Wednesday, December 8, 2021

అక్షరంలో చొరబడ్డ వేదనా సాగరం - దేవులపల్లి కృష్ణశాస్త్రి ' ఆంధ్ర ప్రభ - దినపత్రి- సాహితీ పరామర్శ

 


సాహితీ పరామర్మ : 

అక్షరంలో చొరబడ్డ వేదనా సాగరం 

- కర్లపాలెం హనుమంతరావు

( ఆంధ్రప్రభ దినపత్రిక- సాహితీపుట- బుధవారం 1, నవంబరు, 2017 ' ప్రచురితం) 


వర్డ్ స్ వర్త్  , కోల్‌రెడ్జి, బైరన్ , కీట్సు తరహా యురోపియన్ కవులు రొమాంటిసిజంలో గీటురాళ్లతో పోల్చవగ్గ మహానుభావులు. దేవులపల్లి కృష్ణశాస్త్రి  వారి సరసన అధిష్టించే సామర్ధ్యం  భావకవితా వైతాళికుడు.  కృష్ణశాస్త్రి  కవిత రొమాంటీసమ్ సాగరంలో  ఒక అల మాత్రమే . అయినా ఆ అలే మిగతా అలలకు మించి  కృష్ణశాస్త్రి  ఔన్నత్యాన్ని మరింత ఎత్తులకు ఎగరేసింది. 


సంప్రదాయ కవిత్వం తాలాకు వస్తువును భావకవిత్వం ఆశ్రయిస్తుందనే  ఒక భావన కద్దు. . 'నేను' లేకుండా కృష్ణశాస్త్రి కవిత్వం లేదు! భావనాబలంతో కొత్తలోక ద్వారాలని తెరవవచ్చని రొమాంటిస్టులు ప్రకటించక ముందే.. మన పోతన సరస్వతిని 'భావాంబరి

వీధిని శ్రుత విహారిణి ' గా సంబోధించినాడు  భాగవతంలో! మోడూపా

అనే రాక్షసి తలను షెల్లీ 'లవ్లీనెస్ ఆఫ్ టెర్రర్ ' గా అభివర్ణించిన విధంగానే మన తిక్కనే  యుద్ధ భూమిని ఉద్యానవనం... సరోవరం.. అంటూ వర్ణించుకు వచ్చాడు భారతంలో! కాకపోతే ఆ తరహా రొమాంటిసిజమ్ మార్కుకు విభిన్నంగా ఇప్పటి కృష్ణశాస్త్రి భావకవిత్వ రొమాంటిసిజానికి వ్యక్తివాదం, వ్యక్తిస్వేచ్ఛ పునాదులు. 


కృష్ణశాస్త్రి కవిత్వం నిండా ఈ లక్షణాలు పుష్కలంగా కనిపిస్తాయి . అతని భావకవిత్వం ఆత్మాశ్రయత, స్వేచ్ఛాప్రియత్వం, ప్రకృతి ప్రీతి, ఊహా సౌందర్యం.. వంటి లక్షణాలను పుణికి పుచ్చుకుంది . భావకవితా ధారను ఉధృత  దశకు తీసుకు వెళ్లిన  ఘనత కృష్ణశాస్త్రిది.


కృష్ణశాస్త్రి  గొప్పగా చెప్పుకొనే ' ఏననంత శోకభీకర తిమిర లోకైక  పతిని'. 'జగమునిండ స్వేచ్ఛాగాన ఝరులు నింతు ' ' నేను ప్రళయ ఝంఝా ప్రభంజన స్వామి' .. వంటి చరణాలు కాజీన జుల్,  వాల్ట్ విట్మన్ కవిత్వాలలో ఎప్పటినుంచో  వినిపిస్తున్నవే! కృష్ణశాస్త్రి  కవిత్వంలో అంతర్వాహినిగా కట్టలు తెంచుకొని మరీ ప్రవహించే శోకరసం. . రొమాంటిసిజంలో రివోల్ట్  తెస్తానన్న చలాన్ని అరుణాచలం  తరిమేస్తే,  కృష్ణశాస్త్రిని  మాత్రం జనం మధ్యనే  ఉంచి భావి రసభావుకుల చేత  జే జే లు కొట్టించి మరిన్ని మంచి రచనలు చేయించింది.


ప్రేమలో ఎన్ని దశలున్నా శాస్త్రిగారిని ఆకర్షించింది మాత్రం విక ర్షణ పార్శ్వం మాత్రమే. బైబిలు సోలోమన్ గీతాలు, భాగవతం భ్రమర గీతాలు, టాగోర్ గీతాంజలి,  వేంకట పార్వతీశ కవుల ఏకాంత సేవ . . తరహా ఆధ్యాత్మిక విడంబనకు  సంబంధించినవి . 

కృష్ణశాస్త్రి రొమాంటిసిజం కవిత్వంలోని 'నేను' - అళ్వారుల పాశురాల్లో కనిపించే నీవు 'లాంటిది.  కృష్ణశాస్త్రి  'ఊర్వశి ' ఊహాలోకంలో మాత్రమే లభ్యమయే ఆకర్షణీయ ప్రేయసి . ఉర్వశి పురాణాలలో  కూడా ఉన్నా ఆ  పాత్ర లక్ష్యాలకు కృష్ణశాస్త్రి  కల్పిత  ఊర్వశికి పొంతన లేదు .


అసలైన రొమాంటిసిజమ్ అంటే అద్భుతమైన అతిలోక విశిష్టతయి  కావ్యవిశేషాలుగా రూపాంతరం చెందడం. ఊహల్లో ప్రతీ దానికీ అనంగీకారం తెలియచేస్తూ దానికి ప్రత్యామ్నాయం ఏమిటో  చెప్పకుండా తప్పించుకు తిరగడం రొమాంటిసిజం ప్రత్యేక లక్షణం అంటారు . ఈ విచిత్రమైన మొండి మనస్తత్వమే భావకవితావాదులను యధార్ధవాదుల నుంచి విడదీసి ప్రత్యేక భ్రమాత్మక వాదులుగానిలబెట్టింది. ఆ తరహా భ్రమాత్మక  ముభావుకుల పరుగు పందెంలో ముందటి బసవరాజు, కొనకళ్లల వంటి వారి కన్నా కృష్ణశాస్త్రిదే ఒక  అడుగు ముందు.  ఆ అడుగుల్ని దాటి ఎవరూ ముందుకు సాగలేక పోవడమే  కృష్ణశాస్త్రి అనితార పనతకు తార్కాణం .


కృష్ణశాస్త్రి మీది  వాద వివాదాలన్నీ  ఓ  మూలన  పెట్టేద్దాం . ప్రస్తుతం కృష్ణశాస్త్రి  రగిలించిన  తెలివిడి  ( Newer Sensibility) కొంత తరచి చూసుకొని  ఆ భావకవితా యుగ  వైతాళికుడిని అభినందించి ముగిద్దాం.


కృష్ణశాస్త్రి గారు తేటి వలపు' అనే ఖండకావ్యంలో  ఏడు ఏడు మాలలను రచించారు. 'కోమల  జల జాత పత్రముల మాటున నేటికి దాగితివో?' అన్న ప్రశ్న ఏడుసార్లూ పల్లవిలాగ మాటి మాటికి  కనిపిస్తుంది . . శతక మకుటం లాగా! స్వేచ్ఛాగానం  రెండో ఖండికలో కూడా కృష్ణశాస్త్రి గారు 'నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు' అన్న పాదాన్ని 38 ద్విపదులలో 8 సార్లు పల్లవిలా గానం చేసారు. ' మాయమయ్యెదను' ఒక మారు ఆదిలో. . మరో మారు చివర్లో!  


భావ కవిత్వ శిల్ప నైపుణ్య ప్రధాన ఆకర్షణ పాటకు దగ్గరగా వెళ్లడమే!  ఆ పంజర వీర విహార విన్యాసం  కృష్ణశాస్త్రి కవితలో వలె అంత సుందర మధురంగా నిర్వహించిన భావకవి తెలుగులో ఇంత వరకూ లేడు. 


1984లో కాన్సర్ కారణంగా స్వర పేటిక తొలగించినా మూగకవిగా కాలం కొనసాగించిన నిత్యసాహిత్య కృషీవలుడు కృష్ణశాస్త్రి. '  మూగవోయిన నా గళమ్మునను కూడ/ నిదురవోయిన సెలయేటి రొదలు గలవు' అంటూనే 1900, ఫిబ్రవరి, 24న ఆ ఎద రొదలు  వినిపించేందుకేనేమో  అఇట్లుగా  గంధర్వలోకం తరలి పోయారు . ' నా నివాసమ్ము తొలుత గంధర్వలోక/ మధుర సుషష్టి' అంటూ ఆ సుమధుర వేదనా భావ గాయకుడే తన పూర్వ జన్మవృత్తాంతం చెప్పుకొన్నాడు! ' ఏను మరణించుచున్నాను, ఇటు నశించు/ నా కొకు చెమ్మగిలిన వయనమ్ము లేదు' అన్న కృష్ణశాస్త్రి నిష్ఠురం అక్షరాలా అబద్ధం. 


' కృష్ణశాస్త్రి  బాధ ప్రపంచానికి బాధ' అంటూ చలం వంటి ప్రాజ్ఞులతో చురకలు  వేయించుకొని మరీ మురుసుకొనేందుకైనా అంతులేని ప్రతిభా వ్యుత్పత్తి సామాగ్రి దండిగా ఉండి తీరాలి. 


పాత శబ్దాలే కృష్ణశాస్త్రి చేతిలో కొత్త పరిమళాలను వెదజల్లాయి. అచ్చమైన తెలుగు మాటలు కూర్పు  మధ్య కమనీయమైన సంస్కృత పదాల పొహళింపు కృష్ణూస్త్రి నుంచే తెలుగు కవి నేర్చుకోవాలి. శాస్త్రిగారి భావం స్మృతులను  'సౌకుమార్య మాధుర్యములకు చరమ సీమలు' గా  ఆధునికాంధ్ర కవిత్వంలోని సంప్రదాయ ప్రయోగాల మీద పరిశోధన చేసిన జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి. నారాయణ రెడ్డి  ఉత్తిగా  అయితే శ్లాఘించరు కదా! 


- కర్లపాలెం హనుమంతరావు

( ఆంధ్రప్రభ దినపత్రిక- సాహితీపుట- బుధవారం 1, నవంబరు, 2017 ' ప్రచురితం) 


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...