Sunday, January 22, 2017

తొలి కలల ప్రేమలేఖ- ఈనాడు ఆదివారం సంపాదకీయం


ప్రణయభావం హృదయ సంబంధి. నిండు నూరేళ్ల జీవితానికి రసాలందించే ఆ ప్రేమఫలం చవిని పసగల రెండు మూడు పదాల్లో పొదగాలంటే ఎంత అనుభవం కావాలి? 'ప్రేమంటే ఒక తికమకలే. అది వేధించే తీపి కలే' అన్నాడో ఓ సినిమా కవి. ఎద సడిని సరిగమపదనిసలుగా మలచి పాడే ఆ గడసరి- పిడికిలంత గుండెలో కడలిని మించిన హోరును పుట్టించగల జగడాలమారి. 'మ్రొక్కి మొక్కించుకొనునట్టి చక్కదనము/పొగిడి పొగిడించుకొనునట్టి ప్రోడతనము/దక్కి దక్కించుకొనునట్టి దంటతనము/ దానికేకాక కలదే యే చానకైనా?' అని ముద్దుపళనివారి మాధవుడు తలపోసింది రాధిక గురించే. నిజానికి ఆ శాపనార్థాలన్నీ అన్యాపదేశంగా అశరీరుడి ఆగడాలమీద గురిపెట్టిన శరాలే! సదా గోపాలపాద చింతనామగ్న అయిన గోపకాంత ఒకతె చెంతవాలిన చంచరీకాన్నే ప్రియుడు పంపిన ప్రేమదూతగా భావించుకొని ఆలపించిన భ్రమరగీతాలూ ఈ ధోరణిలోనే సాగే తంతు. తనను మన్మథ వేదనపాలు చేసిన విధాత నిర్దయను వ్రేపల్లె గొల్లభామ పడ తిట్టిపోస్తుంది- పోతన భాగవతంలో. 'కత్తిలేని ఒరకు కాంతి లేనట్టుగా ప్రేమలేక యున్న బ్రతుకు సున్న' అని దాశరథి వంటి కవులు భావిస్తూనే ఉన్నారంటే ఆ కొంటెతనమంతా ఈ మిటారితనంలోనే ఉందనేగా! 'ప్రణయ వధువు నొక రాతిరి త్రాగినాను/ప్రళయ దినము దాక నిషా వదలదు నన్ను' అంటూ పారశీక గజల్ కవి మీర్ పదాలు పాడింది ఈ పాడు తీపి ప్రణయ మధువు గమ్మత్తు మత్తు గురించే!

ప్రేమంటే మోకాలి లోతు దుఃఖం. పీకల దాకా సుఖం. ముల్లు ముల్లుకీ మధ్యనే పువ్వు విచ్చుకున్నట్లు, పువ్వు పువ్వుకీ మధ్య ముల్లూ పొడుచుకొని ఉంటుంది. ప్రేమలో కన్నీళ్లు వద్దనుకుంటే ఎలా? మెరుపు లేకుండా, చినుకు రాకుండా చిగురు పుడుతుందా? రాధికా సాంత్వనంలోని కథానాయిక బాధే ఏ మదన పీడితులకైనా. 'కంటికి నిద్రరాదు, వినుకాంతుని బాసిన నాటి నుండియున్/వంటకమింపు గాదు, పెఱవార్తలు వీనుల సోకలేదు నే/డొంటిగ బ్రొద్దుపోదు, మరులూరక యుండనీదు, తొల్లినే/జంట బెనంగు వారిగన జాలక చాల కరంగ గంటినో' అంటూ పెంపుడు చిలుక ముందు కంటనీరు పెట్టుకొంటుంది రాధిక ఒంటరి తుంటరి ఒంటిబాధ భరించలేక. సుభద్రను తొలిరేయి సమాగమానికి స్వయంగా అలంకరించి భర్త వద్దకు పంపిన తాళ్ళపాక తిమ్మక్కవారి 'ద్రౌపది'దీ అదే హృదయ వేదన. 'విరహము కూడా సుఖమే కాదా నిరతము చింతన మధురము కాదా!' అంటూ పింగళి వంటివారు ఎంత వూరించినా నండూరివారి నాయుడు బావకిలా గుండె గొంతుకలో కొట్లాడుతుండే కూకుండనిస్తుందా కూసింతసేపు?! 'ఒక ముద్దుకోసం యుగాలైనా ఆగుతాను/ తన పొందుకోసం యోజనాలు సాగుతాను' అని బీరాలు పలికే ప్రేమదాసులు మూడుముళ్లు పడితేచాలు... తొలి రేయిదాకానైనా తాళలేరు. 'ఆలుమగల మధ్యగల ఆ అనుబంధం కాలం గడిచేకొద్దీ బలమైన స్నేహబంధంగా మారితేనే ఆ సంసారం సరస సుధాసారం... ఆ జంట లోకం కనులపంట' అంటాడు ఉత్తర రామచరిత్రలో భవభూతి. ఈ తరం యువతరం తొందరపాటు, కలిసి నడవడంలోని తడబాటు, నూతన దంపతుల్లోని ఎడబాటును మరింత వేగంగా పెంచుతోందని మానసిక శాస్త్రవేత్తలిప్పుడు ఆందోళన చెందుతున్నారు.

'ఆమె కడలి తీరపు దీపం. కాకపోతే... అతను సంసార సాగరంలో జాడ తెలియని ఓడ. అతను సాగర హృదయ వైశాల్యం కాకపోతే ఆమె సంగమ సాఫల్యం అందని నదీసుందరి' అంటాడొక ఆధునిక కవి. ఉత్తమ ఇల్లాలు ఎలా ఉండాలో కుమారీ శతకం ఏనాడో తెలియజెప్పింది. భర్తకు భోజనం వడ్డించేటప్పుడు తల్లిలా, పవళింపు సేవలో రంభలా, ఆలోచనల వేళ మంత్రిగా, సేవించేటప్పుడు దాసిగా మెలగాలంటుంది. మరి, భర్త ఎలా ఉండాలి? ఆలుమగలు ఆకాశం, భూమిలాగా- హృదయవైశాల్యం, సహన సౌశీల్యం అలవరచుకుంటేనే ఆ దాంపత్యం వాగర్ధ ప్రణయైకమత్యమంత ఆదర్శప్రాయమవుతుంది. 'ఆత్మ సమానత్వం పొందిన జీవిత భాగస్వామి ముందు మోకరిల్లటం ఆత్మనమస్కారమంత ఉత్తమ సంస్కారం' అని కదా మల్లినాథహరి కిరాతార్జునీయంలోని ఒక ఉపకథాసారం! 'పొందనేర్తునె నిన్ను పూర్వజన్మ / కృతసుకృత వైభవమున దక్కితివి నాకు' అని ఆమె అనుకోవాలి. 'ఎంత మాధుర్యమున్నదో యెంచగలనె! / సలలిత కపోల నీ మృదుసూక్తిలోన' అని అతను మనస్ఫూర్తిగా భావించి పైకి అనాలి. పెళ్ళినాటి సప్తపదిలో ముందు నాలుగడుగులు వధువు వరుణ్ని నడిపిస్తే, మిగిలిన మూడడుగులు వరుడు వధువు చేయిపట్టుకొని నడిపించేవి. పెళ్ళిపీటల మీద అగ్నిసాక్షిగా పరస్పరం చేసుకొన్న ప్రమాణాలు కాళ్ల పారాణి పచ్చదనం తడి ఆరకముందే నేటితరానికి మరపునకు రావడం విచారకరం. పెరుగుతున్న విడాకులకు విరుగుడుగా పొరుగున చైనాలోని బీజింగ్ తపాలాశాఖ ప్రేమలేఖల చిట్కా ప్రవేశపెట్టింది. మూడుముళ్లు పడిన మరుక్షణంలోనే వధూవరులు తమ జీవిత భాగస్వాముల మీదున్న ప్రేమనంతా ఒలకబోసి రాసిన ప్రేమలేఖలను ఆ శాఖవారు భద్రపరచి ఏడేళ్ల తరవాత తిరిగి ఇస్తారట! పెళ్ళినాటి ప్రమాణాలు మళ్ళీ గుర్తుకొచ్చి ఎడబాటు ఆలోచనలు తగ్గుముఖం పడతాయన్నది వారి సదాలోచన. కలకాలం కలిసే ఉండాలన్న కోరికలు మరింత బలపడితే శ్రీ గౌరీశ్వర సాన్నిహిత్యంలా వారి దాంపత్యం కళకళలాడుతుందన్న ఆలోచనే హర్షణీయం. అందమైన సంసారాలను ఆశించే వారందరికీ అది ఆచరణీయం.

(06-10-2011నాటి ఈనాడు సంపాదకీయం)

Monday, January 16, 2017

డిపాజిట్- క్రైం కథల పోటీలో బహుమతి పొందిన కథ


ఒంటిగంట కావస్తోంది. సోమవారాల్లో సాధారణంగా రద్దీ ఉంటుంది. పేరుకి అది కో-ఆపరేటివ్ బ్యాంకే అయినా.. మంచి బిజినెస్ సెంటర్లో ఉన్నందువల్ల దానికీ ఆని బ్యాంకుల మల్లేనే ఆ వేళ కస్టమర్స్ తాకిడి ఎప్పటికన్నా ఎక్కువగానే ఉంది.
లంచ్ టైముకి ఇంకో పావుగంట ఉందనగానే.. అయ్యర్ మెల్లిగా బ్యాంక్ మేనేజర్ క్యాబిన్లోకి వచ్చి కూర్చున్నాడు. బ్రీఫ్ కేసులోంచి ఓ ఫిక్సుడ్ డిపాజిట్ బాండు తీసి బ్యాంకు మేనేజర్ ముందు పెట్టి అన్నాడు 'సార్! ఈ బాండ్ ఇవాళ మెచ్యూర్ అవుతుంది. కాస్త తొందరగా డబ్బిప్పించరా! రెండు గంటల బండికి చెన్నై పోవాలి. ఇవాళ ఈవెనింగే నా వైఫ్ కి ఆపరేషన్. ఈ మనీ చాలా అర్జంట్!'
మేనేజరుగారా బాండందుకొని చూసి 'మీరేనా అయ్యర్?' అనడిగాడు.
'అవును సార్!' అంటూ ఐడీ తీసి చూపించాడు అయ్యర్.
బాండు వెనక సంతకం తీసుకొని కంప్యూటర్ తెరమీద వెరిఫై చేసుకొని తృప్తి పడిన తరువాత 'ఓకె! ఒక్క హావెనవర్ వైట్ చేయండి! క్యాషియర్ లంచికి వెళ్లినట్లున్నాడు. రాగానే అరేంజ్ చేస్తాను' అంటూ బాండుతో సహా బ్యాంకు హాల్లోకి వెళ్ళి పోయాడు మేనేజర్.
అద్దాల్లోంచి ఆయన ఎవరో ఆఫీసరుకి ఐడి చూపించి మాట్లాడుతుండటం.. ఆ ఆఫీసరు మధ్య మధ్యలో తలిటు తిప్పి చూస్తూ ఉండటమూ కనిపిస్తూనే ఉంది అయ్యరుకి.
మేనేజరుగారు ఎటో వెళ్లిపోయాడు.. బహుశా లంచికేమో!ఇంకో ముప్పావు గంట తరువాత అటెండర్ వచ్చి 'సార్! క్యాష్ రెడీగా ఉంది. అటొచ్చి తీసుకోండి1' అన్నాడు.
అయ్యర్ బ్రీఫ్ కేస్ తో సహా వెళ్లి క్యాష్ కౌంటర్ ముందుకెళ్లి నిలబడ్డాడు. లంచవర్ జస్ట్ అప్పుడే అయిపోవడం వల్లనేమో హాల్లోనూ బైటా జనమాట్టే లేరు.
ముందే అరేంజి చేసినట్లున్నాడు.. వందనోట్లు రెండు బండిల్స్, చిల్లర పన్నెండు వేలూ కౌంటర్ మీద పరిచి చూపించాడు క్యాషియర్. 'సారీ సర్! మండే కదా! హెవీ పేమెంట్స్ వచ్చాయి. పెద్ద డినామినేషన్ అరేంజ్ చేయలేకపోయాం' అని నొచ్చుకున్నాడు కూడా.
బండిల్ అంటే పది ప్యాకెట్లు. మొత్తం ఇరవై ప్యాకెట్లు. పదులు పది ప్యాకెట్ల మీద రెండూ! చిన్న సూట్ కేసులో సర్దుకోడం కుదరక సతమతమవుతున్న అయ్యర్ని చూసాడు మేనేజర్ గారు 'బాలప్పా! ఊరికే అట్లా చూస్తూ నిలబదక పోతే సారుకి మన దగ్గరున్న బ్యాగేదన్నా ఇవ్వచ్చు కదా!' అని అరిచాడు.
బాలప్ప లోపలికి తెచ్చిన బ్యాగులో డబ్బు సర్దుతుంటే.. అయ్యర్ మేనేజరుగారి దగ్గరికెళ్లి  'థేంక్స్!' చెప్పాడు. 'ఇట్సాల్ రైట్! ఇందులో నేను చేసింది మాత్రం ఏముంది. ఎవరి మనీ వాళ్లకి సేఫ్ గా చేర్చేట్లు చూడ్డమే కదా.. యాజే మేనేజర్ నా ప్రైమరీ డ్యూటీ!ఆల్రెడీ టూ ఓ క్లాకయింది. ఈ టైములో ఆటోలు దొరకడం కూడా కష్టమేనే! బాలప్పా! బైట మన రెడ్డి ఆటో స్టాండులో ఉందేమో చూడు! సార్ ని స్టేషన్లో దిగబెట్టి రమ్మను!' అంటూ తన క్యాబిన్లోకి వెళ్లిపోయాడు మేనేజర్ గారు.
అయ్యర్ బ్యాంకు బైటికొచ్చి రెడీగా ఉన్న ఆటో ఎక్కి కూర్చున్నాడు. బాలప్ప ముందే చెప్పి పెట్టిన ఆటో అదే లాగుంది.. బాలప్ప అందించిన అయ్యర్ బ్యాగ్ లోపల పెట్టుకొని బాణంలాగా ముందుకు దూసుకు పోయింది.
ఆటో వేగంగా కన్నా ఎక్కువ వేగంగా కొట్టుకుంటున్నాయి అయ్యర్ గుండెలు! 'ఒకటా.. రెండా? రెండు లక్షల చిల్లర! ఇంత ఈజీగా పనయిపోతుందనుకోలేదు. ఒక్కో సారంతే! వెంటనే అయిపోతాయనుకొన్న పనులు ఏళ్లూ పూళ్లూ గడిచినా ఒక పట్టాన తెగవు. అసలు తెమలనే తెమలవనుకోనే పనులు .. ఎవరో తరుముతున్నట్లు.. ఇదిగో.. ఇలా.. చక చకా జరిగిపోతుంటాయి! లేచిన వేళా విశేషం. ఎన్నేళ్ళు కష్టపడితే ఇంత డబ్బొచ్చి వళ్లో బడుతుంది!' వళ్లోని క్యాష్ బ్యాగుని మరింత ఆబగా దగ్గరికి తీసుకున్నాడు అయ్యరు.
అప్పుడు చూసాడు బ్యాగుమీది ఆ అమ్మాయి బొమ్మని. ఎక్కడో చూసినట్లుంది ఆ పాప ఫోటో! ఆఁ! గుర్తుకొస్తోంది గోవింద రెడ్డి కూతురు ఫోటో కదూ అది? రెడ్డికి ఆ పాపంటే ప్రాణం. లాడ్జికొచ్చినప్పుడు చాలా అల్లరి చేస్తుండేది. లాడ్జిక్కూడా ఆ కూతురు పేరే పెట్టుకున్నాడు రెడ్డి.. 'మంగతాయారు లాడ్జి'
అలివేలు మంగనుకుంటా ఆ పాప పేరు.
తను ఈ బ్యాగులో తెచ్చిన లాడ్జి డబ్బే అప్పుడు  బ్యాంకులో డిపాజిట్ చేసింది. అప్పటి బ్యాగింకా బ్యాంకులో భద్రంగా ఉందా?!
'నిజానికీ సొమ్ము దక్కాల్సింది సాంబశివుడికి. చచ్చి ఏ లోకాన ఉన్నాడో పుణ్యాత్ముడు?' అయ్యర్ ఆలోచనలు ఒక్కసారి పదేళ్లు వెనక్కి మళ్లాయి.
మంగతాయారు లాడ్జిలో ఆ రోజు అట్టహాసంగా దిగిన చెన్నయ్ చెట్టియార్ తెల్లారే సరికల్లా బెడ్డుమీద శవంగా మారాడు! తెల్లారు ఝామున బెడ్ కాఫీ ఇవ్వడానికని వెళ్లిన తనే ఆ దృశ్యం అందరికన్నా ముందు చూసింది. కేష్ కౌంటర్లో పడి నిద్రపోతున్న సాంబశివుణ్ని నిద్రలేపి తీసుకొచ్చి చూపించింది కూడా తనే! ఆ తరువాత .. పోలీసులు రావడం.. విచారణలు..  సాంబశివుణ్ని గుచ్చి గుచ్చి అడగడం.. అన్నీ తాను అక్కడక్కడే తచ్చర్లాడుతూ గమనిస్తూనే ఉన్నాడు. అంత గందరగోళంలోనూ సాంబశివుడు తన పేరు బైట పెట్టలేదు! ఎందుకో.. ఆ మధ్యాహ్నం తెలిసింది.
లంచ్ సప్లై చేయడానికని వెళ్లిన తనను టాయిలెట్లోకి లాక్కెళ్లి ఈ బ్యాగే చేతిలో పెట్టి చెప్పాడు 'ఇందులో యాభై వేలున్నాయ్! ఇప్పుడే పోయి పండ్ల బజారులో ఉన్న కో-ఆపరేటివ్ బ్యాంకులో డిపాజిట్ చెయ్.. నీ పేరున! ఈ హడావుడంతా తగ్గింతరువాత ఆలోచిద్దాం ఏం చేయాలో!'
ఆ సాయంకాలమే గోవింద రెడ్డిని పోలీసులు పట్టుకుపోయారు. సాంబశివుడు గాయబ్! భయమేసి తనూ చెన్నయ్ పారిపోయాడు.
కేసునుంచి బైట పడ్డానికి రెడ్డి చాలా కష్టపడ్డాడని విన్నాడు తను. ఏడేళ్ల కిందట సాంబశివుడూ ఏదో రోగమొచ్చి పోవడంతో డిపాజిట్ రహస్యం అతగాడితోనే సమాధి అయిపోయింది.
మధ్యలో రెండు మూడు సార్లొచ్చి బ్యాండును గడువు కన్నా ముందే తీసుకోవాలనుకొన్నా ధైర్యం చాలలేదు. ఇవాళకూడా బ్యాంకులో ఉన్నంత సేపూ ప్రాణాలు పింజం పింజం అంటూనే ఉన్నాయ్! ఆ ఏడుకొండలవాడి దయవల్ల ఏ ఇబ్బందీ లేకుండానే పెద్ద మొత్తం చేతిలోకొచ్చి పడింది. ఈ చిల్లర పన్నెండు వేలూ మందు తిరుపతి వెళ్లి ఏడుకొండలవాడి హుండీలో వేస్తే గానీ మనశ్శాంతి లేదు.
ఆటో ఠకాల్మని ఆగిపోయింది. డ్రైవర్ సెల్లో మాట్లాట్టానికి ఆపినట్లున్నాడు. మళ్లా స్టార్ట్ చేయబోతే ఒక పట్టాన స్టార్ట్ కాలేదు.
డ్రైవర్ బండిని ఓ వారకు లాక్కెళ్లి ఆపి 'ఆయిల్ అయిపోయినట్లుంది. ఇక్కడే పెట్రోలు బంక్. ఒన్ మినిట్ సార్!'అంటో ఓ బాటిల్ తీసుకొని మాయమై పోయాడు.
తిరిగి వస్తూ ఓ పోలీసాయన్ని వెంట బెట్టుకొచ్చాడు! ఆ కానిస్టేబులు కూడా ఎక్కంగానే బండి స్టార్టయింది.. ఏ ఆయిల్ పోయకుండానే!
ఆటో రైల్వేస్టేషను ముందు కాకుండా పోలీస్ స్టేషన్ ముందు ఆగడంతో అయ్యరుకి సీన్ అర్థమై పోయింది. పారిపోవడానిక్కూడా లేదు. క్యాష్ బ్యాగే కాదు.. తన చెయ్యీ కానిస్టేబుల్ చేతిలో ఉంది. మారు మాట్లాడకుండా కానిస్టేబుల్తో పాటు స్టేషన్లోకొచ్చాడు అయ్యర్. బ్యాంకు మేనేజరూ అక్కడే ఉన్నాడు!
'నిన్నెందుకు అరెస్ట్ చేసామో తెలుసా?' అనడిగాడు స్టేషనాఫీసరు.
'పదేళ్ళ కిందట గోవిందు లాడ్జిలో చెట్టియారుకు కాఫీలో విషమిచ్చి చంపినందుకు.' చెప్పాడు సి.ఐ.
'నో! అబద్ధం!' పెద్దగా అరిచాడు అయ్యర్. 'తననింకా బ్యాంకులో దొంగతనంగా డబ్బు డిపాజిట్ చేసినందుకు.. అనుకుంటున్నాడు అయ్యరు ఇప్పటి దాకా.
'మర్డర్ కేసా? యావజ్జీవమో!.. ఉరిశిక్షో!' పెళ్ళాం పిల్లలు గుర్తుకొచ్చారు. 'చెట్టియార్ చావుకీ నాకూ ఏ సంబంధం లేదు సార్!' బావురుమన్నాడు అయ్యరు.
'ఏ సంబంధమూ లేకపోతే ఎందుకురా అట్లా పారిపోయావూ?' అంటూ ఠప్పుమని లాఠీ ఝళిపించాడు సి.ఐ. 'ఇంత డబ్బు నీ కెక్కడిది బే! ఏం పని చేస్తే ఇంతొచ్చింది? దీనికోసమె నువ్వా  చెట్టియార్ని చంపావని సాంబశివుడు చచ్చేముందు స్టేట్మెంటిచ్చాడురా బెవకూఫ్!'
ఠపా ఠపా పడుతున్న లాఠీ దెబ్బలకు అయ్యరు కళ్లు బైర్లుకమ్మాయి. పోలీసువాళ్ల మర్యాదలెలా ఉంటాయో మొదటిసారి తెలిసొచ్చింది అయ్యరుకి. అట్లా ఎందుకన్నాడో తెలియదు 'సార్! సత్య ప్రమాణకంగా చెబుతున్నా. చెట్టియారు చావుకీ నాకూ ఎలాంటి లింకూ లేదు సార్! నా పిల్లలమీద ఒట్టేసి చెబుతున్నా. కావాలంటే ఈ డబ్బంతా తీసేసుకోండి! నన్నీ ఒక్కసారికీ ఒదిలేయండి సార్!'
'అట్లా రాసిస్తావు బే!' అనడిగాడు సి.ఐ. సీరియస్ గా మరో దెబ్బేస్తో.
తలూపాడు అయ్యర్.  బ్యాంకు మేనేజరు తయారు చేసుంచిన పేపర్లమీద గుడ్డిగా సంతకం చేసేసాడు కూడా.
అయ్యరుని బైటికి తీసుకు పోయి వచ్చిన ఆటోలోనే కుదేసిపోయాడు కానిస్టేబుల్.
దారిలో అన్నాడు ఆటో డ్రైవర్ 'అయ్యరంకుల్! నన్ను గుర్తు పట్టారా? నేను.. సాంబశివుడి కొడుకుని శ్రీనివాసుని. గోవింద రెడ్డి కూతురుతో కలసి లాడ్జిలో ఆడుకోడానికి వస్తుండేవాణ్ని. మా అయ్యా, నువ్వూ కల్సి చేసిన వెధవ పని నాకు తెలుసు. అయ్యే చెప్పేడు పొయేముందు. మీరిద్దరూ చేసిన వెధవ పనికి గోవింద రెడ్డి జైలు పాలయ్యాడు. కేసునుంచి బైటపడ్డానికి బోలెడంత ఖర్చయింది. ఆ అవమానంతో ఎక్కువ కాలం బతకలా!' అంటూండంగానే ఓ పాతకాలం బిల్డింగుముందు ఆటో ఆగింది. 'రెడ్డి కూతురు మంగతాయారుండేది ఈ అనాథ శరణాలయంలోనే. దానికి తండ్రినెట్లాగూ తెచ్చియ్యలేం. వాళ్ల నాయన సొమ్ములో కొంతైనా ఇప్పిస్తే ఏదో మంచి కాలేజీలో చేరి ఓ దారి చూసుకొంటుందని..నేనే ఈ ఎత్తు ఎత్తా.. స్నేహితుడిగా! ఇవాళ డిపాజిట్ మెచ్యూరవుతందని నాకు తెలుసు. బ్యాంకు సారు, సి.ఐ సార్ కో అపరేషన్ ఇవ్వబట్టి ఈ ఆపరేషన్ సక్సెస్ అయింది. దిగంకుల్! నీ చేత్తోనే మన తాయారుకి ఈ డబ్బిచ్చి 'సారీ!' చెబితే బాగుంటుంది' అంటూ సి. ఐ. సారిచ్చిన డబ్బు సంచీని తీసుకొని బండి దిగాడు ఆటో డ్రావర్  శ్రీనివాసులు.
***
-కర్లపాలెం హనుమంతరావు
(చిత్ర సకుటుంబ సచిత్ర మాస పత్రిక  2011 లో నిర్వహించిన క్రైమ్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథానికి. జూన్- 2011 అనుబంధ సంచికలో ప్రచురితం)





Sunday, January 15, 2017

'ముగ్గు'గుమ్మలు


‘రాచవీధులన్నీ రంగు రంగుల రంగువల్లికలతో పెళ్లివారికి పరిచిన ‘పంచవర్ణ’ పాద వస్త్రాలవలె  శొభిల్లుతాయ’ని వాల్మీకి వర్ణన రామాయణంలో.  విడిది గృహానికి విచ్చేసే వాసుదేవుడికీ విదురుడిచేత  సప్తవర్ణ సంశోభాయమానంగా వివిధ ప్రాంతాల రంగవల్లికలతో స్వాగత సత్కారాలు జరిపిస్తాడు బమ్మెర పోతన భాగవతంలో. భారతీయ సంస్కృతిలో స్వాగతం, సంబరం, సంతోషం, ఆడంబరం..  సహృద్భావం ఏదైనా  సంకేతం రంగవల్లికే. సాదర స్వాగత సత్కారాలకే కాక..  ఆ అల్లిక  సుదతి   తన ఆంతరంగిక ప్రతీకగా సైతం భావించడమే  భారతీయ సంస్కృతి విశిష్ట లక్షణం. పుష్యమాసారంభంలో పౌష్యలక్ష్మికి, సంక్రాంతి పండుగ సందర్భంలో సూర్యదేవునికి, కృష్ణాష్టమినాడు చిన్నికన్నయ్యకి, నాగపంచమినాడు నాగేంద్రుడికి.. సందర్భానికి అనుగుణంగా ముగ్గులు తీర్చడంలో మగువలకుండే శ్రద్ధాసక్తులు అపరిమితం. మరీ ముఖ్యంగా ధనుర్మాసారంభంలో.. పెద్ద పండుగకి ముందు పట్టే నెల ముప్పై  దినాలూ ముద్దుగుమ్మలకు పొద్దంతా   ముగ్గుల ముచ్చట్లే! తొలి సంజె చలి పులి సైతం భయపెట్టలేదీ బేల మగువల తెగువలను. ‘ ‘ఇంత యోపిక గడించుకొన్న / దానవే తల్లి, యీ చిన్నితనమునందు?/  పిట్టలే లెక్క లల్లార్చి విడిచిపెట్ట/ బోవు మనికీ పట్టీ ముని ప్రొద్దు వేళ!’ అంటూ ‘తెలుగు కన్నె’ కర్త  బొడ్డు బాపిరాజుగారికి అంతలా ఆశ్చర్యం!  ‘కదిలి వచ్చుచున్న సంక్రాంతి రమకు/ తీపులూరించు మేటి యాతిథ్యం’ అందిచాలని తెలుగు  మిఠారీ పంతం. అందుకోసమే  ఆ భామ నరకాసుర సమరసమయ సందర్భ   సత్యభామలా కొంగు బిగించి.. ముందు వెనుకలకు వంగి.. మునిగాళ్లమీద  నిలబడి.. కదులుతూ.. ఇంటి ముంగిలి ముందు  నింగి సూర్య చంద్రులను తారా మేఘమాలికలతో సహా రేఖల సాయంతో కిందికి దించి ఏకంగా ఓ సౌందర్య సామ్రాజ్యమే సృష్టించేస్తుందట!’.. ‘సంక్రాంతి సంబరాల’ వంకన ఓ ప్రాచీన కవిగారి కల్పన.   పూర్ణ కలశం పట్టిన తెలుగు తల్లిలా, అమృతభాండమందుకొన్న జగన్మోహినిలా.. ముగ్గు గిన్నెతో కదిలే ఆ సుందరాంగి భంగిమలను దొంగచాటుగా అయినా ఆ  కవి  చూసుండాలి. తొలిజాము కలనయినా అలా గిలిగింతలు పెట్టుండాలి!
రమణులు రంగువల్లికలు  తీర్చిదిద్దే దృశ్యమాలికలు  ఎన్ని కమనీయ శృంగార ప్రబంధాలకు ప్రాణ ప్రతిష్టలు చేసుంటాయో!  ‘రంగవల్లిక అల్లికలొక స్త్రీ సంబధిత  కళాత్మక ఆభివ్యక్తీకరణం’ అంటాడు ‘కామశాస్త్రం’లో వాత్సాయనుడు.  ‘ఎక్కడ తప్పునో యని యొకించుక ఏమరపాటు లేకయే/ చుక్కలు లెక్క  పెట్టు కొనుచుండగ శ్రద్ధగ గల్పుచుండ నే/ దిక్కునుండి వచ్చెనొ అదే పనిగా తిలకించి భర్త ఓ/ ‘చక్కదనాల  చుక్క!’యన జవ్వని సిగ్గున నాపెముగ్గులన్’ అంటారు శ్రీపాద లక్ష్మీనారాయణ మూర్తి ‘సంక్రాతి ముగ్గుల’లో. నిత్యోత్సవ కళాత్మక జీవితానికి అరవై నాలుగు కళలూ ఆధారమేనన్న వాత్సాయనుడు రంగవల్లికలనూ ఆ జాబితాలో అందుకే చేర్చినట్లుంది.
‘ఆవు పేద తెచ్చి అయినిళ్లు అలికి/ గోవు పేడ తెచ్చి గోపురాలు అలికి/ ముత్యాలు చెడగొట్టి ముగ్గులేయించి/ పగడాలు చెడగొట్టి పట్టిలేయించి’.. ముగ్గుల ప్రాధాన్యతని ముచ్చటైన  మాటలలో కళ్లకు కట్టించే పల్లెపాటలు ఇలాంటివి ఇంకెన్నో! ముగ్గు కళ విశ్వవ్యాప్తం. దేశ కాల సంస్కృతుల ఆధారంగానే మార్పులు. నాగకుండలి బంధంలోని మెలికలు చలికాలంనాటి ప్రజల బాధలకు దర్పణం. రాధాకృష్ణల ముగ్గు లౌకిక సంసార యోగ రహస్యం. పుష్పాలంకృత రంగవల్లికలు జనజీవనంలోని సంతోష భావాల సంకేతాలు.  దుష్ట శక్తుల కట్టడికి ముగ్గులను ఒక కట్టడిగా ఆటవికుల కాలం నాటినుంచే భావించినట్లు పురాతత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యజ్ఞయాగాదుల్లోని ముగ్గులను గురించి రుగ్వేదం ప్రస్తావించింది. అల్పాయుష్కుడైన బిడ్డ చిరాయస్సుకోసం ఓ రాజవైద్యుడు చేసిన కఠోర దీక్షకు మెచ్చి వచ్చిన విధాత- బాలుణ్ని  పోలిన ముగ్గు వేయిస్తే.. ప్రాణ ప్రతిష్ట చేస్తాన’ని అభయమిస్తాడు. ముమ్మూర్తులా చిరంజీవిని పోలిన ముగ్గు వేయించి బిడ్డను కాపాడుకొన్న ఆ ప్రాచీన ‘సులక్షణ గ్రంథం’ కథ ముగ్గు మనిషి జీవితాన్ని ఎంతలా ప్రభావితం చేయగలదో వివరించేందుకు పనికొచ్చే   చక్కని తార్కాణం. సింధు ప్రాంతంలోని తవ్వకాలలో బైటపడ్డ స్వస్తిక్ మార్కు ముగ్గులనుంచి.. శృంగార ప్రధాన  కళ్యాణ ఘట్టాలలో  వధూవరులు అధిష్ఠించే పీటలకింది పెళ్లి పట్టీల వరకు.. ‘ఎందెందు చూసిన అందందే కలదు’  కనువిందు చేసే అందాల ముగ్గు. మలి సంజె వేళ గడపకు అడ్డంగా గీసే రెండు  కర్రల  ముగ్గు అదృష్ట లక్ష్మినయినా గుమ్మం దాటి పోనీతదని తెలుగింటి అమ్మళ్ళ ధీమా.. విశ్వాసం!

విశ్వాసాల  నిజానిజాలు ఎలాగైనా ఉండనీయండి.. మనసు సున్నిత  భావావేశాలను  సుకుమార శైలిలో వెలిబుచ్చుకొనేందుకు వెలదికి తనకంటూ దొరికే ఆ పది నిమిషాలే రోజుమొత్తంలో ఆమెకు నిజమైన విలువైన క్షణాలు. ముగ్గులు వేయడం మగువకు మంచి వ్యాయామం- అంటున్నారు ఆరోగ్య నిపుణులు. తొలి సంజెనే లేచి కళ్లాపి కలిపి.. ఆవరణలో చల్లడం కండరాలకు మంచి  వ్యాయమం! ఆసనాలు, యోగా.. అన్నీ   అతివలకు ఆ  ముగ్గులద్దే కొద్ది క్షణాలలోనే.    స్టీవ్ జాబ్స్ ‘కనెక్టింగ్ ది డాట్స్’  చదివే పాటి పరిజ్ఞానం లేకపోవచ్చు. చుక్కల లెక్కలు మహిళ బుద్ధికి చురుకు పుట్టించే మానసిక వ్యాపారం! వేలి కొసలనుంచి ముగ్గుపిండి సమంగా జాలువార్చడమంటే భావోద్వేగాలను స్వీయాధీనంలోకి తెచ్చుకుంటో వాటితో సక్రమంగా పనిచేయింధుకొనే సాధన. గీతలను కలపడం సమన్యయ సామర్థ్యాన్ని మెరుగుపెరుచుకొనే అభ్యాసం. ‘రంగవల్లికలు అర్థవంతమయిన  మనో వికాస పాఠాలు’ అంటారు మానసిక తత్వవేత రవిశంకర్.  పండుగరోజుల్లో ముగ్గు పోటీలు మగువ మనసులోని పోటీ తత్వ పటిమను గట్టిపరుస్తుంది. పండుగయిన మర్నాటినుంచి అంతా ఆటల్లో అరటి పండనే నైజం  అలవడుతుంది. ఆఖరి క్షణాల్లో హఠాత్తుగా ఏ భారీ వర్షమో కురవడం మొదలవచ్చు. ఆకతాయి వాహనాలేవైనా మీదనుంచి పోవచ్చు. ముగ్గు అందం పాడయిందని ముఖం ముడవ కూడదు. మునుపటి అనుభవంతో మరింత అందమైన ముగ్గు తీర్చిదిద్దు కోవచ్చన్న పంతం బలపడితే క్రీడాస్ఫూర్తి అలవడినట్లే. ‘తోడి కన్నె పడుచులతో గూడి పోయి/  గోమయము, బంతి పూలేరి కోరితెచ్చి/ దిద్దితీర్చివెట్టిన గొబ్బిముద్దలకును/ కొలువు పీఠమీ రంగవల్లులె  అగునగు’ అంటారొక ఆధునిక కవి. వారాలు తరబడి  నేర్చి ఎంతో శ్రమకోర్చి ముంగిలి ముందు తీర్చిన  ముగ్గయినా ఆయుష్షు ఒక రోజే! ‘నేర్చిన మరో కొత్త రతనాల రంగవల్లిక గుమ్మం ముందు కొలువు తీరాలంటే నిన్నటి ముత్యాల ముగ్గుకు సెలవు ఇవ్వాల్సిందే!’ నని  జీవిత పాఠం నేర్పించే రంగవల్లికను మించిన వికాస గురువు నెలతకు మరేమీ ఉండదు. నేలమీద చోటు కరువు. నింగికి ఆ  రంగవల్లికలు అమరవు. ఎంత ఆధునికత సంతరించుకున్నా మగువ మనసు ముగ్గుల్ని వరువవు.  అత్యాధునిక మాధ్యమం అంతర్జాలమే సాధనంగా ఇంతి ఖండాతరాలను సైతం సరకు చేయకుండా తన ముగ్గుల సామ్రాజ్యాన్ని   విస్తరించుకుంటూ పోతోంది. పుట్టింటినుంచి పసుపు కొమ్ములతో పాటు పట్టుకొచ్చిన సొమ్ములీ ముగ్గులమీది ప్రేమాభిమానాలు. మళ్లీ తన చిన్నారి చిట్టి తల్లికి ఆ ‘స్త్రీ ధనం’ పదిలంగా అప్పగిస్తేనే భారతీయ మహిళకు సంతృప్తి!  
-కర్లపాలెం హనుమంతరావు

Monday, January 9, 2017

ప్రపంచ నవ్వులకో 'దినం'

జనవరి, 10- ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా!



'ఇవాళ ప్రపంచ నవ్వుల దినం.. బాబాయ్!'
''దినం' అనద్దురా! ఏదో గుర్తొచ్చి దిగులవుతోంది!'
'ఈ వెటకారాలెప్పుడూ ఉండేవేగా! నవ్వులన్నా నీకు చేదేనా బాబాయ్.. విడ్డూరం కాకపోతే?'
'ఈ ఒక్క రోజు నవ్వేసి ఏడాది పొడుగూతా ఏడిస్తే మాత్రం ఏం లాభంరా బాబిగా? ఏడుస్తూ పుడతాం. ఏడిపిస్తూ పోతాం. మధ్యలో మళ్లా ఈ నవ్వుల తంటా ఏంటంట? నవ్వితే నాలుగిందాల చేటు..'
'ఆ చేట భారతం ఇప్పుడు తిరగేయద్దు ప్లీజ్!  పాత పడ్డ సామెతల్ని పట్టుకుని పండుగ పూట ఉత్సాహంమీద నీళ్లు పోయద్దు! నవ్వితే  రక్తపీడనం పది టు ఇరవై మిల్లిమీటర్లదాకా 'ఠ'పీమని పడిపోతుందట'
'రాజకీయాల్లేవట్రా ఇరవై టు అరవై మిల్లిమీటర్లు 'ఢ'మాల్మని పెంచడానికి! ప్రయోజనమేముందంట?'
'అందుకే బాబాయ్ మానవ సంబంధాలు మెరుగు పరుచుకోమని సామాజిక వేత్తలు మొత్తుకొనేది. అందుకు నవ్వే చవకైన మంచి మందు. లాంగ్ లైఫ్ కి లైఫ్ లాంగ్ లాఫే .. బఫే.. బాబాయ్!'
'అబ్బో .. ఇంగిలి పింగిలీసు దంచుకొచ్చేస్తుందే అబ్బాయిగారికి. ఏ.పి  ఇంగ్లీషు మీడియం జీ.వో ప్రభావమా బాబూ?'
'బాబోయ్! ఏ మాటన్నా వెటకారమే?  పరిశోధకులు చెప్పిన మాటకు తెలుగు కుదరక యథాతధంగా చెప్పా. తప్పా?'
'పనిగట్టు కొనొచ్చి భలే జోకులేస్తున్నావురా బాబూ పొద్దున్నే! పరిశోధకులకు గంటకో మాట గంట బజాయించి మరీ చెబుతుంటారు. ఏడిస్తే గుండె బరువు తీరిపోతుందని ఒహడు. నవ్వితే నలభై నాలుగు కండరాలు ఉపశమిస్తాయని ఇంకొహడు. 'నవ్వైనా.. పువ్వైనా.. నీ కోసం వికసించద'ని పాత సినిమా పాట. ఎందుకీ నిదుల వృథా పరిశోధనలు? నిష్కారణంగా నవ్వితే చెంపలు రెండూ బద్దలవుతాయి. మొన్నా మధ్య చెన్నయ్ విమానాశ్రయంలో అన్నా డి.ఎం.కె తంబికొకడికి ఓ ఎంపి అక్క చేసిన సన్మానం గుర్తుందా?'
'వెతికి వెతికి పటుకొస్తావేంది బాబాయ్ ఎక్కళ్లేని వెతలు.. కతలు? నవ్వమంటే నీకెందుకిట్లా ముళ్లు గుచ్చుకొన్నట్లుంటుందో చస్తే అర్థం కాదు. దేవుడు నవ్వడు. జంతువులు నవ్వవు. చెట్లకూ పుట్లకూ పొట్టలూ గట్రాలుండవు పగలబడి నవ్వాలన్న కోరికలు పుట్లకొద్దీ ఉన్నా. నవ్వే సౌకర్యం ఒక్క మనిషికే సొంతం. ఐదు వేల హావభావాలున్నా మనిషి మొహంలో .. ఒక్క హాసవిలాసనమే నవరత్నాలు కురిపించే అవకాశం'
'రత్నాలూ.. రవ్వలూ ఎవరికిరా కావాలీ కాలంలో? రెండు రాళ్ల పొడలు అదనంగా  మెరిసినా   బోలెడన్ని కిరికిరీలు పన్నుశాఖగాళ్లతో!  నగదుతో వ్యవహారాలు.. గట్రా   తగ్గించుకోమని మోదీలాంటి మహానుభావుడే తల మోదుకొంటుంటే.. ఇహ రాళ్లు రవ్వలతో రచ్చ చేసుకొనేదెవరబ్బా? ఎక్కడ వజ్ర వైఢూర్యాలు రాలి పడతాయోనన్న బెంగతో ఈ మధ్య పెద్దోళ్లంతా నవ్వడం బాగా తగ్గించేసారు'
'ఎక్కణ్నుంచీ ఎక్కడ కీడ్చుకుపోయావ్ బాబోయ్.. మేటరు?! నగదు రహిత లావాదేవీలు దివ్యంగా ఉంటాయెమో గానీ..



నగవు రహిత జీవితాలు మాత్రం పాత శ్రీరంజని సినిమాల్లా ఏడ్చినట్లుంటాయి! నువ్వెన్నైనా చెప్పు! నవ్వుకు ప్రత్యామ్నాయమే లెదంతే!'
'నవ్వి పోతార్రా ఆ మాట పైగ్గాని అంటే! నిత్యానంద స్వామి పళ్లికిలిస్తూ  విడియోల పడి పరువు పోగొట్టుకుంటే.. ఎడ్యూరప్ప ఏడ్చి.. పోయిన పదవుల్ని  మళ్లీ సాధించాడు. నవ్వుకే అన్ని లాభాలుంటే పదేళ్లపాటు మన్మోహన్ సింగెందుకు ఎప్పుడూ మాడు మొహంతోనే  దర్శనిమిస్తాడు? గిట్టుబాటయితే సింగపూరు బాటయినా  వదిలి పెట్టడు మన  ఏపి సియం చంద్రబాబు. మనవడు దగ్గరున్నప్పుడు తప్పించి ఆయనెప్పుడూ నవ్వినట్లు కనిపించడు!'
'నలుగుర్లో నవ్వితే అలుసు. పులుసులో ముక్కలా తీసేస్తారని తెలుసు. రోజుకో వందకు తక్కువ కాకుండా చిర్నవ్వులు చిందిసుండే తప్ప అప్పు వాయిదాలు వేళకి విడుదలవవని నాబార్డు నిబంధనలు సవరించండి. బ్రహ్మానందం ట్యూషన్ పెట్టుకొనైనా నవ్వులు సాధన చేస్తాడు. హాస ప్రయోజనాలు తెలీని జనాలెవరు బాబాయ్ ఈ రోజుల్లో?'
' ఏం ప్రయోజనాల్లేరా? ఇన్నేసి హాస్య చిత్రాలు చిత్రరంగాన్ని ముంచెత్తేస్తున్నాయౕ అన్నీ నిర్మాతను ముంచేసేవే? పటాస్ కార్యక్రమంకన్నా టీ.వీ లో 'టియర్ గ్యాస్' ధారావాహికాలకే టి ఆర్ పి రేటింగెక్కువగా తగలడింది. అయినా నువ్విట్లా పరగడుపునే 'పక పకా నవ్వమ'ని పని గట్టుకు కొంప కొంపకీ తిరగడమెందుకురా.. పరగడుపునే?కోట్లక్కోట్లు కుంభకోణాల్లో కుమ్మేసిన బాబులు కేవలం రెండు వేల కొత్త నోటుకోసం బ్యాంకు క్యూలో గంటల కొద్దీ నిలబడినప్పుడే  పొట్ట పగిలింది దేశం మొత్తానికి. పరగడుపునే బహిష్కరణ.. మిట్ట మధ్యాహ్నం ఆలింగనం,  రాత్రి భోజనం బల్ల ముందు రాజీ! ములాయంజీ పస్తాయింపుల్చూస్తూ నవ్వాపుకోగల సత్తా బహుకొద్దిమందికే ఉంటుంది. హస్తిన ప్రధాని పీఠాన్ని కూలదోయాలని దీదీ పదే పదే కర్రుచ్చుకొని  చేసే చిందు భాగోతం  నవ్వు తెప్పించదెవరికి? తెనాలి రామలింగడే అక్కర్లేదు.. ఢిల్లీ మార్కు కేజ్రీవాల్లాంటి విదూకషుడొక్కడున్నా చాలు.. నేటి రాజకీయాలు డొక్కలు నొప్పుట్టించే నవ్వుల తూటాలే!'
'అవన్నీ రాజకీయాల్లో బాబాయ్! రోజువారీ బతుకుల చీకాకులతో చిరాకెక్కే  సామాన్యుడుకి  సవ్యంగా నవ్వుకొనేందుకు నాలుగు సెకన్లైనా కావాలి గదా?'
'రోజువారీ అవసరాలకు సరిపడా చిల్లర వాడి చేతుల్లో పొయ్యి! ఏ టి యం మీటలు నొక్కంగానే 'నగదు లేదు' చీటీకి బదులు నగదు సరిపడినంతగా వచ్చే ఏర్పాటు చెయ్యి! బ్యాంకు చెక్కులకి చిక్కుముళ్లేవీ పడకుండా చటుక్కున రొక్కం వచ్చేట్లు మార్పులు చెయ్యి! గీకే యంత్రాలు గీరబోకుండా కార్డు లాగంగానే పని పూర్తయే ఏ తారక  మంత్రం  కనిపెడతావో? జనం పెదాలమీద చిర్నవ్వులు పూయాలంటే ఇలాగే ఇంకా ఎన్నో చెయ్యాలి ముందు.  ఏడాదికో సారి ప్రపంచంతో పాటు  'నవ్వుల దినోత్సవాలు'  ఎంత ఘనంగానైనా   నిర్వహించుకోరా! తప్పేంలేదుగాని..  ఈ రెండు వేల పదిహేడులో ఏ రెండు వేల నోటు కంటబడ్డా కేవలం ఓ 'పది' మంది మాత్రమే గుర్తుకొచ్చే సంకట స్థితినుంచి మాత్రం దేశమంతా  బైటపడాలిరా ముందు!'
'నిజమే బాబాయ్! అప్పుడే ఇవాళ్టి 'ప్రపంచ నవ్వుల దినా'నికి 'దినం' అనే అర్థం కాకుండా  'దినోత్సవం' అన్న అర్థం సార్థకమయ్యేది! అందకా మన వంతు ప్రయత్నం కూడా కొంత ఉండాలి గదా! ఈ సారి ఖైరతాబాద్ ట్రాఫిక్ మధ్యలో ఇరుక్కున్న శాల్తీలక్కూడా విసుక్కి బదులు కిసుక్కుమని నవ్వే ఓపిక సాధన చేయిస్తున్నాం.. మూసీ పక్కన ఖాళీ స్థలం వేదిక.    రోజూ నువ్వటే గదా పోయి.. అక్కడే ఇరుక్కుని ప్రపంచాన్నంతా పడ తిట్టేది!  వెటకారాలు నూరుతుండేది! ఒకళ్ల మీద ఒకళ్లు చక్కటి ఛలోక్తులు ఎలా విసురుకొంటారో.. విసుగు ప్రదర్శించకుండా క్రీడాస్ఫూర్తితో ఎంత   ఉల్లాసంగా కాలక్షేపం చేస్తారో చూద్దువుగానీ ఒకసారి పద బాబాయ్! నవ్వడానికి ఏదైనా కారణం తప్పని సరిగా ఉండాలని భావించే నీలాంటి వాళ్లు తప్పకుండా దర్శించవలసిన పురుషార్థ క్షేత్రం అనుకో! ఎన్నో ఏళ్ల కిందట ఎక్కడో ముంబయి రేసుకోర్సులో అనుకోకుండా కలసిని పెద్దలు కొందరు మానసికోల్లాసానికని కనిపెట్టిన మంచి మందు ఈ సామూహిక హాస్య ప్రయోగం.  నువ్వూ కాస్త పుచ్చుకుని చూడు బాబాయ్!    
‘ఏడిపించే వాళ్లే ఎక్కువవుతున్న ఈ కలి కాలంలో నవ్విస్తాం రమ్మని పిల్చేవాళ్లు దొరకడం నిజంగా అదృష్టమేగా!  ఛలోరా అబ్బాయ్.. మీ చలాకీ సభాస్థలికి!
-కర్లపాలెం హనుమంతరావు
***



లబలబల బలాబలాలు- ఏడుపు వల్ల ఎన్ని లాభాలో!- ఈనాడు సరదా వ్యాఖ్య


ఏడవడం గొప్ప కళ. కావాల్సొచ్చినప్పుడు కలవరపడిపోయి కడవల కొద్దీ కన్నీరు కార్చడం అందరికీ అంత సులభంగా అబ్బే విద్య కాదు. 'ఆ పిల్ల ఏవిఁటండీ బాబూ! ఎప్పుడూ నీళ్లకుండ నెత్తిమీదే పెట్టుకునుంటుందీ!' అని తిట్టిపోయడం తప్పు. ఏ ఉల్లిపాయ, గ్లిజరిన్ సీసాల సాయం లేకుండా అలా వలవలా ఏడ్వాలంటే ఎంత గుండెబలం కావాలీ?! బాలలకు, అబలలకనే కాదు.. లబలబలు నేతలందరికీ  కొండంత బలం. కాబట్టే పేదలకి అండగా ఉంటామని భరోసా ఇచ్చే  ధీశాలులూ భోరుమని కన్నీళ్ళు పెట్టుకుంటుంటారు అవసర మొచ్చినప్పుడు.
రోదన ప్రాధాన్యత రామాయణ కాలంబట్టె మహా ప్రాచుర్యంలో ఉంది. కోక తడుపుకొనైనా  కైకమ్మ కొడుక్కి పట్టం కట్టబెట్టాలనుకొన్నది. ముక్కు తిమ్మనగారి సత్యభామ ఎంత ముద్దుగా ముక్కు చీదకపోతే తిరిగి పారిజాతం దక్కించుకోగలింది?! 'ధర్మ విరుద్ధం, నరక కారకం. అపకీర్తి దాయకం.. అంటూ భగవద్గీత ఎన్ని అధ్యాయాలలో ముక్కదొబ్బులు పెట్టినా ..  ముక్కు చీదుళ్లను  చీదరించుకొంటే చివరికి విషాదయోగమే మిగులుస్తుంది.
కరుణానిధి కూతురు  తీహారు జైలు కన్నీళ్ల కథ గుర్తుందా? ఆ ఏడుపేదో ముందే  ఏడ్చుంటే ఆర్నెల్ల పాటు ఆ జైలు సిబ్బంది సెక్యూరిటీ కష్టాలు తప్పించినట్లయేది. చెరగండంనుండి గట్టెక్కాలనుంటే కల్మాడీలాగా వట్టి  'పిచ్చి' వేషాలే చాలవు. దేవుణ్నడ్డు పెట్టుకున్నా యాత్రల వరకే తాత్కాలిక ముక్తి. కన్నతల్లి సెంటిమెంటైనా పండక పోవచ్చు కానీ 'కళ్లకు ఆయింట్ మెంట్' తంత్రం ఎన్నడూ విఫలమయింది లేదిప్పటి వరకూ.. చరిత్రలో! దిక్కులేని దశలో దుఃఖమొక్కటే అక్కరకొచ్చేది.

యడ్యూరప్పకు ఏడుపు పవరేమిటో  తెలుసు. కాబట్టే పవర్లో ఉన్నంత కాలవూఁ ఏడుపు పోర్టిఫోలియోని తన దగ్గరే ఉంచుకొన్నాడు. బిక్క మొగమేయడం తప్ప  బిగ్గరగా ఏడవడం రాకే సత్యం రామలింగరాజు అన్నేళ్ళు అన్యాయంగా చిప్పకూడు తిన్నాడు. ఇనుప గనుల 'గాలి'  లక్షలు కోట్లు నిధులున్నా సాధించుకోలేని బెయిలు.. కేవలం ఓ పాతిక వేల పూచీకత్తుతో ఓ శ్రీ లక్ష్మి మ్యాడమ్ సాధించగలిగారు. ఆ ఘనత అమ్మగారిది కాదు.. అమె నెత్తిమీదున్న గంగాభవానిది
'నవ్వుకొనేందుకు  ముఫ్ఫై రెండు పళ్లు. ఏడవాలంటే కేవలం ఓ రెండు కళ్లే' అంటూ నవ్వుల సంఘం వాళ్లేవేవోఁ కుళ్లు కొటేషన్లు కొడుతుంటారు. నిజానికి నవ్వు నాలుగిందాల చేటు. మయసభా మధ్యంలో  పగలబడి నవ్వినందుకు పాంచాలికి పడ్డ గతి అందరికీ తెలుసు. కురుసభా మధ్యమంలో చిక్కడిపోయినప్పుడు 'హే కృష్ణా!' అంటూ చేసిన రోదనే కదా ఆ సాథ్వీమణి శీలాన్ని కాపాడ గలిగిందీ!
  'కలకంఠి కంట కన్నీరు ఒలికితే ఇంట సిరి నిలవదంటారు . వట్టిదే! చెరసాల చిప్పకూడు  ముప్పొఛ్చి పడ్డప్పుడు కాపాడేది  ఐయేయస్.. ఐపీయసుల్లో టాపు ర్యాంకుల యుక్తి కాదు! విరామం లేకుండా విసుగు పుట్టించే పాటి ఆరున్నొక్కరాగ  స్వరశక్తి.'ఇమ్మనుజేశ్వరాధములకు తన్నమ్మద్దని బమ్మెర వారింటి గుమంలో కూర్చుని కుమిలిపోయిన పలుకంజలి చేసిన గమ్మత్తదే కదా!
'ఏడవకు ఏడవకు వెర్రి నాగన్నా! ఏడిస్తే నీ కళ్లు నీలాలు కారు' అంటూ  తల్లులు పిల్లల్ని జోలపాటలప్పట్నుంచే తప్పుదారి పట్టించడం తప్పు. ఏమో.. ఎవరికెరుక? పెరిగి పెద్దయింతరువాత ఏ పెద్ద నోట్ల రద్దు గండంలో పడి జైలు పాలబడాల్సొస్తుందో? కీడెంచి మేలెంచమని కదా సామెత! 'కీ' ఇచ్చినట్లు రోదించడం బిడ్డకు ఉగ్గుపాలతోనే వంటబటించడం మంచిది.. బెయిళ్ల మీదన్నా జైళ్ల  బైట  మహారాజుల్లా బతికుబండి లాగేయచ్చు.
'వట్టి ఏడుపుగొట్టు' అనేదిహ ఎంత మాత్రం తిట్టుపదంగా భావించరాదు.   చంచల్ గూడా సెంట్రల్నుంచొచ్చినా  ఊటీ కెళ్లొచ్చినంత హుషారుగా ఉంచేదీ  బాష్పధారాస్త్రం!
నేరం మోపినప్పుడు మాయదారి రోగాలు కొనితెచ్చుకోడం పాతకాలంనాటి చిట్కా. రోజులు బాగా లేవు. నిజంగానే ఆరోగ్యం హరించుకు పోతున్నా అమర్ సింగతటి బుద్ధిజీవికే ఊరట దుర్లభంగా ఉందీ మధ్య కాలంలో.  ముందస్తు బెయిలు పప్పులు మునపటంతా సులభంగా ఉడకనప్పుడు.. ఆపకుండా నెత్తిమీద కుళాయి నొదిలి పెట్టి కూర్చోడ మొక్కటే ఆపదల్నుంచీ ఆదుకునే ఏకైక సాధనం. ఏమడిగినా ఏడుపొక్కటే జవాబుగా రావాలి. ఎంత గద్దిస్తే అంతగా దద్దరిల్లి పోవాలి రోదన. మౌనం అనర్థం. అర్థాంగీకారం కింద చలామణయ్యే ప్రమాదం పొచుంటుందందులో. ఆరున్నొక్క రాగం  రొదలో మనమేం చెబుతున్నామో అవతల  బుర్రకి  అర్థమై చావక  ఏడిచ్చావాలి. ఎన్ని చేతి రుమాళ్లు తడిస్తే అంత ఫలం. 'వలవలా ఏడ్చే 
బిడ్డరచేతికే  అరటి పండొచ్చి పడేద'న్నసామెత  మరిస్తే ఎలా? 
ఏడుపంటే మరీ అంత దడుపెందుకు? ఏడుస్తూనే పుడతాం. ఏడిపిస్తూ వెళ్ళిపోతాం. బతికినంత కాలం మనకు ఏడుపు.  పోయిన తరువాత మనవాళ్లకేడుపు. పుట్టినా, గిట్టినా; ఉన్నా, పోయినా తప్పించుకోలేని కన్నీటి సుళ్లనుండి వీలైనంత బెల్లంపాకం వండటమే సిసలైన స్థితప్రజ్ఞ. ఏడుపు అవసరమైనప్పుడు మొహమాటానికి పోయి   నవ్వడం కన్నాణం సరి కొత్తగా బైట పడుతున్న రోజులివి. సిబిఐ వామనుడు ముందు ఎవడెప్పుడు 'బలి' కావాల్సొస్తుందో దేవుడిక్కూడా ఉప్పందని రోజులు కూడా. 
ముందస్తు బెయిళ్లు, సెంటిమెంటు ఇళ్లు,  న్యాయదేవుళ్లకి ముడుపులు, సత్యదేవుళ్లకు సుళ్లు, మాయ రోగాలు, శాంతి పూజలు, దక్షిణ ప్రదక్షిణల్లాంటి రొటీన్ చిటుకులమీదే సంపూర్ణ ధీమాలు క్షేమకరం కాదు. ఎందుకైనా మంచిది.. ఇరవైనాలుగ్గంటలూ విరామ మెరుక్కుండా నెత్తిమీద కుండ నీళ్లు కారేట్లు  సాధన చేసుకోండి.. మంచిది*
-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు, 06-12-2011 నాటి దినపత్రిక, సంపాదకీయ పుటలో ప్రచురితం)

Monday, January 2, 2017

కుల మతాలు- సతమతాలు- వార్తా వ్యాఖ్య-


కుల మతాలు.. మల మూత్రాలవంటివట.. మొదటిది విడిస్తే దేశానికి, రెండోది విసర్జిస్తే  దేహానికి ఆరోగ్యం అని ఓ మినీ కవి ఉద్భోధ. 'మంచి చెడులు రెండు కులములు.. మంచి అన్నది మాల అయితే నే మాలనే అవుతాను' అని గురజాడవారూ ఓ కవిత చెప్పినట్లు గుర్తు. కులాల పేరుతో కుమ్ములాటలు, మతాల పేరిట మత్సరాలు, వర్గాల వంకతో వైషమ్యాలు, ప్రాంతాల  పేరుతో  పేచీలు, లైంగిక దృష్టితో వేధించడాలు, తరాల అంతరాలతో తగాయిదాలు.. అభివృద్ధికి అడ్డంకిగా మారే  ఏ ప్రతికూల శక్తినైనా నిర్ద్వంద్వంగా తిరస్కరించాల్సిందే. నిన్న సర్వోన్నత న్యాయస్థానం పాత దావామీద అప్పట్లో ఇచ్చిన ఓ తీర్పును తిరగరాస్తూ.. ఎన్నికల్లో  కుల, మత, వర్గ, లైంగికాది  కోణాల్లో ఓట్లను అభ్యర్థించడం  అవినీతి సెక్షన్లకింద శిక్షార్హమవుతుందని కుండబద్దలు కొట్టింది. పదిహేను ఏళ్ల కిందటి  ఎన్నికల్లో ఓ శివసేన అభ్యర్థి విజయం హిందూత్వ కోణంలో ప్రచారం చేసుకోడం వల్ల సాధ్యమయిందని.. పిటీషన్ రావడం.. విచారణ అనంతరం 'హిందూత్వం' ఓ జీవన విధానంగా  భావించి  ఆ కేసుని కొట్టివేయడం జరిగింది. తదనంరం జరిగిన పరిణామాల్లో మళ్లా ఆ కేసు విచారణకు వచ్చిన నేపథ్యంలో బెంచీలో ఉన్న   ఏడుగురు  న్యాయాధీశుల్లో నలుగురు కులమతాల్లాంటి భావోద్వేగ అంశాల ఆధారంగా సాధించిన గెలుపుకి లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థలో విలువ ఉండరాదన్న సంచలనాత్మకమైన తీర్పునిచ్చారు. ముగ్గురు న్యాయాధీశులు మాత్రం మునుపటి తీర్పుకే కట్టుబడి ఉన్నారు. కొత్త తీర్పు రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచార సరళిలో ఎలాంటి మార్పు తీసుకు రాబోతున్నదనే రాజకీయ విశ్లేషకుల ప్రస్తుత చర్చ.
పేరుకు మనది భారతదేశం. పరిపాలనా వ్యవస్థ రాజ్యాంగం ప్రకారం కులాతీత మతాతీత సర్వ సత్తాక విధానం. గతంలో ఇదే దేశాన్ని హిందూ దేశమనీ  పిలుస్తండేవాళ్లు. ఇక్కడి పాలనంతా ప్రజాస్వామిక పద్ధతిలో సాగిందేమీ కాదు.  హిందువులు అధికంగా ఉన్న భూఖండం ఇది. చిన్న చిన్న సంస్థానాలుగా ఉండి ఎవరికి తోచిన తీరులో వారు పరిలింపాచుకుని పోయిన వైనం  చరిత్ర స్పష్టం చేస్తుంది. ఎన్నో సంస్కృతులవారు ఈ దేశంమీదకు దండెత్తి వచ్చినా ఇక్కడి సమాజంలోని  కుల, మత వ్యవస్థను ఏ మాత్రం ప్రభావితం చేయలేక పోయారు. సరికదా.. ఇక్కడి నిచ్చెన మెట్ల వ్యవస్థకే తమను తాము సర్దుబాటు చేస్తుకోవాల్సి వచ్చింది మనుగడ కోసం. అంతటి బలమైన ఆధ్యాత్మిక సంస్కృతిని వారసత్వంగా పుణికి పుచ్చుకుంటూ వస్తున్న వ్యవస్థని ఉన్నత న్యాయస్థానం కొత్త తీర్పు ఎంత వరకు ప్రభావితం చేయగలదన్నది ప్రశ్నార్థకమే!

పుట్టుకతో అతుక్కునేది మతం కులం ఈ దేశంలో. పేరు పెట్టడంనుంచి.. బళ్లల్లో చదవడం.. స్నేహితులతో తిరగడం.. పెళ్ళి పేరంటాలు చేసుకోడం.. కన్న పిల్లల్ల్ని మళ్లీ పెంచడం.. చివరకి కాటి ప్రయాణంతో ముగిసే వరకు ఇక్కడి మనిషికి మతం, కులం, వర్గం, జాతి.. అన్నింటిలోనూ మత కులాల ప్రభావమే కొట్టొచ్చినట్లు  కనిపించేది. కొత్త మనిషి ఎదురైనప్పుడు ఏ మాత్రం సంకోచం లేకుండా ' ఏమట్లు?' అనడిగేస్తారు ఇక్కడి పల్లెల్లో. పట్టణ నాగరికత మరీ అంత మొరటుతనాన్ని ఆశ్రయించ లేకున్నా  చాటుగానైనా వ్యక్తి కుల మతాదుల్లాంటి వివరాలు కూపీ తీయందే తోచనీయదు. పెళ్లి పేరంటాల్లాంటి సంబరాల్లోమతం కులం.. వాటికి సంబంధించిన ఆచారాలదే ప్రధాన పాత్ర. పెళ్లిసంబంధాలు వెతుక్కునే వేళ మాది ఫలానా కులం.. మాకు ఫలానా శాఖవాళ్లే కావాలన్న నిబంధన బహిరంగంగానే వినపడుతుంటుంది. ప్రేమ వివాహాలలో సైతం కులం.. మతం వగైరాలు  చూసుకుంటున్నారు యువతరం. ఇళ్లు అద్దెకిచ్చే సమయంలో 'మేం ఫలానా కులపోళ్లకే అద్దెకిస్తాం.. లేకపోతే ఖాళీగానైనా ఉంచుకొంటాం' అనే ధోరణి ఈ నాటికీ ఉన్నది. కుల మతాల ప్రకారం రిజర్వేషన్లే మోతాదులో ఉండాలో  రాజ్యాంగమే నిర్దేశిస్తున్నది. చదువులు, ఉద్యోగాలు,  ఉపాధులు, విద్యార్థి వేతనాల్లాంటి సర్కారు వ్యవహారాల్లోనే  కోటాలున్న దేశం మనది. మమ్మల్ని ఫలనా తరగతిలో చేర్చమని  'ధర్మయుద్ధం' సాగుతుంటే.. ఓట్ల దృష్టితో వాటిని సమర్థించే రాజకీయ పక్షాలకే మనుగడగా ఉందీ దేశ రాజకీయ వాతావరణం కూడా. బైటికి చెప్పరు గానీ.. చాలా ప్రభుత్వ నియామకాల్లో ఈ కుల మతాలు.. శాఖలు ప్రఛ్చన్న పాత్ర పోషిస్తుంటాయని  అందరికీ తెలిసిన రహస్యమే, మైనారిటీ వర్గాల పేరిట కొన్ని మతాల వాళ్లు ప్రత్యేక రాయితీలు డిమాండు చేస్తుంటే.. ఆర్థికంగా వెనకబడ్డామన్న వంకతో కులాలు సంఘాలు కట్టి ప్రత్యేక హోదాలకోసం ప్రభుత్వాలని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసే స్థాయికి వచ్చేసింది ఇప్పటి సమాజం.
ప్రభుత్వాలు కూడా తక్కువేం తనలేదు. న్యాయంగా కుల మతాల ప్రస్తావన రాజ్యాంగ పరిమితుల మేరకే తీసుకురావాలి. చట్టాలను ఏ ప్రభుత్వాలూ పట్టించుకోవడం లేదు. ఫలానా గీత పనివాళ్లకు ఈ రాయితీలు, ఫలానా కులపోళ్లకి ప్రత్యేక నిధులు, ఫలానా వృత్తికార్మికులకు రెండు పడగ్గదులిళ్లు.. అంటూ జనం మెడలు వంచి వసూలు చేసిన సొమ్మును పప్పు బెల్లాల్లా పంచేస్తున్నాయి ప్రభుత్వాలు. తమిళనాడులో వెనకబడిన వర్గాల వారికి తెగబడి మరీ కోటాకి మించి రిజర్వేషన్లిచ్చి మిగతా ప్రభుత్వాలమీద నిష్కారణమైన వత్తిడిని పెంచిన తీరుని మనం గమనించవచ్చు.
సర్కారు తరుఫున జరిగే కార్యక్రమాలలో సైతం ఒక మతం తాలూకు ఆచార వ్యవహరాలకు ప్రాధాన్యమివ్వడాన్ని ఎవరూ ప్రశ్నించడం లేదు. ప్రశ్నించిన జయప్రకాష్ లాంటి వాళ్లకు అసలు రాజకీయాల్లోనే ఉండలెని వాతావరణం కల్పిస్తున్నారు. కొత్త రాష్ట్ర సాధన కోసం కోట్లు ముడుపులు కట్టడం.. గద్దెనిక్కింతరువాత సర్కారు సొమ్మును అప్పనంగా మతకార్యక్రామాలకు ధారపోయడం.. లౌకిక వ్యవస్థని చెప్పుకునే పాలనాయంత్రాంగానికి  తగినదేనా? ఉనికిలోలేని జనసంఘం పక్షానికి జవసత్వాలు కల్పించే ఉద్దేశంతో అద్వానీ సాగించిన రథయాత్ర, తదనంతరం సాగించిన రామజన్మభూమి నిర్మాణం ఉద్యమం మనం మర్చిపోలేం. బాబ్రీ మసీదుని కూలగొట్టిన తరువాత భారతీయ జనతా పార్టీ ప్రాభవానికి ఉత్తర భారతంలో తిరుగే లేకుండా పోయింది. హస్తం పార్టీ ఆధ్వర్యంలో దశాబ్ద కాలంగా సాగిన అక్రమ పాలనకు విసిగిన ఓటరు జాతీయంగా మరో ప్రత్యామ్నాయం లేక భాజపాని భుజాన ఎత్తుకొన్నందుకు ఈ రెండున్నరేళ్లుగా చవిచూస్తున్న అతివాద మతోన్మాద అనుభవాలు చాలు.. ఈ దేశంలో మానవ సమాజంమీద మతాలకి.. మరింత లోతుల్లోకి వెళితే కులాలకి.. ఇంకా కిందకి జొరబడితే వర్గాలకి.. శాఖలకి ఎంత అనుచితమైన పట్టుందో తెలియడానికి.  భాజపా పక్షం అనూహ్యమైన విజయం మత్తుని తమ విధానాల ప్రాభవానికి విజయంగా భావిస్తున్న మతోన్మాద శక్తులు అనధికారికంగా అధికార దండం వత్తాసుతో సాగిస్తున్న అమానుష కర్మకాండను అచ్చమైన లౌకిక ప్రజాస్వామ్య ప్రేమికులెవరూ హర్షించ లేనిది. ఇప్పటికీ ఎక్కడ ఏ రూపంలో, ఏ స్థాయిలో ఎన్నికల జాతర మొదలయినా.. మత శక్తులు మూకుమ్మడిగా  వ్యవస్థకు అవసరంలేని సిద్ధాంతాలతో ఓటర్ల భవోద్వేగాలను రెచ్చగొట్టడం అత్యంత విషాదకరమైన అంశం.
ఈ మొత్తం పరిస్థితిని పరిగణనలోకి తీసుకునే ఉన్నత న్యాయస్థానం పాత కేసు పునర్విచారణ మిషతో సమున్నతమైన తీర్పు దయచేసింది. ధన్యవాధాలు.. అభినందనలు చెప్పవలసిందే. కానీ వ్యవస్థలోని వాస్తవ పరిస్థితులు ఈ తీర్పు అమలుకి అనువైన వాతావరణాన్ని ఎంతవరకు సృష్తిస్తాయన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.
-కర్లపాలెం హనుమంతరావు


  

Saturday, December 31, 2016

హ్యాపీ న్యూ యియర్ !- కర్లపాలెం హనుమంతరావు


కొత్త సంవత్సరం రానే వచ్చింది. సంబరాలు పడిపోతున్నాం అందరం. సహజం. కొత్త ఏదైనా ఉత్సాహంగానే ఉంటుంది. ఉండాలి. కొత్త వాహనం.. కొత్త కాపురం మాదిరి. వాడకం పెరుగుతున్న కొద్దీ కదా వాటి కొత్త కష్టాలు అనుభవంలోకొచ్చేది!అందాకా అందరికీ 'నూతన సంవత్సర శుభాకాంక్షలు!
అపశకునమేదో 'ధ్వని'స్తున్నదంటారా? 'శుభవాఁ అని పెళ్లి జరుగుతుంటే.. మంగళ వాయిద్యాల మధ్య ఈ తుమ్ముళ్లేవిఁటి?!' అని చిరాకా? కానీ.. 'కీడెంచి మేలంచమ'ని కూడా అన్నారు కదండీ!ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తకోసం!
పాత తీర్మానాలు మళ్ళీ కొత్తగా తీసుకునేందుకు  కొత్త సంవత్సరానికి మించిన మంచి అదను మరోటి లేదనుకోండి. 'ఉగాది' ఉన్నా అది అచ్చంగా  తెలుగువాళ్ల ఉత్సాహం. ప్రపంచ వ్యాప్తంగా మన ప్రతిజ్ఞలు.. ప్రమాణాలు వినబడాలంటే కొత్త ఏడాదే సరైన సందర్భం. ఉగాదిలో ఒకింత మత పరమైన తంతూ ఉంటుంది. ఉగాది పచ్చడి గొంతుకడ్డం పడుతుంది.  షడ్రుచులంటారే  కానీ.. అదేందో.. ఎంత మామిడి ముక్క, అల్లం తొక్క, బెల్లం పిక్క, చెరుకు చెక్క, ఉప్పుతో రంగరించినా ఒక్క వేపచేదే నాలిక్కి తగిలేది! అదీగాక.. తెల్లారగట్టే లేచిపోవాలి. అభ్యంగన స్నానాదులాచరించాలి. అట్లాంటి తంటాలేవీ ఉండవు. కాబట్టే న్యూ ఇయర్ నిజమైన  పండగయింది నేటి కుర్రకారుకి.  వచ్చింది ఉగాది కాదు. కాబట్టి ఇప్పుడా రచ్చొద్దు. కొత్త సంవత్సరం  గూర్చి కొద్దిగా చర్చించుకొంటే సందర్భ శుద్ధిగా ఉంటుంది.. కదూ!
కొత్త ఏడాది రావాలంటే ముందటి ఏడాది పోవాలి ముందు. పాతది పోతూ.. కొత్తది వచ్చే సంధికాలం అర్థరాత్రి. పన్నెండు గంటల్లో ఆ  ఆఖరి గంట చివర్లో లోకం  సంధి జ్వరం వచ్చినట్లు వెర్రెత్తి పోతుంది! అట్లాంటి ఊగిపోయే అవకాశం మన పండగల్లో ఒక్క పోలేరమ్మ జాతర్లలో గణాచారి కొక్కళ్లకే దక్కేది.  అమెరికా ఖండం ఆ చివర్నుంచి.. ఆఫ్రికా ఖండం ఈ చివర్దాకా.. భూగోళమంతటా  అఖండమైన గోల. నిజవేఁ కానీ అంతతా ఒకే సారి ఊగుళ్ళు తూగుళ్ళూ ఉండవు. మనమిక్కడ రాత్రి భోజనానికని కూర్చున్న సమయంలో ఇంకెక్కడో జనం 'హ్యాపీ న్యూ యియర్' అంటూ టపాసులు పేలుస్తారు. ఇంకెక్కడో 'కొత్తేడాది సంబరాలు' అంబరాన్ని అంటే వేళకి మనం పడకమీద గుర్రు కొడుతుంటాం. కాకపోతే అన్ని చోట్లా అందరికీ  కామన్ గా కనిపించే దృశ్యం మేందంటే.. పోలీసులు.. తుపాకులూ గట్రా భయం లేకుండా   ఎవరికి తోచినట్లు వాళ్లు యధేఛ్ఛగా  అల్లర్లు చేసుకోవచ్చు ఆ నాలుగ్గంటలూ. విచ్చలవిడితనానికి విడిగా ప్రభుత్వాల పర్మిషన్లు అక్కర్లేని  క్షణాలు ఏడాది మొత్తంలో ఆ ఒక్క నాలుఘ్ఘడియలే!
మన దగ్గర మందూ మాకుతో కుర్రకారు సిద్ధంగా ఉంటారు చాలా ముందునుంచే. డ్రంకెన్ డైవ్ ని సహించవఁటారుగానీ పోలీసులు అదొట్టి  'ప్రెస్' మార్కు  బెదిరింపే.  కొత్త సంవత్సరం మూడ్ కి దూరంగా ఉండేందుకు పోలీసోళ్లేవఁన్నా   ప్రవరాఖ్యుడి  చినతమ్ముళ్లా?
ఈ అరుపులూ.. ఆగవఁతా బహిరంగంగా జరిగే వీరంగం. క్లబ్బుల్లో, పబ్బుల్లో ఇంతకు పదింతల తతంగం సాగుతుందంటారు. ఆ స్వర్గ కార్యకలాపాల్లో అన్ని వర్గాల   తలకాయలు దూరడం విధాయకం. కాబట్టి  తెల్లారింతరువాత ఎవరూ తలకాయలు పట్టుకొని విచారించే అవసరం ఉండదు.. ఒక్క హాంగోవరు తగులుకుంటే తప్ప.
కొత్తేడాదంటే కేవలం ఒక్క మందు కొట్టే సంబరవేఁ కాదు.  గ్రీటింగుల పండక్కూడా. యియర్ ఎండింగెప్పుడూ మంత్ ఎండిగులోనే రావడం కాలం పన్నే కుట్ర. ఇప్పుడంటే ఇంటర్నెట్లాదుకుంటున్నాయి. గతంలో తపాలావారే దిక్కు. ధరలు ఆకాశంలో విహరించే రోజుల్లో   ఆ కార్డుల కొనుగోలో  గగనకుసుమం.  స్టాంపులంటించి కవర్లు పోస్టుబాక్సుల్లో వేయడం    తలకు మించిన వ్యవహారం.  అయినా పాలుమాలేందుకు లేదు. తల తాకట్టయినా పెట్టి జరిపించాల్సిన తంతు.  పక్షంరోజులకు ముందునుంచే రాబోయే కొత్తేడాదికి  'నూతన సంవత్సర శుబాకాంక్షలు' ఆశిస్తూ కార్డులూ, కవర్లూ వచ్చి వెళుతుండేవి.. అటూ ఇటూ. 'ఇచ్చుకొన్న వాయినం .. పుచ్చుకొన్న వాయినం' తంతే ఈ శుభాకాంక్షల తీరు ఏ మాత్రం తేడా పడ్డా సో కాల్డ్ స్నేహ బందం  సిమెంట్ తక్కువ వంతెనలా కుప్పకూలడం ఖాయం.  పత్రికలేవీ గ్రీటింగులు పంపవు. అయినా రచయితలు 'మీ/మా' పత్రిక అభివృద్ధిని కాంక్షించాలి. బాసాసురులు పెదవైనా విప్పరు. ఐనా ఉద్యోగస్తుడు  పళ్లికిలిస్తూ పండో.. ఫండో ఇచ్చి శుభాకాంక్షలు తెలపాలి.   గుత్తేదారుకి  దారులు తెరిచేదే శుభాకాంక్షల సులువుసూత్రమే. కార్యకర్త ఖర్మను తేల్చేదీ ఈ కొత్తేడాది శుభాకామనలే.  పరిశోధన విద్యార్థి పరిశ్రమను కడతెర్చే తారక మంత్ర మీ కొత్తేడాది గ్రీటింగ్సులోనే దాగుంటుంది.
లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్.. తీర్మానంబులు. పాతవే కావచ్చు కానీ  మళ్ళీ కొత్తగా తీసుకోవాలి.  శ్రీవారులకు ధూమపానం మైన్ సబ్జెక్ట్. అదే వారు.. అదే కుటుంబం.. అదే శపథం.. తారీఖొక్కటే తేడా! ఇలాళ్లెవరూ  ఇలాంటి  డొల్ల తీర్మానాల జోలికి రారు. వాళ్లకే దురవాట్లు ఉండవు. టీ.వీ వాచింగ్, శారీస్, గోల్డ్..  షాపింగులు దురవాట్లేనన్న మగవాళ్లు భూమ్మీద మిగిలుండరు. బొట్టికాయలమీదే  ఈ కొత్తేడాది తీర్మానాల వత్తిడి ఎక్కువగా ఉంటుంది.. పాపం! చెడ్డ మాటలు, చెడు స్నేహాలు, హోంవర్కు వాయిదాలు, వీడియో గేమ్సు , లంచ్ బాక్సు తిళ్లు, అబద్ధాలాడ్డాలు, చెల్లాయిల్నేడిపించడాల్లాంటి.. సవాలక్ష శపథాలుంటాయి లిస్టులో.   ఏ శపథం ఎప్పుడు నెరవేర్చాలో టైం టేబుల్  సరిగ్గా పడక .. పడకెక్కేస్తాయన్ని ప్రమాణాలు. అన్నీ నెరవేర్చేస్తే వచ్చే ఏటికేవీఁ మిగిలుండవన్న ముందు చూపు వాళ్లది.  
కాలక్రమాన కాలగర్భంలో కలిసి పోయేవే ఏ తీర్మానాలెవరెంత సీరియస్సుగా తీసుకొన్నా. కాకపోతే  తీర్మానాలతో  తోటివారికి సంతోషం కలిగించే అపూర్వా వకాశం ఈ కొత్త సంవత్సర పర్వదినం.
కొత్తేడాది సీజన్లో పత్రికలన్నీపాత వ్యాసాలే  పునః ప్రచురిస్తాయి.  తీరిక లేని పాతమిత్రులు ఎంత దూరంలో ఉన్నా  తీయని గొంతుల్తో శుభాకాంక్షలు తెలిపే  ఏకైక  శుభ సందర్భం నూతన సంవత్సరవం! కొత్తేడాది వచ్చేది పెద్ద పండుగ రోజుల్లోనే కాబట్టి.. ఇంట్లో ఎదిగిన గుండెలమీది కుంపట్లున్నా.. ఇంటిముందు వేసేందుకు  రవంత జాగా ఉన్నా.. కొత్తేడాది తెల్లారు ఝామున  ముంగిట్లో కనిపించే ముగ్గుల్లో తప్పని సరిగా కనిపించే అందమైన వాక్యం 'హ్యాపీ న్యూ ఇయర్!'
మామూలు మనిషి రోజువారీ బతుకు సినిమా కాదు. వ్యాపారం కాదు. రాజకీయం అంతకన్నా కాదు. ఏడాదంతా జరిగిన ముఖ్యమైన సంఘటనలు సింహావలోకనం చేసుకొనే అవసరం సాధారణ జీవికి ఏ మాత్రం ఉండదు. రోజూ 'తినుచున్న అన్నమే తినుచున్నవాడు' వాడు. కొత్తేడాది కాబట్టి ఆ రోజుటి పత్యేకత టీవీలిచ్చే  సరికొత్త చెత్త మరికొంత.
ఎవరెవరి వెంటో పడి సాధించుకొచ్చిన డైరీకి పసుపు కుంకుమలైనా అద్దకుండా  అద్దాల పుస్తకాలరలో ఓ మూల సర్దిపెట్టుకొనే సర్దా సగటుజీవి నిజజీవితంలో నిజంగా  జరిగే మార్పు మాత్రం ఒకటుంటుంది.. గోడమీది పాత క్యాలెండరు చెత్త బుట్టలోకెళ్లి.. దాని స్థానంలో కొత్త క్యాలెండరు వేలాడ్డం. గతంలో ఎరగని  ఎలక్టానిక్ మీడియా అందుబాట్లో ఉంది కాబట్టి  ముక్కూ ముఖమైనా తెలియని ఫేసు బుక్కుమిత్రులక్కూడా ఇలా  "హ్యాపీ న్యూ యియర్"
అంటూ శుభకామనలు తెలియచేసుకొనే సులువు దొరికింది.
  పాతవన్నీ రోతగా భావించి రద్దు చేస్తున్న పిదప కాలంలో అదృష్టం బాగుండి  ఓ మూడు ముక్కలు మాత్రం ప్రతీ కొత్తేడాది మొదటి రోజున అందరి మనసులనూ అందమైన ఊహల ఉయ్యాలలో ఊగిస్తూనే ఉంది. ఆ మూడు ముక్కలతోనే మిత్రులందరికీ శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఈ చిన్న వాక్యానికి స్వస్తి చెబుతున్నాను.  


H A P P Y     N E W    YEAR 
- కర్లపాలెం హనుమంతరావు


Saturday, December 10, 2016

పెళ్లిల్లో ఆర్భాటాలంత అవసరమా?!- ఈనాడు సంపాదకీయం

'పెళ్ళిచేసి చూడు- ఇల్లుకట్టి చూడు' అని సామెత. ఆస్తులు అంతస్తులతో నిమిత్తం లేకుండా ఏ గృహస్థుకైనా ఈ రెండూ తలకు మించిన కార్యాలే. వరవిక్రయంలో పురుషోత్తమరావు బాధపడినట్లు 'ఆడపిల్ల పెళ్ళంటే అశ్వమేధ యాగమే'! 'కావిళ్లతో కాఫీయు, దోసెలి/ డ్డెనులు, నుప్మాయు నడిపింప వలయు/ కుడుచుచున్నప్పుడు పంక్తి నడుమ నాడుచు బెండ్లివారి వాంఛలు కనిపెట్టవలయు' అన్న ఆ వధువు తండ్రి మాటల్లో ఉన్నది నూరుశాతం ఆవేదన. లోకం, కాలం ఎన్ని మార్పులకు లోనైనా వివాహాది శుభకార్యాల ఆచారాలు, ఆలోచనలు తాతల కాలంనాటివి కావడమే విచిత్రం! ఆడపిల్ల పెళ్ళంటే ఇప్పటికీ కన్నవారి గుండెలమీద నిప్పుల కుంపటే. ఆ బరువు దింపుకోవడానికి తల తాకట్టుకైనా తయారుగా లేకపోవడం లోకుల దృష్టిలో తప్పు! 'అన్నింటికి సైచి వేలు వ్యయించి గౌరవించినను నిష్ఠురములె ప్రాప్తించు తుదకు' అని ఎన్ని నిట్టూర్పులు విడిచినా ఫలితం సున్నా. కష్టించి జీవితాంతం కూడబెట్టిన లక్షలు క్షణాల్లో ఎంత గొప్పగా ఆరిపోయాయన్నదే ఘనతకు గుర్తు! అందుకే పెళ్ళితంతును ఒక ఆధునిక కవి అంతరిక్షనౌక ప్రయోగంతో సరిగ్గానే పోల్చాడు. వధువు మెడలో తాళిపడే సుముహూర్తం క్షిపణి ప్రయోగ క్షణమంత అమూల్యమన్న అతగాడి చమత్కారం- అణాపైసల్లో చూసుకున్నా రూపాయికి వంద పైసలంత నిజం. కల్యాణ మండపం ఖరారు, ఆహ్వాన పత్రాల ముద్రణ, ఆహూతుల సంఖ్య, వంటకాల జాబితా... అదుపులో ఉండొచ్చు గానీ, అతిథుల ఆ పూట ఆకలి దప్పికలను ఏ సూపర్‌ కంప్యూటర్‌ అంచనా వేయగలదు?! అది వేయలేకా, వృథాను అదుపు చేయలేకా ఎంతో ఆహారం వృథా అవుతోంది. ఎక్కడైనా ఏదైనా సమృద్ధిగా లభిస్తున్నప్పుడు, దాని విలువ తెలీదు. భూమాత అందించే ప్రతి గింజనూ ప్రసాదంగా స్వీకరించాలే తప్ప, నేలపాలు చేయకూడదు.

పెళ్ళిళ్లు స్వర్గంలో నిర్ణయం కావచ్చు గాక- భోజనాల ఏర్పాట్లు భూలోకంలోనే కదా జరిగేది! కన్య వరుడి రూపానికి, తల్లి అల్లుడి ఆస్తిపాస్తులకు, తండ్రి అతగాడి పరువు ప్రతిష్ఠలకు, బంధుబలగం కులగోత్రాలకు ప్రాధాన్యమిచ్చినా, అతిథి జనాలు ఆరాటపడేది భోజనాదికాల కోసమేనని ఓ సంస్కృత శ్లోక చమత్కారం. 'జలసేవన గళగళలు, అప్పళముల ఫెళఫెళలు, భోక్తల భళాభళాల' సందడిలేని పెళ్ళి విందుకు అందమే లేదు పొమ్మన్నాడు ఓ భోజనప్రియుడు. పెళ్ళిలో పుస్తెలకున్నంత ప్రాముఖ్యం విస్తరికీ ఉంది మరి! మాయాబజారు చిత్రంలోని ఘటోత్కచుడిలా గారెలు, బూరెలు, అరిసెలు, అప్పడాలు, పులిహోర, దప్పళాలు... వరసపెట్టి అంగిట్లోకి జార్చుకోవాలనే యావే ముప్పు. అష్ట భోగాల్లో మృష్టాన్నమూ ఒకటి. అది మితిమీరడం అహితమే. మర్యాదల పేరుతో శ్రుతి మించి సాగే వియ్యాలవారి విందుకు చెయ్యడ్డు పెట్టుకోకపోతే ముందు చెడేది అతిథి కడుపే. మాయదారి జిహ్వచాపల్యం జీవితానందాన్నే దెబ్బతీసే ప్రమాదముంది. పీకలదాకా మెక్కి పీకలమీదకు తెచ్చుకోవడం ఏమంత తెలివైన పని?! కుడుము కడుపును చేరకముందే మనసును మంగళగిరి పానకాల స్వామి ఆవహిస్తే 'మంగళం మహత్‌'! పరగడుపున రాజులాగా, అపరాహ్ణం మంత్రిలాగా, సాయంత్రం బంటులాగా భుజించాలని భోజన నీతి. అందుకు కట్టుబడటం ఇంటికీ దేశానికీ మంచిదంటున్నారు ఆహార, ఆర్థిక శాస్త్రవేత్తలు. నూటికి నలభై అయిదుమంది ఒక్క పూటైనా ముద్దకు నోచని మన పూర్ణగర్భలో అది శిరోధార్యం.

కల్యాణమంటే ఇద్దరు ఒకటయ్యే అర్థవంతమైన ముచ్చట. ఆత్మీయులు, బంధుమిత్రుల ముందు ఆ వేడుక ఎంత ప్రశాంతంగా జరుపుకొంటే అంత ముద్దు. అప్పు చేసి గొప్పగా పప్పన్నం పెట్టాలనుకోవడం తప్పు, అంతకుమించి ముప్పు. 'జుట్టెడు గడుపుకై చొరని చోట్లు చొచ్చి/ పుట్టెడు కూటికి బతిమాలే' అభాగ్యులు కోట్ల సంఖ్యలో పోగుపడిన దేశంలో విందు పేరిట అనవసర భేషజాలు, ఎడాపెడా వృథా చేయడాలు దారుణ నేరాల పద్దులోకే చేరతాయి. ఎంత భీమ బకాసురులైనా త్రిషష్టిత(63) సంవర్గ రస భేదాలను ఆస్వాదించడం కుదిరే పని కాదు. గొప్పకోసం చేసి చివరకు చెత్తకుప్పలమీదకు పారేసే విస్తరాకుల్లోని ప్రాణశక్తి ఎందరెందరినో ఆకలిచావుల పాలబడకుండా కాపాడగలదు. అటుకులు పిడికెడేనని కృష్ణయ్య కుచేలుడిని కాదు పొమ్మన్నాడా? బంధుమిత్రత్వాలకు విందుభోజనాలు కొలమానాలు, ప్రాతిపదికలు కానేకాదు. దేహమనే దేవాలయంలో ఆత్మారాముడి సంతృప్తికి ఫలం తోయం పరిమాణంతో కాక... ప్రేమతోనే నిమిత్తం. తినగ తినగ గారెలు వెగటు. ఆకలి సూచికలో అరవై మూడో స్థానంలోని మనదేశంలో అంత వెగటు పుట్టేదాకా తినాలనుకోవడమే అపచారం. వండి వృథా చేయడం క్షమించరాని నేరం. విందు వినోదాల్లో సాధారణంగా పదిహేనునుంచి ఇరవైశాతం దాకా ఆహార పదార్థాలు వృథా అవుతాయని ఆవేదన చెందుతున్నారు- 'హంగర్‌ ఎలిమినేషన్‌ అండ్‌ యూ' వ్యవస్థాపకులు వి.రాజగోపాల్‌. ఆ ఆవేదనలో కచ్చితంగా అర్థముంది. చెత్తకుండీలవద్ద ఎంగిలి విస్తళ్ల కోసం కుక్కలమధ్య కొట్లాడే కోట్లాది అన్నార్తులున్న అన్నగర్భ మనది. ఆకాశమంత పందిరి, భూలోకమంత వేదిక వేసి వైభోగంగా వివాహం చేసుకున్నా ఒకే వంటకానికి పరిమితం కావాలనే చట్టం తెచ్చే ఆలోచన మన పాలకులకు కలగటం ముదావహం. పొరుగున పాకిస్థాన్‌లో ఉన్నట్లు ఏకపాక శాసనం ఇక్కడా వచ్చేదాకా ఎందుకు... మనమందరం ముందుగానే మేలుకుందాం. స్వచ్ఛందంగా ఆహారవృథాను అరికడదాం. ఇంటికీ ఒంటికీ దేశానికీ అంతకంటే చేసే మేలు, సేవ ఏముంటుంది?

(ఈనాడు- సంపాదకీయం, ఈనాడు, 05-05-2011)

Thursday, December 1, 2016

పెళ్ళి చేసి చూడు!- పెద్దనోట్ల రద్దులో- సరదా గల్పిక


పెళ్లిళ్లు స్వర్గంలోనే జరిగినా వాటికి గుర్తింపు  కిందిలోకాల్లో ఫెళ్లున జరిగినప్పుడే. అందరు డబ్బున్న మారాజుల్లాగా మా గవర్రాజూ ఆకాశమంత పందిరి.. భూలోకమంత అరుగూ వేసి ఘనంగా చెయ్యాలనుకొన్నాడు తన కూతురు పెళ్లి. ఆఖరి నిమిషంలో ఆ మోదీగారి పుణ్యమా అని డ్యామిట్.. కథ అడ్డం తిరిగింది! నవంబరు, ఎనిమిది- అష్టమి తిధి మధ్య రాత్రి ఆ పెద్దాయన  హఠాత్తుగా పెద్ద నోట్లు రెండూ రద్దనేసెయ్యడంతో అందరు నల్లమహారాజుల మాదిరి మా గవర్రాజూ కొయ్యబారిపొయ్యాడు. అరక్షణంలో పాపం.. పాపరై పొయ్యాడు!
'పెళ్ళి చేసి చూడు.. ఇల్లు కట్టి చూడు' అన్నారు పెద్దలు. ఇల్లంటే ఇవాళ వల్లకాకపోతే మళ్లా ప్రభువులు మారినప్పుడైనా మెల్లంగా కట్టుకోవచ్చు. కళ్యాణమలా కాదే కక్కులా ఆగదు కదా! అందుకే కక్కా లేక.. మింగా లేక పాపం గుడ్లనీరు కక్కుకున్నాడు మా గవర్రాజు. ఆడబిడ్డను కన్న తండ్రులందరికీ ఆ గాలివారంత గుండె నిబ్బరం  ఉండడు! మేట్రిమోనియల్ మొదలు.. పిల్లని మెట్టినింట్లో దిగబెట్టిందాకా  దుడ్డు సంచుల్తోనే కదా ఏ శుభ కార్యమైనా? దుడ్లు దండిగా ఉన్నా సంచులు విప్పే ధైర్యం చాలకే గవర్రాజుకా గుడ్లు.. నీళ్లు! 
పెళ్లి కాబట్టి పిల్ల, పిల్లాడి జాతకాలు జత కలిసాయో.. లేదో చూసుకొన్నారు గానీ.. ప్రధాని మోదీజీ జాతకచక్రం కూడా ఈ మ్యాచికి మ్యాచవ్వాలన్న ఆలోచన రాలేదు.. అందుకే ఇప్పుడిన్ని తిప్పలు! మోదీజీ మూడ్ ను గురించి ఏమాత్రం ఉప్పందినా  ఈ మూడు ముళ్ల ముచ్చటకిన్ని ముళ్ళు పడకుండా ముందస్తు చర్యలు తప్పక తీసుకొనిండేవాడే.  ఎప్పట్నుంచో రాజకీయాల్లో నలుగుతున్న ఘటం మా  గవర్రాజన్న! ఏదేవైఁనా ఒక్కసారి గుండెలమీది కుంపట్ని దించేసాయలనుకున్నాక.. దింపకపోతే ఆ కాకకి  గుండెలు మొత్తం మండే  ముప్పుంది.  ఆ ముప్పునుంచి తప్పించుకొనాలనే కాక  ఉన్న నలుపులో ఒక శాతమన్నా తెలుపవుతుందన్న యావా తోడయింది. శుభలేఖ వీడియోలు  బాలివుడ్ మెగామోవీ స్థాయిలో వైరలవడానికి అదే కారణం. 'మన్ కీ బాత్' అంటే ఎప్పట్లా ఏవో మనసులోని ముచ్చట్లు  బైట పెట్టుకుంటాడనుకొంటే.. పిల్ల మనువుకే మొప్పొచ్చే మెగాబాంబ్ బ్లాస్ట్ చేసేసాడు మోదీ సాబ్!
పెళ్ళంటే పప్పు కూడని పెద్దల శాస్త్రం. ఆ పప్పులో వేసే ఉప్పుకే చచ్చే కరువొచ్చి చచ్చిందిప్పుడు. పాతరేసిన పాత పెద్ద నోట్లమీదున్న భరోసాతో బంధుమిత్రలందరినీ 'సపరివార సమేతంగా' విచ్చేసి  చందన తాంబూల సత్కారాలందుకొని వధూవరులనాశీర్వదించమని ప్రార్థించాడు. 'మాయా బజారు' మార్కు 'వివాహ భోజనాలు' మహా ఆర్భాటంగా ఏర్పాటయ్యాయని టాకొస్తే చాలు.. మరో రెండు శాతం బ్లాక్ వైటవుతుందని   మా  గవర్రాజు తాలూకు ఆడిటర్ల బడాయి. పెద్ద నోట్ల రద్దుతో మనీ బజారు మొత్తం కుదేలవడంతో  మా వాడికిప్పుడు  బేజారు!
పంచ భక్ష్య పరమాన్నాల మాట ఆనక.. పాయసంలో వేసే పంచదారక్కూడా చిన్న నోట్లే కావాలని చిల్లర వ్యాపారులు అల్లరి మొదలు పెట్టేరు. పది రూపాయలైనా సరే బిళ్లగా కనబడితే .. బిచ్చగాడి బొచ్చెలోకి విసిరేసే దర్జా మా గవర్రాజు బాబుది. యాబై నోటే రంగులో ఉంటుందో కూడా మర్చి పోయిన మా దసరా బుల్లోడికి  ప్రధాని రద్దు  ప్రకటన మర్నాటినుంచి పిల్ల పెళ్ళంటే  పెద్ద 'చిల్లర' వ్యవహారంగా మారి కూర్చుంది. 
అన్ని రోజులూ ఎప్పట్లానే డబ్బున్నరాజాలవనుకున్నాడు మా రాజు. ఆ ధీమాతోనే  పిల్ల మామగారిముందు  పెళ్ళేర్పాట్లను గూర్చి తుపాకి రాముణ్ని మించి గొప్పలు పోయాడు. పెళ్ళారు అడక్కముందే మూడ్రోజుల పెళ్ళి.. ముఫ్ఫై రకాల వంటకాలు.. మహారాజా ప్యాలెస్ పందిళ్లు.. కళ్లు మిరిమిట్లు గొలిపేట్లు లైట్లు! ఇహ పట్టు బట్టలు.. నగా నట్రలు.. విందు వినోదాల జాబితా చెప్పనే అక్కర్లేదు.  మారిన పరిస్థితుల వల్ల కిలో బెల్లానిక్కూడా  కొత్త రెండు వేల నోటు బైటికి తీయాల్సొస్తుందిప్పుడు. బ్యాంకోళ్లు విదిల్చే ముష్టి రెండున్నర లక్షల్తో ఇహ లక్షణంగా పెళ్ళి చేసే మాట కేవలం కల్లోనే!
పెళ్లంటే తాళాలు.. మేళాలంటారు. బీరువా తాళాలేవీ బైటికి తీయకుండా ఎంత ఘనంగానైనా చేసుకోండంటున్నారు ఆర్బీఐ గవర్నరు గారు! ఇదేం మేళం?బాజా భజంత్రీలు మోగించే వాడికైనా బయానాకింద తాంబూలంలో విధాయకంగా పెట్టివ్వడానికి కనీసం ఓ వందో.. అదొందలో ఉండాలి గదా? వంద నోటు కనిపించదు. కొత్తైదొందల నోటు కరుణించదు! పెళ్ళనుకుంటున్నప్పట్నుంచీ పిల్లదాని అత్తారిల్లు ఎలాగుండబోతుందోనని అల్లాడిపోతున్న గవర్ర్రాజుకిప్పుడు  గవర్నరాఫ్ ఆర్బిఐ గ వైఖరి ఎలాగుంటుందోనన్న బెంగ మొదలయింది. మామూలు పెళ్లయితే మగ పెళ్లివాళ్లని చూసుకుంటే సరిపోయేది. ఈ పెద్ద నోట్ల రద్దు తరువాత సర్కారు పన్నుల శాఖవాళ్లను కూడా చూసుకోవాల్సొస్తోంది. పాయసంలో రెండు జీడి బద్దలెక్కువ పడ్డా ఈడీ శాఖ వివరాలడిగేస్తుంది. పిల్ల, పిల్లాడికి పళ్లెంలో  పట్టు వస్త్రాలు పెట్టిద్దామన్నా అమ్మకాల పన్ను శాఖెక్కడ పట్టుకుంటుందోనని పీకులాటయిపోయింది! పెళ్లి పీటలమీద  కట్నకానుకలు చదివింపులప్పుడు కూడా లెక్కగా రాసుకునే బంధువుల పక్కనే ముక్కాల పీటేసుకొని బైఠాయిస్తుంటిరి ఆదాయప్పన్ను డేగ గాళ్లు! అడకత్తెర్లో పోక చెక్క బతుకై పోయింది పాపం మా గవర్రాజు బతుకు. పెద్ద నోట్ల పాతర దొడ్డెనకుందన్న నిబ్బరం.  అత్తారేవీఁ అడగనే లేదు.  పిలదాని మెళ్లో నిఖార్సైన  నవరసుల నాన్తాడు నాలుగైదు కిలోలది   ప్రొద్దుటూరు సరుకు దిగేస్తానన్నాడు. దాంతాడు తెగ.. ధడాల్మనీ రద్దు పిడుగొచ్చి పడుతుంద నెవడు కలగన్నాడు? వట్టి దారప్పోగుకింత పసుపు ముద్ద రాసి సొంఠికొమ్ము తాళి  వేలాడేస్తానంటూ  నానుస్తున్నాడిప్పుడు పాపం!   తక్కువ చేస్తే వియ్యాలవారితో తంటా! ఎక్కువ చేస్తే ఎన్ఫోర్సుమెంటు పెద్దల్తో పెంట!
సంభావన పంతుల్నుంచి.. సన్నాయి  భజంత్రీల దాకా అందరి చేతుల్లో తలా ఓ కొత్త రెండు వేల నోటు పెట్టుకుంటే పోతే .. ఇహ అల్లుడి పెట్టుపోతలప్పుడు పెట్టుకోడానికి మిగిలుండేది నోట్లకట్టకు మిగిలుండే ప్లాస్టిక్ బాండే! భూనభోంతరాళు దద్దరిల్లేట్లు పిల్ల పెళ్లి చెయ్యాలని పాపం ఇంతప్పట్నుంచి అడ్డమైన గడ్డి కరిచీ ఈ పెద్ద నోట్లు పోగేసాడు మా గవర్రాజు. ఇప్పుడు అలక పాన్పుమీద అందరల్లుళ్లల్లా ఏ బైకో.. టీవీనో.. టాబ్లెట్టో.. అడిగుంటే..  అదో రకం! చెక్కో.. డ్రాఫ్టో.. నెఫ్టో.. నెట్టో.. డెబిటో.. క్రెడిటో.. ఆ కార్డులు గీకో.. కంప్యూటర్ మీటలు కొట్టో అల్లుడి ముచ్చట తీర్చుండే వాడు! ముందనుకున్న కట్నంలో మిగిలున్న బకాయి మూడుకోట్లు మొత్తం చిల్లర పైసల రూపంలో ఒకే మూటగా చెల్లించాలని మంకు పట్టు పట్టుక్కూర్చున్నాడు! చెల్లని వెయ్యి నోటులా వెల వెలా పోతున్న మా గవర్రాజన్న ముఖం చూస్తుంటే.. చెప్పద్దూ.. పాపం.. ఆ మాజీ
టాటా చైర్మన్ మిస్త్రీ మొహమే మళ్లీ గుర్తుకొచ్చేస్తుంది!తల తాకట్టైనా పెట్టి పెళ్లి గండం గట్టెక్కే తల్లిదండ్రులకీ దేశంలో కొదవేం లేదు కానీ.. తాకట్టుకొట్టు వాడి గల్లా పెట్లోనైనా లెక్కకు పనికొచ్చే చిల్లర ఉండాలి కదా!
చిల్లరమీదే కదా ఇవాళ దేశంలో ఈ అల్లరి ఆర్భాటమంతా?

మోదీజీ ఆర్థిక  సంస్కరణల పుణ్యం! రాబోయే రోజుల్లో పెళ్లి చూపుల్నుంచే పెను మార్పులు తథ్యం! పిల్లాడిది 'ఆధారపడే ఉద్యోగమా?.. ఉపాధా?' అన్న ఆరా ఆనక తీరిగ్గా.  ముందసలు 'ఆధార్ కార్డు ఉందా.. లేదా' అని  తరిచి చూడడం ముఖ్యం పెళ్లికూతురు తరుఫు వాళ్లకిక.  ఆరోగ్య పరీక్షల ధృవీకరణ పత్రాలు  వెంట లేకుండా వధూవరులెవరూ పెళ్లి చూపులకు సిద్ధమవలేరు. రోజులకొద్దీ బ్యాంకులముందు.. ఏటియంల ముందు ఎండ.. వాన.. చలి.. కాలుష్యాలకు తట్టుకొని  తిండి తిప్పలు లేకుండా క్యూలో నిలబడేపాటి  శరీర దార్ధ్యం కాబోయే భర్తగారికి తప్పని సరి. ఒక్కో బ్యాంకుకొక్కో శాల్తీ.. ఏటియంతో కలిపి కుటుంబానికో   డజను జతల కాళ్లు   తప్పని సరి. ఆపాటి బిడ్డల్ని కనేపాటి ఆరోగ్యం కాబోయే భార్యకూ కంపల్సరి!
ఏమో.. ముందు ముందు మరిన్ని తీవ్రమైన చర్యలుంటాయని సంకేతాలిస్తున్నారు కదా మోదీజీ ఇప్పట్నుంచే!
-కర్లపాలెం హనుమంతరావు



 (వాకిలి- అంతర్జాల పత్రిక- డిసెంబరు- 2016-లాఫింగ్ గ్యాస్ గా ప్రచురితం)

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...