కథ
ఆప్తబంధువు
- ఏల్చూరి విజయరాఘవరావు
సేకరణ - కర్లపాలెం హనుమంతరావు
“ధన్ ధనా- టక్ టకా - ధన్ ధనా- ట౯కా- తక తకిట తకతకిట--- తకతకిట తకతకిట
ఖండజాతి లయలో.. శరవేగంతో పరిగెత్తుతోంది రైలు బండి.
బెజవాడ రావడానికింకా ఎనిమిది గంటలన్నా పట్టచ్చు. పానకాల్రావుకు నిద్ర రావడంలా.
అమావాస్య చీకటి రాత్రుల్లో చెట్లూ, చేమలూ, గుళ్ళూ- గోపురాలూ, పల్లెలూ- పట్నాలూ, గతంలోకి మాటుమణిగి పోతుంటే, ముందు రాబోయే స్టేషన్లన్నీ భవిష్యత్తులో పొంచి కూర్చున్న ఆశల్లా వువ్విల్పూరిస్తూ పానకాల్రావు మనస్సును పదే పదే పీకుతున్నాయి. . గమ్యం దగ్గర కొస్తున్న కొద్దీ!
అతని తొండర వాటికేం తెలుసు మరీ! ఇవ్వాళన్నా యీ మాయదారి రైలును మరికాస్త తొందరగా పరిగెత్తించే నాధుడే లేడా?
తెలుసు. అల్లా జరగడం అసంభవమని. అయినా బాణం తగిలిన జింకలా కొట్టుకుంటున్న పానకాల్రావు గుండెల్లో తర్కశక్తి నెప్పుడో మింగేసింది ఆవేశం!
' మదర్ సీరియస్... కమ్ సూన్' మామయ్యిచ్చిన టెలిగ్రామిది...
ఇదమిదం తెలియడంలో అలాంటి పరిస్థితిలో పానకాల్రావేమిటి , పాపారావైనా, పార్వతమ్మయినా ఆ సందిగ్ధావస్థలో .. ఎవరైతేనేం తడబడక తప్పుడు గదా!
ప్రాణాలతో తల్లిని చూసి తీరాలి. "నాన్నా! ఎల్లా వున్నావురా? ఎన్నాళ్లయిందో నిన్ను చూచి!..." అంటూ ఆప్యాయంగా తల్లి బుజ్జగిస్తూ పలికితే, తను గంగా యమునా సరస్వతు లీదుకుంటూ వొడ్డు చేరుకుని, స్వర్గానికి నిచ్చెనకట్టి , గంధర్వగానంతో అప్సరసలు నృత్యం చేస్తున్న ఇంద్రసభలో జారిబడ్డట్టు మురిసిపోడూ మరి!
ఏమిటో!
రాత్రింబవళ్ళూ కవిత్వం రాసే పిచ్చితో ఇలాంటి వూహలే. రైల్లో కూర్చున్నా!
తెల్లగా 'ధగ' 'ధగ'లాడే గడ్డం, లాల్చీ, ధోవతీ- 'ఫట్టు 'మని పరాయి వాళ్ళు చూస్తే, విశ్వకవి టాగూరు గారి వేలువిడిచిన తమ్ముడిలా కనిపిస్తాడు పానకాల్రావ్!
పత్రికలో పని చేస్తున్నాడు. సబ్ ఎడిటర్. "క్షణం తీరిక లేదు. దమ్మిడీ ఆదాయం లేదు" అంటుంటాడు పదే పదే . అయినా చేసే పనిలో మామిడికాయ రసం తాగుతున్నట్లు సంతృప్తి కనబడడంతో, “మనసు గుర్రం' కళ్ళాలింకా చేజారి పోలేదు!
ఎన్నాళ్ళ నుంచో " అమ్మ"ను చూడాలనుకుంటూ, ఢిల్లీ నుంచి బెజవాడకు పోయే విమానాలవీ, రైళ్ళ "టైమ్ టేబుల్స్" రోజూ తన పత్రికలో అచ్చవుతుంటే బట్టీ పెట్టడం తప్ప. పని కల్పించుకుని టిక్కెట్టుకొని బెబవాడ వైపు ప్రస్థానం చేసే ఘడియలిల్లా తల్లి అనారోగ్యంతో తన్ను పీక్కుతినబోతున్నాయని అతను కలగన లేదెప్పుడూ...
"ధన్ ధనాటకకా.."
రెండవ తరగతి పెట్టె కిక్కిరిసి, నిండు చూలాల్లా కదలలేక కదులుతున్నట్టు తూలుతోంది. అర్థ నిద్రతో వున్మీలితమైన కొందరు ప్రయాణీకుల కళ్ళల్లో రైలు....
ఈ మధ్య టీ. పీ. జోరుకదా! ఆదివార మొస్తే "మహాభారతం” తప్పదందులో కొందరు ప్రయాణీక ప్రేక్షకులకు! కానీ రైల్లో ఎల్లా?!
సొంత జీవితపు "భారతం"లోని వొడుదుడుకులు మరిచిపోవడానికి "మహా భారతం" పుస్తకం చదువు కుంటున్నాడు పానకాల్రావు...
అనుకోకుండా వచ్చిన ప్రయాణం గనక "అన్ రిజర్వుడు" పెట్టెలో ఎలాగో కాళ్ళు ముడుచుకుని కాలక్షేపం చేస్తున్నాడు.
బెజవాడ రావాలి. స్టేషన్లో మామయ్య కనపడి "అమ్మకేం ప్రమాదం
లేదులే, భయపడకు పానకాలూ" అనాలి.... "
నజాయతే మ్రియతేవా కదా చిన్నాయంభూత్వా
భవితా వాసభూ యా ః..."
భగవద్గీత" పేజీలు తిరుగుతున్నాయి.....
"వాట్ ఎ రాటెన్ రష్?” సూటూ బూటూ, 'ఫెదర్' హ్యాటూ, చేతిలో ఎ.ఐ.పి. ఫాన్సీ బ్యాగూ, అర్థరాత్రయినా 'ఆరంజీ కలర్' కూలింగ్ గ్లాసులూ.... మిగలక మిగలక మిగిలిన అర ఇంచీ ఖాళీ స్థలం వైపు పానకాల్రావును "జరగమ"ని "ఫారిన్ జంటిల్మన్" ఠీవితో సంజ్ఞ చేస్తూ, ఏం జరుగుతున్నదో అర్థం చేసుకునే లోపలే బిత్తర చూపులు చూస్తున్న పానకాల్రావు పక్కన "దఢీలున" కూర్చుండి పోయాడొక ఆగంతకుడు!!
సంగీత సాహిత్యా లెవరినైనా మనస్కుల్ని శాంతింప చేస్తాయేమో! హఠాత్తుగా జరిగిన అన్యాయానికి బాధపడుతూ కూడా నెమ్మదస్థుడైన పానకాల్రావు "ఏమనాలో" తెలీకుండానే"నమస్తే" అనేసి. ఇంకొంచెం జరిగి కూర్చున్నాడా పెద్ద మనిషి “వసతి" కోసం!
"అతిథి దేవో భవా!"
ఇది మన భారతీయుల నిండుతనం!
" ఎందాకా?" తన పై వుద్యోగస్తుడిలా ప్రశ్నించాడా పెద్దమనిషి!
"బెజవాడ."
"ఇంకేం. నేను బెజవాడే. ఎప్పుడూ విమానంలో తప్ప ప్రయాణం చేయలేదు. అమెరికా నుంచి మేం దిగి నాల్గు రోజులైనా కాలా. అబ్బ! ఇలాంటి చెత్త రైళ్ళల్లో మీరెలా ప్రయాణం చేస్తారర్రా! ఇట్ ఈజ్ ఎ షేమ్! మా వూళ్ళో ఇంట్లో కన్నా రైల్లోనే కమ్మటి నిద్దరొస్తుంది! వాషింగ్టన్ లో పడుకుంటే న్యూయార్క్ లో బెహరా వొచ్చి కాఫీ యిచ్చి లేపిందాకా మూసిన కన్ను తెరవపన్లా ! .... అది సరేగాని, ఏమిటా పుస్తకం?"
" మహా భారతం."
పానకాలావు కయోమయంగా వుంది. అయినా ఈయన లెక్చర్లు వింటూ ఎలాగోలా రాత్రి గడిచి కొంప జేరుకొంటే కొంత ఆదుర్దా తగ్గుతుందేమో! మరి వేరే గత్యంతరం?
"మీకు థ్రిల్స్ కావాలంటే “మహా భారతం" చదివేం లాభమండీ! ఇదిగో "గాన్ విత్ ది విండ్" నేను ముఫ్ఫయ్యొకటో సారి చదువుతున్నా. మనం బెజవాడ చేరే లోపల మళ్ళీ చదువడం పూర్తయితే మీకిస్తా లేండి... అయినా యీ రైళ్ళల్లో ఫ్యాన్లు బాగు చేసే నాథుడే లేడాండీ! ఇక్కడ గాలిరాదు. కిటికీ తెరవాలంటే సుత్తితో కొట్టినా బిగుసుకు పోయి కదలదు ! చూశారా ఆ "బల్బు"లన్నీ ఎలా పగిలి పోయాయో! వెనక పెట్టెలో బాత్రూమ్లో నీళ్ళబొట్టు లేదు. అందుకే ఇక్కడి కొచ్చా. మిమ్మల్ని ఇబ్బందిపెడుతూ - పాపం! మీ ఇండియా ఇంకా, స్టోన్
ఏజ్ కాలంలోనే నిద్రపోతున్నట్టుంది! ఇప్పుడు తెలుసా మీకు?" చంద్రలోక మేంటి "- "సూర్యలోక మేంటి " "అంగారక లోకమేంటే"- చివరకు "బ్రహ్మలోకం"లో కూడా చక్కర్లు కొట్టి , పొద్దున భూమి మీద "టీ" త్రాగి వెళ్ళిన వాళ్ళం, మళ్ళీ భార్యాబిడ్డల్తో బాతాఖానీ కొట్టడానికి రాత్రి భోజనాల వేళ కిల్లు చేరుకోగలం!! గణితమండీ! అంతా శుద్ధ గణితం మహిమంటే నమ్మండి! అదీ అమెరికా అంటే! అలాంటి లెక్కలు తెలిసిన మహానుభావు డొక్కడైనా మీ వూళ్ళో పుట్టాడా చెప్పండి?
వొళ్ళు మండుకొస్తోంది ఆవేశంతో పానకాల్రావుకు. ఒక్కుమ్మడిగా లేచి "రామానుజం రామానుజం" అంటూ మన మేథమేటిక్స్ మేధావి పేరు తలుచుకుంటూ, పక్కవాడి పళ్ళు రాలేట్టు చంప చరుద్దామనుకున్నాడు... కానీ...
తనలో నివురుగప్పిన నిప్పులా. . భూమిగర్భంలో బంగారంలో దాక్కున్న సాహిత్య సంస్కారమలా చేయనిస్తుందా!
వీడెవడు? మన భారతీయుడేనా? చూడ్డానికి మాత్రం అలాగే వున్నాడే! అదేమి ? పచ్చి తెలుగు మాట్లాడుతుంటే! ఎరువుకు తెచ్చుకున్న సూటూ బూట లాగేస్తే.. కళ్ళూ, కాళ్ళూ.. ముక్కూ. నోరూ- అన్నీ, మనలాగే వున్నాయి మరి! అయితే ఇంత "దర్జా వాగుతున్న పెద్దమనిషి తనతో "రెండో తరగతి" (అదీ. అన్ రిజర్వ్ డ్!)లో దేని కిరుక్కున్నట్టు?!!
పోనీ తనకెందుకీ గొడవంతా? తనకున్న దిగుళ్ళు చాలకనా! ఇలాంటి "బేవార్సు" వాళ్ళని పదిమంది వెతుక్కుపోతుంటే...
అయినా, అతన్ని "బేవార్సు" వాడనుకోవడం తన పొరపాటే అయితే?!!
తను మాత్రం విమానంలోనో, ఫస్ట్ క్లాస్ రైలు పెట్టెలోనో
ప్రయాణం చేయగల అర్హత లేనివాడా మరి! అనుకోకుండా తనూ యీ "గరీబీ " పెట్టి "గలీజు" లో కళ్ళు మూసుకుని కాలక్షేపం చెయ్యాల్సిరాలా?!
అతనికీ, అలాంటి అవసర ప్రయాణం కాకతాళీయ న్యాయంగా తటస్పంచిందేమో .. పాపం!
నెమ్మదిగా అడిగాడు పానకాల్రావు " మీదసలే వూరండీ?"
" కొన్నాళ్ళు జపాన్లో వుండే వాళ్ళం. మా ఫ్యామిలీలో సగం మంది కెనడాలో పెద్ద పెద్ద పుద్యోగాల్లో హేమాహేమీల్లా పని చేస్తున్నారు. నాకో రెండేళ్ళ క్రితం అమెరికాలో వరల్డ్ బ్యాంకులో కి ట్రాన్స్ఫర్ అయింది. మీ ఆంధ్రా గవర్నమెంటు వాళ్ళు "బీదల కోసం ఇళ్ళు కట్టించే పథకం" కింద మా దగ్గర నాలుగు మిలియన్ల డాలర్ల అప్పు కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. ఆ సందర్భంలోనే, మీటింగ్ కోసం బెజవాడ వెళ్తున్నా. "సీదా ప్లేన్ లేదు. రైలే తొందరగా చేరుతుందని ఎవరో చెప్పారు. అందుకూ యీ రభస!"
న్యాయంగానే వుందతని వుదంతం! కానీ తన అసలు ప్రశ్నకు జవాబు రాలేదింకా. "ఇతను స్వతః తెలుగువాడా, కాదా" అని. ఈ ధర్మసందేహం తీర్చుకుని తీరాలి... అనుకున్నాడు పానకాల్రావు .
"అవునండీ! రైల్లోనే నయం. ఈ రోజుల్లో విమానాలైనా మనల్ని "టైమ్"కు అందించి చస్తాయి గనకనా... ఒక్క మాట .. మీరు తెలుగు ఇంత స్వచ్ఛంగా మాట్లాడుతున్నారు. తెలుగు వాళ్ళేనా?"
ఇంగ్లీషులో సమాధానమిచ్చాడాయన.
"యస్. బేసికల్తీ వుయ్ ఆర్ ఆంధ్రాస్, బట్ నౌ వుయ్ ఆర్ అమెరికన్ సిటిజన్స్".
ఏమైనా, అతనికీ విషయం మీద చర్చ రుచించినట్లు లేదని, అతని ముఖ కవళికలే చెబుతున్నాయ్!
"ధనాధనా టక్ టకా ”
మేం మేం మాట్లాడుకుంటున్నా రైలుకేం బట్టింది! శరవేగంతో 'కాలం'లా పరుగెడూనే వుంటుందది!
బెజవాడ సమీపిస్తున్న కొద్దీ పానకాల్రావు పక్క మనిపి దౌర్జన్యంగా తన సగం సీటు లాక్కుని, వారి వింతలన్నీ ఏకరువు పెడుతూ, సోది కబుర్లు చెబుతున్న మాటే మరిచిపోయి తన కోసం పంచప్రాణాలు ధారబోసె మాతృదేవతను గురించే "వదే పదే" ఆలోచిస్తూ, ఆమె ఆయురారోగ్యాల కోసం భగవంతుణ్ణి ప్రాధేయపడుతూ, మళ్లీ ప్రయాణ బడలికలో మగత నిద్ర ముంచెత్తుకొచ్చే లోపల, "మహాబారతం" లోంచి "భగవద్గీత" పేజీలు తిప్పడం మొదలెట్టాడు అటు కన్నతల్లి అనారోగ్యపు అశాంతికీ ఇటు యీ ఆగంతకుడి "మాతృదేశ విమర్శ "దాడికీ", "కృష్ణార్జున సంవాద' మే శరణ్యమని నమ్మిన పానకాల్రావు.
ఇంతలో ఆయనన్నాడు "అవర్ డెస్టినేషన్ ఈజ్ నియరింగ్ . ఇంతలో బాత్రూమ్ కెళ్లొస్తా ; నా బ్యాగ్ లో ఫారిన్ ఎక్చేంజి కొల్లలుగా వుంది. కాస్త జాగ్రత్తగా చూస్తుండండేం''
పానకాల్రావు కాశ్చర్యమేసింది. తలా తోకా తెలియని తన మీద ఎంత “భరోసా" ఈయనకు! " ఆ డబ్బు బ్యాగ్ లోపలికే తీసుకు పోదురూ" అందామనుకుంటున్న తన సమాదానం వినకుండానే జనాన్ని తోసుకుని బాత్రూంలో కెళ్లి పోయాడా
" పారెన్ రిటరన్ !"
నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః I
న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః ||
ఇలా చదువుతూ, చదువుతూ ఎంత సేపైందో!
మైమరచి బాహ్య ప్రపంచంతో సంబంధమే లేనట్టు గాఢమైన సుషుప్తిలోకి చొచ్చుకు పోయింది పానకాల్రావు మనస్సు .
మధ్య మద్య ఎక్కేవాళ్లూ. దిగేవాళ్లూ "నీడ నీడ"గా కనబడుతున్నారంటే ఒకసారి టికెట్ కలెక్టరొచ్చి చెక్ చేసి పోతూ పోతూ టాగూర్ అందమైన గడ్డంతో, అపురూపమైన వదనారవిందంతో "మాంచి". పెద్దమనిషిలా కనబడుతున్న పానకాలావు నడిగాడు కూడా " ఇక్కడెవరన్నా టిక్కెట్టు లేకుండా ఎక్కి మిమ్మల్ని అవస్థ పెట్టలేదు కదా సార్? అన్ రిజర్వుడు కంపార్టుమెంట్లలో మాకు రోజూ ఇదే గొడవ కదా! అందుకే అడుగుతున్నా"
"ఎబ్బె! ఏం లేదండీ!" మాట వరసకనేశాడు పానకాల్రావు టిక్కెట్ కలెక్టర్ కు ' థాంక్స్' చెప్పి
"ధన్ ధనా- టక్ టకా.."
తెల్లవారుతోంది. ఈ స్టేషను గాక, ఇంకొక్కటి దాటితే బెజవాడ!
"ఇడ్లీ.. కాఫీ అరుపులు ! " ప్లాట్ ఫోరమ్ నిండా మోగుతున్నాయి.
తన ఎలాగో వూగుతూ వూగుతూ, వోరబడి కాస్తో కూస్తో నిద్రకు దిగి లేచాడు పానకాల్రావు. బాత్రూమ్ లో గంటకు పైగా గడిపి, ముస్తాబై వచ్చిన పారిన్" పెద్దమనిషి' " బెజవాడ వచ్చేస్తోంది. మీరూ బాత్రూమ్ వగైరా వెళ్లొచ్చి ప్రెష్ గా కూర్చోరాదూ?"
ఆప్యాయంగా సొంత చుట్టంలా ఆయన అలా అంటే “వద్ద”న బుద్ధేయలేదు . పయనమైనాడు పానకాల్రావు కాలకృత్యాలు తీర్చుకోవడానికి.
ఖండలయలోంచి ఆదితాళంలోకి దిగి, చివరకు తాళం తప్పినట్లు రైలు రొద ఆగింది నెమ్మది నెమ్మదిగా.
"బెజవాడ వచ్చింది’'
అమ్మను చూడాలి! మామయ్య నాకోసం వెతుకుతున్నాడేమో!"
అసలు రైలాగినా ఆదుర్దాతో పానకాల్రావ్ గుండెల్లో కొత్త కొత్త రైళ్లు పరుగెడుతున్నాయి!
బాత్రూమ్ తలుపు తీసుకుని, దిగే జనాన్ని తోసుకుంటూ సొంత సీటు దగ్గర చేరేడు.
తన పెట్టే, బెడ్డింగూ కూచున్న చోట శూన్యం!
ఆ పారిన్ పెద్దమనిషి లేడక్కడ!
పరిగెడుతున్న గుండెకాయ, ఒక్కసారిగా కొట్టుకోడమే మానేసి నట్టయింది.
సామాను పోతే పోయింది అమ్మకు తెచ్చిన మందులన్నీ, అందులో నే వున్నాయి!
ఏం చేయడమో ఆలోచించే లోపల మామయ్య గొంతు వినిపించింది.
“పానకాలూ- పానకాలు-"
ఇద్దరూ. కొత్తగా పెళ్లయిన భార్యాభర్తలు పడగ్గదిలో కౌగలించుకున్నట్లు కౌగలించుకున్నారొక్కసారి!
" మామా” అమ్మెలా వుంది? "
"గండం తప్పిందోయ్! నీ కోసమే కలవరిస్తోంది .. పద ! కూలీని పిలుస్తా.. సామానేదీ?"
చావు కబురు చల్లగా చెప్పమంటారు. అయినా తల్లిని ప్రాణాలతో చూడగలుగుతున్నానన్న ఆశలో పానకాల్రావుకు సామాను పోయిన దుఃఖం కించిత్తు కూడా బాధపెట్టలేదా క్షణంలో .
గొంతులోంచి చేదు కాకరకాయ కక్కేసినట్టు "దబా" "దబా" సామాను పోయిన వ్యవహారమంతా మామయ్యతో చెప్పేశాడు.
"ఆరి నీ తస్సదియ్యా! పట్నాల్లో కాపురం జేస్తూ ఆమాత్రం జాగ్రత్త లేకపోతే యెల్లాగోయ్! రైలు కదిలే లోపల త్వరగా .. పదమరి రైల్వే సబ్ ఇన్స్పెక్టర్ మనవాడే. గోపాలంగారు.... నడూ ! చెప్పిచూదాం! " ఇంకాయేమేమిటో అంటున్నాడు మామయ్య.
ఈ లోపల కిందటె స్టేషన్లో అవతరించిన “టక్కెట్ కలెక్ట"రే, మన "ఫారిన్ గెస్టు" నొక పోలీసు బంట్రోతుతో సహా నెట్టించుకొస్తూ, వీళ్ళ పెట్టి దగ్గరికి చేరుకున్నాడు!
"ఏమండీ! ఈయన టిక్కెట్టు మీ దగ్గరుందా? "
"అదేమిటీ? ఆయన టిక్కెట్టు నా దగ్గరెందుకుంటుందండీ?!
"అయితే ఆయన మీ "బావమరిది" కాడా మరి?" .
మామయ్య, పానకాల్రావు దిగాలుపడి చూస్తున్నారు!
వరల్డ్ బ్యాంకు మెంబరు గారి ముఖాన కత్తి వేస్తే నెత్తురు చుక్క లేదు.
"ఈ కొత్త బావమరి దెక్కడ దాపరించాడో" అని మామయ్య నిర్ఘాంతపోతున్నాడు! .
అప్పుడు అన్నాడు పోలీసు బంట్రోతు "మరి అతని చేతిలోని యీ పెట్టి మీది మీ చిరునామా.. మీ వుద్యోగ వివరాలూ, పేరూ వూరూ, అన్నీ అతనికి ఎంతో పరిచయంలా, గోపాలంగార్ని నమ్మించేశాడండీ! ఆ వొక్క టిక్కెట్ట ముక్క చేతిలో లేకపోబట్టి గోపాలంగారి కనుమాన మొచ్చి. . సరిగ్గా యీయన గేటు దాటేసుకుంటున్న సమయానికి లంకించుకుని, వాకబు చెయ్యమని మమ్మల్నిలా పంపారండీ!"
"ఓరి భగవంతుడా నా పెట్టా, బేడా పాకుండా రక్షించడమే కాకుండా నాకొక కొత్త ' ఆప్తబంధువు ' ను కూడా సృష్టించావు గదరా! ప్యాన్ లు పని చేయని, బల్పులు పగిలి, కిటికీలు
బిగుసుకుపోయిన భారతదేశపు రైళ్లల్లో హిమాలయాల నుంచి కన్యాకుమారి ప్రతిక్షణం వేలాది భారతీయులు దైనందిన కృత్యాల్లో ముగ్ధులై ప్రయాణం చేస్తూనే వుంటారు. అవి మన కోసం- మనం వాటి కోసం జీవిస్తూనే కాలం గడుస్తుంది.
అయితే వాటిల్లోనే, "అమెరికా, ఇంగ్లండు" వగైరాలూ, "అంగారక గ్రహం"- "బ్రహ్మలోకం" వగైరాలూ, చక్కర్లు కొట్టి ఎప్పుడోప్పుడు తిరిగొచ్చే సమయానికి టికెట్ లెస్ ట్రావెల్ కోసం శ్రీకృష్ణ జన్మసానం పోబోతూ, మన మన "బావమరుదు" లయ్యే సదవకాశం, ఎంత మందికి దక్కుతుందో మరి! '' అనుకుంటూ “దేశపు అమ్మనూ", "కడుపున కన్నతల్లినీ"- ఇద్దర్నీ తలుచుకుంటూ, మధ్య మధ్య తన విచిత్ర ప్రయాణపు కబుర్లతో సతమత మవుతూ, మామయ్యతో సహా గుర్రబ్బండెక్కాడు పానకాల్రావ్.
***
- ఏల్చూరి విజయరాఘవరావు
( ఆంధ్రసచిత్రవారపత్రిక - 31-8-1990 )
సేకరణ :
కర్లపాలెం హనుమంతరావు
27-12-2021
బోథెల్; యూఎస్ ఎ