ఈనాడు - హాస్యం- వ్యంగ్యం - గల్పిక
ఆకలి తీర్చే చిట్కాలు
రచన- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు ప్రచురితం - 23 -08 -2010 )
'పెళ్ళిలో కొత్త వధూవరుల పై ఇన్ని అక్షింతలు చల్లుదామన్నా బజారులో బియ్యం ధర చూసి గుండె బేజారయిపోతోంది. వెర్రిపిల్లకు బావగారిమీదెంత వలపు ఉన్నా కూరలో కూరి పెడదామంటే గుత్తొంకాయలు కిలో పాతిక రూపాయలు! గంగి గోవు పాలు గరిటెడైనా చాలన్నాడుగానీ మన వేమన, ఇప్పుడు చుక్క పాలు కొనాలన్నా చుక్కలు చూడాల్సిన పరిస్థితి!
ఓ కామ్రేడ్ కారత్! మీకు మా చేపల వేపుడు కరకర మంటూ మహారుచికరంగా ఉండవచ్చేమోగానీ, ఇక్కడ రెండు రూపాయలు పెట్టినా కరివేపాకు కాడ ఒకటి కూడా రావటంలేదు! పెట్రోలు గట్రా రేట్లు పేట్రేగి పోతున్నాయని చంద్రబాబు అట్లా ఎడ్లబండిమీద ఊరేగుతున్నారుగానీ... ఎడ్లు తినే ఎండు గడ్డి పరకలైనా పాతికా పరక్కొస్తు న్నాయా?
భారతదేశం ఇప్పుడు చక్కని పాడి యావు కానేకాదు. వట్టి వట్టిపోయిన గొడ్డు. సూటిగా చెప్పాలంటే ఆబాలగోపాలం ఇవాళిక్కడ వరవిక్రయంలోని సింగరాజు లింగరాజులే. ఉప్పులూ పప్పులూ తులాల చొప్పున తూచి తింటేగాని బతకలేని దుర్భర పరిస్థితి.
వేళకు వానలు రాకపోవటం సర్కారు లోప మంటావుట్రా? కరవు మొత్తానికి క్యాబినెట్టే కారణమా ఏంట్రా? వరదలకు గట్లు తెగటం కూడా గవర్నమెంటు కుట్రే! ఉప్పు రేటుకీ, యూపీయే రెండో హయాముకీ సంబంధంమేంటి చెప్పు! ఎస్మాలూ, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించటాలూ తప్ప పాపం సోనియమ్మ సర్కారు మాత్రం చేయగలిగిందేముంది చెప్పు? అదుపు చేసేటందుకు గాదె కింది పందికొక్కులా - పార్టీలోని కిందిస్థాయి కార్యకర్తలూ! అక్కడికి ధరల రెక్కలు కత్తిరించడానికి అందరూ పాపం.. ఎంతగా
రెక్కలు ముక్కలు చేసుకుంటున్నారు? పార్లమెంటు స్తంభిస్తే పాతధరలు దిగుతాయా భాయ్? ధర్నాలకు ధనియాల ధరలు, గోబ్యాకులకు గోధుమల రేట్లు బెదిరే కాలమా ఇది! పిడికెడు అన్నం కూడా పెట్టలేని ఈ పీడీయస్ ఎందుకు? చీమలా అయినా పుట్టలేదు. మధ్యతర గతిలో పుట్టడమే ఖర్మ''
ఆపరా ఆ సోది। తెగ రెచ్చిపోతున్నావు వింటున్న కొద్దీ! ఆఫ్ఘాల్... ఆమాద్మీగాడివి నువ్వెంత? కొరియాలో పుట్టుంటే తెలిసేది .. ఇరవై ఏళ్ళబట్టి అక్కడ రెండంకెల ఆహార ద్రవ్యో ల్బణం రంకెలు పెడుతోంది. మన ప్రధాని పాపం ఒక్క అంకె ద్రవ్యోల్బణం కోసం ఒంటికాలి మీద ఎంతకాలంనుంచీ జపం చేస్తున్నారో చూడు! జాలే యడంలేదురా?
సింగినాధం -- సింగిలిడ్లీలోకి సాంబారు కూడా దొరకనప్పుడు ఆ లెక్కలెందుకు?
ఛ! ఎంతసేపూ దేశం నా భోజనంలోకి ఏమిచ్చిందన్న యావేతప్ప- దేశానికి నువ్వేమిచ్చావోనని చూసు కోవా? గ్లోబే కాలిపోతుందని గోల పెడుతున్నార్రా అవతల! నీ కడుపుమంట ఇపుడెవరిక్కావాలి చెప్పు! అయినా అడిగావు కాబట్టి ఆకలి తీరే చిన్ని చిట్కాలు రెండు, మూడు నాకు తోచినవి చెబుతా విను।
కంచం ముందు కూర్చున్నప్పుడు మాయాబజారు సినిమా భోజనం పాట పెట్టుకో! అయినా కడుపు నిండిన ఫీలింగు కలగకపోతే, కాశీకి పోయినట్లు ఊహించుకుని తినే ఎంగిలి పళ్లాన్ని ఎత్తి గంగలో విసిరి పారేసేయ్! చిన్నత నంలో మీ అమ్మ నిన్ను ఆడించిన అన్నాలాటని మీ చిన్నారులతో మళ్ళీ ఆడించటం మరో బ్రహ్మాండమైన చిట్కా. చిటికలేసుకుంటూ ' పప్పు పెట్టి, పాయసం పెట్టి, అన్నం పెట్టి' అంటూ ముద్దుచేసి మరీ కానీ ఖర్చు లేకుండా ఎన్ని ముద్దలైనా ప్రేమగా పెట్టేయొచ్చు.. ఆపైన చక్కి లిగింతలు కూడా పెట్టావనుకో, కడుపు నిండ టమేం ఖర్మరా బాబూ! కళెంటనీళ్ళు కూడా వచ్చేస్తాయి. . ధారగా..
'ఇంకొద్దన్నా, ఇప్పటికే కన్నీళ్ళు కుండలకొద్దీ కారిపోతున్నాయి!'
... అలా తల గోడకేసి బాదుకుం టున్నావ్? ఒకసారి తల మోదుకుంటే గంటకు నూటయాభయ్ కేలరీలు వృథాగా ఖర్చవుతాయి. తెలుసా! భోజనకాలే గోవింద నామస్మరణ' అంటారు. అలా తల కొట్టుకుంటుంటే భోజనానికి ముందే నువ్వు గోవిందా అయిపోయేవు. ముందు ఆ బాదుడు ఆపరా బాబూ!'
' ఎందుకన్నా ? ముందుముందు మన నాయకు లకు జిందాబాదులు కొట్టేందుకు మిగలవనా!'
రచన- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు ప్రచురితం - 23 -08 -2010 )
No comments:
Post a Comment