మగువంటే మగవాడి మర-యంత్రమా?
- కర్లపాలెం హనుమంతరావు
( సూర్య దిన పత్రిక సంపాదకీయ పుట వ్యాసం)
చెయ్యగా చెయ్యగా పనుల్లో సులువు తెలుస్తుందన్నది లోక నుడి. మనుషులకే కాదు.. దేవుళ్లకూ ఈ సూత్రం వర్తిస్తుంది. 'విధినా తావభ్యస్తం యావద్స్పుష్టా మృగేక్షణా' అని ‘సుభాషిత రత్నమాల’ ముక్తాయించడానికి అదే కారణం. లావణ్యంతో ఓలలాడే లలనామణి సృష్టి కోసం లీలామానుషుడు ఎన్నో మగబొమ్మలను తయారుచేసాడన్నది ఈ శ్లోకం తాత్పర్యం. ఆడవాళ్లను అందుకే ఫెయిర్ సెక్స్ అనడం!
ఫెయిర్ నెస్ ఎతుంటే ఏం లాభం? చపల చిత్తం మగవాడి బుద్ధి ముందు స్థిత ప్రజ్ఞత పుష్కలంగా ఉన్నా స్త్రీ సునిశిత గ్రహణ శక్తి మొక్కవోతూనే ఉంది. సృష్టి ఆది నుంచి ఇదే బాధ. మగవాడు ఆవులించక ముందే మగువలు వాడి పేగులు లెక్కెట్టేస్తారు! ‘అందుకే ఆడదంటే మగవాడికంత బెదురు’ అన్నారు హిల్లరీ క్లింటన్ ఓ సందర్భంలో! అబలగా అన్నింటా మగవాడు చిన్నబుచ్చే ఆడది నిజానికి జగద్గురు శ్రీ శంకరాచార్యుని భాష్యం ప్రకారం అపర పరాశక్తి.. అతిలోక సుందరి శ్రీ లలితాదేవి.. కూడా!
పరమేశ్వరి అనే పదానికి పరమార్థమేదో బుర్రకు తట్టక ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ అంటూ తనకు తానే సర్దిచెప్పుకునే ‘బుద్ధి’తక్కువ శాల్తీ మగవాడు. అయ్యగారి దృష్టిలో ముద్దరాలు అంటే ముద్దుపళని రాధికాసాంత్వనం మార్కు రాధాదేవి. ‘కంటికి నిద్ర రాదు, విను, కాంతుని బాసిన నాటినుండియున్/వంటక మింపు గాదు..’ టైపు విరహబాధలు తెగ పడిపోయే అష్ట శృంగార నాయికల్లో సందర్భాన్ని బట్టి ఎవరో ఒకర్తె. అందుకే ఆమెను అందాల భరిణ అంటూ ఉన్నవీ లేనివీ ఊరికే ఊహించుకుని మరీ ‘కురులకు వందనములు తెలి గోము మొగంబునకున్ జోహారు, నీ/ యరుదగు కంబు గంఠమున కంజలి, నీ కుచ కుంభాళికిన్/ కరముల్ మోడ్చెదన్, బెళుకు క్రౌనుకు మ్రొక్కెద, బంచబాణ మం/దిరములకున్ సతీమణి! పదింబదిగా పదివేల దండముల్' అంటూ దండకాలు రాసుకునేది. నడివయసు దాటినా మిడిమేళపు కవిత్వంతో సడీ సప్పుడు లేకుండా తన మానాన తాను తన పని తాను చూసుకునిపోయే చానను కూడా సామాజిక మాధ్యమ వేదికల మీద కీడ్చి కీచకుడికి మించి రచ్చ చేసేది మగవాడే. కేస్టింగ్ కౌచ్ లు ఉన్నంత వరకు విరుగుడు తంత్రంగా ‘మీ.. టూ’ లు పుట్టుకురాక తప్పదు.
నిజానికి మహిళ ఏనాడూ ‘వాల్మీకి రామాయణం’ పట్టించుకోకుండా వదిలెట్టేసిన ఊర్మిళమ్మలా ఊరికే పడి నిద్రపోయిందిలేదు. అర్జనుడి రాక ముందు నుంచే రాజ్యం దర్జాగా నడిపించిన ప్రమీల ప్రజ్ఞే ప్రమదలది ఎప్పుడూ. నేటి లోకవ్యవహారం కూడా ఆ తీరులోనే తరుణుల ఆధ్వర్యంలో సాగుతుంటే ఇప్పుడీ మహిళా దినోత్సవాలు గట్రా అంటూ ఆర్భాటాల అక్కరే ఉండేది కాదు.
15వ శతాబ్దంలో ఇండియా పర్యటనకని వచ్చిన నికోలో కోంటీ అప్పటి హిందూ రాజ్యాలలో భర్త చనిపోయిన భర్తతో బతికున్న భార్యనూ చితి పైకి ఎక్కించడం చూసి విస్తుపోయాడు. ఆ కాల్చడాలు అవీ ప్రత్యక్షంగా ఇప్పుడు కనిపించవు. కానీ.. కడుపులో పడ్డ మరుక్షణం నుంచి కాటిచితిలో పడే ఘడియ వరకు ఏదో ఓ దుర్మార్గపు రూపంలో ఆడాళ్లను కాల్చుకు తినడాలు మాత్రం తప్పడంలేదు ఇప్పుడు కూడానూ!
వేదాల కాలంలో స్త్రీ పురుషులిద్దరిలో గొప్ప ఎవరన్న వాదమే వినిపించింది కాదు. జనకుడి విద్వత్మహాసభలో గొప్ప తర్కతో తనను తలకిందులు చేసినప్పుడు మహాజ్ఞాని యాజ్ఞవల్క్య మహర్షి మొహమాటం లేకుండా మైత్రేయి ముందు మోకరిల్లినట్లు మనకు కథలున్నాయి. ఎప్పుడు రాజుకుందో గాని ‘అహం’ అనే ఈ నిప్పు రవ్వ.. ఇప్పటి మగవాడి మనస్సులో ‘అహం బ్రహ్మోస్మి’ అన్న అగ్నిని తెగ ఎగదోసేస్తోంది. మగవాడి ఆధిపత్య జ్వాలలకు సుకుమారమైన బతుకులు ఎన్నెన్ని కాలి బూడిదయిపోతున్నాయో ప్రతీ రోజూ! మరి ఉద్యమం వద్దంటే ముద్దరాలు మొద్దులా ఓ మూల పడివుంటుందా?
సృష్టిధర్మ రీత్యా పురుషుడి దేహం స్త్రీ శరీరం కన్న దృఢం అయితే కావచ్చును. అంత మాత్రం చేతనే అన్నింటా అతగాడు అధికుడు ఐపోతాడా? నాగరికత ఆరంభ యుగాలలో ఆడదే కుటుంబానికంతటికీ తిరుగులేని పెద్ద. పితృస్వామ్యవాదం బలిసి పెత్తనం రుచి మరిగిన తరువాత మగవాడో మహారాజు.. ఆడది అతగాడి ఇష్టారాజ్యానికి ఆడి పాడే మరబొమ్మగా మారిపోవడం.
బాల్యం నుంచే బాలికల ఊహలు మహా సునిశితంగా సాగుతుంటాయంటారు. తన మొద్దు బుర్రకు అందని ఊహల ఆడదాని చేతిలో ఓటమి అంటే ఊహూఁ మగవాడికి మరి మండదా! సాటి మగవాళ్లల్లోఎంత నామర్దా! అందుకే అడ్డదారుల్లో అయినా ఆడదానిని మగవాడు లొంగదీసుకునేది. కానీ ఆడదాని మనసు ఊరుకుంటుందా? ‘జీవితమనే మాయాజూదంలో మగవాడిదేనా ఎప్పుడూ గెలుపు?/ అంటే ఖాయంగా అది కనిపించని శకుని విసిరే పాచికల ఆటే’ అనుకుంటుంది ప్రముఖ తమిళ స్త్రీవాద రచయిత్రి ఉమా నారాయణ్ ‘కల్చరల్ డిస్లొకేషన్స్: ఐడెంటిటీసి, ట్రెడిషన్స్ అండ్ థర్డ్ వరల్డ్ ఫెమినిజమ్ ‘ చదివిన తరువాత.
వాస్తవానికి మానవ జీవనకావ్యంలో స్త్రీ పురుషులిద్దరూ రఘువంశ కర్త కాళిదాసు బాషలో చెప్పాలంటే వాగర్థాలు! ఆదిదంపతులకు మల్లే వాళ్లిద్దరూ చెరో సగంగా సమన్వయంతో నిభాయిస్తే తప్ప జగత్ అనే ఈ మహారథం సక్రమంగా ముందుకు సాగదు! 'న శివేన వినా దేవీ, న దేవ్యాచ వినా శివః' ! అమ్మ లేకపోతే అయ్య లేడు. అయ్య లేని పక్షంలో ‘అమ్మ’ ఉండదు. వేటూరివారి పాటలో ఇంకా వివరంగా చెప్పాలంటే మానవ జీవితం ‘నర నారీ సంగమ మృదంగం/ గంగమ జంగమ సంగీతం’. ‘ఆమె’ ధరకు జారిన శివగంగ తరంగం. ఆడది అంటే ఇహ చిన్నచూపు ఎందుకో మగవాడికి?
తరతరాల వెలుగు తాలుపులైనా, తరుగెరుగని ఇలవేలుపులైనా నేల మీదకు కాలు మోపే ముందు ఓ అమ్మ కడుపులోనే ముందు నునుపు తేలేది! లోకాదర్శ జీవనుడు శ్రీరామచంద్రుడు భూమ్మీదకు అవతరించింది కౌసల్యామాత గర్భంలో నవ మాసాలు రూపుదిద్దుకున్న తరువాత మాత్రమే! స్త్రీ జన్మ మహిమ రహస్యం ఆ త్రిశంకు స్వర్గ ద్రష్ట విశ్వామిత్రుల దృష్టి దాటక పోబట్టే బాలరామయ్యను మేలుకొలుపుతూ సుప్రజా రాముడి కన్న ముందు ‘కౌసల్య’ మాతను తలుచుకున్నది. అమ్మ కడుపు చల్లంగా ఉన్నంత కాలమే ఏ అయ్యల కలలైనా నిండుగా పండేది. మగాడు ఈ సింపుల్ లాజిక్ మరుగున పెడుతున్నందు వల్లనే స్త్రీలోకంలో ఇంతలా అల్లకల్లోలం.
కోవెల వంటిదీ లోకం అన్నది కోమలి కోమల భావన. కానీ ‘మగవాడి దృష్టిలో ఆమె తనువుకు మాత్రమే ఓ వెల! తాను కని పెంచిన మగవాడే తన పాలిట సైతానుగా మారుతున్నందుకు ఆ మాత వెత. ఆ కలత వల్లనే నెలతలంతా 'ఏ జన్మకీ స్త్రీ జన్మ నీ కొద్దు నా చిట్టి తల్లీ!' అంటూ అంతలా తల్లడిల్లిపోతున్నది అప్పుడూ.. ఇప్పుడు కూడా!
భారతీయుల దృష్టిలో ఆడవాళ్లకు ఉండే పూజ్యభావన ఎంత గొప్పగా ఉంటుందో చెప్పడానికని ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః’ అంటూ ఎప్పుడూ ఒకే శ్లోకాన్ని వల్లెవేస్తాడు బడుద్ధాయి మగవాడు. వేదాలల్లో స్త్రీని దేవతలుగా చూపించడమూ, విద్య, ధన, ధైర్యాలకు స్త్రీలనే దేవతామూర్తులుగా చిత్రీకరించుకోవడమూ మహా బడాయిగా ఎత్తిచూపిస్తాడు కూడాను. రామాయణంలో రావణాసురుడి కన్న ముందు రాముడిని కష్టాల పాల్చేసింది ఆడవాళ్లే.. కైకేయి, మందర, శూర్పణఖ.. అంటూ తన చిన్ని బుద్ధికి తోచిన కుతర్కం ప్రదర్శిస్తాడు కూడాను!మరి కాస్త కావ్య శాస్త్రజ్ఞానం వంటబట్టి ఉంటే ప్రబంధాల నుంచి కూడా ఎంచుకున్న పద్యాలతో లెక్చర్లు దంచికొట్టచ్చు. ‘సుబ్బరంగా చదువుకోవడానికని వచ్చిన పిల్లోడు చంద్రుడిని చెడగొట్టింది తార అనే స్త్రీనే కదా! కృష్టుణ్ని అష్టకష్టాల పాల్చేసిన దుష్టజాతిలో పూతన వంటి స్త్రీ జాతి పాత్రా ఎంతో కొంత ఉంది కదా! ఆడజాతి అంతా పులుకడిగిన ముత్యాలల్లే బిల్డప్పులు ఇస్తే ఎట్లా? ఏదో ప్రకృతిని చూసి పరవశించిపోదామని వచ్చిన పిచ్చి బ్రాహ్మడు ప్రవరాఖ్యుడిని వరూధిని వశం చేసుకోడానికి అంతలా వేపుకుని తినాలా? ఆవటా అంటూ అంటూ- సొంటూ లేని శుంఠ ప్రశ్నలు లేవదీస్తాడు. జరిగాయో జరగలేదో, జరిగితే ఎంత వరకు నిజంగా నిజాలే ప్రచారంలోకి వచ్చాయో.. ఇతమిత్థంగా నిర్థారణ కాని కట్టు కథలను పట్టుకుని కొట్టుకు చావడం తప్పించి.. వర్తమానం కట్టెదుట ఆడదానికి అన్ని మతాలలో వాస్తవంగా జరుగుతున్న అన్యాయం గురించి నోరు విప్పడు!
కామసూత్రాలను శాస్త్రీకరించి బహిరంగంగా ప్రబోధించినందుకు మహానుభావుడని మనం నెత్తికెత్తుకుంటున్న వాత్సాయనుడు.. ఆయన అదే కామకళల్లో భర్తల పెత్తనాన్ని ఎట్లా భార్యలు చచ్చినట్లు ఒప్పుకుతీరాలో ఉదాహరణలతో సహా నొక్కి చెప్పిన నిజం ఎవరికీ చెప్పరు ఈ మగవాళ్లు. భర్త తినకుండా భార్య తింటే దోషమన్న దుర్మార్గపు సిద్ధాంతం మొదట లేవదీసిన రుషి ఆ మహాశయుడే! దాన ధర్మాల నుంచి ఏ ఇంటి పని (వంట పని తప్పించి) వరకైనా స్వతంత్రించి చేసుకునే హక్కు ఆమెకు చరిత్రలో ఏ దశలోనూ దఖలు పడిందిలేదు . ఒక్క భర్తనే కాదు భర్త బంధువులను, మిత్రులను, ముఖపరిచయస్తులనయినా సరే ఇంటికి వచ్చినప్పుడు నెత్తిన పెట్టుకు సకల సపర్యలతో ఒప్పించని పక్షంలో ఆమె ఉత్తమమైన ఇల్లాలు కానేరదు కదా.. కొండొకచో శాపతాపాలకూ గురి అయిన కథలూ పురాణాలలో బొచ్చెడున్నాయ్. వాటి ప్రస్తావన ఏ మగవాడూ చెయ్యడు. భర్త మోజుపడి మరో వివాహం చేసుకున్నా .. వివాహం కుదరని పక్షంలో ఇంటికే తెచ్చేసుకుంటే ఆ సవతితో సఖ్యంగా ఉండాలి తప్పించి కయ్యానికి కాలుదువ్వే సాహసం ధర్మపత్ని అయినా చేసిన పక్షంలో పుణ్యస్త్రీ వంటి బిరుదులన్నీ వెనక్కి పీక్కోబడతాయని బెదిరింపులు ఈ తరహా మొగవాళ్ల నుంచే!
ప్రపంచంలోని అతి పెద్ద మతం క్రైస్తవానికి సైతం స్త్రీ పట్ల బొత్తిగా సదుద్దేశం లేదు. 'స్త్రీ పుట్టుకతోనే పాపి. పాపహేతువు. కేవలం పురుషుడి సుఖ సంతోషాలే ఆ నీచ ప్రాణి సృష్టి పరమార్థం. స్త్రీని బానిసగా దేవుని వాక్యం భావించిన దానికి ఏ మాత్రం తిసిపోని విధంగా పురుషుడి అన్ని కష్టాలకు మూలకారణం క్రైస్తవంలో లాగా ఇస్లాం మతమూ గాఢంగా విశ్వసించింది.
స్త్రీకి బురఖా ఇస్లాం ప్రసాదమే! ప్రార్థనాలయాల ప్రవేశం ఆమెకు నిషిద్ధం. భర్త కోరితే సంగమానికి సిద్ధం కాకపోవడం పాపహేతువు. ఎంత వయసు వచ్చినా భార్యను శిక్షించే హక్కు భర్తకు ధారాదత్తం చేసింది ఇస్లాం మతం. భర్త తలాడించకుండా తనకు పుట్టిన బిడ్డకు అయినా సరే పాలిచ్చే అధికారం భార్యకు కల్పించింది కాదీ మతం. విడిపోయినా సరే భర్త అనుమతి తప్పనిసరి అనడం కన్నా ఘోరం ప్రపంచంలో మరొకటి ఉంటుందా?
ప్రపంచంలోని దాదాపు అన్ని మతాలలో స్త్రీలు వ్యామోహ కారకులు. వారి మీద సదా ఓ కన్నేసి ఉంచడం పురుషుల తప్పనిసరి బాధ్యతల్లో ఒకటి. ఆడవాళ్లు దున్నబడే భూములతో సమానం. భూముల మీదుండే హక్కు భుక్కుల నియమాలన్నీ స్త్రీలకీ వర్తిస్తాయి కొన్ని మతాలల్లో. లేబుల్ ఏదైనా, కాలం ఎప్పటిదైనా, ప్రాంతం ఎక్కడిదైనా, వైవిధ్యాలు, వైరుధ్యాలు, అంతర్వైరుధ్యాలు ఎన్ని ఉన్నా స్త్రీలకు అవ్యాయం చేసే అంశంలో అన్ని మతాలు అన్నదమ్ముల వలెనే సహకరించుకున్నాయి.. సహకరించుకుంటున్నాయి కూడా!
హోలీ బైబిల్ రెండో ఛాప్టర్ ప్రకారం నిద్ర పోయే మగాడి డొక్కలో నుంచి ఓ పక్కటెముక పీకి ది గ్రేట్ లార్డ్ గాడ్ సృష్టించబడినది ఆడజీవి. ఆ తరహా భావజాలమే మన ముత్తాతలది కూడా. మనువులాంటి మగ మహానుభావులంతా చేరి 'న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి' అంటూ సిద్ధాంతాలు చేయబట్టే మగవాడు ఆ చొప్పదంటు సూత్రాలను పట్టుకుని తోడు నీడుగా ఉందామని వచ్చే సాటి జీవి ఆడదానిని అన్ని ఆటలు ఆడిస్తున్నది! శేషం వేంకటకవి ‘శశాంక విజయం’లో కోరిక తీర్చమని తన దరి చేరిన గురుపత్ని తారతో ‘వికల చరిత్రు డైన, ముది వెంగలి యైన, గురూపి యైననున్, త్రికరణ శుద్ధిగా మగడె దేవు డటం చని నిశ్చయించి, యొండొక డెటువంటివా డయిన నొప్పదు కోరగ నింతి, కి’ అంటూ చంద్రుడు ద్వారా చెప్పిన నీతి సూక్తులన్న్నీ నిజానికి మగాడి మనసులో యుగాల బట్టి జెండా పాతుకుపోయి ఉన్నవే! ఆడదంటే ఒక్క తనువే అన్నట్లు మనువు లాంటి దుష్ట మేధావులు ఈ తరహా ధర్మపన్నాలు పదేపదే వల్లించడ వల్లనే ఆడవాళ్లకు ఏ దశ లోనూ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు బొత్తిగా లేకుండా పోయిందన్నది స్త్రీవాదుల మండిపాటు.
మరను, యంత్రాన్ని కనిపెట్టక ముందే ‘మర-మనిషి’ని కనిపెట్టింది ప్రపంచం. మగప్రపంచం కనిపెట్టిన ఆ మర-మనిషి పేరు ఆడది. ఆడదిగా పుట్టినందుకు, చీరె కట్టడం నేర్చిందాకా పుట్టింటికి గొడ్డులా చాకిరీ చేయడం, ఓ మగాడొచ్చి మెడలో పలుపు కట్టగానే తలొంచుకొని వెళ్లి అతగాడి వంశానికి జీతం బత్తెం లేని ఊడిగం ఎల్లకాలం చేసుకుంటూ పడివుండటం!' మల్లాది సుబ్బమ్మగారి వంటి స్త్రీ జనాభ్యుదయవాదులు పద్దాకా తిట్టిపోసేదీ మగవాడిని తమకు పగవాడిగా మారుస్తున్న ఈ తరహా పెడవాదనలను.. ఇప్పటికీ వాటిని గుడ్డిగా నమ్ముతూ కఠినంగా అమలుచేస్తూ, ముమ్మరంగా ప్రచారం చేసే మూఢమతులను!
'ఎంత రుచి ఆ నిషిద్ధ ఫలానికి/ ఎంత వడి ఆ విముక్త హృదయానికి' అంటారు సినారె విశ్వంభర ఖండకావ్యంలో నారీ నార సంగమ సుందర దృశ్యాన్ని అభివర్ణిస్తూ! ఇద్దరూ కలసి ఒకే తీరులో ఆనుభవించే ఆ సంగమ కార్యపు తీయని రుచి మగవాడికి ఒకానొక అనుభూతితో సరి. ఆడదానికి మాత్రం మంచి.. చెడు.. అనుభవాలన్నీ అక్కడి నుంచే మొదలు! గర్భం ధరించింది మొదలు ప్రసవం అయే వరకు కాబోయే అమ్మ పడే యాతనలేమిటో వాయుపురాణం తిరగేస్తే విశదంగా బోధపడుతుంది. ‘గర్భస్య ధారణే విషమే భూమి వర్త్ముని/ తస్య నిష్క్రమణార్థాయ , మాతృపిండం దదమ్యాహం' (గర్భం ధరించడమే కష్టం. ఎగుడు దిగుడు నేలల మీద నడవడం అందుకు అదనపు కష్టం. ఆ కష్టం కలిగించినందుకు నీ మాతృపిండాన్ని నేను నీకు నమస్కరిస్తున్నాను) అంటూ ఎదిగొచ్చిన తరువాత సంతానం తమ తల్లుల ముందు తోచిన విధంగా మోకరిల్లవచ్చు. తన బిడ్డ పుట్టుక కోసం యమద్వారం ముందుండే మహాఘోరమైన వైతరణీ నదినైనా తరించేందుకు సాహసించిన స్త్రీ అప్పట్లో నష్టపోయిన జీవితానుభవాలకు పరిహారం చెల్లించేదెవరూ?
భావుకతను రేకెత్తించే కవిత్వాలకేం గానీ.. వాస్తవంగా చూస్తే దేశంలోని స్త్రీ పురుష జనాభా నిష్పత్తి లెక్కలే ఆడవారి పట్ల మగజాతి ప్రదర్శించే ద్వంద్వవిలువల వ్యాపార దృక్పథాలకు వికృత ఉదాహరణలు. పుట్టాలంటేనే 'చావు గండం' నుండీ గట్టెక్కాల్సిన గడ్డు దుస్థితి ఒక్క ఆడ గుడ్డుకే ఈ గడ్డన ఇప్పటికీ! తప్పీ దారీ భూమ్మీద పడ్డా.. తప్పుదారిలో నడిచే మగప్రపంచాన్నుంచి ఎప్పటికప్పుడు తెలివిగా తప్పించుకునే దారులు దేవులాడుకోవడమే తప్పించి నేటికీ ఇంటా బైటా వయసుతో నిమిత్తం లేకుండా ఆడది ఎదుర్కోక తప్పని దైన్యస్థితులు ఎన్నెన్నో!
తన జీవితాన్ని తనకై తానుగా అచ్చంగా మగవాడి హక్కులతో సరిసమానంగా బతికే మంచి రోజులు ఆడదానికి ఎప్పుడు లభిస్తే అప్పుడే ఏటేటా జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు అంతిమ లక్ష్యానికి సార్థకత !
- కర్లపాలెం హనుమంతరావు
( సూర్య దిన పత్రిక సంపాదకీయ పుట వ్యాసం)
No comments:
Post a Comment