జీవన యోగం
వేగంగా వెళుతున్న రైల్లోంచి గాంధీజీ చెప్పొకటి జారి పడిపోయింది. తక్షణం రెండో చెప్పును తీసి మొదటిది పడిపోయిన దిశగా వెనక్కివిసిరారాయన. ఏదైనా పోగొట్టుకొన్నప్పుడు దుఃఖం కన్నా ముందు కర్తవ్యం గుర్తుకు రావడం చాలా గొప్ప విషయం. అది యోగజీవనానికికొండగుర్తు. అలా జీవించారు కనుక గాంధీని మహాత్ముడంది లోకం! రాత్రి తండ్రి పిలిచి ‘శీఘ్రముగ పూనుము రాజ్యము, మారు చెప్పకన్’ అన్నాడు. పొద్దున్నే పినతల్లి పిలిపించి ‘నా తనూభవుడు(భరతుడు) ఇప్పుడే సకల ధాత్రికి నీవలె రాజు కావలెన్... ఇది నీ తండ్రి ఆజ్ఞ’ అంది. రాముడి మొహంలో ఏ రకమైన వికారం ఆందోళన కనపడనే లేదని స్పష్టంగా చెప్పారు వాల్మీకి. ‘కిరీటం పెట్టుకో’ అనే మాటను, ‘నారచీరలు కట్టుకో’ అనే మాటను ఒకే రకంగా స్వీకరించడం యోగికే సాధ్యం. కాబట్టే రాముడు పురుషోత్తముడయ్యాడు! మంచినీళ్లకనివెళ్లిన మహా యోధులు తన తమ్ముళ్లు నలుగురూ నిర్జీవంగా పడి ఉన్నారు. ఒక యక్షుడు కంటికి ఎదురుగా భీకరమైన ఆకారంతోతాడిచెట్టులా నిలబడి ఉన్నాడు. ఒళ్లు జలదరించే ఆ సమయంలో మనసు చెదిరిపోకుండా ఒకటీ రెండూ కాదు, ప్రపంచ తాత్వికులనువిస్మయపరచిన ‘నరునకు ఆత్మ ఎవ్వడు’ వంటి... నూట ఇరవై నాలుగు క్లిష్టమైన ప్రశ్నలకు స్థిరచిత్తంతో బదులిచ్చాడు ధర్మజుడు. ‘నీదైనధర్మజ్ఞతకు మెచ్చితిని’ అనిపించుకొన్నాడు. ‘యుధిష్ఠిరుడు’ అనే గొప్ప పేరు గడించాడు. మహాత్ములు, పురుషోత్తములు, స్థిరచిత్తులుఅందరూ మనదేశంలో అద్భుత యోగ విద్యావంతులు. యోగాభ్యాసం అటు మునుల తపస్సులో భాగం. ‘భాసుర నిగమపదోపన్యాసుడు, సుతపో విలాసుడు అనుపమ యోగాభ్యాసుడు, రవిభాసుడు దుర్వాసుడు’ అంటూ వారి ప్రతినిధిగా దుర్వాసమహర్షిని భాగవతం మనకు పరిచయం చేసింది. యోగవిద్య ఒకప్పుడు గురుకులాల్లో పిల్లలకు తప్పనిసరి పాఠ్యాంశం. అది ఈ దేశసంస్కారం.
మదించిన ఏనుగే అయినా, బాగా మచ్చికైతే మావటివాడు చెప్పినట్లే వింటుంది. మనసుదీ అదే దారి. మనసును మచ్చికచేసుకోవాలంటే యోగసాధనను మించిన మంత్రదండం లేదు. మానవాళికి జరిగిన మహోపకారాల ప్రస్తావన వస్తే ‘నేను సైతంప్రపంచానికి యోగవిద్యను ప్రసాదించాను’ అని భారతదేశం సగర్వంగా చెప్పుకోవచ్చు. యోగులైనవారి యోగ్యతలు మామూలు కొలతలకుఅందవు. ‘ఉర్వి జనులు పరమ యోగీశ్వరుని చూచి తెగడు వారెగాని తెలియలేరు.. అమృతమాది రుచులు హస్తమే మెరుగును?’ అనివేమన‘యోగి’ ప్రశ్నించాడు. మనిషిని చాలా తేలిగ్గా లోబరచుకొనే ప్రలోభాలు యోగి ముందు వెలవెలబోతాయి. మైసూర్ మహారాజుఅందించిన అమూల్య ఆభరణాలను, ఆతిథ్యాన్ని వద్దన్న రమణమహర్షి పేదింట గంజిని అడిగి మరీ తాగారు. ‘వీతరాగులు’ అనేమాటకు అర్థమది. ‘వీతరాగ విషయమ్ వాచిత్తమ్’ అనే యోగసూత్రంలో వారి గురించి పతంజలి మహర్షి వివరించారు. రాముడుఆత్మవిదుడు అన్నారు వాల్మీకి. ‘ఏనాడో పాపం చేసుకొని ఈ కోతిమూకతో గడుపుతున్నాను’ అని రాముడేనాడూ చింతించిన దాఖలాలుమనకు కనిపించవు. భరతుడు విభీషణుడు మధ్యలో గుహుడు సుగ్రీవుడు అందరితోనూ ఆయన ఒకలాగే ఉన్నాడు. అయోధ్య, అడవిరెండూ ఆయనకు ‘సుఖమండలాలే’ (కంఫర్టు జోన్సు) అయ్యాయి. యోగ జీవనానికి అర్థం అదే. వీతరాగులకు, ఆత్మవిదులకులోకమంతా సుఖమండలమే. ‘నియమాది సంగుడై నిలిచిన తత్వంబు విశ్వమంతయు తానగు! తాను విశ్వంబైన తత్వమగును’ అన్నాడు వేమన. ఆ విశ్వనరుల నిర్మల చిత్తంలో- అంతస్సంఘర్షణకు చోటెక్కడుంటుంది, సుఖశాంతులకు లోటెలా ఉంటుంది?
కాబట్టే ‘తస్మాత్ యోగీభవ అర్జునా!’ అని విజయుణ్ని ఆదేశించాడు గీతాచార్యుడు. మునులకన్నా జ్ఞానులకన్నా కర్మిష్ఠులకన్నా యోగి స్థితిఉన్నతమైనదని భగవద్గీత స్పష్టం చేసింది. ‘రాజువు నీవు! మేము గురురాట్కలిత ప్రతిభాభిమాన విభ్రాజిత మహోన్నతాత్ములము’ అంటూ సమ్రాట్టుల ముందు ధీమాగా నిలిచే యోగ్యత యోగులకు సిద్ధిస్తుందని వైరాగ్య శతకంలో భర్తృహరి చెప్పాడు. మన భారతీయమహాయోగుల అపార శక్తిసామర్థ్యాలకు ప్రతీకగా హనుమంతుణ్ని చిత్రిస్తూ ‘శైవాంశంబని చెప్పనా! దశశిరస్సంత్రాస చండాకృతిన్, శ్రీవాయూద్భవుడందునా! అనిలు శాసించెన్ మహాయోగియై’ అంటూ ఆకాశం ఎత్తున నిలబెట్టారు విశ్వనాథ. యోగుల ఆత్మ ప్రత్యయం, మానసిక ఔన్నత్యం, శారీరక పటుత్వం మామూలు మనుషులకన్నా చాలా రెట్లు ఎక్కువగా ఉంటుందని ప్రపంచం ఏనాడో గుర్తించింది. ‘హఠయోగం’పై అమెరికా శాస్త్రవేత్తలు తాజాగా జరిపిన పరిశోధనల్లో మరెన్నో విశేషాలు వెల్లడయ్యాయి. మతిమరుపునకు, వృద్ధాప్యంలోఅల్జీమర్స్కు దారితీసే మెదడులోని హిప్పోక్యాంపస్ పని తీరు యోగా ద్వారా బాగా మెరుగవుతోందని, భావోద్వేగాల నియంత్రణకు తోడ్పడేఅమిగ్డల బలోపేతం అవుతోందని ఆ పరిశోధనల్లో తేలింది. ‘మెదడన్నది మనకున్నది అది కాస్తా పనిచేస్తే విశ్వరహః పేటిక విపాటనజరుగక తప్పదు’ అన్నాడు శ్రీశ్రీ. మెదడును అలా పూర్తిస్థాయిలో ఉపయోగంలోకి తేవాలంటే యోగా సాధన తప్పదని ఈ ప్రయోగాలునిరూపిస్తున్నాయి. ‘తర్క సముద్రాలీదిన జ్ఞానికి తన మనసే ఒక ప్రశ్న, జనన హేతువు మధించిన మౌనికి తన తనువే ఒక ప్రశ్న’ అన్నారుసినారె. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు, సందేహాలకు వివరణలు ఇవ్వగలిగేది భారతీయ యోగశాస్త్ర విజ్ఞానమే. అందుకే మన కొత్తసంవత్సర నిర్ణయాల్లో భాగం కావాలి యోగా!- తెలుగు రుచులు - ఈనాడు సంపాదకీయం - జీవన యోగం
- కర్లపాలెంహనుమంతరావు
ఈనాడు సంపాదకీయం
No comments:
Post a Comment