Wednesday, December 8, 2021

ఈనాడు - సంపాదకీయం ఒప్పుల కుప్ప రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 18 -03 - 2012 )

 


ఈనాడు - సంపాదకీయం 

ఒప్పుల కుప్ప

రచన - కర్లపాలెం హనుమంతరావు 


ఈనాడు - సంపాదకీయం 

ఒప్పుల కుప్ప

రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 18 -03 - 2012 ) 


 భూమ్యాకాశాలు, సూర్యచంద్రులు, నక్షత్రమండలం, దేవదానవులు, మానవులు, చెట్టూ పుట్టా- ఏదీ పుట్టని కాలంలో నీటిమీద బుగ్గలా తేలియాడే ఏకోనారాయణుడు ఆదిజాంబవుణ్ని, తోడుగా ఆదిశక్తిని సృష్టించాడని జాంబపురాణం కథనం. 'ఆదిశక్తి సహకా రమే లేకపోతే అసలీ అండపిండ బ్రహ్మాండాలనేవే ఉండేవి కావని డక్కలి కళాకారులు పటం సాయంతో ప్రదర్శించే ఆదిపురాణం చెబుతోంది. 'శక్తితో కలిసినప్పుడే శివుడికైనా జగత్ సృష్టి సాధ్యం' అన్న శంకర భగవత్పాదులవారి సౌందర్యలహరి' ఎత్తుగడా దేవి సర్వోన్నత్యానికి నివాళులు అర్పించేదే! ఉపరితలం మీద ఊగిసలాడే పిల్లవేరు మగవాడైతే, అతడి ఉనికికి ఊపిరందించే తల్లివేరు- స్త్రీ. అక్షమాల, పుస్తకం, అభయ వరదహస్తాల దాల్చి కమలాసీన అయిన బాలాదేవి మొదలు- అష్టభుజ శిష్టరంజని దుష్టదైత్య గర్వ భంజని సర్వమంగళ దుర్గాభవాని దాకా అమ్మవెన్ని అవతారాలో! అన్నీ ఆ స్త్రీమూర్తి అసమాన ప్రజ్ఞాప్రపత్తులకు అలౌకిక ప్రతీకలే. పోతన భాగవతంలో- వేటనుంచి అలసి మరలివచ్చిన పురంజనుడు అంతఃపురాన  తన కాంత కనిపించక ఎంత చింతపడతాడో! పొగడొందుజనని గానీ/ తగవున వర్తించునట్టి దయితయ గానీ/ తగనుండని గృహమున నుం/ టగు జక్రవిహీన రథమునందుంట రయన్' అని ఆ సందర్భంలో పోతన పురంజనుడి నోట పలికించిన మాట నేటికీ నూటికి నూరుపాళ్ల నిజం. 'ఇరువర్గాలు ఇరుసు అని నమ్మే శకటాలపై/ రతిరాజ కేతనాలు కలకాలం రెపరెపలాడాలనే' గానీ 'ఖలులు సుఖసాధన మాధ్యమంగా తప్ప మరోలా తమ శరీరాన్ని మగవాడు మననియ్యడ' న్న  సృహ స్త్రీమూర్తికి లేకనా! జంధ్యాలవారు కరుణాకుమారి ఖండకావ్యంలో అన్నట్లు 'ఆమె అమృతమయి'. మగవాడు ప్రశాంతచిత్తంతో జీవితం గడప గలుగుతున్నాడంటే కారణం- 'ఆమె శాంతమూర్తి' కావడం.


తనవెంట తుదిదాకా అడవులకు నడచివచ్చిన అపరంజి బొమ్మ సీతను చివరకు అవే అడవుల పాల్జెసిన మగవాడు శ్రీరాముడు. ద్వాపరంలో వ్రేపల్లెనుంచి మధురానగరిదాకా ఆ నందనందనుడి జీవితాన్ని బృందావనంగా మార్చింది స్త్రీమూర్తిలోని పదహారువేల కళలే! ఆమె అంటే ప్రేమే. చెదిరిన హృదయాన్ని రాయి చేసికొని పెట్టెను అలల్లోకి నెట్టబోయే ముందు కూడా వలపు నిలు పుకోలేక, చేయిరాక, సుతుని కౌగలించుకుని కుంతీమాత ఎంతలా విలపించింది! పరీక్ష వంకతో శిక్షింపడానికా అన్నట్లు వచ్చిన కలహభోజుడి 'ఫలహారమునకు ఇనుప గుగ్గిళ్లు వండి వడ్డించి - 'అమ్మా! నీ చేతి తాలింపు, కమ్మదనము/ గుమగుమ పరిమళించె' అని భళా అనిపించుకొన్న అనసూయమ్మ తల్లి వాత్సల్యమామెది. నారదుడు చెప్పాడు. నాన్నగారు బెదిరించారు. తల్లి బతిమాలింది. 'ఆ గుండె ధైర్యమేమొ! చావెరిగియు కట్టుకొన్నది నచ్చినవాని ఆ చిన్నది- సావిత్రి. 'అరణ్యములో జము వెంట నొంటిగా నాయువు దీరిపోవు పతికై పరువు లెత్తిన ఆమె గుండె దిటవుకు ఏమని పేరు పెట్టుకోవాలి: వీరనారీ శిరోమణి భారతీయ/ గౌరవపతాక రుద్రాంబికామ తల్లి- నేల నాలుగు చెరగులా కన్నబిడ్డల్లాగా ప్రజ లనేలే పాలనా పటిమకు ఒక ప్రతీక.  అతిపెద్ద ప్రజాస్వామ్య దేశా నికి సారథి ఒక ప్రతిభా భారతి . అత్యున్నత చట్టసభకు అధిపతి

ఒక మీరాకుమార్. ప్రభుతకు పాలక కూటమికి వారధి ఒక సోనియాగాంధి. ప్రశ్నించే ప్రతిపక్షానికి నాయిక ఒక సుష్మాజీ. రాజకీయమేనా... ప్రతి రంగంలోనూ అంగనల ప్రభ   ' కంటే- కూతుర్నే కనాలి ' అనేటంత  అమోఘంగా ఉందా లేదా? 


కాలం ఏదైనా 'కార్యేషు దాసీ, కరణేషు మంత్రి, భోజ్యేషు మాతా, శయనేషు రంభా' సూత్రం- స్త్రీమూర్తి స్వచ్ఛందంగా స్వీక రిస్తున్న బాధ్యత. తల్లిగా, చెల్లిగా, అనురాగవల్లిగా మగువ చూపగ లిగే మక్కువ మగవాడికి వెయ్యిజన్మలెత్తినా ఒంటపట్టని అవధాన విద్య. 'అమ్మా! నీవు ప్రేమతో తాగించిన పాల బలమే నా కమనీయ కవితకు ప్రేరణ'  అని శంకరాచార్యుల వంటి మహా తత్వ వేత్తే చేతులెత్తి మొక్కిన కారుణ్యమామెది. ' ఆడవాళ్లని కోడికాళ్ల కంటే చవగ్గా వండుకుని చెండుకుని కాల్చుకుని నరుక్కుని/తిం టున్న అంగాసురుల్ని' కాచుకునేందుకు 'కడుపుమంట కొలిమిలో కోట్ల కొడవళ్లు అచ్చోసి/ అడుగు బయట పెట్టే అమ్మాయిలు తలల్లో/ అర్ధచంద్రుడిలా ' తురుముకోక తప్పటం లేదు. సహజంగా ఆమె, స్వభావరీత్యా- నవ్వుల నదిలో సాగే పువ్వుల పడవ. సముద్రపు ఒడ్డున కాసిన్ని ఆల్చిప్పలు ఏరుకొని వాటిలో ముత్యాలకోసం వెతుక్కునే పిచ్చితల్లి. తడి ఇసుకలో కాలు దూర్చి పక్షి పిల్లలకోసం గూళ్లు కట్టి వాటి రాకకోసం ఎదురుచూసే పెద్దమనసున్న చిన్నది. ఎంత కష్టమైనా ఉండనీ... ' ఏటి గట్టున రెల్లు పొదలమధ్య పడు కొని/ వగలమారి చందమామను మనసారా' చూసినట్లు ఊహించుకొని'  మురిసిపోయే ప్రణయతత్వం ఆమెది. రాళ్లు ముళ్లు ఉండే దారిలో సాగటానికైతే వట్టి సాహసం చాలు. అడుగడుగునా రక్తం, కన్నీరు మడుగు కట్టిన దోవలో నడవడానికి కావాల్సింది 'హృదయ' మనే అయిదో గుండె కవాటం. నిప్పు కణికనైనా నెమలి పింఛంలా మార్చగల మంత్రం సృష్టి మొత్తంలో పుట్టుకతోనే ఒంటపట్టించుకు న్నది ఒక్క స్త్రీ జాతే. అందుకేనేమో- మరో జన్మంటూ ఉంటే అంద మైన ఆడపిల్లగా పుట్టాలని ఉందని కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ఇటీవల కోరుకున్నారు. ఆయనకు అనే ఏమిటి మరో జన్మంటూ నిజంగా ఉంటే ఒయ్యారి భామగా పుట్టి ఒప్పుల కుప్పలాట ఆడుకోవాలని ఏ మగవాడికుండదు!


- రచన : కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 18 -03 - 2012 ) 




No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...