Friday, October 2, 2015

పాట రద్దయి పోదు!- కవిత

కాలం ముందు చేతులు కట్టుకుని నిలబడటం ఎంత దయనీయం!
ఇలాంటి విషాద ఘడియ ఒకటి వచ్చి పడుతుందని ఊహించనే లేదు .
భ్రాంతి దిగ్ భ్రాంతి గా మారిన దురదృష్టపు క్షణాలివి.
వసంతానికి తప్ప దేనికీ గొంతు విప్పని చిలుక
కొండచిలువతో కలిసి బృందగానం ఆలపించటం కన్నా విషాదం మరేముంటుంది ?
కత్తి అంచున నిలబడి గొంతెత్తి పాడుతూ ఆడి పాడిన ఆ పాట నిజామా?
కొత్త నేస్తం తో చెట్టపట్టాల్ పట్టి చిందులేసే ఈ పాట నిజామా?
నిప్పుకుండను పుక్కిట పట్టిన ఆ పాటేనా
బజారులో రెండు రూపాయలకమ్మే నీటి పాకెట్లా ఇలా కలుషితమయిపోయిందీ!
నీ పాట తాకట్టు కొట్టువాకిట్లో తచ్చాడుతున్నప్పుడే నాకు స్పృహ వచ్చి వుండవలసింది
కలల్ని మింగి హరయించుకోవటం కష్టమని నీ కిప్పుడనిపించిందా!
మరి నీ రాగాన్ని భుజాన మోసుకు తిరుగుతున్న వాడి గతేమిటి పాటగాడా!
దగా, మోసమని నడి బజారులో వాడు నిన్నలా నిలదీస్తోంటే
నీ గురించి కాదు గాని
నిన్ను నమ్ముకున్న పాటను గూర్చి జాలేస్తుంది.
జనం భుజాలమీద మోసుకునే పదాలను నువ్వలా రాజు పాదాల ముందు పరచావు
పాట పరుసవేది స్పర్స అంటకముందు నీవూ ఆ జనం మనిషివేనని మరిచావు .
ఏ బలహీన క్షణాలలో రుద్రుడు కాముడి మాయలో పడి ఓడిపోయాడో
ఆ మాయదారి క్షణాలే మళ్ళి నీ పాటకూ దాపురించాయని సరిపెట్టు కోమంటావా?
వేళ్ళు నరికినా తలను తెంపినా
నీ పాటనే మొండిగా పాడుకొనే మొండెం నిన్నిప్పుడు అడుగుతుంది మిత్రమా!
బదులు చెప్పు!
కవాతుకు ఒక పాట తగ్గింది ..అంతేగా !
వేల గీతాలు ఈ అపస్వరాన్న్నితొక్కుకుంటూ వెళ్ళిపోతాయి
పాట ఆగితే ఆట ఆగదు
ఇది దొరలు గడీలో ఆడుకునే కుర్చీలాట కాదుగా !
సుడిగాలినెదుర్కునేదే అసలయిన పాట
నెత్తురు గడ్డ మీద పూచిన పూవు అంత తొందరగా వాడిపోదులే!
పాట మడుగును అడుగుకింతని నువ్వమ్ముకున్నా
అడుగునున్న తడి మాత్రం ఏ అమ్మకానికీ కుదరదు.
నాలిక మెలికలు తిరిగినంత తేలికగా పాట ఆత్మ మడత పడదు.
నువ్విలా చివరి అంకపు స్త్రోత్ర పాఠపు సర్వేజనా సుఖినో భవన్తులాగా
ఎంత జీరబోయినా
పాట రద్దయి పోదు
రద్దయేది పాటగాడిగా నువ్వు మాత్రమే మిత్రమా !
-కర్లపాలెం హనుమంత రావు
(ప్రజాకళ-జూలై-2012 సంచికలో ప్రచురితం)
సందర్భంః వైయస్సార్ పథకాలకు అనుకూలంగా గజ్జెకట్టి గొంతువిప్పి  ఆడిపాడిన ఓ ప్రముఖ ఉత్తరాంధ్ర జనంకళాకారుడి  రివిజనిజాన్ని నిలువెల్లా గర్హిస్తూ అప్పట్లో రాసుకొన్న పాట

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...