నెత్తిక్కిరీటం, భుజానికి కీర్తులు, జులపాల
జుట్టు, చెవి కుండలాలు, పట్టు
పీతాంబరాలు.. ముఖ వర్చస్సు చూస్తుంటే .. ఎవరో దేవుడనిపిస్తోంది.
'దేవుణ్ణే నాయనా! సత్య నారాయణస్వామిని. నీ కోసమే రాక'
యుగాల తరబడి
ఒంటి కాలి జపమైనా కనికరించని దేవుళ్ళు అడగా పెట్టాకుండా ఇట్లా హఠాత్
దర్శనాలిచ్చేస్తుంటే..డౌటెంత ఉగ్రభక్తుడికైనా తన్నుకురాకుండా ఉంటుందా!
'ఎందుకొచ్చినట్లో?'
'రేపే ఇరవయ్యో తారీఖు. ఇంకా ఏర్పాట్లే స్టార్టయినట్లు లేదే!'
'ఏమేర్పాత్లు స్వామీ?'
'ఇరవయ్యో తారీఖు.. నా వ్రతం ఫిక్స్ చేశావుగా!'
'ఎవరా చెప్పిందీ?'
'మీ బాసు. నైటు ఆయనకు నిద్రలో కనిపించాలే!'
అర్థమయింది
మేటరు. ఆఫీసులో లోన్ పెట్టుకోడానికి రీజనేదైనా కావాలి. రిలిజియస్సుదైతే
రిజెక్షనుకు భయం శాంక్షన్ అధార్టీసుకు. పద్దాకా పెళ్లి, చావు లాంటి ఫంక్షన్స్ రిపిటీషన్ కుదుర్దు
కదా! అందుకే, అందర్లా నేనూ సత్యన్నారాయణ వ్రతం వంకన
పాతికవేలు నొక్కేశాను. బాసా విషయం కూడా దేవుడి ముందు దాచలేదన్న మాట!
బాస్ కంటే
భయపడాలి. భగవంతుడిక్కూడానా! ఫ్యాక్ట్సేవీ దాచుకో తలుచుకోలే!
'ఆ డబ్బింకా ఉంటుందా? అప్పుడే ఖర్చయిందిగా? దేవుణ్ణంటున్నావు. ఇంత చిన్న మేటర్ మీద కూడా సమాచారం లేదా?'
'పాతికవేలయ్యా! ఒక్క టెన్రూపీసన్నా మిగుల్చుకోలేదా?' భగవంతుడి
గొంతులో ఉక్రోషం.
'మిగిల్తే మాత్రం .. నిజం పూజకు అవగొడతామా?' దేవుణ్ణి
టీజ్ చెయ్యడం తమాషా అయిన కొత్తనుభవం!
'పోనీ.. సత్యవ్రతమన్నా చెయ్యవయ్యా! డబ్బుతో పనుండని దీక్ష.. అది' జాలిగా అడిగాడు దేవుడు.
'సత్యవ్రతమా! పైసలక్కర్లేని వ్రతాలుంటాయా! జోక్..'
'ఉంటాయ్. నిత్యమూ సత్యమునాడవలయును. అనృతములాడరాదు'
'ఇదేం పైత్యం! సాధ్యమేనా ఈ కలికాలంలో?' దేవుడు నన్ను
గానీ రివర్సులో టీజ్ చేయడంలేదు కదా?
'పోనీ.. ఒక్క ఇరవై నాలుగ్గంటలన్నా అబద్ధాలడకుండా ఉండలేవా.. మానవా?'
'ఎట్లా సామీ? నేను సాంగ్స్ రాసిన సినిమా ఆడియో రేపే
రిలీజ్! నేనూ మీటింగులో ముఖ్యమైన వక్తనే!'
పరంధాముడుకి
పరిస్థితి అర్థమైనట్లుంది.
'ఓకే! నీ ప్రాబ్లమ్స్ నీకున్నాయి మరి! ఒక్క మూడు అబద్ధాల వరకు కన్ సెషన్
గ్రాంటెడ్! ఆ పైన నువ్వు ఆడాలన్నా ఆడలేవు..'
'ఏందదీ..?'
'అబద్ధం! నీ టంగ్ కంట్రోల్ నీ అధీనంలో ఉండదు. ఆచి తూచి వాడుకో విలువైన
అబద్దాలను. మళ్లీ రేపిదే టైమ్కి ఠంచనుగా మళ్లీ ప్రత్యక్షమయి చూస్తా.. నీ పరిస్థితి'
మరో మాటకు తావివ్వకుండా మాయమైపోయాడు సత్యనారాయణుడు.
ఫోనదే పనిగా
రింగవుతోంటే నాకూ మెలుకొవొచ్చేసింది. ఇహ కథ నడుపుకోడం నాదీ బాధ్యత!
'శంకరయ్యంట! ఎవరో ఎల్లైసీ ఏజెంట్' అంది మా శ్రీమతి
లాండ్ లైన్ రిసీవర్ ఎత్తి పట్టుకుని.
'ఊళ్లో లేనని ఏదో చెప్పు' అంటూ మళ్లీ ముసుగు
బిడాయించబోతూ వుంటే 'ఇవేళ పెందరాళే ఆఫిసు కెళ్లాలన్నారుగా?' అని దుప్పటి
లాగేసింది మా మహాతల్లి.
ప్రెస్
మీటింగ్ సంగతి గుర్తుకొచ్చి ఠక్కున లేచి కూర్చున్నా. అప్పటికే ఎనిమిదయింది.
హడావుడిగా
తయారై హుషారుగా మెట్లు దిగుతుంటే
అనుమానంగా అడిగింది మా ఆవిడ 'ఆఫీసుకేనా?'
'సునిమాలంటే ఇష్టవెఁ కానీ, సినిమాల్తీసేవాళ్లంటే
వళ్లు మంటావిడకు. మందు కొడతారని, ఆడోళ్లనో పట్టన
వదిలిపెట్టరని పక్కింటి పంకజం నూరిపొసిన ఇన్ఫ్లుయెన్స్! తనతో గొడవెందుకని సినిమా
పన్లుప్పుడు కూడా ఆఫీసుకే వెళ్తున్నాని అలవాటుగా చెబుతుంటానెప్పుడూ! ఆ మాటే చెప్పి
బైటకొచ్చింతరువాత గాని బుర్రకు తట్టింది కాదు .. అప్పుడే రెండు అబద్ధాలు వృథా
అయిపోయాయని!
సత్యనారాయణ
మాట సత్యమేనా? మూడో అబద్ధం తరువాత నా నాలుక
నా కంట్రోల్లో ఉండదా?
వెళ్లే
దారిలోనే బాస్ ను కలసి 'నాట్ ఫీలింగ్ వెల్' అని
మూడో అబద్ధమాడేసి నేరుగా సినిమా ఆఫీసుకు చేరేసరికి గుమ్మంలోనే రంగారావు
కనిపించాడు.
రంగారావుకు
నేనో పదివేలు అప్పున్న మాట నిజం. ఏడాది బట్టీ నక్షత్రకుడికి మల్లే నా చుట్టూ
చుట్టూతానే తిరుగున్నాడు; ఎప్పటికప్పుడేదో ఓ అబద్ధమాడి
తప్పించుకోడం ఓ హాబిట్ నాకు.
'అర్జెంటుగా డబ్బవసర పడింది. నీ దగ్గరెంతుంది ప్రస్తుతం ప్యాకెట్లో?'
అనడిగాడు ఎప్పట్లానే. '
'పదేలు' అన్నా అప్రయత్నంగా.
ప్రొడక్షనాఫీసువాళ్లు
పంక్షను ఏర్పాట్లకని ఇచ్చిన సొమ్ము! దాన్నుంచి నొక్కేసిన రొక్కం ప్రస్తుతం నా
జేబులో ఉండటం నా కొంపలా ముంచేసిందీ పూట
ఇట్లా.
'ఇహనేం!' అంటూ నా జేబులో తనే తన చెయ్యేసేసుకుని ఉన్న
సొమ్మంతా ఊడలాగేసుకుని 'అసలు వరకిది ఓకేరా మిత్రమా! వడ్డీ
ఎప్పుడిస్తావో చెప్పి చావమ'ని పీకల మీదెక్కి కూర్చున్నప్పుడు
కాని స్వామివారి అబద్ధాల కన్ సెషన్ మహిమ తెలిసిరాలేదు.
రంగారావుతో
నిజం చెప్పడమదే మొదటి సారి నాకు. స్వామి వారి మాట సత్యమేనన్న రూఢికే ఈ ఘోరం
జరిగినట్లుంది ఆ క్షణంలో.
ఆడియో
ఫంక్షను మధ్యలో రాజమండ్రి నుంచి ఫోన్! మా మరదల్ని చూసిపోయిన మగపెళ్లివారి నుంచి . ' మాకీ సంబంధం నచ్చింది. ముహూర్తాలు
పెట్టేసుకునే ముందు లాస్టుగా ఓ చిన్న ఎన్ క్వయిరీ! మీరూ ఆ ఇంటి అల్లుడే కదా! మాట
వరసకే అడుగుతున్నాం. మంచి సంబంధమేగా?'
నా నాలుక నా
అధీనం తప్పిన మాట నిజంలానే ఉంది. నా నోటి నుంచి వచ్చే మాటలకు నా గుండే
రగిలిపోతోంది 'దరిద్రపు సంబంధం. పిల్లకు
చదువులేదు. మహా మొరటు. వెకిలి చేష్టలకిహ అంతుండదు. మాటే కాదు.. బుద్ధికీ నిలకడలేని
మనిషి మా మాంగారు. చెప్పిన కట్నం గిట్టేది
వట్టిదే. అత్తగారు కిలాడీ. నోరెత్తితే మంచి మాట రాదు. ఆ ఇంటి పిల్లను చేసుకుంటే
చేసేది సంసారం కాదు.. సర్కస్! పెద్దదాన్ని చేసుకుని నేను బఫ్ఫున్నయ్యా.. రెండో
దాన్ని మీరు చేసుకుంటే..'
అవతల లైన్
కట్ అయింది.
విస్తుబోయి
వింటున్నారు ప్రొడక్షన్ టీమంతా నా వంక రెప్ప వాల్చకుండా! 'మీకేమయింది మిత్రమా ఇవాళ. మీటింగులో కూడా మీ
ఉపన్యాసం ఈ ..' అంటుండగానే ఎవరో నా చేతికి మైకందించేశారు.
ఎదురుగా
మీడియా! వీడియోలు రన్నవుతున్నాయ్!
'నిజానికి పాట ట్యూన్లేవీ ఓన్
క్రియేషన్ కాదు. అస్సాం భాష లిటరేచరరుకు
మక్కీకి మక్కీ! ట్యూన్లు తులు భాష మూవీ
నుంచి ఎత్తుకొచ్చినవి. కథ బెంగాలీ థీమ్ ను లైట గా మార్చుకున్నది. అవుట్ పుట్
అధ్వానం. హీరో పరమ వికారం. హిరోయిన్ కోతి ముఖం చూసి మొదటాట నుంచే హాలు ఖాళీలవడం,,
ఖాయం!..' నా చేతిలోని మైకును ఎవరో
గుంజెసుకున్నారు. ఇంకెవరో నన్ను సీటు నుంచి లేపి గేటు బైటకు నెట్టేశారు. వెనక్కు తిరిగి చూస్తే తలుపులు బంద్!
ఇంటికి పోవాలంటే
భయంగా ఉంది. టీవీల నిండా నా మీదే ఫుల్
కవరేజీ! నా సత్యవ్రతం అప్పుడే నెట్ లో ఓ
వీడియాగా వైరలయింది.
పార్కులోని ఓ
సిమెంట్ బెంచీ నా బెడ్డయిందా నైటుకి. చుట్టూతా కటిక చీకటి నా అబద్ధపు జీవితంలా.
దూరంగా ఆకాశంలో తారకలు నేనాడిన సత్యపు తునకల్లా!
సర్వం స్వామి
వారి సత్యస్వరూప శుద్ధ మాహాత్మ్యం!
'లోకంలో ఇంత మంది ఉన్నారు. ఇన్నేసి అబద్ధాలాడుతున్నారు. నిజం చెప్పమని
స్వామి.. సామాన్యుణ్ని నా వెంట మాత్రమే ఎందుకు పడ్డట్లు?
బంగ్లా
యుద్ధంలో జైలు కెళ్లినట్లు ప్రధానిచ్చిన స్టేట్ మెంట్ పెద్ద అబద్ధం కాదా?
దేవుళ్ళ మీద ప్రమాణం చేసి ప్రజాప్రతినిధులంతా పదవులు స్వీకరించే సమయంలో
పేలేవన్ని పరమ సత్యాలనేనా? న్యాయదేవత ముందు బోనులో నిలబడి
సాక్షులంతా ప్రత్యక్షంగా కళ్లతో చూసొచ్చినట్లు చెప్పేవన్నీ శుద్ధసత్యాలా? అధికారులు సర్కారు సొమ్ము గుంజేందుకు సమర్పించే పత్రాలన్నీ నికార్శైన
నిజాలకు నిలువుటద్దాలా? బ్యాంకుల్లో పెద్దలు గుంజుకునెళ్లే
సొమ్ముల కోసమై సమర్పిచే పత్రాలలో ఎదీ అబద్ధమయే అవకాశం లేనేలేదా? సినిమా కలెక్షన్ల గురించి నిర్మాత మహాశయులు, అభివృద్ధి కోసమని దొంగవ్యాపారులు, విదేశీ
వీసాల కోసమై విద్యర్థులు సమర్పించుకునే అర్హతా పత్రాలు అన్నీ పచ్చి వాస్తవాలనేనా?
ముఖ పుస్తకాలలో శాల్తీలే అసలైనవి కాని కలికాలంలో అచ్చమైన సత్యాలు
మాత్రమే చెప్పితీరాలంటూ ఎంత సత్యనారాయణస్వామివారైతే మాత్రం దిక్కూ దివాణం లేని తన
బోటి బక్కవెధవను ఉక్కితి బిక్కరి చేయడమేమిటి?
అబద్ధాలు
ఆడైనా పెళ్లి చేసుకునేందుకు పర్మిషనిచ్చేసిన భగవంతుడి ముందు ముష్టి పాతిక వేలు
అప్పుగా తీసుకున్నందుకు నేనిత అలుసవుతానని కలలో సైతం ఊహించలేదు. ఆక్సిజనైనా లేకుండా మనిషి బతకవచ్చునేమో కానీ..
అబద్ధమాడకుండా మనుగడ కొనసాగించలేడు' అని భగవంతుడికి ఇవాళ రాత్రి కలలోకి వచ్చినప్పుడు నచ్చచెప్పాలి' అనుకున్నా.
ద్
దేవుడు
ఎంచేతనో మళ్లీ కనిపించిందే లేదు! నిజం మీద
నేను నిలదీసేందుకు తెగించిన విషయం బహుశా భగవానుడు కూడా పసిగట్టేశాడనుకుంటా!
దేవుడే మాట
తప్పగా లేంది ఇహ జీవుడి సంగతి చెప్పేదేముంది!
·
కర్లపాలెం హనుమంతరావు
·
(ఈనాడు -దినపత్రిక సంపాదకీయ పుట (నివురు గప్పిన నిజాలు పేరుతో) మే, 2002 లో (30?) ప్రచురితం
No comments:
Post a Comment