Wednesday, December 8, 2021

తెలుగు రుచులు ( జీవనా యోగం ) - ఈనాడు - సంపాదకీయం

జీవన యోగం

వేగంగా వెళుతున్న రైల్లోంచి గాంధీజీ చెప్పొకటి జారి పడిపోయిందితక్షణం రెండో చెప్పును తీసి మొదటిది పడిపోయిన దిశగా వెనక్కివిసిరారాయనఏదైనా పోగొట్టుకొన్నప్పుడు దుఃఖం కన్నా ముందు కర్తవ్యం గుర్తుకు రావడం చాలా గొప్ప విషయంఅది యోగజీవనానికికొండగుర్తుఅలా జీవించారు కనుక గాంధీని మహాత్ముడంది లోకంరాత్రి తండ్రి పిలిచి ‘శీఘ్రముగ పూనుము రాజ్యముమారు చెప్పకన్‌’ అన్నాడుపొద్దున్నే పినతల్లి పిలిపించి ‘నా తనూభవుడు(భరతుడుఇప్పుడే సకల ధాత్రికి నీవలె రాజు కావలెన్‌... ఇది నీ తండ్రి ఆజ్ఞ’ అందిరాముడి మొహంలో  రకమైన వికారం ఆందోళన కనపడనే లేదని స్పష్టంగా చెప్పారు వాల్మీకి. ‘కిరీటం పెట్టుకో’ అనే మాటను, ‘నారచీరలు కట్టుకో’ అనే మాటను ఒకే రకంగా స్వీకరించడం యోగికే సాధ్యంకాబట్టే రాముడు పురుషోత్తముడయ్యాడుమంచినీళ్లకనివెళ్లిన మహా యోధులు తన తమ్ముళ్లు నలుగురూ నిర్జీవంగా పడి ఉన్నారుఒక యక్షుడు కంటికి ఎదురుగా భీకరమైన ఆకారంతోతాడిచెట్టులా నిలబడి ఉన్నాడుఒళ్లు జలదరించే  సమయంలో మనసు చెదిరిపోకుండా ఒకటీ రెండూ కాదుప్రపంచ తాత్వికులనువిస్మయపరచిన ‘నరునకు ఆత్మ ఎవ్వడు’ వంటి... నూట ఇరవై నాలుగు క్లిష్టమైన ప్రశ్నలకు స్థిరచిత్తంతో బదులిచ్చాడు ధర్మజుడు. ‘నీదైనధర్మజ్ఞతకు మెచ్చితిని’ అనిపించుకొన్నాడు. ‘యుధిష్ఠిరుడు’ అనే గొప్ప పేరు గడించాడుమహాత్ములుపురుషోత్తములుస్థిరచిత్తులుఅందరూ మనదేశంలో అద్భుత యోగ విద్యావంతులుయోగాభ్యాసం అటు మునుల తపస్సులో భాగం. ‘భాసుర నిగమపదోపన్యాసుడుసుతపో విలాసుడు అనుపమ యోగాభ్యాసుడురవిభాసుడు దుర్వాసుడు’ అంటూ వారి ప్రతినిధిగా దుర్వాసమహర్షిని భాగవతం మనకు పరిచయం చేసిందియోగవిద్య ఒకప్పుడు గురుకులాల్లో పిల్లలకు తప్పనిసరి పాఠ్యాంశంఅది  దేశసంస్కారం.

మదించిన ఏనుగే అయినాబాగా మచ్చికైతే మావటివాడు చెప్పినట్లే వింటుందిమనసుదీ అదే దారిమనసును మచ్చికచేసుకోవాలంటే యోగసాధనను మించిన మంత్రదండం లేదుమానవాళికి జరిగిన మహోపకారాల  ప్రస్తావన వస్తే ‘నేను సైతంప్రపంచానికి యోగవిద్యను ప్రసాదించాను’ అని భారతదేశం సగర్వంగా చెప్పుకోవచ్చుయోగులైనవారి యోగ్యతలు మామూలు కొలతలకుఅందవు. ‘ఉర్వి జనులు పరమ యోగీశ్వరుని చూచి తెగడు వారెగాని తెలియలేరు.. అమృతమాది రుచులు హస్తమే మెరుగును?’ అనివేమనయోగి’ ప్రశ్నించాడుమనిషిని చాలా తేలిగ్గా లోబరచుకొనే ప్రలోభాలు యోగి ముందు వెలవెలబోతాయిమైసూర్‌ మహారాజుఅందించిన అమూల్య ఆభరణాలనుఆతిథ్యాన్ని వద్దన్న రమణమహర్షి పేదింట గంజిని అడిగి మరీ తాగారు. ‘వీతరాగులు’ అనేమాటకు అర్థమది. ‘వీతరాగ విషయమ్‌ వాచిత్తమ్‌’ అనే యోగసూత్రంలో వారి గురించి పతంజలి మహర్షి వివరించారురాముడుఆత్మవిదుడు అన్నారు వాల్మీకి. ‘ఏనాడో పాపం చేసుకొని  కోతిమూకతో గడుపుతున్నాను’ అని రాముడేనాడూ చింతించిన దాఖలాలుమనకు కనిపించవుభరతుడు విభీషణుడు మధ్యలో గుహుడు సుగ్రీవుడు అందరితోనూ ఆయన ఒకలాగే ఉన్నాడుఅయోధ్యఅడవిరెండూ ఆయనకు ‘సుఖమండలాలే’ (కంఫర్టు జోన్సుఅయ్యాయియోగ జీవనానికి అర్థం అదేవీతరాగులకుఆత్మవిదులకులోకమంతా సుఖమండలమే. ‘నియమాది సంగుడై నిలిచిన తత్వంబు విశ్వమంతయు తానగుతాను విశ్వంబైన తత్వమగును’ అన్నాడు వేమన విశ్వనరుల నిర్మల చిత్తంలోఅంతస్సంఘర్షణకు చోటెక్కడుంటుందిసుఖశాంతులకు లోటెలా ఉంటుంది?

కాబట్టే ‘తస్మాత్‌ యోగీభవ అర్జునా!’ అని విజయుణ్ని ఆదేశించాడు గీతాచార్యుడుమునులకన్నా జ్ఞానులకన్నా కర్మిష్ఠులకన్నా యోగి స్థితిఉన్నతమైనదని భగవద్గీత స్పష్టం చేసింది. ‘రాజువు నీవుమేము గురురాట్కలిత ప్రతిభాభిమాన విభ్రాజిత మహోన్నతాత్ములము’ అంటూ సమ్రాట్టుల ముందు ధీమాగా నిలిచే యోగ్యత యోగులకు సిద్ధిస్తుందని వైరాగ్య శతకంలో భర్తృహరి చెప్పాడుమన భారతీయమహాయోగుల అపార శక్తిసామర్థ్యాలకు ప్రతీకగా హనుమంతుణ్ని చిత్రిస్తూ ‘శైవాంశంబని చెప్పనాదశశిరస్సంత్రాస చండాకృతిన్‌, శ్రీవాయూద్భవుడందునాఅనిలు శాసించెన్‌ మహాయోగియై’ అంటూ ఆకాశం ఎత్తున నిలబెట్టారు విశ్వనాథయోగుల ఆత్మ ప్రత్యయంమానసిక ఔన్నత్యంశారీరక పటుత్వం మామూలు మనుషులకన్నా చాలా రెట్లు ఎక్కువగా ఉంటుందని ప్రపంచం ఏనాడో గుర్తించింది. ‘హఠయోగంపై అమెరికా శాస్త్రవేత్తలు తాజాగా  జరిపిన పరిశోధనల్లో మరెన్నో విశేషాలు వెల్లడయ్యాయిమతిమరుపునకువృద్ధాప్యంలోఅల్జీమర్స్కు దారితీసే మెదడులోని హిప్పోక్యాంపస్‌ పని తీరు యోగా ద్వారా బాగా మెరుగవుతోందనిభావోద్వేగాల నియంత్రణకు తోడ్పడేఅమిగ్డల బలోపేతం అవుతోందని  పరిశోధనల్లో తేలింది. ‘మెదడన్నది మనకున్నది అది కాస్తా పనిచేస్తే విశ్వరహః పేటిక విపాటనజరుగక తప్పదు’ అన్నాడు శ్రీశ్రీమెదడును అలా పూర్తిస్థాయిలో ఉపయోగంలోకి తేవాలంటే యోగా సాధన తప్పదని  ప్రయోగాలునిరూపిస్తున్నాయి. ‘తర్క సముద్రాలీదిన జ్ఞానికి తన మనసే ఒక ప్రశ్నజనన హేతువు మధించిన మౌనికి తన తనువే ఒక ప్రశ్న’ అన్నారుసినారెఇలాంటి ప్రశ్నలకు సమాధానాలుసందేహాలకు వివరణలు ఇవ్వగలిగేది భారతీయ యోగశాస్త్ర విజ్ఞానమేఅందుకే మన కొత్తసంవత్సర నిర్ణయాల్లో భాగం కావాలి యోగా!- తెలుగు రుచులు - ఈనాడు సంపాదకీయం - జీవన యోగం 

- కర్లపాలెంహనుమంతరావు 

ఈనాడు సంపాదకీయం

ఈనాడు - సంపాదకీయం ఆమె గుండె చప్పుడు - కర్లపాలెం హనుమంతరావు

ఈనాడు - సంపాదకీయం 

ఆమె గుండె చప్పుడు! 

- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపాదకీయం - 27 -02 - 2011 - ప్రచురితం) 


'దైవం స్త్రీ జాతి పక్షపాతి. ప్రావీణ్యం సాధించిన తరవాత అంగన సృష్టికి పూనుకొన్నాడు. అందుకే ఆమె అంత సర్వాంగ సుందరంగా శోభిల్లడం ' అంటాడు రామాయణంలో వాల్మీకి. 'తమ్ములనేలు కన్నులు, సుధానిధిబోలు మొగంబు' అంటూ మొదలుపెట్టి 'తేనియల్/ చిమ్మెడు ముద్దు బల్కులును జేయని సొమ్ములు సుందరాంగికిన్' అంటూ శృంగార పారవశ్యంతో భామినుల అంగాంగ వర్ణనలకు పూనుకొన్న భర్తృహరి 'కుచములు ముక్తావళి రమ్యముల్' అనేదాకా సాగిలపడ్డాడు. బాల రసాలసాల నవపల్లవ కోమల కావ్య కన్యకను గూళల కివ్వనని తల్లి వాగ్దేవికి వాగ్దానం చేసే సందర్భాన కూడా 'కాటుక కంటినీరు చనుకట్టు పయింబడనేల యేడ్చెదో?' అని పోతనామాత్యుడు అన్నాడంటే... మరి ఎంత పరమ భాగవతోత్తముడయితేనేమి ..  అతగాడూ ఒక మగవాడే గదా అనిపించక మానదు. ఇది ప్రకృతి విరుద్ధం కూడా కాదంటాడు శృంగారనైషధ కర్త శ్రీనాథుడు. 'మాంచి పైలాపచ్చీసులో ఉన్న పడుచుపిల్ల చెక్కిలిమీద చిటికేస్తే యువకుల మనసులు ఉయ్యాల లూగుతాయిగానీ... చంటివాళ్లకేం చలనముంటుందీ?' అనేవారి మాటలూ కొట్టి పారవేయదగినవి  కాదు. శ్రీకృష్ణ పరమాత్ముడంతటి మహా మాయావి సమర సమయంలో మేనమామ వాహనం కువ లయపీడం కుంభస్థలి చూసి రాధ గుండెపొంగుల తలపులతో తబ్బిబ్బులయ్యాడని జయదేవుడు గీతగోవిందమ్ చమత్కరించింది కదా ! స్త్రీ సౌందర్య సందర్శన మాత్రం చేతనే పురుష హృదయం ఉప్పుటేరులాగా ఉప్పొంగడం సృష్టిసహజం. 'కులుకు కుచ కుంభ ముల కొమ్మకును కుంభరాశి' అని అన్నమయ్య అమ్మ అలివేలు మంగమ్మను కీర్తించినా  స్తుతి అమ్మ పరంగా నాగింది కనుక  అసభ్యమనిపించదు.


అమృతం కోసం సురాసురులు క్షీరసాగర మథనానికి పూనుకో వాల్సి వచ్చింది. మానవుడు అదృష్టవంతుడు... ఏ ప్రయాసా లేకనే పెదవులకు అమృతాన్నందించే ప్రేమమూర్తి లభించింది. ఎంత భగవానుడైనా సరే- ఒకసారి భూమిమీద అవతరించిన తరువాత... తరుణంలో తల్లి చన్ను కుడవక తప్పదు. శకటాసురుని వధానంతరం ఏడుపు లంకించుకున్న బాలకృష్ణుని తన ఒడిలోకి లాక్కొని ' అలసితివిగదన్న చన్ను గుడువుమన్న సంతసపడుమన్న' అంటూ యశోద పడ్డ ఆరాటం అలవికానిది. బెజ్జ మహాదేవి తాను బిడ్డగా భావించిన పరమేశ్వరుణ్ని తలచుకుంటూ 'తల్లి లేకుండిన తన యుడు గాన/ ప్రదుడై యిన్ని వాట్లకు వచ్చే జన్నిచ్చి పలుమాఱు వెన్నయు బెట్టి/ పన్నుగా నిన్నియు బాలును పోసి/ యాకొనగా గడు పరిసి పాలిచ్చి సాకించి పెనుపదే జనని గల్గినను' అంటూ పరిపరి విధాల వాపోయింది. పులి ఎదురైనప్పుడు గోమాతకు ముందుగా గుర్తుకొచ్చింది ఇంటివద్ద ఉన్న కన్నబిడ్డ కడుపారాటమే!  ఇన్ని పాలిచ్చి ఇన్ని సుద్దులు నేర్పి ఇప్పుడే వస్తానని ఆ కన్నపేగు కోసమే పులిముందు అంతగా ఆరాటపడింది! ఊరి బైట వేద పాఠ శాలలో విద్యాభ్యాసం చేసే ఒక బ్రహ్మచారి ఎప్పటిమాదిరే మధ్యాహ్న భోజనంకోసం ఒక ఇంటిముందు జోలెపట్టి 'భవతీ భిక్షాం దేహీ ' అని పిలిచాడు.  స్నానం చివరలో ఉన్న ఆ ఇంటి ఇల్లాలు ఒంటిమీది తడిబట్టలతోనే ఆహారం తీసుకొచ్చింది. చదువు తప్ప మరే ధ్యాసా ఎరుగని ఆ బాలకుడు తల్లి ఎదురురొమ్ములు  చూసి ' ఏమిటమ్మా అవి?' అని అమాయకంగా అడిగాడు. ' పుట్టబోయే పాపాయికి దేవుడు ఇచ్చిన రెండు పాలగిన్నెలు నాయనా!' అని తెలివిగా బదులు ఇచ్చింది ' అంటారు తిరుమల రామచంద్ర. కరుణశ్రీ ఈ పాలగిన్నెలనే పొదుగుగిన్నె అని కూడా భావిస్తూ ఎంతో కరుణ రసాత్మకమైన  కవితలల్లారు . పెదవులయందమృతము మాటలయందమృతము చూపులయందమృతము అమృతంబుగల కుంభద్వయంగల స్త్రీత్వమునకు ప్రణామంబు' అంటుంది సుభాషిత రత్నావళి.


పురిటినొప్పులు తెలియని పురుష జాతికి జన్మనిచ్చి స్తన్యమిచ్చే స్త్రీకి ఆరోగ్యమనేది ఎప్పుడూ పెద్ద సమస్యే. రుతువులు, పురుళ్ళు, సంసారంలోని అనివార్యమైన బాధ్యతల ఒత్తిళ్ళూ... ఆమెనెప్పుడూ వత్తి అంచుదాకా కాలిపోయే దీపశిఖగానే చేస్తున్నాయి. పరదుఃఖ కారుణ్యం నెలత అదనపు బలహీనత. చప్పట్లకు ఎగిరిపోయే చెట్టు మీది చిలకల్లాగా ఇక్కట్లకు బెదిరిపోయి కట్టుకున్నవారిని కన్నవారినీ వదిలిపోయే చిలకల కొలికి కాదు గదా ఆమె! సంసార రథానికి ఆమె రెండో చక్రమైనప్పుడు- జీవనయానం సునాయాసంగా సాగటానికి ఆ చక్రమూ సక్రమంగా ఉండాలి గదా! కష్టంలో ముందుండే... సుఖంలో తోడుండే, విజయంలో వెనకుండే... ఎల్ల పుడూ పక్కనే ఉండే ఆమె గుండెలతో ఆడుకోవడమేకాదు- లోపలి గుండెచప్పుళ్లనూ వినటం మగవాడు నేర్చుకోవాలి. నారీనింద్యాలు అని చెప్పే పదిహేడు బలహీనతల్లో స్వ స్వస్థతపట్ల స్త్రీకి సహజంగా ఉండే నిర్లక్ష్యమూ ఆమె అనారోగ్యానికి ప్రధాన హేతువని మనోవైజ్ఞానికుల భావన. వ్యసనాలకు దూరంగా ఉండే ఆడవారి  ఆయుష్షు సైతం మగవారికన్నా తక్కువగా ఉండటానికి ప్రధాన కారణం- రొమ్ము క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. క్యాన్సర్ని తొలిదశలో గుర్తించగలిగితేనే నివారణ సాధ్యమవుతుంది. ఒకదశ తరవాత నివారణ అసాధ్యం. రొమ్ము క్యాన్సర్ కణాల వ్యాప్తికి కారకమైన పదార్థాన్ని వైద్యులు గుర్తించగ లిగారు. శరీరంలోని వేరే భాగాలకు క్యాన్సరు కణాలు సోకటానికి కారణమయ్యే ఈ పదార్ధం చర్యను అరికట్టగలిగే కీలక విధానాన్ని కనిపెట్టినట్లు బెంగళూరు కేంద్రంగా పనిచేసే బ్రిటిష్ క్యాన్సర్ పరిశోధనా బృందం ప్రకటించింది. బృంద సారథి ఆర్లేన్ విల్కీ ఆశించినట్లు- 'రొమ్ము క్యాన్సర్ కణాలు వేరే అవయవాలకు వ్యాపించి సంభవిస్తున్న తొంభైశాతం స్త్రీ మరణాలు రాబోయే కాలంలో గణనీయంగా తగ్గుముఖం పట్టగలవని ఆశిద్దాం. దుఃఖం లేనిచోటే స్వర్గమని యజుర్వేదం అంటుంది. ఆ స్వర్గం పురుషుడికి దక్కాలంటే- తల్లి, చెలి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలి.


- - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపాదకీయం - 27 -02 - 2011 - ప్రచురితం)



సాహిత్య వ్యాసం: బేతాళ పంచవింశతి -కర్లపాలెం హనుమంతరావు ( తెలుగు వెలుగు మాసపత్రిక - ఏప్రియల్ ; 2019 సంచికలో ప్రచురితం)

 









సాహిత్య వ్యాసం:

బేతాళ  పంచవింశతి

-కర్లపాలెం హనుమంతరావు

( తెలుగు వెలుగు మాసపత్రిక  - ఏప్రియల్ ; 2019 సంచికలో ప్రచురితం) 



బేతాళ కథలను గురించి తెలుగువాళ్లకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.    బాలల మాస పత్రిక 'చందమామ' చలవ.. తెలుగునాట తరాల బట్టి బేతాళుడు ప్రతీ ఇంటికీ నెలకో సారొచ్చి చక్కని కథ వినిపించే కథల భూతంగా   చిరపరిచితుడు.

పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు మీది శవాన్ని భుజాన వేసుకొని స్మశానం కేసి నడవడం.. శవంలోని బేతాళుడు  మహారాజుకు  దారిశ్రమ తెలియకుండా కథలు అల్లి చెప్పడం బేతాళ కథల   రివాజు.  విక్రమార్కుడు వినే ఆ వింత  కథలనే   'చందమామ' పాఠకులూ చిన్నా పెద్దా  తేడా లేకుండా ఎంతో ఉత్కంఠతో చదవడం  అదో మోజు. ఆ మైమరుపుకు కారణం నెలకో తీరులో సాగే  కథలలో కొనసాగే  కొసమెరుపు. బేతాళుడి  ప్రశ్నలకు జవాబులు తెలిసీ పెదవి విప్పకుంటే   రాజు తల వెయ్యి వక్కలయ్యే ప్రమాదముంది. మహారాజు  ఆ నెల  ఏ తెలివైన జవాబు చెప్పి గండం  నుండి తప్పుకుంటాడోనని  దిగులు!  చిత్ర విచిత్రమైన భావోద్వేగాలతో దశాబ్దాలపాటు చందమామ పాఠకులను ఉర్రూతలూగించిన  బేతాళుడు ఎవరు?  చిక్కుముడి కథల అసలు  పరమార్థం ఏమిటి?  బేతాళ కథలు  రేకెత్తించే పలు  సందేహాలు  నివృత్తి కావాలంటే  'బేతాళ పంచవింశతి' గురించి కొంతయినా  తెలుసుండాలి.    

అనగనగా ఒక వీరుడు. అతగాడి పేరు విక్రమసేనుడు.  ప్రతిష్టాపురానికి ఆయన మహారాజు.  శీలభద్రుడనే ఓ యోగి పదేళ్ల పాటు ప్రతీ రోజూ  క్రమం తప్పకుండా రాజుగారికి రోజుకో విచిత్రమైన పండొకటి కానుకగా సమర్పిస్తాడు. నిజానికి  ఆ బహుమానాలన్నీ మణులు.. మాణిక్యాలు! రాజు నిలదీసిన మీదట యోగి నోట బేతాళుడి వివరాలు బైటపడతాయి. కోరుకున్న రూపంలోకి మారిపోగల కామరూప శక్తి మాయ బేతాళుడి బలం. ఆ భూతాన్ని   తన పరం చేయమని వేడుకుంటాడా తాంత్రిక యోగి. 

శైవ తాంత్రిక సంప్రదాయాల అనుసారం బేతాళుడు ఒక భూతం. మంత్ర తంత్రాలతో వాడిని వశం చేసుకోవడం సులభం.  స్మశానాలలో శవాలలో నివాసముండే వాడు  తన వశమయితే  సర్వశక్తులు  సిద్ధిస్తాయని తాంత్రిక యోగి దురాశ.   సాహసం, మేధస్సులకు  సైదోడుగా  బోలెడంత సహనం గల విక్రమసేనుడే తన  వాంఛితం ఈడేర్చే  సమర్థుడని యోగి ఇంత మంత్రాంగానికి పూనుకున్నది. సన్యాసి దురూహ పసిగట్టని రాజు ఎన్ని రాత్రులైనా జాగారాలు చేసి బేతాళుడిని యోగి పరం చేయాలని పంతం పడతాడు. విక్రమసేనుడి ప్రయత్నాలను ఎప్పటికప్పుడు భంగం చేసే బేతాళుడి ప్రయాస  నేపథ్యంగా సాగే పాతిక  విచిత్ర కథల సమాహారమే 'బేతాళ పంచవింశతి'. 

పంచవింశతి అంటే ఇరవైకి అయిదు అదనం. బేతాళుడు చెప్పిన  పాతిక కథలు కాబట్టి ఇవి 'బేతాళ పంచవింశతి' పేరుతో సంస్కృత సాహిత్యంలో సుప్రసిద్ధ కథాకావ్యంగా ప్రసిద్ధమయాయి. ‘చందమామ’ పత్రికలో నిరంతరాయంగా కొనసాగిన కల్పిత కథలన్నిటికి బేతాళ పంచవిశంతిలోని  కథలే ప్రేరణ.  

బేతాళుడి పుట్టుక కథ చాలా ప్రాచీనమైనది.  జనశ్రుతంగా  విన వచ్చిన ఈ  కథలను అజ్ఞాత కవి ఎవరో గ్రంథస్థం చేసినట్లు  సాహిత్య పరిశోధకులు భావిస్తున్నారు. బేతాళ కథల మూలాలు శైవ తాంత్రిక సంప్రదాయంలో ఉన్నప్పటికీ..  బౌద్ధుల తాంత్రిక యోగ సంప్రదాయంలోకీ వచ్చి తిష్ఠవేసినట్లు చెబుతారీ  బేతాళుడు. 

క్రీ.శ ఒకటవ శతాబ్ది, శాతవాహనుల కాలం నాటి ప్రాకృత భాషాకవి గుణాఢ్యుడు పైశాచి భాషలో రాసిన  బృహత్కథలోని కొన్ని కథలే  బేతాళ కథలని ఒక నమ్మకం ప్రచారంలో ఉంది.   బృహత్కథాలహరి కాశ్మీరం ప్రతిలో బేతాళ పంచవింశతి ప్రస్తావన ఉన్నట్లు పాశ్చాత్య  పండితుడు వింటర్ విట్స్ కూడా భావించాడు. ప్రాకృతం నుంచి సంస్కృతంలోకి అనువాదమయిన క్షేమేంద్రుడి బృహత్కథామంజరిలో, సోమదేవుడి  కథాసరిత్సాగరంలో కనిపించే బేతాళ కథలు నేపాళ కవి బౌద్ధస్వామి సంస్కృత బృహత్కథాశ్లోకసంగ్రహంలో కనిపించవు! బేతాళ పంచవింశతికి  మూలమని భావించే కాశ్మీరం ప్రతి ప్రస్తుతం అలభ్యం.   ఈ నేపథ్యంలో  నిజానిజాలు  నిర్ధారించడం కష్టం. ఆయా కాలాలల్లో కవులు తమ సమకాలీన సామాజిక  పరిస్థితులకు  తగ్గట్లుగ ఈ కథల్లో మార్పులు చేసుకున్నారు. ఆ కారణంగా ఏవి మూలరూపాలకు దగ్గరివో, ఏవి  చొప్పించిన  ప్రక్షిప్తరూపాలో  నిగ్గుదేల్చడమూ క్లిష్టతరంగా మారింది ప్రస్తుతం! 

జంబలదత్తు గద్య రూపంలో, వల్లభదేవుడు  సంక్షిప్త రూపంలో, మరో పేరు తెలియని కవి క్షేమేంద్రుడి బృహత్కథామంజరిలోని పద్యరూప కథలను గద్యంలోకి  మార్చినట్లు చెబుతారు. గద్య పద్య మయ హృద్యశైలిలో కూర్చిన   12 వ శతాబ్ది నాటి శివదాసు కృతే ఉన్నంతలో మూలరూపానికి కాస్తింత  సమీపంగా నడిచినట్లు ఇప్పటి విమర్సకులు భావిస్తున్నారు.

ఇక తెలుగులో.. 

జక్కన తెలుగు 'విక్రమార్క చరిత్రము' తెలుగునాట   విస్తారంగా ప్రచారంలొకి వచ్చినప్పటి బట్టి విక్రమసేనుడు విక్రమార్కుడుగా మారిపోయాడని వినికిడి. తెలుగులో వెన్నలకంటి అన్నమయ్య  రాసిన  షోడశకుమార చరిత్రములోని మిగతా కథలతో పాటు కొన్ని కథలు ఈ బేతాళ పంచవింశతి నుంచీ ప్రేరణ పొంది రాసినవే అంటారు. చిన్నయసూరి కాలం వరకు సామాన్య పాఠకులు వెన్నెలకంటివారి కావ్యాన్ని ‘బేతాళ పంచవింశతి’గానే పిలుచుకొనేవాళ్లు కూడా! మిక్కిలి మల్లికార్జునుడనే కవీ బేతాళ పంచవింశతి పేరుతో మరో  కావ్యం రాసినట్లు ఆరుద్ర (సమగ్రాంధ్ర సాహిత్యం మూడవ సంపుటి) పేర్కొన్నారు.  కూచిరాజు ఎర్రన సకలనీతి కథావిధానంలో సైతం బేతాళ పంచవింశతి కథలు కొన్ని కనిపిస్తాయి. వెన్నెలకంటి, ఎర్రనల కన్న ముందే పద్మనాయక యుగంలో కవివల్లభటుడూ తన వంతుగా మరో బేతాళ పంచవింశతి పుష్పాన్ని తెలుగు సాహిత్య తోరణానికి జతచేసాడు. పోతరాజు అనే కవి రాసినట్లు  చెప్పుకొనే మరో పది బేతాళ పంచవింశతి  పద్యాలను ఒక అజ్ఞాతసంధాత వెలికితీసినట్లు విదితమవుతోంది.  

ఆలయ నిర్మాణాలలో పేరు ప్రఖ్యాతులు గడించిన  పద్మనాయకరాజుల నాటి   రేచర్ల గోత్రీకుడు బేతాళరెడ్డిని ప్రస్తుతిస్తూ  చిన్న వీరయ్య అనే కవి సంసృతంలో ఒక లఘుకావ్యం రచిస్తే బంగారు రంగప్ప దానిని ‘బేతాళ చరిత్ర’ పేరుతో ద్విపద  కావ్యంగ  అనువదించాడు.  ఆ  అనువాదం తరచూ బేతాళ కథలుగా పొరపడటం జరుతుతోంది.. ఇదో గమ్మత్తు.. సాహిత్యంలో!

బేతాళ పంచవింశతిలో బేతాళుడు విక్రమసేన మహారాజుకు ప్రతీ రాత్రీ ఒకటి చొప్పున వరుసగా  రెండు డజన్ల కథలు చెపుతాడు. 


తెలివైన పద్మావతి పంపిన మార్మిక  సందేశాలను మంత్రిపుత్రుడు తన బుద్ధికుశలతతో పరిష్కరించి యుక్తియుక్తంగా  ఆమెను తన రాకుమారుడికి జతచేసిన మొదటి కథ నుంచి.. బాలుడి మృత దేహంలోనికి పరకాయప్రవేశం చేసే ముందు రోదనలు, చిందులతో  ఓ ముసలి యోగి చేసిన హంగామా దాకా  ఎక్కడా ఆగకుండా, నడక మందగించకుండా సాగుతుంది బేతాళుడి కథాప్రవాహం.  అనాథలైన  తల్లీ కూతుళ్ళు  విధివశాన ఓ తండ్రి, కొడుకులకు భార్యలవుతారు. ఈ రెండు జంటలకు కలిగిన సంతానం మధ్య సంబంధాలలో సంక్లిష్టత ఏర్పడినప్పుడు ఆ తికమక సంబంధాల సమస్యకు రాజు వద్ద నుండి సబబైన సమాధానం రాదు.  అక్కడికి బేతాళుడి ప్రశ్నలు ఆగిపోయినా ఆ మరునాటి రాత్రి జరిగిన పతాకసన్నివేశాలతో కథాకావ్యం సుఖాంతమవుతుంది, 


నడిమధ్య  కథలలో పునరుజ్జీవితురాలైన మందారవతి, మనుషుల పాప పుణ్యాలను గూర్చి చర్చించే చిలుక.. గోరింక, యజమాని కోసం సకుంటుంబంగా సాహస త్యాగాలకు ఒడిగట్టే భృత్యుడు వీరవరుడు, ఉమ్మడి ప్రజ్ఞల కారణంగా పునరుజ్జీవించిన  సమప్రభను ఎవరు ఏలుకోవాలన్న మీమాంసలో పడిన బ్రాహ్మణ కుమారులు, తలలు.. మొండేలు తారుమారుగా అతికించుకొని తిరిగి బతికిన భర్త.. సోదరులలో ఎవరి పాణి గ్రహించాలో అంతుబట్టక ధర్మసంకటంలో పడ్డ యువతి..  వంటి వింత చిక్కుముడులలో  చిక్కిన పాత్రలు  ఉక్కిరి బిక్కిరి చేసేస్తాయి కొన్ని కథలలో. 

 వివాహమైనా భర్త అనుమతితో  ఇల్లు దాటిన ఇల్లాలు, కాముకుడైనా నిష్కలంకమైన ప్రేమ ప్రదర్శించే   చోరుడు, లోకం ఊహించలేని  దుష్టపాత్రల శిష్టస్వభావాలు విస్తుగొలిపిస్తాయి మరికొన్ని కథలలో! 

సముద్రగర్భ నగరాలు, దివ్యలావణ్యాలతో మెరిసే రాజకుమార్తెలు,  కలువల తాకిడికే దేహం కందే అతి సుకుమారులు, చంద్రకిరణం సోకినా వళ్లు కాలిపోయే   వయ్యారిభామలు, దంపుడు బియ్యం దెబ్బల మోతకే  చేతులు బొబ్బలెక్కే  అబ్బురాండ్రు.. ఊహకైనా అందని చిత్ర విచిత్ర పాత్రలు   ఇంకొన్ని కథలలో!

సుఖలాలసులైన యశఃకేతు వంటి దౌర్భాగ్య మహారాజులు, అమృతం తాగినా విషం మింగినట్లు మరణించే   హరిస్వాములు వంటి దురదృష్ట జాతకులు,  వధ్యశిల ఎక్కిన ముష్కురుని కోరి మరీ వరించి సతీ సహగమనానికి సిధ్ధపడ్డ సుదతీమణులు.. పాఠకులకు ఊపిరి సలుపనీయని విచిత్ర వ్యక్తులు రెప్పకొట్టకుండా చదివిస్తారు  అన్ని కథలూ!

మంత్ర గుళికల మహిమతో  ఇద్దరికి ఇల్లాలైన శశిప్రభ సంకటస్థితి నిజజీవితంలో  మనకే ఎదురైతే కిం కర్తవ్యం?   నాగు రక్షణ కోసం స్వీయ దేహాన్ని  శంఖచూడుడంత సంతోషంగా    గరుత్మంతునికి ఆహారంగా మనం  సమర్పించుకోగలమా? ధర్మం, మోహం మధ్య నలిగే దుర్భర పరిస్థితులు కనక మనకే తటస్తిస్తే ‘సుందరి ఉన్మాదం' కథలోని మహారాజుకు మల్లే సులువుగా మనం ఉసురు తీసుకొంటామా? జీవితమంటే కష్టనష్టాల కలినేతన్న తత్వం తెలిసినప్పటికీ బేతాళ కథల్లో మాదిరి బతుకులో నిజంగానే కష్టాలు ఎదురైతే బేతాళ కథల పాత్రలంత విశుద్ధంగ, విస్పష్టంగ, విచిత్రంగ ప్రవర్తిస్తామా?  అభీష్టవరదాయినీ మంత్రవిద్యను నేర్పే సాధనాక్రమంలో అనూహ్యంగా గురుశిష్యులిద్దరూ  ఆ వింతవిద్యనే  పోగొట్టుకొంటారో  కథలో!  తండ్రి కోసం చేసిన పిండప్రధానంలో  విచిత్రమైన ధర్మసంకటం ఎదుర్కొంటాడో కన్నకొడుకు మరో కథలో! కాసుల కోసం కన్నవాళ్ళు, స్వీయ ప్రాణరక్షణ కోసం మహారాజు ..ఇలా తలా ఒక స్వార్థ ప్రయోజనార్థం  దైవోపహతుడైన ఏడేళ్ళ బాలుణ్ణి బలివ్వడానికి సిధ్ధపడతారు  మరో కథలో! వింటేనే చాలు వెన్నులో వణుకు పుట్టించే  అరుదైన ఘటనలు నిజంగా కంటి ముందే జరుగుతుంటే పాఠకుల మానసిక పరిస్థితుల గతేమిటి? మోహాతిశయంతో ప్రాణాలు విడిచిన స్త్రీని చూసి తట్టుకోలేక  ప్రాణాలు విడుస్తాడా ఎంత ప్రియుడైనా కథల్లో కాకుంటే నిజంగా జీవితంలో? ఇదే అబ్బురమనుకుంటే ఆ భార్య, భార్యాప్రియుల అర్థాంతర మరణ వార్త విని స్వీయప్రాణాలు సైతం తృణప్రాయంగా త్యజిస్తాడు అసలు భర్త మరీ విడ్డూరంగా మరో కథలో!  చచ్చిన సింహానికి జీవం పోసి బతికించి దాని దాడికి బలయి చచ్చిన  మూర్ఖ విద్వాంసుల వంటి వారి మూఢత్వాన్నీ వదలకుండా చెప్పినందుకే బేతాళ కథలు సంస్కృత సాహిత్య రంగాన కథల   ఖజానాగా ప్రసిద్ధికెక్కింది శాశ్వతంగా. భారతీయుల కథాకల్పనా పటిమకు బేతాళ  పంచవింశతిలోని ప్రతీ కథా ఒక విశిష్ట  ఉదాహరణే.

కథలోని విక్రమసేనుడు వాస్తవానికి త్రివిక్రమకసేనుడని సాహిత్య విమర్శకులు భావిస్తున్నారు. ఆ త్రివిక్రముడి అభీష్టం మేరకు ‘బేతాళ పంచవింశతి’ శతాబ్దాల కిందటే ప్రపంచవ్యాప్తంగా ‘ప్రశ్న సమాధాన’ ప్రక్రియాపరంగ సాగే కథావిభాగంలో ఉత్తమ శ్రేణి కావ్యంగ  కీర్తి గడించింది. పలు ప్రపంచ భాషలలోకి తర్జుమా కావడమే బేతాళ కథల ప్రఖ్యాతికి గట్టి నిదర్శనం. 

'భేతాళ పంచవింశతి' ప్రసంగ, శ్రవణాలు జరిగే చోట యక్ష, భేతాళ, పిశాచ, రాక్షసాది దుష్టశక్తుల సంచారం   నిషిద్ధమని భూతం పాఠకులకిచ్చిన అభయం బేతాళ కథలని భారతీయ పురాణాల స్థాయికి పెంచే ప్రయత్నంగా భావించినా  భావించవచ్చునేమో!

 ఆ కథల కమామిషు ఎటు పోయినా  ఇప్పటి సాధారణ తరాలకు మాత్రం కథల బేతాళుడి పరిచయం  ‘చందమామ’ మాసపత్రిక పఠన పుణ్యఫలమే. సాహసాద్భుతాలతో కూడిన  బేతాళ కథల  నిర్మాణం భారతీయుల  కథనకౌశలానికి ఆటపట్టు. ఆ పట్టు ఏ  మాత్రం సడలకుండా   దశాబ్దాల తరబడి  కథలు కల్పించి మరీ  బేతాళుడి నోట చెప్పించి తెలుగుసాహిత్యాన్నీ సుసంపన్నం చేసినందుకు తెలుగువారందరం  'చందమామ' కు సదా మనసారా అభివందనలు తెలుపుకుంటూనే ఉందాం

- కర్లపాలెం హనుమంతరాపు

( తెలుగు వెలుగు మాసపత్రిక  - ఏప్రియల్ ; 2019 సంచికలో ప్రచురితం) 

అక్షరంలో చొరబడ్డ వేదనా సాగరం - దేవులపల్లి కృష్ణశాస్త్రి ' ఆంధ్ర ప్రభ - దినపత్రి- సాహితీ పరామర్శ

 


సాహితీ పరామర్మ : 

అక్షరంలో చొరబడ్డ వేదనా సాగరం 

- కర్లపాలెం హనుమంతరావు

( ఆంధ్రప్రభ దినపత్రిక- సాహితీపుట- బుధవారం 1, నవంబరు, 2017 ' ప్రచురితం) 


వర్డ్ స్ వర్త్  , కోల్‌రెడ్జి, బైరన్ , కీట్సు తరహా యురోపియన్ కవులు రొమాంటిసిజంలో గీటురాళ్లతో పోల్చవగ్గ మహానుభావులు. దేవులపల్లి కృష్ణశాస్త్రి  వారి సరసన అధిష్టించే సామర్ధ్యం  భావకవితా వైతాళికుడు.  కృష్ణశాస్త్రి  కవిత రొమాంటీసమ్ సాగరంలో  ఒక అల మాత్రమే . అయినా ఆ అలే మిగతా అలలకు మించి  కృష్ణశాస్త్రి  ఔన్నత్యాన్ని మరింత ఎత్తులకు ఎగరేసింది. 


సంప్రదాయ కవిత్వం తాలాకు వస్తువును భావకవిత్వం ఆశ్రయిస్తుందనే  ఒక భావన కద్దు. . 'నేను' లేకుండా కృష్ణశాస్త్రి కవిత్వం లేదు! భావనాబలంతో కొత్తలోక ద్వారాలని తెరవవచ్చని రొమాంటిస్టులు ప్రకటించక ముందే.. మన పోతన సరస్వతిని 'భావాంబరి

వీధిని శ్రుత విహారిణి ' గా సంబోధించినాడు  భాగవతంలో! మోడూపా

అనే రాక్షసి తలను షెల్లీ 'లవ్లీనెస్ ఆఫ్ టెర్రర్ ' గా అభివర్ణించిన విధంగానే మన తిక్కనే  యుద్ధ భూమిని ఉద్యానవనం... సరోవరం.. అంటూ వర్ణించుకు వచ్చాడు భారతంలో! కాకపోతే ఆ తరహా రొమాంటిసిజమ్ మార్కుకు విభిన్నంగా ఇప్పటి కృష్ణశాస్త్రి భావకవిత్వ రొమాంటిసిజానికి వ్యక్తివాదం, వ్యక్తిస్వేచ్ఛ పునాదులు. 


కృష్ణశాస్త్రి కవిత్వం నిండా ఈ లక్షణాలు పుష్కలంగా కనిపిస్తాయి . అతని భావకవిత్వం ఆత్మాశ్రయత, స్వేచ్ఛాప్రియత్వం, ప్రకృతి ప్రీతి, ఊహా సౌందర్యం.. వంటి లక్షణాలను పుణికి పుచ్చుకుంది . భావకవితా ధారను ఉధృత  దశకు తీసుకు వెళ్లిన  ఘనత కృష్ణశాస్త్రిది.


కృష్ణశాస్త్రి  గొప్పగా చెప్పుకొనే ' ఏననంత శోకభీకర తిమిర లోకైక  పతిని'. 'జగమునిండ స్వేచ్ఛాగాన ఝరులు నింతు ' ' నేను ప్రళయ ఝంఝా ప్రభంజన స్వామి' .. వంటి చరణాలు కాజీన జుల్,  వాల్ట్ విట్మన్ కవిత్వాలలో ఎప్పటినుంచో  వినిపిస్తున్నవే! కృష్ణశాస్త్రి  కవిత్వంలో అంతర్వాహినిగా కట్టలు తెంచుకొని మరీ ప్రవహించే శోకరసం. . రొమాంటిసిజంలో రివోల్ట్  తెస్తానన్న చలాన్ని అరుణాచలం  తరిమేస్తే,  కృష్ణశాస్త్రిని  మాత్రం జనం మధ్యనే  ఉంచి భావి రసభావుకుల చేత  జే జే లు కొట్టించి మరిన్ని మంచి రచనలు చేయించింది.


ప్రేమలో ఎన్ని దశలున్నా శాస్త్రిగారిని ఆకర్షించింది మాత్రం విక ర్షణ పార్శ్వం మాత్రమే. బైబిలు సోలోమన్ గీతాలు, భాగవతం భ్రమర గీతాలు, టాగోర్ గీతాంజలి,  వేంకట పార్వతీశ కవుల ఏకాంత సేవ . . తరహా ఆధ్యాత్మిక విడంబనకు  సంబంధించినవి . 

కృష్ణశాస్త్రి రొమాంటిసిజం కవిత్వంలోని 'నేను' - అళ్వారుల పాశురాల్లో కనిపించే నీవు 'లాంటిది.  కృష్ణశాస్త్రి  'ఊర్వశి ' ఊహాలోకంలో మాత్రమే లభ్యమయే ఆకర్షణీయ ప్రేయసి . ఉర్వశి పురాణాలలో  కూడా ఉన్నా ఆ  పాత్ర లక్ష్యాలకు కృష్ణశాస్త్రి  కల్పిత  ఊర్వశికి పొంతన లేదు .


అసలైన రొమాంటిసిజమ్ అంటే అద్భుతమైన అతిలోక విశిష్టతయి  కావ్యవిశేషాలుగా రూపాంతరం చెందడం. ఊహల్లో ప్రతీ దానికీ అనంగీకారం తెలియచేస్తూ దానికి ప్రత్యామ్నాయం ఏమిటో  చెప్పకుండా తప్పించుకు తిరగడం రొమాంటిసిజం ప్రత్యేక లక్షణం అంటారు . ఈ విచిత్రమైన మొండి మనస్తత్వమే భావకవితావాదులను యధార్ధవాదుల నుంచి విడదీసి ప్రత్యేక భ్రమాత్మక వాదులుగానిలబెట్టింది. ఆ తరహా భ్రమాత్మక  ముభావుకుల పరుగు పందెంలో ముందటి బసవరాజు, కొనకళ్లల వంటి వారి కన్నా కృష్ణశాస్త్రిదే ఒక  అడుగు ముందు.  ఆ అడుగుల్ని దాటి ఎవరూ ముందుకు సాగలేక పోవడమే  కృష్ణశాస్త్రి అనితార పనతకు తార్కాణం .


కృష్ణశాస్త్రి మీది  వాద వివాదాలన్నీ  ఓ  మూలన  పెట్టేద్దాం . ప్రస్తుతం కృష్ణశాస్త్రి  రగిలించిన  తెలివిడి  ( Newer Sensibility) కొంత తరచి చూసుకొని  ఆ భావకవితా యుగ  వైతాళికుడిని అభినందించి ముగిద్దాం.


కృష్ణశాస్త్రి గారు తేటి వలపు' అనే ఖండకావ్యంలో  ఏడు ఏడు మాలలను రచించారు. 'కోమల  జల జాత పత్రముల మాటున నేటికి దాగితివో?' అన్న ప్రశ్న ఏడుసార్లూ పల్లవిలాగ మాటి మాటికి  కనిపిస్తుంది . . శతక మకుటం లాగా! స్వేచ్ఛాగానం  రెండో ఖండికలో కూడా కృష్ణశాస్త్రి గారు 'నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు' అన్న పాదాన్ని 38 ద్విపదులలో 8 సార్లు పల్లవిలా గానం చేసారు. ' మాయమయ్యెదను' ఒక మారు ఆదిలో. . మరో మారు చివర్లో!  


భావ కవిత్వ శిల్ప నైపుణ్య ప్రధాన ఆకర్షణ పాటకు దగ్గరగా వెళ్లడమే!  ఆ పంజర వీర విహార విన్యాసం  కృష్ణశాస్త్రి కవితలో వలె అంత సుందర మధురంగా నిర్వహించిన భావకవి తెలుగులో ఇంత వరకూ లేడు. 


1984లో కాన్సర్ కారణంగా స్వర పేటిక తొలగించినా మూగకవిగా కాలం కొనసాగించిన నిత్యసాహిత్య కృషీవలుడు కృష్ణశాస్త్రి. '  మూగవోయిన నా గళమ్మునను కూడ/ నిదురవోయిన సెలయేటి రొదలు గలవు' అంటూనే 1900, ఫిబ్రవరి, 24న ఆ ఎద రొదలు  వినిపించేందుకేనేమో  అఇట్లుగా  గంధర్వలోకం తరలి పోయారు . ' నా నివాసమ్ము తొలుత గంధర్వలోక/ మధుర సుషష్టి' అంటూ ఆ సుమధుర వేదనా భావ గాయకుడే తన పూర్వ జన్మవృత్తాంతం చెప్పుకొన్నాడు! ' ఏను మరణించుచున్నాను, ఇటు నశించు/ నా కొకు చెమ్మగిలిన వయనమ్ము లేదు' అన్న కృష్ణశాస్త్రి నిష్ఠురం అక్షరాలా అబద్ధం. 


' కృష్ణశాస్త్రి  బాధ ప్రపంచానికి బాధ' అంటూ చలం వంటి ప్రాజ్ఞులతో చురకలు  వేయించుకొని మరీ మురుసుకొనేందుకైనా అంతులేని ప్రతిభా వ్యుత్పత్తి సామాగ్రి దండిగా ఉండి తీరాలి. 


పాత శబ్దాలే కృష్ణశాస్త్రి చేతిలో కొత్త పరిమళాలను వెదజల్లాయి. అచ్చమైన తెలుగు మాటలు కూర్పు  మధ్య కమనీయమైన సంస్కృత పదాల పొహళింపు కృష్ణూస్త్రి నుంచే తెలుగు కవి నేర్చుకోవాలి. శాస్త్రిగారి భావం స్మృతులను  'సౌకుమార్య మాధుర్యములకు చరమ సీమలు' గా  ఆధునికాంధ్ర కవిత్వంలోని సంప్రదాయ ప్రయోగాల మీద పరిశోధన చేసిన జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి. నారాయణ రెడ్డి  ఉత్తిగా  అయితే శ్లాఘించరు కదా! 


- కర్లపాలెం హనుమంతరావు

( ఆంధ్రప్రభ దినపత్రిక- సాహితీపుట- బుధవారం 1, నవంబరు, 2017 ' ప్రచురితం) 


చలం రాసిన బాలల గేయం ఆహ్వానము

 



చలం రాసిన బాలల గేయం 

ఆహ్వానము


రచన: చలం; దీక్షితులు

( చందమామ - మాసపత్రిక - జూలై, 1947 సంచిక 1 

- సేకరణ: కర్లపాలెం హనుమంతరావు 



చందమామా రావే, జాబిల్లి రావే 

రైలెక్కి రావే, రష్యాకధలు తేవే 

ఇంజనెక్కి రావే, ఇంగ్లీషు కధలు తేవే 

బస్సెక్కి రావే, బాంగ్లా కధలు తేవే 

కారెక్కి రావే, కాంమ్రేడ్ కధలు తేవే 

హారన్ ఊత్తూ రావే, ఆకలికధలు తేవే 

కొండెక్కి రావే, కోటివేలు తేవే 

ఒలిచిన చోకలేట్లు ఒళ్లో పెట్టుకొని 

కరిగిన ఐస్క్రీం చేత్తో పట్టుకొని 

అలా అలా అలా వచ్చి, 

మా తెలుగుపిల్లల తీపి నోట్లో పోసిపోవే.


రచన: చలం; దీక్షితులు

( చందమామ - మాసపత్రిక - జూలై, 1947 సంచిక 1 

- సేకరణ: కర్లపాలెం హనుమంతరావు 

ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్ఫిక కదలును కోదండపాణి రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు ప్రచురితం - 04 -04- 2009 )

 



ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్ఫిక

కదలును కోదండపాణి 

రచన- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు ప్రచురితం - 04 -04- 2009 ) 



ఏమీ, అది మన హనుమ తపమా?


కాదు స్వామీ, భాజపా ఎన్నికల జపం! ఈ గొడవలోపడి మన నవమి జనాలు చేయటం మానేస్తారేమోనని అనుమానంగా ఉంది నాథా !


ఎందుకా సందేహం సీతా! అటు భద్రాద్రివైపు చూడు! ఎప్పటికన్నా గొప్పగా సాగుతున్నది గదా ఆ రథయాత్ర!  ఆ భజన విను జానకీ!


అయ్యో రామ! ఆ భజన మీకోసం కాదు అయోధ్యా రామా! తమ నేత గెలవాలని దూతలు చేసే జాతర. ముందు మీరా అభయముద్ర కిందికి దించండి! ఇప్ప టికే తమరు 'హస్తం' పక్షాన చేరినట్లు ప్రచారం సాగుతున్నది. రామా అంటే 'బూత్' మాటైపోయింది స్వామీ!7 అన్నాడు అప్పుడే వచ్చిన నారదుడు. 


నా నామం అంత రాజకీయమైపోయిందా నారదా! 

అన్నారు రాములవారు ఆశ్చర్యంగా. 


రామ అంటేనే రాజకీయ   మయమని అర్థం గదా దీనబాంధవా! ఆరంభంలో ఆదికవి 'మరా.. మరా' అని నోరు తిరగక అంటున్నాడేమో అనుకొన్నాగానీ, దానికీ 'మనదే రాజ్యం' అని మరో అర్థం కూడా ఉంటుందని ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది ఆపద్బాంధవా! రాఘవులు, రామారావులు, రామచంద్రరావులు, రాములమ్మలు, సీతరామ్ లు , కాన్షీ రామ్ లు , కరుణానిథులు, కరుణాకరులు, రాజీవులు, చిరంజీవులు, రాందాసులు, నారాయణలు... రాజకీయమంతా రామ సంబంధాలతో నిండిపోయింది రామా! ఎక్కడ చూసినా ఆయారామ్ .. గయారామ్ .. మారాము,రామ   రామ... ఏనోట విన్నా రామరాజ్యం మాటే వినిపిస్తున్నది శ్యామా!


మంచిదేగా నారదా! ఈ రాజకీయాల గోలుండదు గదా!- అంది సీతాదేవి.


రామరాజ్యంలో మాత్రం రాజకీయాలు లేవనా  తల్లీ! బుజ్జి రా ముడు చందమామ కోసం మారాము చేస్తే  మంత్రి సుమంతు లవారు అద్దంలో చూపించి బుజ్జగింపు రాజకీయం చేయ లేదా! మారీచుడు మాయలేడి మోసం, విభీషణుడు రామ పక్షం మారటం, రావణాసురుడి సాధ వేషం  కోవర్టు చేష్టలే గదా మాతా! కైకమ్మకు హామీలంటూ మొదలు పెట్టింది ముందు దశరధుల వారే  గదా! యాగఫలం మీద ముగ్గురు భార్యలకు సమానమైన హక్కున్నా మూడో భార్యకు అదనపు వాటా పెట్టి ఆశ్రిత పక్షపాతానికి ఆనాడే మహారాజులు శ్రీకారం చుట్టలేదా? చూసి రమ్మంటే కాల్చివచ్చిన హనుమంతుడి చేతల వెనక ఏ వ్యూహం దాగి వుందో గానీ , ఆనాటి నుంచి కోపమొస్తే  కార్యకర్తలు లంకాదహనాలకు మించి  చేస్తున్నారు దయామయా! ఈ దేవదేవుని అభయముద్రను నేటి నేతలు తమ దైవలక్షణంగా భావిస్తున్నారమ్మా సీతమ్మ తల్లీ! ఈ జగద్రక్షకుడి క్షమాగుణం క్షమాభిక్షగా మారి ఈ కాలం రాక్షసులకు రక్షణ కవచంగా మారిపోయింది . ప్రస్తుతం  నడిచేదంతా పరంధాముడి పరిపాలనేనటి ! రామపాదం సోకి రాయికి ప్రాణం వచ్చినట్లు.. రాజశేఖరుడి పాదం పడిన ప్రతిచోటా  పంట భూములు పరి శ్రమలుగా మారిపోతున్నాయంట!


ఈ ఆరాచకీయాల్లో నా ప్రభువు ప్రమేయమేమున్నది నారదా? అంటూ భర్తను వెనకేసుకొచ్చింది వైదేహి . 


ఈ రామస్వామీ   రాజకీయాలలో  తక్కువేమీ  తినలేదనే  ఒకటే లొల్లిగా ఉంది తల్లీ! వాలిని చెట్టుచాటు నుంచి కొట్టడం, జాంబవంత నల నీల సుగ్రీవుడి వంటి వాళ్లతో  'కూటమి' కట్టడం, చెప్పుడు మాటలు విని శంభూకుడిని శిక్షించటం- వంటివెన్నో   రామచంద్రుడు  చేసినప్పుడు  తప్పుకానప్పుడు , మేము చేస్తే మరి వేలెత్తి చూపడమెందుకంటూ   ఎదురుదాడికి దిగిపోతున్నారిప్పుడు  దీనజనోద్ధారకా! 


సీతమ్మ తల్లి కోపంతో ఉడికిపోయింది. నీ నాథుడు పితృవాక్పరిపాలన కోసం పడరాని పాట్లు పడటం. . ఆ జగన్మోహనుడు పితృదే వుడి పాలన కొరకై అడ్డమైన దారులు  తొక్క డం ఒకటేనా? ఈ రాజశేఖరుడు అందరినీ  కన్నబిడ్డలనే  భావించాడు. ఆ రాజశేఖరుడు కన్నబిడ్డే  అన్నీ అని భావించాడు. ఈ దేవుడు చెక్కుచెదరని సేతువు నిర్మిస్తే, ఆ మహానుభావుడు చెక్కుల కొరకై  సేతువులు నిర్మిస్తున్నాడు. నా రాముడిది ఒకేమాట... ఒకేబాణం... భార్యే ప్రాణం. ఆ దొంగరా ముడిది గంటకోమాట.... ఘడియకో బాణం... ఆడదంటే తృణంతో సమానం . అధికారం వద్దని చెప్పులు మోశాడు ఆనాటి రాముని సోదరుడు.  అధికారం కోసమే చెప్పులు మోసేవారు ఈనాటి నాయకులూ .. వాళ్ళ బంధుజనాలు! జనం డబ్బుతో గుడి కట్టించిన వీరభక్తుడు  మా రామదాసు. గుడి డబ్బునే గుట్టుగా మింగు వాళ్లు  ఈ దాసులు. నిధి సుఖమా, రాముడి సన్నిధి చాలసుఖమా' అనడిగితే నిధే ప్రధానమనే ప్రజాప్రతినిధులు కాదా వీళ్లంతా?  రామకోటితో కన్నా  రాజీవ్ కోటితోనో ..  రామారావు కోటితోనో పుణ్యం పురుషార్ధమనుకొనే భక్తకోటికే కాలమిది. అవునా, కాదా? దేవుడిపాలన అంటున్నారుగానీ మా దేవుళ్లకే ఆలనాపాలనా లేని కరవు కాలం కాదా... నారదా?


నిజమేతల్లీ! కోనేటి రాయనివి ఏడు కాదు .. రెండు కొండలేనని, రామేశ్వరంలో అసలు వంతెనే  లేదనీ రభస చేస్తున్నారు రామభద్రా ! వంద తలల రావణాసురులు కూడా వెయ్యేసి నాలుకలతో ఓటుకోసం నోటుతో పాటు హామీల మాయ లేళ్లను వదలడమే ఈసారి విశేషం శేషశయనా! జనహితం కోసం మళ్ళీ నువ్వే ఏదో మహిమ చూపాలని దీనజనుల తరుఘన కోరేందుకే నేను వాచ్చింది కోదండరామా!


ఈ దుష్ట రాజకీయ రావణాసురుడి ప్రాణం  బాలెట్ పెట్టె  మీట నొక్కే బొటన వేలులో ఉంటుంది  నారదా! పౌరుడిగా అవతారమెత్తి, ఓటు కోదండపాణినై శిష్టరక్షణ  కై  కోదండ మందుకుని ఇదే వస్తున్నాను పదవయ్యా  .. నారదా!  


కదలండి కోదండపాణీ! అరాచకాలకు కాలం చెల్లినప్పుడే మనకు నిజమైన నవమి పండుగ ! అసలైన మన భక్తులకు నిండేది వడపప్పు , పానకాలు కడుపు  నిండుగ ! - అని లేచింది సీతమ్మ తల్లి కూడా! 


రచన- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు ప్రచురితం - 04 -04- 2009 ) 


ఈనాడు - సంపాదకీయం ఒప్పుల కుప్ప రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 18 -03 - 2012 )

 


ఈనాడు - సంపాదకీయం 

ఒప్పుల కుప్ప

రచన - కర్లపాలెం హనుమంతరావు 


ఈనాడు - సంపాదకీయం 

ఒప్పుల కుప్ప

రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 18 -03 - 2012 ) 


 భూమ్యాకాశాలు, సూర్యచంద్రులు, నక్షత్రమండలం, దేవదానవులు, మానవులు, చెట్టూ పుట్టా- ఏదీ పుట్టని కాలంలో నీటిమీద బుగ్గలా తేలియాడే ఏకోనారాయణుడు ఆదిజాంబవుణ్ని, తోడుగా ఆదిశక్తిని సృష్టించాడని జాంబపురాణం కథనం. 'ఆదిశక్తి సహకా రమే లేకపోతే అసలీ అండపిండ బ్రహ్మాండాలనేవే ఉండేవి కావని డక్కలి కళాకారులు పటం సాయంతో ప్రదర్శించే ఆదిపురాణం చెబుతోంది. 'శక్తితో కలిసినప్పుడే శివుడికైనా జగత్ సృష్టి సాధ్యం' అన్న శంకర భగవత్పాదులవారి సౌందర్యలహరి' ఎత్తుగడా దేవి సర్వోన్నత్యానికి నివాళులు అర్పించేదే! ఉపరితలం మీద ఊగిసలాడే పిల్లవేరు మగవాడైతే, అతడి ఉనికికి ఊపిరందించే తల్లివేరు- స్త్రీ. అక్షమాల, పుస్తకం, అభయ వరదహస్తాల దాల్చి కమలాసీన అయిన బాలాదేవి మొదలు- అష్టభుజ శిష్టరంజని దుష్టదైత్య గర్వ భంజని సర్వమంగళ దుర్గాభవాని దాకా అమ్మవెన్ని అవతారాలో! అన్నీ ఆ స్త్రీమూర్తి అసమాన ప్రజ్ఞాప్రపత్తులకు అలౌకిక ప్రతీకలే. పోతన భాగవతంలో- వేటనుంచి అలసి మరలివచ్చిన పురంజనుడు అంతఃపురాన  తన కాంత కనిపించక ఎంత చింతపడతాడో! పొగడొందుజనని గానీ/ తగవున వర్తించునట్టి దయితయ గానీ/ తగనుండని గృహమున నుం/ టగు జక్రవిహీన రథమునందుంట రయన్' అని ఆ సందర్భంలో పోతన పురంజనుడి నోట పలికించిన మాట నేటికీ నూటికి నూరుపాళ్ల నిజం. 'ఇరువర్గాలు ఇరుసు అని నమ్మే శకటాలపై/ రతిరాజ కేతనాలు కలకాలం రెపరెపలాడాలనే' గానీ 'ఖలులు సుఖసాధన మాధ్యమంగా తప్ప మరోలా తమ శరీరాన్ని మగవాడు మననియ్యడ' న్న  సృహ స్త్రీమూర్తికి లేకనా! జంధ్యాలవారు కరుణాకుమారి ఖండకావ్యంలో అన్నట్లు 'ఆమె అమృతమయి'. మగవాడు ప్రశాంతచిత్తంతో జీవితం గడప గలుగుతున్నాడంటే కారణం- 'ఆమె శాంతమూర్తి' కావడం.


తనవెంట తుదిదాకా అడవులకు నడచివచ్చిన అపరంజి బొమ్మ సీతను చివరకు అవే అడవుల పాల్జెసిన మగవాడు శ్రీరాముడు. ద్వాపరంలో వ్రేపల్లెనుంచి మధురానగరిదాకా ఆ నందనందనుడి జీవితాన్ని బృందావనంగా మార్చింది స్త్రీమూర్తిలోని పదహారువేల కళలే! ఆమె అంటే ప్రేమే. చెదిరిన హృదయాన్ని రాయి చేసికొని పెట్టెను అలల్లోకి నెట్టబోయే ముందు కూడా వలపు నిలు పుకోలేక, చేయిరాక, సుతుని కౌగలించుకుని కుంతీమాత ఎంతలా విలపించింది! పరీక్ష వంకతో శిక్షింపడానికా అన్నట్లు వచ్చిన కలహభోజుడి 'ఫలహారమునకు ఇనుప గుగ్గిళ్లు వండి వడ్డించి - 'అమ్మా! నీ చేతి తాలింపు, కమ్మదనము/ గుమగుమ పరిమళించె' అని భళా అనిపించుకొన్న అనసూయమ్మ తల్లి వాత్సల్యమామెది. నారదుడు చెప్పాడు. నాన్నగారు బెదిరించారు. తల్లి బతిమాలింది. 'ఆ గుండె ధైర్యమేమొ! చావెరిగియు కట్టుకొన్నది నచ్చినవాని ఆ చిన్నది- సావిత్రి. 'అరణ్యములో జము వెంట నొంటిగా నాయువు దీరిపోవు పతికై పరువు లెత్తిన ఆమె గుండె దిటవుకు ఏమని పేరు పెట్టుకోవాలి: వీరనారీ శిరోమణి భారతీయ/ గౌరవపతాక రుద్రాంబికామ తల్లి- నేల నాలుగు చెరగులా కన్నబిడ్డల్లాగా ప్రజ లనేలే పాలనా పటిమకు ఒక ప్రతీక.  అతిపెద్ద ప్రజాస్వామ్య దేశా నికి సారథి ఒక ప్రతిభా భారతి . అత్యున్నత చట్టసభకు అధిపతి

ఒక మీరాకుమార్. ప్రభుతకు పాలక కూటమికి వారధి ఒక సోనియాగాంధి. ప్రశ్నించే ప్రతిపక్షానికి నాయిక ఒక సుష్మాజీ. రాజకీయమేనా... ప్రతి రంగంలోనూ అంగనల ప్రభ   ' కంటే- కూతుర్నే కనాలి ' అనేటంత  అమోఘంగా ఉందా లేదా? 


కాలం ఏదైనా 'కార్యేషు దాసీ, కరణేషు మంత్రి, భోజ్యేషు మాతా, శయనేషు రంభా' సూత్రం- స్త్రీమూర్తి స్వచ్ఛందంగా స్వీక రిస్తున్న బాధ్యత. తల్లిగా, చెల్లిగా, అనురాగవల్లిగా మగువ చూపగ లిగే మక్కువ మగవాడికి వెయ్యిజన్మలెత్తినా ఒంటపట్టని అవధాన విద్య. 'అమ్మా! నీవు ప్రేమతో తాగించిన పాల బలమే నా కమనీయ కవితకు ప్రేరణ'  అని శంకరాచార్యుల వంటి మహా తత్వ వేత్తే చేతులెత్తి మొక్కిన కారుణ్యమామెది. ' ఆడవాళ్లని కోడికాళ్ల కంటే చవగ్గా వండుకుని చెండుకుని కాల్చుకుని నరుక్కుని/తిం టున్న అంగాసురుల్ని' కాచుకునేందుకు 'కడుపుమంట కొలిమిలో కోట్ల కొడవళ్లు అచ్చోసి/ అడుగు బయట పెట్టే అమ్మాయిలు తలల్లో/ అర్ధచంద్రుడిలా ' తురుముకోక తప్పటం లేదు. సహజంగా ఆమె, స్వభావరీత్యా- నవ్వుల నదిలో సాగే పువ్వుల పడవ. సముద్రపు ఒడ్డున కాసిన్ని ఆల్చిప్పలు ఏరుకొని వాటిలో ముత్యాలకోసం వెతుక్కునే పిచ్చితల్లి. తడి ఇసుకలో కాలు దూర్చి పక్షి పిల్లలకోసం గూళ్లు కట్టి వాటి రాకకోసం ఎదురుచూసే పెద్దమనసున్న చిన్నది. ఎంత కష్టమైనా ఉండనీ... ' ఏటి గట్టున రెల్లు పొదలమధ్య పడు కొని/ వగలమారి చందమామను మనసారా' చూసినట్లు ఊహించుకొని'  మురిసిపోయే ప్రణయతత్వం ఆమెది. రాళ్లు ముళ్లు ఉండే దారిలో సాగటానికైతే వట్టి సాహసం చాలు. అడుగడుగునా రక్తం, కన్నీరు మడుగు కట్టిన దోవలో నడవడానికి కావాల్సింది 'హృదయ' మనే అయిదో గుండె కవాటం. నిప్పు కణికనైనా నెమలి పింఛంలా మార్చగల మంత్రం సృష్టి మొత్తంలో పుట్టుకతోనే ఒంటపట్టించుకు న్నది ఒక్క స్త్రీ జాతే. అందుకేనేమో- మరో జన్మంటూ ఉంటే అంద మైన ఆడపిల్లగా పుట్టాలని ఉందని కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ఇటీవల కోరుకున్నారు. ఆయనకు అనే ఏమిటి మరో జన్మంటూ నిజంగా ఉంటే ఒయ్యారి భామగా పుట్టి ఒప్పుల కుప్పలాట ఆడుకోవాలని ఏ మగవాడికుండదు!


- రచన : కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 18 -03 - 2012 ) 




Tuesday, December 7, 2021

ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక రాయలుకేం తెలుగు మన మాయలు రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - 22-07-2010 )

 





ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక 

రాయలుకేం తెలుగు మన మాయలు

రచన - కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - 22-07-2010 ) 



'అవును బాబాయ్' ఆ రాయలు మన అధిష్ఠానం మనిషన్నా  కాదు, భయం నటించి ఆర్భాటంగా అంత లావున ఉత్సవాలు చేసి పారేయడానికి! మనం ఆ కృష్ణరాయల్ని  తలచుకోని క్షణమెక్కడున్నది చెప్పు! రాజగోపురాలు కూలినప్పుడల్లా- ఆ రాజుగారు గుర్తుకొస్తూనే ఉన్నారాయె!


'అవునురా అబ్బాయ్! కళింగ యుద్ధానికి ముందు దేవే రులిద్దరితో కలిసి ఆ ధర్మాత్ముడు తిరుమల వేంకటేశ్వరస్వామికి చేయించిన నవరత్న ఖచిత కిరీటాలు, బంగారు ఆభరణాలు... రాళ్ళతో సహా కరిగి మాయమైపోయాయని బయటపడినప్పుడు, ఆ మహారాజే గుర్తు కొచ్చి మనసు పాడైపోయిందనుకో! చేసేవన్నీ చేసి, మళ్లీ ఆ రాయలవారి పాలన వస్తే బహుభేషుగ్గా ఉంటుందని సంస్కరణ సభలో సర్కారు పెద్దమంత్రే పెద్ద అభిభాషణ చేశాడు... చూడు! అదే తమాషా!'


'మాట వరసకేదో అలా అన్నాడులే బాబాయ్, నువ్వు అన్నీ పొల్లుకు పొల్లు పట్టించుకుంటావు! నిజంగా ఆ రాయలవారే గనక తిరిగివస్తే మన నాయకులు తి ట్టుకొంటారు కూడా. ' 


'అసలు ముందు ఆ మహరాజు ఇక్కడి పరిస్థి తులు చూసి తట్టుకోగలడా- ఆ సంగతి చెప్పు1  కన్న తల్లి భాషను వదిలి, కన్నడ రాజ్యం భాషను వదిలి. . తమిళ ఆళ్వారుగారమ్మాయి ప్రేమకథను మన భాషలో అంత చక్కగా రాసిన ఆ బహు భాషాభిమా నికి భాష పేరుతో ఇప్పుడు జరుగుతున్న రచ్చ చూసి పిచ్చెక్కిపోదా! దేశభాషలందు తనకు లెస్సగా తోచిన తెలుగు పలుకులను 'ఎన్నడూ పలకనని' పల కమీద రాసుకుని మరీ మెడల్లో వేలాడేసుకుని తిరిగే ముక్కుపచ్చలారని పిల్లల్ని చూసి ముక్కమీద వేలేసు కోకుండా ఉంటాడా? ' 


'నిజమే బాబాయ్!  తాను రాజగౌరవమిచ్చి ప్రోత్స

హించిన భాషను తెలుగువారై ఉండీ తెలుగు ప్రజా ప్రతినిధులు చివరికి చట్టసభల్లో కూడా తప్పకపోతే తప్ప మాట్లాడని దుస్థితిని చూసి కచ్చితంగా అవాక్క వటం ఖాయం!'


' భాష సంగతి అలా వదిలేయ్! నాయకుల సంగతి మాత్రం అంతకన్నా నయంగా ఉందా! ఓడిన వాళ్ళ మీద కూడా బోలెడంత ఔదార్యం చూపించి ఆదరించేవాడట ఆయన. అంతటి ఉదార హృద యుడు- నేడు ఎన్నికల్లో నిలిచి గెలిచినవాడి మీద కూడా... మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా బురదజల్లటమే ప్రధాన కార్యక్రమంగా పెట్టుకుని ఉండే మన ప్రజాప్ర తినిధులను చూసి నీరుకారిపోడా!'


' సరేలే, ముందుండి సైన్యాన్ని నడిపించిన ఆ వీరుడెక్కడ... వెనక ఉండి జనాలను తుపాకీ గుండ్లకు బలిపెట్టే మన శూరులెక్కడ? ఆ భోజరాజుకీ మన భోజనరాజులకీ పోలికెక్కడలే బాబాయ్! ఒకందుకు మాత్రం మన నేతలు ఆజన్మాంతం ఆ రాయలువారికి  రుణ పడి ఉండి తీరాలి. ప్రజాహిత పక్షపాతి కనక వ్యవ సాయం కోసం అలా ఉరూరా తటాకాలంటూ తవ్వి పెట్టుంచుకపోతే... ఇప్పుడు వాటిని పూడ్చి ప్లాట్లేసుకుంటూ కోట్లకుకోట్లు సొమ్ము చేసుకునే అవకాశమే ఉండేది  కాదుగా!  మన నేతలకు అయినా ఆ రాయలకు మనవారి మాయలు అంతగా అర్ధంకావులే బాబాయ్ ! పొగడ్తలకి పొంగి నిజంగానే దివి నుంచి కిందకు దిగి వచ్చేస్తే .. తన పేరు చెప్పుకొని నాయకులుచేసే ఆర్భాటాలకు, ఆరాటాలకు మళ్లీ ఆయన పాతాళంలోకి పారిపోవాలి !' 


' నిజమేరా నాయనా! ఏ పనైనా తల్చుకోగానే తక్షణం అమల్లో పెట్టనిదీ  తోచని ఆ రాయలు తన పంచశతాబ్ది పట్టాభిషేకోత్సవాన్ని... ఏడాది గడిచిన తరువాత ఏదో మొక్కుబడిగా చేసిన మన సర్కారు వారి చిత్తశుద్ధిని చూసి... పాతాళానికేం ఖర్మ- దాని కిందన ఉన్న రసాతలందాకా ఉరుక్కుంటూ పోవా ల్సిందే!  నన్నడిగితే ఆ రాయలు తిరిగిరాకుండా ఉంటేనే మంచిది. నవరత్నాలు రాసులుగా పోసి అమ్మిన ఆ నాటి నగరాల్లో ఇవాళ బస్సులమీదో, ఎదు టిపక్షం వాళ్ళమీదో విసరటానికి రాళ్ళను కుప్పలుగా పోసి ఉండటం చూస్తే- తట్టుకోలేడు। తన భువన విజయాన్ని మించి వెలిగిపోతున్న నేటి నేతల భవన విజయాలను చూసి బిత్తరపోతాడు! తిరుమల నుంచి సింహాచలం దాకా దాదాపు అన్ని దేవాలయాలకు భూరి విరాళాలిచ్చి ఏ మాత్రం గీర లేకుండా తిరుమలేశుని మహాద్వారం దగ్గర రెండు చేతులూ జోడించి నిలబడ్డ ఆ సార్వభౌ ముడు, జైళ్ళపాలై జడ్ కేటగిరీ సెక్యూ రిటీలు, బుల్లెట్ ప్రూఫ్ కార్లకోసం వెంపర్లాడు తున్న మన నేతలను చూసి ' ఆహా ! వీళ్లా  నా వారసుల' ని  నీరసపడిపోతాడు. రాయలవారు  రాకపోవటమే మేలు! ' 


'రాడులే బాబాయ్, మరీ అంత బెంగొద్దు! ఒకవేళ వచ్చినా, మనసర్కారు ' మద కరీంద్రము డిగ్గి కేలు పట్టి' ఆయనకు గజారోహణం చేయించడానికి తయారుగానూ లేదు. ఓదార్పు యాత్రలు, పాదయాత్రలు, బస్సు యాత్రలు, మధ్యమధ్యలో మినీ ఎన్నికల జాతరలతో క్షణం తీరిక లేకుండా ఉన్న మన ప్రభువులకు ప్రస్తుతం అధిష్ఠానం  పురమాయిస్తే తప్ప ఆ తెలుగు వల్లభుడు వచ్చినా పూలమాల వేయటానికైనా  సాహసం ఉండదు. అయినా, ఏ రాయలు వస్తే మాత్రం ఎవరికి కావాలి? సామాన్య జనానికి కావా ల్సింది కనీసం కిరసనాయిలు ధరన్నా దిగిరావటం!'


రచన - కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - 22-07-2010 ) 

ఈనాడు - హాస్యం- వ్యంగ్యం - గల్పిక ఆకలి తీర్చే చిట్కాలు రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు ప్రచురితం - 23 -08 -2010 )

 



ఈనాడు - హాస్యం- వ్యంగ్యం - గల్పిక

ఆకలి తీర్చే చిట్కాలు 


రచన- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు ప్రచురితం - 23 -08 -2010 ) 



'పెళ్ళిలో కొత్త వధూవరుల పై ఇన్ని అక్షింతలు చల్లుదామన్నా బజారులో బియ్యం ధర చూసి గుండె బేజారయిపోతోంది. వెర్రిపిల్లకు  బావగారిమీదెంత వలపు ఉన్నా కూరలో కూరి పెడదామంటే గుత్తొంకాయలు కిలో పాతిక రూపాయలు! గంగి గోవు పాలు గరిటెడైనా చాలన్నాడుగానీ మన వేమన, ఇప్పుడు చుక్క పాలు కొనాలన్నా చుక్కలు చూడాల్సిన పరిస్థితి!


ఓ కామ్రేడ్ కారత్! మీకు మా చేపల వేపుడు కరకర మంటూ మహారుచికరంగా ఉండవచ్చేమోగానీ, ఇక్కడ రెండు రూపాయలు పెట్టినా కరివేపాకు కాడ ఒకటి కూడా రావటంలేదు! పెట్రోలు గట్రా రేట్లు పేట్రేగి పోతున్నాయని చంద్రబాబు అట్లా ఎడ్లబండిమీద ఊరేగుతున్నారుగానీ... ఎడ్లు తినే ఎండు గడ్డి పరకలైనా పాతికా పరక్కొస్తు న్నాయా? 


భారతదేశం ఇప్పుడు చక్కని పాడి యావు కానేకాదు. వట్టి వట్టిపోయిన గొడ్డు.  సూటిగా చెప్పాలంటే ఆబాలగోపాలం ఇవాళిక్కడ వరవిక్రయంలోని సింగరాజు లింగరాజులే. ఉప్పులూ పప్పులూ తులాల చొప్పున తూచి తింటేగాని బతకలేని దుర్భర పరిస్థితి. 


వేళకు వానలు రాకపోవటం సర్కారు లోప మంటావుట్రా? కరవు మొత్తానికి క్యాబినెట్టే కారణమా ఏంట్రా? వరదలకు గట్లు తెగటం కూడా గవర్నమెంటు కుట్రే! ఉప్పు రేటుకీ, యూపీయే రెండో హయాముకీ సంబంధంమేంటి చెప్పు!  ఎస్మాలూ, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించటాలూ తప్ప పాపం సోనియమ్మ సర్కారు మాత్రం చేయగలిగిందేముంది చెప్పు? అదుపు చేసేటందుకు గాదె కింది పందికొక్కులా - పార్టీలోని కిందిస్థాయి కార్యకర్తలూ! అక్కడికి ధరల రెక్కలు కత్తిరించడానికి అందరూ పాపం.. ఎంతగా

రెక్కలు ముక్కలు చేసుకుంటున్నారు? పార్లమెంటు స్తంభిస్తే పాతధరలు దిగుతాయా భాయ్? ధర్నాలకు ధనియాల ధరలు, గోబ్యాకులకు గోధుమల రేట్లు బెదిరే కాలమా ఇది! పిడికెడు అన్నం కూడా పెట్టలేని ఈ పీడీయస్ ఎందుకు? చీమలా అయినా పుట్టలేదు. మధ్యతర గతిలో పుట్టడమే ఖర్మ''


ఆపరా ఆ సోది। తెగ రెచ్చిపోతున్నావు వింటున్న కొద్దీ!  ఆఫ్ఘాల్... ఆమాద్మీగాడివి నువ్వెంత? కొరియాలో పుట్టుంటే తెలిసేది .. ఇరవై ఏళ్ళబట్టి అక్కడ రెండంకెల ఆహార ద్రవ్యో ల్బణం రంకెలు పెడుతోంది. మన ప్రధాని పాపం ఒక్క అంకె ద్రవ్యోల్బణం కోసం ఒంటికాలి మీద ఎంతకాలంనుంచీ జపం చేస్తున్నారో చూడు! జాలే యడంలేదురా?


సింగినాధం -- సింగిలిడ్లీలోకి సాంబారు కూడా దొరకనప్పుడు ఆ లెక్కలెందుకు?


ఛ! ఎంతసేపూ దేశం నా భోజనంలోకి ఏమిచ్చిందన్న యావేతప్ప- దేశానికి నువ్వేమిచ్చావోనని చూసు కోవా? గ్లోబే కాలిపోతుందని గోల పెడుతున్నార్రా అవతల!  నీ కడుపుమంట ఇపుడెవరిక్కావాలి చెప్పు! అయినా అడిగావు కాబట్టి ఆకలి తీరే చిన్ని చిట్కాలు రెండు, మూడు నాకు తోచినవి చెబుతా విను। 


కంచం ముందు కూర్చున్నప్పుడు  మాయాబజారు సినిమా భోజనం పాట పెట్టుకో! అయినా కడుపు నిండిన ఫీలింగు కలగకపోతే, కాశీకి పోయినట్లు ఊహించుకుని తినే ఎంగిలి  పళ్లాన్ని ఎత్తి  గంగలో విసిరి పారేసేయ్! చిన్నత నంలో మీ అమ్మ నిన్ను ఆడించిన అన్నాలాటని మీ చిన్నారులతో మళ్ళీ ఆడించటం మరో బ్రహ్మాండమైన చిట్కా.  చిటికలేసుకుంటూ ' పప్పు పెట్టి, పాయసం పెట్టి, అన్నం పెట్టి'  అంటూ ముద్దుచేసి మరీ కానీ ఖర్చు లేకుండా ఎన్ని ముద్దలైనా ప్రేమగా పెట్టేయొచ్చు..  ఆపైన చక్కి లిగింతలు కూడా పెట్టావనుకో, కడుపు నిండ టమేం ఖర్మరా  బాబూ! కళెంటనీళ్ళు కూడా వచ్చేస్తాయి. . ధారగా..


'ఇంకొద్దన్నా, ఇప్పటికే కన్నీళ్ళు కుండలకొద్దీ కారిపోతున్నాయి!'


... అలా తల గోడకేసి బాదుకుం టున్నావ్? ఒకసారి తల మోదుకుంటే గంటకు నూటయాభయ్ కేలరీలు వృథాగా ఖర్చవుతాయి. తెలుసా! భోజనకాలే గోవింద నామస్మరణ' అంటారు. అలా తల కొట్టుకుంటుంటే భోజనానికి ముందే నువ్వు గోవిందా అయిపోయేవు. ముందు ఆ బాదుడు ఆపరా బాబూ!'


' ఎందుకన్నా ? ముందుముందు మన నాయకు లకు జిందాబాదులు కొట్టేందుకు మిగలవనా!'


రచన- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు ప్రచురితం - 23 -08 -2010 ) 

చిన్న కథ సుబ్బరావమ్మ ఏడ్చింది - కర్లపాలెం హనుమంతరావు ( ఆంధ్రభూమి - 01 - 12 -2009 - ప్రచురితం )




 చిన్న కథ; 

సుబ్బరావమ్మ ఏడ్చింది 

- కర్లపాలెం హనుమంతరావు 

( ఆంధ్రభూమి - 01 - 12 -2009 - ప్రచురితం ) 


సుబ్బరావమ్మ సూపర్ ధైర్యవంతురాలు. ఏడవటం అస్సలు తెలీదు. తల్లి కడుపులో నుండి బైటపడంగానే ఎవరైనా కేర్..కేర్మని ఏడుస్తారు కదా! ఈవిడ 'ఐ డోంట్ కేర్' అన్నట్లు నవ్వటం మొదలుపెట్టిందట! దయ్యంపిల్లేమో అని ఇంట్లో వాళ్లు శాంతులు చేయించినా గాని సుబ్బరావమ్మ  సుబ్బరంగా నవ్వుతూనే ఉంది.


సుబ్బరావమ్మ పదమూడో ఏట తండ్రి గుండెపోటొచ్చి పోయినప్పుడు కూడా సుబ్బరంగా నవ్వుతూ నట్టింట్లో తిరిగింది. కళ్ళనీళ్లు పెట్టుకోలేదు సరికదా...ఆరోజు అత్యంత విషాదంలో మునిగుంటే తనే అందర్నీ సముదాయించింది.


సుబ్బరావమ్మకు కష్టాలు రావనికాదు...ఏడవటం ఎలాగో తెలీదు. అదీ ప్రాబ్లమ్. 


కొంతమందికి నవ్వటం రాదు కదా!...అలాగ.ఏడ్చినపుడు నరాలు రిలాక్సవ తాయి. గుండె తేలికవుతుందని ఎంత చెప్పినా ఉపయోగం లేకపోయింది.


పెళ్లయి అత్తారింటికి వెళ్ళినప్పుడు దీని తిక్క కుదురుతుందిలే అనుకొన్నారు. అత్తగారికే కుది రిందా తిక్కేదో! ఎప్పుడూ ఏడవకుండా ఉండే కోడల్ని చూసి ఆ అత్తగారికే తిక్క ఎక్కు వైందో..ఏమిటో...మరింత 'కోడరికం' పెట్టింది. 


సుబ్బరావమ్మ మొగుడు పరమత్రాష్టుడు. తాగుడూ.. పేకాట.. తిరుగుళ్లు... తెల్లారి కొంప కొచ్చి పెళ్ళాన్ని చితకబాదేవాడు. మహా ఇల్లాలు... ఆ బాధలన్నీ కిమ్మనకుండా భరిం చింది గానీ ఏనాడైనా కట్టుకున్న వాడిట్లా కసాయి వాడని...కనీసం ఒక్కసారయినా ముక్కు చీదెర గదు. పెళ్ళాం వైఖరికి విసిగి మొగుడు పట్టించుకోవటం మానేశాడు. 


అత్తగారు బెదిరి దూరంగా ఉండేది. ఆడపడచులు వదినవైపే ఆశగా చూస్తుంటేవాళ్లు ఎప్పటికైనా తమ ఆశ నెరవేరక పోతుందా అని.


కాలచక్రం గిర్రున తిరిగింది. సుబ్బరావమ్మిప్పుడు అత్తగారయింది. కొడుకులు, కోడళ్లు పెట్టే హింస నరమానవుడు సహించలేనిది. అలాంటి వాటిని తట్టుకుని నిలబడటం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య.


హఠాత్తుగా సుబ్బరావమ్మకి ఇప్పుడు ఒక కొత్తరకం జబ్బొచ్చి పడింది. దాన్ని ఇంగ్లీషులో అదేదో నోరు తిరగని 'ఫోబియా' అంటారుట..మొత్తానికి అదొక చిత్రమైన జబ్బు. దానికింతవరకూ మందు వైద్యరంగంలో కనుక్కోలేదుట. సుబ్బరావమ్మిక రోజులు లెక్కించు కోవచ్చు అన్నారు డాక్టర్లు. 


కొడుకుల గుండెల్లో బండరాళ్ళు పడ్డాయి. ప్రేమతో కాదు... ఆమె ఇంకా కనీసం ఒక ఏడాదన్నా బతికుండాల్సిన అవసరముంది. మనుమరాలికి మైనారిటీ తీరిందాకా తన నానమ్మ ఇచ్చిన పదికోట్ల ఆస్తికి తనే హక్కుదారు. 


నానమ్మలు మనవరాళ్లకి ఆస్తిని నేరుగా రాసిచ్చే చిత్రమైన సంప్రదాయం వాళ్ళ వంశంలో నాలుగు తరాలనుండి నిరాటంకంగా వస్తుంది. మనమరాలికి మైనారిటీ తీరకుండానే తాతమ్మ గుటుక్కుమంటే ఆస్తంతా ఊళ్ళో ఉన్న శివాలయానికి చెందాలన్నది అందులో రూలు. అందుకే సుబ్బరావమ్మ కొడుకులు తెగ ఆందోళన పడుతున్నారు. ఇంకో ఏడాది గడిస్తేగాని పెద్ద కొడుకు కూతురు మేజర్ కాలేదు. అందాకా సుబ్బరావమ్మ ఎలాగైనా బతికి తీరాలి. 


బతకా లంటే ఆమె నరాలు మెత్తబడాలి. నరాలు మెత్తబ డాలంటే బాగా ఏడవాలి. అది సుబ్బరావమ్మకి చేతగాని పని. అన్ని రకాల వైద్యాలూ అయ్యాయి. 


అల్లోపతి... ఆయుర్వేదం... హోమి యోపతి...న్యూరోపతి...నాచురోపతి, భూమం డలం మీదున్న వైద్య విజ్ఞానం మొత్తం ఈ సుబ్బ రావమ్మని ఏడిపించలేమని నిస్సహాయంగా చేతులెత్తేసింది. 


బట్... ఇండియా ఈజే లాండాఫ్ మిరాకల్స్ కదా! హిమాలయాల్నుంచీ హిందూ మహా సముద్రందాకా పాదయాత్ర చేస్తూపోయే తాంత్రికబాబాగారు ఈపూరుపాలెం వచ్చిన ప్పుడు ఈజీగా ఈ సమస్యను పరిష్కరించారు.


బాబాగారు విషయమంతా విని సాలోచనగా తలూపి కొడుకుని పిలిచి చెవిలో ఏదో ఊదారు. 


వాకిట్లో వేసున్న సుబ్బరావమ్మగారి మంచాన్ని నట్టింట్లోకి మార్పించారు. వారం రోజులవరకూ ఏ మార్పూ లేదు. 


ఆరోజు ఆదివారం... అందరూ ఎవరిపన్లలో వాళ్ళున్నారు. సుమారు పది గంటల ప్రాంతంలో ఘొల్లుమని  గోల వినప డింది. ఆ వింత శబ్దాన్నింతవరకూ ఎవరూ విని ఉండలేదు. కంగారుగా ఇంటిల్లిపాది గదిలోకి పరుగెత్తారు. 


సుబ్బరావమ్మ ఏడుస్తున్నది . భయంకరంగా ఏడుస్తోంది . గుండెలు బద్దలయ్యేలా ఏడుస్తోంది. 


ఇంటిల్లిపాదీ ఆనందంతో గంతులేసారు.


ఇంక ఆస్తికి ఢోకా లేదు . 


థేంక్సు టూ కేబుల్ టీవీ అని గొంతెత్తి అరిచారు ఇంటిల్లిపాదీ! . 


అసలేం జరిగిందంటే... 


టీవీలో రోజూ అన్ని ఛానెల్సులో వరసగా వస్తున్న సీరియల్సుని చూసి చూసి సుబ్బరావమ్మ అందులో పూర్తిగా లీనమైపోయింది. 


ఆవాళా ఆదివారం అవటంచేత...ఆ ఏడుపు సీరియళ్లేవీ రావు . కనుక.... ఘొల్లుమన్నది  సుబ్బరా వమ్మ.


తానొకటి తలిస్తే దైవమొకటి తలు స్తుంది. సుబ్బరావమ్మగారు ఏడుస్తూ ఏడుస్తూ ఆరోజు చీకటి కాకుండానే కన్నుమూ సారు.


ఇప్పుడు ఏడవటం ఇంట్లో వాళ్ళ వంతయింది. 


- కర్లపాలెం హనుమంతరావు 

( ఆంధ్రభూమి - 01 - 12 -2009 - ప్రచురితం ) 

గేయకథ పిల్లల కోసం అనుమానం - పెనుభూతం - జె.జానకి ( ఆంధ్రపత్రిక - వారపత్రిక - 02-01 - 1952 సంచిక సేకరణ: కర్లపాలెం హనుమంతరావు


గేయకథ : పిల్లల కోసం 
అనుమానం - పెనుభూతం 
- జె.జానకి 
( ఆంధ్రపత్రిక - వారపత్రిక - 02-01 - 1952 సంచిక 
సేకరణ: కర్లపాలెం హనుమంతరావు 

ఎచ్చటికో, బాటసారి పయనం? 
చరచర సాగిస్తున్నాడు గమనం. 
సమయం కాని సమయం, 
అంతా అంధకారమయం 
నదురులేక బెదురు లేక, 
ఇటుచూడక అటుచూడక, 
సాగిస్తున్నాడు పయనం, 
ఎచ్చటికో ఆగమనం?

అతని కేదొ కనుపించింది, 
రోడ్డుప్రక్క నిలుచుంది, 
చేతులు చాచుకు చూచింది 
అమ్మొ భూతం అయ్యొ దయ్యం!

బాటసారికి వేసింది భయం 
అకస్మాత్తుగా ఆగింది పయనం 
ముందుకుపోతే పై బడు తుందేమొ? 
వెనుకకుపోతే వెంబడిస్తుందే మొ?

అని కలిగిం దతనికి సందేహం

స్ఫురణకు వచ్చింది ఆంజ నేయ దండకం
 "శ్రీ ఆంజ నేయం”అని మొదలు పెట్టాడు పఠనం

“దిక్కు లేనివారికి దేముడే దిక్కు 
నీకిదే మొక్కు తప్పించు ఈముప్పు" 
అని సాగించాడు ముందుకు గమనం.

అర రె దెయ్యం కాదు 
అది భూతంకాదు 
ఆ ఊరుకు-  అటుదారి 
ఈ ఊరుకు - ఇటుదారి 
అని చూపించే బల్ల అది . 

అంతా వట్టి అనుమానం, 
అనుమానమె పెనుభూతం, 
అన్న పెద్దలమాట నిజం సుమీ 
అనుకున్నాడా ఆసామీ. 
***

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...