులేని వజ్రాయుధం.

 

నిర్భాగ్యులు నిర్వేదంతో చప్పరించుకోడానికి తప్ప పనికి రాని  నాలుక ఎన్నికల్లో హామీలు గుప్పించే వేళ ఏలికలకు ఎంతో కీలకం.  నాటకం చివర్లో ఇంచక్కా మడతేసి  మళ్ళా ఎన్నికలొచ్చే వరకూ  భద్రంగా దాచుకునే సరుక్కూడా. నోరు ఒక్కోసారి అలవాటుగా జారి అల్లరి పాల్జేసినా ఒక్క'సారీ'తో  'స్వారీ' సౌకర్యం చేజారి పోకుండా పదిలపరిచేందుకు పక్కనే చెవితమ్మలు సదా హాజరు.

 

రెండు వేళ్లూ నోట్లోకి  తిన్నగా పోయే వెసులుబాటేమీ లేక వట్టిగాలి మాత్రం జనం భోంచేస్తుంటే.. ఆ వేళ్ళనే విక్టరీ సింబల్ కింద మలుచుకున్న ప్రయోజకులు  మన  నేతలూ.. వాళ్ల తాలూకు దూతలూ.

 

ఓటు బ్యాంకు రాజకీయాలనే వదిలిపెట్ట బుద్ధికాని మన  నేతలకు..  ఉచితంగా వచ్చిపడే  వంటి మీది పార్టులను వృథాగా పోనిస్తారా.. మన పిచ్చిగానీ! నీతిని నమ్మితే మోచేతి మీది బెల్లమే అధికార పరిధి వరకు.

 

పై నుంచొచ్చిన పెద్దాయనొకాయన ఆ మధ్య  పద్దాకా ఓ యువనేత  డిఎన్ఏ ప్రస్తావన తీసుకొచ్చేవాడు. ఆ పెద్దాయన చెంపలు రెండూ  వాయించేయమన్నాడా యువనేతగారు. నేతల రాజకీయ యాత్రల్లో చెంపల  వైటల్ రోల్ రోజూ చూస్తున్న కథే కదా!  ఆడా మగా  చిన్నా పెద్దా తేడా కూడా చూడక  కంటబడ్ద ప్రతి ఓటరు రెండు చెంపలు నిమిరే మా గొప్ప మేనరిజం ఓ జెంటిల్మేంగారిది. 'పంఖా' ఎన్నికల గుర్తుగా ఎందుకు ఖాయమైందో! కానీ నిజానికా  జెంటిల్మేన్ పంథాకు 'చెంపలు' సరైన సింబల్.

 

 కొందరు బుర్రమీసాలు.. కొందరు తొడగొట్టుళ్ళ చూట్టూ రాజకీయాలు తిప్పుతారు. వంటి భాగాలు  గుర్తుగా కూడదన్న షరతేదో ఎన్నికల సంఘానికి అడ్డొస్తోంది కానీ.. నిజానికి కొన్ని పార్టీలకు 'కడుపు' గుర్తు ఇస్తే ఓటరుకు  పసిగట్టే వెసులుబాటు ప్రసాదించినట్లే.

 

గత్తర కొద్దీ ఏదో కూసి ఆనక చెవులు పట్టుకుని 'సారీ' చెప్పే ఆత్రగాళ్లకేమో చెవుల గుర్తు మోస్ట్ సూటబుల్. తడవ తడవకీ వేళ్లో, గోళ్ళో చూపించే పాడలవాటు పోనివాళ్లకు 'గోళ్ళు ఏపుగా పెరిగిన వేళ్ళు' గుర్తు ఖాయం చేస్తే అభిమానులు తగుదూరంలో తిరగేందుకు సులువు. తల్లి చంక దిగని చంటి పాపలకు 'పాల పీక' లాంటిదేదన్నా  గుర్తుగా అందిస్తే పాలిటిక్సుతో ఆడుకుందుకు సరిపోతుంది. అస్తమానం సానుభూతి సెంటిమెంటు మీద ఆధారపడే పార్టీలకు  'నీళ్లు నిండిన కళ్లు' సింబలుగా ఇస్తే  నాలుగు ఓట్లేమన్నా అదనంగా కలిసొచ్చే వెసులుబాటు పెరుగుతుంది. నిండు సభ, చట్టసభలయినా  నిద్రాగని కుంభకర్ణ  వారసులకు 'గురక మార్కు నోరు' గనక గుర్తయితే నిద్రమత్తు ఓటర్ల మద్దతైనా దొరికేవీలుంది మరి! నీలి చిత్రాలతో తప్ప ఉత్తేజం పొందలేని నీచ నేతలకు ''మార్కు బొమ్మలేమైనా సింబల్సుగా వాడుకునే సౌకర్యం ప్రత్యేకంగా కల్పిస్తే.. ఆ టైపు ఓటర్లంతా ఒకటయ్యే అవకాశం ఇచ్చినట్లవుతుంది.

 

తలాతోకా .. అని కాదు.. దేన్నైనా తళతళలాండించే కళ మరో పేరే రాజకీయం. రాజ్యాంగ పెద్దల పుణ్యమా అని ఏదో ఐదేళ్లకోసారి వేలుకి చుక్క పొడిపించుకుని..  నచ్చిన మంచివాడికి ఓటేయ వచ్చనుకుంటుంటే.. మధ్యలో ఈ తిరకాసేమిటనా సందేహం?

 

చెడ్దవాడికిచ్చే ఓటు తలారి చేతికిచ్చే తల్వారు వేటు= అన్నది  రాటుదేలిన ఓ రాజకీయవేత్త కోట్. పదేసి తలలతో  తలపడే రావణబ్రహ్మ ప్రాణాలైనా అరికాలి బొటన వేలులొనేగా పడి ఉండేది! ఎంతలేసి ఛాతీ వడ్డూ పొడుగులున్న నేత ఆయుష్షైనా బ్యాలెట్ పెట్టె బొడ్డు మరుగునే దాగుండేది! ఓటు గుండు పేల్చేది చెడ్ద రాజకీయాలను  చివరంటా కూల్చేయడానికే.  ‘అందరూ చల్లంగుండాలి. అందులో మేమూ ఉండాలి’ అని ఓటర్లంతా ఆలోచించగలగితే  ఇన్నేసి కళలున్న రాజకీయానికి  అప్పుడే కొత్త కళ వచ్చేది! దేహంలోని ఏ పార్ట్ కయినా వివేచన ఉన్న మెదడే అధినేత.. అయినట్లు   దేశంలో ఎన్ని రాజకీయ పార్టీలున్నా వివేకం ఉన్న ఓటరే ఆయువుపట్టు.  

-కర్లపాలెం హనుమంతరావు

25 -02 -2021

***

(ఈనాడు దినపత్రిక సంపాదకీయ పుటలో ప్రచురితం)

 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...