ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్ఫిక
కదలును కోదండపాణి
రచన- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు ప్రచురితం - 04 -04- 2009 )
ఏమీ, అది మన హనుమ తపమా?
కాదు స్వామీ, భాజపా ఎన్నికల జపం! ఈ గొడవలోపడి మన నవమి జనాలు చేయటం మానేస్తారేమోనని అనుమానంగా ఉంది నాథా !
ఎందుకా సందేహం సీతా! అటు భద్రాద్రివైపు చూడు! ఎప్పటికన్నా గొప్పగా సాగుతున్నది గదా ఆ రథయాత్ర! ఆ భజన విను జానకీ!
అయ్యో రామ! ఆ భజన మీకోసం కాదు అయోధ్యా రామా! తమ నేత గెలవాలని దూతలు చేసే జాతర. ముందు మీరా అభయముద్ర కిందికి దించండి! ఇప్ప టికే తమరు 'హస్తం' పక్షాన చేరినట్లు ప్రచారం సాగుతున్నది. రామా అంటే 'బూత్' మాటైపోయింది స్వామీ!7 అన్నాడు అప్పుడే వచ్చిన నారదుడు.
నా నామం అంత రాజకీయమైపోయిందా నారదా!
అన్నారు రాములవారు ఆశ్చర్యంగా.
రామ అంటేనే రాజకీయ మయమని అర్థం గదా దీనబాంధవా! ఆరంభంలో ఆదికవి 'మరా.. మరా' అని నోరు తిరగక అంటున్నాడేమో అనుకొన్నాగానీ, దానికీ 'మనదే రాజ్యం' అని మరో అర్థం కూడా ఉంటుందని ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది ఆపద్బాంధవా! రాఘవులు, రామారావులు, రామచంద్రరావులు, రాములమ్మలు, సీతరామ్ లు , కాన్షీ రామ్ లు , కరుణానిథులు, కరుణాకరులు, రాజీవులు, చిరంజీవులు, రాందాసులు, నారాయణలు... రాజకీయమంతా రామ సంబంధాలతో నిండిపోయింది రామా! ఎక్కడ చూసినా ఆయారామ్ .. గయారామ్ .. మారాము,రామ రామ... ఏనోట విన్నా రామరాజ్యం మాటే వినిపిస్తున్నది శ్యామా!
మంచిదేగా నారదా! ఈ రాజకీయాల గోలుండదు గదా!- అంది సీతాదేవి.
రామరాజ్యంలో మాత్రం రాజకీయాలు లేవనా తల్లీ! బుజ్జి రా ముడు చందమామ కోసం మారాము చేస్తే మంత్రి సుమంతు లవారు అద్దంలో చూపించి బుజ్జగింపు రాజకీయం చేయ లేదా! మారీచుడు మాయలేడి మోసం, విభీషణుడు రామ పక్షం మారటం, రావణాసురుడి సాధ వేషం కోవర్టు చేష్టలే గదా మాతా! కైకమ్మకు హామీలంటూ మొదలు పెట్టింది ముందు దశరధుల వారే గదా! యాగఫలం మీద ముగ్గురు భార్యలకు సమానమైన హక్కున్నా మూడో భార్యకు అదనపు వాటా పెట్టి ఆశ్రిత పక్షపాతానికి ఆనాడే మహారాజులు శ్రీకారం చుట్టలేదా? చూసి రమ్మంటే కాల్చివచ్చిన హనుమంతుడి చేతల వెనక ఏ వ్యూహం దాగి వుందో గానీ , ఆనాటి నుంచి కోపమొస్తే కార్యకర్తలు లంకాదహనాలకు మించి చేస్తున్నారు దయామయా! ఈ దేవదేవుని అభయముద్రను నేటి నేతలు తమ దైవలక్షణంగా భావిస్తున్నారమ్మా సీతమ్మ తల్లీ! ఈ జగద్రక్షకుడి క్షమాగుణం క్షమాభిక్షగా మారి ఈ కాలం రాక్షసులకు రక్షణ కవచంగా మారిపోయింది . ప్రస్తుతం నడిచేదంతా పరంధాముడి పరిపాలనేనటి ! రామపాదం సోకి రాయికి ప్రాణం వచ్చినట్లు.. రాజశేఖరుడి పాదం పడిన ప్రతిచోటా పంట భూములు పరి శ్రమలుగా మారిపోతున్నాయంట!
ఈ ఆరాచకీయాల్లో నా ప్రభువు ప్రమేయమేమున్నది నారదా? అంటూ భర్తను వెనకేసుకొచ్చింది వైదేహి .
ఈ రామస్వామీ రాజకీయాలలో తక్కువేమీ తినలేదనే ఒకటే లొల్లిగా ఉంది తల్లీ! వాలిని చెట్టుచాటు నుంచి కొట్టడం, జాంబవంత నల నీల సుగ్రీవుడి వంటి వాళ్లతో 'కూటమి' కట్టడం, చెప్పుడు మాటలు విని శంభూకుడిని శిక్షించటం- వంటివెన్నో రామచంద్రుడు చేసినప్పుడు తప్పుకానప్పుడు , మేము చేస్తే మరి వేలెత్తి చూపడమెందుకంటూ ఎదురుదాడికి దిగిపోతున్నారిప్పుడు దీనజనోద్ధారకా!
సీతమ్మ తల్లి కోపంతో ఉడికిపోయింది. నీ నాథుడు పితృవాక్పరిపాలన కోసం పడరాని పాట్లు పడటం. . ఆ జగన్మోహనుడు పితృదే వుడి పాలన కొరకై అడ్డమైన దారులు తొక్క డం ఒకటేనా? ఈ రాజశేఖరుడు అందరినీ కన్నబిడ్డలనే భావించాడు. ఆ రాజశేఖరుడు కన్నబిడ్డే అన్నీ అని భావించాడు. ఈ దేవుడు చెక్కుచెదరని సేతువు నిర్మిస్తే, ఆ మహానుభావుడు చెక్కుల కొరకై సేతువులు నిర్మిస్తున్నాడు. నా రాముడిది ఒకేమాట... ఒకేబాణం... భార్యే ప్రాణం. ఆ దొంగరా ముడిది గంటకోమాట.... ఘడియకో బాణం... ఆడదంటే తృణంతో సమానం . అధికారం వద్దని చెప్పులు మోశాడు ఆనాటి రాముని సోదరుడు. అధికారం కోసమే చెప్పులు మోసేవారు ఈనాటి నాయకులూ .. వాళ్ళ బంధుజనాలు! జనం డబ్బుతో గుడి కట్టించిన వీరభక్తుడు మా రామదాసు. గుడి డబ్బునే గుట్టుగా మింగు వాళ్లు ఈ దాసులు. నిధి సుఖమా, రాముడి సన్నిధి చాలసుఖమా' అనడిగితే నిధే ప్రధానమనే ప్రజాప్రతినిధులు కాదా వీళ్లంతా? రామకోటితో కన్నా రాజీవ్ కోటితోనో .. రామారావు కోటితోనో పుణ్యం పురుషార్ధమనుకొనే భక్తకోటికే కాలమిది. అవునా, కాదా? దేవుడిపాలన అంటున్నారుగానీ మా దేవుళ్లకే ఆలనాపాలనా లేని కరవు కాలం కాదా... నారదా?
నిజమేతల్లీ! కోనేటి రాయనివి ఏడు కాదు .. రెండు కొండలేనని, రామేశ్వరంలో అసలు వంతెనే లేదనీ రభస చేస్తున్నారు రామభద్రా ! వంద తలల రావణాసురులు కూడా వెయ్యేసి నాలుకలతో ఓటుకోసం నోటుతో పాటు హామీల మాయ లేళ్లను వదలడమే ఈసారి విశేషం శేషశయనా! జనహితం కోసం మళ్ళీ నువ్వే ఏదో మహిమ చూపాలని దీనజనుల తరుఘన కోరేందుకే నేను వాచ్చింది కోదండరామా!
ఈ దుష్ట రాజకీయ రావణాసురుడి ప్రాణం బాలెట్ పెట్టె మీట నొక్కే బొటన వేలులో ఉంటుంది నారదా! పౌరుడిగా అవతారమెత్తి, ఓటు కోదండపాణినై శిష్టరక్షణ కై కోదండ మందుకుని ఇదే వస్తున్నాను పదవయ్యా .. నారదా!
కదలండి కోదండపాణీ! అరాచకాలకు కాలం చెల్లినప్పుడే మనకు నిజమైన నవమి పండుగ ! అసలైన మన భక్తులకు నిండేది వడపప్పు , పానకాలు కడుపు నిండుగ ! - అని లేచింది సీతమ్మ తల్లి కూడా!
రచన- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు ప్రచురితం - 04 -04- 2009 )
No comments:
Post a Comment