Showing posts with label Surya. Show all posts
Showing posts with label Surya. Show all posts

Thursday, December 9, 2021

వ్యంగ్యం మంత్రిగారితో ముఖాముఖి రచన- కర్లపాలెం హనుమంతరావు ( సూర్య దినపతిక - 30-09-2018 ప్రచురితం )

 



 వ్యంగ్యం 

మంత్రిగారితో ముఖాముఖి 

రచన-  కర్లపాలెం హనుమంతరావు 

( సూర్య దినపతిక - 30-09-2018 ప్రచురితం ) 


జార్ఖండ్ రాష్ట్రంలో గత ఏడాది పశువుల కాపరి ఒకడి పాప పంకిలాన్ని పరిశుధ్ధం చేసే పుణ్యకార్యంలో భాగంగా బహిరంగ ప్రదేశంలో పరమ కిరాతకంగా పరమపదసోపానం ఎక్కించారు కొంతమంది  స్వచ్చంద సేవాకార్యకర్తలు. ఆ పుణ్యాత్ములు ఎనిమిది మంది ఆధ్యాత్మిక లక్ష్యాన్ని అపార్థం చేసుకొని కథిన జీవిత కారాగార శిక్ష  విధించింది కింది కోర్టు. ఆ తప్పును సరిదిద్దుకుంటూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వారిని బెయిలు మీద విడుదల చేసిన సందర్భంలో.. కారాగారం నుండి విముక్తి చెందిన ఆ ప్రజాసేవాతత్పరులకు ఎదురేగి మరీ బహిరంగ సభలో పూలదండలతొ ఘనంగా సన్మానించారు శ్రీమాన్ కేంద్ర మంత్రివర్యులు  జయంత్ సిన్హాజీ! శ్రీవారి సదుద్దేశం దేశానికి తెలియచెయ్యాలన్న ఉద్దేశంతో ముఖాముఖీకి ప్రయత్నించినప్పటికి ఇంత వరకు ఆ పిచ్చాపాటికి అవకాశం లభించింది కాదు. దురదృష్టం. అయితే అదృష్టం మరోలా తన్నుకొచ్చింది. సరిగ్గా గౌరవనీయ సిన్హాజీ అడుగుజాడలలోనే ప్రస్థానించే మరో  రాజకీయ నేత ఈ వారంలో జైలు నుంచి విముక్తి చెందిన మరో నేరస్తుల ముఠాకి ఘన సన్మానం జరిపించి సభా సమక్షంలో పుష్పమాలాంకృతలను చేసి జాతికి మరో మారు దిగ్భ్రాంతి ప్రసాదించారు. పేరు వెల్లండించ వద్దన్న తమ షరతులకు అంగీకరించిన పిదప మీడియాతో వారు తమ మనోభావాలను మనసు విప్పి మరీ పంచుకొన్నారు. ఆ ముఖా ముఖీ తాలూకు కొన్ని విశేషాలుః

హంతకులను సన్మానించడం మంచి పద్ధతి కాదని ప్రజలు భావిస్తున్నారు. అందుకు మీ సమాధానం?

మంత్రివర్యునిగా నా దృక్పథం మరింత విశాలంగా ఉండడం అవసరమని నేను భావించడమే. ఏ ఒక్క వర్గం వారి అభిరుచుల మేరకో నడుచుకోవడం ప్రజాప్రతినిధికి సరి తూగదు. చాలా శతాబ్దాల బట్టి సమాజం నేరగాళ్ల పట్ల బహు క్రూరత్వం ప్రదర్శిస్తోంది. నేరస్తులు మాత్రం మనుషులు కాదా? వారికి మాత్రం భావోద్వేగాలు ఉండవా? 'దేవదాసు' సినిమా చూపిస్తే వాళ్ళూ కన్నీళ్లు పెట్టుకుంటారు. హంతకులూ సమాజంలో అంతర్భాగమే! క్రూరలను సైతం కూడగట్టుకుని ముందుకు సాగవలసిన అగత్యం మన సమాజానికి ఉంది. దొంగలూ దొరల వలె జీవించే మంచి భవిష్యత్తు కోసమే నేను కలలు కనేది. కానీ కొంత మంది కక్షపూరితంగా  నేరస్తుల మీద జుగుప్స పెంచుకుంటున్నారు. కిరాతకుల పట్ల  నేను ప్రదర్శించే సానుభూతిని మీడియాగా మీరూ సమర్థించాలి న్యాయంగా! 

మీ పార్లమెంటు సభ్యులలోనే మూడొంతుల మంది తీవ్రమైన నేరాలు చేసిన నేతలున్నట్లు రికార్డులు చెబుతున్నాయి కదా.. ?

 నిజమే! మా ఎంపీలలో 20 శాతానికి మించి తీవ్రమైన నేరస్తులున్నట్లు  నిందలు భరిస్తున్నారు. హత్యలు, మానభంగాలు, కిడ్నాపులు, వంటి ఆరోపణలల్లో మా స్వంత పార్టీనే ముందంజలో ఉందని లెక్కలు చెపుతున్నాయి. న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది. అదృష్టం కొద్ది ఈ దేశంలో చట్టమూ తన పని తాను చేసుకుపోతోంది.

తన పని తానే చేసుకుపోతుందంటే మీ భావన?

పరిస్థితులన్నీ సవ్యంగా సాగుతున్నాయని అర్థం.  చాలా కేసుల్లో పోలీసుల విచారణ ఇంకా 'సాగు'తోనే ఉంది. కొన్ని కేసులే దారి తప్పి కింద కోర్టుల్లోకి ప్రవేశిస్తున్నాయి. అవీ అవసరాన్ని బట్టి క్రమంగా సర్దుకుంటాయి. సాధారణంగా ప్రతి ఎం.పి కి ఐదు నుంచి ఆరు దఫాలుగా ఎన్నికయే అవకాశం ఉంది. ఆ తరువాత అనారోగ్యం. భార్యో .. కొడుకో పదవి అందుకొనేందుకు సిద్ధంగా ఎటూ ఉంటారు. కొడుకు ఏ తాగుబోతో అయితే కూతురు రంగంలో దూకేందుకు సిద్ధమవుతుంది.

 కానీ మీరు దండలేసిన వ్యక్తులు న్యాయస్థానాలలో నేరస్తులుగా రుజువయినవాళ్లు కదా?  

అదే సామీ నేను మొత్తుకొనేదీ! పోలీసులు మా కార్యకర్తలకు సంబంధించిన కేసుల్లో మాత్ర,మే ఎందుకు త్వరత్వరగా విచారణ పూర్తిచేస్తున్నట్లు? అది అన్యాయమే కదా? న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. కానీ అవీ ఊహించని కారణాల వల్ల గత్తర గత్తరగా తీర్పులిచ్చేస్తున్నాయి! మా ప్రజాప్రతినుధుల పట్ల ఎంతో ఉదాసీనత చూపించే రాజ్యాంగ వ్యవస్థలు అభం శుభం తెలియని చిన్న నేరస్తుల మీదే ఎక్కువ గురిపెడుతున్నాయి! తాత్కాలిక సంఘ ప్రక్షాళనను గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు కాని.. భవిష్యత్తులో సమాజానికి అక్కరకొచ్చే ప్రతిభ తుడుచుపెట్టుకుపోతోందని అర్థంచేసుకోవడంలేదు. ఇప్పుడున్న రాజకీయనేతలంతా ఎక్కడ నుంచి పుట్టుకొచ్చింది? మా  అమాయక కార్యకర్తలు నిష్కారణంగా విక్టిమైజ్ అవుతున్నట్లు కాదా? వారు మానసికంగా మరింత కుంగిపోకుండా నియోజకవర్గ ప్రతినిధిగా వారిలో ఆత్మస్థైర్యం  నింపేందుకు ఏదైనా చెయ్యాలి.  మంత్రిగా అది నా విధుల్లో ఒకటి. అందుకే ఈ బహిరంగ సత్కారాలు!

ఈ హంతకులు మొత్తం పదిమంది ఉన్నారు. ఇందులో ఎవరి  భవిష్యత్తు మీద మీకు ఎక్కువ గురి ఉంది?

మళ్లీ మీరు మీ మీడియా బుద్ధి చూపిస్తున్నారు. నాకు ఎవరి మీద ప్రత్యేకమైన అభిమానంలేదు. అందరు నేరస్తులూ నాకు కావాల్సినవాళ్ళే! అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. నిజానికి వీరి కార్యకలాపాలు  గొప్ప టీం-వర్కుకి ఉదాహరణగా చెప్పుకోవాలి. సమృధ్ధిగా వనరులు, సరయిన వసతులు, శిక్షణ కల్పిస్తే మరిన్ని అద్భుతాలు సాధిస్తారనడంలో సందేహంలేదు.

భవిష్యత్తులో కూడా వాళ్లకి మీ సహాయ సహకారాలు ఉంటాయా?

సదుద్దేశంతో పోత్సహించాం.  ఆ సంకల్పానికి ముందు ముందూ ఆటంకం రాకూడదని అనుకుంటున్నాను. నా నియోజకవర్గంలోని మిగతా మండలాలు, జిల్లాలలో ఇదే తరహా సన్మానాలు కొనసాగాలి. అధికారులకు ఆ బాధ్యత అప్పగించడం జరిగింది. నిధులకు  కొరత లేకుండా  చూసుకోవడం నా బాధ్యత.అది తప్పక నిర్వహిస్తాను.

ముందు ముందు మరన్ని ఈ తరహా కార్యక్రమాలు మీ నుంచి ఆశించవచ్చా?

మా ప్రోత్సాహకాల కన్నా ముఖ్యమైనది వారు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం. వివిధ మంత్రిత్వ శాఖలు ఆ దిశగా శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేసే పనిలో ఉన్నాయి. ఉదాహరణకు పెట్రోలు పోసే సందర్భంలో తమ వంటి మీద ఆ ఆయిల్ పడకుండా చూసుకోవడం ఎలా? పెట్రోలు పోసే సమయంలో తమ దగ్గరి అగ్గిపెట్టెలు పాలిథీన్ కవర్లలో ఉంచుకోవాలి. లేకపోతే తడిసి సమయానికి అక్కరకు రావు. ఆ జ్ఞానం లేక కొన్ని ప్రాణాలు వృథాగా అగ్నికి ఆహుతయ్యాయి! కొంత మంది కంగారులో వట్టి పెట్రోలు మాత్రమే పోసి అగ్గిపెట్టె కోసం వెదుకులాట మొదలుపెడతారు. సమయానికి ఎవరి దగ్గరా నిప్పు లేకపోతే సీను రివర్సయే ప్రమాదం ఉంది. చిన్న చిన్న పొరపాట్ల వల్ల  భారీ కార్యక్రమాలు భంగం కాకూడదు కదా! ఆ విధమైన శిక్షణ మీద మరింత దృష్టి పెట్టడం అవసరం. 

చివరి ప్రశ్న. న్యాయస్థానాలు తప్పు పట్టిన దోషులను రాజ్యాంగబద్ధ సంస్థల ద్వారా విడిపించడమే కాకుండా సమాజం ఎదుట వారిని ప్రజాప్రతినిధి హోదాలో మీరు  సన్మానించారు.. ఈ ప్రక్రియ మొత్తాన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు?

మంచి ప్రశ్న. మా పార్టీ పాలనలో ఏ వ్యవస్థా అసలు పనే చెయ్యడం లేదని కదా విమర్శలు! నిత్యం కక్ష కొద్దీ విమర్శించేవారికి చెంపపెట్టు లాంటిది ఈ ప్రక్రియ మొత్తం అని నా  అభిప్రాయం. అసాంఘిక కార్యకలాపాలు చురుకుగా సాగుతున్నాయి. వారిని పర్యవేక్షించడంలో శాంతి భద్రతల శాఖలు తమ విధులు దివ్యంగా నిర్వహిస్తున్నాయి. కోర్టుల్లోనూ అంతో ఇంతో విచారణంటూ కొనసాగుతుందన్న  వాస్తవం దోషులకు పడ్డ శిక్షలు రువుజు చేసున్నాయి. చేసిన తప్పులు సరిదిద్దుకొనే  అవసరానికి రాజ్యాంగబద్ధ సంస్థలూ మినహాయింపు కాదన్న వాస్తవం ఆయా శాఖల పని తీరును బట్టి అర్థమవుతుంది. అంతిమంగా.. శిక్షలు పడే నేరస్తుల ఆత్మవిశ్వాసం పునరుద్ధరణ కోసం ప్రజాప్రతినిధులమైన మేమంతా రాజ్యాంగ విధులకు అతీతంగా పునరంకితమవుతున్నట్లు వట్టి మాటల ద్వారా కాకుండా గట్టి చేతల ద్వారా నిరూపించినట్లు కూడా అవుతుంది. సంఘాన్ని ఉద్ధరించే మా కార్యాచరణే మరోసారి మాకు గద్దె ఎక్కే అవకాశం ఇవ్వమని ప్రజల వద్దకు వెళ్లి గర్వంగా అభ్యర్థించే  అవకాశం ఇస్తుంది.  

మరో చివరి సందేహం. ఈ విధమైన కార్యాచరణ అన్ని రాష్ట్రాలలోనూ కొనసాగుతుందా?

కేవలం ఎన్నికలకు గడువు సమీపించిన రాష్ట్రాలకు మాత్రమే మా ప్రస్తుత కార్యాచరణ పరిమితమవుతుంది.

మరో చివరి ప్రశ్న. అన్ని వర్గాల  నేరస్తులూ మీ సన్మానాలను ఆశించవచ్చా?

మీ ప్రశ్న అభ్యంతరకరం. ప్రతిపక్షాల కోసం పనిచేసే నేరస్తుల మీద మా ఉక్కుపాదం మునుపటి కన్నా దృఢంగా మోపడం ఖాయం. మీ ద్వారా ప్రతిపక్షాలకు ఇదే నా హెచ్చరిక కూడా. 



రచన-  కర్లపాలెం హనుమంతరావు 

( సూర్య దినపతిక - 30-09-2018 ప్రచురితం

సరదాకే : ఉల్లికిపాటు - కర్లపాలెం హనుమంతరావు ( సూర్య దినపత్రిక సంపాదకీయ పుట ప్రచురణ )

 


                                                 

కోస్తే కన్నీళ్ళు తెప్పిస్తుంది. సరే కొయ్యక ముందే కన్నీళ్ళు తెప్పించే గడుసుదనం కూడా బహుశా కూటి కూరగాయలన్నింటిలోనో ఒక్క ఉల్లిపాయకే ఉంది. ఏడిపించినా ఇష్టపడే ప్రముఖులు ఎప్పుడూ కొందరు ఉంటారు. హిందీ చిత్రాల మీనాకుమారి, మన తెలుగు సినిమాల  సావిత్రిల తరహాలో! ఈ కన్నీళ్ల కోవలోకి వచ్చిచేరే ఉల్లిపాయే ఎంత కన్నీళ్ళు తెప్పించినా ప్రియమే కదా! ఆ ప్రియమైన ఉల్లి ఇప్పుడు మండీలలో ప్రియమైనందుకే ఇంత లొల్లి. మన ఉప్పు మీద పన్ను వసూలు చేసి సంపన్నులవుతున్నారని కదా స్వాతంత్ర్యం రాక మునుపు తెల్లవారికి ఎదురు తిరిగి స్వదేశీ ఉప్పు ఉద్యమంతో బాపూజీ దండియాత్ర చేసింది! స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటిపోయింది. ఇప్పుడు ఉల్లిగడ్డను విదేశాల నుండి దిగుమతి చేసుకుంటే తప్ప వంటింటి పొయ్యిలో పిల్లి లేవనని మొండికేస్తోంది. ఉల్లికే కన్నీళ్ళు తెప్పించే లొల్లి ఇంకెన్ని నాళ్లీ తల్లీ!

 ఉప్పు లేని కూర చప్పగా ఉన్నా అదో పెట్టు.  బి.పి రోగం దాపురించిందనో.. దాపురించనుందనో సర్దుకుపోడం కద్దు! ఈ ఉల్లి సిగ దరిగిరి, ఒక్కసారి గాని రుచి మరిగితిమా.. ఎన్ని రోగాలు రొప్పులు వచ్చినా రానున్నా .. కోసే వేళ కన్నీళ్లు.. కోసుకొనే అవకాశం లేని వేళా కన్నీళ్లే! ఉల్లి కన్నీళ్ల కహానీ ఉల్లికే కన్నీళ్లు తెప్పించడానికి కారణం  ఏ పాలకుల ఉద్ధరణో?

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదంటారు. ఆ నానుడి మన తెలుగువాడి నాలుక నాలుగు యుగాల బట్టి  వాడేస్తోనే ఉంది. జిహ్వ చేత 'వాహ్వా.. ఎంత రుచి!' అంటూ సన్నాసుల నోట కూడా చాటుగా పాడించేస్తున్నది. అహారానికే కాదు.. అల్పాహారానికీ ఉల్లిని కోరుకోడమే ఎన్ని గోదాములు నిండుగా పండినా  కరువు కోరల పాలిట పడటానికి ప్రధాన కారణంట! ఎన్నుకున్న  పాలకుల ఈ పరిహాసాలకి.. ప్రజల సంగతి  సరే ఉల్లికే కన్నీళ్లు తెప్పించే సరసమయిపోయింది! 

ఉల్లి వల్ల కలిగే ఆరోగ్య లాభాలు  ఎప్పుడూ  ఏకరువు పెట్టే సోది  జాబితాలోవే! మందుకైనా దొరకని ఈ కరువు రోజుల్లో అ ఉల్లి మహాతల్లి మేళ్లను ఎంతని హనుమాన్ చాలీసాల మాదిరి వల్లెవేస్తూ కూర్చోడం? తలుచుకుంటేనే చాలు  కన్నీళ్ళు పెట్టించే ఉల్లి మీద కొత్త కబుర్లేమైనా  చెప్పుకోవచ్చేమో..  చూద్దామా!


క్రీస్తు పుట్టడానికి ఐదు వేల ఏళ్ల  ముందే ఉల్లిపాయ  పుట్టిందని వినికిడి. రాతి యుగం నాటి మనిషికి రోటీలో  ఉల్లిపాయ రోటిపచ్చడి కలిపి తినే యోగం లేకపాయ! రాగియుగం నాటి శాల్తీలకే రోజూ రాగి సంకటిలో ఇంత ఉల్లి తొక్కు చవులారా నంజుకు తినే లక్కు. గుండ్రంగా చెక్కులు తీసి మరీ పింగాణీ పేట్లలో  వడ్డిస్తుంటారు కదా  ఉల్లి ముక్కలు ఇవాళ్టి స్టార్ హోటళ్లలో!   సరదా కోసమైనా సరే సుమా!  ఆ తరహా ముక్కలు  తెల్లారి  రెండు  పంటి కింద వేసుకునే జిహ్వచాపల్యం  మహా ప్రమాదమని  రెడ్ ఇండియన్ల గాఢనమ్మకం.  రాత్రంతా నిలవున్న ఉల్లిపాయ ముక్కలంటే కొన్ని రకాల కొరివి దయ్యాలకు పరమ ప్రీతికరమని ఆ పిచ్చోళ్ల పిచ్చి నమ్మకం!

మధ్య ప్రాచ్యం ఈజిప్షియన్ల మేళం అందుకు పూర్తిగా విరుద్ధం.  ఉల్లిపాయ గుండ్రటి చెక్కులు వాళ్ల సంస్కృతిలో  దేవీ దేవతలతో సమానం.  మనిషి తపించే  చిరంజీవి తత్వానికి గుండ్రంగా కోసివుంచిన ఉల్లిపాయలు గొప్ప సంకేతం! ఈజిప్టు  చక్రవర్తుల సమాధుల గోపురాలు ఉల్లి ఆకారంలో కనువిందు చేస్తుంటాయ్! మరణానంతరం కూడా తమను ఏలిన   పాలకుల జీవితాలు సౌకర్యవంతంగా ఉండాలన్న కాంక్ష ఆ ఉల్లి గోపురాల నిర్మాణాల వెనుకున్నమర్మం. ఎన్నుకున్న సైతాను నేతలు ఎప్పుడు విరగడవుతారా  అంటూ వెయ్యికళ్లతో ఎదురుచూసే మనకు నిజంగానే ఇదో వింత విశేషమే కదూ! 

అంత కన్నా వింత విషయం.. ధార్మిక సాంప్రదాయాలలో ఉల్లికి ఇంతటి ప్రాధాన్యమున్నప్పటికీ ఉల్లి సాగులో మధ్య ఆసియా  చాలా వెనకంజలో ఉండటం! ఈజిప్టు వంటకాలకు శ్రేష్టమైన రుచినిచ్చే నాణ్యమైన ఉల్లి నేటికీ పాకిస్తాన్, ఇరాన్ వంటి  తూర్పు ఆసియా ప్రాంతాలలో సాగు కావడం గమనార్హం.

కరెన్సీ కాగితం రూపంలో ఉంది. కాబట్టి ఏ కలర్ ప్రింటింగ్ బట్టీల్లో అచ్చొత్తించినా అచ్చమైన నోట్ల మాదిరి దర్జాగా చలామణీ చేయించొచ్చు. ఇట్లాంటి పిచ్చి తిప్పలు వస్తాయనే మధ్య యుగాలల్లో మనుషులు ఉల్లిపాయనే నేరుగా కరెన్సీ కింద వాడేసుకొనేవాళ్లు.ఇంటి అద్దె వంటివి అంటే.. ఆఖరికి  ఉల్లిపాయ కొనాలన్నా ఉల్లిపాయ కరెన్సీనే అక్కడి కొన్ని దేశాలల్లో! అప్పటి జనాల తిప్పలు వింటుంటే కన్నీళ్ళే కాదు సుమా.. ఉల్లిపాయ నవ్వులు కూడా పూయిస్తుందని తెలుసుకోవాలి ముందు. హాహాకారాలు మాత్రమే పుట్టించేదీ కుళ్ళు ఉల్లిపాయ అన్న అపోహలు ఇహనైనా చాలిస్తే మేలు.  చాలినంతగా ఉల్లి ఉత్పాదన మీదా, సక్రమ పంపిణీ విధానం మీదా  ఏలినవారు దృష్టి పెడితే చాలు! కన్నీళ్లతో పాటే హా.. హ్హా.. హ్హా అంటూ పాలకులకు హారతులు పడతారు వినియోగదారులు.

ఉల్లిపాయను కోస్తే సల్ఫర్ వస్తుంది. అది గాలిలోని తేమతో కలిసి సల్ఫూరిక్ ఆసిడ్ అవుతుది. కళ్ల మీద  దాని దాడి ముందుగానే గ్రహించేస్తుంది.  మన మొద్దు యంత్రాంగంలా కాదు సుమండీ మెదడు పద్ధతి! ఏ ప్రమాదం పసిగట్టినా తక్షణమే చర్యలు తీసుకునే బాధ్యత ఉంది కాబట్టి వెంటనే  నీళ్లు కార్చి కళ్ళకు ఉల్లి నుంచి రక్షణ కల్పిస్తుంది. ఏ  కోతలు , గీతలు లేకుండానే మరి కోతుల్లాంటి నేతలు తెప్పిస్తున్న కన్నీళ్ల సంగతో? ఉగాండాలో కూడా ఉల్లికి మా గొప్ప  కరువుంగా ఉందనే ఊకదంపుళ్ళు మన నేతలవి. ఉల్లి బెంగ కన్నా ముందు ఈ నేతల వైనాల గురించి కదా జనాలు దిగాలు పడాల్సింది!   నీళ్లలో తడిపినప్పుడో, కోసే కత్తి పీట పీకకు ఇంత  తెలుపు వెనిగర్ బొట్టు రాస్తేనో ఎంత లావు ఉల్లిపాయైనా కన్నీళ్లు తెప్పించే శక్తి కోల్పోతుంది. ఏ ఉపాయాలు వాడి మరి మన కోతి బ్రాండ్ నేతల నుంచి వచ్చి పడే ఉపద్రవాల నుంచి జనం బైటపడేదీ?!


ఇంకా నయం! ఇక్కడ ఇండియాలో పుట్ట బట్టి కరువుకు ఏదో కన్నీళ్లతో సరిపోతోంది. అదే లిబియానాలో పుట్టుంటేనా? ముప్పతిప్పలే! అక్కడివాళ్లకు తిండి తిప్పలంటే  ముందుగా గుర్తుకు వచ్చేది  ఉల్లిపాయలే! లిబియన్ల తలసరి సాలీనా  ఉల్లి   వినియోగం దాదాపు అరవై ఏడు పౌండ్లు!

ఉల్లి తొక్క మందంగా ఉంటే రాబోయే శీతాకాలంలో ఇబ్బందులు పెట్టే మందంలో మంచు కురుస్తుందని ఇంగ్లీషు జానపదులలో ఓ నమ్మకం.  తేలికపాటి ఉల్లిపొర తేలిగ్గా వెళ్లిపోయే చలికాలానికి  సంకేతమని వాళ్ల భావన.

 చూడ్డానికి వచ్చే పోయే వాళ్ల చెవులకు ఇంపుగా ఉండాలని న్యూయార్క్ నగరానికి ఆ 'బిగ్ ఏపిల్' అనే ట్యాగ్ తగిలించారు వందేళ్ల కిందట! అయితే ఆ మహా నగరం అసలు బిరుదు బిగ్ ఆపిల్ కన్నా ముందు బిగ్ ఆనియనే !  'ఆపిల్ చెట్టు కాయలం' అంటూ మహా గొప్పలు పోయే ఇక్కడి మన నేతల మూలాలదీ ఇదే తంతు. తీరిగ్గా తడిమే ఓపికలుండాలే గాని  తల్లివేర్లు  ఏ ఉల్లిజాతికో తగిలిందాకా ఆగేవి కాదు! ఆపిల్ కాయ అప్పికట్లలాంటి బుల్లి ఊళ్లల్లో కూడా దొరుకుతున్నది కానీ.. ఉల్లికే రాజధాని వంటి మహానగరాలల్లో కూడా ఉపద్రవం వచ్చిపడింది! పాలించమని చేతికి అధికార దండం అప్పగించింది మంది. పక్కవాడిని లాలించి లాగేసుకోడమా, చండుకు తిని చంతకు చేర్చేసుకోడమా అన్న మంత్రాంగంలోనే ఎక్కడి సమయమూ చాలడంలేదు ఏలికలకు. ఇహ ఉల్లి  ఆలనా పాలనా పైనా సమయం వృథా చేసుకునే పిచ్చితనమా? 

ఉల్లిసాగులో మన దేశానికన్నా ముందున్నది ఒక్క చైనా (సాలీనా 20,507,759 మెట్రిక్ టన్నులు) నే సుమా! అగ్రరాజ్యం అమెరికాది (13,372,100) కూడా మన (13,372,100) తరువాతి స్థానమే! అంటూ  సర్కార్లు ఏకరువు పెట్టే రెండేళ్ల కిందటి లెక్కలు  బీదా బిక్కీ డొక్కలు నింపుతాయనే! ఎంత ఏడిపించే ఉల్లిగడ్డకైనా కన్నీళ్లాగుతాయనే నేతల గడుగ్గాయి కూతలకు!

అమెరికన్ సివిల్ వార్ వేళలో 'ఉల్లిపాయలు ఇవ్వకుంటే  ఉన్న చోటు నుంచి ఒక్కంగుళమైనా ముందుకు కదిలేదిలేదు' అంటూ జనరల్ గ్రాంట్ బెదిరిస్తూ టెలిగ్రాం కొట్టించాడు ప్రభుత్వానికి. వట్టి తినడానికే అనుకునేరు.. అపచారం చుట్టుకుంటుంది.. యుద్ధంలో అయే కోతిపుండ్లు బ్రహ్మరాక్షసులవకుండా ఉండాలంటే  ఉల్లిపాయే అప్పట్లో చవకలో దొరికే  యాంటీ సెప్టిక్ మందు.  ఉన్నపళంగా వార్ డిపార్ట్ మెంట్ వారు మూడు రైలు బోగీలకు నిండుగా ఉల్లిపాయలు ఊరికే కూరల్లో పప్పుల్లో వాడేసుకోమని  పంపిస్తారా?

  ఉల్లి తడాఖా ముందు ఉగ్రవాదులూ తలొంచుతున్న కాలం ఇది! పాపం ఊళ్లల్లో బీదా బిక్కీకే కనీసం ముక్కులతో వాసన చూసుకునేందుకైనా ముక్క సరుకైనా దొరికడంలేదు!  

నెబ్రస్కా బ్లూ హిల్స్ అనే ఓ బుజ్జి దేశం ఉంది. అక్కడి నేరస్తుల శిక్షా స్మృతిలో  నేటికీ ఉల్లిపాయకు గౌరవప్రదమైన స్థానం ఉంది! పిరికి మగాడిని గేలిచేస్తున్నట్లుగా పెద్ద టోపీ తలకు తగిలించుకునే మహిళకు జీవితాంతం  ఉల్లి పదార్థాలేవీ కంచంలోకనిపించరాదన్నది శిక్ష. ఉన్న నాలుగు రోజులూ ఉల్లి మోజు తీరకుండానే పోయేది మేలా? ఆఖరి కోరికగా అయినా ఆరగా ఆరగా అద్దిన ఉల్లి ఊతప్పం మింగి 'హరీ'మనడం మేలా?

మొదటి శతాబ్దంలో జరిగిన ఒలపింక్స్ ఆటల బట్టి ఉల్లిపాయదే నేటి వరకూ ఎవరూ ప్రశ్నించలేని మొదటి స్థానం!  ఆ ఆటల్లో అఖంద విజేతలుగా నిలిచిన గ్రీకు కిలాడీలు బలవర్థక ఆహారం కింద పుచ్చుకున్న ప్రధాన ఆహారమంతా ఉల్లిపాయలతో తయారయినదేనని  ఈనాటికి జనాలకో నమ్మకం. గ్రీ

సు దేశంలో ఉల్లిపాయ బలవర్థక ఔషధం కింద లెక్క. ఇండియాలో ఇప్పటికీ కంటికి, కీళ్లకు, గుండెకు మేలు చేసే గట్టి మందుగా ఉల్లిపాయకు మంచి పేరు! 


2011 లో  పీటర్ గ్లేజ్ బ్రూక్ అనే బ్రిటిష్ రైతన్న 18 పౌండ్లు బరువున్న ఉల్లిపాయను పెంచి ఏకంగా గిన్నీస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కేసాడు. ఆ మాదిరి రికార్డులు .. అవి బద్దలవడాలు మనకొద్దులే! కానీ ఆర్నెల్లుగా ఆకాశానికలా ఎగబాకి ఎటెటో వెళ్లిపోయిన ఉల్లిపాయ..  ఎంతగా బతిమాలి బామాలినా కిందకు దిగిరాననే నీ మంకు పట్టు  మానేయడం మేలు!   ప్రపంచ మార్కెట్ గణాంకాల రీత్యా  శాఖాహార పంటలలో  ఇప్పటికీ ఉల్లిదే  ఆరో స్థానం! ఆ తల్లి కంటబడటం లేదని ఎంత కాలం ఇట్లా  దిగాలుబడి ఎదురుచూసేది?  దేవుళ్లకు ఎలాగూ ఉల్లి పొడ గిట్టదు.  ఆ మూలవిరాట్టుకు  మన ఉల్లి పాట్లు అర్థమయే అవకాశంలేదు. చంద్రయాన్ - మూడు  వెళ్ళి వెదికే వరకు ఉల్లిపాయ ' మూడ్' ఇట్లాగే ఉందా! సృష్టికి ప్రతిసృష్టి చేసిన విశ్వామిత్రుని వారసులం మనం. టెంకాయకు బదులుగా వంకాయ సృష్టి జరిగినట్లే  ఉల్లికి బదులుగా మరి ఏ వెల్లి సృష్టో జరిగిపోవచ్చు! రచ్చ    రాజకీయాల కోసమైతే ఎట్లాగూ ఏ రాజధాని,  పౌరసత్వం మాదిరి చిచ్చులో బొచ్చెడు కొత్తవి రగిలించుకోవచ్చుగా! పేదోడి కడుపు రగిలి  రవ్వ నిప్పుగా మారక  ముందే ఉల్లిపాయను పాడు చెర నుంచి ముందు బయటకు తెద్దురూ!  కన్నీళ్లు పెట్టించే ఉల్లి తల్లి కంటనే కన్నీళ్లు వరదలై పారుతున్నా నవ్వు తెప్పించే పిచ్చి చేష్టలిట్లా కొనసాగితే  కన్నీళ్లు పెట్టుకునేది ఎవరో తమరికి తెలియదా స్వాములూ?

( సూర్య దినపత్రిక సంపాదకీయ పుట ప్రచురణ ) 


- కర్లపాలెం హనుమంతరావు 

20 - 10-2021 

బోధెల్ ; యూ. ఎస్.ఎ 

Wednesday, December 8, 2021

 




హాస్య కథ: 

కప్పగంతులు


 - కర్లపాలెం హనుమంతరావు 

( కౌముది అంతర్జాల పత్రిక కథల పోటీలో బహుమతి గెల్చకున్న కథ )  


పదవులు చాలామంది పెద్దమనుషులకు  తృణప్రాయం.  కొద్దిమంది బుద్ధిజీవులకు ఆ తృణమే ప్రాణం కన్నా ప్రియం.  


అధికారం మూజూసి  కె.డి.వి. కప్ప(కప్ప దాటు వెంకప్ప)గారికి ఈ దఫా మూణ్ణెల్లు దాటిపాయ! మూడు తరాల కోసరంగా కూడేసిన సంపత్తుకు విపత్తాయ! మనీ పరుసుకేనా? పెద్దమనిషి  పరువుకూ ఆపత్తు! ‘ఇంకా బిడియమా! అయితే ఏ కోర్టు బోనులోనో తలొంచుకు నిలబడ్డం ఖాయం!’అంటూ అంతరాత్మ పోరూ అంతకంతకూ ఎక్కువయిపోయిందీ మధ్యన.     అందుకే పాపం.. వెంకప్పగారు మనసొప్పక పోయినా పనికి మాలిన సిగ్గూశరాలనో చెత్త కుప్పన  పారబోసి సత్ ‘గతి’ ప్రాప్తికై ఆపద్ధర్మంగా సర్కారీ పార్టీలోకి  దూరిపోయే  ప్రయాసలు ముమ్మరం చేసేసారు! 


లోపాయికారీ మంత్రాంగంలో లోపమేం లేదు.  కానీ  పదవీ ప్రాప్తికి  అడ్డొచ్చేది ఒకే ఒక మెలిక.    గెలిపించిన ఓటర్లంతా ఓ.కే చేసిన ఓ తీర్మానం కొత్తపార్టీ అప్లికేషనుకు తప్పనిసరిగా జతచేయాలని షరతు. 


కార్యకర్తల చేతనయితే చేతులెత్తించడమేం ఖర్మ.. ఏకంగా కాళ్లే ఈజీగా మొక్కించేయచ్చు! కానీ  ఆ స్వామిభక్తి పరాయణత్వం చచ్చు నియోజకవర్గం ప్రజానీకానికి ఉండి చావద్దూ! ‘నమ్మి అసెంబ్లీకి పమ్మిస్తే ‘ఇదేం వెన్నుపోట’ని నడిబజార్న పెట్టి  నిలదీస్తేనో! 


వెంకప్పగారీ సంకటంలో ఉండగానే  గది తలుపులు ధడాల్మని ఊడిపడ్డయ్! 

 

ఈ.డీ గాడా? సి.బి.ఐ  వాడా? ఉలిక్కిపడి చూస్తే ఈ రెండూ కాడు. కూతురు మొగుడు! తన  పాలిట యముడు. ఆ యములోడి పక్కనే మెడ లోడ్ గార్లండ్సుతో  మెలికలు తిరుగుతో  అతగాడి డార్లింగు!  


' అరేఁ! అల్లుడుగారూ! ఆ మెడ నిండా పూల దండలెందుకమ్మా బంగారూ! ఆషాఢ పట్టీ  మాసం  వచ్చేసిందనేనా ఈ కంగారూ ?’ వెంకప్పగారి శంక.


' సారీ మాంగారూ! నో.. నో.. మాజీ మాంగారూ! మీ బేటీ కాదీ బంగారు. ఆ కాకి బంగారా న్నెప్పుడో వదిలిబెట్టేసాంగా! కారణం  ఆషాఢం పట్టీ.. ఆకాశం ముసురు పట్టీ  కాదు మాజీ మామాజీ! ఈ పూల దండల  వెనకున్న చంద్రబింబం పైన  పిచ్చగా మనం మోజు పడ్డం! ఈ సింగారి చెయ్యి పట్టుకోవాలంటే  మీ బంగారి మోకాలు అడ్డం!’ 


పిచ్చి కోపంతో  రెచ్చి పోయారు వెంకప్పగారు. 


' నాతి చరామి' అంటూ పెళ్ళినాడు మరి మా పిల్లకు  తమరిచ్చిన మాటో?’ 

 

' ధర్మపన్నాలా! మరి దిబ్బలగూడెం జనాలకు ఎన్నికలప్పుడు తమరిచ్చిన హామీ? పవరున్న పార్టీలోకి తమరిప్పుడు వేసే గంతు .. ఏ ప్రజా సేవకో సెలవిస్తారా  వెం.. కప్ప స్వామీ?’ 


వెంకప్పగారు నోరు కప్పలా తెరుచుకుంది.

***


' కెవ్వు..కెవ్వు!’  కేకలు. ఆ వెనకనే ఏడుపులు.. పెడబొబ్బలు! 


ఏడుపులు కింద పడ్డ బిడ్డవి. పెడబొబ్బలు కంగారు పడ్డ బిడ్డ తల్లివి. అయిదో నిమిషంలో అంబులెన్స్ ప్రత్యక్షం! క్షణాల్లో సీన్ ఛేంజ్. 

***

‘ఒన్ నాట్ యైట్ ‘లో వెంకప్పగారి బంగారి పాప.. యములాడితో మెగా ఫైటు చేసేస్తోంది. 


‘డైవర్!..డ్రైవర్! అర్జెంట్.. అర్జెంట్! అపోలో.. అపోలో!' వెంకప్పగారి అరుపులు. 


ఆ అరుపుల్లో ‘అలోపతి.. అప్పలాచారి..’ అన్న రెండు ముక్కలు తప్పించి డ్రైవర్ గారు స్పష్టంగా ముక్కిందేమీ వినిపించింది కాదు. 

ఐనా వెంకప్పగారు అలా ఇలా తాలాడించేసారు!

 

అరగంట తరువాత .. అంకం.. అప్పలాచారి డిస్పెన్సరీ.


మూలికలు, మండలు, కషాయాలు, నూనెలు,   కల్వాల్లో చూర్ణాలు నూరే చప్పుళ్ళు తప్ప మరేవీ వినిపించడంలేదు ఆపరేషన్ థియేటర్ నుంచి! 


మరో మూడు గంటల నిలువుకాళ్ల జపం తరువాతే.. వైద్యనారాయణుడి  దర్శనభాగ్యం. 


' మనం చేసే మానవ ప్రయత్నాలన్నీ ఫినిషైపోయాయండీ పూర్తిగా! తులసి తీర్థం తెచ్చుకోండి … రోగి గొంతులో పోసుకుందురు  తృప్తిగా!’


' చోద్యం. తులసి తీర్థమా? ఇదేం మాయదారి అలోపతి వైద్యం?’ గంపెడంత దుఃఖంలోనూ గయ్యిమంటం మర్చిపోలే వెంకప్పగారు.


' అలోపతా!? హలో! ఇక్కడ .. అద్భుతాలు సృష్టించే  నెంబర్ వన్ ఆయుర్వేద జాతి!’  డాక్టర్ అప్పలాచారి  సమాధానం.


' మోసం.. దగా! ఏడ్రా ఆ అంబులెన్స్ గాడిద? వాడా కూత  ముందే కూసుండాలి గదా!’ 


' ముందే  కూతలెయ్యడం.. ఆనక అంతా అపోలోలకి  పరుగులెయ్యడం! అబ్బో! ఎన్ని చూసామండీ బాబూ మీ లాంటి తొండి కేసులు! కోట్లు తగలేసామండీ  ఎం.డీ చదువులకీ, ఈ మందుల కొట్టు కట్టడానికి! ఆ లాసులేవీ పూడ్చుకోవద్దని ఏ బైలాసులో    రాసుందో.. ముందు చెప్పండి! అబ్బో! ‘మోసం.. మోసం’ అంటూ అంతలా ఆయాసం వద్దబ్బా! దిబ్బలగూడెం జనాలకంత సునాయాసంగా సున్నం పెడుతుందెవరో చెప్పు ముందు  వెం.. కప్పా! మహా గొప్పగా  పొడిచేస్తారని కదా  ప్రజానీకం తమర్ని ఎన్నుకున్నది! ఆ అమాయకులకి  ఎందుకయ్యా మరి వెన్నుపోటు పొడిచేస్తున్నది? హ్హి..హ్హి..హ్హీ! తమరే స్వామీ స్వచ్చమైన  నమ్మక ద్రోహికి అచ్చమైన హాల్ మార్క్!’

 

కె.డి.వి.కప్పగారు షాక్!


ఒన్స్ మోర్ సన్నివేశం ఛేంజ్!

***


పంజగుట్ట  పోలీస్టేషన్  ఫోన్. 


' సార్! ఈ గాడిద కొడుకు మీ కొడుకేనా? మొక్కట్లు చూస్తే ముమ్మూర్తులా మీవే!  గోడ దూకుతుంటే.. అదే సార్.. పేకాట క్లబ్ గోడ.. దూకుతుంటే పట్టేసుకున్నాం! అహఁ! గోడలు దూకే రకం కదా.. అందుకనే అడుగుతున్నాం’ 


పోలీసు బలగం రాబట్టిన వివరాలను  బట్టి మాజీ వి.ఐ.పి - కె.డి.వి.కప్పగారు  తాజాగా  గజం జాగా అయినా తల దాచుకునేందుకు లేనంతగా దివాలా తీసిన  వి.పి! 


అబ్బ  అడ్డదిడ్డంగా మేసి కూడబెట్టిందంతా  బిడ్డ బెట్టింగుల్లో పెట్టి తగలేసినట్టు రెండు తగలంగానే బైటపడ్డది గుట్టు.   నెత్తి మీద సత్తు కాణీ పెట్టినా అర్థ కాణీ చెయ్యని అర్భక సన్నాసి..  సన్ ఆఫ్ కె.డి.వి.కప్ప హోదాలో  అదనంగా కొన్ని లక్షలు చేసే అప్పుపత్రాల పైన అప్పనంగా సంతకాలు కూడా దర్జాగా గిలికేసాడు! 



' అంత లేసి హక్కులు నీ కెక్కడివిరా అబ్బీ?’ అని దబాయిస్తే ‘దాన వినిమయ విక్రయాదులతో సహా  సంపూర్ణ హక్కు భుక్తాలన్నీ నీ యావదాస్తుల పైన  నువ్వే  నాకు ఇచ్ఛాపూర్వకంగా పూర్తి స్పృహలో ఉండి మరీ ధారాదత్తం చేస్తివిగా తండ్రీ!  నా కాలేజీ దరఖాస్తులని సంబరాలు పడుతూ  తమరు బరబరా గిలికేసిన సంతకాలన్నీ లాయర్లు పక్కాగా తయారు చేసిన అస్తిపాస్తుల  దస్తావేజులే పిచ్చి డాడీ!’ అంటూ కూసాడా ‘గాడిద’ కొడుకు. 


' కన్న తండ్రిని! నా మీదట్రా.. నమ్మించి ఇంత  కుట్ర! ఛీఁ.. ఛీఁ! సిగ్గనిపించలేదుట్రా.. త్రాష్టా!’


' దిబ్బలగూడెం జనాలూ   నిన్నిప్పుడిట్లాగే తిట్టుకుంటున్నారు  అబ్బా! నిజం చెప్పనా!  నీ బిడ్డగా పుట్టినందుకే నాకిప్పుడు ఎక్కువ సిగ్గేస్తోంది నాయనా!" 


' నిజంగా వీడు నా కడుపున పుట్టిన బిడ్డేనా.. సతీ సావిత్రీ?


కుప్పకూలిపోయారు శ్రీమాన్ కె.డి.వి. కప్పగారీ సారి. సీను మారిందింకో సారి.

***


' సారీ స్వామీ! ఇప్పటికైనా నిజం కక్కకపోతే నా బతుక్కిక నిష్కృతి లేదు నాథా!’ 


వెక్కి వెక్కి ఏడుస్తోంది పక్కనే పక్కలో పడుకునున్న సతీ సావిత్రీదేవి.


' ఏవిటే సావిత్రీ..  నీ బతుక్కంత నిష్కృతి లేని ఆ నిజం?' బితుకు బితుకు మంటూ చూసారు వెంకప్పగారు వైఫు వైపు!  


' నా కడుపున కాసిన కాయల్లో  ఒకటి.. ఒకే ఒకటి.. మీ రక్తం పంచుకు పుట్టలేదేమోనని..  అనుమానంగా ఉందండీ!’  


' ఒకరు నా రక్తం పంచుకుని పుట్టలేదా?!   ఈ దౌర్భాగ్యంలో కూడా  మళ్లీ సస్పెన్సా? ఎవరే సావిత్రీదేవీ ఆ ఒహ్.. ఖరూ?’ విలవిలలాడిపోతున్నారు వెంకప్పగారు.


' ఏమోనండీ.. ఎంత గింజుకున్నా సమయానికి  గుర్తుకొచ్చి చావడం లా! రెండు పుష్కారాల కిందటి మూడ్సూ.. ముచ్చట్లాయ! ఏ పుణ్య పురుషోత్తముడి ప్రేమ ఫలమో! గుర్తొస్తే కనీసం పేరైనా చెప్పిచావనా! నన్ను నమ్మండీ!’


' నిన్నా? నమ్మటమా?’ 


' భగవంతుడా! ఏ ఆడదానికీ రాకూడదయ్యా ఇంతటి కష్టం’ 

కుళ్లి కుళ్లి ఏడిచే అర్థాంగిని చూసి నవ్వాలో.. ఏడ్వాలో.. అర్థం కాని పరిస్థితి గౌరవనీయులు వెంకప్పగారిది. 


' ఇప్పటి దాకా దాపెట్టిన ఆ గుట్టు  ఈ వయసులోనుటే నా గుప్పెట్లో పెట్టేదీ.. తప్పుడుదానా!’  


అగ్గి బరాటా అయిపోయింది  సతీ సావిత్రి ‘ఐనా తప్పంతా నా ఒక్క దానిదేనా హనీ!  పెళ్లిచూప్పులకని వచ్చి మిర్చి బజ్జి నచ్చిందని కదా నన్ను చేసుకుంటిరి తమరు? ఛీ! ఎంత సేపూ సొంత కడుపు కక్కుర్తే! ఎత్తు కడుపు వైఫు ఎంత సేఫో ఆలోచించంది ఎవరూ?’ 


'తాళి కట్టిన వాడికి ఇలా ద్రోహం చేసింది చాలక..' 


' ఆగండక్కడ! తమరు చేసే ద్రోహాల ముందు నా దోషం చీమ తలంత. ‘నరకాలు నాశనం చేస్తా.. స్వర్గాలు సృష్టించిపారేస్తా!’ అంటూ తుపాకీ రాముళ్లా మాటలు  గుప్పిస్తేనే గదా  దిబ్బలగూడెం నియోజకవర్గమంతా మిమ్మల్నంతలా ఆదరించింది! తమ పక్షమే అని జనం నమ్మబట్టే తమరు గెలిచి ఎమ్మెల్యే అయింది . జనం ప్రయోజనాలు తమరన్నీ  పూర్తిగా మరచిపోయారు. సొంత లాభాల కోసం ఇప్పుడు  కప్పల్లా సర్కారు తక్కెట్లో తూగేందుకు తయారయ్యారు !  తమరు మాట జారడమేమో    మహా పుణ్య కార్యం! నేను  కాలు కొద్దిగా జారడం మాత్రం  కిరాతకమూనా!’ అమ్మోరిలా విరుచుకుపడింది సతీ సావిత్రి.   


ఉలిక్కిపడి గభిక్కున లేచి కూర్చున్నారు వెంకప్పగారు. నిద్ర మొత్తం తేలిపోయింది.  ఇప్పటి దాకా తాను కన్నవన్నీ వట్టి పీడకలలేనని తేలిపోయింది.  వెంకప్పగారి మనసు తేలికయింది.

***


' తేలికవడానికి కారణం పీడకలల నుంచి బైటపడ్డం కాదప్పా!  పీడాకారపు  శరీరాన్నుంచి  బైట పడ్డం! చచ్చినా భలే  గుర్రు కొడ్తున్నావే! ఇదేవఁన్నా తమరి అసెంబ్లీనా సామీ! లే! నరకం కావాలా? స్వర్గం కావాల్నా? తొందరగా తెముల్చు’ గంభీరమైన ఆ గొంతు   విని తానిప్పుడున్నది వేరే లోకాల కెళ్లే దారులు చీలిక  దగ్గరని బుర్రకెక్కింది వెంకప్పగారికి. 

 

ఎదురుగా యమ భటులు.. దేవ దూతలు!


' ఎవడ్రా నన్నిట్లా చంపుకొచ్చింది అన్యాయగా! చంపవతల పారేస్తా! కంటి ముందుకు రండొరే ముందు.. గుండెల్లో దమ్ముంటే!’ వెంకప్పగారి వీరావేశం.


' ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టిన మొదట్రోజునే  తప్పు చేసావు వెంకప్పా!  అందుకే నీకీ దిక్కుమాలిన చావు. సభాపతి సమక్షంలో చేసిన   ప్రమాణ  ప్రమాణ స్వీకార పాఠం గుర్తుంటే చెప్పు?’  


' కప్పదాటు  వెంకప్ప అను నేను దిబ్బలగూడెం నియోజక వర్గ ప్రజల ఆంకాక్షల మేరకు నిస్వార్థంగా కర్తవ్యం  నిర్వహిస్తానని, నా ప్రజల యొక్క  హక్కులకు భంగం కలగనీయనని,  భయ రాగ ద్వేషాలకు అతీతంగా భారత రాజ్యాంగానికి లోబడి   పని చేస్తానని దైవం సాక్షిగా  ప్రమాణం చేస్తున్నాను'


' దేవుడి సాక్షిగా చేసిన ప్రమాణం. ఆ బెదురైనా లేదేమప్పా మీ ప్రజాప్రతినిధులకు.. విడ్డూరం ! నిధులు, నీళ్లు, నియామకాలనేవి ప్రజాస్వామ్యంలో నిజానికి  జనాలకు మాత్రమే చెందిన వనరులు. అధికారం దక్కితే వాటాలప్పుడు తమకన్యాయం జరగకుండా కాపాడతారని, ప్రతిపక్షంలో కూర్చున్నా తమ పక్షానే పోరాడతారని పౌరుల  ఆరాటం. ఆ ఆశతోనే కదా ఓటర్లంతా పొలోమని పోలింగ్ బూతులకట్లా పరుగెత్తేది!  అర్థరాత్రి, అపరాత్రన కూడా సరకు చేయరే ముసలీ ముతకా ఓటేసే వరకు! ఇంత నమ్మి మిమ్ముల్ని చట్టసభలకు పమ్మిస్తే.. సొంత లాభం తప్ప మరేమీ పట్టదా వెంకప్పా మీ కప్పగంతుల నేతలకు? గోడ దూకుడు మీదనేనా ఎప్పుడూ  ధ్యాసంతా? జనం గోడు పట్టని పాడు పాలిటిక్సులోకి పనిమాలా దేవుణ్ని కూడా ఈడ్చుకొస్తున్నారు చూడు.. ఇట్లా ప్రమాణ స్వీకారాల వంకతో! ఆ దైవ ద్రోహానికే నీకీ అర్థాంతరం చావు. అర్థమయిందా?  మళ్లా ఎన్నికల దాకా ఓడ మల్లయ్యల్ని నువ్వు  బోడి మల్లయ్యలను చేయచ్చేమో కానీ.. తన పేరు  మీద నమ్మక ద్రోహం చేసిన నేరానికి  దేవుడైతే  అస్సలూరుకోడు! ఏ ఎన్నికల కోడుతో శిక్షలు తప్పించుకొనే వెసులుబాటు ఈ పైన బొత్తిగా లేదు.. 


తలొంచుకున్నారు కప్పదాటు వెంకప్పగారు.


' ప్రాయశ్చిత్తం చేసుకునే ఉద్దేశముంటే చెప్పు. మరో ఛాన్స్ ఇచ్చేందుకు  నేను సిద్ద్జం. మీ లోకానికి తిరిగి పో! గెలిపించిన పార్టీకే తిరిగి మళ్లిపో! సొంత లాభం కోసం కాదు ప్రజాప్రాతినిధ్యం.  అధికారంలో ఉన్నా ప్రజలందరి సంక్షేమం నీకు సమానంగా ప్రధానం . అధికారం లేకున్నా   ఆ సమసంక్షేమం కోసం పోరాడడం ప్రతిపక్షంగా నీ ధర్మం. ప్రజాస్వామ్యం అంటే కప్పల తక్కెడ కాదు. ముందది మనసుకు ఎక్కించుకోడం ముఖ్యం!’    


రెండు చేతులు జోడించి తలాడించేసారు కప్పదాట్ల వెంకప్పగారు.


గభాలున మెలుకవ వచ్చింది వెంకప్పగారికి. సీను మారింది మళ్లీ! 


గిచ్చుకుని చూసుకుంటే తెలిసొచ్చింది ఇదే అసలైన వాస్తవ జీవితమని. 


పక్కనున్న సెల్ ఫోన్ పదే పదే  మోగుతున్నది. నెంబరు చూస్తే అధికార పార్టీ మధ్యవర్తిది. అప్పటి దాకా తను తహ తహ పడ్డది. 


క్లైమాక్సు సీనులో భగవంతుడొచ్చి చేసిన బోధనంతా మళ్లీ గుర్తుకొచ్చింది! 


సెల్ ఫోన్ అందుకున్నారు కె.డి.వి.కప్పగారు. 'గోవిందా.. గోవిందా అందామయా.. రావయ్యా.. రావయ్యా.. రావయ్యా.. రావయ్యా !' అంటూ అదే పనిగా గీ పెట్టే సెల్ ఫోన్ పీక నొక్కి ఓ పక్కకు  గిరాటేశారు  కప్పదాటు  వెంకప్ప గారు!


ఆయన మనసంతా  ప్రశాంతంగా ఉందిప్పుడు*

 

- కర్లపాలెం హనుమంతరావు 

( కౌముది అంతర్జాల పత్రిక కథల పోటీలో బహుమతి గెల్చకున్న కథ )  

అజ్ఞాన ' సమ్ ' ఉపార్జనం ! - కర్లపాలెం హనుమంతరావు ( సూర్య దినపత్రిక - సుత్తి మొత్తగా - కాలమ్ - ప్రచురితం)

 

u

అజ్ఞాన ' సమ్ ' ఉపార్జనం ! 

- కర్లపాలెం హనుమంతరావు 

( సూర్య దినపత్రిక - సుత్తి మొత్తగా - కాలమ్ - ప్రచురితం) 


'జ్ఞానం' అంటే గురువా?

'జ్ఞానం' అంటే ఏంటో తెలుసునా శిష్యా?

తెలియదు కనకనే కదా స్వామీ.. తమరి దగ్గరికీ రాక!

ఆ తెలియక పోవడమే 'అజ్ఞానం' అని తెలుసుకో నాయనా

ధన్యుణ్ని. ఆ అజ్ఞానం స్వరూపం ఎలా ఉంటుందో కూడా కాస్త 

సెలవివ్వండి స్వామీ! 

'స్వ' అనవద్దు బాలకా! అజ్ఞానం అవుతుంది. ఆ విశేషణం నీ సొంతానికివర్తించేది. రాజకీయాలల్లో ఉంటే మినహా డాంబిక పదప్రయోగాలు హాని చేస్తాయ్. ఆ తెలివిడి లేకపోవడం కూడా 'అజ్ఞానమే'

చిత్తం స్వామీ! ఆ 'అజ్ఞానం' ఎక్కడ ఉంటుందో కూడా తమరే వివరించిపుణ్యం కట్టుకోండి స్వామీ! 


గురువుగారు గడ్డం నీవురుకున్నారు. 

గురువుగారి గుబురు గడ్డంలో అజ్ఞానం దాగుందని శిష్యుడికి అర్థమైపోయింది. అందుకే కాబోలు.. అంతుబట్టని ప్రశ్న ఎదురు పడ్డప్పుడల్లా గురువుగారిలాంటి బుద్ధిజీవులు గడ్డాలు గోక్కుంటుంటారు! సీదా సాదా జీవులకు మల్లే బుర్రలుగోక్కోరు. 


' గురూజీ! 'అజ్ఞానం' అంటే గాడిద గుడ్డు వంటిదని ఎవరో స్వాములవారు ఆ  మధ్య ఓ  టీ. వీలో ప్రవచిస్తుండంగా విన్నాను. అదెంత వరకు నిజం? 


'గాడిద' నిజం. 'గాడిద గుడ్డు' అబద్ధం. నిజం నుంచి పుట్టిన  అబద్ధానికి 'గాడిద

గుడ్డు' ఒక సంకేతంరా శుంఠా! 


ఆ స్వామి వారన్న మాట నూటికి నూటొక్కపాళ్లు నిజమే! 


' మరి ఆ 'అజ్ఞానం' రుచికూడా ఎలా ఉంటుందో విశదపర్చండి గురూజీ?' 


చిటికెడు పంచదార అప్పటికప్పుడు గాలిలోనుంచి సృష్టించి శిష్యుడి నాలిక మీద

వేసి 'రుచి చెప్పు!' అన్నారు స్వామీజీ.

తియ్యగా ఉంది స్వామీ! ఇప్పుడు ఈ లోటాలోని కాఫీ ఓ గుక్కెడు తాగి దాని రుచీ ఎలాగుందో చెప్పు! అన్నారు. ఎప్పుడు ఎలా వచ్చాయో కాఫీ..! 

కప్పు పెదాలకందించుకుని కషాయంలాగా ఉంది స్వామీ! అని ముఖం చిట్లించాడు శిష్యుడు. 

' ఇంద' ఈ సారి ఇంకో చిటికెడు ఉప్పు సృష్టించి శిష్యుడి నాలిక మీద వేసిఈ సారి కాఫీ రుచి చూడమని  ఆదేశించారు గురువుగారు.

' భలే ఉంది స్వామీ! కానీ ఏ రుచో చెప్పలేను' 

' ఆ చెప్పలేక పోవడాన్నే అజ్ఞానంగా తెలుసుకోరా సన్నాసీ! '  


ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టడం శిష్యుడి వంతయింది. 

'అయితే స్వామీ . ' 

' .. అర్థమయింది. వాసన గురించే కదా నీ నెక్స్ట్ క్వశ్చన్? ఉనికిలో ఉన్నదానికైతే వాసనంటూ ఏదైనా ఉంటుంది కానీ.. అసలు ఉనికేలేని అజ్ఞానానికి వాసనేముంటుంది రా అజ్ఞానీ! ' అన్నారు గురూజీ! 


శిష్యుడికి మెల్ల మెల్లగా బోధపడుతోంది అజ్ఞానసారం. అయినా ఇంకా ఏదో

ఇతమిత్థంగా తేలని సందేహం.


' స్వామీ! ఆఖరి ప్రశ్న. జ్ఞానం సంపాదించేందుకు ఎంతో మంది ఎన్నో విధాలుగా తంటాలు పడుతుంటారు. కొందరు ఒంటికాలు మీద జపం చేస్తుంటారు. నా వంటివాళ్ళు మీ బోటి జ్ఞానుల పాదాల చెంత చేరి తత్త్వబోధనలు వింటుంటారు. జ్ఞానం వల్ల ఏదో మేలు లేకపోతే అన్నేసి తంటాలు  అవసరమా స్వామీ? 

' మంచి చెడ్డా.. లాభం నష్టం.. ఉచితం అనుచితం తెలుస్తాయి కాబట్టి ఆ యాతన లేవో వాళ్లు అలా నిత్యం తలో రూపంలో పడుతుంటారురా బాలకా!

' మరి అజ్ఞానం వల్ల ఏం ప్రయోజనం ఉందని స్వామీ.. ఇంతమంది ఈ

లోకంలో జ్ఞాన సముపార్జనకు ఏ ప్రయత్నమూ చేయకుండా మూర్ఖవర్గంలోనే ఉండిపోడానికి కొట్టు కు ఛస్తున్నారూ? ముఖ్యంగా మన రాజకీయ నాయకులు?' 

' ఇదేరా భడవా .. అసలు సిసలు అజ్ఞాన భాండారమంటే ! పొరుగువారిని ప్రేమించుము. నిత్యము సత్యమును మాత్రమే వచించుము! ఆడవారిని తోబుట్టువులవలె గౌరవించుము ! పెద్దలమాట చద్దిమూటగా మన్నించుము . ఆడి తప్పకుము. దొంగతనము చేయకుము. అహింస పరమ ధర్మము. జంతుహింస అమానవీయము. దుర్భాషలాడబోకుము! నీతి మార్గం వదలబోకుము!' ఇత్యాది మంచి సూక్తులన్నీ వింటూ కూర్చుంటే లోకంలో మనం ఎవరికీ ఏమంచీ చేయలేం. మనక్కూడా మనం ఏ మేలూ చేసుకోలేం. అడ్డదారిలో గడ్డికరిస్తేనే కదరా బిడ్డా.. ఆదాయానికి మించిన ఆస్తులేవైనా కూడబెట్టే పట్టు దొరికేది! కొడుకులను.. కూతుళ్లను.. అల్లుళ్ళను.. కోడళ్ళను అందలమెక్కించకుం డా అలా గాలికి వదిలేస్తే వాళ్లు అజ్ఞానం వల్ల చేసే అల్లరిచిల్లర్లతో సొంత ఇమేజి డేమేజవుతుంది కదా శిశువా? పెద్దతనంలో ఏ రోగమోరొప్పో వచ్చి

మంచాన పడ్డాక నీ ఏ మంచీ.. మన్నుగడ్డా పక్కగుడ్డలు మార్పించే నాధుణ్ని రాబట్టలేదు. ఎక్కడెక్కడి రాబందులో సహేలీలు..

స్నేహితులంటూ సంబంధాలు కలుపుకొని పొయస్ గార్డెన్లలోక్కూడా వచ్చి పాగావేస్తారు. సంపాదించుకున్న మంచి పేరుకు తూట్లు పడతాయ్! సొంతానికంటూ ఆస్తులేవో పది రకాలుగా కూడబెట్టుకుంటేనే కదరా అమాయకుడా.. కోట్లులక్షలు ఖర్చయ్యే ఎన్నికల గోదాట్లోకి దూకినప్పుడు గట్టెక్కగలిగేది! అది ఈదే పాదసేవకులకు సాయపడేదీ? అక్రమార్కుడి మార్కు ప్రత్యర్థి అజ్ఞానుల్ని పడగొట్టాలన్నా చెడ్డదారి తొక్కడం మినహా మరోటేమన్నా ఉందామూర్ఖ మంచి మార్గం? ఇందాక నువ్వన్నావే.. ఆ జ్ఞానం గన్నీ బ్యాగులు ఎన్ని గుట్టలుగడించినా జీవితంలో సాధించింది సున్నా.  ఇలా వివిధ మంచి చెడ్డలనుతర్కిస్తూ భావి చరిత్రకారుల దయాదాక్షిణ్యాల కోసం దేబిరించటం కన్నా.. పదవుల్లో పచ్చగా ఉన్నప్పుడే చరిత్ర పుటల్లో పేర్రాయించుకునే దారులు వెదుక్కోవడం మేలు. దనమూలం ఇదం జగత్! డబ్బుతో దెబ్బేయలేనిదేదీ తేదీలోకంలో! జ్ఞానసముపార్జన ధనసంపాదన కాళ్లకడంరా శుంఠా! ఏ ఎన్నికల కోడిఎప్పుడు

కూస్తుందో ఎవడికీ తెలియని రోజుల్లో ఎన్నికల సంఘం కోడులకుజడుస్తూ కూర్చుంటే చివరికి మిగిలేది గోడుగోడుమనే ఏడపులూ.. మొత్తుకో!

అజ్ఞానమే ఓటర్ల తత్త్వంగా తయారైనప్పుడు వాళ్ళు బుట్టలో పడటానికితొక్కలోని జ్ఞానమార్గం నమ్ముకుంటే అంతకు మించిన అజ్ఞానం మరోటి ఉండదు.

ఇప్పుడు చెప్పు! జ్ఞానానికా? అజ్ఞానానికా నీ ఓటు?' 


ఆ శిష్యుడు అప్పుడే మొలుస్తున్న గడ్డం నిమురుకోవడం మొదలు పెట్టాడు. 


' కళ్లుతెరిపించారు గురూజీ! ధనమూలం ఇదం జగత్. సందేహం లేదు. కాబట్టే సర్వ సంగ పరిత్యాగులై ఉండీ తమబోంట్లు ఒక్కొక్క ప్రశ్నకే లక్ష చొప్పునభక్తుల నుంచి నిర్మొహమాటంగా గుంజుతున్నారు! తమరి సంపాదనకు దొంగలెక్కలు రాయలేక నా రెక్కలు గుంజుతున్నాయి . .

ఏ శిష్యుడికైనా గురువు దారే అనుసరణీయం.  అజ్ఞానుల వర్గంలో పోటీ తాకిడి మరీ ఎక్కువగా ఉంది స్వామీ! మరీ ముఖ్యంగా పొలి టికిల్ సర్కిల్లో. నా బిడ్డలకు బారెడు గడ్డాలు మీసాలు పెరిగి నాలుగైదు ఆశ్రమాలు.. టీ వీ ఛానెళ్లు దొరికిందాకా.. చారెడు రూకలు సంపాదించుకోవాలి. తమరిలాగా అజ్ఞాన సమ్ 'ఉపార్జన'కే నా ఓటు కూడానూ! ' 

సభక్తిపూర్వకంగా చేతులు జోడించి లేచి నిలబడ్డాడు శిష్యపరమాణువు.

***

( సూర్య దినపత్రిక - సుత్తి మొత్తగా - కాలమ్ - ప్రచురితం) 

- కర్లపాలెం హనుమంతరావు 

05 - 11-2021 


మగువంటే మగవాడి మర-యంత్రమా? - కర్లపాలెం హనుమంతరావు ( సూర్య దిన పత్రిక సంపాదకీయ పుట వ్యాసం)




మగువంటే మగవాడి మర-యంత్రమా?

- కర్లపాలెం హనుమంతరావు 

( సూర్య దిన పత్రిక సంపాదకీయ పుట వ్యాసం) 

 


చెయ్యగా చెయ్యగా పనుల్లో సులువు తెలుస్తుందన్నది  లోక నుడి. మనుషులకే కాదు.. దేవుళ్లకూ ఈ సూత్రం వర్తిస్తుంది. 'విధినా తావభ్యస్తం యావద్స్పుష్టా మృగేక్షణా' అని  ‘సుభాషిత రత్నమాల’ ముక్తాయించడానికి అదే కారణం. లావణ్యంతో ఓలలాడే లలనామణి సృష్టి కోసం లీలామానుషుడు ఎన్నో మగబొమ్మలను తయారుచేసాడన్నది  ఈ శ్లోకం తాత్పర్యం. ఆడవాళ్లను అందుకే ఫెయిర్ సెక్స్ అనడం! 


ఫెయిర్ నెస్ ఎతుంటే ఏం లాభం? చపల చిత్తం మగవాడి బుద్ధి ముందు స్థిత ప్రజ్ఞత పుష్కలంగా ఉన్నా స్త్రీ సునిశిత గ్రహణ శక్తి మొక్కవోతూనే ఉంది. సృష్టి ఆది నుంచి ఇదే బాధ. మగవాడు ఆవులించక ముందే మగువలు వాడి పేగులు లెక్కెట్టేస్తారు!  ‘అందుకే ఆడదంటే మగవాడికంత బెదురు’ అన్నారు హిల్లరీ క్లింటన్ ఓ  సందర్భంలో! అబలగా అన్నింటా మగవాడు చిన్నబుచ్చే  ఆడది నిజానికి జగద్గురు శ్రీ శంకరాచార్యుని భాష్యం ప్రకారం అపర పరాశక్తి.. అతిలోక సుందరి శ్రీ లలితాదేవి.. కూడా! 

పరమేశ్వరి అనే పదానికి పరమార్థమేదో బుర్రకు  తట్టక ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ అంటూ తనకు తానే సర్దిచెప్పుకునే ‘బుద్ధి’తక్కువ శాల్తీ మగవాడు.  అయ్యగారి దృష్టిలో ముద్దరాలు అంటే ముద్దుపళని రాధికాసాంత్వనం మార్కు రాధాదేవి. ‘కంటికి నిద్ర రాదు, విను, కాంతుని బాసిన నాటినుండియున్/వంటక మింపు గాదు..’ టైపు విరహబాధలు తెగ పడిపోయే అష్ట శృంగార నాయికల్లో సందర్భాన్ని బట్టి ఎవరో ఒకర్తె. అందుకే  ఆమెను అందాల భరిణ అంటూ ఉన్నవీ లేనివీ ఊరికే ఊహించుకుని మరీ ‘కురులకు వందనములు తెలి గోము మొగంబునకున్ జోహారు, నీ/ యరుదగు కంబు గంఠమున కంజలి, నీ కుచ కుంభాళికిన్/ కరముల్ మోడ్చెదన్, బెళుకు క్రౌనుకు మ్రొక్కెద, బంచబాణ మం/దిరములకున్ సతీమణి! పదింబదిగా పదివేల దండముల్' అంటూ  దండకాలు రాసుకునేది. నడివయసు దాటినా మిడిమేళపు కవిత్వంతో సడీ సప్పుడు లేకుండా తన మానాన తాను తన పని తాను చూసుకునిపోయే చానను కూడా సామాజిక మాధ్యమ వేదికల మీద కీడ్చి కీచకుడికి మించి రచ్చ చేసేది మగవాడే.  కేస్టింగ్ కౌచ్ లు ఉన్నంత వరకు విరుగుడు తంత్రంగా  ‘మీ.. టూ’ లు పుట్టుకురాక తప్పదు. 

నిజానికి మహిళ ఏనాడూ ‘వాల్మీకి రామాయణం’ పట్టించుకోకుండా వదిలెట్టేసిన ఊర్మిళమ్మలా ఊరికే పడి నిద్రపోయిందిలేదు. అర్జనుడి రాక ముందు నుంచే రాజ్యం దర్జాగా నడిపించిన   ప్రమీల  ప్రజ్ఞే  ప్రమదలది ఎప్పుడూ. నేటి లోకవ్యవహారం కూడా ఆ తీరులోనే  తరుణుల ఆధ్వర్యంలో సాగుతుంటే ఇప్పుడీ మహిళా దినోత్సవాలు గట్రా అంటూ ఆర్భాటాల అక్కరే ఉండేది కాదు.  


15వ శతాబ్దంలో ఇండియా  పర్యటనకని వచ్చిన నికోలో కోంటీ అప్పటి హిందూ రాజ్యాలలో భర్త చనిపోయిన భర్తతో బతికున్న భార్యనూ చితి పైకి ఎక్కించడం చూసి విస్తుపోయాడు.  ఆ కాల్చడాలు అవీ ప్రత్యక్షంగా ఇప్పుడు కనిపించవు. కానీ.. కడుపులో పడ్డ మరుక్షణం నుంచి కాటిచితిలో పడే ఘడియ వరకు ఏదో ఓ దుర్మార్గపు రూపంలో ఆడాళ్లను కాల్చుకు తినడాలు మాత్రం తప్పడంలేదు ఇప్పుడు కూడానూ! 

వేదాల కాలంలో  స్త్రీ పురుషులిద్దరిలో గొప్ప ఎవరన్న  వాదమే వినిపించింది కాదు. జనకుడి  విద్వత్మహాసభలో గొప్ప తర్కతో తనను తలకిందులు చేసినప్పుడు మహాజ్ఞాని యాజ్ఞవల్క్య మహర్షి  మొహమాటం లేకుండా  మైత్రేయి ముందు మోకరిల్లినట్లు  మనకు కథలున్నాయి.  ఎప్పుడు రాజుకుందో గాని ‘అహం’ అనే ఈ నిప్పు రవ్వ.. ఇప్పటి  మగవాడి మనస్సులో  ‘అహం బ్రహ్మోస్మి’ అన్న అగ్నిని తెగ ఎగదోసేస్తోంది. మగవాడి ఆధిపత్య జ్వాలలకు సుకుమారమైన బతుకులు ఎన్నెన్ని  కాలి బూడిదయిపోతున్నాయో ప్రతీ రోజూ! మరి ఉద్యమం వద్దంటే ముద్దరాలు మొద్దులా ఓ మూల పడివుంటుందా?    


సృష్టిధర్మ రీత్యా పురుషుడి దేహం స్త్రీ శరీరం కన్న దృఢం అయితే కావచ్చును. అంత మాత్రం చేతనే అన్నింటా అతగాడు అధికుడు ఐపోతాడా? నాగరికత ఆరంభ యుగాలలో ఆడదే కుటుంబానికంతటికీ తిరుగులేని పెద్ద. పితృస్వామ్యవాదం బలిసి పెత్తనం రుచి మరిగిన తరువాత మగవాడో మహారాజు.. ఆడది అతగాడి ఇష్టారాజ్యానికి ఆడి పాడే మరబొమ్మగా మారిపోవడం. 


బాల్యం నుంచే బాలికల ఊహలు మహా సునిశితంగా సాగుతుంటాయంటారు.  తన మొద్దు బుర్రకు అందని ఊహల  ఆడదాని చేతిలో ఓటమి  అంటే ఊహూఁ మగవాడికి మరి మండదా! సాటి మగవాళ్లల్లోఎంత నామర్దా!  అందుకే అడ్డదారుల్లో అయినా ఆడదానిని మగవాడు  లొంగదీసుకునేది. కానీ ఆడదాని మనసు ఊరుకుంటుందా? ‘జీవితమనే మాయాజూదంలో మగవాడిదేనా ఎప్పుడూ గెలుపు?/ అంటే ఖాయంగా అది కనిపించని శకుని విసిరే పాచికల ఆటే’ అనుకుంటుంది ప్రముఖ  తమిళ స్త్రీవాద రచయిత్రి ఉమా నారాయణ్ ‘కల్చరల్ డిస్లొకేషన్స్: ఐడెంటిటీసి, ట్రెడిషన్స్ అండ్ థర్డ్ వరల్డ్ ఫెమినిజమ్ ‘ చదివిన తరువాత.


వాస్తవానికి మానవ జీవనకావ్యంలో స్త్రీ పురుషులిద్దరూ  రఘువంశ కర్త కాళిదాసు బాషలో చెప్పాలంటే వాగర్థాలు! ఆదిదంపతులకు మల్లే వాళ్లిద్దరూ చెరో సగంగా సమన్వయంతో నిభాయిస్తే తప్ప జగత్ అనే ఈ మహారథం సక్రమంగా ముందుకు సాగదు!  'న శివేన వినా దేవీ, న దేవ్యాచ వినా శివః' ! అమ్మ లేకపోతే అయ్య లేడు. అయ్య లేని పక్షంలో ‘అమ్మ’ ఉండదు. వేటూరివారి పాటలో ఇంకా వివరంగా చెప్పాలంటే మానవ జీవితం ‘నర నారీ సంగమ మృదంగం/ గంగమ జంగమ సంగీతం’.  ‘ఆమె’ ధరకు జారిన శివగంగ తరంగం.  ఆడది అంటే ఇహ చిన్నచూపు ఎందుకో మగవాడికి?


తరతరాల వెలుగు తాలుపులైనా, తరుగెరుగని ఇలవేలుపులైనా నేల మీదకు కాలు మోపే ముందు ఓ అమ్మ కడుపులోనే  ముందు నునుపు తేలేది! లోకాదర్శ జీవనుడు శ్రీరామచంద్రుడు భూమ్మీదకు  అవతరించింది కౌసల్యామాత గర్భంలో నవ మాసాలు రూపుదిద్దుకున్న తరువాత మాత్రమే! స్త్రీ జన్మ మహిమ రహస్యం ఆ త్రిశంకు  స్వర్గ ద్రష్ట  విశ్వామిత్రుల దృష్టి దాటక పోబట్టే బాలరామయ్యను మేలుకొలుపుతూ సుప్రజా రాముడి కన్న   ముందు ‘కౌసల్య’ మాతను తలుచుకున్నది. అమ్మ కడుపు చల్లంగా ఉన్నంత కాలమే ఏ అయ్యల కలలైనా నిండుగా పండేది. మగాడు ఈ సింపుల్ లాజిక్ మరుగున పెడుతున్నందు  వల్లనే  స్త్రీలోకంలో  ఇంతలా అల్లకల్లోలం.


కోవెల వంటిదీ లోకం అన్నది కోమలి కోమల భావన.  కానీ ‘మగవాడి దృష్టిలో ఆమె తనువుకు మాత్రమే ఓ వెల! తాను కని పెంచిన మగవాడే  తన పాలిట సైతానుగా మారుతున్నందుకు  ఆ మాత  వెత. ఆ కలత వల్లనే నెలతలంతా  'ఏ జన్మకీ స్త్రీ జన్మ నీ కొద్దు నా చిట్టి తల్లీ!' అంటూ అంతలా తల్లడిల్లిపోతున్నది అప్పుడూ.. ఇప్పుడు కూడా! 


భారతీయుల దృష్టిలో ఆడవాళ్లకు ఉండే పూజ్యభావన ఎంత  గొప్పగా ఉంటుందో చెప్పడానికని   ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః’ అంటూ ఎప్పుడూ ఒకే శ్లోకాన్ని వల్లెవేస్తాడు బడుద్ధాయి మగవాడు. వేదాలల్లో స్త్రీని దేవతలుగా చూపించడమూ, విద్య, ధన, ధైర్యాలకు స్త్రీలనే దేవతామూర్తులుగా చిత్రీకరించుకోవడమూ మహా బడాయిగా ఎత్తిచూపిస్తాడు కూడాను. రామాయణంలో రావణాసురుడి కన్న ముందు రాముడిని కష్టాల పాల్చేసింది ఆడవాళ్లే.. కైకేయి, మందర, శూర్పణఖ.. అంటూ  తన చిన్ని బుద్ధికి తోచిన కుతర్కం ప్రదర్శిస్తాడు కూడాను!మరి కాస్త కావ్య శాస్త్రజ్ఞానం వంటబట్టి ఉంటే ప్రబంధాల నుంచి కూడా ఎంచుకున్న పద్యాలతో లెక్చర్లు  దంచికొట్టచ్చు. ‘సుబ్బరంగా చదువుకోవడానికని వచ్చిన పిల్లోడు చంద్రుడిని చెడగొట్టింది  తార అనే  స్త్రీనే కదా! కృష్టుణ్ని అష్టకష్టాల పాల్చేసిన దుష్టజాతిలో పూతన వంటి స్త్రీ జాతి పాత్రా ఎంతో కొంత ఉంది కదా!  ఆడజాతి అంతా పులుకడిగిన ముత్యాలల్లే బిల్డప్పులు ఇస్తే ఎట్లా?  ఏదో ప్రకృతిని చూసి పరవశించిపోదామని వచ్చిన పిచ్చి బ్రాహ్మడు ప్రవరాఖ్యుడిని వరూధిని వశం చేసుకోడానికి అంతలా  వేపుకుని తినాలా? ఆవటా అంటూ  అంటూ- సొంటూ లేని శుంఠ  ప్రశ్నలు లేవదీస్తాడు. జరిగాయో జరగలేదో, జరిగితే ఎంత వరకు నిజంగా నిజాలే  ప్రచారంలోకి వచ్చాయో.. ఇతమిత్థంగా నిర్థారణ కాని కట్టు కథలను పట్టుకుని కొట్టుకు చావడం తప్పించి.. వర్తమానం కట్టెదుట ఆడదానికి అన్ని మతాలలో వాస్తవంగా జరుగుతున్న అన్యాయం గురించి నోరు విప్పడు! 

కామసూత్రాలను శాస్త్రీకరించి బహిరంగంగా  ప్రబోధించినందుకు మహానుభావుడని  మనం  నెత్తికెత్తుకుంటున్న  వాత్సాయనుడు..  ఆయన అదే కామకళల్లో భర్తల పెత్తనాన్ని ఎట్లా భార్యలు చచ్చినట్లు ఒప్పుకుతీరాలో ఉదాహరణలతో సహా నొక్కి చెప్పిన నిజం ఎవరికీ చెప్పరు ఈ మగవాళ్లు. భర్త తినకుండా భార్య తింటే దోషమన్న దుర్మార్గపు సిద్ధాంతం మొదట లేవదీసిన రుషి ఆ మహాశయుడే! దాన ధర్మాల నుంచి ఏ ఇంటి పని (వంట పని తప్పించి) వరకైనా స్వతంత్రించి చేసుకునే హక్కు ఆమెకు చరిత్రలో ఏ దశలోనూ దఖలు పడిందిలేదు . ఒక్క  భర్తనే కాదు భర్త బంధువులను, మిత్రులను, ముఖపరిచయస్తులనయినా సరే ఇంటికి వచ్చినప్పుడు నెత్తిన పెట్టుకు సకల సపర్యలతో ఒప్పించని పక్షంలో ఆమె ఉత్తమమైన ఇల్లాలు కానేరదు కదా.. కొండొకచో శాపతాపాలకూ  గురి అయిన  కథలూ పురాణాలలో బొచ్చెడున్నాయ్. వాటి ప్రస్తావన ఏ మగవాడూ చెయ్యడు. భర్త మోజుపడి మరో వివాహం చేసుకున్నా .. వివాహం కుదరని పక్షంలో ఇంటికే తెచ్చేసుకుంటే ఆ సవతితో సఖ్యంగా ఉండాలి తప్పించి కయ్యానికి కాలుదువ్వే సాహసం ధర్మపత్ని అయినా చేసిన  పక్షంలో పుణ్యస్త్రీ వంటి  బిరుదులన్నీ  వెనక్కి పీక్కోబడతాయని బెదిరింపులు  ఈ తరహా మొగవాళ్ల   నుంచే!

ప్రపంచంలోని అతి పెద్ద మతం క్రైస్తవానికి సైతం స్త్రీ పట్ల బొత్తిగా సదుద్దేశం లేదు. 'స్త్రీ పుట్టుకతోనే పాపి. పాపహేతువు. కేవలం పురుషుడి సుఖ సంతోషాలే ఆ నీచ ప్రాణి  సృష్టి పరమార్థం. స్త్రీని బానిసగా దేవుని వాక్యం భావించిన దానికి ఏ మాత్రం తిసిపోని విధంగా పురుషుడి అన్ని కష్టాలకు మూలకారణం  క్రైస్తవంలో లాగా ఇస్లాం మతమూ గాఢంగా విశ్వసించింది. 


స్త్రీకి బురఖా ఇస్లాం ప్రసాదమే! ప్రార్థనాలయాల ప్రవేశం ఆమెకు నిషిద్ధం. భర్త కోరితే సంగమానికి సిద్ధం కాకపోవడం పాపహేతువు. ఎంత వయసు వచ్చినా భార్యను  శిక్షించే హక్కు భర్తకు ధారాదత్తం చేసింది  ఇస్లాం మతం. భర్త తలాడించకుండా తనకు పుట్టిన బిడ్డకు అయినా సరే పాలిచ్చే అధికారం భార్యకు కల్పించింది కాదీ మతం. విడిపోయినా సరే భర్త అనుమతి తప్పనిసరి అనడం కన్నా ఘోరం ప్రపంచంలో మరొకటి ఉంటుందా? 


ప్రపంచంలోని దాదాపు అన్ని మతాలలో స్త్రీలు వ్యామోహ కారకులు. వారి మీద సదా  ఓ కన్నేసి ఉంచడం పురుషుల  తప్పనిసరి బాధ్యతల్లో ఒకటి. ఆడవాళ్లు దున్నబడే భూములతో సమానం. భూముల మీదుండే హక్కు భుక్కుల నియమాలన్నీ స్త్రీలకీ వర్తిస్తాయి కొన్ని మతాలల్లో. లేబుల్ ఏదైనా, కాలం ఎప్పటిదైనా, ప్రాంతం ఎక్కడిదైనా, వైవిధ్యాలు, వైరుధ్యాలు, అంతర్వైరుధ్యాలు ఎన్ని ఉన్నా  స్త్రీలకు అవ్యాయం  చేసే అంశంలో అన్ని మతాలు అన్నదమ్ముల వలెనే సహకరించుకున్నాయి.. సహకరించుకుంటున్నాయి కూడా!


హోలీ బైబిల్  రెండో ఛాప్టర్ ప్రకారం నిద్ర పోయే మగాడి డొక్కలో నుంచి ఓ పక్కటెముక పీకి  ది గ్రేట్ లార్డ్ గాడ్ సృష్టించబడినది  ఆడజీవి. ఆ తరహా  భావజాలమే మన ముత్తాతలది కూడా. మనువులాంటి మగ మహానుభావులంతా చేరి  'న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి' అంటూ  సిద్ధాంతాలు చేయబట్టే  మగవాడు  ఆ చొప్పదంటు సూత్రాలను పట్టుకుని  తోడు నీడుగా ఉందామని వచ్చే సాటి జీవి ఆడదానిని అన్ని ఆటలు ఆడిస్తున్నది! శేషం వేంకటకవి ‘శశాంక విజయం’లో కోరిక తీర్చమని తన దరి చేరిన గురుపత్ని తారతో ‘వికల చరిత్రు డైన, ముది వెంగలి యైన, గురూపి యైననున్, త్రికరణ శుద్ధిగా మగడె దేవు డటం చని నిశ్చయించి, యొండొక డెటువంటివా డయిన నొప్పదు కోరగ నింతి, కి’ అంటూ చంద్రుడు ద్వారా చెప్పిన నీతి సూక్తులన్న్నీ నిజానికి మగాడి మనసులో యుగాల బట్టి జెండా పాతుకుపోయి ఉన్నవే! ఆడదంటే ఒక్క తనువే అన్నట్లు మనువు  లాంటి దుష్ట మేధావులు ఈ తరహా  ధర్మపన్నాలు పదేపదే వల్లించడ వల్లనే ఆడవాళ్లకు  ఏ దశ లోనూ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు   బొత్తిగా లేకుండా పోయిందన్నది  స్త్రీవాదుల మండిపాటు. 

మరను, యంత్రాన్ని  కనిపెట్టక ముందే ‘మర-మనిషి’ని కనిపెట్టింది ప్రపంచం. మగప్రపంచం కనిపెట్టిన ఆ మర-మనిషి పేరు ఆడది. ఆడదిగా పుట్టినందుకు, చీరె కట్టడం నేర్చిందాకా పుట్టింటికి గొడ్డులా చాకిరీ చేయడం, ఓ మగాడొచ్చి మెడలో పలుపు కట్టగానే  తలొంచుకొని వెళ్లి అతగాడి వంశానికి   జీతం బత్తెం లేని ఊడిగం ఎల్లకాలం చేసుకుంటూ పడివుండటం!' మల్లాది సుబ్బమ్మగారి వంటి  స్త్రీ జనాభ్యుదయవాదులు పద్దాకా తిట్టిపోసేదీ మగవాడిని తమకు పగవాడిగా మారుస్తున్న ఈ తరహా పెడవాదనలను..   ఇప్పటికీ వాటిని గుడ్డిగా నమ్ముతూ  కఠినంగా అమలుచేస్తూ, ముమ్మరంగా ప్రచారం చేసే మూఢమతులను!


'ఎంత రుచి ఆ నిషిద్ధ ఫలానికి/ ఎంత వడి ఆ విముక్త హృదయానికి' అంటారు సినారె  విశ్వంభర ఖండకావ్యంలో నారీ నార సంగమ సుందర దృశ్యాన్ని అభివర్ణిస్తూ! ఇద్దరూ కలసి ఒకే తీరులో  ఆనుభవించే  ఆ సంగమ కార్యపు  తీయని రుచి మగవాడికి  ఒకానొక అనుభూతితో సరి. ఆడదానికి మాత్రం  మంచి.. చెడు..  అనుభవాలన్నీ  అక్కడి నుంచే  మొదలు! గర్భం ధరించింది మొదలు ప్రసవం అయే వరకు కాబోయే అమ్మ పడే యాతనలేమిటో వాయుపురాణం తిరగేస్తే విశదంగా బోధపడుతుంది. ‘గర్భస్య ధారణే విషమే భూమి వర్త్ముని/ తస్య  నిష్క్రమణార్థాయ , మాతృపిండం దదమ్యాహం' (గర్భం ధరించడమే కష్టం. ఎగుడు దిగుడు నేలల మీద నడవడం అందుకు అదనపు కష్టం. ఆ కష్టం కలిగించినందుకు నీ మాతృపిండాన్ని నేను నీకు నమస్కరిస్తున్నాను) అంటూ ఎదిగొచ్చిన తరువాత  సంతానం తమ తల్లుల ముందు తోచిన  విధంగా  మోకరిల్లవచ్చు.  తన బిడ్డ పుట్టుక కోసం యమద్వారం ముందుండే మహాఘోరమైన వైతరణీ నదినైనా తరించేందుకు  సాహసించిన స్త్రీ అప్పట్లో నష్టపోయిన జీవితానుభవాలకు పరిహారం చెల్లించేదెవరూ? 


భావుకతను రేకెత్తించే కవిత్వాలకేం గానీ.. వాస్తవంగా చూస్తే దేశంలోని స్త్రీ పురుష జనాభా నిష్పత్తి లెక్కలే ఆడవారి పట్ల మగజాతి ప్రదర్శించే ద్వంద్వవిలువల  వ్యాపార దృక్పథాలకు వికృత ఉదాహరణలు. పుట్టాలంటేనే 'చావు గండం' నుండీ గట్టెక్కాల్సిన గడ్డు దుస్థితి ఒక్క ఆడ గుడ్డుకే ఈ గడ్డన ఇప్పటికీ! తప్పీ దారీ భూమ్మీద పడ్డా.. తప్పుదారిలో నడిచే మగప్రపంచాన్నుంచి ఎప్పటికప్పుడు తెలివిగా తప్పించుకునే దారులు దేవులాడుకోవడమే తప్పించి నేటికీ ఇంటా బైటా వయసుతో నిమిత్తం లేకుండా ఆడది ఎదుర్కోక తప్పని దైన్యస్థితులు ఎన్నెన్నో! 


తన జీవితాన్ని తనకై  తానుగా అచ్చంగా   మగవాడి హక్కులతో సరిసమానంగా బతికే మంచి రోజులు ఆడదానికి ఎప్పుడు లభిస్తే అప్పుడే ఏటేటా జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు అంతిమ లక్ష్యానికి సార్థకత ! 


- కర్లపాలెం హనుమంతరావు 

( సూర్య దిన పత్రిక సంపాదకీయ పుట వ్యాసం) 

 


పుస్తకం ఓ మంచి నేస్తం - కర్లపాలెం హనుమంతరావు ( సూర్య దినపత్రిక సంపాదకీయ పుట వ్యాసం )



 వ్యాసం: 

పుస్తకం ఓ మంచి నేస్తం 

- కర్లపాలెం హనుమంతరావు 

( సూర్య దినపత్రిక సంపాదకీయ పుట వ్యాసం )


వసుచరిత్ర వంటబట్టించు కుంటే తెలుగు సాహిత్యమంతా మంచినీళ్ల ప్రాయమని  బాల వీరేశాన్ని ఎవరో బాగా నమ్మించారు. ఆ గ్రంథరాజం విలువ ఆ పిల్లవాడి కాలంలోనే రెండున్నర అణాలు. చిల్లుకానీ బిళ్ళ దర్శనానికైనా ఎన్నడో కానీ నోచుకోని బాలకందుకూరి పంతం వదల్లేదు. దినం తప్పకుండా ప్రతీ పరగడుపునా పుస్తక దుకాణ దర్శనం.. పొద్దెక్కేదాకా అక్కడే ఆ పుస్తక పఠనం! పంతులుగారి పంతం చూసి ఉదారంగా ఆ పుస్తకం ప్రదానం చేసాడు  దుకాణదారుడు. విద్య విలువ, ఆ విద్యను అందించే గ్రంథాల  ప్రాధాన్యత గురించి తవ్వి పోసినవారికి తవ్విపోసినంత . అడగడుగునా ఈ తరహా  వింతలూ.. విశేషాలా  అలరిస్తూనే ఉంటాయి.


ఆరువందల ఏళ్ల కిందట బడికి వెళ్లే పిల్లకాయల సంచుల్లో ఇప్పట్లా పుస్తకాల దిండ్లు వందలొందలు ఉండేవి కావు. ఒక్క చెక్కపలకే వాళ్లకు అప్పట్లో రాసుకునేందుకు దిక్కు. వేరే దేశాలలో  అయితే మైనం పూసిన చెక్కపలకలు. వింత వింత రాత సాధనాలు కనిపిస్తాయి పుస్తక చరిత్ర తవ్వుకు పోతుంటే!


ఏది కంటబడితే దాని మీదనే చేతి గోటితొ గీసే అలవాటు ఆదిలో మానవుడిది. గోలుకొండ కోట జైలులో కంచెర్ల గోపన్న గోడ మీద శ్రీరామ చంద్రుణ్ని దెప్పుతూ సంకీర్తనలు రాసుకున్నదీ చేతి వేళ్ల గోళ్ళతోనే! రాతిబండలు, తాటాకులు, భూర్జపత్రాలు, జంతుచర్మాలు, చెట్టుపట్టలు, కుండ పెంకులను, బండలను కూడా వదలకుండా ఒకానొక కాలంలో బండమనుషులు రాయడానికి వాడేవాళ్లు. రాత పరికరాల రూపంలో మార్పు రావడానికి చాలా కాలం పట్టింది. మధ్యలో విసుగెత్తి మనిషి ఈ రాత బెడద మనకెందుకులెమ్మని లేచిపోయి గాని ఉండుంటే!  మన తలరాతలు ఇప్పుడు మరోలా ఉండేవి కదా!


మహమ్మద్ పైగంబర్ ఖురాన్ షరీఫ్ ను గొర్రెమూపు చర్మాలను ఎండబెట్టిన ముక్కల మీదనే రాసాడుట పాపం. గ్రీకులు ఓస్ట్రక్ అనే కుండ పెంకులను పలకలుగా వాడేవాళ్లు. మన దేశంలో అయితే గణతంత్ర రాజ్యాలలో ముద్రలు వేసి ఇచ్చే నోట్లకు కర్రముక్కలను వాడినట్లు చరిత్ర. ఇదే శలాకా పద్ధతి.


పశ్చిమ దేశాలలో పైపరస్ కాగితాలకు గిరాకీ. అంత ధర పెట్టలేని బీద రచయితలు కుండపెంకులతో సరిపెట్టుకొనేవాళ్లే కాని రాత పని మాత్రం వదిలిపెట్టే ఆలోచన ఏనాడూ చేయలేదు. ఈజిప్టులో పనిచేసిన రోమన్ సైనికులు తమ ఖాతాలకు సరిపడా పైపరస్ సరుకు దొరక్కపోయినా కుండ పెంకులను పట్టుకు వేళ్లాడారే గానీ  ఖాతా లెక్కలు రాయడానికి పాలుమాలిందీ లేదు!


గడియకు నూరు పద్యములు గంటము లేక రచింతు అంటూ తెలుగు అడిదం సూరకవి ఎట్లా కోతలు కోసాడో.. తెలియదు కానీ.. మన దేశంలో మొదటి నుంచి తాటాకులదే రాత సాధనాలలలో రాజాపాత్ర. సమయానికి రాసుకునేందుకు ఆకులు ఇవ్వలేదని వేములవాడ భీముడు తాడిచెట్టు మొత్తాన్నే వేళ్లతో సహా బూడిద చేసినట్లు ఓ   కథ. ఆ కట్టుకతలను  పక్కన  పెట్టినా చరిత్రను బట్టి చూస్తే రాయిని కూడా రాజుల శాసనాలు రాయించేందుకు ఉపయోగించినట్లే రూఢీ అవుతుంది. అవే 'శిలాశాసనాలు' శాశ్వతత్వానికి నేటికీ ప్రతీక.  శిలాశాసనం అనే పదం అలా వచ్చిందే! అల మీద అక్షరాలు క్షరాలు/ శిల మీది అక్షరాలు అక్షరాలు/ అలా? శిలా? ప్రియా.. నా ప్రేమాక్షరాలకు నీ హృదయం? ' అని నేను గతంలో ఓ మినీ కవిత రాసినట్లు గుర్తు! 


క్రీస్తుకు నాలుగు వందల ఏళ్ల కిందటిదైనా మహాస్థాన్ శాసనం ఇప్పటికీ మనం కళ్లారా చూస్తున్నామంటే అందుక్కారణం అది శిల మీద చెక్కింది  కావడమే. మన భట్టిప్రోలు, అశోక శాసనాలూ శిలాలిఖితాలే. వేల ఏళ్ల కిందటి బౌద్ధ స్తూపాల మీద చెక్కిన జాతక కథలు నేటికీ చెక్కు చెదరని స్థితిలో తవ్వకాల్లో బైటపడుతున్నాయి ఎన్నో చోట్ల. ఈజిప్టులో కళా చిత్రాలు సమాధుల మీద దేవాలయ కుడ్యాల మీద రాయడం ఓ సంప్రదాయం.


రాతి పుస్తకాలు మోతబరువు. 177 పుటల బరువున్న ఈజిప్టు శిలాశాననం అసలు ప్రతి చదవాలంటే ఎవరైనా ఈజిప్టు దేశం దాకా వెళ్లి రావాలి. గవిమఠం శిలాశాసనం చదవాలంటే కొండలు.. బండలు ఎక్కి పైకిపోవాలి. అశోకచక్ర వర్తి మహానుభావుడు దాన్ని అంత ఎత్తు కొండ మీద ఎందుకు చెక్కించినట్లో? రాసే వాళ్లకి కష్టం ఎటూ తప్పదు. చదివేవాళ్లకీఇన్ని ఇబ్బందులా? 


బహుశా సీరియస్ పరిశోధకులు మాత్రమే ఆ శాసనాల జోలికి పోతారన్న ఉద్దేశముం దేమో.. చక్రవర్తి కడుపులో! పోనీ ప్రత్యామ్నాయంగా పోస్టులో పంపిద్దామన్నా ఉండవల్లి గుహశాసనాలు వంటి బండరాళ్ల శాసనాలను ఉండచుట్టేందుకైనా వీలు కావే! హేవిఁటో.. ఈ రాత కష్టాలు!


ఇన్ని రాతి కష్టాలు ఎదురయ్యాయనే కావచ్చు. పరిష్కారంగా కొంతలో కొంత బరువు తక్కువ లోహాలు కంచు, రాగి వంటివి వాడుకలోకి వచ్చింది. విదేశాలలోని చాలా ప్రార్థనాలయాలు, రాజప్రాసాదాలు ఎక్కువగా కంచు ఫలకాలతోనే కనువిందు చేస్తుంటాయి. బ్లోయిన్ నగరవాసులతో ఎట్ లీన్ ప్రభువు ఓ కంచు ఫలకంపైన చేసుకొన్న ఒప్పంద పత్రం అక్కడి ఓ చర్చి తలుపులకు పుస్తకం మాదిరి తాపడం చేయించిపెట్టారు. రాజప్రసాదం నేల కూలింది కానీ.. కంచు పుస్తకం మాత్రం నేటికీ చెక్కు చెదరకుండా ఉంది! పుస్తకమా.. మజాకానా!


మూరగండరాయడుగా శత్రుమూకల చేత మూడు గంగల నీళ్లు తాగించిన శ్రీకృష్ణదేవరాయలు మను  చరిత్ర కర్త పెద్దనామాత్యుడి కాళ్లు కడిగి ఆ నీళ్లు శిరస్సు మీద జల్లుకున్నాడు. చేత్తో కాలికి ఆ మహారాజు తొడిగిన గండపెండేరం కన్నా.. నోటితో చతుర వచోనిధి/వతుల పురాణాగమేతిహాస కథార్థ/ స్మృతి యుతుడవని పొగడటమే పెద్దన ఆధిక్యాన్ని పదింతలు గుర్తింపు. పెద్దనగారి ఆ ఆధిక్యానికి కారణం ఆ కవిగారు రాసిన మను చరిత్ర కదా! విద్యా సమం నాస్తి శరీర భూషణమ్- విద్యను మించిన అలంకారం మనిషికింకేమీ లేదన్న మాట అక్షరాలా నిజం. ఆ విద్యాప్రసాదం మన జిహ్వకు అందించి రుచి కలిగించే పళ్లెరం పుస్తకం.. తాళపత్ర గ్రంథాలైనా మరోటైనా!


అప్పటికీ మన దేశంలో రాగి లోహం మీది రాతలే ఎక్కువ.  గోరఖ్ పూర్ జిల్లా తాలుకు బుద్ధుని కాలం నాటి పాలీ లిపి తామ్ర శాసనం క్రీస్తుకు పూర్వం 450 ఏళ్ల కిందటిది. ఇప్పటి వరకు దొరికిన వాటిలో ఆ శాసనమే అతి ప్రాచీనమైనది.


తెలుగు దేశాలలో  తెలుగులో చెక్కిన తామ్ర శాసనాలయితే తామర తంపరలుగా కనిపిస్తుంటాయి. తాళ్లపాక అన్నమాచార్యుల వారు  ఆయన బిడ్డ తిరువేంగళాచార్యుల వారు చెక్కించిన సంకీర్తన రాగి రేకులే సుమారు ముపై రెండు వేలకు పై చిలుకు! రాజులుతమ వైభవ ప్రాగల్భ్యాల ప్రదర్శన కోసం, ప్రజలు భక్తిభావ ప్రకటనల కోసం బంగారం, వెండి వంటి వాటి రేకుల మీద స్తోత్రాలు చెక్కించడం ఓ ఆచారంగా వస్తున్నది అనూచానంగా. తక్షశిలలో గంగు స్తూపంలో బంగారు రేకు శాసనం, భట్టిప్రోలు స్తూపంలో వెండిరేకు శాసనం లభ్యమయ్యాయి. అన్ని కళాఖండాల మాదిరే అవీ ఇప్పుడు చివరకు బ్రిటిష్ మ్యూజియంలో తేలాయనుకోండి! అది వేరే కథ.


ఎన్ని నయగారాలు పోయినా చివరికి రాతకు కాగితమే గతి అనితేలిపోయింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్నది చెట్టు బోదెల నుంచి రాబట్టే గుజ్జుతో తయారయే కాగితం. రాతకు, మోతకు, ఖరీదుకు, వాడకానికి అన్నిందాలా  అనువైనది కావడమే కాగితం విజృంభణకు ముఖ్య కారణం. 


ఇప్పుడిప్పుడే ఈ-బుక్స్ పేరుతో ఎలక్ట్రానిక్ పుస్తకాలు ఉనికిలోకి వస్తున్న మాటా నిజమే. అయినా అత్యధికులకు అచ్చు కాగితాలతో తయారయే పుస్తకాలంటేనే ముచ్చట పడుతున్నారు.


ఏ రూపంలో ఉన్నా పుస్తకాలు మనిషికి గొప్ప నేస్తాలు సుమా! దుర్బలంగా జబ్బురోగిలా ఉన్నాడన్న దిగులుతో కన్నబిడ్డ ప్రహ్లాదుణ్ని విద్యాభ్యాసంబున గాని తీవ్రమతి గాడని ఎంచి చండామార్కుల వారికి అప్పగించాడు రాక్షస రాజై ఉండీ హిరణ్యకశిపుడు. చదివిన వాడజ్ఞుండగు/ చదివిన సద సద్వివేక చతురత గలుగుం అన్న ఆ రాక్షసరాజు అప్పుడన్న మాటలు అక్షరాలా అందరికీ శిరోధార్యమే. అసురుల చేత కూడా పొగిడించుకున్న విద్య వట్టి నోటి మాటతో సాధించే కృష్ణ కుచేలుల సాందీపనీ గురుకుల విద్యా ప్రణాళికగా మాత్రమే సాగిపోలేదు. తావికి    పూవులా విద్య పుస్తకంలోకి ఒదిగిపోయింది.


'పాత చొక్కా అయినా తొడుక్కో! కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో!' అన్న కందుకూరి హితవు పాత చింత తొక్కు కింద మారడం మేలు కలిగించే పరిణామం కాదు. దుస్తుల ధారణలో చూపించే శ్రద్ధ నేటి తరం పుస్తక పఠనంలో ప్రదర్శించడం లేదు. క్రమంగా కనుమరుగయే జాతుల జాబితాలో పిచ్చుక, పావురాల మాదిరి పుస్తకమూ చేరడంలో తప్పెవరిది అన్న చర్చ కన్నా ముందు తగు దిద్దుబాటు చర్యలు వేగిరం తీసుకోవడం అవసరం.


అంతర్జాలం అత్యంత వేగంగా ప్రాచుర్యంలోకి వస్తున్న మాయాజాలం. అయినా పుస్తకంలాగా చేతితో ముట్టుకొని, ఆప్యాయంగా గుండెలకు హత్తుకొని సారం గ్రహించేందుకు వీలయే వాస్తవిక ప్రపంచం కాదు అది. ఎవరైనా.. ఏమైనా.. ఎప్పుడైనా.. ఎక్కడైనా.. ఎలాగైనా.. ఏ హద్దులు, పరిమితులు, నిజ నిర్ధారణలు, వడపోతలు గట్రా లేకుండా ఏ ప్రామాణిక పరీక్షల ముందు నిలబడలేని సమాచారం అన్ని వర్గాల పాఠకులకు వయో లింగ భేదాలనేవేవీ లేకుండా అందుబాటులోకి తెచ్చేది ఈ జిత్తులమారి వర్చ్యువల్ ప్రపంచం. కల్లో.. కనికట్టో నిర్ధారణ కాని విషయాల వల్ల మంచి ఎంతో.. హాని అంతకు మించి. ఈ తరం ఆ నిజం ఎంత తొందరగా గ్రహిస్తే పుస్తకం మనుగడకు అంత మంచిది.


పుస్తక ప్రపంచంలోనూ కొన్ని బెడదలు లేకపోలేదు. అయినా సరే.. ఫేసుబుక్కు కన్నా ఏ ఫేమస్ పర్శనాలిటీని గూర్చో చర్చించే బుక్కే పాఠకుడికి ఎక్కువ లాభసాటి. చెడు పుస్తకం వడపోతలు, నిబంధనలు, పర్యవేక్షణలు, చట్టబద్ధమైన నియమాల అడ్డు గోడలు దూకుతూ ఆట్టే కాలం నిలబడేది కష్టం. కాలపరీక్షకు తట్టుకు నిలబడే విజ్ఞానానికే వుస్తక రూపంలో చదువరిముందు ప్రత్యక్షమయ్యే అవకాశం ఎక్కువ. ఇంటర్నెట్ హోరెత్తించే అగాధ సాగరమైతే.. గ్రంథలోకం హృదయాహ్లాదం కలిగించే గందర్వ లోకం అనుకోవచ్చు !


రోజంతా టీ.వీ, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్లకే మీదు కట్టే బలహీనత ముందు పెద్దలే కట్టేసుకోవాలి . వీలున్నంత మేరకు విలువైన పుస్తక పఠనానికే సమయం ఇవ్వాలి. కన్నబిడ్డలకు తాము మార్గదర్శకులయినట్లే మంచి పుస్తకం తమకు సన్మార్గ సూచిక అని పెద్దలు గుర్తించినప్పుడే గత కాలం మాదిరి గ్రంథస్త జ్ఞానం పదహారు కళలతో పునః ప్రవర్థిల్లే అవకాశం.


ఇంటి పట్టు ఉండే అమ్మలక్కలక్కూడా ఇప్పుడు పుస్తకమంటే ఎకసెక్కెమై పోయింది. అమ్మ, అమ్మమ్మల కాలంలో మాదిరి కనీసం ఓ వారపత్రికనైనా తిరగేసే ఓపిక బొత్తిగా ఉండటంలేదు అమ్మళ్లకు. కంటి సత్తువంతా ఎన్నటికీ ఎడతెగని ఏడుపు, పెడబొబ్బల ధారావాహికాలకే  ధారపోత! ఉన్న మానసిక వత్తిళ్లకు తోడు ఉపరి దైహిక వత్తిళ్లు అంటగట్టేవి  టీవీ, మూవీమంధరలు! కొత్తగా నట్టింట చేరిన కంప్యూటరుతో కొత్త తుత్తరు. పద్దస్తమానం చెవులు కొరికే స్మార్ట్ ఫోన్ దూరభారపు చుట్టాలతో కాపురాలు కూల్చేసే దొంగచాటు ఛాటుల కన్నా.. కూలే కాపురాలను నిలబెట్టే పుస్తకాలే మిన్న కదా! అన్నుల మిన్నల కన్నులు తెరిపిడి పడితేనే తప్ప నట్టింటి పుస్తకాల గూటిలో మళ్లీ రంగనాయకమ్మ స్వీట్ హోములు , బాపూ రమణల బుడుగు సీగాన ప్రసూనాంబలు , చక్రపాణిగారి చందమామలు అలరించేది.. మేధను రగిలించేది. 


పిల్లలు తప్పని సరిగా చదివే పాఠ్యపుస్తకాల సంగతి వేరు. ఇప్పటి ఘోషంతా  వినోదంతో పాటు విజ్ఞానం, సంస్కారం, సాంఘిక దృష్టి, ప్రాపంచిక ఇంగితం  పెంపొందించే కాల్పనిక సాహిత్య పఠనం గురించి . అపూర్వ పురా  వైభవాన్ని పరిచయం చేస్తూ.. దివ్యమైన బంగరు భవితవ్యం కోసమై వర్తమానంలో ప్రవర్తించవలసిన తీరుతెన్నులను ఓ గురువులా, స్నేహితుడిలా, తాత్వికుడిలా శాసించి, లాలించి, బోధించే సత్తాగలది పుస్తకం ఒక్కటే! పొత్తం విశిష్టత నేటి తరాలకు తెలియచేసేదెవరు?


శ్రీవాణి వదనంలో నివాసమున్న వాడెన్నడూ దైన్యుడు కాలేడని శంకర భగవ త్పాదులేనాడో భాష్యంలో చెప్పుకొచ్చారు. ఆ వాణీముఖ వాస్తమ్యల వుణ్య చరి త్రలు మనకందించేవి పుస్తకాలే! మనిషి తనకు తానుగా తనకోసం తాను మనిషిగానే మెలగడానికి తయారు చేసుకొన్న గొప్ప చమత్కార మార్గదర్శి-  పుస్తకం.


చిన్నతనం నుంచే పుస్తకాన్ని పిల్లల జీవితంలో అంతర్భాగం చేయవలసిన బాధ్యత నిజానికి కన్నవారి మీదే ఎక్కువ ఉంటుంది. భవిష్యత్తులో గొప్ప కలిమి గడించాలన్న అడియాసలో పడి బిడ్డల ఒడి నుంచి మంచి పుస్తకం లాగేసుకోడం మంచి పెంపకం అనిపించుకోదు. తమంతట తాముగానే మంచి పుస్తకాలని ఎంచుకొని చదువుకొనే దిశగా పసిమనసులను ప్రోత్సహించవలసిన బాధ్యత వాస్తవానికి కన్నతల్లిదండ్రులకే అందరికన్నా ఎక్కువ సుమా! వివిధ రంగాల, రుచులకు చెందిన గ్రంథాలు వారి అంతరంగాలను అలరించే తీరులో అందుబాటుకి తెచ్చినప్పుడే కదా బాలలకు వాటిపై ఆసక్తి, అభిరుచి పెరిగే అవకాశం! 


పుస్తకమే లోకంలా పిల్లలు ఎదగాలంటే ముందు ఇంటినే పుస్తక లోకంగా మార్చేయడమే మందు.


భావి జీవితంపై ఓ స్పష్టమైన వైఖరి తీసుకొనే శక్తిసామర్థ్యాలను కల్పించేవి మంచి పుస్తకాలే. కన్నవారు, అనుభవం పుష్కలంగా ఉన్నవారు అన్ని వేళలా అందుబాటులో ఉండరు. ఆ లోటు భర్తీ చేసే మంచి నేస్తాలే పుస్తకాలు. పుస్తక పఠనమంటే ఓ ఆటలా ఇంటిని ఆటల మైదానంలా తీర్చి దిద్దినప్పుడే పిల్లలలో క్రీడాస్ఫూర్తి పుంజుకునేది! ఎదర జీవితంలో ఎన్నైనా ఢక్కామొక్కీలు ఎదురు కా నీయండి.. తిరగబడి పోరాడే తత్వం పుస్తక పఠనం వల్లనే బాలల్లో గట్టిపడేది.


పుస్తకాలు చదివే వాళ్లకు.. చదవని వాళ్లకు సంస్కారంలో హస్తిమశకాంతరం తేడా. సమయానికి విలువ ఇవ్వడం. సమాజావగాహన కలిగి ఉండటం, సమ స్యలను సమర్థంగా ఎదుర్కోవడం, పరిష్కరించడంలో చురుకుదనం ప్రదర్శించడం, తప్పులుంటే ఒప్పుకోవడం, సరిదిద్దుకొనేందుకు సిద్ధంగా ఉండటం, విభిన్నంగా ఆలోచించడం, విశాల దృక్పథం కలిగి ఉండటం.. మంచి పుస్త కాలు విస్తృతంగా చదివే బుద్ధిజీవులకు సులభంగా పట్టుబడే సిద్ధవిద్యలు.


పుస్తకాల పండుగలు ఏటేటా రెండు తెలుగు రాష్ట్రాలలో కనుల పండువుగా జరుగుతూనే ఉంటాయి. తీరిక ఉన్నప్పుడు కాదు.. తీరిక చేసుకొని మరీ పుస్తకాల కొలువులని చిన్నా పెద్దా కలసి సందర్శించండి అందరూ. కొన్నయినా మంచి పుస్తకాలు కొని ఇంటికి తెచ్చుకోండి! మంచి పుస్తకం పైన మనసు లగ్నమవడానికి మంచి లగ్నం అవసరమా? 


- కర్లపాలెం  హనుమంతరావు 

12-11-2021 


( సూర్య దినపత్రిక సంపాదకీయ పుట వ్యాసం ) 

ఇదీ ఓ ఆదాయ మార్గమే! - కర్లపాలెం హనుమంతరావు ( సూర్య దినపత్రిక - సంపాదక పుట ప్రచురితం)

2020 


హాస్యం : 

ఇదీ ఓ ఆదాయ మార్గమే!  

- కర్లపాలెం  హనుమంతరావు 

( సూర్య దినపత్రిక - సంపాదక పుట ప్రచురితం) 


' రకరకాల ఎన్నికలు ముంచుకొస్తున్నాయి కదా! ఓ మూలట్లా మన్మోహన్ సింగులా కూర్చుంటే ఎట్లా? ఎంచక్కా పోయి ఓసారా ముసలయ్యగారిని కలిసి రారాదా! ' అని మా ఆవిడ నస. 


వెళ్ళి కలిశాను ముసలయ్యగారిని. మనసులోని మాట పెదాల మీదకు రానే లేదు, పెద్దాయన చప్పట్లు కొట్టి పి.య్యేని పిలిచి నన్నప్పగించేశాడు. 


' అయ్యగారికి ఇవాళ మౌన దీక్ష. స్పీకరు పని చెయ్యదు. మరీ ముఖ్యమైతే తప్ప రిసీవరూ బైటికి తియ్యరు. ఏమిటీ విషయం? అనడిగాడా పి.య్యే.


'మా వార్డు నెంబరు పదమూడుకి నిలబడదామనీ. ముసలయ్యగారి పార్టీ సహకారం కావాలి ' అన్నా టూకీగా. 


' మరైతే వట్టి చేతులతో వచ్చారేంటండీ బాబూ! మీ జాతక చక్రం.. సూర్యమానం ప్రకారం వేసిందొకటి, చంద్రమానంతో కలిపిందొకటి తీసుకు రావాలి. గ్రహాలు, రాశులు.. వాటిని బట్టే అయ్యగారి అనుగ్రహం! ' అన్నాడా పి.య్యే. 


తమిళనాడు దివంగత జయలలితమ్మాళ్ గారికి  ఇట్లాగే జ్యోతిష్కం, సంఖ్యాశాస్త్రాలంటే తగని పిచ్చ. జాతక యోగం ఉచ్ఛస్థితిలో ఉందనుకున్న వాళ్ళకు మాత్రమే టిక్కెట్లిచ్చారు ఒకసారి ఎన్నికల్లో. ముఫ్ఫైతొమ్మిది స్థానాలను ముష్టి తొమ్మిదంటే తొమ్మిది మంది మాత్రమే గెలిచారింతా చేసి.  


' గెలుపుకీ గ్రహాల వలపుకీ లింకేమిటండీ బాబూ? ప్రజాస్వామ్యంలో ఘనవిజయానికి కావాల్సింది ప్రజల అభిమానం కాదుటండీ! ' అన్నాను కసిబట్టలేక. 


'టయానికి గుర్తు చేసారు! జయలలితమ్మగారి కన్నా మా ముసలయ్యగారు మరో రెండాకులు ఎక్కువ. ఇట్లాంటి పరాశాస్త్రాల పైన నమ్మకం. మీ ఇంటికో సారి మా వాస్తుశాస్త్రులు వస్తారు. అన్నీ సవ్యంగా ఉంటేనే మీ మొర మా పెద్దాయన ఆలకించడం! మొన్నీ మధ్యన ఇట్లాగే ఒక బొజ్జాయన ఇంటికి ఈశాన్యంలో పూజామందిరం పెట్టుకుని అవకాశం చేజేతులా జారవిడుచుకున్నాడు.' 


' ఇంటికి ఈశాన్యంలో మందిరముంటే దోషమా? ' 


' మందిరముంటే కాదు మహాప్రభో! అందులో వినాయకుడు, ఆంజనేయుడు లాంటి బాహుబలులుంటేనే దుర్దశ. ఈశాన్యంలో బరువులుంటేనే కదండీ ఊహించని ఉత్పాతాలొచ్చిపడేదీ! ఆ మాత్రం వాస్తుజ్ఞానం కూడా లేకుండానే వార్డు మెంబరై పోదామనే! ' 

పి.య్యే మాటల్లో వెటకారం. 


ఇండియాని ఈ కరోనా తరహా మాయదారిరోగాలు ఎందుకు పీడిస్తున్నాయో ఇప్పుడు బుర్రకెక్కింది 


ఈశాన్యంలో అంత లావు హిమాలయాలు.. వాటెనకమాల్న చైనా కొరియా గట్రాల్లాంటి దేశాలాయ! కుంభకోణాలనీ, ద్రవ్యోల్బణాలనీ, ఇరుగు పొరుగు దేశాలతో ఇబ్బందికర సంబధాలనీ.. పాపం మనం మోదీ, షా మామయ్యలను హమేషా ఆడిపోసుకుంటున్నాం నిష్కారణంగా. 


నా ఆలోచనల్లో నేనుండగానే భుజం గోకి మరీ అడిగాడా పి.య్యే ' కొంపదీసి మీ ఇంటిగ్గానీ సింహద్వారం దక్షిణం వారగా ఉందా ఏంటీ? ముందే చెప్పండి బాబూ.. ఆనక నన్నెన్ని దెప్పీ లాభం ఉండదు.' 


' అమెరికా శ్వేత సాధం తలవాకిలే దక్షిణానికి అభిముఖంగా ఉంటుంది తమ్ముడూ! మరా దేశం ఇన్నేళ్ళబట్టి అగ్రరాజ్యంగా ఎట్లా నిప్పులు వెదజల్లుతుందో? ' 


' వాదనలొద్దిక్కడ. ఆ ముచ్చట్లన్నీ టీవీ పెట్టెల్లో! ముసలయ్యగారు శాస్త్రాలు నమ్ముతారు. ఆయన ముక్కును చూసారా? దూలం భారీ. తిన్నగా కూడా ఉండదు. ఆయన ముక్కు వాస్తు ముందే తెలుసుకుని వచ్చుండాల్సుంది తమరు.' 


బిక్క మొహమేయడం నా వంతయింది. పోయిన ఏడాదే మా అడ్డగాడిదకు ఎక్కడా ముడిపడే యోగం కుదరడంలేదని ఇట్లాగే ఏదో శాస్త్రం ఘోషిస్తోందంటూ నా ఘోష లెక్కచెయ్యకుండా వీధి ముఖ ద్వారాలు రెండూ సగం మూయించేసింది మా అర్థాంగి. ఇప్పుడీ ముసలయ్యగారి వాస్తు ఇంకేం మూయిస్తుందో.. ద్యావుడా!


' ముందొక సారి వచ్చి ఈ నీళ్ళ తొట్లో మీ కిష్టమైన రంగు ముక్క ఏదన్నా తగలేయండి బాబూ! మీ అసలు రంగేంటో బైట పడేందుగ్గాను ఇదో చిన్న స్లిప్ టెస్ట్ అన్నమాట! ' అంటో గారపళ్ళు చూపించాడా పియ్యేగారు.


రంగులు మారుతున్న నా మొహం వంక చూసి మీ సందేహం అర్థమైందిలేండి బాబూ! ఈ తొట్లో ఉన్నది సీదా సాదా జలగ కాదు! ఆఫ్రికా ఖండం ' యవుండే ' దేశం నుండి తెప్పించిందండీ! ప్రపంచ ఫుట్ బాల్ పోటీలల్లో ఫలితాలు ముందే చెప్పిన ఆక్టోపస్ 'పాల్' లేదూ.. దానితో క్రాస్ చేయించి పుట్టించిందండీ ఈ బుజ్జిముండను! తండ్రి తాలూకు జోస్యం చెప్పే లక్షణాలు ఎక్కడకండీ పొయ్యేదీ? ఒక్క పాలిటిక్సులోనే కాదు వంశపారంపర్యాలు గట్రా జాతకాలు కూడా ఇట్టే పట్టేస్తుంది. వద్దని దులపరిస్తే మాత్రం మాయమై పోడానికి ఇదేమన్నా గుడికి  పట్టిన ఆర్డినరీ బూజా? వాస్తు బూజు బాబూ! ' 


వాస్తు మోజు ఆటల మీద రంధి పెంచి బెట్టింగ్ సొమ్ము రెట్టింపు గుంజేందుకు మాస్ మీడియాతో మాఫియా ఆడించే  నాటకాల్రా బాబూ ! ఆ ఆక్టోపస్సుల యాక్టింగులు వెనక ఉన్న కుట్ర ఎవరికీ అర్థమవడం లేదు. యుద్ధ రంగంలోకి దిగే ముందే శత్రువర్గం మానసికంగా కుంగేటందుకు వాడుకునే గూఢచర్యా నికి ఇది నకలు.’ 


నా ఊహల్లో నేనుండగానే పెడబొబ్బలు పెట్టేసాడా పి.య్యేసామి. నా చేతులు పట్టుకు తెగ ఊపేస్తూ ' కంగ్రాట్సండీ కామాయ్ సారో! మీరీ పరీక్షలో కూడా నెగ్గేశారోచ్! ఇహ కోయంబట్టూరు నాడీ జోస్యం కూడా తెప్పించేసుకుని రడీగా ఉంచుకుంటే సరి.. మీ పని ఫినిషయిపోయినట్లే! ఆఁ.. అన్నట్లు.. ఈ లోపల్నే నామనక్షత్రం ప్రకారం తమ పేరును ఎట్లా మారిస్తే దిగ్విజయం సిద్ధిస్తుందో డాక్టర్ దైవజ్ఞానం కూడా ఓ నివేదిక తయారుచేసిస్తారు. ఓ.కే నా? ' 


పేరు మార్చుకుంటే అపజయలక్ష్మి ఆనవాలు పట్టకుండా వదిలేస్తుందనా? దేవుళ్లను కూడా తప్పుదారి పట్టించే కొత్త రకం గుంటనక్క ట్రిక్కా!


' మీరున్నారు చూసారూ.. భలే చిలిపి సార్! మనసులో ఏదున్నా అస్సలు దాచుకోరు! ఐ ఎప్రిషియేట్! ఇది వరకో చిన్నారావును.. ఇట్లాగే 'చీ..అన్నా.. రావు'గా సాగదీసిం తరువాతనేనండీ అతగాడి జాతకం మొత్తం తిరగడ్డం మొదలెట్టింది. దివ్యజ్ఞానం గారి విజ్ఞానాన్ని సందేహించకండి! అరవై ఏళ్ళ అనుభవసారం. వాజిపేయి, సోనియాజీ, కరుణానిధీ, నెల్సన్ మండేలా, జార్జ్ బుష్, సద్దాం హుస్సేన్ లాంటి పెద్ద పెద్ద జాతీయ, అంతర్జాతీయ శాల్తీల నాడులే పట్టి మరీ జోస్యం రాబట్టిన ఘనాపాటి ఇతగాడు! మీ డౌట్లన్నీ ని తీరిపోతాయ్.. ముందీ బౌండు బుక్కు చదవండి ' అంటూ కవిలకట్టొకటి నా మొహాన ఠకీమని కొట్టి లోపలికి తారుకున్నాడా పియ్యే. 


బౌండా అది? వందలాది ఏళ్ళ కిందటి తాళపత్ర గ్రంథాల ఆధారంగా చెప్పే నాడీ జోస్యంట ఆ దిండు! నోస్ట్రస్ డేమ్ జోస్యం కన్నా డేమ్ ష్యూర్ గా డాక్టర్ దివ్యజ్ఞానం జోస్యముంటుందని డబ్బాలు! ఇరాక్ యుద్ధం, ఇందిరమ్మ మరణం, రజనీ ' బాషా ' హిట్టూ.. బాబా ఫట్టూ, బందిపోటు వీరప్పన్ చావు, వెస్ట్ బెంగాల్ లెఫ్టిస్టుల ఫేటు, దక్షిణాది  సునామీలు, ఆమ్ ఆద్మీ కేజ్రీవాలు  రైజు, పెద్దనోట్ల రద్దు, ముంబై దాడులు.. ఆర్జీవీ మూడ్స్ తో సహా హిస్టరీ దృష్టిలో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అనింపార్టెంట్ స్టోరీస్ ఆల్మోస్ట్ అన్నీ నేటివ్ టు ఇంటర్నేషనల్ లెవెల్లో సర్వం జరక్కముందే.. విఘడియల వివరాలతో సహా పర్ఫెక్టుగా లెక్క గట్టి మరీ తేల్చినట్టిదీ నాడీ మండలం అంటూ కోతలు! కరుణానిధిగారు శుద్ధ చార్వాకవాది. హస్తసాముద్రికాలు.. నాడీ జోస్యాల వంటి అవరశాస్త్రాలు ఆయన వంటికి పడవు. అంత పెద్దల వ్యక్తిగత జీవితాల లోతుల్లో కెల్లా చొచ్చుకెళ్ళగలిగాడబ్బా ఈ డాక్టర్ దైవజ్ఞానం! ఈ లెక్కన చూసుకుంటే.. కొరియా ట్రంపుల ఒప్పందం, సులేమానీ మరణం లాంటి  అనూహ్య ఉత్పాతాల గుట్లు మట్లన్నీ తూ  గుప్పెట్లోనే అదిమి పట్టి ఉంచానని కోతలు ఇంకెన్నయినా కోయచ్చు . 


అసలీ దస్త్రాలన్నీ చదవడం సంగతట్లా పక్కనుంచి.. మొయ్యడానికే ముందు కోడి రామ్మూర్తిగారి కండబలం కావాలి!


ఇంకాస్సేపు గానీ ఇక్కడే పడుంటే.. ఈ ముసలయ్యగారి నస పి.య్యే బల్లిశాస్త్ర పరీక్ష కూడా బలవంతంగా చేయిస్తాడు. గ్రహణం బాలేదు. వచ్చింది గ్రహణం పూట.  కాబట్టి నైటు దాకా వెయిటింగులో పెట్టి తలవాకిట్లో పళ్లెం  పెట్టి రోకలి నిలబెట్టమనే టెట్టా  తలపెట్టచ్చు.


ఎదుటి పక్షం అభ్యర్థి ఎన్నికలల్లో నామినేషన్లెయ్యడమే కురుక్షేత్ర యుద్ధంలో తలదూర్చినంత ఘోరంగా ఉందే ఇప్పటి పరిస్థితి! గెలుపు మాట ఆనక, ముందు మన వేలైనా ఓటు మిషను మీట మీద పడనిస్తుందో లేదో.. పాడు రాజకీయం! ప్రచారాలు మాత్రం? ఓటెయ్యమని అడిగేందుకు పంచ ముందు కెళ్లి నిలబడ్డం ఆలస్యం. పింఛన్లు పెంచు, కోకలు పంచు, పంచెలు ఇప్పించంటూ ఒహటే దంచుళ్లు! ఓటర్లతో ఓ మంచీ చెడూ చెప్పుకోడాలిప్పుడు మరీ ఓల్డ్ ఫ్యాషన్సయిపోయాయ్! ఓట్ మేటర్ అంటే ఓన్లీ మనీ మేటర్! అసలే కరోనా రోజులు కూడా! కనబడ్డ కుంకెవరైనా  కరచాలనం వంకన కక్ష కొద్దీ ఏ మాయదారి రోగమో వంటికి తగిలిస్తే? నిలబడ్డం మాట అటుంచి ఓటేయడానికైనా వచ్చే ఎన్నికల దాకా శాల్తీ మిగిలే ఛాన్సుంటుందో ఉండదో! ఎన్నికల్లో నిలబడ్డానికి ఎన్ని తిప్పలురా ద్యావుడా! 


ఆ మాటకొస్తే ముందు ముందు జరగబోయేది ముందుగానే తెలిస్తే యెస్ బ్యాంకు తుస్సు మంటుందని ముందే ఎందుకయ్యా ఏ జ్యోతిష్కుడూ నోరు తెరిచిందిలేదు? సి.యం పదవి హుళక్కేనని ముందే ఏ న్యూమరాలజిస్టయినా సింథియా  చెవిన చేరేసుంటే  అంత లావున ఎం.పీ లో కాంగీల గుంపు గెలుపుకోసం  కిందా మీదా పడునా? నిజంగా జరిగేది నిఖార్సుగా చెప్పేదుంటే నిర్భయ నిందులందరికి ఉరిశిక్ష ఎప్పుడో నిర్భయంగా ఇప్పుడైనా చెప్పమనండి.. చూతాం! 


గీత దాటిన శాసనసభ్యుల పైన వేటు పడే సుముహూర్తం ఎప్పుడో ఎవరికీ అంతుబట్టదు. ఆ గుట్టేదో విప్పమనండి!


పండించిన పంటకు మంచి రేటు పలికేది ఎన్నడో ముందే తెలిస్తే కష్టపడైనా సరుకును దాచుకుని నష్టపోడుగా పాపం అన్నదాత! నైరుతీ రుతు పవనాల రాక ఇదీ అని నిక్కచ్చిగా తేలితే ముందుగానే దుక్కి దున్ని విత్తులు జల్లి నెత్తికి చేతులు తెచ్చుకునే దుస్థితి తప్పునుగా చిన్నరైతుకి! వాయుగుండాలు తీరం దాటే తీరు అంతుబట్టక తలలు పట్టుకుంటున్నారు పెద్ద పెద్ద వాతావరణ శాస్త్రవేత్తలు. సదరు నివుణులందరికీ జ్యోతిషంలో గానీ ఘట్టి తర్ఫీదిప్పిస్తే దేశాన్నీ, జనాన్నీ వరదల బెడద నుంచీ తప్పించిన్నట్లవుతుంది కదా! 


ఏ సర్కారీ చాకిరీ ముఖాన ఎప్పుడు రాసుందో ముందే ముఖం మీది రాతలు చదివే పండిత ప్రకాండులెవరైనా చదివి చెపితే ఇన్నేసి సెట్లతో విద్యార్థులకు పట్టే కుస్తీపట్లు తప్పును కదా! 


సూపర్ సక్సెస్ ఫార్ములా ముందే ఫిక్సైపోయుంటే చిన్న నిర్మాతలిలా తలలు తాకట్టు పెట్టుకుని మరీ చెత్త చిత్రాలు పోగేసే రొష్టు తప్పుతుంది కదా? పసిడి ధర ఇదిగిదిగో పడిపోయింది. గ్యాసు ధర అదిగదిగో అంతర్జాతీయంగా ఎక్కడికో ఎగిరిపోతోందంటో పచ్చడి మెతుకుల కూటిక్కూడా తడుముకునే బడుగుజీవిని కంగారు పెట్టేస్తున్నాయ్ బంగారం కొట్లు, పెట్రోలు బంకులు! బంగారంలాంటి జీవితాలు వాటి చుట్టూతా గింగిర్మ కొట్టకుండా కాపాడవచ్చు కదా కాలజ్ఞానం పైన అంత అపారమైన అవగాహనవుండే నవీన బ్రహ్మంగారుఅలా నోరు తెరిచి లీలలు బోధిస్తే! 


ఏ అపరాల ధర ఎప్పుడు ఎంత వరకు పెరుగుతుందో.. స్టాకు బజార్లలో ఏ షేరు ధర ఏ క్షణంలో ఎంత కుంగనుందో.. ముందే కనిపెట్టేసి ఓ ఉగాది పంచాంగం లాంటిది రిలీజు చేసేస్తే.. కన్రెప్ప  కొట్టే లోపల ఇట్లా  లక్షలూ కోట్లు ఆవిరయిపోడాలుండవు కదా! 


దాంతాడు తెగా.. ఒక్క నోస్టర్ డ్యాము నోరూ అడ్వాన్సుగా పెకిలి చావదు ! సరి కదా.. తీరా తాడు తెగి బక్కెట బావిలో పడిన తరువాతనా.. ఇదిగిదిగో.. ఇలా జరుగుతుందనేగా మేం ముందే కనిపెట్టి ఘోషెట్టిందీ' ! అంటూ టీవీ పెట్టెల  ముందు చిందులు!


లావు లావు ' లా ' వుస్తకాలు.. అవీ ఇవీ.. చదివి ఐయ్యే యస్సులు ఐపీయెస్సులూ ఐపోయే సార్లు, దొరసాన్లు ఇంకాస్త మనసు పెట్టి ఆ కాస్త బల్లి శాస్త్రమో, పాదసాముద్రికమో కూడా ఔపోసన పట్టేస్తారు గదా  నిఖార్సైన ప్రభావమంటూ నిజంగా పరాశాస్త్రలకు  ఉండుంటే! 


వాస్తవేమిటంటే.. వాస్తు వసతి కోసమని ఎన్నడో ఏర్పాటైన ఓ చిన్న నిర్మాణశాస్త్రం. గుహల నుంచి కాంక్రీటు గృహాల దాకా ఎదిగిన మనం ఇంకా ఆ ఆకు కుటీరం నాటి అవసరాలను తీర్చిన పాత నియమ నిబంధనల చూర్లు పట్టుకు వదలమంటే . . మానవ వికాస నిర్మాణం ముందు ముందు మరింత విస్తరించడం ఎట్లా? వరాహ మిహిరుడి వాస్తు ప్రకారం మహానగరాలల్లో కాని నిర్మాణాలు సాగిస్తే ఇరుగింటి మురుగు పారేది పొరుగింటి పడక గది కిందనే! మయామాతా, మానసారా.. ఎవరి వాస్తు శాస్త్రాలు వాళ్లవి. వాటిలో వాటికే ఏకీభావం లేని శాస్త్రాలతో నేటి నాగరిక మానవుడు ఏకీభవించడం సాధ్యమవుతుందా? వీరేశలింగం పంతులుగారు అమావాస్యనాడు ఉద్యోగంలో చేరి మహోపాధ్యాయుడిగా కీర్తి గడించారు. సురవరం సుధాకరరెడ్డి రెండువేల నాలుగు నాటి ఎన్నికల్లో రాహుకాలంలో నామినేషన్ వేసి మరీ ఎం.పీగా ఎన్నికయారు!


నాడీ జ్యోతిషం వేదవిజ్ఞానం కాదు. నాలుగో శతాబ్దందాకా వేదాలలో వాస్తు ప్రస్తావనే లేదు. ఎన్ని వేద సంహితలలో  భూతద్దం పెట్టి వెతికినా సంఖ్యాశాస్త్రం కనిపించదు. మనిషి వస్త్రలాభం, వాహన యోగం గోడ మీది బల్లి కాదు  నిగ్గుతేల్చేది! సిల్లీ! కుళ్లు బుద్ధులతో మనం అనుక్షణం కొట్టుకుచస్తూ ఆ కలహాలకి కారణం పురుగుల్నేరుకుని తినే గోడ మీది బల్లి మీదకు తోసెయ్యడం దారుణం! 


ఈ సారి ఇంకేదో మూడు కాళ్ళ కప్ప బొమ్మ పట్టుకుని నవ్వుతో బైటికొచ్చాడు. పి. య్యేసారు. 


చైనా వాస్తు ఫెంగ్-షూయి ప్రకారం మూడు కాళ్ల కప్ప గుమ్మం ముందు కూర్చున్నట్లుంటేనే ఇంటి యజమానికి మనోసిద్ధి ప్రాప్తిరస్తంట! 


ఇట్లాగే ఇంకా ఏవేవో శాస్త్ర మర్మాలు చాలా విప్పి చెప్పే  ఉత్సాహంలో ఉన్నాడీ ముసలయ్యగారి పర్శనల్ అసిస్టెంట్! 


కానీ నా మానసికస్థితి అప్పటికే ఒక గట్టి స్థితప్రజ్ఞతను సాధించింది. మూడు కాళ్ల కప్పతో సహా గిరుక్కున వెనక్కి తిరిగి వచ్చేసా. 


" అష్టమి, మంగళవారం, ఆ పైన గ్రహణం. బయల్దేరిందేమో రాహుకాలం.. అదీ వర్జ్యం వదలక ముందే! ఎదురుగా వచ్చిందేమో నల్ల పిల్లి! కాస్త కూర్చుని నెత్తి మీదిన్ని నీళ్ళు జల్లుకుని పోవయ్యా మగడా! అన్నా! పరగడువున బల్లి భుజం మీద పడ్డప్పుడే అనుకున్నాలే, ఇవాళేదో ముదనష్టం ముహాన రాసిపెట్టుందని! " అంటూ తగులుకుంది ఇంట్లో మా ఆవిడ. 


రక రకాల శాస్త్రపరీక్షలకూ, కొన్ని నివేదికలకూ, ఇదిగో ఈ మూడుకాళ్ళ కప్ప బాపతు దిష్టిబొమ్మలు గట్రాలు మరికొన్నింటికి.. అంతా కలసి ముసలయ్యగారి పి.య్యేమనిషి నా దగ్గర పళ్ళూడగొట్టి రాల్చుకున్నవి అక్షరాలా అర్థ పదివేల నూటపదహార్లు! వాటిగురించే ఆవిడ షష్టాష్టకాలు! 


సొమ్ముపోతే పోయిందిలేవయ్యా! ఆ వార్డు మెంబరూ వద్దు.. పాడూ మనకొద్దు! ఏ పని చేసేది అయినా ఆదాయం కోసమేగా! ఇంచక్కా నువ్వూ ఆ చైనా వాస్తు బొమ్మలు అమ్మే దుకాణం మొదలెట్టు అనేసింది ఆవిడే మర్నాడు వాతావరణం   కాస్త చల్లబడి మెదడు మంత్రం ఆడటం మొదలయ్యాక! 


- కర్లపాలెం  హనుమంతరావు 

03 -4 -



Saturday, December 4, 2021

చిల్లర మల్లర మంచితనం - కర్లపాలెం హనుమంతరావు ( సూర్య దినపత్రిక - సంపాదకీయ పుట ప్రచురితం )

 



హాస్యం - సూర్య దినపత్రిక 

చిల్లర మల్లర మంచితనం

- కర్లపాలెం హనుమంతరావు 

( సూర్య దినపత్రిక - సంపాదకీయ పుట ప్రచురితం ) 




ఏ రకంవో గానీ.. మొత్తానికి ఏవో రకం ఎన్నికలకు నగారా మోగేందుకు వాతావరణం సిద్ధమవుతుంది! మా పార్టీ ఆంతరంగిక సమావేశాల్లో పై స్థాయి పెద్దలు పనుపున  వచ్చిన  చిన్నస్థాయి పెద్దలు  మా బుల్లిస్థాయి పెద్దలనందర్నీ హెచ్చరించడం కూడా అయిపోయింది. ఈ సారి 'ఏం చేసైనా సరే'.. పార్టీ అభ్యర్థుల్ని ఆయా ప్రాంతీయ బాధ్యులే  గెలిపించి తీరాలంట!

‘ఏం చేయించడానికైనా' మేం సిద్ధంగా ఉంటే సరా? ఏమైనా చేసేందుకు మా కార్యకర్తలూ  సిద్ధంగా ఉండాలి కదా! అసలు కార్యకర్తలు మిగిలుండాలి కదా? ఖర్మ!

అధికారంలో లేనప్పుడు జెండాలు భుజం దించకుండా.. సొంత సొమ్ము తగలేసుకొని మరీ ఊరేగినోళ్లను.. పార్టీ అధికారంలోకి వచ్చినాక.. పులుసులోని ముక్కల్లాగా పక్కన పెట్టింది. అలిగి పక్క పార్టీల్లోకి గెంతేసారంతా. ‘చుక్క.. ముక్క.. ఏర్పాట్లు ఆ పక్క పార్టీల కన్నా ఇంకాస్త  మెరుగ్గానే చూస్తాం. మాతృపక్షంలోకి రమ్మ’ని  హామీ ఇమ్మంటున్నారు మమ్మల్ని. హామీలు  నమ్మి గోదాట్లోకి దూకే రోజులన్నా ఇవి? అవతల పార్టీలు.. పాపం..  పదవుల్లో లేకపోయినా ఆప్పో సప్పో చేసి మమ్మల్నింతకాలం మేపుతున్నది ఈ ఎన్నికల కోసమే కదా!  మళ్లా వాళ్లకీ వెన్నుపోటంటే బాగుంటుందా?' అని సుద్దులు చెబుతున్నారు పాత కార్యకర్తలు. ఇహ వాళ్ల వైపు నుంచి ఇదివరకట్లా సభల్లో చెప్పులు, ప్రచారంలో సిరాలు, కేన్వాయీల కడ్డంగా పడుకోడాల్లాంటి  అల్లర్లు   కల్లో మాటే మా పార్టీ వరకు. 

ఈ మధ్య యోగాగురువులు, స్వాములార్లు, వ్యక్తిత్వ వికాస పాఠాలు మప్పి పోయేవాళ్ల సేవలు ముమ్మరించాయి అన్ని పార్టీల్లో. అల్లరి కార్యకర్తలకు ఎక్కళ్లేని కరువొచ్చింది అందుకే. చిల్లర పన్లేవీ చెయ్యకుండా ఎన్నికలు నెట్టుకొచ్చేందుకు  మనమింకా సంపూర్ణ రామరాజ్యంలోకి రాలేదు కదా! 

మేం ఎన్నికల్లో నిలబడ్డప్పుడు ఏ పెద్దమనిషి నుంచైనా మాటవరసకు    ఒక్క  మాట సాయం అందిదా? పార్టీ పోస్టర్లనుంచి.. ఎగస్పార్టీ అభ్యర్థుల ఊరేగింపుల మీద వేయించే రాళ్లూ రప్పా వరకు అన్ని తిప్పలూ మేమే పడ్డాం. ఎన్నికల సంఘం లెక్కలడిగినప్పుడు ఎన్ని యాతనలు పడ్డామో పరమాత్ముడికే తెలుసు. అప్పుడూ మాకే బిల్లు. ఇప్పుడూ మా పర్సులకే చిల్లు! 


గతం గుర్తుచేసుకుని కుళ్ళుతూ కూర్చుంటే  భవిష్యత్తుండని పాపిష్టిది ఈ  పొలిటికల్ ఫీల్డు.

 రాహుల్ బాబును చూసి గుండె నిబ్బరం చేసుకోవడమేగానీ.. నిజానికి ఇంట్లో కూడా చెప్పకుండా సెలవు చీటీ పారేసి ఇంచక్కా ఏ స్విండ్జర్లాండుకో చెక్కాలనిపిస్తుందప్పా! 

నిలబెట్టిన వాడ్ని గెలిపించే బాధ్యత అడక్కుండానే అంటగడుతున్నాయి. సరేనయ్యా.. అది అధిష్ఠానాల హక్కు! లోకల్ ఎన్నికలప్పుడు  సిగ్గిడిచి కాళ్ళూ గడ్డాలు పుచ్చుకున్నా  కోరుకున్న కొడుకూ అల్లుళ్లకు టిక్కెట్లేమన్నా దక్కాయా?   ఎక్కడెక్కణ్నుంచో గాలించి మరీ  నిజాయితీలో నిఖార్సులంటూ  నిలబెడతారంట ఇక్కడ!  గెలిపించి తీరాల్సిన పూచీ  మా నెత్తికి చుట్టేట్లున్నారు!   

అతి నిజాయితీ,  నీతికి ప్రాణమిచ్చే పిచ్చిబుద్ధి.. ఏం చేసుకోనబ్బా ఈ పుచ్చు రాజకీయాల్లో? ఓటరుకే మాత్రం  సంబంధం లేని   మేధావుల గుంపును  గెలిపించే పూచీ మా నెత్తికి  రుద్దితే.. గట్టెక్కించడం అంత తేలికా?

అవతల పార్టీల్నుంచి కాలు దువ్వేది  గుత్తేదార్లు, పారిశ్రామికవేత్తలు, కొలువుల్లో ఉన్నప్పుడు  చేయరానివి, చెప్పకూడనివి ఎన్నో చేసి  మీడియా  పుణ్యమా అని ప్రజాసేవకుల జాబితాలో దూరేసిన దొరలు.  నీతివంతుడన్న చెడ్డ పేరు వచ్చి పడ్డాక ఎంత పెద్దమనిషినైనా    ఎన్నికల గుండం నుంచి బైటపడేయడం ఎంత కష్టం?

మూడొంతులు పైగా  వేలి ముద్దరగాళ్లే గట్టి బలగంగా గల మా  ఇలాకాలో విదేశాల్లో చదువుకొన్న  విద్యావేత్తను గట్టెక్కించడం కంటే  వరద పొంగులో నిండు గోదారికి ఎదురీదుకొంటూ వెళ్ళి కొట్టుకు పోయే గాడిదను గట్టుకు ఈడ్చడం సులువు.  గట్టెక్కడానికి  సొంతంగానే గజీత రానక్కర్లేదు. చిల్లర మోతగాళ్లున్నా చాలని మా పార్టీ పెద్దల ఉద్బోధ. నిజమే కానీ మోసే చిల్లరగాళ్లకే ఎక్కళ్ళేని కరవొచ్చి పడిందిక్కడ మా పార్టీలో. ఆ ఉపద్రవం  పసిగట్టినట్లు లేదు పార్టీ పెద్దలు.

అభ్యర్థి వ్యక్తిగత జీవితం మరీ  అంత విశుద్ధంగా ఉంటే అదో పెద్ద ప్రారబ్దం. రేపు ఎన్నికై ఇలాకా మొత్తానికి మొదటి పెద్దమనిషి అయింతరువాత.. ఏ ప్రభుత్వ భూమీ  ఆక్రమించుకోడానికి ఒప్పుకోకుంటే! వివాదాలని ఏ విధంగా కూడా సెటిల్  చేయడానికి ‘నో’ అని మొండికి తిరిగితే! కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాలనుంచి వచ్చి పడే నిధుల్ని అచ్చంగా ఆయా పథకాలకే వెచ్చించాలని  పట్టుబడితే! ఎప్పట్నుంచో అనుభవిస్తున్న భోగాలు.. విద్యుత్ బిల్లులు.. నీళ్ల బిల్లులు, ఆస్తి పన్నులు.. వృత్తి పన్నుల ఎగ వేత.. వంటివన్నీ  తిరగదోడి తిరిగి కట్టించేదాకా కోర్టుల్లో పోరాటాలకు దిగిపోతానంటే! పార్కులు.. పాదచారుల  దారులు..  స్థలాల ఆక్రమణల కోసం అడ్డొస్తే.. చెట్టూ చేమనైనా  కొట్టేయక తప్పదు. నేర శిక్షాస్మృతిలో ఉన్న ప్రతీ సెక్షన్నూ తు. చ తప్పకుండా పాటించాల్సిందేనని పంతం పట్టుక్కూర్చుంటే!  ఆట స్థలాల్లేని పాఠశాలల.. రక్షణ వ్యవస్థలు పటిష్టంగా లేని  కార్యాలయాల.. నిబంధనల ప్రకారం వినియోగదారుల వాహనాలు నిలుకొనేందుకు జాగాలు   చూపించని వ్యాపార సంస్థల గుర్తింపు రద్దయేదాకా నిద్ర పోనంత చండశాసనుడైతే! శిరస్త్రాణాలు.. సీటు బెల్టులు.. పరిమితికి లోబడి మాత్రమే బండ్లు నడపమని హూంకరించడాలు.. మైనర్లకస్సలు వాహనాలు ఇవ్వద్దంటూ సుద్దులు రుద్దేయడాలు.. నిబంధనలకు మించి కాలుష్యాలు వెదజల్లే కార్ఖానాలు, వాహనాలు..  గట్రాలన్నింటికీ  లాకౌట్ తప్పదంటూ లాస్ట్ వార్నింగైనా లేకుండా  హుకూంలూ జారీ చేయిస్తే!   ఇష్టమొచ్చిన చోట మలమూత్ర విసర్జనలు.. బహిరంగ ధూమపానాలు.. బస్సుల్లో.. ఆఫీసుల్లో ఆడపాపలను వేపుకుతింటాలు.. కళాశాల ఆవరణల్లో రేగింగులు చేయడాలు.. పసిబిడ్డల చేత  నిబంధనలకు మించి మితిమీరి  పనులుచేయిచడాలు.. కట్టుకున్న దానిని, కన్న తల్లిదండ్రులను ఇంటా బయటా అమానుషంగా కొట్టి, కోసి హింసించడాలు, దొంగతనాలు, దొరబాబుల్లా కనిపించి మోసగించడాలు, రోడ్డు పక్కన మెగా సైజు అశ్లీషమైన పోస్టర్లు.. ప్రార్థనాలయాల్లో.. నిబంధనలు మించిన శబ్దాలతో ఆర్భాటలు  చెయ్యడాలు, ధర్మాసుపత్రి సిబ్బందులు  పెట్టే ఇబ్బందులు, సినిమా ధియేటర్లు, బస్టాండులు, రైల్వే స్టేషన్లలాంటి జనం సంచార ప్రదేశాలల్లో  బహిరంగంగా చేసే విశృంఖల  శృంగార వ్యాపారాలు,  దుకాణాల నుంచి అమ్ముడయిపోయే  తినుబండారాలలో మధ్యన మూడో కంటికి తెలీని డ్రగ్గు డోసులు, రైతు బజార్ల వంకతో జరిగే నిలువు దోపిడీలు.. పచ్చి పిందెలు ముందే  మగ్గాలని  కృత్రిమ  రసాయనాలు పిచ్చిగా వాడేయడాలు,  చట్టం అనుమతించిన పరిమితుల్లోనే ప్రజాజీవనం  ప్రశాంతంగా సాగిపోవాలని కోరుకొనే అభ్యర్థికి పాలనా పగ్గాలు ఒప్పగించేటంత అమాయక ఓటర్లు ఎక్కడుంటారండీ ఈ  కలికాలంలో! ఫేసు బుక్కుల్లో ఉబుసుపోక  రాసుకునే    చాదస్తపు రాతల్లో తప్ప! 

అందునా ఎదుటి పక్షం నుంచి తొడ చరుస్తున్న వస్తాదు..  ఎన్నో తరాల బట్టి ఇక్కడి ఎన్నికల గోదాలో నిలబడి ఎదురు లేకుండా గెలుపు సాధిస్తున్న వంశం నుంచి వచ్చిన గండరగండడు.  నియోజకవర్గం ఓటర్లలో అధిక శాతంగా   ఉన్న కులంనుంచే వచ్చిన అభ్యర్థిని ఏ కారణంతో కులం.. మతం.. దేవుడు.. దయ్యం.. లాంటి సెంటిమెంట్లేవీఁలేని అభ్యర్థికోసం నిరాకరిస్తారంట?

ఎన్నికలంటే ఓ నెలరోజులు మించి సాగని సంబడాలు. ఆ తరువాత? మంచికైనా.. చెడ్డకైనా  ఆదుకొనేదైనా.. అడ్డుకొనేదైనా ఎవరని కదా చూసుకొనేది జనం? అసాంఘిక శక్తుల ఆరాధ్య దైవాన్ని కాదని ఓ నిజాయితీ పరుడైన విదేశీ మేథస్సుగల స్వచ్ఛంద సేవా తత్పరుణ్ణి  ఏం భరోసా కల్పించి  గెలిపించడం నా బోటి బుల్లి పెద్ద?!

మా పార్టీ తరుఫున నిలబడ్డ మహా మేధావి ధరావతుకూడా గల్లంతయింది. 

ఓటమికి బాధ్యత వహిస్తూ నన్ను రాజీనామా చెయ్యమని  అధిష్ఠానం ఆదేశం.  

ఎన్నో లక్షలు పోసి, ఎంతో  శ్రమదమాదులకోర్చి గెల్చుకున్న ఎమ్మెల్యే సీటు.  

వదిలేసుకు పోవడం అంత తేలికా?  ఎదుటి పార్టీలోకి దూకేస్తే పస్తుతానికి  నా ప్రజా ప్రతినిధి సీటునైనా కాపాడుకోవచ్చు. 

రాజీ బేరాలు మొదలయ్యాయి. . చర్చలు చివరి అంచె దగ్గర కొచ్చి స్తంభించాయి. నా బేరానికి మరో అభ్యర్థి ఆడ్డురావడమే కారణం. 

ఆ అభ్యర్థి వేరెవరో అయితే ఈ కథే చెప్పక పోదును. ఎవరి మూలకంగా అయితే నేను రాజీనామా చేయాల్సొచ్చిందో.. ఆ స్వచ్ఛంద సేవా సంస్థల అధిపతి!

'మీ పార్టీ నన్ను ఎలాగూ గెలిపించలేక పోయింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో  ఈ పార్టీద్వారా నిలబడతాను. నా సంస్థల్ని కాపాడుకోడానికి ఈ 'వాల్ జంప్' తప్పడం లేదు. సారీ' అనేశాడు స్వం. సం. పెద్దమనిషి!

రాజకీయాల్లో ఏదైనా సంభవమే!  బిజెపిని గెలిపించినంత మాత్రాన ప్రశాంత కిశోర్ అచ్చంగా భాజపాకే ఎన్నికల సలహాదారుడిగా  మిగిలి పోయాడా? రాహుల్ గాంధీని కూడా గిలిపించేందుకు ఇటువైపుకు దూకాడా లేదా? మంచాల పథకంతో సంచలనాలు సృష్టించడం లా?! రాజకీయంగా  సలహాలిచ్చి   క్లెయింటుని గెలిపించే కన్సల్టెంటు ఉద్యోగం అతగాడిది. వృత్తిధర్మానికి ద్రోహం చేసే చిల్లర మనిషి కాదు. చిల్లర రాజకీయాలకు ఇలా   కాలం చెల్లిపోతుంటే.. ఇహ మా బోటి నిబద్దమైన అరాజకీయవాదులకు ఉపాధి దొరికేది ఎట్లా?!

 



- కర్లపాలెం హనుమంతరావు 

( సూర్య దినపత్రిక - సంపాదకీయ పుట ప్రచురితం ) 


మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...