2020
హాస్యం :
ఇదీ ఓ ఆదాయ మార్గమే!
- కర్లపాలెం హనుమంతరావు
( సూర్య దినపత్రిక - సంపాదక పుట ప్రచురితం)
' రకరకాల ఎన్నికలు ముంచుకొస్తున్నాయి కదా! ఓ మూలట్లా మన్మోహన్ సింగులా కూర్చుంటే ఎట్లా? ఎంచక్కా పోయి ఓసారా ముసలయ్యగారిని కలిసి రారాదా! ' అని మా ఆవిడ నస.
వెళ్ళి కలిశాను ముసలయ్యగారిని. మనసులోని మాట పెదాల మీదకు రానే లేదు, పెద్దాయన చప్పట్లు కొట్టి పి.య్యేని పిలిచి నన్నప్పగించేశాడు.
' అయ్యగారికి ఇవాళ మౌన దీక్ష. స్పీకరు పని చెయ్యదు. మరీ ముఖ్యమైతే తప్ప రిసీవరూ బైటికి తియ్యరు. ఏమిటీ విషయం? అనడిగాడా పి.య్యే.
'మా వార్డు నెంబరు పదమూడుకి నిలబడదామనీ. ముసలయ్యగారి పార్టీ సహకారం కావాలి ' అన్నా టూకీగా.
' మరైతే వట్టి చేతులతో వచ్చారేంటండీ బాబూ! మీ జాతక చక్రం.. సూర్యమానం ప్రకారం వేసిందొకటి, చంద్రమానంతో కలిపిందొకటి తీసుకు రావాలి. గ్రహాలు, రాశులు.. వాటిని బట్టే అయ్యగారి అనుగ్రహం! ' అన్నాడా పి.య్యే.
తమిళనాడు దివంగత జయలలితమ్మాళ్ గారికి ఇట్లాగే జ్యోతిష్కం, సంఖ్యాశాస్త్రాలంటే తగని పిచ్చ. జాతక యోగం ఉచ్ఛస్థితిలో ఉందనుకున్న వాళ్ళకు మాత్రమే టిక్కెట్లిచ్చారు ఒకసారి ఎన్నికల్లో. ముఫ్ఫైతొమ్మిది స్థానాలను ముష్టి తొమ్మిదంటే తొమ్మిది మంది మాత్రమే గెలిచారింతా చేసి.
' గెలుపుకీ గ్రహాల వలపుకీ లింకేమిటండీ బాబూ? ప్రజాస్వామ్యంలో ఘనవిజయానికి కావాల్సింది ప్రజల అభిమానం కాదుటండీ! ' అన్నాను కసిబట్టలేక.
'టయానికి గుర్తు చేసారు! జయలలితమ్మగారి కన్నా మా ముసలయ్యగారు మరో రెండాకులు ఎక్కువ. ఇట్లాంటి పరాశాస్త్రాల పైన నమ్మకం. మీ ఇంటికో సారి మా వాస్తుశాస్త్రులు వస్తారు. అన్నీ సవ్యంగా ఉంటేనే మీ మొర మా పెద్దాయన ఆలకించడం! మొన్నీ మధ్యన ఇట్లాగే ఒక బొజ్జాయన ఇంటికి ఈశాన్యంలో పూజామందిరం పెట్టుకుని అవకాశం చేజేతులా జారవిడుచుకున్నాడు.'
' ఇంటికి ఈశాన్యంలో మందిరముంటే దోషమా? '
' మందిరముంటే కాదు మహాప్రభో! అందులో వినాయకుడు, ఆంజనేయుడు లాంటి బాహుబలులుంటేనే దుర్దశ. ఈశాన్యంలో బరువులుంటేనే కదండీ ఊహించని ఉత్పాతాలొచ్చిపడేదీ! ఆ మాత్రం వాస్తుజ్ఞానం కూడా లేకుండానే వార్డు మెంబరై పోదామనే! '
పి.య్యే మాటల్లో వెటకారం.
ఇండియాని ఈ కరోనా తరహా మాయదారిరోగాలు ఎందుకు పీడిస్తున్నాయో ఇప్పుడు బుర్రకెక్కింది
ఈశాన్యంలో అంత లావు హిమాలయాలు.. వాటెనకమాల్న చైనా కొరియా గట్రాల్లాంటి దేశాలాయ! కుంభకోణాలనీ, ద్రవ్యోల్బణాలనీ, ఇరుగు పొరుగు దేశాలతో ఇబ్బందికర సంబధాలనీ.. పాపం మనం మోదీ, షా మామయ్యలను హమేషా ఆడిపోసుకుంటున్నాం నిష్కారణంగా.
నా ఆలోచనల్లో నేనుండగానే భుజం గోకి మరీ అడిగాడా పి.య్యే ' కొంపదీసి మీ ఇంటిగ్గానీ సింహద్వారం దక్షిణం వారగా ఉందా ఏంటీ? ముందే చెప్పండి బాబూ.. ఆనక నన్నెన్ని దెప్పీ లాభం ఉండదు.'
' అమెరికా శ్వేత సాధం తలవాకిలే దక్షిణానికి అభిముఖంగా ఉంటుంది తమ్ముడూ! మరా దేశం ఇన్నేళ్ళబట్టి అగ్రరాజ్యంగా ఎట్లా నిప్పులు వెదజల్లుతుందో? '
' వాదనలొద్దిక్కడ. ఆ ముచ్చట్లన్నీ టీవీ పెట్టెల్లో! ముసలయ్యగారు శాస్త్రాలు నమ్ముతారు. ఆయన ముక్కును చూసారా? దూలం భారీ. తిన్నగా కూడా ఉండదు. ఆయన ముక్కు వాస్తు ముందే తెలుసుకుని వచ్చుండాల్సుంది తమరు.'
బిక్క మొహమేయడం నా వంతయింది. పోయిన ఏడాదే మా అడ్డగాడిదకు ఎక్కడా ముడిపడే యోగం కుదరడంలేదని ఇట్లాగే ఏదో శాస్త్రం ఘోషిస్తోందంటూ నా ఘోష లెక్కచెయ్యకుండా వీధి ముఖ ద్వారాలు రెండూ సగం మూయించేసింది మా అర్థాంగి. ఇప్పుడీ ముసలయ్యగారి వాస్తు ఇంకేం మూయిస్తుందో.. ద్యావుడా!
' ముందొక సారి వచ్చి ఈ నీళ్ళ తొట్లో మీ కిష్టమైన రంగు ముక్క ఏదన్నా తగలేయండి బాబూ! మీ అసలు రంగేంటో బైట పడేందుగ్గాను ఇదో చిన్న స్లిప్ టెస్ట్ అన్నమాట! ' అంటో గారపళ్ళు చూపించాడా పియ్యేగారు.
రంగులు మారుతున్న నా మొహం వంక చూసి మీ సందేహం అర్థమైందిలేండి బాబూ! ఈ తొట్లో ఉన్నది సీదా సాదా జలగ కాదు! ఆఫ్రికా ఖండం ' యవుండే ' దేశం నుండి తెప్పించిందండీ! ప్రపంచ ఫుట్ బాల్ పోటీలల్లో ఫలితాలు ముందే చెప్పిన ఆక్టోపస్ 'పాల్' లేదూ.. దానితో క్రాస్ చేయించి పుట్టించిందండీ ఈ బుజ్జిముండను! తండ్రి తాలూకు జోస్యం చెప్పే లక్షణాలు ఎక్కడకండీ పొయ్యేదీ? ఒక్క పాలిటిక్సులోనే కాదు వంశపారంపర్యాలు గట్రా జాతకాలు కూడా ఇట్టే పట్టేస్తుంది. వద్దని దులపరిస్తే మాత్రం మాయమై పోడానికి ఇదేమన్నా గుడికి పట్టిన ఆర్డినరీ బూజా? వాస్తు బూజు బాబూ! '
వాస్తు మోజు ఆటల మీద రంధి పెంచి బెట్టింగ్ సొమ్ము రెట్టింపు గుంజేందుకు మాస్ మీడియాతో మాఫియా ఆడించే నాటకాల్రా బాబూ ! ఆ ఆక్టోపస్సుల యాక్టింగులు వెనక ఉన్న కుట్ర ఎవరికీ అర్థమవడం లేదు. యుద్ధ రంగంలోకి దిగే ముందే శత్రువర్గం మానసికంగా కుంగేటందుకు వాడుకునే గూఢచర్యా నికి ఇది నకలు.’
నా ఊహల్లో నేనుండగానే పెడబొబ్బలు పెట్టేసాడా పి.య్యేసామి. నా చేతులు పట్టుకు తెగ ఊపేస్తూ ' కంగ్రాట్సండీ కామాయ్ సారో! మీరీ పరీక్షలో కూడా నెగ్గేశారోచ్! ఇహ కోయంబట్టూరు నాడీ జోస్యం కూడా తెప్పించేసుకుని రడీగా ఉంచుకుంటే సరి.. మీ పని ఫినిషయిపోయినట్లే! ఆఁ.. అన్నట్లు.. ఈ లోపల్నే నామనక్షత్రం ప్రకారం తమ పేరును ఎట్లా మారిస్తే దిగ్విజయం సిద్ధిస్తుందో డాక్టర్ దైవజ్ఞానం కూడా ఓ నివేదిక తయారుచేసిస్తారు. ఓ.కే నా? '
పేరు మార్చుకుంటే అపజయలక్ష్మి ఆనవాలు పట్టకుండా వదిలేస్తుందనా? దేవుళ్లను కూడా తప్పుదారి పట్టించే కొత్త రకం గుంటనక్క ట్రిక్కా!
' మీరున్నారు చూసారూ.. భలే చిలిపి సార్! మనసులో ఏదున్నా అస్సలు దాచుకోరు! ఐ ఎప్రిషియేట్! ఇది వరకో చిన్నారావును.. ఇట్లాగే 'చీ..అన్నా.. రావు'గా సాగదీసిం తరువాతనేనండీ అతగాడి జాతకం మొత్తం తిరగడ్డం మొదలెట్టింది. దివ్యజ్ఞానం గారి విజ్ఞానాన్ని సందేహించకండి! అరవై ఏళ్ళ అనుభవసారం. వాజిపేయి, సోనియాజీ, కరుణానిధీ, నెల్సన్ మండేలా, జార్జ్ బుష్, సద్దాం హుస్సేన్ లాంటి పెద్ద పెద్ద జాతీయ, అంతర్జాతీయ శాల్తీల నాడులే పట్టి మరీ జోస్యం రాబట్టిన ఘనాపాటి ఇతగాడు! మీ డౌట్లన్నీ ని తీరిపోతాయ్.. ముందీ బౌండు బుక్కు చదవండి ' అంటూ కవిలకట్టొకటి నా మొహాన ఠకీమని కొట్టి లోపలికి తారుకున్నాడా పియ్యే.
బౌండా అది? వందలాది ఏళ్ళ కిందటి తాళపత్ర గ్రంథాల ఆధారంగా చెప్పే నాడీ జోస్యంట ఆ దిండు! నోస్ట్రస్ డేమ్ జోస్యం కన్నా డేమ్ ష్యూర్ గా డాక్టర్ దివ్యజ్ఞానం జోస్యముంటుందని డబ్బాలు! ఇరాక్ యుద్ధం, ఇందిరమ్మ మరణం, రజనీ ' బాషా ' హిట్టూ.. బాబా ఫట్టూ, బందిపోటు వీరప్పన్ చావు, వెస్ట్ బెంగాల్ లెఫ్టిస్టుల ఫేటు, దక్షిణాది సునామీలు, ఆమ్ ఆద్మీ కేజ్రీవాలు రైజు, పెద్దనోట్ల రద్దు, ముంబై దాడులు.. ఆర్జీవీ మూడ్స్ తో సహా హిస్టరీ దృష్టిలో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అనింపార్టెంట్ స్టోరీస్ ఆల్మోస్ట్ అన్నీ నేటివ్ టు ఇంటర్నేషనల్ లెవెల్లో సర్వం జరక్కముందే.. విఘడియల వివరాలతో సహా పర్ఫెక్టుగా లెక్క గట్టి మరీ తేల్చినట్టిదీ నాడీ మండలం అంటూ కోతలు! కరుణానిధిగారు శుద్ధ చార్వాకవాది. హస్తసాముద్రికాలు.. నాడీ జోస్యాల వంటి అవరశాస్త్రాలు ఆయన వంటికి పడవు. అంత పెద్దల వ్యక్తిగత జీవితాల లోతుల్లో కెల్లా చొచ్చుకెళ్ళగలిగాడబ్బా ఈ డాక్టర్ దైవజ్ఞానం! ఈ లెక్కన చూసుకుంటే.. కొరియా ట్రంపుల ఒప్పందం, సులేమానీ మరణం లాంటి అనూహ్య ఉత్పాతాల గుట్లు మట్లన్నీ తూ గుప్పెట్లోనే అదిమి పట్టి ఉంచానని కోతలు ఇంకెన్నయినా కోయచ్చు .
అసలీ దస్త్రాలన్నీ చదవడం సంగతట్లా పక్కనుంచి.. మొయ్యడానికే ముందు కోడి రామ్మూర్తిగారి కండబలం కావాలి!
ఇంకాస్సేపు గానీ ఇక్కడే పడుంటే.. ఈ ముసలయ్యగారి నస పి.య్యే బల్లిశాస్త్ర పరీక్ష కూడా బలవంతంగా చేయిస్తాడు. గ్రహణం బాలేదు. వచ్చింది గ్రహణం పూట. కాబట్టి నైటు దాకా వెయిటింగులో పెట్టి తలవాకిట్లో పళ్లెం పెట్టి రోకలి నిలబెట్టమనే టెట్టా తలపెట్టచ్చు.
ఎదుటి పక్షం అభ్యర్థి ఎన్నికలల్లో నామినేషన్లెయ్యడమే కురుక్షేత్ర యుద్ధంలో తలదూర్చినంత ఘోరంగా ఉందే ఇప్పటి పరిస్థితి! గెలుపు మాట ఆనక, ముందు మన వేలైనా ఓటు మిషను మీట మీద పడనిస్తుందో లేదో.. పాడు రాజకీయం! ప్రచారాలు మాత్రం? ఓటెయ్యమని అడిగేందుకు పంచ ముందు కెళ్లి నిలబడ్డం ఆలస్యం. పింఛన్లు పెంచు, కోకలు పంచు, పంచెలు ఇప్పించంటూ ఒహటే దంచుళ్లు! ఓటర్లతో ఓ మంచీ చెడూ చెప్పుకోడాలిప్పుడు మరీ ఓల్డ్ ఫ్యాషన్సయిపోయాయ్! ఓట్ మేటర్ అంటే ఓన్లీ మనీ మేటర్! అసలే కరోనా రోజులు కూడా! కనబడ్డ కుంకెవరైనా కరచాలనం వంకన కక్ష కొద్దీ ఏ మాయదారి రోగమో వంటికి తగిలిస్తే? నిలబడ్డం మాట అటుంచి ఓటేయడానికైనా వచ్చే ఎన్నికల దాకా శాల్తీ మిగిలే ఛాన్సుంటుందో ఉండదో! ఎన్నికల్లో నిలబడ్డానికి ఎన్ని తిప్పలురా ద్యావుడా!
ఆ మాటకొస్తే ముందు ముందు జరగబోయేది ముందుగానే తెలిస్తే యెస్ బ్యాంకు తుస్సు మంటుందని ముందే ఎందుకయ్యా ఏ జ్యోతిష్కుడూ నోరు తెరిచిందిలేదు? సి.యం పదవి హుళక్కేనని ముందే ఏ న్యూమరాలజిస్టయినా సింథియా చెవిన చేరేసుంటే అంత లావున ఎం.పీ లో కాంగీల గుంపు గెలుపుకోసం కిందా మీదా పడునా? నిజంగా జరిగేది నిఖార్సుగా చెప్పేదుంటే నిర్భయ నిందులందరికి ఉరిశిక్ష ఎప్పుడో నిర్భయంగా ఇప్పుడైనా చెప్పమనండి.. చూతాం!
గీత దాటిన శాసనసభ్యుల పైన వేటు పడే సుముహూర్తం ఎప్పుడో ఎవరికీ అంతుబట్టదు. ఆ గుట్టేదో విప్పమనండి!
పండించిన పంటకు మంచి రేటు పలికేది ఎన్నడో ముందే తెలిస్తే కష్టపడైనా సరుకును దాచుకుని నష్టపోడుగా పాపం అన్నదాత! నైరుతీ రుతు పవనాల రాక ఇదీ అని నిక్కచ్చిగా తేలితే ముందుగానే దుక్కి దున్ని విత్తులు జల్లి నెత్తికి చేతులు తెచ్చుకునే దుస్థితి తప్పునుగా చిన్నరైతుకి! వాయుగుండాలు తీరం దాటే తీరు అంతుబట్టక తలలు పట్టుకుంటున్నారు పెద్ద పెద్ద వాతావరణ శాస్త్రవేత్తలు. సదరు నివుణులందరికీ జ్యోతిషంలో గానీ ఘట్టి తర్ఫీదిప్పిస్తే దేశాన్నీ, జనాన్నీ వరదల బెడద నుంచీ తప్పించిన్నట్లవుతుంది కదా!
ఏ సర్కారీ చాకిరీ ముఖాన ఎప్పుడు రాసుందో ముందే ముఖం మీది రాతలు చదివే పండిత ప్రకాండులెవరైనా చదివి చెపితే ఇన్నేసి సెట్లతో విద్యార్థులకు పట్టే కుస్తీపట్లు తప్పును కదా!
సూపర్ సక్సెస్ ఫార్ములా ముందే ఫిక్సైపోయుంటే చిన్న నిర్మాతలిలా తలలు తాకట్టు పెట్టుకుని మరీ చెత్త చిత్రాలు పోగేసే రొష్టు తప్పుతుంది కదా? పసిడి ధర ఇదిగిదిగో పడిపోయింది. గ్యాసు ధర అదిగదిగో అంతర్జాతీయంగా ఎక్కడికో ఎగిరిపోతోందంటో పచ్చడి మెతుకుల కూటిక్కూడా తడుముకునే బడుగుజీవిని కంగారు పెట్టేస్తున్నాయ్ బంగారం కొట్లు, పెట్రోలు బంకులు! బంగారంలాంటి జీవితాలు వాటి చుట్టూతా గింగిర్మ కొట్టకుండా కాపాడవచ్చు కదా కాలజ్ఞానం పైన అంత అపారమైన అవగాహనవుండే నవీన బ్రహ్మంగారుఅలా నోరు తెరిచి లీలలు బోధిస్తే!
ఏ అపరాల ధర ఎప్పుడు ఎంత వరకు పెరుగుతుందో.. స్టాకు బజార్లలో ఏ షేరు ధర ఏ క్షణంలో ఎంత కుంగనుందో.. ముందే కనిపెట్టేసి ఓ ఉగాది పంచాంగం లాంటిది రిలీజు చేసేస్తే.. కన్రెప్ప కొట్టే లోపల ఇట్లా లక్షలూ కోట్లు ఆవిరయిపోడాలుండవు కదా!
దాంతాడు తెగా.. ఒక్క నోస్టర్ డ్యాము నోరూ అడ్వాన్సుగా పెకిలి చావదు ! సరి కదా.. తీరా తాడు తెగి బక్కెట బావిలో పడిన తరువాతనా.. ఇదిగిదిగో.. ఇలా జరుగుతుందనేగా మేం ముందే కనిపెట్టి ఘోషెట్టిందీ' ! అంటూ టీవీ పెట్టెల ముందు చిందులు!
లావు లావు ' లా ' వుస్తకాలు.. అవీ ఇవీ.. చదివి ఐయ్యే యస్సులు ఐపీయెస్సులూ ఐపోయే సార్లు, దొరసాన్లు ఇంకాస్త మనసు పెట్టి ఆ కాస్త బల్లి శాస్త్రమో, పాదసాముద్రికమో కూడా ఔపోసన పట్టేస్తారు గదా నిఖార్సైన ప్రభావమంటూ నిజంగా పరాశాస్త్రలకు ఉండుంటే!
వాస్తవేమిటంటే.. వాస్తు వసతి కోసమని ఎన్నడో ఏర్పాటైన ఓ చిన్న నిర్మాణశాస్త్రం. గుహల నుంచి కాంక్రీటు గృహాల దాకా ఎదిగిన మనం ఇంకా ఆ ఆకు కుటీరం నాటి అవసరాలను తీర్చిన పాత నియమ నిబంధనల చూర్లు పట్టుకు వదలమంటే . . మానవ వికాస నిర్మాణం ముందు ముందు మరింత విస్తరించడం ఎట్లా? వరాహ మిహిరుడి వాస్తు ప్రకారం మహానగరాలల్లో కాని నిర్మాణాలు సాగిస్తే ఇరుగింటి మురుగు పారేది పొరుగింటి పడక గది కిందనే! మయామాతా, మానసారా.. ఎవరి వాస్తు శాస్త్రాలు వాళ్లవి. వాటిలో వాటికే ఏకీభావం లేని శాస్త్రాలతో నేటి నాగరిక మానవుడు ఏకీభవించడం సాధ్యమవుతుందా? వీరేశలింగం పంతులుగారు అమావాస్యనాడు ఉద్యోగంలో చేరి మహోపాధ్యాయుడిగా కీర్తి గడించారు. సురవరం సుధాకరరెడ్డి రెండువేల నాలుగు నాటి ఎన్నికల్లో రాహుకాలంలో నామినేషన్ వేసి మరీ ఎం.పీగా ఎన్నికయారు!
నాడీ జ్యోతిషం వేదవిజ్ఞానం కాదు. నాలుగో శతాబ్దందాకా వేదాలలో వాస్తు ప్రస్తావనే లేదు. ఎన్ని వేద సంహితలలో భూతద్దం పెట్టి వెతికినా సంఖ్యాశాస్త్రం కనిపించదు. మనిషి వస్త్రలాభం, వాహన యోగం గోడ మీది బల్లి కాదు నిగ్గుతేల్చేది! సిల్లీ! కుళ్లు బుద్ధులతో మనం అనుక్షణం కొట్టుకుచస్తూ ఆ కలహాలకి కారణం పురుగుల్నేరుకుని తినే గోడ మీది బల్లి మీదకు తోసెయ్యడం దారుణం!
ఈ సారి ఇంకేదో మూడు కాళ్ళ కప్ప బొమ్మ పట్టుకుని నవ్వుతో బైటికొచ్చాడు. పి. య్యేసారు.
చైనా వాస్తు ఫెంగ్-షూయి ప్రకారం మూడు కాళ్ల కప్ప గుమ్మం ముందు కూర్చున్నట్లుంటేనే ఇంటి యజమానికి మనోసిద్ధి ప్రాప్తిరస్తంట!
ఇట్లాగే ఇంకా ఏవేవో శాస్త్ర మర్మాలు చాలా విప్పి చెప్పే ఉత్సాహంలో ఉన్నాడీ ముసలయ్యగారి పర్శనల్ అసిస్టెంట్!
కానీ నా మానసికస్థితి అప్పటికే ఒక గట్టి స్థితప్రజ్ఞతను సాధించింది. మూడు కాళ్ల కప్పతో సహా గిరుక్కున వెనక్కి తిరిగి వచ్చేసా.
" అష్టమి, మంగళవారం, ఆ పైన గ్రహణం. బయల్దేరిందేమో రాహుకాలం.. అదీ వర్జ్యం వదలక ముందే! ఎదురుగా వచ్చిందేమో నల్ల పిల్లి! కాస్త కూర్చుని నెత్తి మీదిన్ని నీళ్ళు జల్లుకుని పోవయ్యా మగడా! అన్నా! పరగడువున బల్లి భుజం మీద పడ్డప్పుడే అనుకున్నాలే, ఇవాళేదో ముదనష్టం ముహాన రాసిపెట్టుందని! " అంటూ తగులుకుంది ఇంట్లో మా ఆవిడ.
రక రకాల శాస్త్రపరీక్షలకూ, కొన్ని నివేదికలకూ, ఇదిగో ఈ మూడుకాళ్ళ కప్ప బాపతు దిష్టిబొమ్మలు గట్రాలు మరికొన్నింటికి.. అంతా కలసి ముసలయ్యగారి పి.య్యేమనిషి నా దగ్గర పళ్ళూడగొట్టి రాల్చుకున్నవి అక్షరాలా అర్థ పదివేల నూటపదహార్లు! వాటిగురించే ఆవిడ షష్టాష్టకాలు!
సొమ్ముపోతే పోయిందిలేవయ్యా! ఆ వార్డు మెంబరూ వద్దు.. పాడూ మనకొద్దు! ఏ పని చేసేది అయినా ఆదాయం కోసమేగా! ఇంచక్కా నువ్వూ ఆ చైనా వాస్తు బొమ్మలు అమ్మే దుకాణం మొదలెట్టు అనేసింది ఆవిడే మర్నాడు వాతావరణం కాస్త చల్లబడి మెదడు మంత్రం ఆడటం మొదలయ్యాక!
- కర్లపాలెం హనుమంతరావు
03 -4 -
No comments:
Post a Comment