సాహిత్య వ్యాసం:
బేతాళ పంచవింశతి
-కర్లపాలెం హనుమంతరావు
( తెలుగు వెలుగు మాసపత్రిక - ఏప్రియల్ ; 2019 సంచికలో ప్రచురితం)
బేతాళ కథలను గురించి తెలుగువాళ్లకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. బాలల మాస పత్రిక 'చందమామ' చలవ.. తెలుగునాట తరాల బట్టి బేతాళుడు ప్రతీ ఇంటికీ నెలకో సారొచ్చి చక్కని కథ వినిపించే కథల భూతంగా చిరపరిచితుడు.
పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు మీది శవాన్ని భుజాన వేసుకొని స్మశానం కేసి నడవడం.. శవంలోని బేతాళుడు మహారాజుకు దారిశ్రమ తెలియకుండా కథలు అల్లి చెప్పడం బేతాళ కథల రివాజు. విక్రమార్కుడు వినే ఆ వింత కథలనే 'చందమామ' పాఠకులూ చిన్నా పెద్దా తేడా లేకుండా ఎంతో ఉత్కంఠతో చదవడం అదో మోజు. ఆ మైమరుపుకు కారణం నెలకో తీరులో సాగే కథలలో కొనసాగే కొసమెరుపు. బేతాళుడి ప్రశ్నలకు జవాబులు తెలిసీ పెదవి విప్పకుంటే రాజు తల వెయ్యి వక్కలయ్యే ప్రమాదముంది. మహారాజు ఆ నెల ఏ తెలివైన జవాబు చెప్పి గండం నుండి తప్పుకుంటాడోనని దిగులు! చిత్ర విచిత్రమైన భావోద్వేగాలతో దశాబ్దాలపాటు చందమామ పాఠకులను ఉర్రూతలూగించిన బేతాళుడు ఎవరు? చిక్కుముడి కథల అసలు పరమార్థం ఏమిటి? బేతాళ కథలు రేకెత్తించే పలు సందేహాలు నివృత్తి కావాలంటే 'బేతాళ పంచవింశతి' గురించి కొంతయినా తెలుసుండాలి.
అనగనగా ఒక వీరుడు. అతగాడి పేరు విక్రమసేనుడు. ప్రతిష్టాపురానికి ఆయన మహారాజు. శీలభద్రుడనే ఓ యోగి పదేళ్ల పాటు ప్రతీ రోజూ క్రమం తప్పకుండా రాజుగారికి రోజుకో విచిత్రమైన పండొకటి కానుకగా సమర్పిస్తాడు. నిజానికి ఆ బహుమానాలన్నీ మణులు.. మాణిక్యాలు! రాజు నిలదీసిన మీదట యోగి నోట బేతాళుడి వివరాలు బైటపడతాయి. కోరుకున్న రూపంలోకి మారిపోగల కామరూప శక్తి మాయ బేతాళుడి బలం. ఆ భూతాన్ని తన పరం చేయమని వేడుకుంటాడా తాంత్రిక యోగి.
శైవ తాంత్రిక సంప్రదాయాల అనుసారం బేతాళుడు ఒక భూతం. మంత్ర తంత్రాలతో వాడిని వశం చేసుకోవడం సులభం. స్మశానాలలో శవాలలో నివాసముండే వాడు తన వశమయితే సర్వశక్తులు సిద్ధిస్తాయని తాంత్రిక యోగి దురాశ. సాహసం, మేధస్సులకు సైదోడుగా బోలెడంత సహనం గల విక్రమసేనుడే తన వాంఛితం ఈడేర్చే సమర్థుడని యోగి ఇంత మంత్రాంగానికి పూనుకున్నది. సన్యాసి దురూహ పసిగట్టని రాజు ఎన్ని రాత్రులైనా జాగారాలు చేసి బేతాళుడిని యోగి పరం చేయాలని పంతం పడతాడు. విక్రమసేనుడి ప్రయత్నాలను ఎప్పటికప్పుడు భంగం చేసే బేతాళుడి ప్రయాస నేపథ్యంగా సాగే పాతిక విచిత్ర కథల సమాహారమే 'బేతాళ పంచవింశతి'.
పంచవింశతి అంటే ఇరవైకి అయిదు అదనం. బేతాళుడు చెప్పిన పాతిక కథలు కాబట్టి ఇవి 'బేతాళ పంచవింశతి' పేరుతో సంస్కృత సాహిత్యంలో సుప్రసిద్ధ కథాకావ్యంగా ప్రసిద్ధమయాయి. ‘చందమామ’ పత్రికలో నిరంతరాయంగా కొనసాగిన కల్పిత కథలన్నిటికి బేతాళ పంచవిశంతిలోని కథలే ప్రేరణ.
బేతాళుడి పుట్టుక కథ చాలా ప్రాచీనమైనది. జనశ్రుతంగా విన వచ్చిన ఈ కథలను అజ్ఞాత కవి ఎవరో గ్రంథస్థం చేసినట్లు సాహిత్య పరిశోధకులు భావిస్తున్నారు. బేతాళ కథల మూలాలు శైవ తాంత్రిక సంప్రదాయంలో ఉన్నప్పటికీ.. బౌద్ధుల తాంత్రిక యోగ సంప్రదాయంలోకీ వచ్చి తిష్ఠవేసినట్లు చెబుతారీ బేతాళుడు.
క్రీ.శ ఒకటవ శతాబ్ది, శాతవాహనుల కాలం నాటి ప్రాకృత భాషాకవి గుణాఢ్యుడు పైశాచి భాషలో రాసిన బృహత్కథలోని కొన్ని కథలే బేతాళ కథలని ఒక నమ్మకం ప్రచారంలో ఉంది. బృహత్కథాలహరి కాశ్మీరం ప్రతిలో బేతాళ పంచవింశతి ప్రస్తావన ఉన్నట్లు పాశ్చాత్య పండితుడు వింటర్ విట్స్ కూడా భావించాడు. ప్రాకృతం నుంచి సంస్కృతంలోకి అనువాదమయిన క్షేమేంద్రుడి బృహత్కథామంజరిలో, సోమదేవుడి కథాసరిత్సాగరంలో కనిపించే బేతాళ కథలు నేపాళ కవి బౌద్ధస్వామి సంస్కృత బృహత్కథాశ్లోకసంగ్రహంలో కనిపించవు! బేతాళ పంచవింశతికి మూలమని భావించే కాశ్మీరం ప్రతి ప్రస్తుతం అలభ్యం. ఈ నేపథ్యంలో నిజానిజాలు నిర్ధారించడం కష్టం. ఆయా కాలాలల్లో కవులు తమ సమకాలీన సామాజిక పరిస్థితులకు తగ్గట్లుగ ఈ కథల్లో మార్పులు చేసుకున్నారు. ఆ కారణంగా ఏవి మూలరూపాలకు దగ్గరివో, ఏవి చొప్పించిన ప్రక్షిప్తరూపాలో నిగ్గుదేల్చడమూ క్లిష్టతరంగా మారింది ప్రస్తుతం!
జంబలదత్తు గద్య రూపంలో, వల్లభదేవుడు సంక్షిప్త రూపంలో, మరో పేరు తెలియని కవి క్షేమేంద్రుడి బృహత్కథామంజరిలోని పద్యరూప కథలను గద్యంలోకి మార్చినట్లు చెబుతారు. గద్య పద్య మయ హృద్యశైలిలో కూర్చిన 12 వ శతాబ్ది నాటి శివదాసు కృతే ఉన్నంతలో మూలరూపానికి కాస్తింత సమీపంగా నడిచినట్లు ఇప్పటి విమర్సకులు భావిస్తున్నారు.
ఇక తెలుగులో..
జక్కన తెలుగు 'విక్రమార్క చరిత్రము' తెలుగునాట విస్తారంగా ప్రచారంలొకి వచ్చినప్పటి బట్టి విక్రమసేనుడు విక్రమార్కుడుగా మారిపోయాడని వినికిడి. తెలుగులో వెన్నలకంటి అన్నమయ్య రాసిన షోడశకుమార చరిత్రములోని మిగతా కథలతో పాటు కొన్ని కథలు ఈ బేతాళ పంచవింశతి నుంచీ ప్రేరణ పొంది రాసినవే అంటారు. చిన్నయసూరి కాలం వరకు సామాన్య పాఠకులు వెన్నెలకంటివారి కావ్యాన్ని ‘బేతాళ పంచవింశతి’గానే పిలుచుకొనేవాళ్లు కూడా! మిక్కిలి మల్లికార్జునుడనే కవీ బేతాళ పంచవింశతి పేరుతో మరో కావ్యం రాసినట్లు ఆరుద్ర (సమగ్రాంధ్ర సాహిత్యం మూడవ సంపుటి) పేర్కొన్నారు. కూచిరాజు ఎర్రన సకలనీతి కథావిధానంలో సైతం బేతాళ పంచవింశతి కథలు కొన్ని కనిపిస్తాయి. వెన్నెలకంటి, ఎర్రనల కన్న ముందే పద్మనాయక యుగంలో కవివల్లభటుడూ తన వంతుగా మరో బేతాళ పంచవింశతి పుష్పాన్ని తెలుగు సాహిత్య తోరణానికి జతచేసాడు. పోతరాజు అనే కవి రాసినట్లు చెప్పుకొనే మరో పది బేతాళ పంచవింశతి పద్యాలను ఒక అజ్ఞాతసంధాత వెలికితీసినట్లు విదితమవుతోంది.
ఆలయ నిర్మాణాలలో పేరు ప్రఖ్యాతులు గడించిన పద్మనాయకరాజుల నాటి రేచర్ల గోత్రీకుడు బేతాళరెడ్డిని ప్రస్తుతిస్తూ చిన్న వీరయ్య అనే కవి సంసృతంలో ఒక లఘుకావ్యం రచిస్తే బంగారు రంగప్ప దానిని ‘బేతాళ చరిత్ర’ పేరుతో ద్విపద కావ్యంగ అనువదించాడు. ఆ అనువాదం తరచూ బేతాళ కథలుగా పొరపడటం జరుతుతోంది.. ఇదో గమ్మత్తు.. సాహిత్యంలో!
బేతాళ పంచవింశతిలో బేతాళుడు విక్రమసేన మహారాజుకు ప్రతీ రాత్రీ ఒకటి చొప్పున వరుసగా రెండు డజన్ల కథలు చెపుతాడు.
తెలివైన పద్మావతి పంపిన మార్మిక సందేశాలను మంత్రిపుత్రుడు తన బుద్ధికుశలతతో పరిష్కరించి యుక్తియుక్తంగా ఆమెను తన రాకుమారుడికి జతచేసిన మొదటి కథ నుంచి.. బాలుడి మృత దేహంలోనికి పరకాయప్రవేశం చేసే ముందు రోదనలు, చిందులతో ఓ ముసలి యోగి చేసిన హంగామా దాకా ఎక్కడా ఆగకుండా, నడక మందగించకుండా సాగుతుంది బేతాళుడి కథాప్రవాహం. అనాథలైన తల్లీ కూతుళ్ళు విధివశాన ఓ తండ్రి, కొడుకులకు భార్యలవుతారు. ఈ రెండు జంటలకు కలిగిన సంతానం మధ్య సంబంధాలలో సంక్లిష్టత ఏర్పడినప్పుడు ఆ తికమక సంబంధాల సమస్యకు రాజు వద్ద నుండి సబబైన సమాధానం రాదు. అక్కడికి బేతాళుడి ప్రశ్నలు ఆగిపోయినా ఆ మరునాటి రాత్రి జరిగిన పతాకసన్నివేశాలతో కథాకావ్యం సుఖాంతమవుతుంది,
నడిమధ్య కథలలో పునరుజ్జీవితురాలైన మందారవతి, మనుషుల పాప పుణ్యాలను గూర్చి చర్చించే చిలుక.. గోరింక, యజమాని కోసం సకుంటుంబంగా సాహస త్యాగాలకు ఒడిగట్టే భృత్యుడు వీరవరుడు, ఉమ్మడి ప్రజ్ఞల కారణంగా పునరుజ్జీవించిన సమప్రభను ఎవరు ఏలుకోవాలన్న మీమాంసలో పడిన బ్రాహ్మణ కుమారులు, తలలు.. మొండేలు తారుమారుగా అతికించుకొని తిరిగి బతికిన భర్త.. సోదరులలో ఎవరి పాణి గ్రహించాలో అంతుబట్టక ధర్మసంకటంలో పడ్డ యువతి.. వంటి వింత చిక్కుముడులలో చిక్కిన పాత్రలు ఉక్కిరి బిక్కిరి చేసేస్తాయి కొన్ని కథలలో.
వివాహమైనా భర్త అనుమతితో ఇల్లు దాటిన ఇల్లాలు, కాముకుడైనా నిష్కలంకమైన ప్రేమ ప్రదర్శించే చోరుడు, లోకం ఊహించలేని దుష్టపాత్రల శిష్టస్వభావాలు విస్తుగొలిపిస్తాయి మరికొన్ని కథలలో!
సముద్రగర్భ నగరాలు, దివ్యలావణ్యాలతో మెరిసే రాజకుమార్తెలు, కలువల తాకిడికే దేహం కందే అతి సుకుమారులు, చంద్రకిరణం సోకినా వళ్లు కాలిపోయే వయ్యారిభామలు, దంపుడు బియ్యం దెబ్బల మోతకే చేతులు బొబ్బలెక్కే అబ్బురాండ్రు.. ఊహకైనా అందని చిత్ర విచిత్ర పాత్రలు ఇంకొన్ని కథలలో!
సుఖలాలసులైన యశఃకేతు వంటి దౌర్భాగ్య మహారాజులు, అమృతం తాగినా విషం మింగినట్లు మరణించే హరిస్వాములు వంటి దురదృష్ట జాతకులు, వధ్యశిల ఎక్కిన ముష్కురుని కోరి మరీ వరించి సతీ సహగమనానికి సిధ్ధపడ్డ సుదతీమణులు.. పాఠకులకు ఊపిరి సలుపనీయని విచిత్ర వ్యక్తులు రెప్పకొట్టకుండా చదివిస్తారు అన్ని కథలూ!
మంత్ర గుళికల మహిమతో ఇద్దరికి ఇల్లాలైన శశిప్రభ సంకటస్థితి నిజజీవితంలో మనకే ఎదురైతే కిం కర్తవ్యం? నాగు రక్షణ కోసం స్వీయ దేహాన్ని శంఖచూడుడంత సంతోషంగా గరుత్మంతునికి ఆహారంగా మనం సమర్పించుకోగలమా? ధర్మం, మోహం మధ్య నలిగే దుర్భర పరిస్థితులు కనక మనకే తటస్తిస్తే ‘సుందరి ఉన్మాదం' కథలోని మహారాజుకు మల్లే సులువుగా మనం ఉసురు తీసుకొంటామా? జీవితమంటే కష్టనష్టాల కలినేతన్న తత్వం తెలిసినప్పటికీ బేతాళ కథల్లో మాదిరి బతుకులో నిజంగానే కష్టాలు ఎదురైతే బేతాళ కథల పాత్రలంత విశుద్ధంగ, విస్పష్టంగ, విచిత్రంగ ప్రవర్తిస్తామా? అభీష్టవరదాయినీ మంత్రవిద్యను నేర్పే సాధనాక్రమంలో అనూహ్యంగా గురుశిష్యులిద్దరూ ఆ వింతవిద్యనే పోగొట్టుకొంటారో కథలో! తండ్రి కోసం చేసిన పిండప్రధానంలో విచిత్రమైన ధర్మసంకటం ఎదుర్కొంటాడో కన్నకొడుకు మరో కథలో! కాసుల కోసం కన్నవాళ్ళు, స్వీయ ప్రాణరక్షణ కోసం మహారాజు ..ఇలా తలా ఒక స్వార్థ ప్రయోజనార్థం దైవోపహతుడైన ఏడేళ్ళ బాలుణ్ణి బలివ్వడానికి సిధ్ధపడతారు మరో కథలో! వింటేనే చాలు వెన్నులో వణుకు పుట్టించే అరుదైన ఘటనలు నిజంగా కంటి ముందే జరుగుతుంటే పాఠకుల మానసిక పరిస్థితుల గతేమిటి? మోహాతిశయంతో ప్రాణాలు విడిచిన స్త్రీని చూసి తట్టుకోలేక ప్రాణాలు విడుస్తాడా ఎంత ప్రియుడైనా కథల్లో కాకుంటే నిజంగా జీవితంలో? ఇదే అబ్బురమనుకుంటే ఆ భార్య, భార్యాప్రియుల అర్థాంతర మరణ వార్త విని స్వీయప్రాణాలు సైతం తృణప్రాయంగా త్యజిస్తాడు అసలు భర్త మరీ విడ్డూరంగా మరో కథలో! చచ్చిన సింహానికి జీవం పోసి బతికించి దాని దాడికి బలయి చచ్చిన మూర్ఖ విద్వాంసుల వంటి వారి మూఢత్వాన్నీ వదలకుండా చెప్పినందుకే బేతాళ కథలు సంస్కృత సాహిత్య రంగాన కథల ఖజానాగా ప్రసిద్ధికెక్కింది శాశ్వతంగా. భారతీయుల కథాకల్పనా పటిమకు బేతాళ పంచవింశతిలోని ప్రతీ కథా ఒక విశిష్ట ఉదాహరణే.
కథలోని విక్రమసేనుడు వాస్తవానికి త్రివిక్రమకసేనుడని సాహిత్య విమర్శకులు భావిస్తున్నారు. ఆ త్రివిక్రముడి అభీష్టం మేరకు ‘బేతాళ పంచవింశతి’ శతాబ్దాల కిందటే ప్రపంచవ్యాప్తంగా ‘ప్రశ్న సమాధాన’ ప్రక్రియాపరంగ సాగే కథావిభాగంలో ఉత్తమ శ్రేణి కావ్యంగ కీర్తి గడించింది. పలు ప్రపంచ భాషలలోకి తర్జుమా కావడమే బేతాళ కథల ప్రఖ్యాతికి గట్టి నిదర్శనం.
'భేతాళ పంచవింశతి' ప్రసంగ, శ్రవణాలు జరిగే చోట యక్ష, భేతాళ, పిశాచ, రాక్షసాది దుష్టశక్తుల సంచారం నిషిద్ధమని భూతం పాఠకులకిచ్చిన అభయం బేతాళ కథలని భారతీయ పురాణాల స్థాయికి పెంచే ప్రయత్నంగా భావించినా భావించవచ్చునేమో!
ఆ కథల కమామిషు ఎటు పోయినా ఇప్పటి సాధారణ తరాలకు మాత్రం కథల బేతాళుడి పరిచయం ‘చందమామ’ మాసపత్రిక పఠన పుణ్యఫలమే. సాహసాద్భుతాలతో కూడిన బేతాళ కథల నిర్మాణం భారతీయుల కథనకౌశలానికి ఆటపట్టు. ఆ పట్టు ఏ మాత్రం సడలకుండా దశాబ్దాల తరబడి కథలు కల్పించి మరీ బేతాళుడి నోట చెప్పించి తెలుగుసాహిత్యాన్నీ సుసంపన్నం చేసినందుకు తెలుగువారందరం 'చందమామ' కు సదా మనసారా అభివందనలు తెలుపుకుంటూనే ఉందాం
- కర్లపాలెం హనుమంతరాపు
( తెలుగు వెలుగు మాసపత్రిక - ఏప్రియల్ ; 2019 సంచికలో ప్రచురితం)
No comments:
Post a Comment